ఒక వాక్యం – రెండు వివక్షలు!!

మల్లీశ్వరి
అయిదున్నర అడుగుల ఎత్తు, నల్లని బక్కపలచని శరీరం, చురుకయిన ముఖవర్ఛస్సు, ముప్ఫయ్యేళ్ళ వయస్సు ఉన్న వ్యక్తిగా అతన్ని మనం గుర్తించదలుచుకుంటే అతనిలాంటి వాళ్ళు సవాలక్ష మంది లోకంలో కన్పిస్తారు.
కానీ…
యింద్రధనుస్సులో నుంచి వొంపుకున్న రంగుల్లో కుంచెని ముంచి చేపపిల్లల్లా తుళ్ళిపడే వేళ్ళ కదలికలతో చీరలపై బాటిక్‌ పెయింటింగ్‌ చేసేవాడు, అడవికి తోలుకెళ్ళిన పశువులు దూరంగా మేస్తుంటే తక్కిన పిలకాయలందర్నీ చెట్టుకింద పోగేసి వార్తలోనో, సాక్షిలోనో, జ్యోతిలోనో వచ్చిన ప్రతి కథనీ వైన వైనాలుగా చదివి విన్పించే సాహిత్య ప్రచారకుడు, కడప జిల్లా చిట్వేల్‌ మండలం దేవమంచువల్లి గ్రామంలో రాత్రి నాటకాల్లో హావభావ రాగాలతో నిలువెల్లా పద్యమై ఆపకుండా అయిదు నిమిషాలు ఆలాపన చేసే సంగీతకారుడిగా మనం ఎవరినన్నా గుర్తించదలిస్తే అతను ఖచ్చితంగా, మాల దాసరి పుట్టా పెంచలయ్య అయి వుంటాడు.
ఈ మధ్య తిరుపతిలో జరిగిన ఒక సాహిత్యసభకి వెళ్ళినపుడు గొప్ప గొప్ప సాహిత్యకారుల మధ్య తళుక్కున మెరుస్తూ కనిపించాడు పెంచలయ్య.
అతను ఐ.టి.ఐ వరకే చదువుకుని వుండొచ్చు. కానీ సం.వె. రమేష్‌ చెప్పే భాషా సిద్ధాంతాలకి తన అనుభవాలు చేర్చి చర్చలు చేసేయగలడు. ‘మాయింటికొచ్చి నాలుగు జానపద గేయాలు పాడేసి వెళ్ళవా?’ అని నెంబర్‌వన్‌ ప్రడింగితో బ్రతిమిలాడించు కోగలడు. ‘కథలు రాసినోళ్ళకి ఫోన్లు చేస్తాను… నాకు తోచిన మంచీ చెడు చెప్పడానికి,గొప్పోడిని కాదు కదండీ’ అందరూ బాగా ఏం మాట్లాడరు. అయినా గమ్మున వుండబుద్ధి కాదు పాపం! కష్టపడి రాస్తారా కదండీ! ఏదొకటి చెప్పాలి కదా!” అంటూ ఉదార హృదయంలో రచయితల్ని క్షమించేయగలడు.
పెంచలయ్య అంటే యింతేనా?
యింత మట్టుకే అయితే ఈ కాలమెలా యితని గురించే ఎందుకు రాయాలి! కానీ పెంచలయ్య గురించి యింకొంచెం చెప్పుకోడానికి ఉంది… అతనికి కొస దొరకాలే గానీ భవిష్యత్తులోనూ అతని గురించి చెప్పుకోడానికీ చాలా వుంటుంది.
పెంచలయ్యకి జీవితం అంటే సాహిత్యమూ, చర్చలూ, నాటకాలూ, చప్పట్లూ, కుంచెలూ, రంగులతో నిండిన ఈస్థటిక్స్‌ మాత్రమే కాదు. దానికి కూడా దాటుకుని చూడగలడు కాబట్టే ‘పనయినా మానేస్తాను గానీ మరేదీ లేని చోట పని చేయను’ అంటూ పౌరుష పడతాడు.
‘మీరేసిన బొమ్మలు ఎంత బావున్నాయో! ‘భలే పాడుతున్నారే మీరూ?’
‘యించగ్గా మాట్లాడుతున్నారు కూడానూ!’ అంటూ వాస్తవాలు అతనికి చెప్పేస్తామా… కొంచెం సిగ్గూ మొహమాటాలతో యిబ్బంది పడిపోయి ఆకాశంలోకి, భూమి మీదకీ చుట్టు పక్కలకీ చూపులు తిప్పేసి ‘ఆ!.. ఏదో లెండి… యియ్యన్నీ గాబట్టే ఎటూ తిన్నగా బతకలేక పోతన్నాం’ అంటూ చిన్నగా  నవ్వేస్తాడు.
కానీ అపుడపుడూ పెంచలయ్యకి కోపం కూడా వస్తుంది. బాధేస్తుంది మళ్ళా… అపుడు అన్ని మొహమాటాలను విసిరి కొట్టేసి సూటిగా చురుగ్గా అందరి వంకా చూసేస్తాడు. ఆ చూపుల్లోంచి, పదునెక్కిన స్వరంలోంచే అపుడపుడూ అగ్నికణాలు కొన్ని రాలిపడతాయి. అట్లా రాలిపడిన ఒక ఆక్రోశం యిది.
పెంచలయ్య వూళ్ళోని ఒక కాన్వెంట్‌లో పదో తరగతి చదివే పిల్లల్లో బాగా చదివే పదిమందిని ఎంపిక చేసి ఒక బాచీగా చేసారట. వాళ్ళకి బాగా కోచింగ్‌ యిప్పించి రాంక్‌ తెప్పించడానికి ఎంపిక చేసిన పదిమందీ, రెడ్ల పిల్లలే. పెంచలయ్యకి తెలిసిన మాల దాసరి పిల్లవాడు ఒకరు ఆ తరగతిలోనే చదువుతున్నాడు. అతను బాగా చదువుతాడనీ ఆ పదిమందితో పాటు కోచింగ్‌ యిప్పించమంటే ‘స్టాండర్డ్‌’ సరిపోదని స్కూలు యాజమాన్యం తిరస్కరించిందంట. తీరా పరీక్షా ఫలితాలు వచ్చాక చూస్తే ఆ పదిమందినీ దాటుకుని ఈ పిల్లవాడే 9.8 గ్రేడింగ్‌తో స్కూల్‌ ఫస్ట్‌ వచ్చాడంట. మొహం కోపంగా పెట్టి ఈ విషయం చెప్పడం మొదలు పెట్టినా చివరికి ఆ పిల్లవాడి విజయానికి ఉత్సవం లాగా చిరునవ్వులతో ముగించాడు పెంచలయ్య.
మళ్ళీ తడి తడి అయిపోయిన గొంతుతో పెంచలయ్యే…” ‘మిగతా వాళ్ళ కన్నా మేం ప్రతిదానికీ రెట్టింపు కష్టపడాలండీ. ఇంత జరిగినా… కనీసం మా పిలగాడిని పిలిచి  చిన్న బహుమతి అయినా యివ్వలేదండీ! పైగా రెడ్లందరూ’ మాలోడికి మగబిడ్డా!!’ అని ముక్కున వేలేసుకున్నారు…” అన్నాడు…
‘మాలోడికి మగబిడ్డా!!’
ఒకే ఒక చిన్న వాక్యం…
శతాబ్దాల తరబడీ దళితులపై స్త్రీలపై ఉన్న చులకన భావానికి అద్దం పట్టిన వాక్యం…
ఒక వాక్యం – రెండు వివక్షలు…

Share
This entry was posted in లోగిలి. Bookmark the permalink.

One Response to ఒక వాక్యం – రెండు వివక్షలు!!

  1. నాకు చదువు నేర్పించిన బడి పంతులే ఒక వాక్యం ఉపయోగించేవాడు “మొగుడు చచ్చినా ముండకి బుద్ధి రాలేదు” అని. పిల్లలకి అలాంటి వాటికి అర్థాలు తెలియవు. పిల్లలు అర్థం అడిగితే నిర్మొహమాటంగా చెప్పేవాడు “పూర్వం భర్త చనిపోయిన స్త్రీలకి శిరోముండనం, అనగా గుండు గియ్యడం చేసేవాళ్ళు. ముండ అంటే గుండు గియ్యించబడ్డ స్త్రీ” అని. ఇప్పుడు ఎవరూ స్త్రీలకి గుండు గియ్యించడం లేదు కదా. అలాంటప్పుడు ఆ సామెతలు ఉపయోగించడం అవసరమా? ఈ సందేహం ఆ పంతులుకి రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో