తెలుగు సాహిత్య విమర్శకు విజయభారతి దోహదం

కందాల శోభారాణి
తొలి దళిత సాహిత్య విమర్శకురాలిగా తాడి నాగమ్మ 1930లలో చేసిన కృషిని అందిపుచ్చుకొని డాక్టర్‌ బోయి విజయభారతి 1990 ల నుండి విశేషంగా సాహిత్య విమర్శ కృషిని కొనసాగించారు. విజయభారతి వ్యాసాలలో రెండు రకాల ధోరణులు కనిపిస్తాయి. ఆధునిక దళిత సాహిత్యాన్ని విశ్లేషించటం ఒక ధోరణి కాగా, ప్రాచీన సాహిత్యాన్ని దళిత, స్త్రీవాద కోణాల నుండి విశ్లేషించటం మరొక ధోరణి. 1990లో దళిత సాహిత్యంపై ఆమె వ్యాసం వచ్చింది (నలుపు ఏప్రిల్‌, పుట, 31-33) ఈ వ్యాసంలో సాంఘిక సమానత్వం, ఆర్థిక ప్రగతి, మానవ స్వేచ్ఛ వంటి రంగాలలో సమాజం నుంచి వేరుగా చేయబడిన వారు దళితులని నిర్వచించి, కుల, మతపరమైన నిషేదాలవల్ల, ఆర్థిక వ్యత్యాసాల వల్ల వేరుగా చూడబడ్తూ, సామాజిక దౌష్ట్యానికి గురి అవుతూ, నిస్సహాయంగా జీవితాలు వెళ్ళదీస్తున్న వారికోసం ఆవేదన చెందటం, సమస్యలు చిత్రించటం మెరుగు పర్చటానికి పరిష్కార మార్గాలు సూచించటం దళిత సాహిత్య ముఖ్య లక్షణంగా పేర్కొన్నారు.
తెలుగులో వచ్చిన దళిత సాహిత్యం చాలా తక్కువ అని దానికి మానవతా వాదమూ, కాల్పనిక కోద్యమమూ భూమిక లని అన్నారు విజయభారతి. కొనకళ్ళ వెంకటరత్నం గారి ‘రోడ్డు రోలరు పాట’, రెంటాల గోపాలకృష్ణ ‘పల్లకి బోయీలు’ దళితుల ఆవేదనను ప్రకటించే రచనలు అని, మంగిపూడి వెంకటశర్మ, గురజాడ, మాదవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి, చలం, ప్రభృతులు వర్ణవివక్షను నిరసిస్తూ ప్రబోదాత్మకమైన రచనలు చేసినవారిలో కొందరిని పేర్కొన్నారు. వీరంతా అంటరానితనాన్ని నిరసించారని, అంటరాని వారుగా చూడబడుతున్న వారిని తోటి సోదరులుగా, చూడవలసిందిగా సమాజాన్ని అర్థించి ప్రబోధించారని వివరించారు. విషయ ప్రతిపాదనలో, వివరణలో, చిత్రణలో సమస్యలను విశ్లేషించి చూడటంలో, జిజ్ఞాసలో పరిష్కార సూచనలో అన్నింట్లో దళిత రచయితలు చేసే రచనలకు దళితేతర మేధావులు, రచయితలు చేసే రచనలకూ తేడా ఉంటుందని గుర్తించి చెప్పారు.
మంగిపూడి వారి ‘నిరుద్ధ భారతం’ (1915) దళితుల పరంగా ఎన్నదగిన ప్రబోధకావ్యం అని ప్రశంసించారు. జాషువా, బోయి బీమన్నల రచనలు కవితాత్మతో పాటు దళిత వర్గ సంక్షేమాన్ని కూడా రంగరించుకున్నవని చెప్పారు. విప్లవ కవిత్వంలో పాటగా ఆవిర్భవించిన కవితాశాఖ చాలా వరకు దళితుల అవసరాలను తీరుస్తున్నదని అన్నారు.
సాహిత్యంలో అంటరానితనం, హరిశ్చంద్రుడు మాతంగ కన్యలు (నలుపు 1991 ఏప్రిల్‌, పుట, 56-62) విజయభారతి వ్రాసిన వ్యాసాలలో ఒకటి. హరిశ్చంద్రుని కథను గౌరన అనే కవి హరిశ్చంద్రోపాఖ్యానము అనే పేరుతో ద్విపద కావ్యంగా వ్రాశాడు. గౌరన కావ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే హరిశ్చంద్రునిలో సత్యనిష్ట కన్న కింది కులాల పట్ల ఏవగింపు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందని, ఒక గొప్ప వ్యక్తికి ఉండవలసిన ఉదాత్త గుణాలు, సమదర్శనం ఆయనలో మచ్చుకైనా కనపడవని, మొండివైఖరి, తనకన్న పెద్దవాళ్ళు మునులు కనిపిస్తే భయంతో వణకటం, కింది వాళ్ళపట్ల కర్కశంగా వ్యవహరించటం, కోపం వస్తే ఎదుటివారిని కొట్టబోవటం వంటివి హరిశ్చంద్రుడి లక్షణాలుగా గౌరన చిత్రీకరణలో కనిపిస్తాయి అని విజయభారతి వివరించారు. మాతంగ కన్యలను వివాహమాడక పోడానికి హరిశ్చంద్రునికి ఏకపత్నీ వ్రతం అభ్యంతరం కాదని, అతనికి కడజాతి వారిపట్ల ఉన్న యేహ్య భావమే అభ్యంతరమైందని నిశిత పరిశీలనతో పేర్కొన్నారు.
భారతదేశ సమాజంలోని కుల వ్యవస్థ గురించి ఎంత చెప్పుకున్న తరగదు. భారతదేశంలో వేదాల స్మృతులు, పురాణాలు ఈ వర్ణ వ్యవస్థను  సమర్థిస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. హేతువాద దృక్పథంతో పురాణాల్లో పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన విషయాలెన్నో బయటపడుతున్నాయి. పురాణాల మూలాలతోనే భారతీయ సాహిత్యంలో చాలా కావ్యాలు వెలిశాయి. అవన్నీ భారతీయుల జీవన విధానంపై అమితమైన ప్రభావం చూపాయి. ఆ విధంగా ప్రచారమై ప్రజలను గొప్పగా ఆకట్టుకున్నది, ప్రభావితం చేసినది సత్యహరిశ్చంద్రుని కథ. సమాజంలో ఉత్పత్తికి, సంపదకు ఆలవాలంగా ఉన్న శూద్ర కులాలను ముఖ్యంగా క్రింది కులాలను స్త్రీలను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి ఆ కథను ఆధారంగా చేసుకున్నారు అని తన రచనను ప్రారంభించారు.
క్రింది కులాల వారికి, స్త్రీలకు కొన్ని పరిమితులను విధించి వారికి ఒక రకమైన ప్రవర్తన నియమావళిని ఏర్పాటు చేయడంలో ఈ కథ ప్రయోజనం సాధించిందని ఒక కుహనా సంస్కృతిని ప్రచారం చేసిందని గౌరవ కవి తెలుగులో వ్రాసిన హరిశ్చంద్రోపాఖ్యా నాన్ని ఆ కథకు మూలంగా ఉన్న పురాణ కథలను పరిశీలిస్తే హరిశ్చంద్రుడు సత్యవ్రత పాలనకోసం కాక బ్రాహ్మణ శాపానికి భయపడి వర్ణ ధర్మాన్ని రక్షించేందుకు రాజ్యం వదులుకున్నాడని స్పష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.
వర్ణ ధర్మాలు వర్ణం ఆధారంగా ఏర్పరచినవి. ఒక కాలంలో మనిషి స్వభావాన్ని బుద్ధి పరిణితిని బట్టి వర్గం నిర్ణయించేవారు. పుట్టుకను బట్టి కాదు. కాని కాలక్రమంలో పుట్టుక ఆధారంగా వర్ణం, వృత్తి నిర్ణయించే పద్ధతి ఆచరణలోనికి వచ్చింది. పని-వృత్తి, పుట్టుక అనే విభజనలతో ఎక్కువ తక్కువలు కల్పించి మనిషికి మధ్య తేడాలు సృష్టించి ఒక మనిషి మరో మనిషిపై ఒక వర్గం మరో వర్గంపై పెత్తనం చేస్తూ వారి శ్రమ ఫలితాన్ని దోచుకునే వ్యవస్థ దేశంలో స్థిరపడింది. ఇది ధర్మం పేరుతో వేల సంవత్సరాల నుంచి ఆచరింపబడుతూ ఉంది అని చరిత్రను వ్యాఖ్యానించారు.
పురాణాలు, ఉప పురాణాలు, కావ్యాలు కూడ వర్ణ ధర్మం ఎంత గొప్పదో చెబుతూ దానిని తప్పక పాటించాలని భోదించాయి. స్వధర్మం ఆచరించని వారిని శిక్షించాలన్నాయి. కాలక్రమంలో నాలుగు వర్ణాలకు జతగా పంచమ వర్ణం వచ్చి చేరింది. హేయమైన పనులు చేయవలసి వచ్చిన కులాలు (దళితులు) తరతరాలుగా ఆకలితో, అనారోగ్యంతో, అజ్ఞానంతో, దారిద్య్రంతో, వెట్టి చాకిరితో జీవితాలు చాలిస్తూ వచ్చారు. ఈ కుల వ్యవస్థ కోట్లాది ప్రజల జీవితాలను యుగ యుగాలుగా దుర్భరం చేస్తూ సమాజ జీవన వ్యవస్థగా స్థిరపడిపోయింది. ఇతిహాసాలు-స్మృతులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు-కావ్యాలు ఈ వ్యవస్థను బలపరుస్తూ ప్రచారం చేశాయి. ఇవి పైకి నీతి కథలుగా కనిపిస్తూ వర్ణ ధర్మాల అమలును పటిష్టం చేసాయి అని అన్నారు విజయభారతి.
భారతదేశంలో ప్రాచీన కాలంలో నుంచి ప్రచారంలో ఉన్న సత్యహరిశ్చంద్రుని కథ కుల వ్యవస్థను ప్రచారం చేయడానికి ఉద్దేశించారని అది కుల వ్యవస్థ పునాదులపై అల్లిన కథ అని తెలుసుకోవటం ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నదని, హరిశ్చంద్రుడు సత్యం కోసం రాజ్యం వదులుకోలేదని మాల, మాదిగ కన్యలను వివాహం చేసుకోవడం ద్వారా కులాలు సంకరం చేయడానికి ఇష్టపడక రాజ్యం వదులుకున్నాడని ఆమె ఈ గ్రంథంలో నిర్ధారించారు.
”దక్షిణదేశీయాంధ్ర వాఙ్మయం సాంఘిక సంస్థలు” అనే అంశం మీద పరిశోధన చేసి పి.హెచ్‌.డి. డిగ్రీ పొందిన విజయభారతి అంబేద్కర్‌ను, జ్యోతిబాపూలేను బాగా అధ్యయనం చేసింది. ఆ ప్రభావాలతో భారతీయ కుల వ్యవస్థ స్వరూప స్వభావాలను గురించి పురాణాలు, ఇతి హాసాలు ఆధారంగా విశ్లేషణలు చేస్తూ రచనలు చేసింది. వాటిని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. వాటిలో మొదటిది పురాణాలు-కులవ్యవస్థ, సత్యహరిశ్చంద్రుడు (2002) దీని తొలి రూపం.
వర్ణధర్మ రక్షణ (కమ్యూనిజం 1995 నవంబర్‌, పు-28-45) అనే వ్యాసంలో విజయభారతి మాతృస్వామ్య వ్యవస్థను నాశనం చేసిన సమాజమే తాటకనూ అంతం చేసిందని ఆమెను అపకీర్తి పాలు చేసే విధంగా ఆమె చరిత్రను వక్రీకరించిందని అభిప్రాయపడ్డారు. యజ్ఞానికి విఘ్నం కల్గిస్తున్నారని విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తాటకవనానికి తీసికెళ్ళి, స్త్రీని చంపకూడదనే ధర్మం ఉన్నప్పటికీ స్త్రీ హత్యను ప్రోత్సహించాడు. వనవాసిని, నిరాయుధురాలూ అయిన స్త్రీ పై క్షత్రియులు చేసిన దాడి అది అని ఆమె పేర్కొన్నారు. అనార్య ప్రాంతాలలో స్థావరాలు ఏర్పరచుకోవటం, అనార్యులు, గిరిజనులు అయిన వారి సంపదను దోచుకోవటం, వారి ధర్మాన్ని సంప్రదాయాలనూ నాశనం చేసి తమ ధర్మాన్ని వ్యాపింపచేయటం ఆర్యులు శతాబ్దాలుగా సాగిస్తున్న కార్యకలాపాలు అని ఆమె అంటారు. అదేవిధంగా విజయభారతి ”స్త్రీల ప్రతిపత్తి – పూర్వ సాహిత్యం – దళిత వర్గాల స్త్రీలు” అనే వ్యాసంలో కింది జాతి స్త్రీలను నీచంగా పరుషంగా అవమానించడం పురాణాల సంస్కృతి అని విమర్శించారు. శీలం పాతివ్రత్యం స్త్రీకి అతి ముఖ్యమంటూనే ఆ పాతివ్రత్యాన్ని కూడా చెడగొట్టడానికి ప్రయత్నించడంలోని సంస్కృతిని గురించి చర్చించారు. (భూమిక, 2003, నవంబర్‌, 2004, ఫిబ్రవరి)
పురాణాలు-కులవ్యవస్థ రెండవ భాగం దశావతరాలు (2003) భిన్న యుగాలలోని అవతార మూర్తుల కథలను, వారి చుట్టూ అల్లిన భావజాలాన్ని పరిశీలిస్తే వర్ణవ్యవస్థ విధించే ఆంక్షలను పటిష్టంగా సామాన్యుని జీవితంలోనికి చొప్పించడానికి ఈ ప్రయత్నమంతా జరిగిందని అర్థమవుతుంది అని ఆ క్రమాన్ని విశ్లేషిస్తూ ఈ రచన చేశారు విజయభారతి.
జ్ఞానాన్ని అగ్రవర్ణాలకే పరిమితం చేసిన కట్టుబాటుకు మత్స్యావతారంలో విష్ణువు చేసిన దానవవధ మూలం ఆ కట్టుబాట్లు చట్టాల ద్వారాను అంతకంటే పటిష్టంగా పురాణాల ద్వారాను ప్రచారం అయ్యాయి. ఈ అవతారాలలో నారాయణనుని మొదటి మూడు అవతారాలు జంతురూపాలు జయ విజయలలు హిరణ్యాక్ష, హిరణ్యకషికులుగా దైత్యులుగా పుట్టినప్పుడు వారిని చంపడానికి జంతురూపాలు ధరించాడు. వారు రావణ కుంభకర్ణులుగా, రాక్షసులుగా పుట్టినప్పుడు నరుడైయ్యాడు. వారు శిశుపాల దంత వక్రులుగా శూద్ర రాజులైనప్పుడు నారాయణుడు నరరూపంలోనే వారిని చంపాడు. ఈ కథలన్ని ప్రతీకాత్మకాలే అని భావించాలి అన్నారు విజయభారతి.
పురాణాలు-కులవ్యవస్థ మూడవ భాగం షట్చక్రవర్తులు (2003 ఆగష్టు) భారతదేశ ప్రాచీన సారస్వతంలో షోడష మహారాజులు షట్చక్రవర్తులు ప్రసిద్దులని చెప్తూ హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు అనే ఆరుగురిని షట్చక్రవర్తులుగా పరిగణిస్తారని షోడషరాజుల చరిత్రలో వైదికపురోహితుల ఆధిపత్యాన్ని చూడవచ్చని విజయభారతి ప్రతిపాదించారు.
వర్ణధర్మాన్ని పాటించడం ప్రజలకు తప్పనిసరని చాటిన పాత్రలలో చక్రవర్తులు, రాజులు, భోగులు పతివ్రతలు మొదలగు అన్ని వర్గాల వారు కనిపిస్తారని పురాణాలలోనూ భారత భాగవతాలలోను ఉన్న రాజుల చరిత్రలు దేవగణాలు / అసురగణాల కథలు పరిశీలిస్తే అధికారం కోసం పోరాటం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. వర్గవైషమ్యం, జాతివైషమ్యంగా రూపుదిద్దుకున్న సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని ఉన్నత వర్గాలు, నిమ్న వర్గాలు ఆధిపత్య కులాలు, దాస్యకులాలు ఇలా సమాజం చీలికలుగా మారిందని ఆమె వివరించారు.
భర్త జూదగాడైనా తనను పందెంలో ఓడినా అప్పు తీర్చడానికి తాకట్టుపెట్టినా అమ్మినా భార్య భరించాలని చెప్పడం ఇవన్నీ తర్వాత వారికి ఆదర్శాలుగా చెప్పటాన్ని బట్టి చూస్తే సాటివారిని మానవతా దృక్పథంలో చూడటం అనే ఆలోచనే ఈ వ్యవస్థలో లేదని తెలుస్తుందని విజయభారతి అభిప్రాయం. హేతువాద దృష్టితో సాహిత్యాన్ని చరిత్రను గమనించినప్పుడే పురాణాలలోని అభూత కల్పనలు అసంగతులు పరస్పర వైరుధ్యాలు బయటపడతాయని ఆమె సూచించారు.
పురాణాలు – కుల వ్యవస్థ నాలుగో భాగం, రామాయణం మీదికి ఎక్కుపెట్టబడిన విమర్శ. ఇది ఆధునిక యుగంలో మహాత్మ జ్యోతిరావు పూలే, డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ ఈ సామాజిక వ్యవస్థ గురించి తపన పడ్డారు.అసమానతల మూలాలను అన్వేషించే క్రమంలో పురాణాల నేపథ్యాన్ని అధ్యయనం చేశారు. సమ సమాజం కోసం మానవతా విలువల కోసం వారు చేసిన అన్వేషణ అందించిన సమా చారం అనంతర తరాలకు వెలుగు బాటలైనాయి. ఆ వారసత్వం నుండే విజయభారతి, రామాయణం ఆధారంగా కుల వ్యవస్థను విశ్లే షించే పనికి పూనుకొన్నారు. ప్రాచీన కాలం నుంచి భారతీయ వేదాం తులు-తత్వవేత్తలు, సంస్కర్తలు, రాజకీయ నాయకులు ఈ సామాజిక ధోరణులను సరిచేస్తున్నామంటూనే ఆ చిక్కు ముడులను మరింత బిగిస్తూ వచ్చారు. పురాణాలు రామాయణ మహాభారతాలు చెప్పిన ధర్మాలను అతిక్రమించే సాహసం చేయలేకపోయారని అన్నారు ఆమె.
వ్యవసాయ సంబంధమైన ప్రతీకలతో భూమి ఆక్రమణలకు సంబంధించిన ఎన్నెన్నో సంఘటనలు రామాయణ కథకు చేరి దాని విస్తృతిని పెంచాయని అవన్నీ సమాజానికి నీతులు భోదించే ఉద్దేశంతో చేర్చినవేనని సామాజిక సంబంధాలు కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉండవలసిన సంబంధాలు వారితో ప్రవర్తించవలసిన పద్ధతులు అన్ని ఇందులో ఉన్నాయని భారతి చెప్పారు. మునుల అసక్తులను పరిరక్షించడం క్షత్రియుని ధర్మంగా రామాయణం బోధిస్తుందని అరణ్యవాసులైన రాక్షసుల స్వస్థలాలను, భూములను ఆక్రమించు కోవడంలో అక్కడ ఆశ్రమాలు స్థిరపర్చుకోవడంలో మునులకు సహకరిస్తూ సాగిన రాముని ప్రయాణమే రామాయణం అని విజయభారతి అభిప్రాయం. దానితోపాటు రామాయణం ప్రతిపాదించిన బలపర్చిన సామాజిక ధోరణులు ఘన తంతు సంస్కృతిని కాదనడం జేష్ఠాధికార వారసత్వ క్రమాన్ని వేదాలను ప్రామాణికాలుగా ప్రచారం చేయడం వర్ణ ధర్మం చాతుర్వర్ణ వ్యవస్థ లోకహితం కోసమే అంటూ శూద్రులపై ఆంక్షలు విధించడం, భూమిపై హక్కు బ్రాహ్మణులది వారి ప్రతినిధులైన క్షత్రియులది అని ప్రచారం చేయడం రామాయణం చేసిన పని అని స్పష్టం చేశారు విజయభారతి.
సంస్కృతికరణం – దేశ భాషలను కాదని సంస్కృతాన్ని గొప్పగా ఆదరించడం పురుషస్వామ్యం స్త్రీలపై విధి నిషేదాలు – పతివ్రతా ధర్మాలు స్త్రీ తండ్రి / భర్త ఆధీనంలో ఉండాలనటం, వివాహ విషయంలో స్వేచ్ఛ ఇవ్వకపోవటం స్థానికులనూ ఆదివాసీలను (రాక్షసులుగా ముద్ర వేసి చంపే ధోరణిని సమర్థించడం పురోహిత వర్గాలూ పాలక వర్గాలూ కలిసి కట్టుగా ఉంటూ బ్రాహ్మణహితం కోసం ఏమైనా చేయవచ్చునని అనటమూ రామాయణంలో ప్రధానంగా కనిపిస్తాయని, అనంతర కాలంలో ఇవే బలపడి వ్యవస్థీకృత మయ్యాయని విజయభారతి పేర్కొన్నారు.
ఒకానొక వర్గపు ఆధిక్యాన్ని, ఒకానొక దేవుని గొప్పతనాన్ని ప్రతిష్టించటమే రామాయణ లక్ష్యంగా పైకి కనిపించినా కొన్ని తరాల పోరాటం, వర్గవైషమ్యం దీనిలోని గాధలలో ప్రతిఫలిస్తున్నదని, సామాజిక, రాజకీయ రంగాలలో వర్తమానంలో కనిపిస్తున్న వాతావరణం పొత్తులూ బలపర్చడాలు ఆనాడు ఉన్నాయని వర్తమానానికి అన్వయించి వ్యాఖ్యానించారు. ఈ విధంగా పరిశీలిస్తే విస్తృతమైన సంప్రదాయ సాహిత్యాన్ని దళిత సామజిక కోణం నుండి విశ్లేషించిన విమర్శకురాలిగా ఘనత విజయభారతికి దక్కుతుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.