రవీంద్రుని నాటికల్లో స్త్రీలు

డా. వేలూరి శ్రీదేవి
ప్రపంచ సాహిత్య వినీలాకాశంలో ధృవతారలుగా నిల్చిపోయి ఆచంద్రార్కంగా వెలిగిపోతున్న కవులు, రచయితలు కొద్దిమంది ఉన్నారు. అలాంటి విశిష్టమైన కవుల్లో విలక్షణమైన కవి, రచయిత, తత్త్వవేత్త, గాయకుడు, చిత్రకారుడు మన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. ఇతడు దేశంలోనే మొట్టమొదటి నోబుల్‌ బహుమతి గ్రహీతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి గడించిన రవీంద్రుడి రచనలు సమకాలీన భారతీయ సాంప్రదాయపు ఒరవడిలో సాగాయి. వంగదేశపు సాహిత్యాన్ని, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసి విశ్వకవి అయ్యాడు.
మహర్షి దేవేంధ్రనాథ్‌, శారదాదేవిలకు గల 15 మంది సంతానంలో 14వ వాడు ఠాగూర్‌. 1861 వ సం|| మే 7వ తేదీన కలకత్తాలో జన్మించాడు. పుత్రుల సంఖ్యలో ఇతడు 8వ వాడు. వీరిది సంపన్నమైన కుటుంబం. రవీంద్రుడికి 12 సం. వయస్సున్నప్పుడే రచనలు చేయడం అలవాటైంది. అలా ప్రారంభమైన ఆయన సాహిత్య వ్యాసంగం కవిత్వం, వచనం, ప్రబంధ సాహిత్యం, గేయ సాహిత్యం, వ్యాసాలు, నాటికలు ఇలా అనేక రకాలైన ప్రక్రియలలో సాగింది. ఇదంతా తన చుట్టూ ఉన్న ప్రకృతి ప్రేరణతోనే సాగింది.
బాల్యంలో అల్లరిగా, యవ్వనంలో చిత్రకారుడిగా, యుక్తవయస్సు నుండి చివరి దశ వరకూ కవిగా, రచయితగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా తన ప్రయాణం సాగించి ప్రకృతిలోకి పాఠశాలలు అనే నినాదంతో ”శాంతి నికేతన్‌” పేరుతో ఒక పాఠశాలను స్థాపించాడు. ఆసియా ఖండం నుండి మొదటి సారిగా సాహిత్య రంగంలో ”నోబుల్‌ బహుమతి” (1973) పొంది అసాధారణ ప్రతిభాశాలి అని విశ్వవ్యాప్తంగా గుర్తించబడ్డాడు.
ఒకే రూపం విభిన్న దృక్కోణాలతో విశిష్టమైన లక్షణాలు కలగలిసిన రవీంద్రుడు మంచి సంగీతాభిమాని. సుమారు రెండు వేలకు పైగా పాటలకు సంగీతాన్ని సమకూర్చి తన సంగీత ప్రియత్వాన్ని చాటుకున్నాడు. ఇతడు మంచి గాయకుడు కూడా. తొలిసారిగా ”వందేమాతర” గీతాన్ని అధికారికంగా 1911లో కలకత్తా కాంగ్రెసు సమావేశంలో ఆలపించడమే కాక ”జనగణమన” గేయాన్ని సృష్టించి మొదటిసారిగా మనకు వినిపించడం విశేషం.
రవీంద్రుడు విశ్వమానవ ప్రేమికుడు. ప్రేమ తత్వాన్ని తన రచనల్లో ప్రస్పుటంగా ప్రదర్శించాడు. ఇతని నాటికల్లో వివిధ రకాల ప్రేమలు కనపడతాయి. ఈతని నాటికలకు ఒక ప్రత్యేకత ఉంది. వీటిలో తీసుకోబడ్డ ఇతివృత్తాలన్నీ దాదాపు మూలకథ నుండి తీసుకున్నవే. ఇందులో ఎక్కువ నాటికల పేర్లు స్త్రీల పేర్లతో ఉండటం గమనార్హం. ఉదాహరణకు – చిత్రాంగద, గాంధారి ఆవేదన, మాలిని, కర్ణ-కుంతి సంవాదం, కచ-దేవయాని, ప్రకృతి ప్రతీకారం.
వ్యాస విరచిత మహాభారతంలోని ”యయాతి చరిత్ర” లోని కచుడు-దేవయానిల ఇతివృత్తాంతాన్ని నాటికగా మలచాడు రవీంద్రుడు. వారిద్దరి మధ్య జరిగిన సంవాదం, సంభాషణలు మాత్రమే తీసుకుని అంతకు ముందు వెనకల కథ జోలికి వెళ్ళలేదు. ప్రధాన పాత్రల్లో అతి ప్రాధాన్యత కలిగిన  పాత్రగా నిలిచిపోయిన దేవయానిని కేంద్రబిందువుగా చేసుకుని రాయబడిందీ నాటిక.
కచుడు మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి శుక్రుని వద్దకు రావడం, దేవయాని అతన్ని ఇష్టపడటం, తాను వచ్చిన పని పూర్తయిందని కచుడు ప్రయాణమవడం – ఇక్కడి దాకా యయాతి చరిత్రలో కనబడే కథ, పాత్ర కూడా. కాని రవీంద్రుడు దేవయానిని మలిచిన తీరు కొంత విలక్షణంగా, ఉదాత్తంగా కనబడుతుంది. కచుడితో అనేక రకాలుగా వాదించిన దేవయాని తన మనోవేదనను అతడు గ్రహించలేక పోతున్నాడని బాధ పడ్తుంది. ఆ బాధ నుండి ఆవేదన, అందులో నుండి ఆందోళన, అక్కడి నుండి ఆవేశం ఒక్కసారిగా పెల్లుబికి రాగా కచుడిని నిలదీస్తుంది. కచుడు మృత సంజీవని విద్య కోసం తన తండ్రి దగ్గరకు వచ్చిన విధానాన్ని, పథకాన్ని, అందుకోసం తనను ఉపయోగించుకున్న వైనాన్ని బట్టబయలు చేస్తుంది.
ఇక్కడ రవీంద్రుడు దేవయానిని సూక్ష్మగ్రాహిగా, కొంత సుకుమార హృదయినిగా చిత్రించాడు. కచుడు తన పనిని పూర్తిచేసుకోవడానికి దేవయాని తన హృదయాన్ని హరించేటట్లుగా ప్రవర్తించాడని నిందిస్తుంది. దేవయాని వాక్చాతుర్యం కలదిగా చిత్రించబడింది.
రవీంద్రుడు సామాజిక నేపథ్యం గల ఇతివృత్తాన్ని స్వతంత్రంగా రాయలేదు. ఆయన ఇతివృత్తాలన్నీ అనుసరణీయాలే. కచ-దేవయానిల కథను తీసుకోవడంలో రవీంద్రుడు సామాజిక ప్రయోజనాన్ని ఆశించినట్లుగా అనిపిస్తుంది. సామాజిక తత్వవేత్తలు నివేదించిన అంశాల్లో ఒకటైన ”ఏకాత్రయానురాగం” (వన్‌ సైడ్‌ లవ్‌) వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడం కోసమే ఈ నాటిక చేసినట్లనిపిస్తుంది.
ఒకవైపు నుండి ఉద్భవించే ప్రేమ ఫలవంతం కాదని దేవయాని పాత్ర వల్ల స్పష్టపడింది. కార్యసాధన కోసం వచ్చిన కచుడికి ప్రేమ వైపు దృష్టి లేదు. అతని ధ్యాసంతా సాధన వైపే. కాని దేవయాని మాత్రం కచుడిని ప్రేమించి తనను వరించమని వేడుకుంటుంది. అందుకు నిరాకరించిన కచుడిని కోపంతో, కసితో శపిస్తుంది. తత్ఫలితంగా కచుడు దేవయానికి ప్రతిశాపమివ్వకపోగా ”సుఖంగా ఉండమని, జరిగిన వృత్తాంతమంతా మర్చిపోదువుగాక” అని వరమివ్వడం గమనార్హం. దీనివల్ల దేవయాని జీవితం, తద్వారా చరిత్ర గతే మారిపోతుంది.
”స్త్రీ బుద్ధి ప్రళయాంతకా” అన్నట్లుగా దేవయాని ప్రేమ, బుద్ధి ఇద్దరి జీవితాల్లో ప్రళయాన్ని సృష్టించింది. ఆమె ప్రేమ ”ఏకాత్రయానురాగం” కావడం వల్ల పుష్పించి, ఫలించలేదు. దీన్ని ఆధారంగా చేసుకుని ప్రేమ, అనురాగం ఇరువైపులా ఉండాలని రవీంద్రుడు ప్రపంచానికి చాటడం కోసమే ఈ నాటిక రచన చేసాడనిపిస్తుంది.
ఇదే వరుసలో వచ్చిన రవీంద్రుడి మరో నాటిక ”మాలిని” రవీంద్రుడు తనకు 35 సం||వ వయస్సున్నపుడే ఈ నాటికను రాసారు. ఇది ఒక పద్య నాటిక. ఇందులో రాజమహిత ”మాలిని” ఆర్య ధర్మంలో పుట్టినదై ఉండి కూడా బౌద్ధమతాన్ని ”కాశ్యప’ భిక్షువు ద్వారా ఉపదేశం పొందుతుంది. బ్రాహ్మణ మండలి ఆమె నిర్వాసనాన్ని కోరి ప్రత్యక్షం కాగానే ఆమె మార్గాన్ని అనుసరిస్తారు. కాని వారి నాయకుడు క్షామాంకరుడు చివరి వరకూ కూడా తన పట్టు వదలకుండా ఉంటాడు. తన స్నేహితుడైన సుప్రియుడిని చంపి తాను కూడా మరణిస్తాడు. సుప్రియుడు మాలినిని ఇష్టపడతాడు. అయితే మాలినిని సుప్రియుడు ప్రేమించాడా లేదా అన్నది ఇక్కడ గమనార్హం. ఈ నాటికకు ముందుమాట రాస్తూ బెజవాడ గోపాలరెడ్డి గారు ”ఒకవేళ మాలిని ప్రేమిస్తుంది అంటే సుప్రియుడినా లేక క్షామాంకరుడినా అన్నది పాఠకులే నిర్ణయించుకునే అంశం” అంటారు. ఇలా అనడం వల్ల ఈ నాటికపై ఆసక్తి కలిగే అవకాశం ఉంది.
రాజకుమార్తె అయిన మాలిని ని కేంద్రస్థానంగా చేసుకుని రాయబడిన నాటిక ఇది. ఇందులో కూడా ఏకాత్రయానురాగమే కనిపిస్తుంది. తాను ఇష్టపడిన వ్యక్తిని చేరుకోలేక, తనను ఇష్టపడిన వ్యక్తిని అంగీకరించలేక సందిగ్ధంలో పడి సంఘర్షణలో పడుతుంది. ఈ క్రమంలోనే జీవితంపై నిరాశతో మాలిని మాతృప్రేమను వదలి విశాల ప్రపంచంలోకి ప్రేమకోసం వెళ్ళడం, నిరాశపడి ఒంటరితనం అనుభవించడం గమనిస్తాం. అలా ఏకాకిగా కొంతకాలం గడిపిన తర్వాత, ఆ స్థితి నుండి తేరుకుని, విశాల పృథ్వి కంటే మాతృప్రేమే గొప్పదని నమ్మి తల్లి ఒడికి చేరి సేద దీరడం కొసమెరుపు.
రవీంద్రుడు తన నాటికల్లో పురాణ స్త్రీని, ప్రబంధాల్లోని స్త్రీని, వేదకాలంనాటి స్త్రీని ఇలా రకరకాల స్త్రీ పాత్రల్ని ఇతివృత్తాలుగా స్వీకరించి నాటిక రచన చేసాడు. కొన్ని సందర్భాల్లో బెంగాలీ స్త్రీలను ఆవిష్కరింపజేయ ప్రయత్నించారు. భిన్న ప్రేమలకు సంబంధించిన స్త్రీలను చూపించాడు. ఒక స్త్రీ తల్లిగా, చెల్లిగా, కూతురుగా, భార్యగా పంచే ప్రేమను ప్రదర్శించాడు. తల్లి ప్రేమకోసం ఆరాటపడిన మాలిని గాని, తల్లి ప్రేమను చూపించే క్రమంలో కుమారుడి వికృత, దుర్మార్గపు చేష్టలకు విసిగిపోయిన గాంధారి కర్కోటకురాలిగా మారిన వైనాన్ని గాని చక్కగా చిత్రించడం విశేషం.
రవీంద్రుడి మరో నాటిక ”గాంధారి ఆవేదన”. మహాభారతం లోని గాంధారికి, రవీంద్రుడు మలిచిన గాంధారి పాత్రకు కొంత వ్యత్యాసం కనబడుతుంది. అంధుడైన భర్తతోపాటు తాను కూడా అంధత్వంతో జీవితాన్ని గడిపిన అనుకూలవతియైన భార్య గాంధారి. పదినెలలు తన గర్భంలో  మృత్పిండాన్ని మోసి, కన్న సంతానంలో ప్రధముడు దుర్యోధనుడు. అందరిలో ప్రియమైన వాడైన దుర్యోధునున్ని అజేయుడుగా, అమిత బలాఢ్యుడుగా చేయాలనే సంకల్పంతో బాల్యంలో దుర్యోధనున్ని తన మహిమాన్వితమైన నేత్రాలతో దర్శించి అమిత బల, తేజోవంతుడుగా జేసిన అరుదైన అమృతమూర్తి గాంధారి. వంద మంది పుత్రుల్ని కని చరిత్రలో నిల్చిపోయింది. దుర్యోధనుని యవ్వన దశలో చేస్తున్న అహంభావ పూరిత చర్యలకు ఏవగించుకుని అతడిని పరిత్యజించమని భర్తను వేడుకుంటుంది. అమితంగా ఇష్టపడే ప్రియ పుత్రుడు దుర్యోధనుని వికృత చేష్టలను అసహ్యించుకుంటుంది. అతడిని కన్నందుకు సిగ్గు పడ్తుంది. బాల్యం లోని అతని అమాయక శిశు వదనాన్ని చూసి పొంగి పోయినందుకు దుఃఖిస్తుంది. అతనికి జన్మనిచ్చినందుకు వ్యధ పడ్తుంది.
నిండు సభలో అహంకారంతో దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవించినందుకు గాంధారి అవమాన పడుతుంది. తన ప్రియ పుత్రుడు తన పలుకుల నుండి పలుకులను, తన ప్రాణము నుండి ప్రాణమును గ్రహించి ఇంతటి ఘోర పాపానికి పూనుకున్నాడని, అలాంటి వాడికి జన్మనిచ్చి తప్పుచేసానని బాధ పడ్తుంది.
ఇలా రవీంద్రుడు గాంధారిని ఒక విభిన్న కోణంలో మనముందు సాక్షాత్కరింప జేసాడు. కా పురుషుడు అయిన దుర్యోధనున్ని తక్షణమే దూరం చేయమని, అతనికి కఠిన శిక్షలు విధించి రాజ్యంలో నాలాంటి తల్లుల మాతృదుఃఖాన్ని పోగొట్టమని అర్థిస్తుంది. రాజ్యంలో ధర్మ పరిరక్షణకు ఇది అవశ్యం అంటుంది. ఇది ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. రవీంద్రుడు గాంధారిని ఒక ఉదాత్త స్త్రీ మూర్తి వలె చిత్రించాడు. ఇంకా ధర్మ సూక్ష్మమూర్తిగా చూపించాడు. ఆమె చేత నాటికలో రచయిత ధర్మ సూక్ష్మాలు చెప్పించడం ఒక విశేషం.
రవీంద్రుని అద్భుత రచనా సామర్థ్యానికి ”గాంధారి ఆవేదన” ఒక మచ్చుతునక. పిల్లల్ని కనడమే కాదు, పెంచే విషయంలో, విద్యాబుద్ధులు నేర్పే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, మాతృ ప్రేమను సరైన క్రమంలో, సక్రమమైన రీతిలో ప్రదర్శించాలని సూచించాడు.
గాంధారి ఆశించిన స్పందన ధృతరాష్ట్రునిలో కనబడనందున ”ఏ రాజ్యంలోనైనా, ఏ జనుడైనా ఒక అబలను, పరదారను, ఏ పాపమెరుగని దానను  అవమానిస్తే అలాంటి వారికి కఠిన శిక్షలు వేయాలని కోరుతుంది. స్త్రీల అమాయకత్వాన్ని, వారి నిరాడంబరత్వాన్ని బాహటంగా చెపుతుంది”. స్వార్థం చేత పురుషులకు, పురుషులకు మధ్య వివాదాలుండవచ్చు. వాటి మంచి, చెడులు స్త్రీలకు తెలియవు. వందల కొద్ది కుటిల నీతులు, దండనీతులు,  భేద నీతులు, పురుషుల తీరు పురుషులకే ఎరుక. బలము సాధించుకొనుటకు బలము, వంచన సాధించుకొనుటకు వంచన, కౌశలమును ప్రతిఘటించుకొనుటకు కౌశలమును సృష్టించుకుంటారు. అలా పురుషులు తమ మనోభిష్టాన్ని నెరవేర్చుకుంటారు. ఇన్ని రకాల కుటిల నీతులు స్త్రీలకు తెలియవు. గృహధర్మచారిణులను, స్త్రీలను పురుష స్పర్శచే అమర్యాద చేయువారు, భార్యను కొట్టి హింసించి కసి తీర్చుకునేవారు, స్త్రీలను అగౌరవపర్చువారు పాపాత్ములే కాదు, నీచులు కూడా. అలాంటి వారికి కఠిన శిక్షలు అమలు చేయాలి. వారిని ఉపేక్షించరాదని ధైర్యంగా, నిరాఘంటంగా మాట్లాడి స్త్రీ జాతికే వన్నె తెచ్చేటట్లుగా రవీంద్రుడు గాంధారిని తీర్చి దిద్దాడు.
రవీంద్రుడి నాటికల్లో మరో విలక్షణ నాటిక ”కర్ణ-కుంతీ సంవాదం” పాండురాజు పట్టుమహిషి అయిన కుంతీదేవికి, కర్ణుడికి జరిగిన సంభాషణ, సంవాదం ఇందులోని ఇతివృత్తం. అవివాహితగా ఉన్నప్పుడు వర ప్రసాదంవల్ల కుంతికి పుట్టిన కొడుకు కర్ణుడు లోకానికి భయపడి ఆ పుత్రుడిని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేయడం లోక విదితమే. ఆ పెట్టె జల ప్రవాహంలో అలా పోతూ సూతునకు (రథ సారథి) దొరుకుతుంది. అతడి భార్య రాధ ఆ పుత్రునికి కర్ణుడు అని పేరు పెట్టి పెంచడం, అతడు రాధేయుడుగా పిలవబడటం మనందరికి తెలిసిందే. ఈ రాధేయుడే పరుశురాముడి వద్ద సకల విద్యలు అభ్యసించి మహావీరుడిగా పరాక్రమ వంతుడిగా పేరు తెచ్చుకుని కౌరవేంద్రుడు దుర్యోధనుడితో సఖ్యం చేసి అంగరాజుగా పట్టాభిషేకం పొంది రాజుగా కీర్తించబడతాడు.
ఈ నాటికలో కుంతి పాత్ర యొక్క నిస్సహాయతను, మాతృ హృదయాన్ని ఒకవైపు, కర్ణుని మాతృప్రేమ పరితాపాన్ని, పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని తనదైన శైలిలో విశ్లేషించాడు రచయిత. రవీంద్రుడు ఈ నాటికలో కుంతి పాత్రను విభిన్న కోణాల్లో మన ముందు ఆవిష్కరింపజేసే ప్రయత్నం చేస్తాడు. మొదట కుంతి కర్ణుడిని పసిప్రాయంలోనే వదిలి వేసినప్పటి నుండి బాధపడే మానసిక వ్యధను వ్యక్తపరుస్తూనే దానికి కర్ణుడు ఎంత బాధ పడ్డాడో అని ఆలోచిస్తున్న తీరు పాఠకులను కదిలిస్తుంది ఇందులో కుంతిని పరిపూర్ణమైన వ్యక్తిత్వం గలదానిగా చూపిస్తూ కుంతికి ద్వితీయ పాత్రగా చూపెడతాడు.
రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన నాటికల్లోని స్త్రీ పాత్రలకు ఒక ప్రత్యేకత, ప్రాధాన్యత ఉన్నాయి. పాత్రలు, ఇతివృత్తం మూలం నుండి తీసుకోబడినవే అయినా వాటిని మలిచిన తీరులోగాని, పాత్రల్ని ప్రదర్శించే విధానంలోగాని ఒక సామాజిక ప్రయోజనం ఆశించినట్లుగా ఉంటాయి. గాంధారి, కుంతి పాత్రలు తమ మాతృ హృదయాన్ని ప్రదర్శించి, వారి ప్రథమ సంతానం వల్ల (దుర్యోధనుడు, కర్ణుడు) వారు పొందిన మనోవ్యధ ఈ నాటికల్లో ప్రస్పుటమవుతుంది.
”సుపుత్రో జాయతే వచిదపి కుమాతా న భవతాం” అని శంకరాచార్యుల వారన్నట్లు లోకంలో మంచి తల్లులుంటారు గాని అందరూ మంచి కొడుకులు కారేమో.
రవీంద్రుడు విశ్వమానవ ప్రేమను ప్రదర్శించడంలో భాగంగా స్త్రీని వివిధ పాత్రల్లో, విభిన్న పార్శ్వాల్లో ఆవిష్కరింపచేసాడు. తల్లిగా స్త్రీమూర్తి హృదయాన్ని చూపించడం కోసం గాంధారిని, కుంతిని తీసుకోవడం, ప్రేయసిగా స్త్రీ హృదయావిష్కారాన్ని దేవయాని, మాలిని పాత్రల్ని భార్య ప్రేమను  ప్రదర్శించడం కోసం చిత్రాంగడ, అమాబాయి పాత్రల్ని తీసుకుని తన అద్భుత రచనా సామర్థ్యాన్ని నిర్మించుకున్నాడు. ”స్త్రీ చిత్తం పురుషుని భాగ్యం” అన్నట్లు రచయిత సృష్టించిన అన్ని పాత్రలు నాటికలోని ప్రధాన స్త్రీ పాత్రల చుట్టూ తిరుగుతూ కథను నడిపించేవిగా కనబడుతాయి. రవీంద్రుడు సృష్టించిన స్త్రీ పాత్రల యొక్క హృదయాన్ని లోతుగా పరిశీలిస్తే
”కుసుమం కంటే కోమలమైంది స్త్రీ హృదయం
వజ్రం కంటే కఠినమైంది స్త్రీ హృదయం”.
అన్నట్లుంటుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో