అభ్యుదయకరమైన ఆలోచనలకు గవాక్షం

(ఇటీవల మరణించిన సత్తిరాజు రాజ్యలక్ష్మిగారికి భూమిక నివాళి)
సత్తిరాజు రాజ్యలక్ష్మి గారి నుండి ఫోన్‌ వచ్చిందంటే నాకు  చాలా సంతోషంగా వుంటుంది. ఎందుకంటే ఆవిడ చాలా కాలంగా భూమిక అభిమానిగా ఎంతో సహకారమందిస్తున్నారు. కథలపోటీకి ప్రథమ విరాళం ఆవిడ నుండే. భూమిక విషయం మాట్లాడతారని అనుకుంటున్న నాకు ఆవిడ అడిగిన విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘గవాక్షం’ పేరుతో పుస్తకం తీసుకురాదలిచారని, దానికి నేను ముందు మాట రాయాలని కోరారు. అంత పెద్దవారి పుస్తకానికి నేను ముందు మాట రాయడమా? నేను పుట్టక ముందు నుండే రచనా  వ్యాసంగంలో వున్నారు ఆవిడ. స్త్రీవాద ఉద్యమం పురుడు పోసుకోక ముందే ఆవిడ స్త్రీల పక్షపాతిగా అనేక అంశాల మీద వ్యాసాలు, రేడియో ప్రసంగాలు చేసారు. స్త్రీ విద్యకు సంబంధించి చక్కటి విశ్లేషణాత్మక రచనలు చేసారు.
ఒక్కొక్క వ్యాసం చదువుతుంటే నేను క్రమంగా 1950ల నాటి పరిస్థితులలోకి ప్రవేశం చేసానని పించింది. స్త్రీల చదువులు, ఉద్యోగాలు, సామాజిక స్థితిగతులు, స్త్రీల పట్ల వివక్ష, ఎన్నో అంశాల చుట్టూ ఆవిడ రచనలు తిరిగాయి. ఎంతో అభ్యుదయకరమైన ఆలోచనలు రాజ్యలక్ష్మిగారిలో ఆనాడే వుండడం ఆశ్చర్యం గొలుపుతుంది. సాహిత్యపరంగా ఎంతో ప్రముఖమైన కుటుంబ నేపథ్యం ఆవిడలో అభ్యుదయ భావాలను ప్రోది చేసింది. అబ్బూరి రామకృష్ణరావు అబ్బూరి రుక్మిణమ్మల కుమార్తె, అబ్బూరి వరద రాజేశ్వరరావుగారి సోదరి, అబ్బూరి ఛాయాదేవి గారి ఆడబడచు సత్తిరాజు రాజ్యలక్ష్మిగారు. ఈ కుటుంబ నేపథ్యం ఆవిడ రచనల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది.
1935 లోనే ఇంగ్లీషు మీడియం చదువు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎమ్‌.ఏ., ఎమ్‌ ఎడ్‌.  పెద్ద హోదాలో పనిచేసిన అనుభవం. విస్తృతమైన ఉద్యోగానుభవంతో స్త్రీ విద్య మీద చాలా వ్యాసాలు రాసారు. స్వయంగా అనుభవం లోకి వచ్చిన, ఇంటా బయటా పనిచేసిన అనుభవంతో రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
రాజ్యలక్ష్మి గారు ఇంత కాలం ఈ వ్యాసాలను ఎందుకు ప్రచురించలేదో నాకు ఆశ్చర్యంగా వుంది. 1950లో ఆవిడ రాసిన ”బేసిక్‌ విద్యావిధానం” అనే వ్యాసం ఈనాటికీ ఎంతో ప్రామాణికమైంది. ”మూల విద్యావిధానం ముఖ్యంగా జీవితం ద్వారా జీవిత ధర్మాలను సాధించాలని, పిల్లల పరిపూర్ణ వ్యక్తి వికాసం దాని  లక్ష్యమై ఉండాలని” ఆవిడ ఆనాడే రాసారు. ఈనాటి విద్యావిధానం చూస్తున్నపుడు, కేవలం ఉద్యోగాల కోసమే రూపొందించిన పద్ధతిని గమనించినపుడు రాజ్యలక్ష్మిగారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతో అభ్యుదయకరంగా కనబడతాయి. జీవితానికి వెలుగు నివ్వని విద్య, వ్యక్తిత్యాన్ని వికసింపనివ్వని విద్య వ్యర్థమే.
స్త్రీల హక్కులు, ఆర్థికాధికారాలు లాంటి అంశాల మీద వీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతో విప్లవాత్మకంగా వున్నాయి. 1952లో రాసిన ” స్త్రీలు- ఉన్నత విద్య” అనే ప్రసంగ వ్యాసంలో ఇలా అంటారు. ”స్త్రీకి పురుషునితో సమానమైన ఆర్థికాధికారం చట్ట సమ్మతం కావాలి. హక్కులు లేని బాధ్యతలు నిర్వహించడం దుర్లభమే కదా! ఆత్మగౌరవం కల ప్రతి స్త్రీ స్వీయ క్షేత్రంలో స్వంత బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించి స్వయం ప్రకాశమానురాలు కావాలని వాంఛిస్తుంది.”
”సమాన ప్రాతినిధ్యం” అనే వ్యాసంలో స్త్రీల రాజకీయ ప్రాతినిధ్యం గురించి చర్చిస్తూ , ఆనాటి పార్లమెంటులో ” హిందూ వారసత్వ బిల్లు” మీద చర్చ జరుగుతున్న సందర్భంలో  పురుషులు ఆ బిల్లు మీద మాట్లాడిన పద్థతి మీద స్పందిస్తూ ఇలా రాసారు. ”పార్లమెంటు సభ్యులంతా స్త్రీలే అయితే అదే చర్చ ఎలా సాగి వుండునో ఊహించుకోండి. సానుభూతి కోసం యాచించకుండా ఒక సహజమైన హక్కుకోసం వారు చర్చించి వుండేవారని నిస్సందేహంగా భావించవచ్చు. దీనిని బట్టి పార్లమెంటులో జరిగే ముఖ్యమైన నిర్ణయాలు కేవలం స్త్రీలే నిర్ణయిస్తే ఉండే దృక్పథం కేవలం పురుషులే నిర్ణయించే దృక్పథానికి తప్పకుండా భిన్నంగా వుంటుందని ఒప్పుకోవాలి” అంటూ కుండబద్ధలు గొట్టినట్లు చెప్పారు. 1956 లో రాజ్యలక్ష్మిగారు రాసిన స్థితిలోనే ఈనాటికీ స్త్రీల రాజకీయ ప్రాతినిధ్యం వుండడం, 33% బిల్లు ఇంకా గాఢ నిద్రలోనే మగ్గడం మనం చూస్తూనే వున్నాం. రాజకీయాల్లో స్త్రీల ప్రాతినిధ్యం పెరగాలని ఆవిడ ఎన్నో సంవత్సరాల ముందే రాయడం ఇక్కడ గమనించాలి. అంతేకాదు స్త్రీల రాజకీయ ప్రవేశానికి పురుషులు చెప్పే అభ్యంతరాలు ఏమిటో ఆవిడ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు.
”రాజకీయాధికారాలు మరిగిన పురుషులు ఈ ప్రతిపాదనకు చాలా ఆక్షేపణలు చెప్పుతారు. స్త్రీలు  విద్యలో వెనకబడి వున్నారనీ, వారికి ప్రాపంచికానుభవం తక్కువనీ అనడం ఈ అక్షేపణలలో ముఖ్యమైనవి. కొంచం చరిత్ర పరిశీలించి మన దేశంలో ఆగష్టు 15, 1947కు వెనుక పరిపాలించిన వారి రాజనీతిని గమనిస్తే తమ స్వాధీనంలో ఉన్న వలస దేశీయులకు స్వాతంత్రమివ్వడానికి ఏలిక జాతులు చెప్పిన ఆక్షేపణలు కూడా సరిగ్గా ఇవే”.
స్త్రీలు రాజకీయాల్లో ప్రవేశిస్తే తమ పీఠాలు కదులుతాయన్నదే రాజకీయ నాయకుల అసలు భయమని, అధికారం చలాయించడం మరిగిన వారు అంత తేలికగా వదులు కోరనే విషయం 33% బిల్లును తొక్కి పెట్టడం ద్వారా రాజకీయం నెరుపుతున్న పురుషుల అసలు రంగును ఆవిడ 1956లోనే స్పష్టంగా అర్థం చేసుకున్నారు
ఆడపిల్లల్ని, మగపిల్లల్ని సరిసమానంగా పెంచాలని, మగవాళ్ళు వంట చేస్తే తప్పేంటి అంటూ రాసిన ”స్త్రీల సమస్యకు కారకులెవరు?” వ్యాసం చాలా విలువైంది. ”స్త్రీలలో ఆత్మస్థైర్యం, మనో నిబ్బరం పెంపొందించాలంటే తల్లిదండ్రులు, తమ పిల్లలను, ఆడ, మగా అనే భేద భావం మరిచి, సమంగా పెంచాలి. ”భర్త వంట చేస్తే తప్పేముంది. మగవాడు వంట చేస్తే  చేతులు కాల్చుకోవడమేమిటి? మగవాడే కాదు, ఆడదైనా ఆఫీసు నుంచి అలిసిపోయి వస్తే ఒక గ్లాసెడు మంచి నీళ్ళు, ఒక కప్పు టీ కూడా ఇస్తే తప్పేముంది?” రాజ్యలక్ష్మి గారిలో స్త్రీవాద భావాలు పుష్కలంగా వున్నాయి. ఆ భావాలు ఎన్నో అంశాల్లో వెల్లడయ్యాయి. కట్నం పోసి కొనుక్కున్న భర్త మీద భార్యకే అన్ని హక్కులుండాలని తీర్మనిస్తూ, ”మరి పశువును కొనుక్కున్న వారికే కదా దాని పాల మీద హక్కులన్నీను” అంటారు. ”మహిళాలోకం” వ్యాసంలో. అంతేకాదు ఆడపిల్లల్ని అణుకువగా, వొద్దికగా పెంచడంవల్ల వాళ్ళ వ్యక్తిత్వం దెబ్బతింటుందని చెబుతారు.
”ఆడపిల్లలు అణుకువగా వుండాలని, గట్టిగా  హాయిగా నవ్వనివ్వరు, పరుగెత్తనివ్వరు. ఈ పెంపకం వలన ఆడపిల్ల వ్యక్తిత్వం తప్పకుండా దెబ్బతింటుంది.” అని ఢంకా బజాయించి చెప్పారు. స్త్రీల అణిచివేతకు సంబంధించి, దురాచాలకు సంబంధించి ఎన్నో విషయాలు రాసారు. భర్త చనిపోయిన స్త్రీల పట్ల ఎంత దుర్మారంగా సమాజం ప్రవర్తిస్తుందో చాలా ఆర్ద్రంగా రాసారు. పెళ్ళి చూపుల తంతు గురించి, 1956లోనే విస్తరించిన మేరేజీ బ్యూరోల గురించి వ్యంగ్యంగా రాసారు.
పిల్లల చదువులు, పెంపకం, వారిపై పరిసరాల ప్రభావం మొదలైన అంశాల గురించి చాలా వ్యాసాలు రాసారు. పిల్లలు-రేడియో అనే వ్యాసంలో బాల సాహిత్య ఆవశ్యకత గురించి చక్కగా వివరించారు. ”చిన్న పిల్లల సాహిత్యం అంటే పెద్దల సాహిత్యాన్ని చిన్న పదాలలోను, సులభమైన శైలిలోను రాయడం గాదు. విద్యా సంబంధమైన అన్ని విషయాలనూ వస్తువులుగా తీసుకుని రూపకాలూ, కథలూ, కథనాలూ, గేయాలూ పిల్లల మానసికావస్థల కనుకూలంగా రచించాలి.” దీన్ని ఈవిడ 1954లో రాసారనే విషయం మర్చిపోకుండా ఇప్పటికీ సరైన బాలసాహిత్య సృజన జరగడం లేదనే అంశాన్ని మనం గమనించాలి.  ఉద్యోగం చేసే స్త్రీల గురించి, వీరు చాలానే రాసారు. బయటకెళ్ళి ఉద్యోగాలు చేసే స్త్రీల కనుగుణంగా సాంఘిక జీవనం పునర్‌వ్యవస్థీకరింపబడాలనే విప్లవాత్మక సూచన ఈవిడ కలం నుండి 1956లో వెలువడడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. రష్యాలాంటి దేశాలలో ఉద్యోగినుల కోసం చేసిన  ప్రత్యేక ఏర్పాట్లను పలుచోట్ల ప్రశంసించారు.
”స్త్రీలు-ఉద్యోగాలు” అనే వ్యాసంలో ”ఈనాటి మానవ సంఘంలో వచ్చిన మార్పులనుసరించి మన సాంఘిక జీవనం కూడా స్త్రీల దృష్ట్యా పునర్వ్యవస్థీకరించబడాలి”. మనం ఈ రోజు ఏదైతే స్త్రీల దృష్టికోణం, స్త్రీవాద దృష్టికోణం నుంచి సమాజాన్ని చూడాలని ప్రతిపాదిస్తున్నామో దాన్ని ఏభై ఏళ్ళ కింద చెప్పడం ఆవిడ విజన్‌ని, అభ్యుదయ దృక్పథాన్ని తేట తెల్లం చేస్తుంది. ఇంటా బయటా పనిభారంతో నలుగుతున్న ఈనాటి ఉద్యోగినులను గమనిస్తే, బయట కెళ్ళి పనిచేస్తున్న స్త్రీలకు అనుగుణంగా మార్పు చెందని కుటుంబ వ్యవస్థని గమనిస్తే, ఇంకా ఇంటిపని, వంటపని, పిల్లల పని స్త్రీలే చెయ్యాల్సిరావడం చూస్తుంటే దు:ఖం కలుగుతుంది. పెద్ద చదువులు చదివి గొప్ప హోదాల్లో వుంటున్న స్త్రీలు కూడా ఈ అంశంలో మాములు గృహిణుల్లాగానే మిగిలిపోవడం, తమ ప్రమోషన్‌లను , ప్రమోషన్ల మీద వచ్చే బదిలీలను, తమ నైపుణ్యాలను పెంచుకునే అవకాశాలను కోల్పోవడం చూస్తుంటే స్త్రీల ఉద్యమం ఈ అంశమై ఎక్కడ వైఫల్యం చెందిందో విశ్లేషించుకోవాల్సి వస్తుంది. స్త్రీలు వ్యక్తులుగా కన్నా ఉత్తమ గృహిణుల కిరీటాలనే మోయాల్సి రావడం అత్యంత విషాదకరమైన విషయం. రాజ్యలక్ష్మి గారు ప్రతిపాదించిన సంఘ పునర్వ్యవస్థీకరణ జరిగివుంటే, ఇంటి నిర్వహణ స్త్రీ పురుషులిద్దరూ సమానంగా పంచుకుంటే మన సమాజం మహిళల పరంగా మరింత మెరుగైనదిగా భాసించేది.
సత్తిరాజు రాజ్యలక్ష్మి గారు ‘గవాక్షం’ వ్యాస సంకలనంలో ఇంకా చాలా విషయాలు రాసారు. వీరు విద్యావేత్త కాబట్టి ఎక్కువ అంశాలు విద్యమీద, ఉద్యోగిని కాబట్టి ఉద్యోగాలు చేసే స్త్రీల సమస్యల మీద  రాసారు. నిత్యం పిల్లలతో మెలిగే వృత్తిలో వుండడం వల్ల పిల్లల అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. స్త్రీ పక్షపాతి కాబట్టి స్త్రీల అంశాలు చాలానే రాసారు. వారి భావాలు విప్లవాత్మకంగా అభ్యుదయంతో నిండివున్నాయి. ఈ వ్యాసాలను ఒకేసారి చదవడం నాకు మంచి అనుభవం. ఇంత చక్కటి రచన అచ్చులోకి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడం ఆశ్చర్యంగా వుంది. ఇప్పటికైనా వెలుగులోకి రావడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇంత పెద్దవారి పుస్తకానికి ముందు మాట రాస్తానని నేను ఏనాడు కలకూడ కనలేదు. నాకీ అవకాశాన్ని ఇవ్వడం వెనుక నా పట్ల వారికున్న అభిమానమే కారణం అయ్యుంటుంది. భూమిక మీద రాజ్యలక్ష్మిగారి కున్న ప్రేమ కూడా ఒక కారణం.
(‘గవాక్షం’, వ్యాసాలూ, ప్రసంగాలూ సత్తిరాజు రాజ్యలక్ష్మి పుస్తకం నుండి)

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో