నెత్తిన కురవబోయే వాన నీది కాదు

 కొండేపూడి నిర్మల
హజ్‌ యాత్ర నిమిత్తం ముస్లిం భక్తుల కోసం ప్రతి ఏటా ఇస్తున్న సబ్సిడీల్ని ఇక ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని సుప్రీంకోర్టు ఈ రోజు ఒక ప్రకటన చేసింది.. అనవసరమైన భావోద్వేగాల్ని మత పెద్దలెవరూ రెచ్చ గొట్టకుండా వుంటే, మైనారిటీల క్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే ఇంతకంటే సంతోషించాల్సిన విషయం ఇంకోటి లేదు. పనిలో పనిగా హిందూ దేవుళ్ళకు, బాబాలకు చేయించే బంగారు హంసతూలికా తల్పాలకీ, క్షీరాభిషేకాలకీ కేటాయించిన ధనాన్ని నగరంలో పేరుకున్న మురికిని, చెత్తను, మలేరియా దోమల్నీ నిర్మూలించడానికి వాడినట్టయితే, పౌరులు ముక్కునిండా గాలిపీల్చుకుని, బతికే హక్కుని కల కంటారు.
ఆర్టికల్‌ ఏభై ఒకటి ఎ ప్రకారం పౌరులందరూ శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలి. అందుకు మన విద్యా, వైద్యం, న్యాయమూ, రాజ్యమూ సహకరించాలి. విషాదం ఏమిటంటే ఈ దేశంలో మూఢనమ్మకమే ఒక వ్యాపారమూ, రాజకీయమూ, దిక్కూ దివాణమూ అయిపోయాయి.. కావాలంటే మూఢ నమ్మకాన్ని కూడా సైన్సు సాయంతోనే నడిపిస్తున్నవారు వున్నారు. సైన్సు అంటేనే నిరూపణకు సిద్ధంగా వున్నదని అర్థం. మూఢనమ్మకాన్ని నమ్మించడం ఒక బలప్రయోగమే. ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌… తరచూ జనాలు బలవంతాలకు లొంగిపోతారు. ప్రభుత్వమే స్వయంగా నిరూపణ కాని భ్రమల కోసం ప్రజాధనం వినియోగించడం నేరం. చట్ట విరుద్ధం.
ఇప్పుడు చూడండి. క్రీస్తు పూర్వం జరిగిన యాగాల్లో సైన్సు వున్నదని అది మానవాళికి పనికొస్తుందని నంబూద్రి పండితులొచ్చి భద్రాచలంలోని ఎడపాక గ్రామంలో అతిరాత్రపు హోమం చేసివెళ్ళారు. దీనిగురించి సామాన్యులకి చాలా గందరగోళం వుంది. సాధారణంగా అపరాత్రి పూజలు దేవతలకు కాక దెయ్యాలకు బాగా వర్తిస్తాయని నానుడి. కానీ ఈ యాగమ్‌ రాత్రిపూటే చెయ్యాలట. కలియుగంలోకి అడుగుపెట్టాక దీన్ని కేరళలో తప్ప ఇంకెక్కడా జరపలేదట. కాబట్టి అక్కడ సిద్ధించిన విశ్వశాంతి, మానవాళి కళ్యాణంతో బాటు వానలు కురిపించడమే ప్రధాన ధ్యేయంగా ఈ యాగం ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. నిత్యమూ నీటిమీద తేలియాడే కేరళ భౌగోళిక పరిస్థితులు వేరు, అన్ని రుతువుల్లోనూ నిప్పులు కురిసే భద్రాచలం వాతావరణ పరిస్థితి వేరు. అసలే పిట్టలు రాలిపోయే ఏప్రిల్‌, మే నెల ఎండల్లో పన్నెండు ఎకరాల మీర దగ్ధ మండలానికి గాను ఈ నేల ఎంపిక చేసుకోవడం వెనక ఏ రాజకీయం వుందో తెలీదు. విశ్వశాంతి కోరుతున్నట్టు చెప్పబడుతున్న ఈ క్రతువు స్థానిక ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో పట్టించుకునే వాళ్ళెవరూ లేరు. అరలీటరు పాల ప్యాకెట్టు అయిదు వందల రూపాయలకు దొరికిందంటే అక్కడ చెలరేగిన వ్యాపారాత్మని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆ పన్నెండు రోజుల యజ్ఞం కుమ్మరించిన వేడిసెగలకి, టూరిజం రద్దీకి పిల్లా, తల్లీ, గొడ్డు, గోదా, వాగు వంకా ఎలా సలసల కాగిపోయారో, ఆస్పత్రుల్లో వున్న రోగులు, వుయ్యాల్లో పసికందులు ఎలా తట్టుకున్నారో ఊహించలేరు. ప్రచార ప్రసార సాధనాలకు కూడా ఉత్సవాలే తప్ప పరిణామ వాస్తవాలు పట్టవు. అట్టడుగు మనిషి బతకడానికి చిన్న బడ్డీకొట్టు పెట్టుకోవాలంటే సవాలక్ష పర్మిషన్లు అడగాల్సినచోట, టన్నుల కొద్దీ ఆవు నేతిని, సోమరసాన్ని కుమ్మరించి, ఇలాంటి మహా మంటలు పెట్టడానికి అక్కడి పౌరుల పర్మిషన్‌ ఎవరూ అడగరు. అసలు ఇవి ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. ప్రపంచ ప్రథమ పౌరుడితోనా? అతను అక్కడే కుటుంబంతో సహా యాగ క్రతువులో వుంటాడు. పోలీసులా? వాళ్ళంతా హోమానికి కాపలాగా వుంటారు. వైద్యులా…? న్యాయవాదులా? శాస్త్రజ్ఞులా.. వాళ్ళంతా ఆ పొగలోనే వున్నారు. ఈ రాజ్యాంగంలో ఏ దేవుడి వెంటా, దెయ్యం వెంటా పడనివాడు పరమ పామర పౌరుడే. అతనెప్పుడూ ఒంటరివాడే. కాబట్టి పామరుడ్ని అడిగి పండితులు యాగాలు, రాజులు యుద్ధాలు, మంత్రులు పన్నులు విధించరు. అవి నెత్తిమీదికొచ్చి నప్పుడే భరించాలని తెలుస్తుంది అంతే. ఈ మధ్య ఎవరో అన్నట్టు ప్రభుత్వ లాంఛనాలతో ప్రతిఏటా పెళ్ళి చేసుకుని కలుకుతున్న భద్రాద్రిరాముడు బాజాల ఖర్చు సరిపోను నాలుగు దుక్కుల వాన అయినా కురిపించలేక పోయాడు కాని, నాలుగువేల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో పన్నెండోరోజున యాగ వేదికని దగ్ద చేశాక అప్పుడు ఉద్భవించిన ఆధ్యాత్మిక శక్తితో పాడి పంటలు విలసిల్లుతాయట..? ఇది మబ్బుల్లో వున్న నీళ్ళ కోసం ముంత వొలకబోసుకోవడం లాంటిది కూడా కాదు, అంతకంటే పెద్ద పరాజయం. వానలు కురవడానికి ఎలాంటి పర్యావరణ రక్షణ వుండాలో మట్టిలో పుట్టిగిట్టే పేద రైతుకి తెలుసు. గుళ్ళో పూజారికేం తెలుసు..? ఏసీలో దొరలకు ఏం తెలుసు..?
ఇంకా చెప్పాలంటే జంతుబలి జరిగే వుంటుందని నమ్మకంతో ధ్వజ స్థంభంపైన గిరికీలు కొట్టే గరుడ పక్షికి తెలుసు. స్పాన్సరు చేసిన అమెరికన్‌ రాక్‌ ఫిల్లర్‌ సంస్థకు తెలుసు. అవును ఇది మల్టీ నేషనల్‌ మహా దగ్దయాగం. లేదా గ్లోబల్‌ అగ్ని గుండం. ఈ భూమి వివాదంలో వుందని కూడా ఒక భోగట్టా. భూమి నుంచి ఆకాశం దాకా ముసురుకున్న కర్భనపు పొగల మధ్య ఏ పుణ్య పురుషులు ప్రత్యక్షమయి ఏమిచ్చి వెళ్ళారో కనబడలేదు. కేరళలో ఒరిగినదేమిటో అక్కడివాళ్ళే చెబుతారు. అవినీతి అసలు తొలగలేదని వివేకపు వెన్నెల కురవడంలేదని వున్నదున్నట్టు చెప్పారో చచ్చామన్న మాటే, జరిగిన యాగంలో అపశృతి దొర్లిందని, ఇంకోసారి మళ్ళీ మొదలు పెడతారు. ముందు నుయ్యి వెనక గొయ్యి.
ఇంకో భయం కూడా నాకుంది. ఇప్పటివరకు సత్యసాయి, తిరుపతి తదితర హుండీల్లో బంగారు కిరీటాలూ, వజ్రాల హారాలూ వేసే అజ్ఞాత భక్తులందరూ రేపటినుంచీ నల్లడబ్బు తెల్లబరచుకోవడానికి గాను సరదాగా ఎవరి గల్లీలో వారు మినీయాగాలూ, మనీయాగాలూ మొదలుపెడతారు. ప్రభుత్వ దీవెనలు ఎలాగూ వుంటాయి. అప్పుడు కురిసే ఆ వానచుక్కల్ని ”వాన చుక్కలు” అనరాదు. అవి ఆ గ్రామానికి వర్తించవు. అంటే పేటెంట్‌ హక్కు మారిపోతుందన్నమాట. ఇప్పుడు ఎడపాకలో కురిసిన వానకి సోమవర్షం అని పేరు పెట్టలేదూ అలాగే అప్పారావు గారి వాన చుక్కలు, సుబ్బారావు గారి వానచుక్కలు అనాలి. వంట చెరుకు మండబెట్టి మబ్బుల్ని లాక్కొచ్చింది వాళ్ళే కదా మరి. అప్పుడే ఏమయింది..? త్వరలో కృష్ణా జిల్లాలోని విజయవాడలో వేయిపిడకలు కాల్చి చెయ్యబోయే యాగ క్రతువులోంచి ఆ పట్టణాన్ని రక్షించడానికి కావలసిన అక్షయ పాత్ర అందుకుంటారట. వూరు వదలి ఎక్కడికి పారిపోతే బావుంటుందో సలహా అడుగుతూ నిన్న మా తమ్ముడు నాకు ఫోన్‌ చేశాడు.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో