ఎక్కడున్నా ఒక్కటేనా?

కొండవీటి సత్యవతి
చుట్టూ పచ్చటి పొలాల మధ్య వుంది ఆ వృద్ధాశ్రమం. నాట్లు వేసి నెలరోజులైవుంటుంది. ఏపుగా పెరిగిన చేలు.. గట్ల మీద వరుసగా నాటిన కొబ్బరి చెట్లు. చక్కటి పరిసరాల్లో, హూందాగా నిలిచివున్న ‘జీవన సంధ్య’ ఆశ్రమం.నేను కారాపి, కిందికి దిగుతుంటే నాగరత్నంగారు ఎదురొచ్చారు.
”రండి…రండి రంగారావుగారూ!” ఆవిడ గొంతు  గంభీరంగా వుంది…
”నమస్తే నాగరత్నంగారూ! ఎపుడు జరిగింది”
”తెల్లవారుజామున నాలుగింటికి సంపూర్ణగారు వెళ్ళిపోయారు. హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది.”

”వల్లభ్‌  ఎలా వున్నాడు?”  ఆయన అలాగే వున్నారు. ఆవిడ పోయినట్టు ఆయనకు తెలియదు కదా”…అంటూ లోపలికి దారితీసిందావిడ.

నేను నాగరత్నంగారిని అనుసరించాను. ఆశ్రమానికి చెందిన ఐస్‌బాక్సులో సంపూర్ణగారి పార్ధివ శరీరం వుంచారు. ఆవిడ ముఖంలో ఒక నిశ్చింత. వల్లభ్‌ ఓ పక్కగా కుర్చీలో కూర్చుని వున్నాడు. అతని ముఖం నిర్జీవంగా వుంది. ఏదో లోకంలో వున్నట్టున్నాడు. అల్జీమర్స్‌ వల్ల అతను అందరినీ మర్చిపోయాడు. సంపూర్ణే అతన్ని కనిపెట్టి చూసుకునేది.

”వాళ్ళబ్బాయిలకి ఫోన్‌ చేయించాం. ఐస్‌బాక్సులో వుంచమన్నారు. ఎపుడు బయలుదేరుతారో చెప్పలేదు.”

”దూరం కదండి. ఇప్పటికిప్పుడు అమెరికా నుండి రావాలంటే కష్టమే మరి.”

నేను వల్లబ్‌ భుజం మీద చెయ్యేసి దగ్గరగా నిలబడ్డాను. నా వేపు అయోమయంగా చూసాడు. చనిపోయింది తన భార్య అని కూడా తెలియకుండా, నిర్వీకారంగా కూర్చున్న వల్లభ్‌ను చూస్తుంటే నా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. ఇద్దరు కొడుకులు, భర్త వుండి కూడా సంపూర్ణ అనాథ శవంలా అలా ఐస్‌బాక్సులో వుండడం, ఆమె కోసం ఒక్క కన్నీటి బొట్టు రాల్చేవాళ్ళు లేకపోవడం చాలా బాధగా అన్పించింది. తల్లిదండ్రుల్ని వదిలేసి పిల్లలు అంతంత దూరాలెందుకు పోవాలి? నా పిల్లలు హాయిగా నా కళ్ళ ముందే వున్నారు. లేనిదల్లా రుక్మిణి మాత్రమే. రుక్మిణి చనిపోయినపుడు నా కూతుళ్ళు, కొడుకులు, మనవలు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం కళ్ళ ముందు కదలాడి, నిశ్శబ్దంగా వున్న ఆ పరిసరాలు వెక్కిరించి నట్టుగా అనిపించి, ఇక అక్కడ వుండలేక, మర్నాడు వస్తానని చెప్పి నేను అక్కడి నుంచి లేచి వచ్చేసాను.

చల్లటి పెట్టెలో సంపూర్ణ, ఏమి పట్టని వల్లభ్‌ల ముఖాలు పదే పదే గుర్తొచ్చి కలవరపెట్టసాగాయి. కొంచం దూరం వెళ్ళాక కారు ఆపి, పొలాల్లోకి నడిచాను. కొబ్బరి చెట్టు నీడన కూర్చుంటే చల్లటిగాలి పొలాల మీంచి వీస్తూ కొంత సేద తీర్చింది. ఎన్నో ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నాయి. పక్క పక్క ఇళ్ళల్లో వుంటూ, ఎన్నో సంవత్సరాలు కలిసి బతికిన రోజులు, సంపూర్ణ, వల్లభ్‌లు పిల్లల కోసం ఎంత కష్టపడింది, ఎన్ని త్యాగాలు చేసింది ఒకటొకటే గుర్తురాసాగాయి.

+ + +

”రంగా! మేం ఇల్లు మారదామనుకుంటున్నాం.” అన్నాడొక రోజు వల్లభ్‌.
”ఎందుకురా ! ఈ ఇల్లు బాగానే వుందిగా. అయినా ఇంకా ఎన్నాళ్ళు అద్దె కొంపలో వుందాం. లోన్‌లు పెట్టి ఇల్లు కట్టుకుందాం” ఇద్దరం నడుస్తూ మాట్లాడుకుంటున్నాం.
”ఇల్లు కట్టడమా! ఇప్పుడా! భలేవాడివిరా! మావాడి ఐఐటి కోచింగ్‌ కోసం మేం నల్లకుంట వెళ్ళిపోదామనుకుంటున్నాం.”
”ఐఐటి కోచింగ్‌కి ఇల్లు మారడానికి సంబంధం ఏమిటి?”
”సంబంధం వుంది. తెల్లవారు జామున నాలుగింటికి క్లాసుకెళ్ళాలి. ఇక్కడి నుండి వెళ్ళడం కష్టం”.
”అందుకని మమ్మల్ని వదిలేసి పోతావా? మాక్కూడా చూడు మేము వచ్చేస్తాం.”
”నీ కెందుకురా! నీ పిల్లలకి ఐఐటి ఆసక్తి లేదు కదా!
”లేదు కానీ ! మన కుటుంబాలు బాగా కలిసి పోయాయి. మీరు వెళ్ళి పోతారంటే రుక్మిణి కూడా బాధపడుతుంది. సంపూర్ణ ఏమంటోంది మరి?”
”ఏమనడానికి లేదు. నాకు మాత్రం బాధగా లేదంటావా రంగా! తప్పదు. పిల్లల కోసం ఆ మాత్రం చెయ్యాలి కదా!” మేం ఇంటికి చేరడంతో సంభాషణ ఆగిపోయింది.
+++
ఆ తర్వాత పదిహేను రోజులకి విద్యానగర్‌లో పక్క పక్కనే రెండు అపార్ట్‌మెంట్లు అద్దెకు దొరకడం, మేం షిప్ట్‌ అయిపోవడం జరిగిపోయాయి. మా పిల్లలిద్దరు యూనివర్సిటీలో చదువుతున్నారు కాబట్టి వాళ్ళు సంతోషంగానే ఒప్పుకున్నారు.
వల్లభ్‌ కొడుకు విశాల్‌ రామయ్య కోచింగ్‌ సెంటర్‌లో చేరాడు. చాలా తెలివైన వాడు. వల్లభ్‌ నాలుగింటికి విశాల్‌ని దింపేసి వచ్చి, ఐదింటికి నాతో వాకింగ్‌కి వచ్చేవాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ యూనివర్సిటీ వైపు వెళ్ళేవాళ్ళం. వల్లబ్‌ కొడుకు గురించి, అతని కోచింగ్‌ విశేషాల గురించి చెబుతుండేవాడు. సంపూర్ణ మూడున్నరకి లేచి, కొడుకుకోసం టిఫిన్లు చేసి ఇచ్చేది. సాయంత్రం మళ్ళీ ఎక్కడికో కోచింగ్‌కి దింపేవాడు. వల్లభ్‌కి ఆఫీసు, కొడుకు కోచింగ్‌ తప్ప వేరే వ్యాపకం లేకుండా పోయింది. ఇంతకు ముందు అందరం సినిమాలకి, హోటళ్ళకి వెళ్ళేవాళ్ళం. సంపూర్ణ, వల్లభ్‌ దేనికీ రావడం లేదు.
ఓ రోజు వాకింగ్‌ చేస్తూనే కిందపడిపోయాడు వల్లభ్‌. నేను చాలా గాభరా పడిపోయాను.వాకింగ్‌లో వున్న అందరూ పరుగెత్తి వచ్చారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. సంపూర్ణ ఏడుస్తూ ఆసుపత్రికి పరుగెత్తి వచ్చింది. కాసేపటికి కళ్ళు తెరిచాడు.
”ఈయనకి బి.పి. చాలా ఎక్కువగా వుంది. మందులేమైనా వాడుతున్నారా? అని అడిగాడు డాక్టరు. ”లేదండి. ఆయనకి ఇంతకు ముందు బి.పి లేదు.” అంది సంపూర్ణ.
”ఎప్పుడైనా చెక్‌ చేయించుకున్నారా? ఈ వయసులో బి.పి చూసుకుంటూ వుండాలి.”
”లేదని’ చెప్పింది. సంపూర్ణ.
ఏం ఫర్వాలేదని, బి.పి. టాబ్లెట్‌ వేసుకోవాలని విశ్రాంతిగా వుండాలని చెప్పి డిస్సార్జ్‌ చేసారు.
”నేను చెబుతూనే వున్నాను రుక్మిణీ! వింటే కదా! అసలు ఈ మధ్య నిద్ర తక్కువైపోయింది. మూడున్నరకి లేస్తాడు. విశాల్‌ని దింపి వచ్చి పడుకోమంటే వినడు.” అంది నిష్ఠూరంగా సంపూర్ణ.

ఆ రోజే మొదలు అతని ఆరోగ్యం దెబ్బతినడం. ఏదీ పట్టించుకునేవాడు కాదు. ఎవరు చెప్పినా వినేవాడు కాదు. విశాల్‌కి ఐఐటిలో ర్యాంకు వచ్చినపుడు వాడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. గౌహతి వరకు వెళ్ళి కొడుకుని జాయిన్‌ చేసి వచ్చారు. అంత సుదీర్ఘ  రైలు ప్రయాణం వల్ల సంపూర్ణకి తీవ్ర అనారోగ్యం కలిగింది. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని, 36 గంటలు ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చినపుడు  వాళ్ళను చూసి నాకు చాలా బాధ కలిగింది. ఇద్దర్ని మా ఇంట్లోనే వుంచుకుని జాగ్రత్తగా చూసింది రుక్మిణి. రైలు ప్రయాణం పొడుగునా వాంతులు, విరేచనాలతో చాలా నీరసించి పోయింది సంపూర్ణ.

”కొత్త ప్రాంతంలో వాడెలా వున్నాడో” అంటూ ఇద్దరూ కొంత కాలం బెంగ పెట్టుకున్నారు. ”ఏం ఫర్వాలేదురా! వాడి స్నేహితులు కూడా అక్కడే చేరారు కదా! బాగానే వుంటాడులే. ఫోన్‌లో మాట్లాడుతున్నాడుగా.” అంటూ వోదార్చాం.

+++

”సుధాకర్‌కూడా కోచింగంటూ గొడవ చేస్తున్నాడు రా! నాకు వాడు మెడిసిన్‌ చేస్తే బావుంటుందని వుంది. వాడు వినడం లేదు.” ఓ రోజు అన్నాడు.

”అంటే నీ కష్టాలు మళ్ళీ మొదలన్నమాట” అన్నాన్నేను నవ్వుతూ.

”కష్టమని ఎలా అంటాం లేరా? పిల్లల కోసమేగా మన తాపత్రయమంతా. పాపం! సంపూర్ణకే కష్టం. మూడున్నరకి లేచి మమ్మల్ని సాగనంపాలి. డబ్బాలు కట్టాలి.”

సుధాకర్‌ కూడా రామయ్య కోచింగ్‌ సెంటర్‌లో చేరాడు.

వల్లభ్‌ జీవితం రోటిన్‌గా తయారైంది మళ్ళీ.

ఓ రోజు గౌహతి నుండి ఫోన్‌ విశాల్‌కి బాగోలేదని. అతని స్నేహితులు ఫోన్‌ చేసారు. సంపూర్ణ, వల్లభ్‌ గాభరాపడి పోయారు. ఏం చెయ్యాలి? రైల్లో వెళ్ళితే మూడు రోజుల ప్రయాణం. చాలా కష్టమ్మీద డబ్బు కూడేసి ప్లయిట్‌కి బయలుదేరాడు. జీవితంలో ఎప్పుడూ విమానమెక్కలేదు. అదో కంగారు. వల్లభ్‌ ముఖం తెల్లగా  పాలిపోయినట్లుయ్యింది. నేను, నా కొడుకు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి దిగబెట్టాం. అతని గాభరా చూసి నేను కూడా వెళ్ళుంటే బావుండునని చాలా అనుకున్నాను కానీ అంత డబ్బు పెట్టడం నా వల్ల కూడా కాదు.

అలా వెళ్ళినవాడు పది రోజుల తర్వాత వచ్చాడు రైల్లో. చిక్కి శల్యమైపోయాడు. విశాల్‌ కోలుకున్నాడని, వాడికి అక్కడి భోజనం పడడంలేదని, అజీర్ణంతో బాధపడుతున్నాడని చెప్పాడు. వల్లభ్‌ని చూసి సంపూర్ణ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ

”అంత దూరంలో చదవడంమెందుకు? వాడికేమైనా అయితే తట్టుకోగలామా? ఈయన చూడండి.ఎలాగైపోయాడో” అంటూ ఏడ్చింది ఆ రోజు.

+++

సుధాకర్‌కి మంచి ర్యాంకు వచ్చి, అతనిక్కూడా గౌహతిలోనే సీటు రావడంతో వీళ్ళ కష్టాలు కొంత తీరాయి. ఒకరికొకరు తోడుగా వుంటారని వల్లభ్‌ చాలా సంతోషించాడు. వాళ్ళక్కడున్న నాలుగు సంవత్సరాల్లో వీళ్ళిద్దరూ చాలా సార్లు వెళ్ళి వచ్చారు. వాళ్ళకి బాగోపోవడం, వీళ్ళువెళ్ళడం మాకు అలవాటయిపోయింది.

చూస్తుండనే సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. విశాల్‌కి  కేంపస్‌ అప్పాయింట్‌మెంటు రావడం, ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోవడం, ఆ తర్వాత సుధాకర్‌ అన్నదారి పట్టడం జరిగిపోయాయి.

ఆ తర్వాత  కాలంలో వల్లభ్‌కి మతిమరుపు ఎక్కువైపోయింది. సంపూర్ణకి బి.పి, షుగర్‌ రెండూ వచ్చాయి. నాకు గుండె జబ్బు పట్టుకుంది. వయస్సుతో పాటే రోగాలు. విశాల్‌, సుధాకర్‌ల పెళ్ళిళ్ళు అవ్వడం, భార్యలతో సహ అక్కడే స్థిరపడి పోవడంతో వల్లభ్‌, సంపూర్ణలిద్దరే మిగిలారు.

ఓ రోజు బయటకెళ్ళిన వల్లభ్‌ అర్థరాత్రయినా ఇంటికి చేరలేదు. మేమంతా కంగారుపడి చుట్టాలిళ్ళన్నీ వెతికాం. కనబడలేదు. పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చాం. మర్నాడు పదిగంటలవేళ ఎవరో వల్లభ్‌ని తీసుకొచ్చారు. రోడ్డుమీద తెలివిలేకుండా పడి వుంటే వాళ్ళింటికి తీసుకెళ్ళారట. ఉదయం దాకా లేవలేదట. లేచాక ఎంతో ప్రయత్నం మీద ఇంటి అడ్రస్‌ చెప్పాడట. జాగ్రత్తగా తీసుకొచ్చి, ‘పెద్దాయన్ని ఒంటరిగా వదలకండి’ అని చెప్పి వెళ్ళారు. సంపూర్ణ దు:ఖానికి అంతులేదు. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళితే గుండె పగిలే వార్త చెప్పాడు. అల్జీమర్స్‌. వల్లభ్‌కి అల్జీమర్స్‌ వ్యాధి సోకింది. క్రమంగా జ్ఞాపకశక్తి పోతుందని, బయటకు పంపొద్దని చెప్పడంతో సంపూర్ణ వెక్కి వెక్కి ఏడుస్తూ కొడుకులకు ఈ వార్త చెప్పడం, ఓ పదిరోజుల తర్వాత సెలవు పెట్టి సుధాకర్‌ రావడం, సంపూర్ణని, వల్లభ్‌ని ఈ హోమ్‌లో చేర్చడం చాలా వేగంగా జరిగిపోయాయి. భార్యాభర్తలుండడానికి ప్రత్యేక గది, అన్ని సౌకర్యాలతో వుండడంతో సంపూర్ణ కూడా ఏమనలేదు. తల్లిని తండ్రిని అమెరికా రమ్మని మాత్రం అనకుండానే అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయాడు. విశాల్‌ అయితే ఖాళీ లేదని రానే లేదు.

ఎన్నో సంవత్సరాలుగా కలిసి వున్న కుటుంబం అలా దూరంగా వృద్ధ్ధాశ్రమానికి తరలివెళ్ళడం నాకు చాలా దు:ఖం కలిగించింది. సంవత్సరం తిరక్కుండా రుక్మిణి కాలం చేసింది. నేను అపుడపుడూ ఈ ఊరొచ్చి సంపూర్ణని, వల్లభ్‌ని చూస్తూనే వున్నాను. వల్లభ్‌ జ్ఞాపకశక్తి మొత్తం పోయింది. సంపూర్ణని కూడా గుర్తు పట్టలేడు. నా వేపు నిర్వాకారంగా చూస్తూ వుంటాడు. ఇపుడు సంపూర్ణ కూడా లేదు. వల్లభ్‌ని ఎవరూ చూసుకుంటారు?

+++

ఎంతసేపూ అలా కూర్చుండిపోయానో గానీ ఎండ చురుక్కుమని తగులుతుంటే స్పృహలోకి వచ్చాను. కారు స్టార్ట్‌ చేసి ఇంటివేపు బయలుదేరాను.

+++

మర్నాడు ఉదయాన్నే హోమ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. మా కోడలు కళ్యాణి ఫోన్‌ అందుకుంది. వల్లభ్‌ కొడుకులిద్దరూ బయలు దేరి వస్తున్నారట. హమ్మయ్య అనుకున్నాను. వాళ్ళు వస్తారో రారో అనే అనుమానం ఏ మూలో వుంది. అనవసరంగా అపార్థం చేసుకున్నానని బాధపడి, పోనీలే వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటారనుకుని తృప్తి పడ్డాను.

+++

మా ఇంట్లోనే దిగారు. శెలవు లేదట. కోడళ్ళు రాలేదు. సంపూర్ణకి దహన సంస్కారం చేసి, దినకార్యాలు కూడా పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ఇవేమీ పట్టని స్థిత ప్రజ్ఞుడిలా వల్లభ్‌ పడుకుని వున్నాడు.

”అంకుల్‌’! మేము రేపు రాత్రి ప్లయిట్‌కి వెళ్ళిపోతున్నాం.” అన్నాడు విశాల్‌.

”మీ నాన్నని తీసుకెళ్ళిపోతున్నారా?” అని అడిగాడు.

”లేదంకుల్‌! నాన్న ఇక్కడే వుంటారు.”

”ఇన్నాళ్ళు మీ అమ్మ కంటికి రెప్పలా కాపాడింది. ఇపుడెవరు చూసుకుంటారు. మీరు తీసుకెళ్ళితే బావుంటుంది.”

”లేదంకుల్‌! అక్కడ ఆయన్ని చూసుకోవడం చాలా కష్టం. ఇక్కడైతై హోమ్‌ వాళ్ళు చూసుకుంటారు.” విశాల్‌ అన్నాడు.

స్వంత తండ్రిని చూసుకోవడం కొడుకులకి కష్టం. ఏమీ సంబంధం లేని ఆశ్రమం వాళ్ళు చూడాలి.

”అయినా అంకుల్‌! ఈయన ఎక్కడున్నా ఒకటే. మమ్మల్ని గుర్తు పట్ట లేడు. మేం తీసుకెళ్ళినా, ఇక్కడున్నా పెద్ద తేడా లేదు. మేం డబ్బు పంపుతాం. ఆశ్రమం వాళ్ళు చూసుకుంటారు.” సుధాకర్‌ గొంతులో ఎంత నిర్లక్ష్యం.

మతి స్థిమితం లేని తండ్రి ఎక్కడున్నా ఒకటే. ఈ మతి కోల్పోయిన మనిషి తమ కోసం ఏం చేసాడో ఎంత తేలిగ్గా మర్చి పోయారు. ఎంతో జాగ్రత్తగా పసిపిల్లని చూసినట్టు చూసుకోవాల్సిన స్థితిలో నిర్దయగా తండ్రిని వదిలేసి తమ మానాన తాము పోవాలను కుంటున్న, ఐఐటి చదివిన ఈ పుత్రరత్నాల ప్రవర్తన నాకు గుండెలో మంట పుట్టించింది. నా ప్రాణమితృడు ఇదేమీ పట్టకుండా ఆకాశం లోకి చూస్తున్నాడు. నా గుండె గొంతులోకొస్తున్న ఫీలింగ్‌. కళ్ళల్లోంచి ధార కట్టిన కన్నీళ్ళ మధ్య నాకింకేమీ కనబడడం లేదు. కూర్చున్న చోటే కుప్పకూలాను.

”నాన్నా ఏమైంది?” నన్ను పొదివి పట్టుకుంటోన్న నా కూతురి గొంతు ఎక్కడో నూతిలో నుంచి వినబడుతున్నట్టుగా వుంది నాకు… మొదట్నుంచీ మా రెండు కుటుంబాల మధ్య నున్న మైత్రీ బంధాన్ని ఎరిగివున్న నా కూతురు మెల్లిగా నన్ను సోఫాలో కూర్చోబెడుతూ… మంచినీళ్ళు పట్రమ్మని తన అన్నయ్యకి పురమాయించింది…తన పమిట చెంగుతో నా నుదటి మీద చెమటను అద్దుతూ

”నాన్న,! వల్లభ్‌ అంకుల్‌ని మనం వొదులుకోలేం.. మీకు యిష్టమైన, ప్రియమైన వ్యక్తి మాకూ ప్రియమైన వాడే కదా.. మీరెంతో వల్లభంకుల్‌ కూడా మాకు అంతే.. చూసుకుందాం నాన్నా అంకుల్ని మానమే చూసుకుందాం.. మీరు ధైర్యంగా వుండండి. మీరు మాకు కావాలి నాన్నా…” దు:ఖపు తెరలను మింగుతూ నా కూతురు సౌమ్య చెప్తోన్న మాటలకు నా కొడుకు అంగీకారంగా తలూపుతూ దిగులు నిండిన కళ్ళతో నా వంక చూస్తున్నాడు.. వాడి చేతిలోని మంచినీళ్ళ గ్లాసు సన్నగా వొణుకుతోంది…

నా పిల్లలకి గొప్ప గొప్ప కార్పోరేట్‌ విద్యలు నేర్పించక పోయి నప్పటికీ మానవీయ విలువలున్న  బడిలో చదివించి నందుకు… నిండుగా ఊపిరి నింపుకున్న నా గుండె ఉప్పొగింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to ఎక్కడున్నా ఒక్కటేనా?

 1. రావు says:

  తల్లిదండ్రులదే తప్పంతా
  ================

  సత్యవతి గారూ,

  మీ కధ చదివాను. మీరు చెప్పదలుచుకుంది అర్థం అయింది. “చిన్న తనంలో తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా చూసుకోవాలి. వాళ్ళకి మంచి సంస్కారం, ఉన్నత విలువలూ నేర్పాలి. (అవి నేర్పడానికి ముందుగా, అవి వాళ్ళకే వుండాలి.) వృద్ధాప్యంలో పిల్లలు తమ తల్లిదండ్రుల్న బాధ్యతగా చూసుకోవాలి. ఇదీ సరైన సాంఘీక ధర్మం” అని చెప్పాలన్న మీ ఉద్దేశ్యం చాలా కరెక్టు. అయితే, ఇది పూర్తిగా ఈ కధలో ప్రతిబింబించ లేదు. పైపెచ్చు తప్పంతా పిల్లలదే అన్న ధోరణిలో సాగింది ఈ కధ. పిల్లల తప్పే పూర్తిగా వుండే పరిస్థితులు కూడా వుంటాయి గానీ, ఈ కధలోని పరిస్థితి అది కాదు. ఇది వివరించాలనే నా ప్రయత్నం.

  1. ఈ కధ లోని తల్లిదండ్రులకి ఉన్నత విలువలు లేవు. పోటీ పరీక్షలూ, రేంకులూ, ఇతరుల కన్నా తాము ముందర వుండాలనే తపనా, పిల్లలు గొప్ప ఉద్యోగాలు చేసేసి, ఎక్కడికో దేశాంతరాలు పోయి ఎలాగో ఒక లాగా బోలెడు డబ్బు సంపాదించెయ్యాలనే గోలా, వగైరా విలువలున్న వాళ్ళు వీళ్ళు. వీళ్ళు తమ పిల్లలకి సరైన సంస్కారం నేర్పించలేదు మొదటి నించీ.

  2. ఈ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇంటి పని చెయ్యడం, స్త్రీ,పురుష సమానత్వం, ఒకరి పై ఒకరు ఎంతో ప్రేమగా వుండటం లాంటివి నేర్పించలేదు. అలాంటివి నేర్పించాక కూడా, ఒక వయసు వచ్చాక, బయటి సమాజపు ప్రభావంతో పిల్లలు దుర్మార్గంగా తయారయితే అది వేరే పరిస్థితి. ఈ కధలో ఆ పరిస్థితి లేదు.

  3. ఈ తల్లిదండ్రులు పిల్లలకి ఆత్మ గౌరవం నేర్పలేదు అస్సలు. అసలు అది వాళ్ళకే లేదు. వాళ్ళు నేర్చుకున్నదల్లా, తమ పిల్లల కోసం అడ్డమైన త్యాగాలూ చేసి, ఆరోగ్యం పాడు చేసుకుని, జబ్బులు తెచ్చుకోవడం. ఇది ఆత్మ గౌరవాన్ని నేర్పించదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఒకరి మీద ఆధార పడి బతకడం ఎప్పుడూ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టదు. చేసినప్పుడు చేస్తారు, విసుక్కున్నప్పుడు విసుక్కుంటారు అవతల వాళ్ళు. తప్పని సరి పరిస్థితుల్లో ఒకరి మీద ఆధార పడి బతక వలసి రావడం ఒక విషయమైతే, నిర్లక్ష్యంగా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, వ్యాయామం చెయ్యక (ఈ కధలో తండ్రి ఏదో కాస్త నడవడం చేస్తాడు. అది సరైన, సరి పోయే వ్యాయామం కాదు), రక రకాల సాకులు చెప్పుకుంటూ, ఒకరి మీద ఆధార పడి బతకడం వేరే విషయం. మనం రెండో విషయం గురించి మాట్టాడుతున్నాము.

  4. ఈ తల్లిదండ్రులు పిల్లలకి బాధ్యత నేర్పలేదు. సాహిత్యం నేర్పలేదు. కధ ప్రకారం అది వాళ్ళకే వున్నట్టు లేదు. సమాజంలో నేర్చుకున్న కృత్రిమ విలువలు మాత్రం పిల్లలకి నేర్పారు. పిల్లలకి సున్నితత్వం నేర్పాలి. దాన్ని వారు ప్రదర్శించక పోతే, వాళ్ళతో సీరియస్‌గా వుండాలి. పిల్లల మీద బండ ప్రేమలూ, దృతరాష్ట్ర ప్రేమలూ చూపించడం, వాళ్ళు తిరిగి తమని సరిగా ప్రేమించడం లేదని వాపోవడం అర్థం లేని విషయాలు. ఈ కధలోని తల్లిదండ్రులు తమ తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించారో వివరాలు లేవు గానీ, వాటిని వూహించు కోవచ్చు. వాళ్ళు తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వుంటే, అది వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకునే పరిస్థితి వుంటుంది.

  5. ఒక ఇంగ్లీషు సినిమాలో ఒక పాత్ర ఇలా అంటుంది: “ఈ దేశంలో కారు నడపాలంటే లైసెన్సు కావాలి. ఒక జంతువుని పెంచు కోవాలంటే దానికి లైసెన్సు కావాలి. పిల్లల్ని కని పెంచడానికి మాత్రం ఎలాంటి లైసెన్సూ అక్కర్లేదు.” ఈ వాక్యాలని యాంత్రికంగా తీసుకోక పోతే, వాటిలో చాలా గాఢమైన అర్థం వుంది.

  6. పిల్లల సంస్కారానికి మొదట బాధ్యులు తల్లిదండ్రులు. ఆ తర్వాత బయటి సమాజం. ఎక్కడ వేసిన గొంగళీలు అక్కడే వుంటాయన్నట్టు కాకుండా, మారుతున్న సమాజంతో పాటు తల్లిదండ్రులు కూడా కొత్త జ్ఞానాన్ని నేర్చు కోవాలి. అప్పుడే ఏది మంచీ, ఏది చెడూ అనే విచక్షణ ముందుగా వాళ్ళకి కలుగుతుంది. దాన్ని తమ పిల్లలకి నేర్ప గలుగుతారు. ఇదంతా చేశాక కూడా, పిల్లలు అడ్డ గాడిదల్లా, బయటి సమాజపు ప్రభావం వల్ల, తయారయితే, చెయ్య గలిగేది ఏమీ లేదు.

  7. పిల్లలు ఏ వయసులో తల్లిదండ్రులని అవమానించినా, అది ఆ తల్లిదండ్రులు చాలా సీరియస్‌గా తీసుకోవాలి. చాలా మంది పిల్లలు, తమ తల్లిదండ్రులని అవమానించడం తమ జన్మ హక్కుగా తీసుకుంటారు. దానికి కారణం ఆ తల్లిదండ్రులే. వారు ఆత్మ గౌరవంతో ప్రవర్తించడం, పిల్లలు చేసే అవమానాలని భరించ పోవడం చెయ్యక పోతే, పిల్లలకి వాళ్ళ మీద ఏమీ గౌరవం వుండదు. మహా వుంటే, ఏదో యాంత్రిక ప్రేమ మాత్రం వుంటుంది.

  8. చాలా మంది తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచడం చేత కాదు. ఆ తర్వాత ఆ పిల్లలు సరిగా ప్రవర్తించ లేదని వాళ్ళ మీద నెపం నెట్టేస్తారు.

  పైన చెప్పిన లక్షణాలన్నీ ఈ కధ లోని తల్లిదండ్రుల విషయంలో కనబడతాయి. ఎటొచ్చీ కధ చెప్పే మనిషి విషయంలో మాత్రం, ఏదో మేజిక్ చేసినట్టుగా అతని పిల్లలు మాత్రమే గొప్పగా పెరిగారనడం చాలా అసంబద్ధమైన విషయం. ఈ పోటీ సమాజంలో సరిగా పెరగాలంటే, మామూలు విషయం కాదు.

  రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో