తలపోతల జిలుగువెలుగులో కొత్త ఒక రోతా…?

కొండేపూడి నిర్మల
ఈ మధ్య మా ఎకెటిపి హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. వేరే ఏదో పనిమీద అక్కడే వున్న నేనూ ఎగురుకుంటూ వెళ్ళాను. గత వారం రోజులుగా విజయవాడలో మా తమ్ముడు శ్రీను వాడి స్నేహితులు ఆ కార్యక్రమానికి హడావిడి చేస్తూనే వున్నారు. వరసాగ్గా రెండు దినపత్రికల్లో ఆ చిన్న మునిసిపల్‌ స్కూలు పేరు జిల్లా ఎడిషన్లో రావడం మాకందరికీ బోలెడంత గొప్పగా కూడా వుంది.

1951-2002 వరకు అందులో చదివిన విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఆ కార్యక్రమానికి అరవైలు దాటిన సీనియరు సిటిజన్సే ఎక్కువమంది వచ్చారు. బాబూరావు మేడ కొండ గుర్తు పెట్టుకున్నా కూడా స్కూలు సందు ఏదో నేనసలు గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే మెయిన్‌ గేట్‌ మూసేశారు. అక్కడ చాలా స్థలం కబ్జా అయిందిట. ఒక ఇ సేవ సెంటరు, ఇంకేవో షాపులు కనిపించాయి. వెనకవైపు అంటే ఇదివరకు మేము ఆడుకునే ఆట మైదానం వేపున ప్రధాన ద్వారం తెరిచారు. మామూలుగా అక్కడ సెవెన్త్‌ క్లాసు వరకూ చదివే పిల్లలు దూరిపారిపోయేలాగానూ, పెద్ద క్లాసు పిల్లలయితే ఎక్కి పారిపోయేలాగానూ సదుపాయంగల ఒక చిన్న ఇనప గేటు వుండాలి. ఇప్పుడు అక్కడ హెడ్‌ మాస్టరు రూం వుంది. హెడ్‌ మాస్టరు అని రాసి వున్న బోర్డులో హెడ్‌ అనే మాటకీ మాస్టరు అనే మాటకీ మధ్య లెస్‌ అని రాసేవాళ్ళం. ప్రతిరోజూ ప్యూన్‌ జీవరత్నాన్నీ పిలిపించి అది తుడిపించడంతో ఆయన దినచర్య మొదలయ్యేది. ఎవర్రా అది రాసిందీ…? అని ఉదయ ప్రార్థనకు తర్వాత అసెంబ్లీలో ఎంత గర్జిస్తే మాత్రం చెప్పడానికి మేమేమయినా చెవిలో పూలు పెట్టుకున్నామా ఏమిటి…? కిక్కురుమనేవాళ్లం కాదు. ఒకసారి ఇన్స్పెక్షన్‌ చెయ్యడానికి వచ్చిన వాడు కూడా అది చూసి నవ్వుకున్నాడు. ఇప్పుడు మైదానం చుట్టుతా వలయాకారంలో నిలువెత్తు గోడలున్న తరగతులు వున్నాయి. మేము చదివినప్పుడు క్లాసులన్నిటికీ మొండి గోడలే వుండేవి. అచ్చమైన పారదర్శకత అక్కడ కనబడేది. మనం మనకంటే పెద్ద క్లాసు పాఠాలు అడ్వాన్సుగా వినెయ్యచ్చన్నమాట. ఎవరూ పట్టించుకోరు. మేం రోజు టిఫిను బాక్సులు కడుక్కుని దోసిళ్ళనిండా నీళ్ళు తాగే పంపుజాడలేదు. అవే నీళ్లలో ఇప్పుడు కలరా, మలేరియా, డెంగూ లాంటి క్రిములు కలిసి ప్రవహిస్తున్నాయట. అందుకని కనెక్షన్‌ తీసేసి వూరుకున్నారు. స్కూలంతా ఎండ తగలకుండా షామ్యానా కట్టినా గాని బ్లేజ్‌ వాడ వేడి సెగలు కక్కుతోంది.. ”కొప్పున పూలెట్టుకొని బుగ్గన చెయ్యేసుకుని వీధంటా నే వెడుతుంటే, కెవ్‌… కేక” పాట కాసేపు ఆపేసి ఎవరో మిమిక్రీ చెయ్యడం తెరిపిగా అనిపించింది. పూర్వ విద్యార్థుల్లో ఇప్పుడు హైకోర్టు జడ్జ్‌, సినిమా డైరెక్టరు, ఎమ్మెల్యే స్థాయివారు మాత్రమే కాక గాయకులు, నాట్యగురువులు కూడా వుండటం ఆనందదాయకంగా వుందని నిర్వాహకుడు ఉపన్యాసం ఇస్తున్నాడు. అవాళ్టి భోజనం, గురుసన్మానంలాంటి ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకున్నారట. ఒక విద్యార్థి అయితే అమెరికా నుంచి ప్రతి సంవత్సరం పదో క్లాసులో వున్న పేద విద్యార్థులకోసం ఫీజులు పంపిస్తున్నాడు. తన పేరు మాత్రం ఎవ్వరికీ చెప్పకూడదని షరతు విధించాడట.

అప్పట్లో మేం ముద్దుపేర్లు (నిక్‌ నేమ్స్‌) పెట్టి గోలచేసిన ఎంగిలి వక్కలు, పుచ్చువంకాయలు, బుంగమూతి గుండు కృష్ణమూర్తి, సోడాబుడ్డి కళ్లద్దాల మాస్టార్లు ఎవరూ నాకు కనిపించలేదు. బహుశా కాల ప్రవాహంలో కలిసిపోయి వుంటారు. అవధాని మాస్టారుకీ, ఉషాటీచరుకీ ఇంకా ఒకరిద్దరికీ సన్మానం జరిగింది. అందరికీ ఇష్టమైన లలితాటీచర్‌ ఈ మధ్యే కన్నుమూసారు.. ఆ విషయం అక్కడి వాళ్లతో చెబితే దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆడపిల్లలు ఎక్కువ సంఖ్యలో గేమ్స్‌లోకి రావడానికి ఆవిడే కారణం. మధ్యతరగతి ఆడపిల్లగా వాళ్ళ నాన్న హోమియో డాక్టరుగా రిటైరయిన దగ్గర్నించీ ఇంటి బాధ్యతే కాక చెల్లెళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అయాకే తన గురించి ఆలోచించుకుంది. పెళ్ళి కానందుకు కూడా ఆవిడ వివక్షకు గురయింది. అప్పట్లోనే అంతులేని కథ అనే సినిమా జయప్రద నాయికగా విడుదలయింది. నా కళ్ళకి ఆవిడే నిజ నాయికలా కనిపించేది. పిల్లలతో ఉషారుగా, స్నేహంగా వుండటం ఆవిడ ఇంకో ప్రత్యేకత. అయితే పెత్తనమో, లేకపోతే వాత్సల్యమో తప్ప ఇంకేమీ ఎరగని మాకు ఆవిడ ఒక రోల్‌ మోడల్‌గా నిలబడింది.

ఏ బ్యాచ్‌కి ఆ బ్యాచి పేర్లు రాసి గదులు కేటాయించారు కానీ, కరెంటు లేకపోవడంతో అందరం మైదానంలో వున్న కుర్చీల్లోనే కూచున్నాం. కొత్త తరం పిల్లలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. పాత తరం వాళ్ళు అంకతంటే ఉత్సాహంగా కబుర్లు పోగేసుకుంటున్నారు. ఎన్నాళ్లనుంచి ఎదురుచూస్తున్నారో గానీ, అందరికంటే వాళ్ళే ముందు వచ్చారు.

ఒక తలపండిన ముసలమ్మ ఇంకెటో తిరిగి చూస్తున్న ఇంకో ముసలమ్మ కళ్ళు మూసి ”నేనెవరో చెప్పవే చూద్దాం” అని అడిగింది.

ఆవిడ కూడా బుర్రకి పదును పెట్టి ఆలోచిస్తూ, ”ఎవరబ్బా రాజేశ్వరేనా” అని అడిగింది.

”అంతేలేవే నీకు దానిమీదున్న ప్రేమ నామీద లేదు” అలిగినట్టు బుంగమూతి పెట్టి చేతులు తోసేసింది.

గబుక్కున వెనక్కి తిరిగిచూసిన మొదటి ఆవిడ ”ఒసినీ నువ్వా కాముడూ, ఆ మధ్య నిన్ను గురించి ఏదో చెడు వార్త విన్నానే…” అని ఆపేసింది.

”అవున్లేవే, ఆ రెండోదానికి పురుడు పోసివచ్చాక హటాత్తుగా ఒకరోజు కళ్ళూ తిరిగిపడిపోయా. బ్రెయిన్‌ హేమరేజ్‌ అన్నారు. వారంపాటు కోమాలో వున్నా… అసలు చచ్చేపోతాననుకున్నారు మావాళ్ళంతా. వాళ్ల పప్పులేంవుడకలా అంచేత బతికేశా…” అని ఫక్కున నవ్వింది.

మొదట పలకరించిన ముసలమ్మకి ఏమనడానికి తోచలేదు. బెంగగా స్నేహితురాలి చేతులు నిమురుతూ వుండిపోయింది.

”సుబ్బారావు గుర్తున్నాడా అలివేలూ” అని అడిగింది వున్నట్టుండి కామేశ్వరి.

”వచ్చాడా కొంపతీసి,” కొంచెం గొంతు తగ్గించి అడిగింది అలివేలు. ఆ పేరు వింటూనే ఆవిడ మొహం ఎర్రగా అయింది.

”రావచ్చు మరి మనం కలిసినట్టే, తనూ కలుస్తాడు కదా, అదిగో అటు చూడు” అని అరిచింది ఉద్వేగం ఆపుకుంటూ…

అలివేలు గబగబ చీర కుచ్చిళ్ళు సర్దుకుని గంభీరంగా మొహం పెట్టడానికి ప్రయత్నిస్తూ. తల తిప్పి చూసింది. ఆ క్షణాన వాళ్ళిద్దరు పదిహేనేళ్ల పిల్లలయిపోయారు.

అక్కడ ఇంకొక వృద్ధ యువకుల సంభాషణ మొదలయింది. ”ఓరి సూరిగా, నేన్రా గుర్తుపట్టావా? అంటున్నాడు మొదటాయన.

”నువ్వుట్రా విశ్వనాధం, అదేంట్రా అంత పెద్దాడివైపోయావ్‌” సూరిగాడు అనబడు పెద్దాయన ఆశ్చర్యపోయాడు…”

విశ్వనాధం సూరిపొట్టలో ఒక పోటు పొడిచి. ”ఓయబ్బ నువ్వేదో పదహారేళ్ళ బాలకుమారుడివి అయినట్టూ…. ఏదో ఆ నెత్తికి ఇంత జుట్టు వుండబట్టి డై చేసుకుని వేషాలేస్తున్నావ్‌ గాని, మరి నాకెలా కుదురుతుందీ మనది టెన్నిస్‌ కోర్టు కదా… అంటు బట్టతల నిమురుకుంటూ పక్కకి చూసి తబ్బిబ్బయాడు. కళ్ల ముందు నీలం గళ్ల చీర రెపరెపలాడింది. అప్పుడెప్పుడో ప్రేమలేఖ అందుకున్న అలివేలూ ఉరఫ్‌ వేల్మణి కనిపించిందీ. వెంటనే బట్టతల మీంచి చెయ్యి తీసేసి నవ్వుతో చెయ్యూపాడు.

”వాళ్ళని కలుద్దాం పద…” అని రాజేశ్వరి అలివేలు చెయ్యి పట్టుకుని లాగుతోంది.

”హబ్బ వూరుకోవే నిదానంగా నడవాలి. అంత తొందరగా నడవలేను, మొన్నీ మధ్యనే మోకాళ్ల జాయింట్స్‌ ఆపరేషను అయింది,” గొణిగినట్టే చెప్పింది అలివేలు.

”మేడమ్‌ మేము గుర్తున్నామా..” సూరిగాడు అలివేలు వంక చూస్తు రాజేశ్వరిని అడిగాడు.

అక్కడే నుంచున్న నాకు ఈ ఘట్టం చాలా ఆసక్తికరంగా వుంది.

”ఇక్కడున్నావా, వెనక నిన్నెవరో పిలుస్తున్నారు చూడు,” మా చెల్లెలు విజ్జి నా చెయ్యి పట్టుకుని లాగింది. నాకు అక్కడ ఇంకా ఏం జరుగుతుందో చూడాలని వుంది. కానీ బలవంతాన వచ్చేశాను. నా జూనియర్‌ రాధారాణి పలకరించి మా చెల్లెలు లీల వివరాలు అడిగింది. లీల కోసం తన ఫోన్‌ నంబరు తీసుకున్నాను. ఆ నలుగురూ నాకు బాగా సీనియర్లయి వుండాలి. మా బ్యాచ్‌లో వుంటే తెలిసేవాళ్ళే కదా, మా క్లాసులో అయితే శనగన శతావధాని… (శనగన కరెక్టో, శనగల కరెక్టో, మేం మాత్రం శనగల అని పిలిచేవాళ్ళం. అతగాడు పిలకతో సహా బడికి వచ్చేవాడు.) నాగరత్నం…. ఈ పేరుతో ఒక అమ్మాయి, అబ్బాయి కూడా వుండేవారు. ఎవరిని పిలిచినా ఒకడే పలికేవాడు. లేడీ నాగరత్నానికి చెవుడేమీలేదు కాని అదొక రకం పరధ్యానంగా వుండేది. సుకుమార్‌ అని ఇంకో కళ్ళజోడు అబ్బాయి వుండాలి. ”సుకుమార్‌ నీ మార్కులు కూడా మహ సుకుమారంగా వస్తాయి” అనేది ఉషా టీచర్‌. సావిత్రి, యశోధర, సీత… వీళ్ళేవరూ రాలేదేమిటో. వరలక్ష్మీ తను ఒక్కత్తే వచ్చింది. అవును, తను అప్పుడు కూడా ఇంత సన్నగా, పొడుగ్గా పిండి బలపంలా వుండేది. జడ మాత్రం చెచ్చేంత బరువుగా బుర్రలో ఆలోచనలన్నీ దువ్వెనతో బాటు కిందికి జారిపోతాయేమో అనిపించేలా వుండేది. ఒకసారి ఆ మాటే అంటే పగలబడి నవ్వి, నువ్వింత వేలం వెర్రిగా ఎలా మాట్లాడతావు అన్నది. అలాంటి పద ప్రయోగానికి నాకప్పుడు కోపం కూడా వచ్చింది. గాలి పద్మావతి అని వుండాలికదా మరి ఎందుకు రాలేదో, చిన్నప్పుడు శోభన్‌బాబు వాల్‌పోస్టరు బైట గోడమీంచి చింపుకొచ్చి నాక్కావాలంటే నాక్కావాలని ఇక్కడ ఇసకలో దొర్లి దొర్లి కుస్తీ పట్టాం. చివరికి అది అడ్డదిడ్డంగా ముక్కలయింది. ఎక్కాల పుస్తకానికి అట్ట వేసుకోవడానికి పనికి వచ్చింది అంతే. తను ఎ సెక్షన్‌లో వుండేది. నేను బి కదా. మా రెండు క్లాసులకి మంచి పోటీ వుండేది. మాది మిత్రవైరుధ్యం అనాలేమో. చెలమలో కదులుతున్న మబ్బుల గుంపులాగా నా జ్ఞాపకాలు తేరుకుంటున్నాయి.

ప్రస్తుత ఎమ్మెల్యే, పూర్వ విద్యార్థి ఒకరు మైకు అందుకున్నారు. ఖద్దరు దుస్తులన్నీ, వంది మాగధుల్నీ, జెండా ఎజెండానీ గేటు బయటే వదిలి పెట్టేశాడేమో, సరదాగా కబుర్లు మొదలుపెట్టాడు. ”నేను ఏనాడూ పుస్తకాలు ముట్టలేదండీ, వెనక బెంచీ కుర్రాడిని.” పిల్లలకి ఆ మాట బాగా నచ్చినట్టూంది చప్పట్లు కొట్టారు. (అందుకే రాజకీయ నాయకుడయ్యాడేమో. నేనెక్కడో చదివాను. ముందు బెంచీలో వున్నవాళ్ళూ మంచి గుమాస్తాలు, మధ్య వరసల్లో ఆఫీసర్లు, వెనక బెంచీ వాళ్ళు వ్యాపార, రాజకీయాల్లో స్థిరపడతారు అని, అది నిజమైనట్టే కనిపిస్తోంది. ఇక్కడ కొందర్ని చూస్తుంటే, ఆ మాటే చెబుదామా అనిపించింది కాని బావుండదేమోలే అనుకుని మానేశాను.)

ఎమ్మెల్యే విజృంభించాడు ”ఒకరోజేం జరిగిందో తెలుసా…?” ముందురోజు కురిసిన వానకి క్లాసులో నీళ్ళూ నిలిచాయి. బెంచీలు కూడా తడిపేస్తే ఇవాళ్టి పరీక్షని తేలిగ్గా డుమ్మాకొట్టించెయ్యచ్చు అనుకున్నాం. కిందున్న బురద నీళ్ళు రేకు డబ్బాలతో, సీసాల్తో ఎత్తి బెంచీల మీద పోశాం. మా సార్‌ ఎవరనుకున్నారు…? గోపాలకృష్ణ మూర్తి గారు, ఎంత నవ్విస్తాడో అంత చండశాసనుడన్న మాట, (హిట్లర్‌ అన మారుపేరు వుండేదనుకోండి.)

”ఎలాసార్‌, కూచోడానికి లేదు. పరీక్ష రేపు రాస్తాం సార్‌, అప్పటికి ఈ బెంచీలు ఆరతాయి కదా,” అన్నాం.

హిట్లర్‌ అందరివంకా పరిశీలనగా చూశాడు. సాధ్యమయి నంత అమాయకంగా మొహాలు పెట్టాం. గాని వెనకగా ఒకళ్ళిద్దరు మాత్రం. అనవసరంగా నవ్వేశారు ఆయనకేదో అర్థమయి పోయింది.

”ఒరేయ్‌ ఇప్పండిరా చొక్కాలు,” గర్జించాడు.

”ఎందుకు సార్‌.”

”చొక్కాల్తో తుడవండి, ఎవరి బెంచి వాళ్ళు తుడుచుకుని కూచోండి పరీక్ష రాయండి, వూ! క్విక్‌. అయిదు నిమిషాల్లో పని అయిపోవాలి,” అదేశించాడు.

ఇక చూడండి మా మొహాలు, దమ్ముకున్న అగ్గిపెట్టేల్లాగా తెల్లబోయాయి ఎలాగోలా గొణుక్కుంటూ ఆ పరీక్ష రాశేశాం. మార్కులు ఇచ్చేటప్పుడు స్పెషల్‌ కోటాగా ఎలాగూ దరువులు పడతాయనుకోండి.

ఆ తర్వాత ఆ మురికి చొక్కాల్తో ఇంటికెడితే ఇంట్లో కాళ్ళు ఇరగ్గొడతారు కదా అంచేత అందరం చంచాలు వేసుకుని ఒక సబ్బు బిళ్ళ కొన్నాం. ఇదిగో ఇక్కడొక పంపు వుండాలి అక్కడే ఉతుక్కుని, తొడుక్కుని ఇంటికెళ్ళాం. ఇంట్లో వాళ్ళు వూరుకుంటారా? చీపురుకట్టతో గుమ్మంలోనే ఎదురయింది అమ్మ.

”వెధవా చొక్కా ఎందుకురా అలా తడిసింది.”

”కృష్ణలంకలో స్నానం చేసి వచ్చానమ్మా, ఇవాళ కృష్ణాష్టమిట కదా….” నోటికి తోచింది చెప్పేశాను.

”వెధవన్నర వెధవా, స్నానానికెడితే నిక్కరు తడవదా, చొక్కా ఒక్కటే తడుస్తుందా….”ఏం జరిగిందో చెప్పంటూ వీప్పగల కొట్టీందండీ మా అమ్మ. ఇప్పుడు గోపాల కృష్ణమూర్తిగారు లేరు. అమ్మలేదు. ఇక్కడ వుండాల్సిన పంపులేదు. పంపులో అంత తియ్యటి నీళ్ళూలేవు. అసలు ఆరోజులే లేవు..అంటూ గొంతు జీరబోతూ మళ్ళీ ఏభై ఎనిమిదేళ్ళ వయసులోకి వచ్చేశాడు దామెర్ల శ్యాం కుమార్‌.

పాత ఎప్పుడు బంగారమే, అక్కడికొచ్చిన అన్ని బ్యాచుల వాళ్ళు పాత రోజుల గురించే మాట్లాడుతున్నారు. అప్పుడున్న స్వేచ్ఛ ఇప్పుడు లేదు. అప్పుడు వున్న విలువలు ఇప్పుడు లేవు. ఇదంతా తలపోతే కావచ్చు. నాస్టాల్జియా, అంటారనుకుంటా. ఒకరకంగా ఇది వృద్ధాప్య లక్షణం. కానీ ఇప్పుడు కొత్తగా కాలేజీకెళ్ళినవాళ్ళు కూడా ఇలాగే చెబుతున్నారేమిటి…? ఆశ్చర్యంగా అనిపించింది. ప్రతివాళ్ళకి వాళ్ళ భూతకాలమే ఎందుకు బావుంటోంది..? వర్తమానం మీద ఆసక్తిగాని, భవిష్యత్తు మీద ఆశకాని ఎందుకని లేదు…? పాత సినిమాలు బావుంటాయి. పాత పట్టుచీరలు బావుంటాయి. పాత సంగీతం బావుంటుంది. కూరగాయలు, పళ్ళు, నీళ్ళు, పాలు, నెయ్యి… స్టీలు ఇత్తడి గిన్నెలు ఒకటేమిటి అన్నీ అప్పటివే బావుంటాయి.

ఆ టీచర్లే బాగా చదువు చెప్పేవారు. వాళ్ల తెలుగు, లెక్కలు, ఇంగ్లీషు గ్రామరే ఇప్పటికంటే బావుండేది.. ఆనాటి చెక్క సోఫాలు, ఇళ్ళు, పంటలు ఆరోగ్యాలు, రేడియో కార్యక్రమాలు, రాజకీయాలు అన్నీ మెరుగ్గానే వుండేవి. మానవ సంబంధాలు పరిడవిల్లేవి. ఎందుకని ఈ పాతకాలం నాటి తలపోత మన నోటిలో నాటుకు పోయింది. ఎన్ని మారినా ఈ మాట మారలేదేమిటి…? ఎక్కడో గాని ఏదో లెక్క తప్పింది.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

3 Responses to తలపోతల జిలుగువెలుగులో కొత్త ఒక రోతా…?

 1. రావు says:

  “అప్పుడెప్పుడో ప్రేమలేఖ అందుకున్న అలివేలూ ఉరఫ్‌ వేల్మణి కనిపించిందీ.” ==> హేవిటీ? హైస్కూలు పిల్లల మధ్యే ఈ ప్రేమలేఖల గోల? ఈ కాలం లోనే అనుకున్నాము, ఆ రోజుల్లో కూడా వుందన్న మాట ఈ హైస్కూలు ప్రేమల పైత్యం.

  “ఒక విద్యార్థి అయితే అమెరికా నుంచి ప్రతి సంవత్సరం పదో క్లాసులో వున్న పేద విద్యార్థులకోసం ఫీజులు పంపిస్తున్నాడు. తన పేరు మాత్రం ఎవ్వరికీ చెప్పకూడదని షరతు విధించాడట.” ==> ఈ వాక్యం వెనకాల సంతోషమైన గొంతు లేదెందుకో?

  పాత అంతా బంగారం కాదు. కొత్తతో పోల్చకుండా వుంటే, పాతలో కూడా చాలా చెత్త వుండేది. బాల్య వివాహాలూ, కన్యాశుల్కాలూ, సతీ సహగమనాలూ, వర కట్నాలూ, స్త్రీ విద్య నిషేధం, గట్రా పాతలో వున్న చెత్తలే కదా? పాతివ్రత్యం చెత్త కూడా పాత లోంచే వచ్చింది. పెట్టుబడి దారీ సంస్కృతి బాగా ప్రబలి, అది కొత్తని బోలెడంత చెత్తగా చేసేసింది. అయితే, శ్రమ దోపిడీ అర్థం కావడం, స్త్రీ స్వేచ్ఛని మనుషులు గుర్తించడం, స్త్రీలు పాతలో లాగా వంటిళ్ళలో వుండి పోకుండా, బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు చెయ్యడం, దళిత సమస్యకి వ్యతిరేకంగా పోరాడ్డం (పాతలో లాగా దళితులని దూరంగా వుంచకుండా, వారిని మరింత దోచుకోకుండా), ఇంకా ఎన్నెన్నో మంచి విషయాలు కొత్తలో వున్నాయి.

  అసలు, ఈ పాత, కొత్తల పోలిక జనరల్ గా చేసెయ్య కూడదు. ఒక విషయం తీసుకుని, అది అభివృద్ధి చెందిందా, నాశనం అయిందా అని చూడాలి.

  పాత కన్నా సినిమాల్లో హింసా, సెక్సూ ఎక్కువయ్యాయి కొత్తలో. అది కొత్త లోని చెత్త.
  పాతలో లాగా స్త్రీలు అణగి,మణగి వుండటం లేదు. తమ స్వేచ్ఛ కోసం తాము పోరాడుతున్నారు. అది కొత్త లోని గొప్ప.

  ఈ విధంగా విషయాన్ని బట్టి, ఏది మంచిదో తార్కికంగా ఆలోచించాలి. ప్రతీ పాత చెత్తా గొప్పదీ కాదు. ప్రతీ కొత్త మంచీ చెత్తదీ కాదు.

  చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని అపురూపంగా వుంటాయి. అందులో తప్పు లేదు. అలా అని చెప్పి, చిన్నతనపు ప్రతీ జ్ఞాపకమూ అపురూపం అనుకోకూడదు. వాటిలో చెత్త విషయాలు కూడా వుంటాయి. పాత రోజుల్లో, స్త్రీకి సంబంధించిన మొదటి సారి ఋతుక్రమాన్ని డప్పు కొట్టి చాటేవారు. అదెంత అసహ్యకరమైన విషయమో ఇప్పుడు గ్రహించారు. ఆ చిన్నప్పటి జ్ఞాపకం అపురూపంగా వుండదు.

  అమాయకుల్నీ, అజ్ఞానుల్నీ వదిలేస్తే, అందరం సమాజం ఓవరాల్ గా ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే వుంటుంది అని గ్రహించాలి. అయితే, కొన్ని విషయాల్లో తిరోగమనంగానే వుంటుంది. ఇక్కడ చెప్పేది ఓవరాల్ విషయం.

  రావు

 2. g leela says:

  రుర్తుకొస్తున్నఈ ,,,గుర్తుకొన్నన్నఈ ……. నిజమె రొజులు మల్లి రవు

 3. g leela says:

  అక్కఒ(కొందీపూదినిర్మల) చాలా బాగా రాసావు. అరూజులు గుర్తుకొచాఈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో