తొవ్వ

జయప్రకాష్ మాటేటి

గాలికి కిటికీలు టపటప కొట్టు కుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది. టైం ఎంతైందో అనుకుంటనే ఉన్న. దూరంగ పదకొండు గంట్ల సీటీ ఇనొచ్చింది. వానకు ట్రాన్స్ఫార్మర్ పేలి కరంట్ పోయింది. దీపం పెట్టుకొని సంటోన్ని కాల్లమీద ఏసుకొని ఊపుతుంటె ఎప్పుడు కన్నంటుకున్నదో తెలువలే.

రేకుల మీద రాల్లు పడ్డట్టు పడ్తాంది వాన. జర గట్టిగ ఇంకో గాలొస్తే ఎగిరిపోతయా అన్నట్టు ఉన్నయా రేకులు. “ఇయ్యాలేందో జోరుగ పడ్తాంది వాన!” అన్నది పక్క అర్రల నుంచి మా అత్త, గిప్పుడామె తోటి మాట్లాడుడు నా తోటి కాదని ఏం సప్పుడు జెయ్యలే. “ఏం శంద్రవ్వ! పండుకున్నవా? అయ్యో మాట్లాడరేందుల్ల… ! అని ఏదో గొనుక్కుంట మల్ల పన్నది.

ఇంట్ల వండుకుందామంటె కూర గాయలు లేకపోయె. ఇన్ని నూకలేసు కుందామంటె గాస్నూనె అన్న లేకపోయె. రెండు దినాలైంది నా పెనివిటి మొకానొచ్చి. ఇదివరకు సొలుక్కుంటనో బొర్రుకుంటనో ఇంటి మొకాన ఒచ్చి నాలుగు రాల్లు మొకాన కొట్టేది. ఇప్పుడు అవిసుత లేవు. ఎప్పుడత్తడో ఎప్పుడు పోత్తడో ఎన్నాల్లెకొత్తడో సుత ఎరుకైతలే. సంటోనికి దగ్గుమందు తెమ్మని శెప్పి చిట్టి శేతుల బెడితె అటే బోయె. మందులేక ఇప్పుడు జరం బట్టె. కనీసం కూలికన్న బోదామంటె ఈ వానొకటి. సంటోన్ని ఈ ముసలిదాని చేతుల పెట్టి పోనీకి మనసొప్పదాయె.
పెండ్లైన కొత్తల మల్లేషు ఇట్ల ఉండక పోతుండె. ఆ షావుకారు దెగ్గర జీతం ఉన్నప్పుడన్న మంచిగుంటుండె.
యాల్లకు ఇంటికొచ్చేది. యాల్లకు ఇంత తిని పండుకునేది.
ఏమైందో ఏందో ఒకనాడు ఇంకెవడో బద్మాష్గాని సాయితబట్టి సేటు లేనపుడు గల్ల పలగ్గొట్టనీకి సూస్తుంటె పక్క, దుకునమోడు సూశి పోలీసులకు పట్టిచ్చిండట. పెండ్లై యాడాది సుత గాలే నాకేమో పానం వణుక బట్టింది. మా మ్యానమామ వాల్ల ఊర్ల సర్పంచికి ఎవరో తెలిశినోల్లు ఉన్న రని చెప్తె, పైరవీలు జేశి వాని కాల్లు బట్టి, వీని చేతులు తడిపి నంక నల్బై దినాలకేమో బైట బడ్డడు.
పక్కనేదో పిడుగు పడ్డట్టున్నది. సప్పుడుకు సంటోడు లేశిండు, రేకుల సప్పుడుకి నిద్రపడ్తలేనట్టున్నది ఒకటే ఏడ్పు. తాగిపిద్దామంటె పాలుసుత ఇంకి పాయె. ఏం జెయ్యాలనో సమజైతలేదు, చిన్నోన్ని మా అత్త పక్కల ఏశి పక్కింటికి పోయి వాల్లను వీల్లను అడుగంగ ఇన్ని పాలు దొరికినయి.
అవి ఇన్ని కాగబెట్టి పోశినంక జర నిమ్మలమై పన్నడు. వాడలకొచ్చి మేయిన్ రోడ్డు దిక్కు మల్లేషం జాడ సూసుకుంట నిలబడ్డ. దూరంగ ఏదో బండి కన్లబడితె దగ్గెరికొచ్చే దానుక సూశిన, వాడు మా ఇల్లు దాటంగనే తిప్పుకొని పక్క సందులకు పొయ్యిండు.
ఎదురుంగ ఇంట్ల ఏమో లొల్లి ఇనబడుతాంది, పరీచ్చగ ఇంటె పోశమ్మ గొంతు ఇనొచ్చింది. పోశమ్మ చీకట్లనే లేశి మార్కెట్ పొయ్యి, లారీల నుంచి కూరగాయలు దింపుకొని, పొద్దంత రెక్కలిరుసుకొని కూరగాయల్ని అమ్ముకొని ఇల్లుజేరేసరికి దాని మొగడు పనీ పాటలేక తప్పదాగి ఉంటడు. రోజు గదె భారతం. ఈ కొత్త సర్కారొచ్చినంక ఏమిచ్చినా ఇయ్యకపోయినా వాడ వాడకో బరాండీ దుకునం తెరిశె. దరిద్రపు మందు, ఆల్ల బతుకుల్ల మన్నువడ. పోశమ్మ మొగుడు తాగితె తాగిండు, కమస్కం తాగి ఇంట్లనే బొర్రుతడుగద, మా మల్లేషు లెక్క ఇంట్ల పెండ్లాం పిల్లలు ఉన్నరన్న సోయి సుత లేకుంట ఊర్ల మీద బడి తిరుగుతలేడు గద!

వాన బడ్తాంది గని లేకుంటె ఈ యాల్లకి వాడల సగం మంది ఇంట్ల ఈ లొల్లే ఇనొత్తది. తాగొచ్చి పెండ్లాన్ని కొట్టెటోడు ఒకడైతె, పెండ్లాం బతికుండగనే ఇంకో దాన్ని తెచ్చి ఇంట్ల ఉంచుకునేబోడు ఇంకోడు. ఎన్నని జెప్పాలో ఇంటింటికి ఉండే రామాయనం అని ఊకునేటట్టు లేదాయె. మొన్న ఆ మధ్య పక్కవాడల సుశీల సూశి శూశి దానితోటి గాక ఒకరోజు, అదే పొయ్యి ఒక అర్దశీరు మందు తెచ్చి, కోడికూర బెట్టి దాని మొగుడు తాగి పన్నంక రోకలి అందుకొని వాని తలకాయ పలగ్గొట్టిందట. నాకు సుత ఒకోసారి కోపమొచ్చినప్పుడు రోకలి దిక్కు సూత్త. కని వాన్ని సంపి నేనే దేశానికి పోవాలె, సంటోన్ని ఈ ముసలిదాన్ని ఏం జెయ్యాలె.

గాలికి గొడుగు కొట్టుకుంటాంటె లోపలికి బొయ్యి మా అత్తకింత సద్దన్నం పెట్టిన. సంటోన్ని కాల్లమీద ఏసుకొని కిటికీల నుంచి చీకట్ల వానను సూత్తాన. దానికేం కట్టమొచ్చిందో సాయింత్రం సంది దారబెట్టి ఏడ్శినట్టు కొడుతాంది వాన.
మల్లేషు జైల్లనుంచి బైటికొచ్చినంక మా మ్యానమామ దగ్గెరుండి మిత్తికి పైసలు ఇప్పిచ్చి ఒక ఆటో కొనిపిచ్చిండు. అప్పటి సంది మల్లేషుల కొంచం మార్పు కనొచ్చింది. మంచిగనే పైసలొచ్చేటియి, మేము ఇదివరకున్న వాడలనే అవుతల మొకాన రేకులేశిన రెండు రూముల ఇల్లొకటి కిరాయికి తీసుకున్నం. మెల్లమెల్లగ అప్పు తేర్పుడు మొదలుబెట్టినం.

ఆ మద్యలనే నెల తప్పింది నాకు. మతలాబు పంపుతె సూశిపోనీకి మా నాయినొచ్చిండు. మీ అమ్మ బతికున్నా నీ కాన్పుకు దగ్గర ఉండి నిన్ను సూసుకును. ఈ పట్నంల నువ్వొక్కదానివి ఎట్లైతదో ఏందో బిడ్డా అనుకుంట నా చేతుల మొకంబెట్టి ఏడిశిండు. పక్కింటోల్లుండి దైర్నం జెప్పినంక జర పానం సల్లబడ్డది. రాత్రికి ఉండి పొద్దుటి రైలుకు ఊరికి పైనమైండు.
అంత మంచిగున్నది అనుకుంటాంటి ఓ రోజు, మా అత్త, మా ఆడిబిడ్డోల్ల ఇంట్ల లొల్లి బెట్టుకొని బట్టల మూట నెత్తిమీద బెట్టుకొని ఒచ్చింది. నాకు ఆరో నెల నిండు తాంది అప్పుడు, నాలుగు దినాలు బాగనే ఉన్నం. నాకు పానం మంచి గనిపిత్తల్లేదు, దాంట్ల మా అత్తకు అన్ని చేశి పెట్టుడైతలేదు. గదే ముచ్చట చెప్పిన, గయ్యిమని ఎగబడ్డడు మల్లేషు. గట్లనే రేషం మీద చేతిలున్న ఛా గిలాస గట్టిగ గోడకు ఇసిరిగొట్టి బైటికి పోయిండు. రాత్రికి ఒచ్చినంక ఏం మాట్లాడ కుంట తిని పండుకున్నడు. నోట్ల నుంచి మందు వాసనొచ్చింది, ఎప్పుడు లేంది గిదేం అలువాటు అనుకున్న.

రోజు రోజుకి మా అత్తతోటి పంచా యితిలు ఎక్కువైనయి, గట్లనే మల్లేషు తాగుడు అలువాటు సుత. ఎంత దుక్క మొచ్చినా కడుపులనే దాసుకుంటుంటి. చానమాట్లు నా కోసం గాక పోయినా కడుపుల పెరిగే బిడ్డకోసమన్న ఈ తాగుడు ఇడిశిపెట్టమని, ఒట్లు పెట్టిచ్చుకునేది. ఇన్నట్టే ఇనేది, మల్ల గట్లనే తాగొచ్చేది. మిత్తి కట్టుడు బందైంది, దాని తోటి మిత్తికిచ్చిన శావుకారి ఇంటి మీదికి ఒచ్చుడు మొదలుబెట్టిండు.
మా అత్త తినుడు అయింది, పల్లెం ఆడ పడేశి ఒచ్చి ఎదురుంగ నిలబడ్డది. నేనేం సప్పుడు జెయ్యకుంట కూసున్న. సూశి సూశి “శంద్రవ్వ, మల్లేషం ఏడి గింత యాల్ల అయింది ఇంక రాలె, శీటీ సుత ఇచ్చింర్రు… ఎందో బిడ్డ ఏడున్నడో, యాల్లకింత తిన్నడో లేదో !” నాకు కడుపుల మసులబట్టింది, ఆమె ఏమన్న ఒర్రుకోనీ అని, సప్పుడుజెయ్యక కూసున్న. నేనోమాట అన, ఆమెమాట అన, ఎందుకొచ్చిన గోస?
ఎప్పుడన్న ఏమన్న మాట్లాడాల్నంటె మల్లేషు సోయిల ఉంటడా పాడా. రాత్రి ఏ యాల్లకో ఇంటికొచ్చెటోడు, సోయి ఉంటె ఇంత తినెటోడు, లేకుంటె అట్లనె పండుకునేటోడు. పొద్దుగాల ఒకో పాలిలేశి మొకంగూడ సూడకుంట అట్లనే ఆటో ఏసుకొని పోయేది. ఒక పాలి గట్లనే చెప్పక జెయ్యక పోతాంటె సూశి బండికి అడ్డం నిలబడితె నాతోటి పంచాతి పెట్టుకున్నడు. కొన్ని దినాలకు కొట్టుడుసుత మొదలు బెట్టిండు. మొదట్ల వాడల ఉన్నోల్లన్న అడ్డంబడేది, వాల్లనుసుత తిట్టుడు మొదలు బెట్టిండు. సూశి సూశి ఈ తాగుబోతోని తోటి మాకేంది అన్నట్టు వాల్లు గూడ చెప్పుడు బందు పెట్టింరు.
తొమ్మిది నెల్లు బడ్డా, మల్లేషు పత్తకు లేకుంట పోయిండు. ఎప్పుడన్న మందు దుకునంలనో, చాయి హోటల్లనో ఎవలకన్న కనబడ్డప్పుడు అరుసుకుంటె, వాల్లమీదికి ఎగబడేదంట. సూత్తాంటేనే నెలలు నిండినయి, నాకు నొప్పులొచ్చినప్పుడు యాడ తాగిపన్నడో సుత ఎరుకలే మల్లేషంకి. పక్కింటోల్లే తీసుకపోయి సర్కారు దవాకాన్ల జేరిపిచ్చి మా ఊరుకి మతులాబు పంపిచ్చింరు. మా నాయన మా మ్యానత్తను ఎంబడి బెట్టుకొని వచ్చిండు. పెద్దాపరేషన్ అయింది. మొగపిలగాడు పుట్టిండు.
మొగపోరడు పుట్టిండు అని సంబరపడాల్నో, వాడుసుత వాని అయ్యలెక్క అయ్యి జీవుల్ని సంపుక దింటడో సమజ్గాలే. కాన్పు అయినంక ఇంటికి తీసుకోని వచ్చి నాలుగు దినాలుండి పోయింరు మావోల్లు. ఏడనో కూసొని తాగుతాంటె ఎవలో సూశి ‘ఏం రా మల్లేషు నీ పెండ్లానికి ఆడ కాన్పయితాంటె నువ్వేందిరా! ఈడ కూసొని తాగుతానవు?’ అంటె అట్లనె తాగుబోతు మొకం ఏసుకొని దవాకాన్లకు ఒచ్చిండు. కొడుకును ఎత్తుకుంటా అని లొల్లి బెడ్తాంటె ఆడున్న నర్సమ్మలు ‘తాగింది
నాకు ఎనిమిదెల్లి దిగినంక, పొద్దుగాల రా పో’ అని తిట్టి పంపిచ్చింరు.
సంటోడు పుట్టినంక ఏమనుకున్నడో ఏందో, కొన్ని దినాలు బాగనే తాగకుంట ఇంటి దిక్కే ఉన్నడు. రెండు నెల్లు ఎల్లినంక మల్ల కత మొదటికొచ్చింది. అల్లున్ని సూశి పోనికి ఆడిబిడ్డ వస్తె వండి చేశిపెడ్తలేనని, బాలింతనని సుత సూడకుంట తన్న బట్టిండు, ‘నువ్వొద్దు నీ చెల్లొద్దు పో’ అని సంటోన్ని సంకలేసుకోని మా ఊరికి బోయిన. నేను ఊరికి మూడు వారాలు దగ్గెర బడ్డాంటె నన్ను తీసుకపోనీకి మల్లేషమొచ్చిండు. మా నాయిన ఏం మాట్లాడలే ‘ఉంట అంటె ఉండు బిడ్డా, నా రెక్కలున్నన్ని రోజులు నిన్ను సాదుత, పోత అన్నా అడ్డం బడ, నీ ఇష్టం’ అన్నట్టు కండ్లల్ల నీల్లు బెట్టుకొని సూశిండు. మల్లేషు నా కాల్ల మీద పడుడు తప్ప అన్ని తీర్ల బతిలాడ బట్టిండు, సంటోని మీద ఒట్లు బెట్టుకుంట.

రెండు రోజులైనంక మల్లేషం తోటి పట్న మొచ్చిన. రెండు నెలలు మంచిగనే ఉన్నడు, తాగినా చేసినా యాల్లకు ఇంటికొచ్చేది నాలుగు పైసలు చేతుల బెట్టేది. నేను జర మెత్తబడంగనే మల్ల తాగుడు ఎక్కువ జేసిండు. ఏమన్నా ఎదురుజెప్పుడు మొదలు బెట్టిన, నోరు మూసుకోని పడి ఉండుడు నాతోటి కాలే మరి. ఒక పాలి నేను సుశీలతోటి మాట్లాడంగ సూశిండు, ఏమనుకున్నడో ఏందో ఆనాటి సంది తాగినా తాగకపోయినా కొట్టుడు మొదలు పెట్టిండు. సుశీలను నోటికొచ్చిన మాటలు తిట్టేది, దాని సాయితబట్టి ఇద్దరుగలిసి నన్ను సంపుదామని సూస్తున్నరులే అని యాదికి ఒచ్చినప్పుడల్ల చేతులు కాల్లాడిచ్చేది.

నయమయితాది అనుకునే యాల్లకు, మల్లేషం తన్నులకు కడుపుల ఒకదిక్కు కుట్లకాడ పుండైంది. కడుపుల నొప్పి, సంటోన్ని సాకుడు, మా ముసలామెకు చేశిపెట్టుడు, దినదినానికి మల్లేషం మరీ దయ్యం పట్ట్లినోని తీరుగ చేసుడు, ఇయ్యన్నీటి తోటి నాకు హైబత్ హైబత్ అయ్యేది. రెండు మూడుసార్ల సావాలె అని గూడ అనిపిచ్చింది, సంటోని మొకం కంట్లె తిరిగి దైర్నం రాలె.
ఇయ్యాల పొద్దుగాలనే మిత్తికి ఇచ్చినోడు ఇంటి మొకానొచ్చి “ఇంకో వారం రోజుల్ల అప్పు తీర్పకపోతె ఆటో జప్తుజేసుకుంట” అని బెదిరిచ్చి పోయిండు. ఎసోంటి సంసారం ఎట్లయిపాయె అనిపియ్యబట్టింది, నాకు తెల్వకుంటనే నా కంట్లెంబటి నీల్లు కారుతనే ఉన్నయి. ఎందుకో కడుపుల ఒకటే బయం కాబట్టింది. ఏందా అనుకుంటాంటెనే ‘భల్లుమని’ తలుపుతన్ని లోపలికొచ్చి సోలిగి పడ్డడు.

ఇంటెనుక కరెంటు వచ్చినట్టుంది, వాడల లైటు కిటికీల నుంచి మల్లేషం మొకం మీద పడ్తాంది. కండ్లు ఆర్పకుంట నాదిక్కు సూసుకుంట పాక బట్టిండు. మల్ల ఏంజేత్తడో అర్తంగాక సంటోన్ని గట్టిగ పట్టుకోని మూలకు జరిగిన.
“ఏందే గట్ల ఎనుకకు పోబడితివి, నేనే నీ మల్లేషాన్ని” అనుకుంట ఇంకా దగ్గెరికి రాబట్టిండు.
“ఏట్లున్నడే సంటోడు, పాలుజీకిండా…. నా జిగర్ కా టుక్డా…” అనుకుంట పిలగాడి నెత్తిమీద చెయ్యిబెట్టబోతె, “ఇయ్యాల యాదికొచ్చింరా నీకు పెండ్లాం పిల్లలు…” అని గట్టిగ చెయ్యిని ఇసిరిగొట్టిన.

“ఏమే లావు నఖ్రాల్ జేస్తున్నవు…? అనుకుంట దగ్గరికి రాబట్టిండు…
“ఏందిరా నఖ్రాలు… వీడు పుట్టినప్పటి సంది అసలు బతికున్న మా సచ్చినమా అని
సూడొచ్చినావ్రా? తిన్నమా లేదా అని ఒక్కపాలన్న అరుసుకున్నవార? మిత్తికి ఇచ్చినోడు ఇయ్యాల ఇంటి మీదికొచ్చిండు ఆటో జప్తు జేస్తనని… ఇగ మన్ను బుక్కి బతుకాల్నా…” అని మొకంల మొకం బెట్టి అంటనే ఉన్న…
“దొంగ ముండ… ఏందే ఈ నడుమ ఏమో లావు ఎగురుతానవ్?” అని సిగె బట్టి గోడకిసిరి గొడితె పొయ్యి కాడ బడ్డ. నన్ను కొట్టి మల్లేషం సుత సొలిగి పడ్డడు. పొయ్యి కాడ రోకలి అందుకొని ఇసురంగనే నెత్తి పలిగి బెహోష్ అయ్యిండు…
వాన సల్లబడుతాంది. అప్పటి దానుక పక్కింట్లల్ల ఇనబడ్డ లొల్లులు, పిడుగుల సప్పుల్లు, రేకుల మోతలు, మా ముసలామె గొణుగుడు ఏం ఇనబడుతలేవు.

ఏమయితాందో అర్థంగాక, ఎక్కడ లేస్తడో మల్ల అని బయిటకు ఉరికి, బట్టలు ఎండబెట్టిన తాడు పట్టుకొచ్చి మల్లేషం చేతులు కాల్లు కట్టేశి. కిటికీకి కట్టిన. రాత్రంత రోకలి పట్టుకొని కావలి కూసున్న. మద్యల మల్లేషం మొసులక పోయ్యేపాటికి సచ్చిండా ఏంది? సస్తె ఏంగానూ? అనుకుంట దగ్గరికి పొయ్యి సూస్తె దమ్ము తీత్తున్నట్టు అనిపిచ్చింది. ఏం జెయ్యాలె సమజ్ అయితలేదు. జరసేపటికి సుశీల యాదికొచ్చి, ఇంటికి తాలంబెట్టి సుశీల ఇంటికాడికి పోతె తాలమేశున్నది. చీకట్ల లేశి పనికి పొయ్యేటోల్లంత రోడ్ల మీద కనొస్తున్నరింక, యాడికి పోవాలో తోసక జరంతశేపు ఆడనే అరుగు మీద కూసున్న.
“శంద్రవ్వ! ఏందే ఈ యాల్లకు ఈడ కూసున్నవు”అనుకుంట అటు దిక్కు నుంచి మార్కెట్ పోతున్న పోశవ్వ దగ్గరికొచ్చింది. దుక్కం ఆగక పోశవ్వను పట్టుకోని గట్టిగ ఏడ్శిన. ఏందే మల్ల మల్లేషు ఏమన్న కొట్టిండా!” అనంగనే మల్ల ఏడుపొచ్చింది.

“…నెత్తురు బాగ కారవట్టింది, వాడు ఇంక బతికున్నడో లేదో సుత తెల్వది. ఆటో వచ్చినప్పటి సంది మొదలయింది ఈ తాగుడు గోస, గొడ్డును గొట్టినట్టు కొడ్తాండు…” అని ఎక్కి ఎక్కి ఏడ్వ బడితి. కొద్దిసేపటికి నిమ్మలం చేసుకొని, అయ్యిందంత చెప్పిన. “…యాడికి పోవాల్నో, ఏం జెయ్యాల్నో అస్సల్ ఏం సమజ్ అయితలేదు పోశవ్వా…” అని ఏడ్వబోతె…
“చల్ నోర్ముయ్యి… ఏమైందే నీకు కాల్ రెక్కలు మంచిగున్నయి సంబురపడు… సావుకొచ్చిన ముసలి దానిలెక్క ఏడుస్తవేందె? నీకంటె ఇర్వైఐదేల్లు ముసల్దాన్ని, గట్లనే ఏడుసుకుంట కూసుంటనానే ఎప్పుడన్న”
“… … …” నాకు ఏమనాల్నో సమజ్ గాలే
కొద్దిసేపు ఏం మాట్లాడకుంట అట్లనే కూసున్నం “ఇను చంద్రా! ఆటో వచ్చినంక మల్లేష్ ఏదో బాగుపడుతడు అనుకుంటె గిట్లయ్యిండు, వాని రాత ఎట్లున్నదో? వాని చేతుల మీ రాత ఎట్లున్నదో? … వాన్ని మార్సుడు పక్కకువెట్టు, వాడు మారడు నాకు తెల్సు. వాడేందో మారి నిన్ను నీ పోరగాన్ని సాకుతడు అనుకుంటె నీ బతుకు తెల్లారినట్టే”
“ఏం జెయ్యల్నే పెద్దవ్వా? వీని తాగుడు జెయ్యవట్టి ఇంట్ల తిండికి లేకుంటాయె, మిత్తికి ఇచ్చినోడు ఇంటి మీదికొచ్చె… ఇయ్యల్నో రేపో వచ్చి ఆటోను జప్తు జేసుకుంటమని దమ్కాయించ్చి పోయిండు…. గట్లైతె సంటోడు మా అత్త నేను ఏంగావాలె… ఏడ సావాల్నో సమజైతలేదు”
“సత్తె వాడు సత్తడు నువ్వేందె, బర్కత్ లేని మనిషి వాని కోసం ఏడుత్తవు? నువ్వు నడుపుతనంటె చెప్పు ఆటోను నేను ఇడిపిత్త” అనంగనే ఎట్లన్ననో ఎందుకన్ననో సుత తెల్వది “బాంచను ఆ పని జెయ్యి పెద్దవ్వ పున్యముంటది… ఆ ఆటో నేను నడుపుత. ఎట్లన్న జేసి సంవస్రంల ఆ అప్పు నేను దేర్పుత” అని అన్న.

?????????
సంకకు జోలె గట్టుకొని సంటోన్ని ఏసుకొని, ఆటో నడుపుకుంట చంద్రమ్మ ఆటో స్టాండు కొచ్చి బండి ఆపుకున్నది. పక్కనున్న ఇంకో ఆటోడ్రైవర్ జూసి “ఎవర్రా భయ్ ఈ జాన్సీరాణి”, అని అన్నది ఇనబడ్డది చంద్రమ్మకు. అప్పటికే ఇసొంటి కూతలు పాతబడ్డయి… అయినా బయిటికొచ్చి వాని గల్లా బట్టుకొని
“ఏవడు హనీఫ్ భయ్ ఈ బద్మాష్గాడు! నేనెవర్నో తెల్వకుంట ఈ స్టాండ్ల బండి ఆపుకున్నడు?” అని ఆడున్న ఇంకో ఆటోఆయిన తోటి అన్నది.
“అరే చోడ్దో బహెన్! కొత్త పోరడు… నీ రోకలి ఇష్టోరీ వానికింక తెల్వది… నేను వానికి సమ్జాయిస్త కద వదిలెయ్యి!” అని వాన్ని ఇడిపిచ్చిండు. ఈ జాన్సీరాణి ఇంత పెద్దగ కరంట్ కొడ్తది అని తెల్వక ఒక్కసారి పరేషాన్ అయ్యిండు కొత్త పోరడు.
“అరే వీడేంది హనీఫ్ భయ్! కొత్తల నేను బయపడ్డదానికంటె ఎక్కువ బయపడు తున్నడు… చల్ తమ్మీ చాయ్ తాగుదాం దా!” అని హోటల్కు పట్టుకపోయింది ఇద్దరిని.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో