నాగరికతకి మనం ఎంత దూరంలో వున్నాం…?

కొండేపూడి నిర్మల

తుపాకి గుండు శరీరంలోకి దూసుకుపోయినప్పుడు అది వెంటనే తీసేస్తేనే ప్రాణం దక్కుతుంది. ప్రమాదవశాత్తూ కాలికో చేతికో దెబ్బతగిలి గాయం విషమిస్తే ఆ భాగాన్ని కోతపెట్టడమే వైద్యం అవుతుంది. గర్భంలోనే విచ్ఛిన్నమయిన పిండాన్ని సురక్షితంగా తొలగించి తల్లి ప్రాణాన్ని రక్షించడానికి ఒక దేశమూ, మతమూ, చట్టమూ, వైద్యము నిరాకరిస్తున్నాయంటే అక్కడ మహిళలకున్న మానవహక్కుల పరిస్థితి ఏమిటి..? సవిత కేసు చదివాక నేనెంతో వేదనకి గురయ్యాను. అసలు గర్భస్రావాన్ని గురించి నాలో ఎప్పటి నుంచో వున్న ప్రశ్నలు కూడా మళ్ళీ రేగాయి. ఈ కేసు విషయానికే వద్దాం. వృత్తిరీత్యా ఐర్లండులో వుంటున్న భారతీయ దంత వైద్యురాలు అయిన సవితాహలప్పనవార్‌ అక్టోబరు ఇరవై ఆరున తీవ్రమయిన వెన్నునొప్పితో గాల్‌ వే యూనివర్సిటీ ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఆమెకు గర్భస్రావమయింది. పిండ శకలాల్ని తొలగించి కడుపును శుభ్రం చెయ్యడానికి బదులు గర్భస్రావానికి తమ కేధలిక్‌ దేశం అనుమతించదని చెప్పి కడుపులో వున్న పిండానికి గుండె కొట్టుకోవడం నిలిచిపోయేవరశీరి చికిత్స చెయ్యడానికి నిరాకరించారు వైద్యులు. తాను భారతీయురాలినని, తనకు సహజంగానే గర్భస్రావం జరిగిందని, తనది ఐర్లండ్‌ కాని, కాథలిక్‌ మతం కాని కాదని కాబట్టి తప్పనిసరిగా డీ అండ్‌ సి చేయాలని ఆమె ఎంతగానో వేడుకుంది. ఎవరూ వినలేదు. మూడు రోజులపాటు నరకయాతన అనుభవింపచేసి, చివరకు పిండం మరణించిందనే నమ్మకం కలిగాక వైద్యులు చికిత్సకు పూనుకున్నారు. జరిగిన ఆలస్యానికి తిరుగులేని పరిహారంగా సవిత మరణించింది. సెప్టిసేమియాతో మరణించినట్టు డెత్‌ రిపోర్టు కూడా వచ్చింది. అదే దేశంలో వున్న ఆమె భర్త ప్రవీణ్‌ హలప్పనవార్‌, బెల్గాంలో వుంటున్న సవిత తల్లిదండ్రులు ఐరిష్‌ చట్టాలపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. పదిహేడువారాల పిండంకోసం ముప్పయ్యేళ్ళ నిండు ప్రాణాన్ని పొట్టనపెట్టుకున్న ఆ దేశాన్ని ఇప్పుడు అన్ని వర్గాలూ తిట్టిపోస్తున్నాయి.

జరిగిన దారుణానికి గాల్‌ వే యూనివర్సిటీ గైనకాలజిస్టులు మాత్రమే నిందితులా..? మానవత్వం కంటే మత నిబంధనలే ముఖ్యమైపోయిన దేశంలో అంతకంటే విచక్షణ ఆశించడమే వ్యర్థం.. వార్త వెలుగులోకి వచ్చేశాక చట్టాన్ని సమర్ధించుకోవడానికి గాను మతపెద్దలు కానీ, ప్రభుత్వాలు కాని ఇప్పుడు ఏమని అంటున్నారు? తల్లి కనక ప్రాణాపాయ స్థితిలో వుంటే గర్భస్రావం చేయవచ్చట! అప్పుడు అది తల్లికి వుండాల్సిన ప్రాణ రక్షణ హక్కు కాదు. ఒక ఉద్రిక్త చట్టానికి వున్న తాత్కాలిక సడలింపు మాత్రమే. వైద్యులు అలా నిర్ణయించలేకపోతే, రోగి ఎంతగా ఆక్రోశించినా వినరు. ఒకవేళ తల్లికి ప్రాణం పోదనుకుంటే ఆ గర్భం వల్ల ఆమె శారీరక మానసిక ఆరోగ్యాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎంతధ్వంసమయినా సరే మాట్లాడేందుకు లేదు. స్త్రీలకు సంబంధించిన ఏ చట్టాన్ని అయినా చూడండి. చట్టం కంటే లోపాలే పటిష్టంగా అమలవుతాయి. మత ప్రమేయంలేని లౌకిక రాజ్యమయినా గాని ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ లేదు.

ఐర్లండు దేశంలో ఎన్నో వేలమంది స్త్రీలు గర్భస్రావ హక్కుని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. అయిదు ప్రభుత్వాలు మారినా అది జరగలేదు. పక్క దేశమైన ఇంగ్లండ్‌లో ఆ చట్టం అమలులోకి వచ్చి యాభై ఏళ్లయింది. చట్టాలు మారేవరకూ గర్భాలు ఆగవు కాబట్టే అంతకాలం నుంచీ స్త్రీలు ఐర్లండ్‌లో వచ్చిన గర్భాల్ని బ్రిటన్‌కెళ్ళి తొలగించు కుంటున్నారు. లేదా నిబంధనల పుణ్యమా అని నిస్సహాయంగా మరణిస్తున్నారు. ఇంకోలా చెప్పాలంటే బతకదల్చుకుంటే బ్రిటన్‌కి, చావదల్చుకుంటే ఐర్లండ్‌లోనూ వుండిపోతున్నారు. అదే కనక ఒక మగవాడయితే వేసక్టమీ చేయించుకోవాలో, మానుకోవాలో అతనిష్టం. కనడంలోనే కాదు నియంత్రణ విషయంలోనూ అతని భాగస్వామ్యం వుండక్కర్లేదు. అతను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అవి చట్టానికి, న్యాయానికి అడ్డుకావు. కానీ గర్భాలు అలా కాదు కదా. వాంఛనీయత, అవాంఛనీయత అనే రెండు దశలుంటాయి. ఏ దేశంలో అయినా అత్యాచారం జరక్కుండా ఆపే రక్షణ యంత్రాంగం లేదు. కానీ దాని ఫలితంగా వచ్చిన గర్భాల మీద మాత్రం అంతులేని నిఘా వుంది. శిక్ష వుంది, వెలివేత వుంది. పనికి రాని ఫ్యామిలీ ప్లానింగు విధానాల వల్ల గానీ, బాధ్యతతీసుకోదల్చుకోని దొంగ ప్రియుడి వల్ల గానీ, లేదా భర్తవల్ల గానీ గర్భాలు రావచ్చు. ఇక శాస్త్రీల అశాస్త్రీయ తొలగింపుకి కారణాలూ మార్గాలూ కోకోల్లలే వుంటాయి. కాన్పుకి సిద్ధంగా లేని అనారోగ్యవంతులు, జెనటిక్‌ వ్యాధులు రాగల అవకాశం వున్న వారు, భర్తల్ని కోల్పోయినవారు. ఇలా అనేకమంది ఈ కోవలోకి వస్తారు. కాగా కాన్పు అయ్యేంతవరకూ వున్న తొమ్మిది నెల్ల వ్యవధిలో ఎప్పుడయినా గర్భవిచ్ఛిత్తి జరిగిపోయే పరిస్థితి కొందరిలో వుంటుంది. కాబట్టే పిండాన్ని పుట్టేవరకూ శిశువు అనరాదనే వాదన కొందరు చేస్తారు. పుట్టిన తర్వాత కూడా కనీసం ఏడాది వరకు బాలారిష్టాలు వుంటాయి. ఈ సమస్యలు తల్లులకి తెలిసినంతగా విజ్ఞలయిన మత పెద్దలకి తెలిసే అవకాశంలేదు. నిన్నటి పిండాలే నేటి శిశువులు. నేటి శిశువులే రేపటి భావి భారత పౌరులు. అనుకోవడానికి బానే వుంటుంది. అయితే ఆ గర్భాన్ని మోస్తున్న తల్లికిక ఎలాంటి హక్కులు వుండవా..? ఆమె పిల్లల్ని కనే తోలుసంచీ మాత్రమేనా??? ఆ సంచీకి సూదులు గిచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయచ్చు ఆ సంచి తయారు చేసిన బొడ్డుతాడు లోంచి మూల కణాలు తీసుకోవచ్చు. ఆ సంచీని అద్దెకిచ్చి ఎన్ని దందాలయినా చెయ్యచ్చు. ఆ సంచీలో వున్న పిండం ఏ జెండరులో, ఏ చర్మపు రంగులో పుట్టాలో ప్రయోగాలు చెయ్యచ్చు. ఆ సంచీ కారణంగా ఉత్పత్తిఅయిన పాల కోసం బ్యాంకులు నడుపుకోవచ్చు. ఇవన్నీ అఖండమయిన సాంకేతిక విజ్ఞాన ఫలితాలే. స్త్రీలెవరూ సాంకేతికతని వ్యతిరేకించడం లేదు. ఆ ఫలితాలు, సౌకర్యాలు తమవి కూడా ఎందుకు కావడం లేదు అని వాపోతున్నారు. తాము నివసించే ఈ మట్టికి ఎప్పుడు నాగరికత వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

2 Responses to నాగరికతకి మనం ఎంత దూరంలో వున్నాం…?

 1. david says:

  నిర్మల గారు మహిళా గర్భస్రావం పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఐర్లాండు చట్టాలను మార్చెందుకు ప్రతిఒక్కరు ఉద్యమించాలి..మీ వివరణాత్మక వ్యాసమ బాగుంది.

 2. రావు says:

  ఐర్లండు దేశమా? ఆ దిక్కు మాలిన దేశం ఎక్కడుందో!! తలుచుకుంటేనే చీదర పుడుతోంది.
  ఈనాటికీ ప్రపంచంలో ఎన్నో చోట్ల స్త్రీ వివక్ష చాలా ఘోరంగా వుంది. ఆ వివక్ష మీద పోరాటం తప్పదు. ఎటొచ్చీ ఆ పోరాటం తెలివి తక్కువగా మాత్రం చెయ్యకూడదు. శాశ్విత పరిష్కారం వేపు పని చేస్తూ, తాత్కాలిక పరిష్కారం సంపాదించు కోవాలి. లేక పోతే కొత్త సమస్యలు ఉద్భవిస్తాయి.

  స్త్రీలూ, పురుషులూ శతృ వర్గాల వాళ్ళు కారు. వాళ్ళ మధ్య శతృ వైరుధ్యం లేదు. స్త్రీల మీద వివక్ష అంతా పురుషుల వల్లే వచ్చినా, ఆ వివక్ష పోవాలంటే పురుషులు కూడా చైతన్య వంతులు కావాలి. ఇప్పటికే చైతన్యవంతులైన పురుషులు కూడా బాగానే వున్నారు. ఈ పోరాటాలకి స్త్రీలతో చెయ్యి కలిపే పురుషులు చాలా మందే వుంటారు. కాబట్టి మొత్తం పురుష వర్గాన్ని శతృ వర్గంగా జెమకట్టి, మాట్టాడకూడదు.

  ఈ వ్యాసం లోని ఈ మాటలు చూడండి:
  “అదే కనక ఒక మగవాడయితే వేసక్టమీ చేయించుకోవాలో, మానుకోవాలో అతనిష్టం. కనడంలోనే కాదు నియంత్రణ విషయంలోనూ అతని భాగస్వామ్యం వుండక్కర్లేదు. అతను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అవి చట్టానికి, న్యాయానికి అడ్డుకావు.”

  1. వేసక్టమీ ఆపరేషన్ని గర్భ స్రావాలతో పోల్చకూడదు. ఆ దేశంలో స్త్రీలకి గర్భ నిరోధక ఆపరేషను చేయించుకునే హక్కు లేదా? లేకపోతే, ఆ విషయం గురించి మాట్టాడాలి. అప్పుడు వాటిని పోల్చవచ్చు. గర్భ స్రావం విషయం వేరు. దీనర్థం, స్త్రీలకి గర్భ స్రావ హక్కు వుండ కూడదని కాదు.

  2. పురుషులకి ఒక హక్కు వుండి, స్త్రీలకి అటువంటి హక్కు లేనప్పుడు, ఆ హక్కు కలిగి వుండటం “చెల్లుబాటు” అవదు. అది వారికి సహజంగా వుండాల్సిన మంచి హక్కు. దాని మీద విరుచుకు పడితే, తప్పర్థాలు వస్తాయి. అలాంటి మంచి హక్కు స్త్రీలకు కూడా వుండాలని పోరాడాలి. ఏ దేశంలో అయినా పురుషులకి కూడా అటువంటి హక్కు లేకపోతే, దాని మీద పురుషులు కూడా పోరాడాలి.

  3. ఏ దేశంలో అయినా సరే, స్త్రీలకి వారి శరీరాల మీద హక్కులు వాళ్ళకే వుండాలి. అదే కరెక్టు. గర్భ స్రావం అనే విషయం స్త్రీలకి మాత్రమే పరిమిత మైన విషయం. దాన్ని వేరే విషయంతో పోలిస్తే, అది తప్పు అవుతుంది.

  స్త్రీ వివక్ష పోరాటాలకి చైతన్య వంతులైన పురుషులు కూడా కలిస్తే, ఆ పోరాటాలు మరింత గట్టిగా జరుగుతాయి. ఈ ఉద్యమాలలో చైతన్య వంతులైన పురుషులని కలుపుకోవడం అనేది ఒక భాగంగా వుంటే, ఆ ఉద్యమాలు చక్కగా సాగుతాయి.

  రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో