అక్కిరాజుపల్లిలో….

కొండమ్మ :
మా ఊరు కేశవపురం, నా పేరు కొండమ్మ. రజాకర్లొచ్చిన్రు, దొడ్డి వెట్టిండ్రు. ఆడోల్లనోదిక్కు, మొగోల్లనోదిక్కు దొడ్డివెట్టిన్రు. మొగోల్లనేమొ పొడి సేసిన్రు, ఆడోల్లనేమొ బట్టలిప్పేసిన్రు, నల్లపూసలు దెంపుకున్రు. డ్రస్సు లేసుకుని, లాగులేసుకుని వచ్చిండ్రు. వాల్లకు బస్సు, గిస్సు ఎక్కడిది? ఇండ్లు దోస్కపోటానికి బండ్లు గిండ్లు గట్టుకొని వచ్చిరి.
మొగోల్లందర్ని సంపుతాంటె, ఆడోల్లు మొత్తుకుంటాంటే, దొడ్లల్లకు దోలి కంప యెన్కులాడుకొచ్చి నిప్పువెట్టి అండ్లదోల్తమనేది. ఒగడు సెట్టెక్కిండు, నాకు తుపాకేసిండు. దెబ్బ ఇడిసి పెట్టంగనే ఎక్కడోల్లక్కడ పారిప్రోయిన్రు, ఊల్లకొచ్చిన్రు, ఇండ్లు కాలవెట్టిన్రు, నల్లపూసలు దెంపుకున్నరు, పెయిమీదున్నది గుంజుకున్నరు. అందర్ని గూడెందోలి నిప్పువెడ్తమన్నరు. పొడిసెటోల్లను పొడిసేసిన్రు, బట్టలిడిపిచ్చిన్రు. నాతోని మందంతున్నరు. పది, పదిహేను మంది గొల్లోలు, మా అవ్వ, మా పెద్దవ్వగూడుండె. అందరి పూసవోగులు గుంజుకున్నరు. ఇగ నాకు తుపాకేసినంక సోయిలేదు. అప్పుడు గొలుసుల ఎల్లమ్మ, మా పెద్దవ్వ, నేను, గొలుసుల లచ్చమ్మ, శాల బాలమ్మ, మంగలి కౌలమ్మ వీళ్ళందరుండిరి. సాకలి యెంకి వుండెగని సచ్చిపోయింది.
అప్పటికి పిల్లల్లేరింక నాకు. వూర్లెవుండొద్దని బయానికి, బాయిలకాడ ఒండుకునితిన్నం. అడవిల్నే ఒండుకతింటిమి. వూర్లెవుంటె బయమని ఎక్కడోల్లమక్కడ పారిపోయినం. వొచ్చి మామీద వడిందాక దెల్వదు. బుడ్డెడో, అడ్డెడో కొంచవోతిమి, ఆడ ఉడ్కబెట్టుకుని తింటిమి, ఉంటిమి. వున్నోల్లయితె సర్దుకుందురు, లోపల వోసుకుందురు. ఇవిదిని బతుకుతమా మనం, ఆ వున్నయే సర్దుకున్నం. బతికెటోల్లెవరో, సచ్చెటోల్లెవరో.
అప్పుడు ఎక్కడోల్లక్కన్నే పీనిగల్ని సూసుకుంట, ఏడ్సుకుంటుండేది. ఇగ వాల్లను తిట్టేటట్టున్నాది ! నీ బాంచెన్‌, మమ్మల్నే పొడిసేయవట్టిరి, ఇగ మేము దిడ్తాం అప్పటి కాలంల ! ఇగ ఏదోజేసే కట్టం, కూలో, నాలో అన్నీ జేసేది. మిలిట్రి సంగతయితె నాకెరుకలే. అప్పుడు నేనేడున్న? తుపాకి దెబ్బవడి దవకాన్లనే వుంటి…. ముందుగాల చెట్లమందు, మన్ను వెడ్తమన్నరు – దెబ్బ మానదంటె గప్పుడు దవకానకు దీస్కపోయిన్రు. ఇగ చెర్రాలు దీసిన్రు. గిదంత గూడ సంగపోల్లు మనకోసమే వచ్చిన్రని జేసినం – ఇగ గట్లయ్యింది…
వజ్రమ్మ :
నా పేరు వజ్రమ్మ. ఆ రజాకర్లప్పుడు బతుమ్మలాడమంటె ఆడ్తిమి, బట్టలిడువమంటె ఇడిస్తిమి. అప్పుడు ఇజ్జతెక్కడిది, మానమెక్కడిది. ఇగ మేం గిట్లనే వున్నం. అడ్డం బండివెట్టి కోత్తనే వుండిరి ఇగ మాముందే. మా బావనైతే ముడ్లె వొడిసిండ్రు, ఒత్తి గుంజెవరకల్ల పానంబోయింది, పేగులివుతలపడ్డయి. అక్కడ సంపిన్రు. ఇక్కడ ఇండ్లు గాలవెట్టిన్రు. తొట్టెన్ల పిల్లలనిడిసిపెట్టి వుర్కుదుమమ్మా బైటకు బతుకుదమని. ఇగ వున్నదేగంత, వుర్కినం వూర్ల పంట. మిరప్పొడి పట్టుకొని, రాల్లువట్టుకొని, మా మొగల బయానికి పుర్కుదుమమ్మా, నీ దండంబెడ్త, మా గోస అప్పుడు.
ఈ కమ్యూనిస్టు పార్టీల ఉండిరి గద ! వాళ్ళను సంపుతమని రజాకర్లు వొచ్చిరిగద ! ఇటు పోలీసులొచ్చిరి. కమ్యూనిస్టోల్లు వోంగనే, వాల్లొచ్చి కొట్టుడు వొండిపెట్టున్రని మల్ల వాల్లు వోంగనే వీల్లొచ్చి కొట్టిరి. ఆడోల్లను మానంబంగం జేస్తమని తయారై వచ్చిరి. ఈడ గూడ జేసిన్రు. అగోగామె, తైదసేన్ల కంకేరు తాంటె గుంజుకవోయిన్రు, కరాబు జేసిన్రు. తరిగొప్పులపల్లిల. ఆమె పేరు సిద్ధమ్మ, తాటి సిద్ధమ్మ.
పోలిసులు అక్కన్నపేట నుండి వచ్చిన్రు. చేర్యాల దవకాన్ల మూడు నెల్లుంది. పిల్లలుగాలెగప్పుడు. ‘పెద్దమనిషి’ గూడగాలె. ఇప్పుడు ఒక్క బిడ్డున్నది. మేం ఎట్ల బతుకుతమో అన్పించేది. తెల్లారై ఏంది పొద్దుక్తె ఏంది, ఒక యాడాది అడవిల పండుకున్నం. జొన్న సేన్లుంటైసూడు గుంపుల్ల, అపుతలోల్లకు గండ్లవడకుండ, ఇన్రాకుండ ముసలోల్లనిడిసివెట్టి, దగ్గుతరుగద, సంటి పిల్లలు ఏడుస్తరు గద ! అని సోపతులు వాసి ఇయ్యాల వండుకున్నకాడ రేపు వండుకోక పోయేది. అడవిల గూడ చెట్ల మార్గాన వోయి వండుకుంటిమి.
పార్టీవోల్లు మా పానాలు గాపాడుకొమ్మని చెప్పేది. కమ్యూనిస్టు పార్టీల మావాల్లు వుండేదిగద ! మేం ఇండ్లు ఇడిసిపెట్టి ఆ పొద్దాక గూడ ఓ మనిషిని వెట్టుకుని వంటజేసుకుందుమమ్మా మా పానబయానికి చింతచెట్టుమీద ఓ మనిషిని కావలివెట్టి పొయ్యిమీద వంటపెట్తుంటిమి. మంచెమీదినుంచి ఎవరన్న వస్తండ్రనే వరకు, పొయ్యి మీదియి పొయ్యి మీదనే, పోరగాన్లను తొట్లెన్లనే వెట్టి వుర్కుదుము, మనిషివస్తలేరంటె మల్ల వుర్కొద్దుము. మేం బతికొత్తె పిల్లలు, లేకుంటె లేదు. ఈ పిల్లలు గావాలె, ఈ సంసారం గావాలె, ఈ మొగుడు గావాలె అని ఆలోసనున్నాది ! ఎవలి పానానికి వాల్లే వుర్కేది. తల్లీ, పిల్ల అన్నట్టున్నాదమ్మ. కొన్ని దినాలు కొందరు సుట్టుపట్టు వూర్లల్ల బతికొచ్చిన్రు. ఈ సుట్టుపట్టు తాలూ కాల్లల్ల బతికొచ్చినం సుట్టాల్లల్ల వోయినం. కొందరు దలాల్లల్ల వుండిరి. పార్టీ లీడర్లయి ఎవరు పోలెగని, దలాల్లల్ల వోయిన్రు….
కొందరు ఇటునర్మేట వోయిరి. అటు పోతారం వోయిరి తరిగొప్పుల వోయిరి. ఊరు మొత్తం వోయిన్రు. ఊరు మొత్తం అంటేనే కమ్యూనిస్టోల్లకి మంట. ఈ తరిగొప్పల కొస్తి ఎదురుదాడి జేసిన్రు. పోతారంబోలె ఎదురుదాడి జేసిన్రు. నర్మేటకివోతె ఎదురుదాడి జేసిన్రు. ఇగ గింత జేసినగాని, మనకి గింత సందిత్తలేరని వాళ్ళ పకృతి రజాకర్లది. ఇగ మనం వూల్లెవుంటె మంచి గుండదని గుంపులగుంపులం జామచెట్ల కింద, బాయిలకాడ వుందుము. ఇగ ‘ఎగిల్లు’ వార్తన్నయి. పచ్చగ చెట్లున్నయి. చెట్లోల్నే వాల్లున్నరు. ఆ మడుగులున్నరు. ఆడోల్లగుడిసెల్ల వుందుము మొగోల్లు బైట వున్నరు.
(పెద్ద) రామాపురం అనే వూర్ల ‘కంకి’ గొడ్తాన్రు. కొడ్తుంటె ఈ వూరి సాకలాయనె అక్కడ జీతమున్నడు ఇగ వాల్లను జూసిండు. ఇగ కంకి కొట్టే టోడల్ల ఇక్కడికొచ్చిండు. ఇగ ఏమున్నది. మనం ‘జత్తం’పంది అన్నరు. అనంగనే ఏమున్నది, ఇగ మా బావ కొందరు మొగోల్లు వురికిన్రు. కొంతమంది వురుకుతాంటె వీల్ల నాయిన ఏం జేసిండుగదా, ఏమన్నడుగుతె ఇత్తాం, మీరు బయపడకండి. మొలతాడు యిత్త. 50 తులాల మొలతాడుండె వీల్ల నాయిన మీద బయపడకండన్నరు. కొందరు ఉరికినోల్లు ఉరికిన్రు, కొందరు వీల్లనాయన మాట వట్టుకుని వున్నరు. మేమందరం అక్కన్నే వున్నం. నా పిల్ల నెలపిల్ల. అయితె మా అక్కను, నన్ను ఒక్క వూరికే ఇచ్చిన్రు. ఇగ వుర్కుతాన్నం. వుర్కుతాంటె, ఈ సందుల్నించి ఒగరు రానేవచ్చిన్రు. వచ్చి దాన్ని అటు మలిపిన్రు. ఇగ నేను ఇండ్లనే చిక్కుకుపోయిన. ఇగ మా బావ ఇంకోగాయిన మా ‘పాలాయిన’ ఆయన బచ్చన్నపేటకి వోతనని తయారై వస్తాండు. ఆయన్ని ముడ్డిమీద ఒక తన్నుదంతె వీళ్ళ బాయిల్నే రాల్ల మీద వడేటల్లకి ముంగటి రెండుపండ్లు ఇరిగినై. లే అని మల్లోటేసేటల్లకి లేసిండు. లేసిగసంత వోంగనే అడ్డంబడేసిండ్రు ముడ్లెబడిసేసి పొడిసిన్రు. పొడిసెటాల్లకి పేగులెల్లినై. ఇగ వండి దూపదూప అంటాండు, ఎండకాలమాయె, ఇగ మంచినీళ్లు దీస్కొచ్చి పోసేటట్టున్నదా? ఇగ మొగోల్లను సంపుతాండ్రు ఇగ మమ్ములను గిట్లనే సంపుతరని నా బిడ్డోదిక్కు వోయింది నెలపోరి. ఇగ అండ్లనే ఉన్న. ఒగడొచ్చి ఈ చెంపమీదికెల్లి ఏసిండు, ఒగడొచ్చి ఈ ‘కడెం’ గుంజె, ఒగడొచ్చి చెవులై వట్టి గుంజిన్రు. నీకు కాల్లకు కడాలు ఉండెగదా ఏమాయె అని అడుగవట్టిన్రు. అడుగుతె నాకు లేవు అమ్ముకున్నాం అన్న. అంటే మొన్న బాయిల బట్టలుతుకంగలేవు అన్నరు. మా అత్త దీస్కపోయింది అన్న. 30 తులాల వెండి ముబ్యాడెత్తు బంగారం బయానికి ఏం జేత్తం ఇచ్చినం. ఇగ ఆ దెబ్బ ఇండ్ల గుద్దుతే ఇప్పటికి లేత్తాంది. మొన్న నెల్లాల్లు వన్న ఈ దెబ్బలేత్తె. ఇండ్ల గుద్దిండు ఆ తుపాకి మర్లేసి మడిమెతోటి, తుపాకి మడిమెతోటి. గట్ల జేసిండ్రవ్వా ఆగమాగం అంతా నాశడం జేసి పోయిన్రు.
గజ్జెల బాలమ్మ :
నా పేరు గజ్జెల బాలమ్మ, మంగలోల్లం. నాకు కొడుకులు లేరు. ముగ్గురు కొడుకులుంటె సచ్చిపోయిన్రు. ఒగ బిడ్డ సచ్చిపోయింది. దొరకలే నాకు. ఒగ బిడ్డున్నది. మొగుడు వోయిన తర్వాత పిల్లలు వోయిన్రు, అందరు వోయిన్రు. ఇగ కూలి జేసుకుంట బతుకుతాన్న.చాతనయిన్నాడు కూలి, చాతగాన్నాడు సప్పుడు జేయకుంటట వంటి !
నా భర్తగూడ పార్టీల వుండె అప్పుడు. అప్పుడుండెపట్కనే మంట ఈ రజాకర్లకు. పోరాటకాలంలనే, తన్నులైనయి, గుద్దులైనయి. తర్వాత సచ్చిండు  గట్ల. అప్పుడే కోసిన్రు, సంపిన్రు, అన్నయినై, లేంది ఎట్లంటం. ఇమానం అంటారు, పమానం అంటరుగదా ! ఇగ నాకు ఈ బుక్కెడన్నంసుత దొర్కదు.
ఈ మొత్తం ‘అక్కిరాజుపల్లి’ అంటేనే పేరెల్లిందంట. చద్వంగ, అనంగ విన్న. పల్లె అంత ఒక్క కట్టుమీద ఉందాం అన్నరు. ఈ తురుకోడు వోయి ‘అమ్మాపురం’ బోయి చెప్పిండు. మా దగ్గర్నే ఉన్నడు. మేమే మనిషింతబెడ్తె తిన్నడు. ఇగతిని ఎగిలివారంగ నేను నూనెదెత్తనని వోయిండు. మా యింటి ఎన్కనే వుండెటోడు. ఇగ… పెద్దోడు నర్మేటకి వోయి మంచినూనె దెచ్చుకుంట అన్నడు మాటోలి పొద్దుకి. ఇట్ల ఎంటవెట్టుకొత్తడని మాకేంగురుతు. అట్లెరుకుంటె ఆ రాత్రే వోదుం…. ఇగ ‘యెగిలివారంగ’ యెంటవెట్టుకుని వాచ్చిండు. వాచ్చిగంత పన్జేసిండు (రజాకర్లని) చెట్లు ఏర్పడ్లే, వాల్లు ఏర్పట్లె….
పోలీసులొచ్చిన్రు, నాబిడ్డ తొట్టెండ్లవన్నది. నేను పచ్చిపులుసు జేస్తున్న, ఇంట్లకొచ్చేదాక ఏర్పడ్లే, ఇంటెనుక గలుముండె. ఇంటిముంగల గలుముండె. మనమాట దెల్వదు, మన్ను దెల్వది, ఇంతింత కుల్లలున్నయి. ఇంతింత దొడ్డున్నరు. ఇండ్లల్లసొచ్చి మీ మొగల్లెక్కడవో యిన్రని అడిగిన్రు. ఇగ గిన్నెక్కడిది, చిప్పల్నే విసుకుతున్న పచ్చిపులుసు, అదే పులుసు ఇసిరేసిన మొకాన. ఇసిరేసి నడూర్లకొచ్చిన. మనం వాళ్ళింటకాడికి వోయిరాలె గాఇంటికాన్నె…. ఇగ నా బిడ్డ తొట్టెన్లనే వోయింది ఇట్ల ఇసిరేస్తె కండ్లల్ల వడ్డదోఏమో… (నవ్వు) ఇగ వున్న ముచ్చట్లే జెప్పాలెగద ! ఇగ గిట్ల కండ్లు నల్సుకుంట ఎటువోయెరో, ఎటువోయెరో అని వాళ్ళ భాషల అనుకుంటాన్రు. ఆన్నుంచి వుర్కొచ్చి ఇంకొక రింట్ల దుంకిన వాముల్ల దుంకిన, కుండలు వెడ్తరుగద గండ్ల దుంకిన గండ్ల దాక్కున్న.
ఇగ మా ఊరంత కమ్యూనిస్టేనని తెల్సు. అందరు కల్సికట్టుగుండేది గద. తురుకోల్లు గల్సేగింత పనయ్యింది – తురుకోల్లే గిట్ల జేసిన్రు మల్ల…
నా పేరు వజ్రమ్మ, పలుచ వజ్రమ్మ. నా పేరు కొండమ్మ, కేశం కోండమ్మ, అగొ గామె లచ్చమ్మ, గొలుసు లచ్చమ్మ. ఏం మాట్లాడాలమ్మ నేను, అందరు మాట్లాడ్తనే వుండిరి. పెద్దమనిషినైతె ఏందేే, ఎవరో ఒకరు మాట్లాడ్తనే వుండిరి. ఇగ నేను మాట్లాడకుంటే ఏందే, ఎవరైతేమున్నది. చూసినామె చెప్తనే వుండె. అందరం అండ్ల మునిగినోల్లమేనైతిమి  – ఈమె పేరా, ఈమె పేరు మామిడి చాకలి సైదమ్మ.
సైదమ్మ :
నా పేరే సైదమ్మ. నా భర్తకీ తుపాకేసిండ్రు, కాల్చేసిండ్రు. అదే నాకేసినట్టే యేసిండ్రు కొన్ని రోజులు బతికుండు- ఎయ్యంగనే ఇగ అడ్డంబడ్డడు. ఇగ పోరగాండ్లు ఎంబడే వున్నరుగదా. ఇగ, పీనిగమీదపడి అందరు ఏడుస్తనే వున్నరు. లే లంజె లే అని మల్లేసిండు. లే లంజె లే అని ఇటు నూకిండు, అటు నూకిండు…. ఈ చేతులు ‘కడాలు’ గుంజుకుని, గాజుల వల్లగ్గొట్టిన్రు. ఉండీ ఉండీ గాపట్టున్నే వెట్టుకున్నరు- ఒచ్చినోల్లంత ఏ గిట్టుంటారని అంటె, ఓరకేసినోల్లమల్ల మల్లఏసుకున్నం. ఏ దాడి లేదు ఏం లేదు అనంటె- గారాత్రె వెట్టుకున్నం. ఎగులువారంగ దాడి జేసిన్రు. తీసి తీసి దాసినం….
ఇగ గిట్ల చెట్లున్నయి. వచ్చేదాక ఏర్పడ్లే ఆ డిరసుగాడు. చెట్లల్ల నుంచి దబ్బ దబ్బ వాచ్చిండు. గుండ్లు దెంపుకున్నరు. గుండ్లు దెంపుకుని ఇగ పో లంజె పో అన్నడు. యెనుకకు ఎవల్లేరయ్య, మేం ఇద్దరం వున్నం. ఈ పిల్ల నేనే వున్నం అంటే గూడ కొట్టుకుంట కొట్టుకుంట అంతదూరం దీస్కపోయిండు. దీస్కపోయి పడేసిండు ఆన్నే. మందంత ఒక్కదగ్గర్నే సచ్చిండ్రు. ఇగ గిట్లనే వున్నమమ్మా. జరుగుండ్రు జరుగుండ్రని మమ్మల్నిట్ల నిలబెట్టిండు. జరుగుండ్రి అంటె ఇగ అందరం ఒక్కతాన్నే జత్తం. ఇగ ఒక్క దగ్గర్నే వున్నం. గుంపుకు గుంపు గూడినం. ఇగ వాళ్ళందర్ని జంపిన్రు, ఊరు జొచ్చిన్రు, ఊరి మీదపడి ఊరు కాలవెట్టిండ్రు.
పోలీసోల్లు ఆడోల్లను ఒక్కొక్కరం వుంటె ‘కరాబు’ జేత్తరని మా వాడకైతే అందరం కుమ్మరోల్ల ఇంటికాడ వుందుము. అంత పదిరువై మంది ఇల్లు సుట్టుకున్నరు. ఆమె బట్ట, రైకంత పీకేసిన్రు. మా అత్తను, వాళ్ళత్తను కాళ్ళసందున జొర్రబెట్టుకో… ఒక్కలం గాకపోతిమి. తుపాకి తుపాకి పొగ వోయి కండ్లు కనపడ్నే లేదు. నీళ్ళు కమ్ముడు ఒకటే…..
అప్పుడు గిట్లలేదు. సస్తమా, బతుకతమో అన్నట్టు వుండె. రెండు మూడేండ్లదాక అదే ఫికరుండె. కొన్ని దినాలు ఎక్కడ స్తలముంటె అక్కన్నే వోయి బతికొచ్చిన్రు. బయానికి ఈ ఊర్లె నెల రోజులు దీపమేలేదు. ఆరునెల్లు లేదు. బైరంపల్లి కూటిగంటి దొడ్డయ్యేదాక-
మా వాళ్ళంత వోయిరి కాడికి, బయానికి. వాళ్ళింటరా, సొప్పాముల్ల, గడ్డా ముల్లుంటె, దొడ్డాముల్లుంటె వుడ్కబెట్టుకతినేది గీయాల్లకు. అడవిల్ల సాతగాని ముసలోల్లుంటె కాళ్ళు, రెక్కలుగట్టి బాయిలేసిరి. గడ్డాములేసి కాలబెట్టిరి. సావకుంటె సొప్పగట్టేసి అగ్గిపుల్లగీకిరి – రజాకర్లే గట్లజేసిండ్రు. అట్ల భూదేవయ్యని కాల్చిన్రు, అందర్ని కాల్చిన్రు అమ్మా, ఒక మంటలు, మంటలన్నట్టు. ఆ రోజులు మంటల్నుంచి ఎల్లినట్టు. రెండుమూడూర్లల్ల జరిగిందిట్ల. కొంత మందిమి, ఇక్కడ బేగాడైన్రు…. ఇగ ఏంజెప్తునయ్యా, అన్ని అన్ని జెప్తనేవుంటి. యేంజెప్పకపోతి? కాలవెట్టిండ్రనిజెప్తి, కొట్టిండ్రనిజెప్తి. గీ జెప్పుడు ఎల్లమే వొడిసిందిగని, ఎన్నిరోజులు కష్టవడ్డం, అప్పుడు…..
ఇగ జొన్న చేనుంది మా ఇంటికాన్నే, జొన్నచేనుండె. పజ్జొన్న పిండుంటె, అడుగున ఇన్నిరాల్లువెట్టి, రొట్టె జేసుకుంటున్న అరుగుమీద. ఇంట్లకి సూతవోలె, ఇగవిలిత్తె ఉర్కుదామని బజార్లనే గుంటదోడి రొట్టె జేసుకుంటున్న. పిలుత్తరుగదా రాయే అని, గట్ల. ఇగ, గిట్ల జూత్తాన్రు, వీళ్ళు పజ్జొన్న చేన్ల నిలబడి మా ఇంటి పక్కనుండె చేను. ఓ…. బుచ్చక్క, ఎవరో గిట్లొచ్చిన్రని, కమ్మరోల్లింటికి వోయినం. వొచ్చెటాల్లకే ఎవరొచ్చిన్రే. పోదాంరావే మా ఇంటికాన్నే వుందాం అని ఆమె జెర ధైర్యంగల మనిసి వొచ్చింది. ఒచ్చేటాల్లకి పోదాం పద అక్కాని ఆయింత ఆయింత, ఆ రొట్టెలు జేసుకున్నయి, వట్టుకున్నం, వాల్లింటికివోతున్నం…. ఇగ వోతాంటె, ఓ అక్కా, నీ బాంచెన్‌, మాకు ఆకలైతాంది, నాలుగు దినాలాయె తిండిలేక…. ఏ నేనేడ వొండుకున్ననయ్య, రొట్టె జేసుకున్న. నిన్నట్నుండి నాకు తిండిలేదు. గింత రొట్టియ్యి…. బాంచెన్‌ గింత రొట్టియ్యి. వున్నయే మూడు రొట్టెలు ఇగ వొచ్చి అడిగేటాల్లకు ఇచ్చికాలవెట్టిన. ఒక్కడొచ్చిండు ఓ రొట్టిచ్చిన. వానికియ్యంగనె ఇంకొగడొచ్చిండు, ఇంకోటియ్యని, ఇంకోడొచ్చిండు. ముగ్గురు దుంకిన్రు. గొడమీదకెల్లి ముగ్గురు దుంకేటాల్లకు, అవతల జొన్నచేసుకున్నది. ఆయింత, ఓయమ్మ ముగ్గురు మూడు రొట్టెల్దిన్నరు…. ఇదెక్కడి పాపమవ్వ…. కుండతోటి నీల్లు చిప్పలకి ఒగరొంచుకున్నరు, ముంతలొగరొంచుకున్నరు. ఇగ ఆ నీళ్ళు తాగిడ్రు. ఇగ నీ కడుపు సల్లగుండ మాకు మూడురోజులాయె తిండిలేక, ఇగ నువ్వు ఎట్లన్న అడుక్కోని తిను అని ఇగబోయిండ్రు ఆల్లు కమ్యూనిస్టోల్లే….
గప్పుడు కమ్యూనిస్టోల్ల నుంచి ఒక వుత్తరం వొచ్చింది. ఇప్పుడు మనం బోలె, గా కోమటోల్లింట్లనే ఆయినుండె. ఇగ పిండిసుర్లు, ఆకులు జేసుడు, ఊడ్చి జల్లుడు అవి ఏజ్జెయ్యరన్నరు. అంటె ఊడ్చిజల్లలే, పిండిసర్లే. ఇగ ఈ కమ్యూనిస్టు తేలిందా అన్ని బందు…. ఆ కమ్యూనిస్టోల్లు అన్ని జెప్పేది. రాసి జెప్పిన్రు, పాటలువాడి జెప్పిన్రు, జైకొట్టి జెప్పిన్రు ఊల్లల్ల…. మా మొగోల్లు ఒక్కరోజు ఇంటికాడ వుండకవోదురు. పండుగైనా వుండకవోదురు ఇంటికాడ. పిల్లలు, కుటుంబం వుండి పండుగ జేసుకొని హాయిగా తిందామంటె నమ్మికలేకుండె. ఈడ వంటలు తయారయ్యేటల్లకల్ల మల్లరమ్మంటె  వోతనేవుండిరి. ఎవరన్న జెర్ర మంచిగుంటె ఆడోల్లనుపిల్సేది దొరలు, కొన్ని జాగల్ల. కాని మా కాడ లేదు. కొన్ని జాగల్లవుండె – ఆ దొరలకు పాడుగాను మత్తు బూములుండె. మత్తు గుండెగని అమ్ముకున్నరు, ఎవలకు వంచివెట్టిన్రు, ఎవరికిచ్చిన్రు? ఇయ్యలే అంతమ్ముకున్నరు. గవర్నమెంటు బంజరు బూములువంచిన్రు. అదిగూడ మాదిగలకే, ఎవరికిచ్చిన్రు? హరిజనులకిచ్చిన్రు. పార్టీ తరపున నలబై యాబై ఎకరాలిచ్చుంటరు, కొండయ్యకెరుకే…. అప్పుడందరికి వుండె ఒకటి, రెండెకరాలు మొదటిసందేవుండె, అట్ల…. పటేండ్లు రానియ్యలే…
అప్పట్లనే పోలీసులు కరాబు జేసిన్రు, జేసివోయిరి. నోటినిండ బట్టవెట్టి బెదిరియ్యలేమరి, బెదిరించే కరాబు జేసిన్రు, మాటెల్లకుండ. మొత్తుకుంటె ఎవరన్నయింటరని ఇట్ల బట్టవెట్టిండు మనదె. ఒక్కటే మామీద పడి…. అప్పుడు మా తల్లిదండ్రి జూసుకున్నరు. ఏమంటరు కరాబుజేసిరి, వోయిరి. నేను చిన్న పోరినేనైతి. ఏడ్సుకుంటనేను మావోల్లింటికిబోతె, మాఅయ్య మాఅవ్వ దవకానకేసుకొని వోయిన్రు. అప్పుడు నా మొగని దగ్గరికివోలె చిన్నపిల్లని,  తర్వాత రజాకార్లంతయి నంకవోయిన. మా తల్లిగారుతరిగొప్పుల. నన్ను ఏవనేటోడుగాదు. నన్ను మంచిగనే జూసుకునేది. దవాకాన్లగూడ మంచిగనే సూసుకున్నరు.
నేనైతె ఆడవిల్ల ఒక్కదాన్నే దిరిగిన గుంటూర్ల నెలరోజులున్న. కడుపుల్ల వొడుసుడు, ముడ్లల్ల వొడుసుడు. మనుసులసంపిరి, ఇండ్లల్ల వుందా మంటె ఇండ్లు గాలవెట్టిరి. ఈమెకైతె ఇక్కడేసిండ్రుదెబ్బ. వాల్లత్త, మా మల్లక్కను మానబంగం జేసిన్రు. ఈమెను మానబంగం జెయ్యలేగని, ఈమె బట్టవీకేసిన్రు, రైకవీకేసిన్రు. నాకు తుపాకేసినప్పుడు, ఈమె గూడ వడ్డది. అందరం అక్కన్నే వున్నమమ్మ. ఒక్కమొకాన్నె అందర్ని దొడ్డివెట్టిండ్రు. నువ్వనిలేదు, నేననిలేదిక. అందర్నండ్ల నూకిన్రు. రాంగనె కంపవెట్టికాల వెడ్తమనే ఉపాయమే జేసిన్రు.
ఇగ గిట్ల, మీవోలె వొచ్చి, ఏం కష్టమైంది, ఏం నష్టమైందని ఎవర్రాలె బాంచెన్‌, ఇంతవరకైతె. జైగొట్టుకుంట ఆవలవడ్డరు. మా కట్టాలైతె ఎవరు అడిగినోల్లు లేరు, ఇప్పటిదాక. అన్నం బెట్టమందురు, తిందురు, ఆవలవడ్డురు. గిట్ల యెన్ని దినాలంటె, మరెట్లమ్మ, కొన్ని దినాలు పోరాడాలె అనందురు. పార్టీలోలొచ్చి కొన్ని దినాలు పోరాడాలె, పోరాడ్తెనే సుకముంటది రేపని అందురు. ఏం సుకమున్నది, బొందలసుకం. ఉన్న మొగోల్లువోయినంక- అప్పటికంటె ఇప్పుడు సుకమేమున్నది. ఏం కట్టంజేసి పెట్టేటోల్లు లేరు, మనరెక్కల కట్టం జేస్తెనే. లోకం సుకపడెటోల్లు సుకవడ్తాండ్రు, కష్టపడేటోల్లు కష్టపడ్తాన్రు. మాకైతె ఏం సుకంలేదు. గా మానబంగాలు, తగులబెట్టడాలు బందైనయి. గాకట్టం లేదు. ఇంతదిని నిమ్మలంగుంటున్నం. ఇగ మంచిరాజ్యం ఇగ ఒత్తదేమొగని యిదివరకైతెరాలె. అప్పటి బాదల్లేవు. అయినబట్టగట్టుకుని ఇంటిలోపల్నె వుంటున్నం. ఆ ఉరుకుడు, పరుగుడులేదు, హాయిగుంటున్నం.
ఈ ఊరుమొత్తం పార్టీలనే వుండిరి. ఈ ఊరు మొత్తం పార్టీయే. ఈ ఊరి మనిషి కండ్లవడ్తనే ఆల్లకు ఇశమోలె కండ్లవడ్దురు. భగభగమండేది. ఊరంత ఒక్కటే పార్టీ అయినసుతగట్లజేసిరి. పోటీల్లేవు ఒకరిమీదొకరికి.
మా బయంగాదు ఏం గాదుగని ఇగ పాటలు బాడవోయినాం. అగొ గాడ ‘పదం’ బాడ్తాన్రు పోదాంబావే అంటె బయిమేనాయె, కొడ్తరనేనాయె. ఇగదాడులై నలబై ఏండ్లకొచ్చెనా. అప్పుడు నా బిడ్డ నా కడుపులున్నది. మా కొమరవ్వ, మా సాయవ్వ అది నెలపిల్ల. నా బిడ్డను దొమ్మాటకిచ్చినం. ఇప్పుడామెకు ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. అందరం బాయిలకాడ్నె వుందుముగద. ఏదన్న పూసవోగుంటె దాసి మొండిచెపుల్తొ వుందుము. దాసిదాసి వాల్లొచ్చిన్నాడె వెట్టుకొందుము. కడెంబిగ్గరుంటె గుంజిన్రు, పీకేసిన్రు. సాకలాయెనని నరికేసిన్రు. నేనేమనను బాంచెనంటెగూడ నరికేసిన్రు. ఆ కుటుంబమంత ఈ బాయి కాన్నే, మా బాయికాన్నే. కొందర్నయితె బతికుండంగనె పూడ్చిపెట్టిన్రు. బూచె ఎల్లయ్యను పూడ్చలేమరి బూచెఎల్లయ్యను! జీవివోక ముందె సొప్పకట్టేసి, అగ్గి పుల్లగీకిన్రు. పెద్ద లింగయ్యను పందులోల్ల బాయికాడ దొరికిచ్చుకుని కోడిపిల్లను గాపినట్టుగాపిన్రు.
గొల్ల మల్లమ్మ :
నా పేరు గొల్ల మల్లమ్మ. అమ్మా దాడప్పుడ్నేను ఒక బిడ్డతల్లిని. రజాకర్లప్పుడ్నేను రాళ్ళురప్పలందిచ్చిన, కష్టపడ్డ. మోకాల్లువలిగినై, దెబ్బల్దాకినైవడ్తె. నానాగందరగోళం ఎన్నో కష్టాలువడ్డం. ఇగయాదికున్నయి ! ఇగ మీరు ఏమన్న సాయం జేస్తెజెయ్యండి. ఇప్పుడు నాకు అరవై ఏండ్లున్నయి. ఇన్నవా… అందరు దూపైగొడ్డోలె వుర్కుతాంటె నీల్లందిచ్చినం ఉర్కుతాంటె ఎరుకేనా ఎన్ననిజెప్పాలమ్మా ! తరాల జెప్పరాని తరాల్నే జరిగినై. గవన్ని ఎట్ల జెప్పొస్తది. ఏదుంటదే అందిచ్చినం. ఇప్పుడు జెప్పరాదమ్మా, జెప్పరాదు ఆ కట్టం. గిట్లజెయమని ఎవరు జెప్పలెమాకు. ఒగలేందిజెప్పేది మాకు. మనల్నిట్ల కాపాడుకోవాలని ఆలోచించుకున్నరు. తెలివిగ జేసుకున్నరుగట్ల. మా బాయిలకాడరాంగనే అగ్గిపుల్లగీసిన్రు, కొట్టంగాలవెట్టిండ్రు, మడుసులసంపిన్రు, అయ్యో అయ్యో అని రొంబొచ్చకొట్టుకోంగనే,…. ఇగ గుడ్డ బట్టలన్ని ఇడిసేసిండ్రు, ఇగ ఆడుండ్రి, ఆడుండ్రి అంటె ఇగ బతుకమ్మలాడిన్రు. ఇగ మా బెగరు మాకేనాయె, మొత్తుకున్నరు. బేగాడ బేగాడై వోయి, మా గుడ్డబట్ట లెక్కడవోయినయో, ఉర్కసాగినం. దండాలు వెట్టుకుంట ఉర్కసాగినం. ఇగ అటువోయిండ్రు. చింతల్లకెల్లి వచ్చినం. రాజక్క జెప్పవేమె? వీల్లబాయికాన్నే. రాజక్క జెప్తాది… సంపినోల్లనే కాలవెట్టిన్రు, కాలవెట్టినోల్లనే సంపిన్రు. మా ఇల్లుసుత కాలవెట్టిన్రు. మా ఊర్లందరిని సంపిన్రు, కాలవెట్టిండ్రు.
గొల్ల బుచ్చమ్మ :
నా పేరు గొల్ల బుచ్చమ్మ. మా ఊర్ల తుర్కోల్లు లేరు. ఒక్కడే దూదేకులోడుండె. మా ఊరు ‘ఆయం’ గొంచవోయి జెప్పిండు. నేనే మొదట్ల జెప్పలే అవ్వ…. అందర్ది గదేకత గిట్లయింది…. మా ఊరికతంత ఒక్కటే…. సంపిండ్రు కాలవెట్టిండ్రు, మానబంగం జేసిండ్రు. ఇగనేనేం జెప్తు, అంతగదే కత. మా కత మాకు జెప్పొత్తాదవ్వ, జెప్పరాదు….
(‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకం నుంచి)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.