తారాబాయి చాల్‌ – గది నంబర్‌ 135

– సుధా ఆరోరా

అనువాదం: ఆర్‌.శాంతా సుందరి (హిందీ మూలం)

ఆమెకు పిల్లలు లేరు. ముప్ఫై ఎనిమిదేళ్ల ఆమె భర్త చనిపోయి ఇవాల్టికి పధ్నాలుగో రోజు.

స్నానంచేసి, నీళ్లతో నానిన పెట్టికోట్‌ని పిండుకుని దాంతోనే తన ఒళ్లు తుడుచుకుంటూ ఉండగా, హఠాత్తుగా ఆమె కళ్లు అద్దంలోకి చూశాయి. అద్దం మీది దుమ్ముని ఆమె తడివేళ్లతో తుడిచేసింది.

ఆమె ఉలిక్కి పడింది. వారాలూ, నెలలూ, ఏళ్లూ గడిచిపోయాయి. ఆమె అద్దంలో మొహం చూసుకుని!

పోయినసారి తను అద్దంలో చూసుకున్నదెప్పుడో? బహుశా పెళ్లికి ముందెప్పుడో, ఐదో క్లాసులో ఉండగా, స్కూలుకెళ్లేముందు రిబ్బను కట్టుకునేది. ఇవాళ తనని తాను మొదటిసారి అద్దంలో చూసుకుంటున్న అనుభూతి కలిగిందామెకి. మునుపు అద్దంలో చూసుకుని జడ అల్లుకునేటప్పుడు, తను కళ్లని మట్టుకే చూసుకునేది, చెవులకి దుద్దులు పెట్టుకునేటప్పుడు చెవులకేసి మాత్రమే చూసేది, ఆ విడివిడి ముక్కలనన్నిటినీ ఒకటిగా చేర్చి, ఈ రోజే తన మొహాన్ని మొత్తంగా మొదటిసారి చూసుకుంది.

అద్దం మురికిపట్టి ఉంది, చాలా చిన్న అద్దం. ఆమె తన కాలి మునివేళ్ల మీద నిలబడింది. చాలా నెమ్మదిగా, తడిసిన తన ఒంటిమీదనించి, బట్టలు విప్పింది. మెడకింది భాగాన్ని ఆమె ఎన్నడూ అద్దంలో చూసుకోలేదు. కన్నార్పకుండా అలా చూస్తూనే ఉండిపోయింది. హఠాత్తుగా కాళ్లకిందున్న నేల ఇసకగా మారిపోయినట్టనిపించింది. కాళ్లు ఇసకలోకి కూరుకుపోయి, భూమిలోకి కూరుకుపోతున్న భావన! ఆమె కళ్లు మూసుకుని, రెండు చేతులతోనూ కణతల్ని రుద్దుకుంది. అయినా ఇసకలోకి కూరుకుపోవటం ఆగలేదు. ఇసక ఆమె పెదవులకి అంటి పంటికింద గరగరమంటోంది. ఆమె గుండె ఛాతీని చీల్చుకుని వచ్చేస్తుందా అన్నంత తీవ్రంగా కొట్టుకోసాగింది. రెండు చేతులూ ఎడమవైపు స్తనం కింద ఆన్చి, గుండె కొట్టుకోవటం విన్నది. ఆ తరవాత నెమ్మదినెమ్మదిగా పైకివచ్చి, మళ్లీ నేలమీద కాళ్లూనింది. ఆమె చేతులు స్తనం కిందినించి స్తనం పైకి వచ్చాయి. దానిమీదున్న పాత గాయాలనీ, కొత్త గాయాలనీ తడమసాగాయి. స్తనాల మీద అక్కడక్కడా ఎర్రగా, నల్లగా, మచ్చలు. చెక్కు ఎండి ఊడిపోయిన చోట చిన్నచిన్న గుంటలు. చివరి మచ్చ పదిహేను రోజుల కిందటిది. అలవాటు ప్రకారం భార్యతో సంభోగించాక, అతను బీడీ ముట్టించి, ఆఖరి దమ్ము పీల్చాక, ఆమె ఎడమ స్తనం మీద దానితో కాల్చాడు. ఆమె బాధతో కేకలు పెట్టింది, అది చూసి అతను గారపళ్లు బైటపెట్టి ఇకిలించాడు. ఆమె విదిల్చి కొట్టేలోపల బీడీకి ఉన్న నిప్పు ఆమెని లోతుగా గాయపరిచింది. ఆమె వెక్కుతూ, అతని కుడిచేతిని మెలిపెట్టింది, దానికతను ఇంకా గట్టిగా నవ్వాడు. బీడీ, సిగరెట్టు, ఏదో ఒకటి వెలిగించి ఆమె ఒంటిమీద దానితో కాల్చటం అతనికి చాలా సరదా.

”నీకు కుష్ఠురోగం తగులుకోనూ! చచ్చేటప్పుడు నీ నోట్లో గుక్కెడు నీళ్లు పోసే దిక్కు కూడా ఉండకుండా పోతుంది, చూసుకో!” అంటూ ఆమె తిట్లు లంకించు కునేది. కానీ ఆ సరికి అతను అటుకేసి తిరిగి గురకపెడుతూ నిద్రపోయే వాడు. గదంతా అతని గురకకీ తేడా తెలిసేది కాదు.

జ జ జ

ఆ రోజు బైఖలా దగ్గర లోకల్‌ ట్రైన్‌ ప్రమాదం జరిగి, అతనికి బదులు, అతని శవం ఇంటికి రావటం చూసి, ఆమె తన కళ్లని తానే నమ్మలేకపోయింది. గదిలో ప్రాణం లేని భర్త శరీరం నేలమీద ఉంది. పై కప్పులోంచి నీళ్లు బొట్లుబొట్లుగా కారి అతని శవం మీద పడుతున్నాయి. గదిలో చిలక్కాయ్యకి అతని వెలిసిపోయిన చొక్కా ఇంకా వేలాడుతూనే ఉంది. గది గోడలకి అతని గురక కూడా ఇంకా అతుక్కునే ఉన్నట్టనిపించింది. ఆమె ఒంటికి క్రితం రాత్రి కాల్చిన తాజా గాయం, ఇంకా ఎక్కువగా బాధపెట్టసాగింది. ఆమె ఒంటినున్న గాయాలన్నీ ఒక్కసారిగా ప్రాణాలతో లేచొచ్చినట్టనిపించింది. ఆమె గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది, తన గాయాల పోటుతోనా, భర్త పోయినందుకా అనేది స్పష్టంగా తెలీలేదు.

చూరునించి నీళ్లు కారుతూనే ఉన్నాయి, ఆమెకంటినించి కన్నీటిధార కూడా కారుతూనే ఉంది, భర్త శవాన్ని దహనానికి ఎప్పుడు తీసుకెళ్లారో కూడా ఆమె గమనించలేదు. నల్లపూసలకున్న మంగళ సూత్రాన్ని తీసేసి గూట్లో పెట్టింది. నాలుగు రోజుల తరవాత మామూలుగా పనిలో కెళ్లసాగింది.

ఇంటికి తిరిగొచ్చాక ఆమెకి గది చాలా పెద్దదిగా ఉన్నట్టు అనిపించింది. గరుగ్గా ఉన్న నేలమీద మోకాళ్లమీద పాకే పసిపిల్లాడికోసం తహతహా, గదినిండా చిందరవందరగా వస్తువుల్ని పారేసి వాడు అల్లరిచేస్తే బావుణ్ణనే కోరికా, గది మూలల్లో ఎక్కడో దాక్కుని, గదిని మరీ ఖాళీగా దెయ్యాల కొంపలా చేశాయి. ఇదే గదిలో మునుపు వాళ్లిద్దరూ ఒకరికొకరు అడ్డం వస్తూ, తప్పించుకుంటూ తిరిగేవారు, ఏదో, గదినిండా జనం ఉన్నట్టనిపించేది! ఇప్పుడు ఆమెకి రోజులు గడవటం కష్టమైపోయింది. పనినించి ఇంటికి తిరిగొచ్చాక, ఆమె గదిలో నేలని బాగా రుద్దిరుద్ది కడిగేది, అయినా ఆ గదిలో, ఆగిపోయిన కాలంలా తిష్ఠవేసుక్కూర్చున్న, ఏదో ఒక వాసన వదిలేది కాదు. రాత్రి అలసిసొలసి పక్కమీదికి చేరగానే ఇంట ికప్పుకీ, గోడలకీ వేలాడే గురక కిందికి దిగి, ఆమె చుట్టూ పరుచుకునేది. మగతనిద్ర పట్టే సమయానికి ఏ తలుపు సందులోంచో భర్త నవ్వు వినిపించినట్టయేది, ఛాతీమీద ఉడుకుడుకు నీళ్లధార పడ్డట్టు బాధతో ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చునేది.

ఆమె తన భర్త తాలూకు వస్తువు లన్నిటినీ కళ్లకు కనబడకుండా దాచేసింది. సారాబుడ్డీని గుమ్మం బైటపెట్టేసి, గోడకి వేలాడుతున్న అతని చొక్కాని మంచంకింద ఉన్న బట్టల కుప్పలోకి తోసేసింది. చొక్కా తీసేసిన మేకుకి అద్దాన్ని తగిలించింది. మునుపు గూట్లో ఉన్న ఆ అద్దంలో తన తలమీది జుట్టు మాత్రమే కనిపించేది. మునివేళ్లమీద నిలబడితే, ముక్కువరకూ మొహం కనిపించేది. ఇప్పుడు గదిలో అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు, వద్దనుకున్నా తన రూపం కనిపిస్తూనే ఉంటుంది.

అద్దంలో చూసుకుంటూ, ఛాతీమీదున్న గాయాన్ని తడిమింది. అది ఆరిపోయి చెక్కుకడుతోంది. ఆ చెక్కుని వేళ్లతో కొద్దిగా పీకేసరికి, అందులోంచి రక్తంబొట్లు కార సాగాయి. గాయాలు మానుతున్నాయని ఆమె భ్రమపడింది. అవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి. తడి పెట్టికోట్‌తో రక్తం బొట్లని తుడుచుకుంది. ఆ పెట్టికోట్‌తోనే అద్దాన్ని కప్పేసి, అక్కణ్ణించి వెళ్లిపోయింది.

బట్టలు తొడుక్కున్నాక కిటికీ దగ్గరకెళ్లి నిలబడింది. కిటికీకున్న చెక్క చివికిపోయి పెచ్చులూడింది. ఆ సందుల్లోంచి చిన్నచిన్న పురుగులు, పధ్నాలుగురోజుల క్రితం తన భర్త కిటికీలో వదిలిన, టూత్‌బ్రష్‌ మీదికి పాకుతున్నాయి. ఆ పక్కనే ఒక మూల ఖాళీ సిగరెట్టు పెట్టె పడి ఉంది. ఆమె దాన్ని తీసి నలిపి పారేద్దామని అనుకునేంతలో, అందులో ఒక ఆఖరి సిగరెట్టు మిగిలి ఉండటం కనిపించింది.

ఆమె సిగరెట్టు వెలిగించింది. భర్తలాగ ఫోజుపెట్టి దమ్ము పీల్చింది, మళ్లీ మళ్లీ పీల్చింది. చివరికి ఆమెని ఏ వెర్రి ఆవేశం ఆవహించిందో కాని, కాలుతున్న సిగరెట్టు కొసని తన పొట్టమీద పెట్టి నొక్కింది. మృదువైన ఆ చర్మం మీద మండేనిప్పు తగలగానే ఆమె నోటివెంట ఒక ఆర్తనాదం లేచి పైకప్పుని తాకింది. ఆమె కళ్లనిండా నీళ్లు ఉబికాయి. ఉన్నట్టుంది ఆమె గొంతు దాకా దుఃఖం పొంగుకొచ్చింది. ఆమె భోరుమని ఏడవసాగింది.

ఏడ్చిఏడ్చి కొంతసేపటికి అలిస ిపోయింది. నీళ్లు నిండిన కళ్లతో మంచంకేసి చూసింది. అక్కడ తన భర్త కాళ్లాడిస్తూ కూర్చుని ఉండటం మసగ్గా కనిపించింది. అతని మొహం మీద కాఠిన్యంతో కూడుకున్న నవ్వు అద్దంలా స్పష్టంగా కనిపించింది!

Share
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

One Response to తారాబాయి చాల్‌ – గది నంబర్‌ 135

  1. Anonymous says:

    అసలు బగలె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.