చంద్రశ్రీకి ‘మట్టిపూల’ నివాళి

జూపాక సుభద్ర
చంద్రశ్రీ ఒక అందమైన పాట, ఆకుపచ్చని పాట, నల్లనల్లని పాట, పరిగెత్తిన పాట. ఎన్నో విప్లవ, దళిత వేదికలు చంద్రశ్రీ చిందేసిన పాటల్తో ఉర్రూత లూగినయి. చంద్రశ్రీ విప్లవ, దళిత ఉద్యమాల్లో అరుదైన అత్యద్భుత ప్రతిభవున్న కళాకారిణి. పాడేది ఆడేది రాగాలు కట్టేది. దళిత చైతన్యాల్ని పదాల్లోకి పాటల్లోకి ఎత్తేది. ఒంగోలు జిల్లా యాసలో మాట్లాడే చంద్రశ్రీ నూయి ముంతలు తెలంగాణలో వున్నయి. తాతల నాడు మిలటరీ వరంగల్‌ జిల్లా జనగామ నుండి మిలటరీ ఉద్యోగ బతుకుదెరువుకు ఒంగోలు జిల్లా చీరాలకు వలస పోయిన దళిత కుటుంబం. చదువుకొని ఉద్యోగాల్లో వున్న దళిత కుటుంబం చంద్రశ్రీది.
 కాని చంద్రశ్రీ మధ్యతరగతి కుటుంబ విలువల్ని, కులవివక్షల్ని వ్యతిరేకించి ఇంటర్‌ చదివేటప్పుడే విప్లవ పార్టీలో చేరిపోయింది. ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం, పాటలు పాడుడు తల్లిదండ్రులకు నచ్చక అడ్డుబడితే తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని వదిలేసి పూర్తిస్థాయి కార్యకర్తగా విప్లవ పార్టీలో చేరింది. చిన్నమ్మా యిగా వున్నప్పుడే తను వేసిన చిందులు పాటలు వాడల్లో, వూర్లల్లో మారుమోగేనని’ చంద్ర చివరి చూపుకోసం వచ్చిన వాల్లు యాది చేసుకొని ఏడ్చిండ్రు.
 చంద్రశ్రీ వాల్లు మూడు నాలుగు తరాల్నించి క్రిస్టియన్‌ అయినా వాల్లంతా అంబేద్కర్‌ అభిమానులు. ఆ అభిమానంతోనే కాబోలు చంద్రశ్రీ జననాట్యమండలిలో పూర్తిస్థాయిగా పనిచేస్తున్నా (1985) అంబేద్కర్‌ జయంతినాడే పార్టీ అతన్ని కులాంతర పెళ్లి చేస్కుంది. ఉద్యమాల్లో పనిచేసే క్రమంలో కొండపల్లి అనసూయమ్మతో పాటు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో వుంది. జైల్లో వున్నా ఖైదీలందరికి విప్లవ గీతాలు నేర్పిందట. రాజకీయ తరగతులు నడిపిందట.
 ఆ తర్వాత కారంచేడు ఉద్యమానికి సంఘీభావంగా జననాట్యమండలి ప్రకాశం జిల్లా కార్యకర్తగా దళిత బిడ్డగా తనపాటతో ఉత్తేజితం చేసింది. తర్వాత అండర్‌ గ్రౌండ్‌ లోకి వెళ్లి పోయినంక విప్లవ పార్టీల్లోని కులం, కుటుంబాల విలువల్లో యిమడలేక బైటకొచ్చింది. చేసుకున్న కులాంతర వివాహంలో నిత్యం కుల వేధింపులు అవమానాలు, అనుమానాలు భరించలేక బైటకొచ్చింది. కుటుంబ కట్టుబాట్లు, కులాంతర పెళ్లి కుల అణచివేతలు నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసినయనేది. పాతికేండ్లకే జీవితానికి సంపద దుక్కాల్ని అనుభవించిన్నదనేది.
 పూసేవన్ని పూలనుకున్నది కాసేవన్ని కాయలనుకున్నది. కాని వాటి వెనక విషాలు, చేదులు, ముండ్లుంటాయని తెలువని దళిత మహిళ. యీ దేశంలో దళితులు శాపగ్రస్తులు. అందులో దళిత మహిళలు శాపగ్రస్తుల బానిసలు. యిక వాల్ల బతుకు యీ సమాజంలో ఎట్లా వుంటదో చంద్రశ్రీ జీవితం ఒక పాఠం.
 చంద్రశ్రీ నాకు మొదటిసారి 1998లో ‘లెల్లె పాటల’ మీటింగు (ప్రెస్‌ క్లబ్‌) లో పాటై పరిచయమైంది. ఆ మీటింగులో మర్చిపోలేని ఆ పాత మధురంగా వుండి పోయేవి చంద్రశ్రీ పాటలు. ఆ మీటింగులో ‘నల్ల నల్ల సూరీడు పాటను తన గొంతుతో సభికుల్ని ఆకాశంపై గంతులేయించిన అనుభవం, అనుభూతి ఆనాడు ఆ మీటింగు కొచ్చిన వాల్లకు యింకా యాదిల వుండే వుంటది.
 విప్లవ పార్టీ నుంచి కుల వివక్ష కుటుంబం నుంచి బైటకొచ్చిన దళిత బహుజన దృక్పథంతో పనిచేసింది వివిధ దళిత సంగాలల్ల. ఏకలవ్య కళామండపం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త సభలు, సమావేశాల్లో క్రియాశీలకంగా పనిచేసింది. చలపతి, విజయ వర్ణనల ఉరి రద్దుకు జరిగిన పోరాటంలో చంద్రది కీలక భాగస్వామ్యం. దళితుల మీద దాడులు, దళితుల భూమి సమస్య, గిరిజనుల సమస్యల మీద జరిగిన పోరాటాల్లో, అంబేద్కర్‌, జ్యోతిరావ్‌ పూలే, సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్లో చంద్రశ్రీ పాటై పోటెత్తింది.
 తర్వాత జీవనోపాధిని వెతుక్కోవడంలో కూడా తన పాటశైలినే కొనసాగించింది. ఎన్‌జివో సంస్థల్లో పనిచేస్తూ పాటలు, వ్యాసాలు, నృత్యనాటికలు, పల్లె సుద్దులు రాసింది. జానపద గేయాలు, విప్లవగీతాలు మొదలుకొని శాస్త్రీయ సంగీతం దాకా అలవోకగా పాడగలదు. బుర్రకథలు, ఒగ్గు కథలు చెప్పింది. నల్ల సూరీడు, దళిత మహిళాగానం, అంబేద్కర్‌ సుప్రభాతం ఆల్బమ్స్‌ తీసింది తన దళిత వుమెన్‌ థియేటర్‌ ద్వారా.
 కళాకారులంటే మగకళాకారుల్నే పైకెత్తిన మీడియా, గానసభలు, కళా సంస్థలే కాదు దళిత సాంస్కృతిక సంగాలు, కళామండల్లు కూడా మహిళా గాయకులను, కళాకారుల్ని అవాచ్యం గానే వుంచుతున్నయి. ఎన్నో దళిత కళా సంగాల్లో, సంస్థల్లో పనిచేసినా ఒక్క కళ్యాణ్‌రావ్‌, మాస్టార్జీ, ఇంద్రవెల్లి వ్యాస కర్త తప్ప మిగతా ఏ కళాసంగాలు ఆగిపోయిన చంద్ర పాట దరిదాపుల్లోకి వెళ్లకపోవడం బాదైంది. యీ దుస్థితికి పాటమ్మ ఎంత మౌనంగా మూగబోయిన చంద్ర చుట్టు ఏడ్చివుంటదో… ఒక కాకిపోతే వందల కాకులు చేర్తయి. కాకి పాటి మానవ సంస్కారం లేకుండా పోయింది మనకు. చంద్రశ్రీ మామూలు తోటి మనిషి సాటిమనిషే కాదు. ఆమె అద్భుత కళాకారిణి. బతికినంత కాలం పాటగా, కళగా, ఆపాటను కళల్ని సమాజసేవకు అంకితం చేసిన సామాజిక కళావేత్త ఇంటినొదిలిన సామాజిక కళాకారిణి, దళిత బిడ్డ చంద్రశ్రీ. స్వేచ్ఛ పేరు మీద అల్లిన అనేక వుచ్చుల్లో చిక్కుకొని క్యాన్సర్‌తో విధ్వంసమైతుంటే, దళిత సంస్థలు, కళా సమాజాలు, సంగాలు ఆమెను జాతి బాధ్యతగా అక్కున చేర్చుకొని కాపాడుకోవాల్సి వుండె. అకాల మరణమైన ఆమెను గౌరవంగా, బలగంగా సాగనంపాల్సి వుండె. యివేవి జరగలే. యివన్ని దళిత సంగాల సాహిత్య కళా సంస్థల వైఫల్యాలుగానే చరిత్రలో వుండిపోతయి.
 చంద్రశ్రీ పోయినంక జరిగిన మరో వక్రీకరణ, ఆమెను జననాట్యమండలి కళాకారిణిగా సత్యమూర్తి అనుయాయిగా పేర్కొనడం. నిజానికి చంద్రశ్రీ సామాజిక, సాంస్కృతిక జీవన రంగస్థలం నుంచి కనుమరుగయ్యే నిన్నటిదాకా ఆమె అంబేద్కరైటు ఐడింటిటీతో బత్కింది. యీ విషయంలో ఆమెది స్పష్టమైన దళిత దృష్టికోణం. దళిత జీవన పోరాటమే ఆమె గొంతులో గంతులేసేది. అంబేద్కర్‌ కాన్షిరామ్‌ ఆలోచనా పునాదులపై దళితుల భవిష్యత్‌ నిర్మితం కావాలని కోరుకొని అందుకోసం జీవితమంతా కృషిచేసిన చంద్రశ్రీ ఐడెంటిటీని కొన్ని పత్రికలు వక్రీకరించినయ్‌. 20 ఏండ్ల కింద చంద్రశ్రీ జననాట్యమండలి కార్యకర్త కావొచ్చు. తర్వాత కాదు. కెజి సత్యమూర్తి దళిత క్రియాశీల రాజకీయాల్లో వున్నప్పుడు చంద్రశ్రీ అతని అనుచరురాలు కావొచ్చు కాని తర్వాత కాదు. యీ నిజం చెప్పకుండా ఆమె యింకా జననాట్యమండలి అయినట్లు, ఇంకా సత్యమూర్తి అనుయాయే అన్నట్లు ఆమెపై ప్రచారం జరగడం ఆమె అంబేద్కరైట్‌ ఐడెంటిటీకి మసిపూయడంగానే భావించాలి.
 చంద్రశ్రీ కులవ్యవస్థను కుటుంబ రాజరికాన్ని ఎదిరించింది. స్త్రీ పురుష సంబంధాలను ప్రజాస్వామ్యీకరించాలని కోరుకుంది. దళిత కులాల్లోనే పైనున్న వారి ఆధిపత్యాల్ని అణచివేతల్ని నిరసిస్తూ పంపక న్యాయాలకై సాగిన దండోర ఉద్యమానికి మద్ధతుగా పాడింది రాసింది.
 కింది కులాల జెండర్‌ కళాసాహిత్యాలపై పైకులాల జెండర్‌ సాహిత్యాధిపత్యాల్ని వ్యతిరేకిస్తూ ఏర్పడిన ‘మట్టిపూలు’ ఎస్సీ ఎస్టీ బీసి మైనారిటీ రచయిత్రుల వేదిక సభ్యురాలైన మహోన్నత కళామూర్తి చంద్రశ్రీకి కన్నీటి వీడ్కోల్లు, జోహార్లు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో