1000:914 దిగజారుతున్న సెక్స్‌రేషియో – మనమేం చేయాలి?

కుసుమ స్వరూప
(భూమిక నిర్వహించిన కథ, వ్యాస పోటీలో సాధారణ పచ్రురణ స్వీకరించిన వ్యాసం)
స్త్రీ పురుష నిష్పత్తి 1981లో 947 ఉంటే 2001లో 920, 2011లో 914కి తగ్గింది. అంటే సమాజంలో పురుషుల సంఖ్య పెరుగుతున్నది, స్త్రీల సంఖ్య తగ్గుతున్నది. స్త్రీ మనిషిగా మనుగడ కొనసాగించేందుకు వీలులేకుండా పోతున్నది. అంతేకాదు ”స్త్రీకి స్త్రీగా జన్మించే హక్కు లేకుండా పోతున్నది”. స్త్రీ పురుష నిష్పత్తి తగ్గుదల వలన మహిళలపై ఇంటా బయటా అనేక నేరాలు జరుగుతున్నాయి. నానాటికీ మహిళల సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. భ్రూణ హత్యలు, చదువుకు దూరంగా ఉంచడం, యాసిడ్‌ దాడులు, ఈవ్‌ టీజింగ్‌ పెళ్ళయ్యాక అత్తింటి చిత్రహింసలు… వృద్ధాప్యంలో పిల్లల నిరాదరణ…. ఇలా జీవితం ప్రతి దశలోనూ మహిళలకు సమస్యలే.
ఈ మధ్య కాలంలో ముక్కు పచ్చలారని చిన్నారులపైన అత్యాచారాలు పెరిగిపోయాయి. వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా మూడేళ్ళ, ఐదేండ్ల బాలికలపై 60 ఏండ్ల వృద్ధుడి అత్యాచారం, ఆరేళ్ళ బాలికపై అత్యాచారం చేసి రైల్లో పడేసిన యువకుడు, ఎనిమిదవ తరగతి చదువుతున్న ఒక బాలికను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు, స్కూలు బాలికలపై రోజుల తరబడి అత్యాచారం, హాస్టల్‌ విద్యార్ధినులపై అత్యాచారాల పరంపర. ఇంటర్‌మీడియట్‌ చదువుతున్న విద్యార్ధినులను లైంగికంగా వేధిస్తున్న 50 ఏండ్ల ప్రిన్సిపాల్‌, 58 ఏండ్ల ఆచార్యుడు 49 ఏండ్ల పరిశోధకురాలిపై జరుపుతున్న లైంగిక వేధింపులు, ప్రేమించలేదని వెంటపడి కళాశాలలో హత్య చేసిన ప్రేమోన్మాది, శారీరకంగా తన కోర్కెను తీర్చమని లేకుంటే నీ అంతు తేలుస్తానని బెదిరిస్తున్న పై అధికారి, సామూహిక అత్యాచారం చేయగా తీవ్రమయిన రక్తస్రావంతో మరణించిన గర్భవతి, ఏడేండ్ల బాలికను అత్యాచారం చేసి పూడ్చేసిన ఓ యువకుడు, విద్యార్ధినిపై యాసిడ్‌ దాడి, వృద్ధురాలిపై అత్యాచారం, మైనర్‌ బాలికలు వ్యభిచార గృహాలకు తరలింపు, వరకట్న హత్యలు, ప్రేమజంటల ఆత్మహత్యలు, కూతురు వయస్సున్న బాలికను నిర్భంధించి అత్యాచారం చేసిన పోలీసు అధికారి, పసిపిల్లల కిడ్నాప్‌, ఆపై అత్యాచారం హత్య, 11 ఏళ్ళ బాలికపై ఆటో వాడి అత్యాచారం ఇలా రోజుకొక వార్త. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, హంతక దాడులు, ప్రేమ పేరిట వేధింపుల ఘటనలు పరంపరగా సాగుతున్నాయి.
చిన్న వయసులోని అమ్మాయిల ప్రాణాలు బలవుతుంటే ఆడ పిల్లలను కన్న తల్లిదండ్రులు చాలా రకాలుగా భయాందోళనలకు గురవుతున్నారు. స్త్రీలపైన అత్యాచారాలు బాగా తీవ్రమయ్యాయి. మహిళలపై నేరాలు మరిన్ని పెరుగుతూనే ఉన్నాయి. బాలికలపై పెరుగుతున్న నేరాల సంఖ్య లెక్కలు కూడా దొరకడం లేదు. దీనిక్కారణం 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో) ఏర్పడిన తర్వాత అశ్లీల నృత్యాలు, అశ్లీల చిత్రాలు విపరీతంగా పెరిగాయి. దీనికి అనుబంధంగా టీ.వీలు 24 గంటలు ఏదో ఒక ప్రోగ్రాంతో తలమునకలవుతున్నాయి. సీరియళ్ళలో అక్రమ సంబంధాలు, భార్యభర్తల మధ్య అనుమానాలు, మర్డర్లు, మానభంగాలు. ఫలితం ఇంటర్‌మీడియట్‌ చదువుతున్న అమ్మాయి తల్లిదండ్రుల పోట్లాట కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది. అంతేకాదు ఈ మధ్య మొదలయ్యి ఇంకా కొనసాగుతున్న సీరియల్‌లో 8 ఏండ్ల బాలికను కిడ్నాప్‌ చేయటం, ఆడపిల్ల కదా చంపేయాలని, లేదా దీన్ని ఏ ముంబాయికో అమ్మేస్తే ఆర్థికంగా బాగుపడొచ్చు అనే ఆలోచనలతో ఉన్న యువకుల పాత్రలు, ఇలా ఎన్నో తప్పటడుగులు ఏ విధంగా వేయాలో బాగా నేర్పుతున్నాయి. తక్షణమే ఇలాంటి కార్యక్రమాలను నిలిపివేయటం వలన హింసను తగ్గించుకోవచ్చు, రేషియోను పెంచుకోవచ్చు.
ఈ మధ్యకాలంలో పెరిగిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ‘జావా’ ప్రభావంతో అన్ని రకాల చిత్రాలను సెల్‌లోకి బంధించుకుని ఎక్కడ బడితే అక్కడ చూసుకునే అవకాశం వయస్సు పరిమితి లేకుండా ఏర్పడింది. సెల్‌ బాగోతం అందరికి తెలిసిందే. దీనివల్ల ఎందరో ఆడపిల్లలు ప్రలోభాలకు లోనై అఘాయిత్యాల పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్రేకానికి లోనైన వారు తమ యొక్క పరిధిలు, పరిమితులు, సమాజం, వయసు అన్నింటిని మరచిపోతున్నారు. ఆ సమయంలో ఏం చేస్తున్నారో వారికే తెలియక చిన్న పిల్లలపై పడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రపంచ వాణిజ్య సంస్థవలన పెరిగిన ప్రచారం స్త్రీలపై లైంగిక దోపిడిని, హింసను సాగించడానికి అవసరమైన భూమికను ఏర్పరచి, నీచ సంస్కృతిని, హీన విలువల్ని ప్రోత్సహి స్తున్నాయి.
విద్యార్థినులపై పెరుగుతున్న దాడులకు మూలాలు భూస్వామ్య సామ్రాజ్యవాద విషసంస్కృతిలో ఉన్నాయి. సినిమాలు, టీవీ ఛానళ్ళు ఇతర ప్రచార సాధనాలు నీచ అభిరుచుల్ని హీన విలువల్నీ పనిగట్టుకుని ప్రచారం చేస్తూ జరిగిన దాడుల్ని ఘోరాల్ని కూడ వినోద కార్యక్రమాలుగా మలిచి సొమ్ము చేసుకుంటున్నాయి. స్త్రీని ఆటబొమ్మగా, అంగడి సరకుగా, ఆదాయపు వనరుగా చూసే సామ్రాజ్యవాద సంస్కృతి, స్త్రీని ఆస్తిగా, పరాధీనగా, అనుభవించదగినదిగా చూపే భూస్వామ్య సంస్కృతి కలిసి ఆడపిల్ల అనగానే ఒక వ్యక్తిగా గాక అనుభవించాల్సిన వస్తువుగా, సెక్స్‌ సింబల్‌గా స్ఫురింపచేయటం ఎంత ఘోరం? ఎవడైన తాను ప్రేమించానని వెంటబడితే ఆ ‘ప్రేమ’ హింసని ఒప్పుకోవటం తప్ప మరొక మార్గం లేదు. కాదంటే క్షణంలో ప్రాణాలు తీయటం. బడికెళ్ళిన పసిపిల్ల క్షేమంగా తిరిగి వస్తుందో తెలియదు. చదువుకునే, ఉద్యోగాలు చేసే మహిళలు ఎవరి ప్రేమవాతన పడనున్నారో, రోడ్డుమీద ఏ ఉన్మాది దృష్టి పడి తల బద్దలై చచ్చిపోతారో తెలీదు. తమను కాదన్నందుకు స్త్రీలను వేధించవచ్చు ఇంకా చంపవచ్చు కూడ అనే అహంకారాన్ని, స్త్రీలు పురుషులకు సంబంధించిన వస్తువులని, వారిపై సర్వాధికారాలు పురుషులవేనని బోధించే ఈ పితృస్వామ్య సమాజం, దీని ఆధిపత్య సంస్కృతి స్త్రీలపై ఈ హింసకు కారణం. ప్రభుత్వ మద్యం విధానం కూడ దాడులకు ప్రేరకంగా ఉంటున్నది, బయటకు వస్తే భద్రత కరవుగా ఉన్న ఈ స్థితిలో స్త్రీలు ప్రాణాలరచేతిలో పెట్టుకుని చదువుకోవటానికి, ఉద్యోగాలు చేయటానికి వెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వం విద్య వైద్య రంగాలను  ప్రైవేటీకరిస్తున్న ఫలితంగా వాటిలో వ్యాపార ధోరణులు ప్రబలుతున్నాయి.
మన సమాజంలో ఉండకూడని అతి ప్రమాదకరమైన రుగ్మతలలో లైంగిక వేధింపులు ఒకటి. ”పనిస్థలాలలో లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2010” గురించి భూమిక ఆధ్వర్యంలో నిర్వహించబడిన రాష్ట్ర స్థాయి వర్క్‌ షాప్‌లో ముజిబ్‌ కుమార్‌, హైకోర్టు అడ్వకేటు చాలా వివరంగా బిల్లులో వున్న లోపాల గురించి చెబుతూ ముఖ్యంగా ఈ బిల్లులో చేర్చని వర్గాలలో విద్యార్థులు ఒకరని వీరు పరిశోధన చేసే సమయంలో వారి వారి గైడ్‌ల నుండి లైంగిక వేధింపుల సమస్య ఎదుర్కొంటారని, వారిని తప్పని సరిగా ఈ బిల్లులో చేర్చాలని సూచించడం జరిగింది. నిజమే చేర్చాల్సిందే ఎందుకంటే ఈ మధ్య ఒక ఉన్నత విద్య సంస్థలో లైంగిక వేధింపులు అలవాటుగా మారిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అతడు నేను మనిషినే నాకు కోరికలుంటాయి. దాహమేసినప్పుడు మంచినీళ్ళు ఎలా తాగుతామో కోరిక కలిగినప్పుడు తీర్చుకోవడమూ అంతే ముఖ్యం అంటున్న టీచకుడికి ఎలా బుద్ధి చెప్పాలి? ఈ దురాగతాలను, మహిళలకు జరుగుతున్న అన్యాయాలను రూపు మాపి, దుష్టశక్తుల బారినుండి సమాజానికి విముక్తి కలిగించేదెలా? మహిళల ప్రగతికి తద్వారా యావత్‌ సమాజ అభ్యున్నతికి విఘాతం కలిగిస్తున్న దుర్మార్గులను అడ్డు తొలగించుకొనేదెలా?
భారతదేశంలో స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రతి 1000 మంది పురుషులకు 1050 మంది కనీసం 1000 మంది స్త్రీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 60 మంది స్త్రీలు కనబడటం లేదు. అంటే దేశ జనాభాలో కొన్ని లక్షలమంది స్త్రీలు కనబడటం లేదు. గర్భంలో వుండగానే లేదా పుట్టగానే లేదా ఎదుగుతున్నప్పుడు లేదా సంతానోత్పత్తి దశలో రకరకాల కారణాలవల్ల చనిపోతున్నారు. 2001 జనాభా లెక్కలతో పోలిస్తే 2011 లెక్కల్లో 50 లక్షల మంది పిల్లలు తగ్గిపోవడం 1000 మంది మగపిల్లలకు 914 ఆడపిల్లలు ఉండటం ఆందోళనకరమైన అంశంగానే కాక రేషియో దిగజారడమనేది ఇంకా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నాగరికత పెరిగిన ప్రాంతాల్లో కంటే కూడా నాగరిక ప్రపంచానికి కాస్త దూరంగా ఉన్న చోటే ఆడపిల్లల పట్ల ఎక్కువ ఆదరణ, మక్కువ కనబడుతున్నట్టు తాజా జనాభా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దేశ రాజధానికి సమీపంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరొందిన పంజాబ్‌, హర్యానాలో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు ఆడపిల్లలు 830, 846 మాత్రమే ఉండగా ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మేఘాలయాలు ప్రతి వెయ్యిమంది బాలురకు 971, 970 ఉంది. దీన్నిబట్టి పెరుగుతున్న నాగరికత చిట్టి తల్లులకు ప్రాణం పోయడం లేదని, సంకుచితమైన వివక్షాపూరితమైన ఆలోచనా ధోరణులను సామాజికాభివృద్ధి ఏమంతగా ప్రభావితం చేయలేక పోతున్నదని స్పష్టమౌతున్నది. అలాగే గ్రామీణ స్థాయిలో ఆడ, మగ నిష్పత్తి 1991లో 948, 2001లో 934 ఉండగా పట్టణ ప్రాంతంలో 935, 903 ఉంది. దీన్నిబట్టి గ్రామీణ స్థాయిలో ఆడ, మగ నిష్పత్తి కంటే పట్టణ స్థాయిలోని ఆడ, మగ నిష్పత్తి తక్కువ ఉండటాన్ని గమనించవచ్చు.
దేశంలో మహిళలపట్ల విచక్షణ కొనసాగుతున్నదని అధికారిక గణాంకాలు సైతం ధ్రువపరుస్తున్నాయి. 2008 నాటి లింగ సమానత సూచి (జీఈఐ) ప్రకారం 168 దేశాల్లో భారత్‌ది 122వ స్థానమని ఆర్థిక సర్వే (2010-11) స్వయంగా వెల్లడించింది. పునరుద్పాకతకు దోహదపడే ఆరోగ్యం, సాధికారత, శ్రామిక శక్తిలో భాగస్వామ్యం లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకొని ఈ సూచి రూపొందించారు. ఇందులో భారత్‌ విలువ 0.748, చైనా (0.405), శ్రీలంక (0.599) లతో పోలిస్తే భారత్‌లో మహిళల పట్ల విచక్షణ చాలా ఎక్కువని ఆ సూచి స్పష్టం చేసినట్లు ఆర్థిక సర్వే తెలిపింది.
మహిళల అక్షరాస్యత పెరుగుతోంది. ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయిన మాతృత్వ మరణాలకు గురవుతోన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నది. రాష్ట్రంలో ప్రతి వెయ్యి ప్రసవాలకి నలభై ఎనిమిది మహిళలు మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిముషానికి ఒకరు మృత్యువు ఒడికి చేరుతున్నారు. గర్భం దాల్చింది మొదలు పండంటి పాపాయిని పొత్తిళ్ళలోకి తీసుకునే దాక కాబోయే తల్లికి ఎదురయ్యే సమస్యలు వేధించే అనారోగ్యాలే వారిని ప్రాణాపాయం దిశగా తీసుకెళుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రసవం లేక గర్భస్రావం జరిగిన నలభై రెండు రోజుల లోపల ఎదురయ్యే కారణాలన్నీ మాతృత్వ మరణాల్లోకే వస్తాయి. ఇవి ఎనభై శాతం ఉంటాయి. స్త్రీల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సామాజిక, కటుంబ పరిస్థితులు, అవగాహనలేమితో సహా మరికొన్ని ఇరవై శాతం సమస్యలు. పేదరికం, నిరక్షరాస్యత, పోషకాహార లేమి మొదలైనవి. మాతృత్వ మరణాల సంఖ్య తగ్గించాలంటే కుటుంబ పరంగానే కాదు; సామాజికంగానూ మార్పులు రావాలి. అమ్మాయికి చిన్న వయసులో పెళ్ళి చేయాలనే ఆలోచనను తల్లిదండ్రులు మానుకోవడం ప్రాథమికంగా చేపట్టాల్సిన మార్పు.
గర్భం, ప్రసవం, గర్భ విచ్ఛిత్తిల కారణంగా లక్షల మంది స్త్రీలు మరణిస్తున్నారు. చిన్నవయసులో తక్కువ వ్యవధిలో వచ్చే గర్భాల కారణంగా ప్రపంచంలో జరుగుతున్న మాతృ మరణాలలో 48 శాతం వరకు భారతదేశంలోనే జరుగుతున్నాయి. ఎక్కువగా మగశిశువులే గర్భ స్రావాల ద్వారా, మృత శిశువులుగా తల్లి గర్భం నుండి బయట పడతారు. పుట్టాక 6 నెలల వరకు ఆడపిల్లల మరణాల కంటే మగపిల్లల మరణాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం ఆడ, మగ శిశువుల క్రోమోజోమ్స్‌లో ఉన్న తేడా అయితే 6 నెలల తర్వాత మరణించిన శిశువులలో మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి కారణం కుటుంబంలోనూ, సమాజంలోనూ వారిపై అమలవుతున్న వివక్ష.
గర్భం దాల్చిన మొదటి నెల నుంచి కాన్పు అయ్యే దాకా వైద్యుల సలహాలు పాటిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాని కొన్ని ప్రాంతాల్లో ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, ఉన్నా ఊరికి దూరంగా ఉండటం. అలాగే అత్యవసర సమయంలో చికిత్స అందించాల్సి వస్తే సరైన వైద్య పరికరాలు సిద్ధంగా ఉండవు. ఇదిగాక ఈ మధ్య పట్టణాల్లో సైతం స్త్రీ ప్రసవం పట్ల ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా వారు వైద్య సహాయం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కేవలం జబ్బులు లేక పోవడమే ఆరోగ్యం కాదు. సంపూర్ణమైన శారీరక, మానసిక, సామాజిక స్వస్థతే ”ఆరోగ్యం” అని నిర్వచించింది. శారీరకంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తగినంతగా లభించాలి. శారీరకంగా ఆరోగ్యం బాగుపడాలంటే మనుషుల జీవితాల్లో నిశ్చింత, భద్రత ఉండాలి. ఎటువంటి ఆందోళనలు ఒత్తిడులు, అలజడులు, విచారాలు, అభద్రతలు లేకుండా ఉండాలి. అయితే మిలియన్ల మంది బాలికలు నిర్లక్ష్యం, విపరీతమైన చాకిరి, తరచుగా వేధింపులు, హింసకు ఆలవాలమైన వాతావరణంలో పెంచబడుతున్నారు. స్త్రీల జీవితపు అన్ని దశల్లోనూ అమలవుతున్న వివక్ష, హింస వారి మాన, ప్రాణాల్ని హరించడమేగాక ఆరోగ్యంపై కూడ దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. పురుషుల విశృంఖల సెక్స్‌ ప్రవర్తనవలన సుఖరోగాలు, హెచ్‌.ఐ.వి, ఎయిడ్స్‌ భారాన్ని పురుషులకంటే స్త్రీలే ఎక్కువగా అనుభవిస్తూ ప్రమాదకరమైన లైంగిక వ్యాధుల కారణంగా లక్షల సంఖ్యలో స్త్రీలు మరణిస్తున్నారు.
స్త్రీల ఆరోగ్యంపై జెండర్‌ అసమానత వలన ఇలాంటి ప్రభావాన్ని కల్గి ఉన్నవి. స్త్రీలు ప్రపంచపు పేదల్లో 70 శాతం నిరక్షరాస్యులలో 70 శాతం ఉన్నారు. రక్తహీనతకు గురవుతున్న వారిలో పురుషులు 25 కోట్ల మంది ఉండగా స్త్రీలు 46 కోట్ల మంది ఉన్నారు. చాలా దేశాలలో బాలికలకు తమ సోదరుల కంటే తక్కువ ఆహారం ఇవ్వబడుతున్నది. వారు ఎక్కువ కఠినమైన శ్రమ చెయ్యాల్సి వస్తున్నది. వారికి తక్కువ ఆరోగ్య సంరక్షణ లభిస్తున్నది. బాలికలు తమ చిన్న వయసు, జెండర్‌ కారణంగా రెట్టింపు నిరాకరణలకు గురవుతున్నారు. స్త్రీలు మంచి పాఠశాలలకోసం, భద్రత ఉన్న నివాస ప్రదేశం కోసం, పరిశుభ్రమైన గాలి, పరిసరాల కోసం, త్రాగునీటికోసం, హుందాగా జీవించడానికవసరమైన లెట్రిన్ల కోసం అలమటిస్తూ పోరాటాలు చేస్తూ బ్రతుకుతున్నారు.
పురుషులకంటే ఎక్కువ మంది స్త్రీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం వలన తీవ్ర రక్తహీనత వస్తుంది. ఇది గర్భం సమయంలో ప్రసవ సమయంలో ప్రసవం తరువాత తీవ్ర రక్త స్రావం అవడానికి, తక్షణ వైద్య సహాయం అందకపోతే మరణించడానికి లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారి తీస్తుంది. బాలింతకు పోషకాహార లోపం ఉంటే ఇన్ఫెక్షన్లు కూడ సులభంగా వస్తాయి. అయితే జెండర్‌ అసమానతల వలన ఈ అన్ని దశలలోనూ ఆడపిల్లలకు తక్కువ పోషకాహారం, తక్కువ నాణ్యతగల పోషకాహారం లభిస్తున్నది.
ప్రసవానికి ముందే గర్భస్త శిశువు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని తీర్మానించిన అత్యున్నత న్యాయస్థానం యొక్క తీర్పును కూడ ఉల్లంఘించి, లింగ నిర్ధారణానంతరం ఆడ శిశువులైతే గర్భస్రావానికి పాల్పడుట స్త్రీ పురుష నిష్పత్తిలోని తగ్గుదలకు కారణమని ప్రసిద్ధ డెమో గ్రాఫర్‌ మాలినీ కర్నాల్‌ చెప్తున్నారు. అంటే గర్భస్త శిశువు రూపుదిద్దుకోక ముందే మన సమాజంలో లింగ వివక్షత చూపబడుతుంది. పితృస్వామ్య వ్యవస్థ ఉన్న మనదేశంలో స్త్రీ శిశువు పట్ల ఉన్న నిరాదరణ, పునరుత్పత్తి వయస్సులో స్త్రీల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ, ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీల మరణాలు పై గణాంక వివరాలకు అర్థం చెబుతున్నాయి.
వచ్చే నాలుగేళ్ళలో మాతృత్వ మరణాల్ని డెభ్భై అయిదు శాతం తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎం.పీ.ఎస్‌ (మేకింగ్‌ ప్రెగ్నెన్సీ సేఫర్‌) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యంపై దృష్టి సారించడం, గర్భధారణ, ఆ తరువాత నిపుణుల పర్యవేక్షణలో ఉండటం, కుటుంబ నియంత్రణ, గర్భస్రావం తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పుట్టిన పిల్లల సంరక్షణ సమస్యలు ఎదురైనప్పుడు నిపుణులతో వైద్యం చేయించుకోవడం మొదలైనవి.
రాష్ట్రంలో పసిపిల్లల సంఖ్య బాగా తగ్గుతోంది. చిన్న కుటుంబమే చింతలేని కుటుంబమనే ధోరణి ప్రబలుతుండటమే ఇందుకు కారణం. ఒక్క బిడ్డతో సరిపెట్టుకునే కుటుంబాల సంఖ్య క్రమంగా అధికమవుతున్నది. ఇంకా మారుతున్న యువత జీవన విధానం, ఉద్యోగ జీవితాల్లో యువతీ, యువకులు బిజీ కావడం, దంపతుల్లో సంతాన సాఫల్య రేటు తగ్గడం వంటివీ కూడ ముఖ్య కారణాలేనని విశ్లేషకులంటున్నారు. దీనికి తోడు ముందుకు ఒక ఆడపిల్ల ఉన్నట్టయితే లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడపిల్ల అని తెలుసుకొని గర్భస్రావాలు చేయించుకునేవారు కొందరైతే ఆడపిల్లను కనడం భారంగా భావిస్తున్నవారు మరికొందరు. ఇలాంటి వారివల్ల సైతం మొత్తం జనాభాలో ఆడ శిశువుల శాతం బాగా తగ్గుతోంది. తాజా జనాభా లెక్కలు ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి. మగపిల్లలకంటే ఆడపిల్లల సంఖ్య గతం కంటే కూడ తగ్గింది. ఇందుకు ఆధునిక వైద్య సదుపాయాల మాటున లింగ వివక్షను పెంచి పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీగాక దేశ వ్యాప్తంగా వేలకొద్ది వివిధ పరీక్షలు చేసే ల్యాబ్‌లున్నాయి. ఇక్కడే కొన్ని చోట్ల లింగ వివక్షకు బీజం పడుతుందనే ఆరోపణలున్నాయి.
వరంగల్‌ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరుకు చెందిన రావుల మల్లయ్య తనకు మూడోసారి ఆడపిల్ల పుటిందని వినగానే జనగామ ఆసుపత్రిలో పురిటి శిశువును నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ ఘాతుకం లింగ వివక్షకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంల అడపదడపా జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలు వద్దనుకునే వారిని మానసిక రోగులుగా పరిగణించాలి. ఆడపిల్ల పుట్టిందనే కారణంగా సంసారాలను పాడుచేసుకోవడం, గర్భంలోనే భ్రూణహత్యలకు పాల్పడటం నేరం. దక్షిణాది రాష్ట్రాల్లో గత దశాబ్ద కాలంగా ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
బాలికల సరాసరి వివాహ వయస్సు 1961లో 15.5 శాతం కాగా, అది 1997 నాటికి 19.5 కు పెరిగింది. కాని ఇప్పటికి 44.5 శాతం మందికి 18 సంవత్సరాలు నిండకముందే వివాహం జరిపిస్తున్నారు. పుస్తకాల సంచి భుజానకేసుకుని బడికెళ్ళాల్సిన వయసులో చంకలో ఓ పసిబిడ్డ. మనసు వికసించాల్సిన దశలో ఒత్తిళ్ళూ ఆత్మహత్య ఆలోచనలు. పచ్చగా కాపురం చేసుకోవాల్సిన సమయానికి విడాకులు, వైధవ్యాలు. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని పలుగ్రామాల్లో బాల్య వివాహాలు ఆడపిల్లల జీవితాల్ని బుగ్గిపాలు చేస్తున్నాయి. యునిసెఫ్‌ సంస్థ నిర్వహించిన సర్వేల ప్రకారం గత ఏడాది ఆదోని చట్టు ప్రక్కల ప్రాంతాల్లో 1400 బాల్య వివాహాలు జరిగినట్లు నిర్ధారించారు. వధూవరులంతా 9 నుంచి 14 ఏళ్ళ పసిపిల్లలే. ముడులు మూడే వాటి చుట్టూ కష్టాలు, కన్నీళ్ళు, అనారోగ్యం, లింగ వివక్ష, దుర్భర దారిద్య్రం అనే పదునైన ముళ్ళు మాత్రం లెక్కలేనన్ని.
మనదేశంలో 2001 నాటికి 33 మిలియన్ల వితంతువులున్నారు. భార్య చనిపోయిన పురుషులు 2.5 శాతం ఉంటే స్త్రీలలో భర్త చనిపోయిన వాళ్ళు 8 శాతం ఉన్నారు. వితంతువులకు పునర్వివాహ విషయం నేటికి పెద్ద సమస్య గానే ఉంది. ఇప్పటికీ చనిపోయి స్వర్గంలో ఉన్న ఆమె భర్త ఆస్తిగానే చూడబడుతోంది. పేదరికం పిల్లల పోషణ భారం, సాంఘిక వివక్ష వారిని కృంగ తీస్తున్నాయి. వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు, అభిప్రాయాల వలన సమాజంలోనే కాకుండా ఇంట్లో కూడ స్త్రీ పురుష సంబంధాలలో అసమానతలు ఏర్పడి గృహహింసకు దారి తీస్తున్నాయి. అటువంటి స్త్రీలకు ఉపశమనం కల్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నెం. 43, 2005 రక్షణ చట్టం-2005ని అమల్లోకి తెచ్చింది. శారీరక, మానసిక మాటల ద్వారా ఉద్వేగ పరచడం, దౌర్జన్యానికి పాల్పడడం ఆరోగ్యాన్ని కుంటు పరచే చర్యలన్నీ గృహహింసకు సంబంధించినవే. నాలుగ్గోడల మధ్య నలిగి పోతున్న స్త్రీని గోడవతలి చట్టం ఏమేరకు కాపాడగల్గిందనే విషయాన్ని తీసుకుంటే గత నెల ముంబయ్‌లో జరిగిన నిధి గుప్తా ఆత్మహత్య ఒక ఉదాహరణ. చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఈమె తన ఇద్దరు పిల్లలను కూడా చంపింది. బాగా చదువుకుని, సంపాదిస్తున్న మహిళలు కూడా ఇలాంటి ఘోరమైన చర్యలకు పాల్పడుతున్నారంటే దానిక్కారణం గృహహింస. తరతరాల నుండి పురుష అహంకారాన్ని నరనరాన జీర్ణించుకున్న పితృస్వామ్య వ్యవస్థ అధికార అజమాయిషీలే దీనికి ముఖ్య కారణం. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన మూడేళ్ళలో నమోదైన ఆత్మహత్యల కేసులు 2007లో 1075, 2008లో 1142, 2009లో 985గా ఉన్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రీసెర్చి బ్యూరో ప్రకారం 2008-2009 మధ్యకాలంలో భర్తల వలన హింసకు క్రూరమైన దాడులకు గురైన భార్యల శాతం 10 శాతానికి పెరిగింది. ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం ప్రకారం 50 శాతం స్త్రీలు ఇంట్లో హింసకు గురవ్వడం, గాయపడడం, మరణించడం కూడా జరుగుతున్నదని తన నివేదికలో వివరించడం జరిగింది.
వైవాహిక జీవితంలో మహిళలపై హింస కూడా ఆందోళన కలిగించే అంశం. పోలీసు శాఖ ప్రతి సంవత్సరం 5 వేల వరకట్నపు కేసులు నమోదు చేస్తున్నది. అదనపు వరకట్న వేధింపు కేసులు సుమారు 30 వేలు నమోదవుతున్నాయి. ఇద్దరు భార్యలను కలిగి ఉండటం, వివాహానంతరం భార్యను వదలివేయడం, విడాకులు తీసుకోవడం లాంటి సంఘటనలకు సంబంధించిన కేసులు అధికంగానే నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు న్యాయస్థానాలలో సుమారు 5 లక్షల కేసుల వరకు పెండింగ్‌లో ఉన్నాయని గణాంక వివరాల అంచనా.
ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రీసెర్చి ఆన్‌ వుమెన్‌ (ఐసిఆర్‌డబ్ల్యు) అంతర్జాతీయ స్త్రీ అధ్యయన కేంద్రం నిర్వహించిన ఇంటర్నేషనల్‌ మెన్‌ అండ్‌ జెండర్‌ ఈక్వాలిటీ సర్వే ప్రకారం 68 శాతం భారతీయ పురుషులు స్త్రీలు గృహహింసని భరించాలి అని అభిప్రాయంలో ఉన్నారు. అలాగే 16 శాతం మంది భారతీయ పురుషులు ఇంటిపనిలో పాలు పంచుకుంటామని చెప్పడం జరిగింది. అంటే మన సమాజంలో ఇంకా పురుషాధిక్యత కొనసాగుతోంది. మగపిల్లల పట్ల మొగ్గునకు కారణమిదే.
మన రాష్ట్రంలో దళిత, గిరిజన స్త్రీలు 23 శాతం ఉన్నారు. అభివృద్ధిలో అసమానతల కారణంగా వీరి పట్ల వివక్ష పెరిగింది. స్త్రీ పురుష నిష్పత్తి దళిత గిరిజనుల్లో కూడ పడిపోతున్నది. వ్యవసాయ కూలీలు, పేదరైతులు, బాడి, భవన నిర్మాణం తదితర అసంఘటిత కార్మికుల్లో, దళిత, గిరిజన స్త్రీలే ఎక్కువ. వారిలో ఆరోగ్యం, ఆహార భద్రత తీవ్రమయిన సమస్యలుగానే ఉన్నాయి. 80 శాతం పైగా స్త్రీలలో రక్తహీనత ఉంది. పేదరికానికి తోడు ఇంటా బయటా చేస్తున్న అధిక శ్రమ, మగవాళ్ళ తాగుడు హింస, కుల వివక్ష పురుషాధిక్యత తోడై బ్రతుకులు బండబారుతున్నాయి. వ్యవసాయ సంక్షోభం పెరగటంతో పేద, చిన్న రైతు కుటుంబాల వలసలు పెరిగి, భవన నిర్మాణ రంగంలో ఈ తరగతి, స్త్రీ కార్మికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడది 40-50 శాతానికి పెరిగింది. పని గ్యారంటీ లేకపోవడం వలన వీళ్ళు లైంగిక దోపిడీకి బలి అవుతున్నారు.
2007వ సంవత్సరంలో భారత ప్రభుత్వం గల్ఫ్‌ దేశాలకు వెళ్ళే మహిళా ఇంటి పనికార్మికుల సంక్షేమం పట్టించుకోవాలని ప్రతిపాదించినా, వీరికి ఏ దేశీయ అంతర్జాతీయ చట్టాలు, న్యాయాన్ని, రక్షణను ఇవ్వలేకపోతున్నాయి. వలస పోయిన స్త్రీకి అన్ని మానవ హక్కులు హరించబడుతున్నవి.
దేశంలో మహిళలకు పురుషులతో సమాన స్థాయి లభించడం లేదు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు బస్సులు, రైళ్ళు ఒక్కటేమిటి అన్ని చోట్ల మహిళలు అవమానాలకు, అఘాయిత్యాలకు గురవుతున్నారు. కట్న కానుకల పేరుతోనో మరే ఇతర సాకులతో నవ వధువులను కాల్చి చంపే విష సంస్కృతికి తెరపడలేదు. ప్రేమకు అంగీకరించని ఆడపిల్లల్ని మగ ‘పురుగులు’ కిరాతకంగా కడతేరుస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న రమావత్‌ లలితాబాయ్‌ (16) ప్రేమోన్మాదానికి, యాసిడ్‌ దాడికి గురై గుంటూరులో చికిత్స పొందుతూ 11-4-2010న మృతి చెందింది. ఖమ్మం జిల్లాలో ప్రేమికుడు శ్రీను (28) ప్రేమికురాలు చింతమళ్ళ శ్రీలత (23) ను మోసం చేసి పోలీసు కేసయ్యి తిరిగి 3-6-2011న ఒకసారి శ్రీలతతో మాట్లాడాలని పిలిపించి వెంట తెచ్చుకున్న కత్తితో మెడపై కోశాడు. ఈ ఘాతుకాన్ని విని పోలీసులు కూతవేటు దూరంలోనున్న పోలీస్‌ స్టేషన్‌ నుండి సంఘటన స్థలానికి చేరుకోవడానికి 15 నిమిషాలు పట్టింది. తరువాత శ్రీలతను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌లో 19-6-2011న కోరిక తీర్చలేదని కామాందులిద్దరు బాలిక కన్ను పొడిచారు. మరో ఉన్మాది అదే రోజున తుపాకీతో భయపెట్టి 18 ఏళ్ళ యువతిపై అత్యాచారం చేశాడు.
ఈ మధ్య మనదేశంలో గౌరవ హత్యలుగా చెప్పబడుతున్న హత్యలు ఎక్కువయ్యాయి. భారతదేశానికి తప్ప ప్రపంచంలో మరే ఇతర దేశానికి లేని భయంకరమైన నీచమైన రుగ్మత కులం. ఈనాటి కుటుంబాలు కులాన్ని ఆచరించే సంకుచిత బానిస కేంద్రాలుగా మారిపోయాయి. అందుకే కులాంతర వివాహాలను ఏ కుటుంబం కూడ అంగీకరించడం లేదు. ప్రేమికుల ఆత్మహత్యలకు ఇది ఒక ప్రధానమైన కారణం. పిల్లల ప్రేమ తమకు ఇష్టం లేకున్ననూ ఇద్దరిదీ ఒకే కులం అయితే పెళ్ళికి ముందో తర్వాతో పెద్దలు వారి ప్రేమను సులువుగా అంగీకరిస్తున్నారు. కులాలు వేరయితే మాత్రం ఆ ప్రేమికులెంత ఉన్నతస్థాయికి వెళ్ళిననూ వారి ప్రేమను ససేమిరా అంగీకరించడం లేదు. తమ పిల్లల జీవితాలను ఆ కులానికి బలి ఇవ్వడంలో పెద్దలే ప్రధానపాత్ర పోషిస్తున్నారని నిస్సంకోచంగా చెప్పవచ్చు. దానికి ఉదాహరణ మనసు పడిన ప్రేమికులు మాంగల్య బంధంతో ఒక్కటయిన నేరానికి ఓ యువతిని అయినవారే మట్టు బెట్టిన అమానుషత్వం మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగితే… ప్రేమికుడితో సహజీవనం చేస్తుందని శ్రీకాకుళం జిల్లాలో తమ బిడ్డను కర్కశంగా చంపేశాడో తండ్రి.
వ్యక్తి జీవితంలోను, మొత్తం సమాజంలోను, విద్య విలువైన సాధనం. అడుగడుగునా ఒక వ్యక్తి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్షరాస్యత ఆయుధమౌతున్నది. విద్య వలన సామాజిక ఎదుగుదల, జ్ఞానం పెరుగుదల, రాజకీయ అవగాహన, ఆర్థిక స్థోమత, నైపుణ్యాలను పెంచడం సాధ్యమవుతుంది. అయితే భారతదేశంలో అక్షరాస్యత రేటులో జెండర్‌ వివక్ష ఎలా ఉందంటే వివిధ జనాభా లెక్కల ననుసరించి 1951 నుండి 2001 మధ్య కాలంలో పురుషుల అక్షరాస్యత 27.16 శాతం నుండి 75 శాతానికి పెరగగా స్త్రీల అక్షరాస్యత 8.86 శాతం నుండి 54.16 శాతానికి మించలేదు. అలాగే 2001 నుండి 2011 మధ్యకాలంలో పురుషుల అక్షరాస్యత 75.85 నుండి 82.14 శాతానికి పెరుగగా స్త్రీల అక్షరాస్యత 54.16 నుండి 65.46 శాతం మాత్రం పెరిగింది. అంటే ఇంకా 34.54 శాతం స్త్రీలు నిరక్షరాస్యులుగానే ఉన్నారన్నమాట. రాష్ట్రంలో 2001 నుండి 2011 మధ్య కాలంలో పురుషుల అక్షరాస్యత 70.32 నుండి 75.56 శాతానికి పెరిగింది. స్త్రీల అక్షరాస్యత 50.43 నుండి 59.74 శాతం పెరిగినప్పటికి ఇంకా 40.26 శాతం స్త్రీలు నిరక్షరాస్యులుగానే ఉన్నారు.
పాఠశాలల్లో బాలికల నమోదు శాతం సాపేక్షికంగా అంటే బాలురతో పోల్చినప్పుడు తక్కువగా ఉండటమే కాకుండా మధ్యలో చదువు ఆపేసే బాలికలు 1 నుండి 10 తరగతి మధ్య 2000-01లో 71.5 శాతం ఉంది. దీని వలన స్త్రీలు విద్యకు దూరం కావటమే కాకుండా విద్యలో జెండర్‌ వివక్ష కొనసాగటం జరుగుతున్నది. అక్షరాస్యత అనేది మహిళలందరికీ అందుబాటులో లేదు. చాలామంది మహిళలకు బాల్య వివాహాలు చేయడం, ఆర్థికంగా వెనుకబడి ఉండటం వలన వారు విద్యకు దూరం అవుతున్నారు.
స్త్రీలలో అక్షరాస్యతను పెంచడం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ అనుకున్న పూర్తి లక్ష్యాన్ని సాధించలేకపోతున్నది. దానిక్కారణం స్త్రీలపై జరిగే అత్యాచారాల వలన స్త్రీలు చదువుకోవడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రోజురోజుకు స్త్రీలకు రక్షణ లేకుండా పోతున్నది. అనంతపురం జిల్లా, ఉరవకొండలో 9, 10 తరగతులకు చెందిన చిన్నారులపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపుల కారణంగా వారు పాఠశాలకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు పిల్లలను వ్యవసాయ పనులకు పంపటం, ఈ ప్రాంతంలో పాఠశాల సంఖ్య తక్కువగా ఉండటం, సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత ఇవన్నీ కలిసి స్త్రీ పూర్ణ అక్షరాస్యత సాధించడం సాధ్యంకాదు. స్త్రీ విద్యవల్ల మానవాభివృద్ధి దిశగా సమాజాలు పయనించటం సులభమవుతుందని, అధిక జనాభా సమస్యను పరిష్కరించటంలో, శిశు మరణాల రేటును తగ్గించటంలో పౌష్టికాహార స్థాయిని పెంచటంలో, కుటుంబ సంపాదన సామర్థ్యాన్ని పెంచటంలో ఆరోగ్యాన్ని, ఆయుఃప్రమాణాన్ని పెంచటంలో స్త్రీ విద్య ప్రముఖపాత్ర వహిస్తుందని వివిధ అధ్యయనాలు వెల్లడి చేశాయి.
ప్రతి వంట కత్తె ఒక రాజకీయ వేత్త కావాలి అన్నారు లెనిన్‌. అలాగే సంస్థల్లోను, నిర్ణయాత్మక ఫోరంలలోను, సర్వీసులు, ఉద్యోగాలలోను, స్థానిక సంస్థల్లో ఎన్నికయిన సభ్యులుగా మహిళలు ప్రమాణం స్వీకరించిన అధికారానికి మాత్రం దూరంగానే ఉంటున్నారు. వారి తరపున పురుషులే అధికారం చెలాయిస్తున్నారు. దానిక్కారణం వారిలో చాలామంది నిరక్షరాస్యులు కావడమే.
స్త్రీలు చిన్నతనం నుంచే ఆర్థికావసరాల కోసం మొదట తండ్రి, తర్వాత భర్త, తర్వాత కుమారుడు లేదా ఇతర బంధువుల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఇంకా మన సమాజంలో కొనసాగుతోంది. ఏ మతం లేదా వర్గానికి చెందిన వారైనా మహిళలకు ఆర్థిక హక్కులు చాల తక్కువగానే ఉన్నాయి. ఆర్థిక సర్వే (2010-11) ప్రకారం 2008 నాటికి దేశంలోని సంఘటిత రంగంలో 2.75 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వారిలో మహిళల  సంఖ్య 55 లక్షలే అంటే ఈ రంగంలో ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య 20 శాతం మాత్రమే. ప్రభుత్వరంగంలోని మొత్తం 1.76 కోట్ల శ్రామిక శక్తిలో మహిళా ఉద్యోగుల సంఖ్య 30 లక్షలు. ప్రయివేటు రంగంలో 2.47 కోట్ల ఉద్యోగినులు ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో వారి సంఖ్య 25 శాతం కేవలం 17.2 శాతంతో ప్రేవేటు రంగమే కొంత మెరుగైనప్పటికీ ప్రభుత్వరంగ ఉద్యోగులకన్నా ప్రైవేటు రంగ ఉద్యోగులు తక్కువ జీతభత్యాలకు ఎక్కువ పనిచేయాల్సి వస్తోంది. స్త్రీ పురుషుల వేదన వ్యత్యాసాలు గణనీయంగా పెరిగాయి, స్త్రీలు వేతనం గురించి బేర మాడుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. కోట్ల రూపాయల అవినీతి సొమ్ము దేశ రాజకీయాల్ని ఏలుతుంటే, కనీస తాగునీటి సౌకర్యాలు, ఆసుపత్రి సౌకర్యాలు లేక పిల్లలు, స్త్రీలు అర్థాంతరంగా బతుకు చాలిస్తున్నారు.
ప్రతి కార్యాలయం, సంస్థలతోపాటు వ్యవసాయం పరిశ్రమలు, సేవారంగాల్లోనూ మహిళలు సగభాగం ఉంటేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. మహిళల సంఖ్య తమతో సమానంగా ఉన్నప్పుడు పురుష ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వారిపై అఘాయిత్యాలకు పాల్పడేందుకు వెనకాడతారు. ఈ స్థాయిలో సామాజిక పరివర్తన రావడం అనేది అవసరంగా భావించాలి.
మనదేశంలో పురుషాధిక్య సమాజాన్ని, అన్ని రంగాలలోను కనపడుతున్న లింగ వివక్షను రూపు మాపడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కృషి చెయ్యాలి. మహిళ సంరక్షణ, శిశురక్షణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న సూచనల్ని వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు తప్పని సరిగా పాటించేట్లుగా ప్రభుత్వం ఉదాసీనత విడనాడి అధికారులపై చర్యలు తీసుకోవాలి. వీటి కోసం కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ చేయూతనివ్వాలి. ఒక హింసాత్మక సంఘటన జరిగేదాకా ఆగకుండా వేధింపులు తొలిదశలోనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అలాగే అమ్మాయిల ఫిర్యాదులకు తక్షణమే స్పందించి, ఆకతాయిల ఆటలు కట్టించడానికి నిఘా వేసే రక్షణ వ్యవస్థను నియమించాలి. స్త్రీల ఆరోగ్యం, విద్యలో పెట్టుబడి అధికం చేయడం, న్యాయ హక్కులతో సహా అన్ని హక్కుల గురించి స్త్రీలను చైతన్య పరచాలి. విద్యార్థులకి నైతిక విలువలను, ఔదార్యాన్ని పెంపొందించే విద్యా సంస్కారాలను విద్యాలయాల్లో బోధించాలి. భారత రాజ్యాంగం సర్వహక్కుల్ని పురుషులతో సమానంగా ఇచ్చినప్పటికి వాటిని ఆచరించటంలోను, విజయాలను సాధించటంలోను, మహిళలకు భరోసా ఇవ్వటంలోను ప్రభుత్వం నిజాయితీని కనబరచాలి. బ్రూణ హత్యలు నిరక్షరాస్యత, పేదరికం, నిరుద్యోగత నివారించబడాలి. మహిళలంతా అక్షరాస్యులు కావాలి. ఉద్యోగాలలో వారికి మరిన్ని అవకాశాలు కల్పించబడాలి. ప్రేమను ద్వేషాన్ని పెంచి పోషిస్తున్న సినిమాలు, సీరియళ్ళను అంతర్జాలంలో అశ్లీల చిత్రాలను, సాహిత్యాలను నిరోధించాలి. గ్రామాల్లో విద్యకు దూరమై, బాల్య వివాహాల బందీలై, నగరాల్లో ర్యాగింగులకు, అత్యాచారాలకు గురవుతూ అటు భౌతిక దాడులతో మానసిక వ్యాధులతో కృంగి పోతున్న వారిని ఆదరించి, ఆధారాన్ని కల్పించాలి. బాల్య వివాహాలను మూఢ నమ్మకాలను నిర్మూలించాలి.
భారతదేశ ప్రభుత్వం మహిళల, శిశురక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలన్నింటిని దేశమంతా పూర్తిస్థాయిలో అమలయ్యేట్లుగా ప్రచారాన్ని చేపట్టి చట్టాల సక్రమ అమలుకు జండర్‌ స్పృహతో వ్యవహరించాలి. సమాజంలో మన దృక్పథాలు మారాలి. ఆడపిల్ల అంటే ‘ఆడ’ పిల్లగా కాక మన పిల్లగా భావించి, స్త్రీ పురుష నిష్పత్తి సమాన స్థాయిని చేరుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమస్యలను అధిగమించి విజయాన్ని సాధిద్దాం, లింగ వివక్షలేని సమాజాన్ని నిర్మించాలని ఆశిద్దాం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.