లాడ్లీ అవార్డుల నిర్వహణలో – నా అనుభవం

2008 నుండి నేను లాడ్లీి మీడియా అవార్డుల కార్యక్రమంతో దగ్గరగా పనిచేస్తున్నాను. ఆ సంవత్సరం బొంబాయి నుండి వచ్చిన పాప్యులేషన్‌ ఫస్ట్‌ డైరక్టర్‌ శారద హోటల్‌ తాజ్‌కృష్ణలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి లాడ్లీ మీడియా అవార్డుల గురించి ప్రకటించింది. ఆ రోజు ఆ సమావేశానికి లోక్‌సత్తా వ్యవస్థాపకులు డా|| జయప్రకాశ్‌ నారాయణ్‌ హాజరై ‘లాడ్లీ’ గురించి మెచ్చుకుంటూ మాట్లాడారు. మీడియాలో బాలికల గురించి, స్త్రీల గురించి రాసేటపుడు జండర్‌ స్పృహతో జర్నలిస్ట్‌లు ఎందుకు వుండాలి? అసలు జండర్‌ స్పృహ అంటే ఏమిటి అని శారద మాట్లాడారు. చాలామంది జర్నలిస్ట్‌లతో పాటు నేను కూడా ఆ రోజు ఆ మీటింగ్‌కి హాజరయ్యాను.

ఆ రోజు నుండి నేను ‘లాడ్లీ’ తో ముడిపడి పోయాను. అవార్డు కోసం భూమిక సంపాదకీయాలు పంపడం ”సదరన్‌ రీజియన్‌ అవార్డు” రావడం, ఆ తర్వాత అదే ఎంట్రీ ”నేషనల్‌ అవార్డు” గెలుచుకోవడం జరిగాయి. ఆ తర్వాత సంవత్సరం అంటే 2009 నుండి ‘లాడ్లీ మీడియా’ అవార్డుల నిర్వహణ బాధ్యతను ‘భూమిక’ తీసుకోవడం, ఆ సంవత్సరం మొత్తం దక్షిణాది రాష్ట్రాల బాధ్యతతో కొచ్చిన్‌, బెంగుళూరులో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు పెట్టడం, రవీంద్రభారతిలో కనుల పండుగగా అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఒక పండుగలాగా జరిగి, న్యాయమూర్తులు, సామాజిక వేత్తలు, అధికారులు, మానవహక్కుల కమీషన్‌ చైర్‌పర్సన్‌ లాంటి ప్రముఖుందరినీ భాగస్వాముల్ని చెయ్యడం ద్వారా ‘లాడ్లీ’ ని మరింతగా, ప్రస్పుటంగా ప్రచారం కల్పించడంతో ఆడపిల్లల హక్కుల గురించి ఒక ఆశావహమైన సందేశాన్ని అన్ని వర్గాల్లోకి పంపదలిచాం.

2010 నుండి ఆంధ్రప్రదేశ్‌ కోఆర్డినేటర్‌గా నేను వ్యవహరిస్తున్నాను.ఆ సంవత్సరం అవార్డుల ప్రదానోత్సవం బెంగుళూరులో జరిగింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూకి సంబంధించిన ఎంట్రీలను స్వీకరించడం, పరిశీలించడం, జ్యూరీని నియమించి వారి ద్వారా విజేతల ఎంపిక చేయడం కో ఆర్డినేటర్‌ విధుల్లో భాగం. ఈ బాధ్యత నిర్వహణలో భాగంగా మీడియా హౌస్‌లకు వెళ్ళడం, లాడ్లీ అవార్డుల గురించి, జండర్‌ స్పృహ ఆవశ్యకత గురించి చెప్పడం, ఎంట్రీలను పంపమని ప్రోత్సహించడం లాంటివి చెయ్యాలి. ఇవన్నీ నేను చేస్తూనే వున్నాను.

2011 లో జర్నలిస్ట్‌లకి మీడియా వర్క్‌షాప్‌ పెట్టాం. పాప్యులేషన్‌ ఫస్ట్‌, భూమిక సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ వర్క్‌షాప్‌ జరిగింది. మీడియాలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియా మహిళల్ని చూపిస్తున్న పద్ధతుల గురించి, కొన్ని కార్యక్రమాలు ఎంత ఇన్సెన్సిటివ్‌గా వుంటున్నాయి అనే అంశాల మీద చాలా చర్చలు జరిగాయి. గ్రూప్‌ డిస్కషన్‌లు జరిగాయి. తాము ఉపయోగించే భాష, విజువల్స్‌ చూపించేచోట కనబడే ఇన్సెన్సిటివిటి లాంటి వాటి గురించి జర్నలిస్ట్‌లకి ఓరియెంటేషన్‌ ఇవ్వడం వల్ల వారు తాము చేసే పొరపాట్లను సరిదిద్దుకునేలా కార్యక్రమాల రూపకల్పన జరిగింది. తాము ఈ విధంగా ఎపుడూ ఆలోచించలేదని, ఈ రెండు రోజుల సమావేశం తమకెంతో ఉపయోగపడిందని వర్క్‌షాప్‌కి  హాజరైన జర్నలిస్ట్‌లు చెప్పారు.

2012 లాడ్లీ అవార్డుల నిర్వహణ బాధ్యత కూడా భూమిక తీసుకుంది. ఈ బాధ్యతతోపాటు బెంగుళూరులో జరిగే జండర్‌ వర్క్‌షాప్‌కి జర్నలిస్ట్‌ల్ని ఎంపిక చేసి పంపించడం జరిగింది. 2012 లో వచ్చిన ఎంట్రీలను పరిశీలించినపుడు చాలా సంతోషం కలిగింది. 2008 నాటికి 2012 నాటికి స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పనలో తేడా చాలా స్పష్టంగా కనబడింది. స్త్రీలను వేధిస్తున్న ఎన్నో సమస్యల్ని తీసుకుని చక్కటి టాక్‌షోలు, డాక్యుమెంటరీలు, వివిధ అంశాల ఆధారిత కార్యక్రమాలు రూపొందించారు. ఐ.పి.సి. 498ఎ, గృహహింస, బాల్యవివాహాలు, బాలికల సమస్యలు, బాల కార్మికుల సమస్య, ట్రాఫికింగ్‌, రోడ్లమీద హింస, ప్రభుత్వ పాఠశాలల దుస్థితి, బాలికలకు బాత్‌రూమ్‌లు లేని విషాదం లాంటి ఎన్నో సమస్యలను తీసుకుని చాలా చక్కటి ప్రోగ్రాముల్ని చాలా చానల్స్‌ రూపొందించాయి. బాలికలకు సంబంధించి ఎన్నో అర్థవంతమైన ప్రకటల్ని, ప్రోమోలను తయారు చేసి ఆయా ఛానళ్ళల్లో విరివిగా చూపిస్తున్నారు. బాలికల విద్య, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా, లింగ నిష్పత్తి తగ్గిపోవడం గురించి, లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి ఆడపిండాలను హత్యలు చేయడం గురించి ప్రకటనలు చూపిస్తున్నారు. ఈ ప్రకటనల ద్వారా ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం.

2008 సంవత్సరం నుండి క్రమం తప్పకుండా మీడియాలో జండర్‌ స్పృహ పెంపొందించే విధంగా ‘లాడ్లీ’ కార్యక్రమం కొనసాగుతుండడం వల్ల వచ్చిన మార్పు 2012 ఎంట్రీలలో చాలా స్పష్టంగా కనబడింది. స్త్రీల పరంగా మీడియాలో జండర్‌ సెన్సిటివిటీని పెంపొందించే కార్యక్రమంలో భూమిక కూడా భాగస్వామి కావడం, ‘లాడ్లి ఇంపాక్ట్‌’ చాలా బాగా కనబడడం నాకు చాలా సంతోషం కల్గించే అంశాలు. ప్రధాన స్రవంతి మీడియాలో జండర్‌ స్పృహను ప్రవేశపెట్టడం ద్వారా లక్షలాది మందికి బాలికల, స్త్రీల అంశాల పట్ల ఒక ఆశావహమైన అవగాహనను కల్గించే వీలువుంది. ఈ అవగాహనని లాడ్లీ ప్రోగ్రామ్‌ ద్వారా మేము ప్రధాన స్రవంతి మీడియాలో విజయవంతంగా ప్రవేశపెట్టగలిగాం. ‘లాడ్లీ’ అంటే జండర్‌ స్పృహకి పర్యాయపదంగా మీడియాలో విస్తృత ప్రచారం పొందింది. దాని కనుగుణంగానే ఎంట్రీలు రావడం జరిగింది.

అయితే ఎలక్ట్రానిక్‌ మీడియా నుండి వచ్చినట్టుగా ఎంట్రీలు ప్రింట్‌ నుండి రావడం లేదు. మరీ ముఖ్యంగా తెలుగు మీడియా నుండి అస్సలు రావడం లేదు. తెలుగు దినపత్రికలలో మహిళల పేజీలు కుంచించుకుపోవడమే దీనికి కారణమనుకుంటాను. మహిళల కోసం కేటాయించిన పేజీలలో కూడా మహిళా సమస్యలు/అంశాలకు ప్రాధాన్యతనివ్వకుండా వంటలు/డాక్టర్‌ సలహాలు/అలంకారాలు/వస్త్రధారణ లాంటి అంశాలు నిండిపోతున్నాయి. ఎలక్ట్రానిక్‌ మీడియా తీసుకుంటున్న ఎన్నో సీరియస్‌, వాస్తవ స్త్రీల సమస్యలు/అంశాలు ఈ మహిళా పేజీలలో కనబడటం లేదు. తెలుగు పత్రికల నుండి  ‘లాడ్లీ’ కి ఎంట్రీలు రాకపోవడానికి ఇది కూడా కారణమని నేను భావిస్తున్నాను.

అలాగే ఉర్దూ, హిందీ నుండి పత్రికలున్నప్పటికీ, ఎన్ని సార్లు కోరినప్పటికీ ఒక్క ఎంట్రీ కూడా ఈ సంవత్సరం రాలేదు. అయితే ఇంగ్లీషు పత్రికల నుండి చాలా అర్థవంతమైన, జండర్‌ స్పృహతో వున్న ఎంట్రీలు వస్తున్నాయి. మహిళల పేజీ అంటూ ప్రత్యేకంగా లేకపోయినా, ఎడిట్‌ పేజీలోను, ఓపెడ్‌ పేజీలలోను, మెయిన్‌ పేపర్‌లోను చాలా చక్కటి వ్యాసాలు స్త్రీల అంశాలను విశ్లేషిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం అనుబంధాల్లో క్రమం తప్పకుండా ఇలాంటి వ్యాసాలు వస్తుంటాయి. వీటిల్లో చాలా మటుకు ‘లాడ్లీ ఎంట్రీలు’గా వస్తున్నాయి. ఈ ధోరణి తెలుగు ప్రింట్‌ మీడియాలో కనబడకపోవడం బాధాకరం. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన స్త్రీల సమస్యలు, ఎన్నో రకాల ఉద్యమాలు స్త్రీలపరంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి నేరాల చిట్టాలో ఎన్నింటిలోనో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో వుంటూ వస్తోంది. మహిళలపై హింసలో మనమే నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో వుంటున్నాం. హెచ్‌ఐవి, ట్రాఫికింగ్‌, బహిరంగ హింస, గృహహింస, ఆసిడ్‌ దాడులు ఇలా ఎన్నో అంశాలలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. అలాగే ‘అభివృద్ధి’ పేరుతో జరుగుతున్న విధ్వంశంలో ఎక్కువగా ప్రభావితమవుతున్న వాళ్ళు మహిళలే. అందుకే ‘అభివృద్ధి నమూనా’ ను ప్రశ్నిస్తూ కదంతొక్కుతూ, తుపాకీ గుళ్ళకు సైతం వెరవని మహిళలు దర్శనమిస్తున్నారు. ఒక వైపు నానారకాల హింసల నెదుర్కొంటూనే మరోవైపు ఎన్నో ఉద్యమాలలో అగ్రభాగాన నిలబడుతున్నారు స్త్రీలు. ఇవన్నీ మీడియాలో ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తున్నయా అంటే లేదనే చెప్పుకోవాలి. ఇవన్నీ సంచలనాత్మక వార్తలుగా దర్శనమిస్తుంటాయి తప్ప, సెన్సిటివిటీతో మానవీయంగా వుండవు. అత్యాచార బాధిత మహిళల విషయంలో జండర్‌ స్పృహలేనితనం మరింత ఎక్కువగా వుంటోంది. చాలాసార్లు బాధిత స్త్రీని నేరుగా కెమెరా ముందు నిలబెట్టడం, ముఖాన్ని చూపించడం, పేరును, గుర్తింపును ప్రకటించడం, టీవీ స్టూడియోలో కూర్చోబెట్టి చర్చలు నిర్వహించడం లాంటి ఇన్సెన్సిటివిటీతో వ్యవహరించడం చాలా ఎక్కువగానే కనిపిస్తోంది.

కొన్ని ఛానళ్ళ ఎంట్రీలను పరిశీలించినపుడు బాధతో పాటు కోపం కూడా తన్నుకొచ్చింది. ట్రాఫికింగ్‌, కమర్షియల్‌ సెక్స్‌వర్కర్స్‌, ఆడపిండాల హత్యలు లాంటి అంశాల మీద చేసిన ప్రోగ్రామ్‌లలో వాడిన స్క్రిప్ట్‌, భాష, విజువల్స్‌ చాలా ఘోరంగా వున్నాయి. ఏంకరింగ్‌ కూడా చాలా వెకిలిగా, ఎలాంటి సీరియస్‌నెస్‌ లేనితనం కూడా స్పష్టంగా కన్పించాయి. తీసుకున్న అంశం మంచిదే అయినప్పటికీ, అది స్త్రీలను వేధిస్తున్న సమస్యే అయినప్పటికీ,  దానిని ప్రెజెంట్‌ చేసే తీరు చాలా సార్లు నాసిరకంగా, సంచలనాత్మకంగా వుండడం వల్ల ఆ కార్యక్రమం నాణ్యత కూడా పడిపోతుంది. ముఖ్యంగా గర్భస్థ ఆడపిండాల హత్యల్ని భ్రూణ హత్యలుగా వర్ణించడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అల్ట్రా సౌండ్‌ మిషన్‌ల ద్వారా సెక్స్‌ సెలక్షన్‌ పరీక్షలు చేసి, ఆడపిండాలను అబార్షన్‌ చేయడం వేరు, అబార్షన్‌ వేరు అనే దానిపట్ల మీడియాలో స్పష్టమైన అవగాహన లేదు. భ్రూణ హత్యల్ని నిషేధించాలి అంటూ మాట్లాడటం చాలా సార్లు, చాలా ప్రోగ్రామ్స్‌లో కనిపిస్తూంటుంది. ఈ పదం వాడడం ద్వారా ఎన్నో మంచి ఎంట్రీలు సైతం అవార్డుల్ని కోల్పోయిన సంఘటనలు ఈ నాలుగేళ్ళలో చాలాసార్లు జరిగాయి. ‘అబార్షన్‌’ మహిళా ఉద్యమం సాధించుకున్న హక్కు. భ్రూణహత్యల్ని నిషేధించాలి అంటే అబార్షన్‌ని నిషేధించాలని డిమాండ్‌ చెయ్యడం అవుతుంది. అంటే మహిళలకి వ్యతిరేకంగా చేస్తున్న డిమాండ్‌ అన్నమాట. తెలిసో తెలియకో మీడియా భ్రూణహత్యలనే పదాన్ని చాలా విస్తృతంగా వాడుతోంది. నిజానికి మనం డిమాండ్‌ చెయ్యాల్సింది ఆడపిండాల హత్యల్ని, సెక్స్‌ సెలెక్షన్‌ పరీక్షల్ని నిషేధించమని. గర్భస్థ పిండం సెక్స్‌ని ఆల్ట్రా సౌండ్‌ మిషన్‌ల ద్వారా తెలుసుకొని ఆ పిండాలని అబార్షన్‌ ద్వారా నిర్మూలించడం, చంపేయడం దుర్మార్గమని, దీనివల్ల సమాజంలో స్త్రీ, పురుష నిష్పత్తి దారుణంగా పడిపోయిందనే అవగాహనతో చేయాల్సిన కార్యక్రమాల్లో భ్రూణ హత్యలు నిషేధించాలనే పదం వాడడం వల్ల ఆ కార్యక్రమమంతా ఎంత బావున్నా అది స్త్రీల వ్యతిరేకంగానే ముద్రపడిపోతుంది. ఈ అంశాన్ని జర్నలిస్ట్‌ల కోసం నిర్వహిస్తున్న మీడియా వర్క్‌షాప్‌లలో వివరించడం జరుగుతోంది. ఆయా వర్క్‌షాప్‌లకి హాజరయ్యే జర్నలిస్ట్‌లు తమ పొరపాట్లను సరిదిద్దుకుంటున్నారు. కానీ మెజారిటీ జర్నలిస్ట్‌లకు ఈ అవగాహన లేదు. ఎన్నో పోరాటాల ఫలితంగా స్త్రీలు సాధించుకున్న గర్భస్రావహక్కు (అబార్షన్‌ రైట్‌) ని గౌరవించాల్సిందిగా జర్నలిస్ట్‌ మిత్రుల్ని కోరుతూ భ్రూణహత్యలకు, లింగ నిర్ధారణ పరీక్ష ద్వారా ఆడపిండాల హత్యకు వుండే తేడాని అర్థం చేసుకుని తమ తమ స్క్రిప్ట్‌ల్లో, సంభాషణల్లో, ప్రోగ్రామ్‌ల్లో ఈ పదం దొర్లకుండా జాగ్రత్త పడమని మనవి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘లాడ్లీ’ ప్రచారం వల్ల మీడియా మొత్తంలో జండర్‌ స్పృహ పొంగిపొర్లుతోందనే భ్రమ మాత్రం నాకు లేదు. స్త్రీల కార్యక్రమాలలో స్త్రీల అంశాలకు కొంత ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తోంది కానీ ప్రైమ్‌ టైమ్‌ ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో ఈ స్పృహ కనబడటం లేదు. అలాగే జీళ్ళపాకంలాగా, పొంగుతున్న డ్రైనేజీల్లా కంపుకొడుతున్న సీరియళ్ళ జబ్బుగురించి ఎంత రాసినా తక్కువే. ఈ సీరియళ్ళలోని స్త్రీ పాత్రలు ఏ సమాజానికి చెందుతాయో, అంత అమానవీయంగా ఎందుకు రచయితలు ఆయా కథలు రాస్తున్నారో అర్థం కాదు. ప్రత్యామ్నాయ వినోదం అందుబాటులో లేక, పుస్తకాలు చదవడం అనే కళని కోల్పోవడం వల్ల, సినిమాలనిండా కృత్రిమ ప్రేమల్ని నింపడం వల్ల స్త్రీలు ఈ సీరియళ్ళకి నల్లమందుకి బానిసలైనట్టు అలవాటు పడిపోయారు. లంచ్‌తో మొదలయ్యే ఈ సీరియళ్ళ హింస అర్థరాత్రి వరకు కొనసాగి, ఆయా సీరియళ్ళ భయానక, బీభత్స, అమానవీయ దృశ్యాలే కళ్ళనిండా, మెదళ్ళ నిండా నిండిపోయి పీడకలల్లో సైతం అవే దృశ్యాలను భరిస్తున్న లక్షలాది మహిళలు మన కళ్ళముందు కనబడుతున్నారు. ఎంతో ప్రభావాన్ని చెెయ్యగల ఈ సీరియళ్ళు మహిళల్ని హక్కులపట్ల చైతన్యం కల్పించే కార్యక్రమాలుగా కనీసం అప్పుడప్పుడూ మలిచినా కొంత ప్రయోజనం వుండేది. అలాంటిది వీసమెత్తైనా లేకపోగా మహిళల్ని ఒకరిపట్ల మరొకరు శతృపూరితంగా ప్రవర్తించే పాత్రలుగా మలిచి చూసేవారి మెదళ్ళలోకి విషాన్ని ఎక్కిస్తున్నారు. నాకు సీరియళ్ళని చూసే అలవాటు లేదు కాని పొరపాటున చానళ్ళు నొక్కుతున్నప్పుడు కన్పించే స్త్రీ పాత్రల వస్త్రధారణ, కట్టు, బొట్టు, హావభావాలు, డైలాగులు గమనించినపుడు వీళ్ళు ఏ సమాజానికి చెందుతారా అని అనుమానం వస్తుంది. సమాజంలో మానవ సంబంధాల విధ్వంశం జరిగిన మాట వాస్తవమే కానీ వాస్తవ జీవితంలో, మన చుట్టూ సమాజంలో స్త్రీల మధ్య మానవ సంబంధాలు సీరియళ్ళలో చూపిన పద్ధతిలో మాత్రం లేవు.

అత్తాకోడళ్ళ సంబంధాలు ఇంతకు ముందులా లేవు. ముఖ్యంగా చదువుకున్న కుటుంబాల్లో చక్కటి స్నేహ సంబంధాలు కూడా వుంటున్నాయి. అట్లాగే తోడి కోడళ్ళు, ఆడబడుచులు వీళ్ళ మధ్య సంబంధాలు కూడా చాలా చోట్ల స్నేహపూరితంగానే వుంటున్నాయి. వేగవంతమైన ఈ నాటి కాలపరిస్థితుల్లో ఎవరి జీవితాలకు సంబంధించిన సమస్యలతో వాళ్ళు సతమతమవుతున్నారు. ఎదుటివాళ్ళ గురించి మంచిగానో, చెడుగా ఆలోచించే తీరికలేని చోట ఒకరి మీద ఒకరు కుట్రలు, కుతంత్రాలు, బెదిరింపులు లాంటివి నెరిపే సమయం ఎక్కడుంది? మరి ఈ సీరియళ్ళలోని స్త్రీ పాత్రలు ఏ సమాజం నుంచి, ఏ వర్గం నుంచి, ఏ ప్రాంతం నుంచి ఊడిపడ్డాయి?

నిజానికి ఇరవై సంవత్సరాల స్త్రీల ఉద్యమం స్త్రీల మధ్య పాదుకొల్పిన ‘సిస్టర్‌హుడ్‌ని’ సంఘీభావాన్ని ఈ సీరియళ్ళ సంస్కృతి చావుదెబ్బకొడుతోంది. ఈనాటి హింసాయుత పరిస్థితుల్లో, ఇంటా, బయటా హింసపెరిగిపోతున్న నేపథ్యంలో స్త్రీలలో పెద్ద ఎత్తున సంఘీభావం పెరిగి, ఒకరికొకరు ఆసరాగా, సపోర్ట్‌ సిస్టమ్స్‌ లాగా నిలవాల్సిన స్త్రీల మధ్య శతృపూరిత వాతావరణాన్ని విషంలాగా చిమ్ముతున్న సీరియళ్ళ విషయంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో చీమతలకాయంత జండర్‌ సెన్సిటివిటీ కూడా లేదన్నది కఠోర వాస్తవం. ఒకవైపు స్త్రీల అంశాల పట్ల సీరియస్‌ టాక్‌షోలు చేస్తూ, డాక్యుమెంటరీలు తీస్తూ తాము జండర్‌ స్పృహతో వున్నట్లు నటిస్తూనే తొంభై శాతం కార్యక్రమాల్లో మాత్రం స్త్రీవ్యతిరేక దృక్పథాన్నే కలిగివుంది ఎలక్ట్రానిక్‌ మీడియా.

న్యూస్‌ ఛానళ్ళలో కూడా స్త్రీల అంశాల మీద చర్చలు నిర్వహించేటపుడు చూపించే విజువల్స్‌ చాలాసార్లు బూతు సినిమాల్లాగా వుంటాయి. ఉదాహరణకి ఒక అత్యాచార సంఘటన మీద నిర్వహించే చర్చాకార్యక్రమంలో స్టూడియోలో నిబద్ధతతో, సీరియస్‌గా మాట్లాడే వక్తలు ఒక వైపున వుంటే మరోపక్క బెడ్‌రూమ్‌ దృశ్యాలు, అత్యాచారానికి గురైన బాధిత స్త్రీ వివరాలతోపాటు ముఖం మీద కెమెరాకి ఫోకస్‌ చెయ్యడం లాంటి అమానవీయ ధోరణులకు పాల్పడుతున్నాయి. స్త్రీల అంశాలను సంచలనాత్మకంగా చూపిస్తే పెరిగే రేటింగ్‌ల మీదే దృష్టి తప్ప సెన్సిటివిటీ, మానవీయ కోణం మీద అస్సలు దృష్టిపెట్టనితనం అడుగడుగునా కన్పిస్తుంది. దీనికి కారణం మీడియా హౌస్‌ల వ్యాపార ధోరణి, కార్పోరేటీకరణ. కార్పోరేట్లకి కావాల్సింది లాభాలు. ఆ లాభాలు పిండుకోవడానికి ఆడవాళ్ళ శరీరాలను ఎలా ఉపయోగించుకోవాలో ఉగ్గుపాలతో నేర్చిన కార్పోరేట్‌ మీడియాహౌస్‌ల నుండి జండర్‌ సెన్సిటివిటీని ఆశించడం అత్యాశ అయినా ‘లాడ్లీ’ కార్యక్రమం మొదలైన ఈ నాలుగేళ్ళలో దాని ప్రభావం మీడియా మీద కొంచమైనా వుందా అని అవలోకించినపుడు నా ముందు సాక్షాత్కరించిన దృశ్యాలమాలికే ఈ వ్యాసం. కొండంత మహా సంచలనాల ముందు మినుకు మినుకు మంటోంది ‘లాడ్లీ’ ద్వారా ప్రచారమౌతున్న జండర్‌ స్పృహ. ఈ చిన్ని మార్పే నాలో గొప్ప ఆశను రేపుతోంది. ఆ మహా కొండ మీంచి జండర్‌ స్పృహతో నడిచే కార్యక్రమాలు మా ఊరి వరద గోదారంత ఉధృతంగా వెల్లువెత్తాలనే ఆకాంక్ష నాలో బలంగానే వుంది. ఎందుకంటే నేను ఆశాజీవిని. రేపటిమీద గొప్ప నమ్మకమున్న ఆశావహ దృక్పథం ఉన్నదానిని.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to లాడ్లీ అవార్డుల నిర్వహణలో – నా అనుభవం

  1. rama says:

    స్రిమమతి సత్యవతి గారు
    మీరు వ్వ్రాసిన సమ్పదికియము చలా విషయాలను వెలుగులొకి తెచ్హాయి. ప్రత్యెకంగా తెలివిజ్ న సెరియల్స లొ స్త్రీల పాత్రలు.వీతి ప్రభావము స్త్రీలమీద ఆలవుంది.మీ భూమిక పత్రిక ఆద్లి మిదియ యెవార్ద్ లొ ప్ర్తతెయ్య్కకమయిన పాత్ర వహిస్తూ వుంది.మీ పత్రిక ద్వార స్త్రీల సమస్యలను గూర్చి ప్రజలలొ అవగహనను పెంచి సమస్య పరిష్కారనికి దొహదమ అవుతరని అసిస్తు వున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.