కార్ల్‌ మార్క్‌స్‌ కీర్తి వెనక…

అబ్బూరి ఛాయాదేవి
ప్రసిద్ధి చెందిన ప్రతి పురుషుడి వెనకా ఒక స్త్రీ ఉంటుందన్న ఇంగ్లీషు నానుడి ఉన్నట్లు, కార్ల్‌మార్క్స్‌ కీర్తి వెనక కూడా అతని భార్య జెన్నీ ఉంది. మార్క్స్‌ రచన ‘దాస్‌ కేపిటల్‌’ ప్రసిద్ధి చెందడానికి అతని భార్య ఎంత వరకు దోహద పడిందో, వారి వైవాహిక జీవితం ఎలా సాగిందో, వాళ్ళిద్దరికీ మొదట పరిచయం ఎలా ఏర్పడిందో- మొదలైన విషయాల గురించి మరింత పరిశోధన చేసి, మేరీ గేబ్రియల్‌ గత సంవత్సరం వెలువరించిన ”లవ్‌ అండ్‌ కేపిటల్‌” అనే పుస్తకం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది.
జెన్నీ వాన్‌ వెస్ట్‌ ఫాలెన్‌ కార్ల్‌ మార్క్స్‌ కన్న నాలుగేళ్ళు పెద్దది. జెన్నీ ప్రష్యా ధనిక వర్గానికి చెందిన స్త్రీ. మార్క్స్‌ మధ్య తరగతి జ్యూయిష్‌ కుటుంబానికి చెందినవాడు. మార్క్స్‌ స్కూల్లో చదువుతున్నప్పుడు అతని స్నేహితుడి సోదరిగా పరిచయమైంది జెన్నీ. పూర్తి పేరు జొహన్నా బెర్తా జూలీ జెన్నీ వాన్‌ వెస్ట్‌ఫాలెన్‌, అందరూ జెన్నీ అని పిలిచేవారు. వాళ్ళు పెరిగిన ఊరు ట్రీర్‌లో అందరికన్నా అందమైన అమ్మాయి అని చెప్పుకునే వారు. ఉన్నత పరిపాలనాధికారి కుటుంబానికి చెందిన జెన్నీని- ఒక బేరన్‌ కూతురు మధ్య తరగతికి చెందిన ఒక జ్యూయిష్‌ సంసారి కొడుకుని తన కన్న నాలుగేళ్ళు చిన్నవాడిని ప్రేమించడం ఆ రోజుల్లో విడ్డూరం. కానీ జెన్నీ బాగా తెలివైనది, స్వేచ్ఛామనస్విని. మార్క్స్‌ లోని మేధావి లక్షణాలకు ముగ్ధురాలైంది. సంప్రదాయబద్ధంగా తండ్రి కుదిర్చిన పెళ్ళి కొడుకుని- 1836లో ‘ప్రదానం’ అయినప్పటికీ, అతన్ని కాదని, మార్క్స్‌తో రహస్యంగా ప్రేమ సంబంధం ఏర్పరచుకుంది. మార్క్స్‌ ఈ విషయమై తన తల్లిదండ్రులతో గొప్పగా చెప్పుకున్నాడు కాని, జెన్నీ తండ్రి కుటుంబానికి దాదాపు ఒక సంవత్సరం వరకూ తెలియనివ్వలేదు- స్థిరత్వం, సంపదా లేని మార్క్స్‌తో సంబంధాన్ని జెన్నీ తండ్రి అంగీకరించడన్న భయంతో.
దాదాపు ఒక సంవత్సరం పాటు పెళ్ళికాకుండానే శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఆ సమయంలో కొంతకాలం మార్క్స్‌ వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు ఇద్దరూ ప్రేమ పూరితంగా ఉత్తరాలు రాసుకునేవారు. జెన్నీ దగ్గర నుంచి ఉత్తరం రావడం కొద్దిగా ఆలస్యం అయితే, మార్క్స్‌ అనుమానించేవాడు- తనపై జెన్నీకి ప్రేమ తరిగి పోయిందేమోనని. అతని దగ్గరనుంచి ఉత్తరం రాకపోతే జెన్నీ ఆందోళన చెందేది- అతనికి వేరే ఎవరితోనైనా సంబంధం ఏర్పడిందేమోనని. పెళ్ళయిన తరవాత కూడా వాళ్ళ ఉత్తర ప్రత్యుత్తరాలకు మధ్య ఎన్నో నెలలు గడిచిపోయేవి. 1840-1860ల  మధ్య సాగిన ఉత్తరాలు అవి. మార్క్స్‌ తన వృత్తి, విప్లవ కార్యకలాపాలతో జెన్నీకి దూరంగా ఉండవలసి వచ్చేది. ఈ ఉత్తరాలు కొన్ని ”మార్క్స్‌ ఎంగిల్స్‌ కలెక్టెడ్‌ వర్క్‌ ్స సంకలనాల్లో ముఖ్యంగా 1, 38-41 సంపుటాల్లో దొరుకుతాయి. జెన్నీ ఉత్తరాలు ఎంతో వివరంగా ఉంటాయి ఆమెలో కలిగిన భావాలన్నిటినీ వ్యక్తీకరిస్తూ.
మార్క్స్‌ పెళ్ళి చేసుకున్న కొత్తల్లోంచీ జెన్నీని మేధావిగా తనతో సమానంగా పరిగణించేవాడు. అది కేవలం ‘ప్రేమ’ పేరుతో కాదు. మేధాపరమైన విషయాల్లో మార్క్‌ ్స, ప్రజ్ఞావంతురాలైన జెన్నీ నిర్ణయాలు తీసుకునే నేర్పుపై గౌరవం చూపించేవాడు. నిజానికి మార్క్స్‌ జీవితాంతం వరకూ తనతో పాటు కలిసి వ్యవహరించిన ఎంగిల్స్‌ని కాక, అదే గౌరవంతో చూసిన వ్యక్తి జెన్నీ మాత్రమే అని అంటుంది వారి జీవిత చరిత్ర రాసిన మేరీ గేబ్రియల్స్‌. ఎంగిల్స్‌ మార్క్స్‌ని మేధాపరంగా అర్థం చేసుకుని సహకరించగా, జెన్నీ మార్క్‌ ్సకి మానవతా దృష్టిని కూడా అలవరిచింది అని అంటుంది మేరీ గేబ్రియల్‌.
జెన్నీ తన తండ్రి విప్లవాత్మక రాజకీయ భావాలను కొంతవరకు పుణికి పుచ్చుకుంది. తను పుట్టి పెరిగిన సంపన్న వాతావరణాన్ని వదులుకుని మార్క్స్‌తో సామాన్య జీవితాన్ని గడపటానికి వెనుదీయలేదు. కానీ ఎంతో దారిద్య్రాన్నీ, కష్టాల్నీ ఎదుర్కోవలసి వస్తుందని కూడా ఊహించి ఉండదు. పాత్రికేయ రచయితగా   మార్క్స్‌ సంపాదన అంతంత మాత్రమే. సైద్ధాంతిక, తాత్త్విక రచనలవల్ల వచ్చే ప్రతిఫలం గురించి చెప్పనక్కరలేదు. ప్రచురణ కర్తలకి ఇచ్చిన సమయాన్ని ఎప్పుడూ పాటించలేకపోయే వాడుట కార్ల్‌ మార్క్స్‌. పుస్తకం పూర్తి చెయ్యాలన్న ఆత్రుత కన్న, ఇంకా ఎన్నో విషయాలు పరిశోధించాలనే తపన ఎక్కువగా ఉండేది మార్క్స్‌కి. జ్ఞాన సముపార్జనతో పాటు తీవ్ర రాజకీయ కార్యకలాపాల్లో తల మునకలుగా ఉండటంవల్ల ప్రభుత్వాధికారులు అతన్ని నిరోధించడానికి యూరోప్‌లోని వివిధ దేశాల్లో వెతికి పట్టుకునేవారు. మార్క్స్‌ అనారోగ్యంతో బాధ పడుతూ ఉండేవాడు.
మార్క్స్‌ ఒక పేపర్లో పనిచేయడానికి పారిస్‌కి భార్య జెన్నీతో పాటు వెళ్ళాడు. అప్పుడు మార్క్స్‌ వయస్సు 25, జెన్నీ వయస్సు 29. వాళ్ళు పారిస్‌ నగర వాసులతో, ముఖ్యంగా తీవ్రవాదులతోనూ, ప్రజాస్వామ్య వాదులతోనూ కలిసి మెలిసి తిరిగేవారు. ఇద్దరూ ”దంపతులు” గా పరిచయమయ్యారు. ఆమె అందం, తెలివితేటలూ పారిస్‌లోని ప్రఖ్యాత స్త్రీలకు తీసిపోవని మార్క్‌ ్స గర్వపడేవాడుట. మార్క్స్‌ విప్లవాత్మకంగా రాసిన వ్యాసాలు కొంతకాలం పాటు నిషేధానికి గురి అయ్యాయి. తరవాత, పారిస్‌లో ఆ నిషేధాన్ని తొలగించడం జరిగింది. అప్పటికి జెన్నీ గర్భవతి. ఆ దంపతుల ఆర్థిక పరిస్థితి విషమంగా ఉండేది. వారి మొదటి బిడ్డ 1844, మే 1 న జన్మించింది. ఆ పిల్లకి తల్లి పేరే పెట్టారు- ‘చిన్న జెన్ని’ అని. ఆ పిల్ల పోలిక మాత్రం తండ్రిది. పిల్లల పెంపకంలో ఇద్దరికీ అనుభవం లేదు. ఆ పిల్ల ఒకసారి ప్రమాద స్థితికి చేరుకున్నప్పుడు పొరుగున ఉన్న స్త్రీ సహాయంతో పిల్లని రక్షించుకోగలిగారు. చివరికి ఇక లాభం లేదని, ట్రీర్‌లో ఉన్న తన పుట్టింటికి తీసుకు వెళ్ళింది తన బిడ్డని. జెన్నీ తల్లి మనవరాలి సంరక్షణ బాధ్యత తీసుకునేది. కానీ జెన్నీ ఆందోళనతో ఉండేది- తనకి మార్క్‌ ్సతో సంబంధం ఏర్పడి ఏడాది అవుతున్నా ఇంకా పెళ్ళి కాలేదు, మార్క్‌ ్స తనకి దూరంగా పెద్ద నగరంలో ఉంటూ వేరే సంబంధంలో ఇరుక్కుంటాడేమోనని. కానీ మార్క్‌ ్స తన రచనా వ్యాసంగంలోనూ, రహస్య సాంఘిక కార్యకలాపాల్లోనూ మునిగి ఉండేవాడు వేరే ధ్యాస లేకుండా. జెన్నీ మార్క్‌ ్సకి ఉత్తరాలు రాస్తూండేది తమ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ. అతను అనుసరిస్తున్న బాట గురించి ఆందోళన పడేది. కానీ, ఒక ఉత్తరంలో తనే, ”మార్క్‌ ్స అనుసరిస్తున్న విప్లవాత్మక విధానం గురించి అనుమానించే వారికి ప్రతి చోటా ఏర్పడుతున్న భూకంపాల చిహ్నాలు కనిపించడం లేదా? దేవాలయాలూ దుకాణాల పునాదులపై నిర్మించిన సమాజాన్ని రూపుమాపే పరిస్థితులు కనిపించడం లేదా?” అని రాసింది. ఆ ఉత్తరాన్ని మార్క్‌ ్స ‘వోర్‌ వార్ట్స్‌’ అనే పత్రికకి ”ఒక జర్మన్‌ వనిత” రాసినట్లు సంతకం చేసి పంపించాడు. అది 1844 ఆగస్టు 10వ తేదీన ప్రచురితమైంది. మార్క్‌ ్స మొదటిసారి ఆ పత్రికకి రాసిన తరవాత, జెన్నీ మొదటి రచన ప్రచురితమైంది. ప్రష్యన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్రాన్స్‌ నుంచి వచ్చే పత్రిక అదొక్కటే అవడం వల్ల, ప్రష్యన్‌ ప్రభుత్వం దృష్టికి వచ్చి, ఫ్రెంచ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చింది. ఆ పత్రిక సంపాదకుణ్ణి రెండు నెలలపాటు జైల్లో పెట్టడం జరిగింది. దాని ప్రభావం తక్కిన పాత్రికేయులపై కూడా పడింది. ఆ పరిస్థితుల్లో జెన్నీ పారిస్‌కి తిరుగు ప్రయాణం పెట్టుకుంది- భర్త ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు అతని పక్కనే తను రక్షగా ఉండాలని. జెన్నీ ఉత్తరం ఆ పత్రికలో పడిన తరవాత ఎంగిల్స్‌ మార్క్‌ ్స జీవితంలోకి ప్రవేశించి జీవితాంతం అతని సంరక్షకుడిగా, సహకార్యకర్తగా, సహ రచయితగా ఉన్నాడు.
మార్క్‌ ్స సాధారణంగా ఇతరులతో వ్యవహరించేటప్పుడు, అతని అభిప్రాయాలతో ఏకీభవించనప్పుడు అసహనం చూపించడం, వాదించడం, అహంకారాన్ని ప్రదర్శించడం చేసేవాడుట- ముఖ్యంగా, యూరోప్‌లోని వివిధ పట్టణాల్లో సహకార్యకర్తలతో కలిసి తాగుతూ మాట్లాడుకునేటప్పుడు వాగ్యుద్ధాలు అప్పుడప్పుడు కొట్లాటలకు కూడా దారి తీసేవిట. కానీ, వ్యక్తి గతంగా చాలా ప్రేమాస్పదుడూ, సహృదయుడూ అనిపించేవాడుట- అనారోగ్యంతోనూ, ఆందోళనతోనూ నిద్రలేక బాధపడినప్పుడు తప్ప.
జెన్నీ ఎప్పుడూ మార్క్స్‌కి అండగా నిలిచింది. ”మనకొచ్చిన కష్టాలకు నేను కుంగిపోలేదు. జీవితాన్ని ఎంతో ఆనందంగా గడిపినవాళ్ళలో నేను ముఖ్యురాలిని – ఎందుకంటే, ప్రియమైన నా భర్త నా జీవితంలో ప్రధానమైనవాడూ, ఎప్పుడూ సన్నిహితుడూ కాబట్టి.” అని రాసింది ఒకసారి మార్క్స్‌కి రాసిన ఉత్తరంలోనే. భార్యాభర్తలు విడివిడిగానూ, కలిసీ కొలోన్‌ నుంచి పారిస్‌కీ, అక్కణ్ణించి బ్రస్సెల్స్‌కీ – అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ తిరిగినప్పటికీ, చివరికి లండన్‌లో స్థిరపడ్డారు జీవితాంతం వరకూ. వాళ్ళ హౌస్‌కీపర్‌ లెన్‌చెన్‌కి మార్క్స్‌వల్ల ఫ్రెడ్డీ అనే కొడుకు పుట్టాడని చెప్పుకున్నా, జెన్నీ మార్క్స్‌ల వైవాహిక జీవితం నిరాటంకంగా సాగింది. వారి పిల్లల్లో నలుగురు పోవడమే వారికి ఎక్కువ దుఃఖం కలిగించిన విషయం. వాళ్ళిద్దరికీ పుట్టిన మొత్తం ఏడుగురు పిల్లల్లో ముగ్గురు మగపిల్లలతోపాటు ముందుగా నలుగురు పిల్లలు మరణించారు. రెండవకొడుకు మరణాన్ని మార్క్స్‌ తట్టుకోలేకపోయాడు. అతన్ని ఓదార్చబోయిన వాళ్ళతో, ”నా కొడుకుని నాకు తెచ్చి ఇవ్వగలరా!” అని నిలదీస్తూ విలపించాడుట.
పదహారు సంవత్సరాలు ఆలస్యంగా తన విశిష్ట రచనని పూర్తిచేసి ప్రచురణకర్తలకు అందజేయడంవల్ల దానిమీద వచ్చే డబ్బుని ప్రచురణకర్తలు మార్క్స్‌ పిల్లలకే అందజేయవలసివచ్చింది. జెన్నీ 1881లోనూ మార్క్స్‌ 1883లోనూ మరణించారు. చివరికి ఇద్దరు ఆడపిల్లలు టుస్సీ, లారా – ఇద్దరే అప్పటికి బతికి ఉన్నారు. ఇద్దరూ వివాహితులు. ఎంగిల్స్‌ తన ఆస్తిలో ముఖ్యభాగం వాళ్ళకి రాసిచ్చాడు. కానీ మార్క్స్‌ ఉద్యమదీక్ష వాళ్ళని కూడా పట్టుకుంది. ఇద్దరు కూతుళ్ళూ ఆత్మహత్య చేసుకున్నారు – టుస్సీ 1897లోనూ, లారా 1911లోనూ. ఆ ఇద్దరు కూతుళ్ళు ఉన్నప్పుడే మార్క్స్‌ మొదటి కూతురు జెన్నీ పోలీసుల క్రూరత్వాన్ని ఎదుర్కొంటూనే 1883 జనవరిలో మరణించింది. ఆమె పోయినప్పుడు తండ్రి మార్క్స్‌తోపాటు యూరోప్‌లోనూ, అమెరికాలోనూ వందలవేలమంది కార్మికులు దుఃఖించారుట. తల్లి జెన్నీ ఆ దుఃఖాన్ని పంచుకునేందుకు లేకుండా రెండేళ్లకి ముందే పోయింది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.