పట్టపగటి చీకటి

– ఓల్గా

పరిశుభ్రమైన నీటి మడుగులో చిక్కగా చేరుతున్న కల్మశం, కుంచించుకుపోతున్న నీళ్ళు – విస్తరిస్తున్న మురికి చేస్తున్న విజయహాసం. మడుగు చుట్టూ చేరిన వారందరూ ఆ మురికిని చూసి సంతోషిస్తున్నారు.
ఇష్టంగా ఒంటికి రాసుకుంటున్నారు. తనకూ రాయబోతున్నారు.

ఒద్దు ఒద్దు – విశాల పరిగెత్తుతోంది.
ఇరుకు సందుల్లోంచి పరిగెత్తుతోంది.
మైదానం కనపడదేమోననే ఆరాటంతో పరిగెత్తుతోంది.

ఊపిరాడటం లేదు.
అదుగో – అదేదో మైదానం లాగానే ఉంది.
ఆకుపచ్చని వెలుగు. కాదు – కాదు వెలుగు కాదు. అది మంట.
ఆకుపచ్చని కాంతిలా వంచిస్తున్న మంట. ఆ మంటలో చుక్కలన్నీ ఒక్కసారిగా రాలి పడిపోతున్నాయి.
లక్షల కంఠాల్లో చిక్కుకున్న దుఃఖపు జీరలు
ముళ్ళ కంపలకు చిక్కుకున్న చిగురాకులు
గాలిరొదలో కలిసిపోతున్న రోదనలు
పూలు తమని తాము చిదిమేసు కుంటున్నాయి.
మూలుగులు బైటికి రావటం లేదు.
సీతాకోకలు నిప్పుల్లో పడిపోతున్నాయి. చిట పట ధ్వనులు.

రామ చిలకలు రెక్కలు టపటపా కొట్టుకుంటూ మంటల్లో పడిపోతున్నాయి.
టప. టప. టప. చప్పుడు.
విశాల పెనుగు లాడుతోంది. ఆ చప్పుడు వినలేకపోతోంది. భరించలేక పోతోంది.
కలలోంచి మెలకువలోకి రావటానికి కూడా అంత పోరాటం చెయ్యాలా?

మెల్లిగా అనస్థీషియా మత్తులోంచి బైటికి వచ్చే రోగిలా బాధగా వేదనతో మెలకువలోకి వచ్చింది విశాల.
పక్కన బాత్రూం తలుపు తెరిచి ఉంది.
నీటి చుక్కలు ఒకటొకటి ప్లాస్టిక్ బక్కెట్లో పడి టపటప చప్పుడు చేస్తున్నాయి.
ఆ చప్పుడు ఆగితే తన బాధంతా పోతుందన్నంత ఆత్రంగా లేచి వెళ్ళి టాప్ గట్టిగా బిగించి తలుపు వేసింది.
అమ్మయ్య! చప్పుడాగింది. చిలకలు రెక్కలు టప టప కొట్టుకుంటూ మంటల్లో పడిపోవు.

విశాలకు కలా, మెలకువా కలగలిసిన కలవరమింకా తగ్గలేదు.
“టైమవుతోంది. తయారవు” సువర్ణ లిప్స్టిక్ వేసుకుంటూ హెచ్చరించింది.

విశాలకు ఒళ్ళంతా నలగగొట్టినట్లుంది. వేడి వేడి నీళ్ళు ఒంటిమీద పోసుకోవాలనిపించింది. కానీ కుదరదు. వేడినీళ్ళు కావాలంటే రెండు రూపాయలు ఖర్చు పెట్టాలి.
బాత్రూంలోకి వెళ్ళి చన్నీళ్ళు గుమ్మరించుకుని వచ్చేసింది విశాల.
అప్పటికే సువర్ణ వెళ్ళిపోయింది.
విశాల కంగారు పడుతూ తయారై వెళ్ళింది పనికి.

పట్ట పగలుని చీకటి చేసి సన్నని వెలుతురిచ్చే విద్యుద్దీపాలతో తిరిగి వెలిగించారు.
చల్లగా మంచుగదిలా ఉండే తన హాలుకి చేరుకుంది విశాల.
రాత్రి వరకూ యిలాగే – చల్లగా – శవాలనుంచే గదిలాంటి ఈ గదిలో తను శవం కాని శవం.
నవ్వి, నడిచి, మాట్లాడే శవం.
నగరంలోని అతిపెద్ద షాపింగు మాల్లో తన స్థానంలో నుంచుని కస్టమర్స్ కోసం ఎదురు చూస్తోంది విశాల.
పదయింది. మరో గంటన్నర తర్వాత గానీ వ్యాపారం పుంజుకోదు.
జనం కొనుగోలు క్రీడలోకి దిగరు.

అమ్మే సరుకులను నీట్గా సర్దుతుంటే పూర్వం తను పనిచేసిన స్కూల్లో పిల్లలు గుర్తొచ్చారు.
ఒకటో తరగతి చదివే పిల్లలు. తలలు దువ్వుకుని, యూనిఫాం వేసుకుని ముచ్చటగా తన దగ్గరకొచ్చే పిల్లలు.
నవ్వినా, ఏడ్చినా ముద్దుగా ఉండే పిల్లలు.
తన ప్రేమ కోసం పోటీపడే పిల్లలు.
సజీవమైన పిల్లల్ని ఒదిలి ఈ సరుకుల మధ్య జీవించటానికొచ్చినందుకు రోజూలాగే బాధపడింది విశాల.
ఆ బాధలోంచే ఫ్లోర్ మేనేజర్ మూడో కన్ను చూసి హడలి పోయింది.
ఏం జరిగింది – ఇంకా కస్టమర్స్ ఎవరూ రాలేదుగా
“అద్దంలో ఒకసారి ముఖం చూసుకో”
మేనేజర్ కంఠంలో రాతిని బద్దలు చేసే సుత్తి చప్పుడు.
విశాల గబగబా పర్సు తెరిచి అద్దం బైటికి తీసి చూసుకుంది.
నాలుక కరుచుకుంటూ మేనేజర్ వంక చూసింది.

“చేరి మూడు నెలలవుతోంది. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? పల్లెటూరి బైతుని తీసుకోవటం నాదే తప్పు. నా ఫ్రెండు చెప్పాడని తీసుకుంటే”
కట్టెలు గొడ్డలితో నరుకుతున్న చప్పుడు.
మేనేజర్ వెళ్ళాక విశాల పర్సులోంచి లిప్స్టిక్ తీసి పెదాలకు పూసుకుంది.
ఇక్కడ పని చెయ్యాలంటే ఒక డ్రస్ కోడ్ పాటించాలి.
స్కర్ట్ వేసుకోవాలి. మోకాళ్ళ వరకే ఉంటుందది. పైన షర్ట్ వంటిది –
జుట్టు ఎలా కత్తిరించుకోవాలో చెప్పారు. చిన్న బొట్టే పెట్టుకోవాలి –
కంటికి ఐ లైనర్. పెదవులకు లిప్స్టిక్.
ముఖం నిండా లైట్గా మేకప్.
దీన్లో ఏ కొంచెం మార్పూ ఉండ కూడదు.
బరువు తగ్గ కూడదనీ, పెరగకూడదనీ ముందే నిబంధన పెట్టారు.
ఎలా నవ్వాలో, ఎలా నడవాలో వారం రోజులు ట్రైనింగు యిచ్చారు.
పెదువు లెప్పుడూ తడిగా ఉండాలి. నవ్వుతూ ఉండాలి. కళ్ళు మెరుస్తుండాలి.
ఆమెను చూస్తూ ఆ సరుకుల దగ్గర మరికాసేపు ఉండాలనిపించాలి కస్టమర్స్కి
కొందరు సరుకుల కంటే విశాలనే ఆసక్తిగా చూస్తారు.
పనేమీ కష్టమైంది కాదు. అంతకుముందు ఐదారేళ్ళ పిల్లలకు పాఠాలు చెప్పేది. ఇపుడు రకరకాల వయసుల వాళ్ళకు వస్తువులు చూపించి అమ్ముతోంది.
సమస్య అది కాదు. కానీ
ఈ ఉద్యోగంలో తన శ్రమను కాక తననే అమ్ముకున్నట్లనిపిస్తుంది విశాలకు.
విశాలకు తన వూళ్ళో రెండేళ్ళు పనిచేసిన స్కూలు, పాఠాలు చెప్పిన పిల్లలూ గుర్తొచ్చారు. ఆ పిల్లలకు తనంటే ఎంత యిష్టం. పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చేవారు. గులాబీపూలు మల్లెపూలు తెచ్చి యిచ్చేవారు. బుగ్గల మీద ముద్దులు పెట్టేవారు.
వారితో అరిచీ అరిచీ గొంతు నెప్పి పుట్టేది. ఐనా అరవటానికి శక్తి ఉండేది. ఉత్సాహం ఉండేది.
ఇక్కడ అతి మెల్లిగా మాట్లాడుతున్నా సహకరించటం లేదు.
“నీ గొంతులో అవతలివాళ్ళ పట్ల శ్రద్ధ వినపడాలి. వాళ్ళ మేలు కోరి నువ్వీ వస్తువు వారికి అమ్ముతున్నంత ప్రేమ వాళ్ళమీద చూపించాలి”.
మేనేజర్ మహా కఠినమైన గొంతుతో చెబుతాడీ మాటలు.
తెచ్చి పెట్టుకున్న ప్రేమ గొంతులోంచి బైటికి ఊడిపడటం ఎంత నష్టమో విశాలకు పదిరోజుల్లోనే తెలిసొచ్చింది.

ఒక రోజు కొంచెం గొంతు విప్పి కస్టమర్స్తో మాట్లాడింది.
మేనేజర్ పిల్చి ‘నీ గొంతులో అంత అథారిటీ ఏమిటి? కస్టమర్స్ చిరాకుపడి వెళ్ళిపోతే ఏం చేస్తావని చివాట్లు పెట్టాడు’
తనతోపాటు పనిచేస్తున్న కొందరమ్మాయిలకు యిదంత కష్టంగా ఉన్నట్లు లేదు. వాళ్ళంతా నగరంలో పుట్టి పెరిగినట్లున్నారు.
కస్టమర్స్తో నవ్వులూ, జోకులూ వాళ్ళలాగా తనకు కుదరటం లేదు’.
ఐనా విశాల దగ్గర సరుకులు బాగానే అమ్ముడవుతున్నాయి.
అందువల్ల నియమాలను ఉల్లంఘించినపుడు తిట్టినా విశాల ఉద్యోగం మూడు నెలలుగా పోకుండానే ఉంది.
“అబ్బ – రోజంతా ఏ.సి లో ఉంటావు ఎంత హాయి” అంటుంది హాస్టల్లో తన రూంమేట్ సువర్ణ.
ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో నాలుగేళ్ళ నుంచీ పనిచేస్తోంది.

“నీ డ్రస్సు, నీ మేకప్, ఆ లైట్ల వెలుగులో మెరిసి పోతుంటుంది. నాకు నీ అందం ఉంటేనా?” అంటుంది.
విశాల డల్గా నవ్వుతుంది. తను అందం ప్రదర్శించుకోటానికి ఈ ఉద్యోగంలో చేరలేదు. జీతం కోసం – కేవలం జీతం కోసం చేరింది. మూడు వేలు ఇస్తున్నారు.
నాన్న చచ్చిపోయాక తన ఊళ్ళో ఆ చిన్న స్కూల్లో యిచ్చే ఎనిమిదొందల జీతం సరిపోక, అమ్మ మందులకు, తమ్ముడిని చదివించటానికి కడుపునిండా తినడానికే ఆ ఎనిమిదొందలూ సరిపోక నాన్న స్నేహితుడి రికమండేషన్తో ఈ ఉద్యోగంలో చేరటానికి నగరం వచ్చింది.
కానీ ఈ మూడు వేలు ఒద్దు ఆ ఎనిమిదొందలే చాలు అని మనసుగోల పెడుతోంది.

ఒక సంవత్సరం పనిచేస్తానని బాండ్ రాసివ్వకపోతే విశాల రెండు నెలల్లోనే తిరిగి తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళిపోయేది. సంవత్సరంలో హాస్టలు ఖర్చులు పోను పదివేలన్నా మిగిలితే అవి తీసుకుని వెళ్దామని చూస్తుంటే అప్పులు తప్ప ఏమీ మిగిలేలా లేవు.
రోజూ కొద్దిగా మేకప్ వేసుకోవాలి. మొదటి నెలలో కాస్త చౌకధరలో కొంటే ముఖమంతా దద్దుర్లు, ఎలర్జీ వచ్చింది. డాక్టర్లకు, మందులకు ఖర్చయింది. కొన్నవి పారేసి కాస్త ఖరీదైనవి మళ్ళీ కొనక తప్పలేదు. ప్రతినెలా అదనపు ఖర్చులేవో ఉంటాయి. బస్లు అందక టైమవుతోందని వారానికోసారైనా ఆటోలో వెళ్ళక తప్పటం లేదు. ఎంత పొదుపుగా ఉన్నా హాస్టలుకి 15 వందలు కట్టాక నెలకు మరో వెయ్యి ఖర్చవుతూనే ఉన్నాయి.
డ్రస్లు పాతగా ఉన్నాయని సువర్ణ బలవంత పెట్టి రెండు జతలు కొనిపించింది.

జీన్ ప్యాంట్, టీ షర్టు కొనుక్కోమని మరో రూంమేట్ రంజని గోల. తనకంత ధైర్యం లేదంటే వూరి బుద్ధులు ఒదులు కోకపోతే వెనకబడి పోతావంటుంది.
మాల్లో, హాస్టల్లో కొందరమ్మాయిలు చాలా సరదాగా ఉంటారు. సెల్ఫోన్లో బాయ్ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటారు. మెసేజీలిస్తూ అందుకుంటూ వాటిని చూసి నవ్వుకుంటూ మురిసి పోతుంటారు.

పబ్లకు వెళ్తుంటారు.
మొదట వాళ్ళను చూసి భయపడింది విశాల. వాళ్ళు విశాలను జాలిగా చూస్తారు. వాళ్ళిక ఆ జీవితంలోంచి బైటికి రాలేరు. రాధిక బాగా కూరుకుపోయింది. వారం క్రితం చాలా అర్జంటు పని. ఒక్క గంట పర్మిషన్ కావాలని వెళ్ళి గంటలో వచ్చేసింది. అందరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు.
“గంటలో వెయ్యి రూపాయలు సంపాదించింది. కాంటాక్ట్స్ ఉండాలి” ఆషా మూతి విరుస్తూ తనకు లేని కాంటాక్ట్స్ గురించి దిగులుపడింది.
విశాలతో రాధిక ఒకసారి మాట్లాడింది కూడా.
“నా ఫ్రెండ్ ఫ్రెండ్ నిన్ను బాగా లైక్ చేస్తున్నాడు. ఒకసారి అతన్తో వెళ్ళరాదూ?” విశాలకు కోపం వచ్చింది గానీ దాన్నెట్లా చూపించాలో తెలియలేదు. “నాకిష్టం లేదు” అని చెప్పింది.
ఆ రోజు రాత్రి నిద్ర పోకుండా ఎందుకో తెలియకుండా ఏడుస్తూ పడుకుంది. ఇలా ఈ ఏడాదిలో ఎన్నిసార్లు ఏడవాలో –
స్కూల్లో ఏడుస్తున్న పిల్లల్ని నవ్వించే తను యిపుడు ఎవరేమంటున్నా ఏడ్చే పరిస్థితిలో పడింది.
శలవురోజు నగరం రోడ్ల మీద తిరుగుతుంటారు విశాల, సువర్ణ.
“నగరం మిలమిల మెరిసి పోతోంది చూడు” అంటుంది సువర్ణ.
“నాకీ మెరుపులంటే భయం. చల్లని వెన్నెల కావాలి” అంటుంది విశాల.
“నువ్వొట్టి అమ్మమ్మవి. ఫో – మీ ఊరికి” విసుక్కుమంటుంది సువర్ణ.
అమ్మమ్మకేం. చాలా ప్రశాంతంగా బతికింది. ప్రశాంతంగా చనిపోయింది. నాన్న హఠాత్తుగా చనిపోకముందు అమ్మకూడా ప్రశాంతంగానే బతికింది. తనూ ఊరెళ్ళి మళ్ళీ ఆ స్కూల్లో టీచర్గా చేరితే ప్రశాంతంగానే ఉంటుంది.
“ఈ జనాలు, సందడి, లైట్ల వెలుగులు, పెద్ద పెద్ద బోర్డులు యివన్నీ లేకుండా ఒక చిన్న వూళ్ళో ఏం బాగుంటుంది?” ఆశ్చర్యపడుతుంది సువర్ణ.
“ఇంతమంది జనాల్లో మనకెవరు తెలుసు? నాకిక్కడే ఒంటరితనం. మా ఊళ్ళో కనీసం వందమంది నాకు తెలిసిన వాళ్ళుంటారు.”
“ఏం చేస్తావు వాళ్ళతో – “

“ఏం చేసేదేమిటి? మన వాళ్ళుంటే మనకు అండ కదూ”
“ఏమీ – నాకు చిరాకు. లేనిపోని ఆరాలు తీసి విసిగిస్తారు”
ఆ మాట నిజమే. కానీ అసలు ఎవరూ ఏమీ పట్టించుకోని తనం కంటె విశాలకదే నయమనిపిస్తుంది.
ఈ నగరం ఒక మాయలోకంలా ఉంది విశాలకు. అందరూ కలిసి పరమోత్సాహంగా ఉన్నట్లుంటారు. ఎవరికి వారిది ఒక ఒంటరి ప్రపంచంలా ఉంటుంది. ఆ ప్రపంచంలోకి యింకొకర్ని తొంగి చూడనివ్వరు.
మామూలు కబుర్లు, సినిమాలు, షికార్లు, యజమానులను తిట్టుకోటం, కొలీగ్సుని ఆడిపోసుకోవటం యివన్నీ ఉంటాయి.

వాటిని దాటి మాటలు మనసులో అంగుళం లోతునుంచి కూడా రావు.
ఊర్లో కూడా ఈ కబుర్లుంటాయి. కానీ వాటిని దాటి తమ మనసులో మాట మంచో చెడ్డో చెప్పుకుంటారు.
తమ బీదరికం గురించి, పిల్లలకు పెళ్ళి చెయ్యలేని నిస్సహాయత గురించి పెళ్ళికోసం పడుతున్న ఆరాటం గురించి, చదువుకోవాలని ఉన్నా చదువుకోలేనితనం గురించి – ఏదో ఒకటి చెప్పుకుని సేద దీరతారు.
ఇక్కడ సేదదీరే అవసరమే లేనట్టు నటిస్తారు.
అంతా అందరికీ తెలిసిందే కదా అనుకుంటారేమో.
విశాలకు సువర్ణ ఒక్కత్తీ బాగా దగ్గరయింది. తనకున్న కుటుంబ భారం సువర్ణకు లేదుగానీ ఆమె బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు. చాలా తెలివైనది. చిన్న ఉద్యోగమైనా ఒక్కత్తే కాబట్టి ఎలాగో నెట్టుకొస్తుంది. కంప్యూటర్ కోర్సులేవో చెయ్యాలని తాపత్రయ పడుతుంది గానీ ఫీజు కట్టలేక దిగులుపడుతుంది.

ఇక్కడ యిలా వుంటే యిక ఒడ్డన్నది కనిపించదు. ఊరికి వెళ్ళి పోవాల్సిందే అన్న ఆలోచనతో మరో రెండు నెలలు గడిచాయి.
ఈ రెండు నెలల్లో సువర్ణ హాస్టల్కి రావటం మానేసిన రోజులు ఎక్కువవుతూ వచ్చాయి.
మొదట విశాల కంగారు పడింది. సువర్ణ బంధువులింటికి వెళ్తున్నానని చెప్పింది గానీ రెండు నెలల క్రితం లేని బంధువులు యిప్పుడెక్కడినుంచి వచ్చారని అడిగే ధైర్యం విశాలకు లేకపోయింది. నమ్మకపోయినా నమ్మినట్టు నటించింది.
సువర్ణ తాను హాస్టల్ ఖాళీ చేసి అపార్ట్మెంట్కి మారుతున్నానని చెప్పినరోజు విశాలకు నగరంలో ఉన్న చిన్న ఆధారం కూడా తెగిపోయినట్లయింది.
హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో, అపార్ట్మెంట్ ఎక్కడో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. సువర్ణ కళ్ళల్లో దిగుల్ని కనపడనీయని మొండి నిర్ణయమేదో కనిపించింది విశాలకు.
సువర్ణ మళ్ళీ రెండు నెలలకు విశాలను చూడటానికి వచ్చేసరికి విశాల పుట్టెడు జ్వరంతో ఉంది.
వైరల్ పీవర్. సువర్ణ చొరవ తీసుకుని నర్సింగుహోంలో చేర్పించింది. కడుపు కట్టుకుని దాచుకున్న ఐదువేలలో మూడువేలు ఖర్చయ్యాయి. విశాల కళ్ళనుంచి రక్తం కారింది.

హాస్పిటల్ నుంచి విశాలకు తన ఎపార్ట్మెంట్కి తీసుకెళ్ళింది సువర్ణ. చాలా అందమైన ఫ్లాట్. ఖరీదైన ఫర్నీచరు
ఇంట్లో వంట చేసుకుంటున్నట్టు లేదు. మెస్ నుంచి కారియర్ వస్తుందని చెప్పింది.
ఇంత మంచి ఫ్లాట్ని సువర్ణ ఎలా భరించగలుగుతోంది?
విశాల కళ్ళల్లోని అనుమానం చూసి నవ్వింది సువర్ణ.
“నేనూ మొదలుపెట్టా. లేకపోతే యిక్కడ బతకలేం. మనలాంటి వాళ్ళకు తప్పదు.”
విశాలకు తగ్గిన చలిజ్వరం మళ్ళీ ఒచ్చినట్లు ఒణికింది.
“నేను హాస్టల్కి వెళ్తా” అంది నీరసంగా.
“వెళ్ళు – కానీ రావాలనిపిస్తే యిక్కడికేరా. నువు తెలివితక్కువ దానివి. ఒంటరిగా యిది మొదలు పెడితే మోసపోతావు”.

“ఇంకో రెండు నెలల్లో మా ఊరికి వెళ్ళిపోతా. మా స్కూల్లో టీచర్గా చేరిపోతా. అసలు మా హెడ్మిస్ట్రెస్ వెళ్ళొద్దో అంటున్నా వినకుండా వచ్చేశా. ఆ జీతం చాలకపోతే ట్యూషన్లు చెబుతా, మిషన్ కుడతా – “
సువర్ణతో చెప్పినట్లు కాకుండా తనతో తనే చెప్పుకుంది విశాల.
తను వెళ్తే సీతాకోక చిలకల్లా ఎగురుతూ వచ్చి పిల్లలు కావలించుకుంటారు.

సువర్ణ ఎలుగ్గొడ్ల పట్టులోకి రమ్మంటోంది. తను వెళ్ళదు గాక వెళ్ళదు.
“మీ ఊరెళ్తే సరే. ఇక్కడుంటే మాత్రం యిక్కడికే రా”.
విశాల ఒంటరిగా హాస్టల్ చేరింది.
నీరసించిన విశాలను చూసి ముఖం చిట్లించాడు మేనేజర్.
“నిన్ను చూస్తే కొనాలని వచ్చినవాళ్ళు కూడ ఒద్దనుకుంటారు. ఇన్ని రోజుల శలవ తర్వాత యిలా బక్కచిక్కి వస్తే ఎలా?”
“జ్వరం” గొణికింది.
“తెలుసు. మంచి తిండితిని తొందరగా ఒళ్ళు చెయ్యి”
సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోయింది విశాలకు.
ఎలాగో మరో రెండు నెలలు. ఎప్పటికవుతాయి రెండు నెలలు?
ఎన్నేళ్ళకు? ఎన్ని వందల ఏళ్ళకు?
పట్టపగల్ని చీకటి చేసే గదుల్లోంచి చీకటి రాత్రుల్ని వెలిగించే వెన్నెల్లోకి ఎప్పటికి వెళ్తుంది?
అసలుంటుందా వెన్నెల?

ఉంటుంది. ఊర్లో తను అద్దెకున్న పెంకుటింటి వసారాలోకి ఎండా వెన్నెలా రెండూ వస్తాయి.
నాలుగు కుటుంబాలకూ ఒకటే వసారా. సందడిగా గోలగా ఉండేది. అంత గోలలోనూ విశాల నాన్న పడక్కుర్చీలో పడుకుని ఏదో ఒకటి చదువుకుంటూనే ఉండేవాడు.
నాన్న పోయాక విశాల ఆ పడక్కుర్చీ నాశ్రయించి చదువుకునేది పక్క వాటాల పిల్లల అరుపులు, ఏడుపులు, వినిపించినా మనసులోకి దూరేవి కావు.
ఇక్కడ ఒక్కోసారి సూది పడితే వినిపించేంత నిశ్శబ్ధం మనసులోకి దూరి ఒకటే రొద పెడుతుంది.
కస్టమర్స్ మెల్లిగానే మాట్లాడతారు. ఐనా మనసులో అలజడి అలలహోరు.
రెండు నెలలు గడిచిపోయి ఊరెళ్ళి, అమ్మ, తమ్ముడు, ఇరుగు పొరుగు వాళ్ళ పలకరింతల్లోంచి, కరచాలనాల్లోంచి, కావలింతల్లోంచి స్కూలుకి నడిచి వెళ్ళింది విశాల.
మనసు శుభ్రమైన గాలిలో ఆహ్లాదంగా ఉంది. అడుగులు చురుగ్గా పడుతున్నాయి. దారంతో పచ్చగా కంటికి హాయిగా ఉంది.

కానీ – కానీ – స్కూలు ఏది? ఏది?
ఇన్నంతుస్థుల ఈ భవనం ఏంటి? విశాల కళ్ళు తన స్కూలు కోసం చిన్న చిన్న పాకలున్న బడికోసం వెతుక్కుంటున్నాయి.
ఆ కళ్ళకు అడ్డుగా నల్లని బోర్డు. పెద్ద బోర్డు. ఎతైన బోర్డు. 70 ఎమ్. ఎమ్ తెరంత బోర్డు. ఆ బోర్డు మీద చుట్టలు చుట్టుకున్న పాముల్లాంటి అక్షరాలు
“కాన్సెప్ట్ స్కూలు”
అది బడిలా లేదు. ఐదు నక్షత్రాల హోటల్లా ఉంది. తను పనిచేసి తనకు పనికిరాదని ఒదిలేసి వచ్చిన మాల్లా ఉంది. పిల్లలు క్రమశిక్షణతో నడుస్తున్నారు. గంతుల్లేవు. నవ్వుల్లేవు. ఏడుపుల్లేవు. ఆధ్యాత్మిక గమ్యాల కోసం అన్నీ ఒదిలి నిర్లిప్తులై నడిచి వెళ్తున్న యోగుల్లా ఉన్నారు.
విశాల అయోమయంగా చూస్తోంది.

హెడ్ మిస్ట్రెస్ పార్వతి ఒచ్చి విశాలను చూసి ఆగిపోయింది.
“మేడమ్” మాటలు రాలేదు విశాలకు.
“మన బడి లేదు విశాలా. అది కొనేసి ఈ స్కూలు పెట్టారు. చూశావుగా ఎంత పెద్దదో -”
నోరు బాగా తెరిచి ఆవలిస్తున్న గుహలా ఉన్న స్కూలుని మరొకసారి చూసింది విశాల.
“నాకు ఉద్యోగం -” తడబడింది.
“రాదు విశాలా. ఇక్కడ నీకు ఉద్యోగం దొరకదు. నీ క్లాసు నేను చెబుతున్నాను.”
హెడ్ మిస్ట్రెస్ పార్వతి ఒకటో తరగతి టీచరా?
విశాల నమ్మలేనట్లు చూసింది.
“నేనీ స్కూల్లో అందుకే పనికొస్తా నన్నారు. ఇంగ్లీషు ఫ్యూయంట్గా మాట్లాడ లేనట. ఏం చేస్తాం. ఏదో ఒకటి. ఊరొదిలి వెళ్లలేక. పిల్లల చదువులయ్యేదాకా నెట్టుకు రావాలిగా”
బెల్ మోగుతుంటే పార్వతి హడావుడిగా వెళ్ళిపోయింది.
విశాల కాళ్ళు నెప్పెట్టేదాకా అక్కడే నుంచుని తిరిగి వచ్చేసింది.
ఏడాది లోపల భూతంలా ఈ స్కూలు ఎలా వచ్చింది?
ఇంత భవనం ఎలా కట్టారు?

పార్వతిగారికి తను ఉత్తరం రాసింది. దానికావిడ బదులెందుకివ్వలేదు. ఈ స్కూలు సంగతి చెబితే ఆ ఉద్యోగం ఒదులుకునేది కాదుగా. ఇపుడేం చెయ్యాలి?
స్కూల్లో చేరి అమ్మకు చెబ్దామనుకుంది. ఉద్యోగం ఒదిలేసి వచ్చానని చెబితే అమ్మేమంటుంది? ఈ ఊళ్ళో మరో ఉద్యోగం ఏం దొరుకుతుంది? నగరంలో మాత్రం తనకేం ఉద్యోగం దొరుకుతుంది?

ఆ రోజు రాత్రి గుండె దిటవు చేసుకుని
“నేను చేస్తున్న ఉద్యోగం బాగోలేదమ్మా. ఇక్కడే ఏదన్నా చూసుకుంటే బాగుంటుందని పిస్తుంది” చెప్పింది తల్లితో.
“అయ్యో – ఈ ఊళ్ళో వెయ్యి రూపాయలు ఉద్యోగం కూడా దొరకదుగదే. అలాగంటే ఎలాగమ్మా. కష్టమో, నిష్టూరమో తమ్ముడి చదువు ఒక దారికొచ్చేదాకా ఆదుకోవాలమ్మా”
దీనంగా, అనునయంగా చెప్తున్న తల్లిని చూస్తూ చూస్తూ ఉన్న ఉద్యోగం వదిలేశానని చెప్పలేకపోయింది.
మర్నాడు తల్లి ఈ మాటను చూశారా ఈ విడ్డూరం అన్నట్లు ఇరుగు పొరుగులతో చెప్పింది –
“అయ్యో – హైదరాబాదులో ఉద్యోగం మానేసి యిక్కడికొస్తావా? ఇంక నయం. వెళ్ళు. వెళ్ళు. తొందరగా వెళ్ళు. మా పిల్లలకి అవకాశం రాలేదని మేం ఏడొస్తుంటే – “
అందరి కళ్ళల్లో నగరం మీద ఆశ.
అందరూ నగరం మీద ఆకలిగొని ఉన్నారు.
“వెళ్ళు. వెళ్ళు. వెళ్ళు”
మళ్ళీ ఆ ఉద్యోగం సంపాదించుకోవాలి. నాన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఉన్న విషయం చెప్పింది.
“ఇంత తెలివితక్కువ దానివేమిటమ్మా. రాజీనామా చేసే ముందు నాతో ఓ మాట చెప్పాలా? అది చెయ్యకుండా ఇప్పుడు వాళ్ళతో నన్నోమాట చెప్పమంటావా? దేనికైనా ఒక పద్ధతుండాలి. ఒకసారి మానేసిన వాళ్ళను వాళ్ళెలా తీసుకుంటారు?”
విశాలకు ఏడవటానికి కూడా శక్తి లేనంత భయం వేసింది.
తల్లి – తమ్ముడు –
తను డిగ్రీ చదవాలి. పి.జి. చెయ్యాలి. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి. కలలన్నీ తగలబడి పోతున్నాయి.
పక్కింటి పిన్ని అంటోంది.
ఎందుకొచ్చావు? ఇక్కడేముంది? నెలకు మూడువేలు యిస్తుంటే చేదయిందా? చేదయింది జీతం కాదు. తన బతుకు.
ఎట్లా చెప్పాలి? ఇపుడు తనకా ఉద్యోగం కూడా లేదని ఎట్లా చెప్పాలి? చెప్పి ప్రయో జనం?
నాలుగురోజుల తర్వాత నగరానికి తిరిగివచ్చి సువర్ణ ఫ్లాట్ తలుపు తట్టింది విశాల.
రాధికకు ఫోన్ చేసి నీ ఫ్రెండ్ ఫ్రెండ్కి యింకా నేనంటే యిష్టమేనా అని ముందే అడిగింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

5 Responses to పట్టపగటి చీకటి

  1. Bhanu Murthy says:

    నగరజీవితం మాయలేడి లాగా తన తళుకుబెళుకులతో యువతను కవ్వించి మానవీయ విలువలను చిధ్రం చేస్తున్న దృశ్యాన్ని ఓల్గా గొప్పగా ఆవిష్కరించారు.
    గ్లొబలైజేషన్ మన గ్రామీణ జీవన మూలాల్ని ఎలా ధ్వంసం చేస్తున్నదో కూడా కథలో స్పర్శా మాత్రం గా తెలిపారు.

  2. gs rammohan says:

    Fed up with these stereotype rural preaching. Story reflects the moral ambition of the writer if not hypocrisy. The way she is looking at the things is very very simplistic. If the rural “vennela” is so bright why don’t we go and stay there? Why we confined ourselves to the urban a/cs? On one hand we are enjoying the urban exposure and we are preaching ruralism to others!!!! I don’t expect this kind of a story from a veteran feminist writer! At last India witnessing a sea change in productive activities. Women are coming out of their homes and getting recognition and value for the work. This positive development must be appreciated. Why do we demoralize them? Why do we often link the “modern” jobs of call center, and customer care with prostitution? Is there any point becoming insensitive towards these fields? We can fight against the globalization and the new development model. But for that we don’t need to shed our sensibilities.

  3. hima bindu says:

    I do feel that this story is very old fashioned and judgmental, and unusual from Olga.

  4. Vennela says:

    ఈ మధ్య ఎన్నో సేవా సంస్థలు వచ్చాయి. రకరకాల ఉద్యోగాలు వచ్చాయి. కేవలం వ్యభిచారం మాత్రమే ప్రతీ సమస్యకీ పరిష్కారంగా చూపటం ఏమీ బాలేదు. చదువు మీద శ్రద్ధ ఉన్న కథానాయిక కాస్తైనా సృజనాత్మకంగా ఆలోచించలేక పోవటం వింతగా ఉంది. పేపర్ లో చదువు కోసం డబ్బు కావాలి అనే ఏడ్ చూసి వెంటనే స్పందించే వారు ఇప్పటికీ ఉన్నారు. ఇది వరకటికన్నా అవకాశాలు పెరిగాయి. ఆలోచన లో పరిణతి, కాస్త ఊహా శక్తి, ఉంటే చాలు.. కుంటీ గుడ్డి వాళ్ళు సైతం ఎన్నైనా సాధించేస్తున్నారు.. నాకు తెలిసీ గౌరవప్రదమైన పనఉలే చేసుకుంటూ ఇదే నగరంలో జీవించే నిరాధారులైన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆటువంటి వారికి సహాయం అందించేవాల్లూ ఉన్నారు. స్త్రీకి గౌరవంగ జీవించటానికి ఇప్పుడెన్నో సదుపాయాలున్నాయి. సేవాసంస్ఠలూ ఉన్నాయి.
    దయ చేసి ఇటువంటి నిరాశాజనక కథలు రాయటం ఇప్పటికైనా మానమని ప్రఖ్యాత రచయిత్రిగారికి మనవి. కాస్త మీ ఋణాత్మక దృక్పథాన్ని విడిచి ప్రగతి శీలంగా, సకారాత్మకంగా ఆలోచించి నావంటి మీ అభిమానులకోసం స్ఫూర్తిదాయకమైన కథలు, ప్రబోధాత్మకంగా లేక పోయినా కనీసం కాస్త ధైర్యమ చెప్పి వెన్ను తట్టే కథలు రాయమని మనవి.

  5. కథా, అభిప్రాయాలూ చదివాక నాకు అనిపించింది – శైలి బాగుంది.
    2. ఓ సిద్దాంతానికి కట్టుబడి రచనలు చేస్తున్నప్పుడు కేవలం ఆసిద్ధాంతానికి ఉపయోగపడే వాదనలే రాస్తారు. రచయితకి ఉండాల్సిన సమద్రుష్టి లోపిస్తుంది.
    నీ.నీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.