హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 498 ఎ సెక్షన్‌ అమలు తీరుతెన్నులు – ఒక నివేదిక

ఘంటశాల నిర్మల
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 498-ఎ సెక్షన్‌ అమలవుతున్న తీరుతెన్నుల్ని ఆచరణలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల్ని చర్చించేందుకు భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ గత మార్చి 12వ తేదీన సికింద్రాబాద్‌లోని హోటల్‌ మినర్వాగ్రాండ్‌లో ఒక రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించింది.బాధిత మహిళలకు ఒక గొప్ప వూరటగా, పీడన నుంచి బయటపడేందుకు మేలైన మార్గంగా స్త్రీ విమోచనవాదులు స్వాగతించిన 498-ఎ చట్టం వాస్తవంలో ఎంతవరకు ప్రయోజనాల్ని అందిస్తోంది, చట్టంలో ఏమైనా లోటుపాట్లు వున్నాయా, అలా వున్న పక్షంలో ఆ లొసుగులు ఎవరికి వత్తాసునిస్తున్నాయి, మరింత పటిష్టంగా 498-ఎ అమలు జరగాలంటే ఎటువంటి విధానాలు, చర్యలు పాటించాలి, చట్టం గురించి మహిళా చైతన్యవాదులు, న్యాయశాస్త్ర నిపుణులు, పోలీసులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు వంటి వివిధ భాగస్వాములు ఏం చెబుతున్నారు వంటి అంశాల్ని చర్చించి, ఆ సారాన్ని క్రోడీకరించి నివేదిక రూపొందించేందుకు యీ సమావేశం ఏర్పాటయింది. భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ ప్రధాన నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి చర్చను ప్రారంభిస్తూ, 498-ఎ చట్టం దుర్వినియోగమవుతున్నదన్న ప్రచారం మితిమీరి జరుగుతున్న నేటి పరిస్థితుల్లో చట్టం అమలుకు సంబంధించిన వాస్తవస్థితి మదింపు వేసి, నిజానిజాల్ని పరిశోధించి సక్రమమైన, మెరుగైన అమలుకై చేపట్టవలసిన విధానాన్ని, చర్యల్ని పరస్పరం పంచుకునేందుకు యీ సమావేశాన్ని ఏర్పాటు చేసామని పేర్కొంటూ, పోలీసు, న్యాయ, ప్రభుత్వ ప్రతినిధులు, రచయితలు, మీడియా నిపుణులు, పౌర స్వరాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వంటి విభిన్న ప్రధాన భాగస్వాములందరూ కలసి యీ చట్టం అమలవుతున్న ధోరణిని చర్చించడం యిదే ప్రధమ ప్రయత్నమని తెలిపారు. ఐపిఎస్‌ అధికారి శ్రీ ఉమాపతి (ఐజిపి-సిఐడి) ని, మహిళా కమిషన్‌ సెక్రటరీ సరళా రాజ్యలక్ష్మిని సత్యవతి వేదిక మీదకు ఆహ్వానించారు.
శ్రీ ఉమాపతి ప్రసంగిస్తూ ఏటా నమోదయ్యే 23,800 కేసులలో 498-ఎ గురించినవి 9,800 వుంటున్నాయంటే వరకట్న హింస ఎంత ప్రబలంగా వున్నదో తెలుస్తున్నదని, మన సమాజంలో వేళ్ళూనుకున్న యీ జాడ్యం సమసిపోవాలంటే పంచాయతీ స్థాయి నుంచి మహిళల ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు జరగాలని అభిప్రాయపడ్డారు. తమకు ఎదురవుతున్న వివక్షను, అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు మహిళలకు విద్య, విజ్ఞానం శక్తిమంతమైన ఆయుధాలని పేర్కొంటూ, కౌన్సిలింగ్‌ కేంద్రాల సంఖ్య యింకా పెరగవలసి వున్నదని సూచించారు. 498-ఎ క్రింద కేసు మోపబడినప్పుడు, ఆ నిందితుడు దేశం నుండి పారిపోయిన సందర్భాల్లో పోలీసుశాఖ అశక్తంగా మిగిలిపోవలసి వస్తున్నదన్న వాస్తవాన్ని సమావేశం దృష్టికి తెచ్చారు.
తర్వాత ప్రసంగించిన ఆక్స్‌ఫామ్‌ ఇండియా హైదరాబాద్‌ ప్రతినిధి రంజన- రకరకాలైన అణచివేత, హింస, క్రూరత్వానికి గురవుతున్న మహిళలకు ప్రయోజనకారిగా వున్న 498 ఎ చట్టం గురించి వేర్వేరు వాదాలు, అందునా ఇతరేతర ప్రయోజనాల కోసం చట్టాన్ని అడ్డుపెట్టుకోవడం జరుగుతున్నదన్న వాదన రేగుతున్న నేపథ్యంలో, భూమికతో కలసి తాము యీ అధ్యయనాన్ని చేపట్టామని వివరించారు. వనరుల కొరత కారణంగా కేవలం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు రెండింటికీ పరిమితం కావలసి వచ్చినట్లు తెలిపారు.
నల్సార్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక బృందం 498-ఎ గురించి ప్రజెంటేషన్‌ సమర్పించిన అనంతరం, తనయ్‌ అగర్వాల్‌ 498-ఎ లో పునఃసమీక్షించవలసిన కొన్ని మౌలికాంశాలు ప్రాతిపదికగా సాగిన వర్క్‌షాప్‌ నేపథ్యాన్ని వివరించారు. ప్రస్తుతం మహిళలకు గృహహింస నుంచి రక్షణగా ఐపిసిలో 498-ఎ సెక్షన్‌, పిడబ్ల్యుడివి చట్టం-2005 (ముఖ్యంగా భరణం కోసం వుద్దేశించిన) క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సెక్షన్‌ 125 అందుబాటులో వున్నాయి.
అధ్యయనం లక్ష్యాలు :
ా    సెక్షన్‌ 498 ఎ కింద గృహహింస కేసులు ఏమేరకు నమోదవుతున్నాయి, కేసుల తీరుతెన్నులు, వాటిలోని రకాల విశ్లేషణతో పాటు చట్టం ఆవశ్యకత పరిశీలన
ా    సేకరించిన ప్రాథమిక, పరోక్ష సమాచారం సహాయంతో చట్టం సద్వినియోగం/దుర్వినియోగం ఏ మేరకు వుంటుందో విశ్లేషణ
ా    గృహహింసకు వ్యతిరేకంగా ప్రస్తుతం వున్న చట్టాల లీగల్‌ ప్రభావం గురించి, కొత్త చట్టాల రూపకల్పన ఆవశ్యకత గురించి మున్ముందు మరింత లోతైన అధ్యయనాలకు వీలు కల్పిస్తూ ఒక మౌలికమైన స్టడీని అందించడం
ా    వాస్తవంగా 498 ఎ బాధితులకు ఏమేరకు అందుబాటులో వుంటుంది, బాధితుల ఫిర్యాదు మేరకు చట్టం అమలు ఏరకంగా సాగుతున్నది, మరింత పటిష్టంగా అమలు చేసేందుకు సూచనలు, సలహాలు వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని సాగించిన యీ అధ్యయనంలో ముఖ్యంగా బాధితుల పట్ల చట్టం అమలుదారుల సానుకూల ధోరణి కొరవడుతుండడం, వివిధ వ్యవస్థల మధ్య సమన్వయం, ప్రచారానికి భిన్నంగా చట్టం దుర్వినియోగం వాస్తవంలో చాలా తక్కువగా వుంటుండడం వంటి అంశాలు బయట పడ్డాయి. పోలీస్‌ అధికారులు తమ వద్దకు వచ్చిన బాధితుల్ని కౌన్సిలింగ్‌ సెంటర్‌కు పంపాలి, ఆపైన కేసు రక్షణాధికారి వద్దకు చేరుతుంది; అలా కాక చాలా సందర్భాల్లో పోలీసులు బాధితురాల్ని నేరుగా ట్రయల్‌ కోర్టుకు పంపుతూండడం వల్ల, కేసు హైకోర్టుకు చేరడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో, బాధిత మహిళలు పోలీసు అధికారుల్ని కాక నేరుగా సలహా కేంద్రాన్ని సంప్రదించడం మేలు అని సూచిస్తున్న అధ్యయనం- యీ చట్టానికి సంబంధించి పోలీసు స్టేషన్లు, కింది కోర్టులు, ఆం.ప్ర. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌, కౌన్సిలింగ్‌ సెంటర్లు, రక్షణ అధికారులు, హైకోర్టు, న్యాయవాదుల పనితీరు వెలుగులోకి తీసుకురావడంతోపాటు, కొన్ని మేలైన చర్యలు సైతం సూచించింది:
ు    పోలీసు అధికారులకు జెండర్‌ శిక్షణ, చైతన్య కల్పన అత్యవసరం.
ు    ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చాలా శ్రద్ధగా, నేర్పుగా, ఎటువంటి అస్పష్టతకూ చోటు పెట్టని పద్ధతిలో, ఏరకమైన మానవ హక్కుల వుల్లంఘనకూ తావు యివ్వకుండా రూపొందించాలి.
ు    ట్రయల్‌ కోర్టుల విషయంలో, ప్రాక్టీషనర్లకు సరైన జెండర్‌ శిక్షణ యివ్వడం ద్వారా వాళ్ళ పనితీరు నాణ్యతను పెంచవలసి వుంటుంది.
ు    క్లిష్టతరమైన పాలనా విధానాలవల్ల, సామాన్య బాధితులు న్యాయవాదిని పెట్టుకోక తప్పడం లేదు.
ు    రక్షణ అధికారి, కౌన్సిలింగ్‌ సెంటర్లో, ఎస్‌ హెచ్‌ ఆర్సీ ల మధ్య సమన్వయం కొరవడుతున్నది; దీన్ని పరిష్కరించాలి.
ు    చట్టం అమలు గురించి మరింత విస్తృతంగా చర్చించాలి.
ు    మూసకట్టు దృక్పథం తగ్గాలంటే జెండర్‌ సెన్సిటైజేషన్‌ అవసరం
ు     వ్యవస్థల్ని సమీకృత పరచడం
ు    దుర్వినియోగం (చాలా తక్కువే అయినప్పటికీ) కాకుండా చూసే రక్షక చర్యల పరిశీలన
తర్వాత ప్రసంగించిన ఐఎఎస్‌ అధికారిణి హోంశాఖ (జైళ్ళు, అగ్నిమాపక విభాగం) స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఛాయారతన్‌ అధ్యయనాన్ని నిర్వహించిన నల్సార్‌ బృందం, పోలీస్‌, జ్యుడీషియల్‌ ఐపిఎస్‌ అధికారులు వంటి ప్రధాన భాగస్వాములకు జెండర్‌ ట్రయినింగ్‌ అందజేస్తే, ఆయా వర్గాల దృక్పథాలు మరికొంత పరిణతి చెంది, మేలైన పనితీరు అందించగలదని సూచించారు; అధ్యయనం సూచించిన మేరకు మార్పు చేర్పులతో 498 ఎ ను అమలు పరచవలసి వుంటుంది అన్నారు.
ఐ పి ఎస్‌ అధికారిణి, హైద్రాబాద్‌ విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఎస్‌.పి. కల్పన మన రాష్ట్రంలో యీ సెక్షన్‌ కింద నేరాలు శిక్షార్హం కావడం వల్ల, మిగిలిన రాష్ట్రాలకంటే యిక్కడ ఎక్కువ కేసులు న్యాయస్థానానికి వస్తున్నాయని పేర్కొంటూ, బాధిత మహిళలు రాజీ చేసుకోవలసిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. కోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య విపరీతంగా వున్న కారణంగా, కేసు నమోదైన 15 రోజులలోగా జారీ చెయ్యవలసిన మధ్యంతర వుత్తర్వులకు రెండు మూడేళ్ళ వ్యవధి పడుతున్నదని, అందువల్ల కోర్టు బయట పరిష్కార మార్గాల్ని మరింతగా పటిష్టపరచవలసి వున్నదని చెప్పారు. గృహహింస బాధితురాలు తనకు రక్షణ కోసం, తన పిల్లల కస్టడీ కోసం, భరణం కోసమంటూ న్యాయ వ్యవస్థలన్నిటి చుట్టూ పరుగులు తీయవలసి వస్తున్నదని, వేర్వేరు కోర్టుల మధ్య సమన్వయ ధోరణి నెలకొనడం దీనికి పరిష్కారం కాగలదన్నారు.
చర్చలో పాల్గొన్న ఆహ్వానితులు 498-ఎ అమలుకు సంబంధించి తమ పనిరంగాలలో ఎదురవుతున్న అనుభవాలు, కేసుల్ని వివరిస్తూ విభిన్నమైన సలహాలను, సూచనల్ని అందించారు. పోలీస్‌, న్యాయ వ్యవస్థల్లోని లోపాలపట్ల, కౌన్సిలింగ్‌ సెంటర్లు, అధికారుల విభిన్న ధోరణుల వల్ల, మారుతున్న సామాజిక నేపథ్యాన్ని గ్రహింపులోకి తీసుకోని మనుష్యుల పోకడల వల్ల తల యెత్తుతున్న అనేక అంశాలు 498-ఎ చట్టం అమలును ఏమేరకు దెబ్బతీస్తున్నాయో చర్చించారు. కోర్టుల సంఖ్య పెంచడం, గృహహింస కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, ఎప్‌ఐఆర్‌ నమోదులో మరింత జాగ్రత్త వహించడం, వ్యవస్థల్లోని లోపాల నివారణకు మరిన్ని వ్యూహాత్మక పరిష్కారాల్ని అందుబాటులోకి తీసుకురావడం ఖాళీగా వున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వుద్యోగాల భర్తీ విపత్కర స్థితిలో బాధితురాలికి వెంటనే సహాయం అందజేత వంటి సభ్యుల అనేక సూచనల్ని పోలీస్‌ అధికారిణి కల్పన, ఐఎఎస్‌ అధికారిణి ఛాయారతన్‌ చర్చించారు.
‘స్వార్డ్‌’ ప్రతినిధి శివకుమారి 498 ఎ పెండింగ్‌ కేసులు కోర్టుల్లో విచారణలో వున్న కేసులు, న్యాయ పరిష్కారం పొందిన కేసుల సంఖ్యాపరమైన వివరాలు అందరికీ అందుబాటులో వుండాలని, బాధితురాలు గృహహింసకు రుజువులు చూపగల స్థితిలో వుండదని, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ సక్రమంగా రూపొందించలేని కేసులు కోర్టులో న్యాయం పొందలేవని వాదించారు. కరీమ్‌నగర్‌ జిల్లాలో పనిచేస్తున్న ఎస్‌.ఐ. దుర్గ 498-ఎ కింద భర్తలపై ఫిర్యాదు చేస్తున్న మహిళలు తమ భర్తల్ని పోలీసులు పిలిపించి ప్రశ్నిస్తున్నప్పుడు వారికి ఏ విధమైన హాని జరగకుండా అడ్డుపడతారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌ జ్యుడీషియల్‌ అకాడమీ అదనపు సంచాలకులు సీతారాం అవధాని  ఈ సమావేశంలో అనేక వివాదాస్పద అంశాలు, వైవిధ్యభరితమైన అభిప్రాయాలు వెలికివచ్చి 498-ఎ చట్టం గురించి మరిన్ని కోణాలలో మరింత లోతైన చర్చ జరగవలసిన అవసరాన్ని స్పష్టం చేసాయని, నేరస్థులలో మరింత భయాన్ని నింపి నేరాల్ని నివారించే విధంగా యీ సెక్షన్‌ను మరింత పదును తేర్చవలసి వున్నదని అభిప్రాయపడ్డారు.
నగరాలలో ఇటువంటి సమావేశాలు  జరుగుతున్నప్పటికీ, అత్యధికంగా అణచివేతకు, హింసకు గురి అవుతున్న గ్రామీణ మహిళల కోసం పల్లె ప్రాంతాల్లో చర్చలు నిర్వహించవలసిన అవసరం వున్నదని, పితృస్వామ్య వ్వవస్థలో పోలీసులు, సంరక్షణ అధికారుల మూస ఆలోచనా ధోరణి కీలకమైన అవరోధమని, బాధిత మహిళల ప్రయోజనాలు తప్ప మిగిలిన అందరి ఆసక్తుల్నీ కాపాడే వ్యవస్థల మధ్య మనం వున్నామని పేర్కొంటూ, 498-ఎ అమలు స్థితి గురించి మరొక మరింత లోతైన అధ్యయనాన్ని త్వరలో చేపట్టబోతున్నామని తెలియజేస్తూ కె. సత్యవతి సమావేశాన్ని ముగించారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>