”చీరనెరజాణ”

– పోడూరి కృష్ణకుమారి

కళ్యాణమండపం గేటు దగ్గర నిలబడి పూలతో ఏర్పాటైన ఆర్చి, దానిమీద అందంగా తీర్చిన వధూవరుల పేర్లు చూస్తూ ఓ నిమిషం అలాగే నిలబడింది లత. కళాత్మకంగా తీర్చిదిద్దబడి, ఆహూతులతో కళకళలాడి పోతున్న ఆ హాలు అందాలు, సందడి చూసేందుకు రెండు కళ్ళు చాలవనిపించింది. తెలుగువారింటి పెళ్ళికళంటే సమస్త లలితకళల సమాహారమే అనుకుంటూ లోపలికడుగుపెట్టింది తెలిసిన మొహాలు వెతుక్కుంటూ.

లత ఆడబడుచు సుమతి ఎదురొచ్చి ”ఇంతాలస్యంగానా రావడం దగ్గిరే ఇల్లు పెట్టుకునీ?” అంటూ స్వాగతించి, లత కట్టిన చీరవంక అదోలాగా చూసి మూతివిరిచి, ”పద, అలా కూచో మనవాళ్ళంతా అక్కడు న్నారు.” అని నడుం తిప్పుకుంటూ వెళ్ళి పోయింది. వెళ్ళేముందు మళ్ళీ ఓసారి లత చీరవైపు కోరగా చూసింది. చూపుల్తోనే ‘పాయింటు’ నొక్కివక్కాణించడంలో ఆవిడకి చాలా నైపుణ్యం ఉంది. లతకి మనసు చివుక్కుమన్నా, ఎప్పుడూ ఉండే భాగోతానికి చివుక్కులూ గతుక్కులూ వేస్ట్‌’. అని సర్ది చెప్పుకుంది. సుమతి కోరచూపుకి అర్థం లతకి బాగానే తెలుసు. లత ఇవాళ కట్టిన బెనారసు చీర ఏడాది క్రితం సుమతి మరిది కొడుకు పెళ్ళికి కట్టింది. ఇవాళ సుమతి బావగారమ్మాయి పెళ్ళి. ఆ పెళ్ళికి కట్టిన చీరే మళ్ళీ ఈ పెళ్ళికీ కట్టిందని సుమతి అలక. ‘ఇది మరీ అన్యాయం..’ లత మనసు ఆక్రోశించింది. సందర్భానికి తగ్గట్టుగా దుస్తులు వేసుకోవడం లతకీ తెలుసు. ‘వేలకి వేలు పోసి కొనుక్కున్న చీరలు ఓ సారి కట్టాక మళ్ళీ కట్టాలంటే, మొదటిసారి కట్టినప్పుడు చూసిన వాళ్ళెవరూ రాని మరో పెళ్ళో పార్టీయో రావాలని తపస్సు చేస్తూ కూచోవాలి కాబోలు! పోన్లే. నాకొకటే పట్టు చీరుందనీ లోకం కూడై కూసుకుంటే కూసుకోనీ నేను మాత్రం నాకేది ఎప్పుడు కట్టుకోవాలనిపిస్తేనే అదే కట్టుకుంటా’. నిర్లక్ష్యంగా మనసులోనే నవ్వుకుంది. ఓ చోట గుంపుగా కూచున్న ఆడవాళ్ళని చూసి, ”హల్లో వాణీ, వీణా, రాధా, సుజాతా” అని పలకరిస్తూ వాళ్ళదగ్గరకెళ్ళి కూచుంది. ”హాయ్‌” ”హల్లో” ”లతని చూసి చాలా రోజులైంది” అబ్బో! ఆవిడగారో నల్లపూస!” లాంటి పలకరింపులు ఒక అలలా వచ్చి లతని ముంచెత్తి మళ్ళీ సద్దుమణిగాయి. సుమతి చూపుల్తోనే గుచ్చిన ముళ్ళని మనసులోంచి దులిపేసుకుని చుట్టూ వాళ్ళ కబుర్లకి చెవులప్పగించింది.

”వాణీ! ఈ చీరెక్కడ కొన్నావే? ఆ బోర్డరు, పల్లూ లేటెస్ట్‌ కాంబినేషన్‌. నేను బోంబే నించి తెచ్చుకున్నా. మన ఊళ్ళో కూడా దొరుకుతున్నాయా? వీణ ప్రశ్న. ”అసలు నాకు ఆకాశరంగు పట్టుచీర కనిపిస్తే చాలు వదల్ను. పైగా దీనికి పింక్‌ బోర్డరు! ఇంకసలు ముందూవెనకా ఆలోచించలా. చెన్నైలో కొన్నా.” వాణి వివరించింది. ”అసలు రాధ కట్టిన చీరలాంటి చీరలిప్పుడు దొరకడం లేదు. నేనెన్ని షాపులు తిరిగానో!” ”ఇది షాపులో కొన్నది కాదే బాబూ! మా తమ్ముడి పెళ్ళప్పుడు నేనూ అమ్మా కలిసి కంచి వెళ్ళి డిజైను చెప్పి ఆర్డరిచ్చి నేయించాం.” గర్వంగా రాధ సమాధానం. ”అవునవును గుర్తొచ్చింది. అప్పుడు వదినతో సహా మీ అక్కచెల్లెళ్ళందరూ ఈ చీరలు కట్టారు. మెరిసిపోయారనుకో!” రాధని మరింత ఉబ్బించింది. ”కంచి దాకా వెళ్లక్కర్లేదు. మేం రెగ్యులర్‌గా కొనే షాపాయన మనం డిజైను చెప్తే ఆయనే వెళ్ళి మనం చెప్పినచోట నేయించుకొస్తాడు. నేనూ మా క్లబ్‌ మెంబర్స్‌ కొంతమందిమి కలిసి చిలకపచ్చ చీరకి పాలపిట్టరంగు బోర్డర్స్‌తో చీరలు నేయించాం. బోర్డర్‌ మీద జరీ గళ్ళు, చీర ప్లెయిన్‌. మేం ఇచ్చిన డిజైను మాషాపాయనకి ఎంత నచ్చిందంటే అదే డిజైను వేరేవేరే కలర్‌ కాంబినేషన్స్‌తో ఇంకా చాలా నేయించాడు. హాట్‌ కేక్స్‌ లా అమ్ముడయిపోతాయంటూ. అసలివాళ ఆ చీరే కట్టుకొద్దామని ప్లాను. మా టైలరు బ్లౌజు రెడీ చెయ్యలేదు.” సుజాత తనకొచ్చిన చీర కష్టం చెప్పి నిట్టూర్చింది. ఇలా ఈ చీరల కష్టసుఖాలగాధావాహిని అనంతంగా సాగిపోతూనే ఉంది. లతకి తల వాచిపోయింది. తనకి నచ్చిందేదో కొనేసు కుంటుంది లత. నచ్చిన దాన్ని తనివితీరేదాకా కట్టేసుకుంటుంది. ఎదుటి వాళ్ళేం కట్టుకున్నారో గమనించడం, చీరని బట్టి బంధుత్వం, మర్యాద ఇవ్వడం అన్నవి లత నిఘంటువులో లేవసలు. ఇలాంటప్పుడు అందరం తీరిగ్గా కూచుంటాం కదా ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు అనుకుంది. చర్చలు చీరల అంచులు దాటట్లేదు. ”హల్లో రంజన్‌! నీకు మళ్ళీ ఇక్కడికే ట్రాన్స్‌ఫర యిందట కదా? జాయినయి పోయావా?” మరో గ్రూపులో కజిన్‌ ని పలకరిస్తూ అటెళ్ళింది లత. ”వీడినీ మధ్య ఆఫీసువాళ్ళు యూరోపు టూరు పంపించారు తెలుసా?” నర్సింహం బాబాయి అడిగాడు. ”నాకు తెలీదు…” లత ఇంకేదో అనే లోపల, ”ఆ షర్టు చూస్తేనే తెలిసిపోతోంది. ఆ స్టైలు మనదేశంలో ఎక్కడా దొరకదు. ఏ దేశంలో కొన్నావురా?” మరో కజిన్‌ మహేష్‌ అడిగాడు. దాంతో విదేశాల్లో బట్టలు, వాటి నాణ్యత, ఇండియన్స్‌కి తగ్గ సైజులెలా సెలెక్ట్‌ చేసుకోవాలో మొదలైన ముఖ్య విషయాలమీద చర్చ ఊపందుకుంది.

‘వార్నీ! వీళ్ళూ బ్రూటసులే!” ఒళ్ళు మండిపోయింది లతకి. వెళ్ళి సన్నాయి మేళం వాళ్ళ పక్కన కూలబడింది. ”మరుగేలరా ఓ రాఘవా వాయించండీ” సన్నాయి సవరించుకుంటున్న కళాకారుడ్ని అడిగింది. ఆయన సద్దుక్కూచుని రాగం అందుకున్నాడు. ”బాబూ, భజంత్రీలూ! కాసేపాపండి” బ్రహ్మగారు విన్నపంలాంటి ఆజ్ఞ జారీ చేసారు. రాగం మూగబోయింది. ‘హుఁ ఇక్కడా చుక్కెదురే!’. నిరాశగా నిట్టూర్చింది లత.

పెళ్ళి ముహూర్తం కాగానే ఇట్నించి క్యూలో వేదికనెక్కి, వధూవరుల నెత్తిన నాలుగక్షింతలేసి, తెచ్చిన కవరు వధువు చేతిలోపెట్టి, గ్రీటింగ్సు చెప్పి, అట్నించి అదే క్యూలో వేదిక దిగి, ఆ నాలుగు మెతుకులూ నోట్లో వేసుకుని ఇంటికొచ్చిపడింది లత.

లత తల్లి శాంతమ్మతో కాసేపు గడపడానికి అత్తమ్మ పార్వతి, వదినమ్మ సీత, పిన్నమ్మ లక్ష్మి వచ్చి ఉన్నారు. బట్టలు మార్చుకుని అందరికీ వేడిగా కాఫీలు పట్టుకెళ్ళి వాళ్ళ మధ్య కూచుంది. ”గుర్తుందిటే అక్కాయ్‌ ఈ చీర? నీ పెద్దమనవడి బారసాలనాడు నాకు పెట్టావీ చీర. కట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో!” అంటోంది పిన్ని. ”గుర్తు లేకేం నువ్వాచీర కట్టుకుని, బారసాల తతంగం అయిపోయాక చంటి పిల్లాణ్ణి ఒళ్ళోకి తీసుకోంగానే వాడుకాస్తా చీర తడిపేసాడు.” అందరూ ఆనాటి సంఘటన గుర్తొచ్చి నవ్వుకున్నారు. ”ఇదుగో నేను కట్టుకున్న చీర గుర్తుందా పార్వతీ? నీ ఆఖరు కూతురి పెళ్ళికి నువ్వు నాకు పెట్టిన చీర. తనకి కొన్న పెళ్ళి చీరలకంటే ఈ చీరే బాగుంది ఇదిచ్చెయ్యమని పెళ్ళికూతురు ఎంత అల్లరిచేసిందో! మర్చిపోగలమా? ఒట్టి చిలిపి పిల్ల!” అందరూ మరోసారి మురిపెంగా నవ్వుకున్నారు. ”ఇదిగో ఇది మా లత మొదటి జీతంతో కొని పట్టుకొచ్చింది నాకు. ఆడపిల్ల సొమ్ము మేం ముట్టుకోకూడదే అంటే ఒకటే బలవంతం పెట్టింది. ఇదిగో ఇలా అప్పుడప్పుడు తీసి కడుతుంటా.” కూతురివైపు గర్వంగా చూస్తూ చెప్పింది శాంతమ్మ. ”ఏం అన్నయ్య తెస్తే కట్టుకోవేంటీ? చిలిపి పోట్లాటకి దిగింది లత. మురిపెంగా లత నెత్తినో మొట్టికాయేసింది పిన్నమ్మ. ”నీకు గుర్తుందిటే పార్వతీ, మన చిన్నతనాల్లో ఔరంగాబాదు చీరలనీ నాన్నగారు తెచ్చేవారు….”. పెద్దవాళ్ళంతా వాళ్ళ చిన్నతనాలనాటి చీరల కబుర్లలో పడ్డారు.

ఆ మాటలు వింటుంటే లతకు హాయిగా, తీయగా ఉంది.

ఇందాక పెళ్ళిలో వాళ్ళకి – చీరంటే ఓ స్టేటస్‌ సింబల్‌. గొప్ప చూపించుకోడానికీ ఓ మాధ్యమం. ఇక్కడ వీళ్ళకీ చీరంటే – దాని వెలతో సంబంధంలేని విలువ! చీర చీరకో తీపి జ్ఞాపకం! ఒకే చీర – ఒక్కొక్కరిలో ఒక్కొక్క అనుభూతి

ఒకే చీర – కొందరిలో అహంకారపు కారం రగిలిస్తుంది

కొందరిలో ఆత్మీయతల తీయందనం పులకిస్తుంది.

ఈ చీర ఎంతటి నెరజాణ!!

(నేనీ కథ రాస్తుంటే లో చేనేత కార్మికుల గురించి ప్రోగ్రామ్‌ వస్తోంది. (21 ఫిబ్రవరి, రాత్రి 10.30) ఒకరికి తన భేషజం ప్రదర్శించుకునేందుకు పనికొచ్చే చీర, మరొకరికి ఇష్టంగా తీపి గురుతులు దాచుకోడానికి ఉపయోగపడే చీర – ఈ చీరలు నేసే నేతగాళ్ళ కన్నీటి గాధలు కళ్లముందు చూపిస్తున్నారు. ఇన్నేసి వేలు, వందలు పోస్తే గాని మన చేతికి రాని చీరలు నేసే చేనేతకార్మికుల చేతులకి అందుతున్నదెంత? రైతులతో పాటు చేనేత కార్మికులుకూడా ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులెందుకున్నాయి?)

Share
This entry was posted in గల్పికలు. Bookmark the permalink.

One Response to ”చీరనెరజాణ”

  1. viswam says:

    గ్ ల్పికబాగునంది.కస్తాలకదలిలొ నెత కార్మికులు ఒక పక్క అత్మహత్యలు మరొపక్క దలరిలు అంతె షొపుల ఔనర్స లక్షధికార్లు అవుతున్నరు.సమస్యకు పరిష్కరమ ఎక్క్ దదొరుకుతుంది,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో