నీలోన్నా క్రమోన్మీలన వ్యక్తిత్వ వికాసం “అమ్మ”

– వి. ప్రతిమ

అలెక్స్య్ మక్సీమొవిచ్ పీష్కోవ్…… మాక్సింగోర్కీ కలం పేరుతో నిరుప మానమయిన రచనలు చేసి ప్రపంచ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా… కార్మిక కర్షక వర్గాలకు, సామాన్య ప్రజలకు ప్రాతఃస్మరణీయుడుగా నిలిచి పోయాడు… ఆనాటి రష్యన్ సమాజంలోని దుష్టత్వానికి అణిచివేతలకు, పీడనకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన కలం యోధుడు గోర్కీ…
గోర్కీ అయిదో ఏట తండ్రి చనిపోతే తల్లి వేరే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతూ అయిదేళ్ళ పిల్లవాడ్ని తన తల్లిదండ్రులకు అప్పగిస్తుంది… ఆ అమ్మమ్మ ఈ కుర్రవాడికి తల్లిమీద కోపం, ద్వేషం, అగౌరవం కలగకుండా వుండడం కోసం అత్యంత ప్రేమగా తన గుండెల్లో దాచుకుంది…. ఇల్లు పీకి పందిరేసే గోర్కీ అల్లరిని ఆమె ప్రేమగా భరించేది….

ప్రతీరోజూ రాత్రి పడుకునే ముందు రకరకాల కల్పిత కథలని గోర్కీకి చెప్తుండేది… చుట్టూ వున్న సమాజంలోని పాపాన్ని, దుష్టత్వాన్ని గురించి చెబుతూ… ఎవరయినా పాపం చేశారని నీకన్పిస్తే అటువంటి పాపం, అటువంటి దుష్టచర్య నీవు చేయకుండా వుండు అంటూ హితబోధ చేసేది.
చదువుకునే అవకాశం యివ్వని పేదరికం, తల్లిదండ్రుల్లేని దుర్భర దారిద్య్రంలో నుండి వ్యవసాయ కూలీగా, పడవనడిపే కార్మికుడిగా, ఓడ కళాసీగా…. రకరకాల పనుల్లో ఆకలితో అలమటించి పోయిన ఒక చిన్న పిల్లవాడు ఎదిగి జీవన్ముృతుడిగా మిగలకుండా…..
ఇన్ని రకాల కడగండ్లకు, బాధలకు కారణం ఈ వ్యవస్థలోనే వున్నదని గ్రహించి, జీవితాన్ని పునర్నిర్మించడం సాధ్యమేనని గుర్తించి పోరాట యోధుడై ఉద్యమ దిశగా సాగి…. అత్యంత కళాత్మకంగా ‘అమ్మ’ అనే విముక్తి గీతం ఆలపించినవాడు గోర్కీ….
నూరేళ్ళ తరువాత కూడ యివ్వాల్టి మన సమాజానికి ‘అమ్మ’ నవల ఎంత సందర్భోచితంగా వుందో, ఎంత అవసరమో తలచుకుంటే ఆనాడు ‘అమ్మ’ నవల పూర్తి చేసిన సందర్భంగా గోర్కీతో లెనిన్ అన్నమాటలు మనకి పదే పదే గుర్తు కొస్తాయి….
లెనిన్ సిద్ధాంతీకరించి కార్యరూప మిచ్చిన కార్మిక కర్షక మైత్రీ బంధం విముక్తి పోరాట విజయాన్ని చేకూర్చింది… ఈ కార్మిక కర్షక మైత్రిని అంటే రైతులను కూడ కలుపుకున్నపుడు కార్మికులు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలరన్న విషయాన్ని హోహోల్, రబిన్ పాత్రల ద్వారా ‘అమ్మ’ నవలలో గోర్కీ ప్రతిపాదించడం జరిగింది….

ప్రజాసాహిత్యంలో ‘అమ్మ’ తో పోల్చదగిన మరో గొప్ప గ్రంథం మరేదీ లేదని విజ్ఞుల అభిప్రాయం….
1906లో అమెరికాలో ప్రవాసిగా వున్న సమయంలో గోర్కీ ‘అమ్మ’ నవల వ్రాశాడు… అక్కడి యాపిల్టన్ కంపెనీ వాళ్ళు మొదట దీనిని ప్రచురించారు…. ఈ నవల ఒక్క రష్యన్ సమాజాన్ని సోవియట్ యూనియన్గా మార్చే క్రమంలోనే కాక…. అనువదించబడిన తరువాత భారత సమాజం మీద కూడ అత్యంత ప్రభావాన్ని చూపించింది.

అయితే ‘అమ్మ’ భారతదేశానికి ఎప్పుడొచ్చింది?….
‘కాంగ్రెస్’ అనే పత్రికలో ‘వీరబలి’ అన్నవ్యాసం వ్రాసినందుకుగాను క్రొవ్విడి లింగరాజు గారికి బ్రిటిష్ ప్రభుత్వం రెండున్నరేళ్ళు జైలు శిక్ష విధించింది. 1932లో కన్ననూరు జైలులో శిక్షననుభవి స్తూండగా ఆయనకి ‘అమ్మ’ నవల ఆంగ్లప్రతి లభించింది…. ఆ సమయానికి స్వాతంత్య్రోద్య మానికి ప్రేరణగా వుంటుందన్న ఆలోచనతో ‘అమ్మ’ నవలను అనువదించడం ప్రారంభించా డాయన. మొదటి భాగాన్ని కన్ననూరు జైలులోనూ… రెండవ భాగాన్ని కోయం బత్తూరు జైలులోనూ అనువదించి పూర్తి చేశారు. 1934లో ఆదర్శ గ్రంథమండలి ద్వారా ప్రచురించబడి తెలుగు పాఠకులకి అందుబాటులోకి వచ్చింది….
1935లో బ్రిటిష్ ప్రభుత్వం దీనిని నిషేధించింది.
1938లో రాజాజీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని తొలగించింది.

ఆనాడు మనదేశంలో సామాన్య ప్రజలలో…. ముఖ్యంగా స్త్రీలలో సోషలిస్టు భావాల వ్యాప్తికి క్రొవ్విడి లింగరాజుగారు తెలుగులోకి అనువదించిన ‘అమ్మ’ నవల ఎంతగానో తోడ్పడింది….. ఎందరో సాను భూతిపరుల కుటుంబాల్లోని స్త్రీలు ‘అమ్మ’ని చదివి ఉద్యమంలోకి రావడమో, సానుభూతి పరులుగా వుండడమో జరిగింది….
‘అమ్మ’ ఒక నిరంతర ఉద్యమ స్ఫూర్తి….
సర్వమూ మానవుని శ్రమలోనే వున్నదనీ, సర్వమూ మానవుడి కోసమేనన్న సోషలిస్టు చైతన్య సిద్ధాంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన నవల ‘అమ్మ’…. కార్మికుడిని కథానాయకుడుగా ప్రపంచ చారిత్రక వేదికమీద నిలబెట్టిన ఘనత ‘అమ్మ’దే.
జారు చక్రవర్తుల పరమ నిరంకుశ దోపిడీ, పీడన, పెత్తనం, దౌర్జన్యాలను ఎదుర్కొన్న రష్యన్ ప్రజలు అల్లకల్లోలమై పోయిన తమ జీవితాల్లో నుండి చైతన్యవంతమై కార్మికోద్యమానికి శ్రీకారం చుట్టడానికి ‘అమ్మ’ నవల ఎంతగానో ప్రేరణగా నిలిచింది….
1902లో పోర్మవోలో ఫ్యాక్టరీ పనివాళ్ళు జరిపిన మేడే ప్రదర్శనను పోలీసులు చెదరగొట్టడమే కాకుండా, వారిపై విచారణ జరపడం యివన్నీ కూడ గోర్కీ మనసులో నాటుకుపోయాయి.

ఆ సంఘటనను గోర్కీ ఆ తర్వాతి కాలంలో స్మరించుకుంటూ యిలా అంటాడు…. పొర్మోవోలో ప్రదర్శనానంతరం కార్మికులను గురించి ఒక పుస్తకం వ్రాయాలనే తలంపు నాకు అప్పుడే కలిగింది… ఈ ఘటనలను గురించిన వివరాలను ఆ రోజుల్లోనే సేకరించడం ప్రారంభించాను…. వేర్వేరు వివరాలు కూడ రాసుకున్నాను” అని చెప్తాడు….
ఒకానది ఓల్గానదిలో కలిసే చోట గోర్కీ జన్మస్థలమైన నిజ్నినొవోగ్రాడ్ అనే ప్రాంతంలో ‘అమ్మ’ నవల జరుగుతుంది…. అది చాలా పెద్ద వ్యాపార కేంద్రమైనప్పటికీ ఒకే ఒక్క ఫ్యాక్టరీ వుండేది…. అది ఒక నౌకా నిర్మాణ కేంద్రం…. ఆ ఫ్యాక్టరీ సైరన్ మోతతోనే ‘అమ్మ’ నవల ప్రారంభమవుతుంది.
ఆనాటికి ‘అమ్మ’ పెలగీయానీలోన్నా మనఃశరీరాల నిండా భయాందోళనలు నింపుకున్న నాలుగు పదులు నిండిన ఒకానొక మామూలు గృహిణి… కొద్దిగా గూనితో వొంగినట్లుగా…. భర్త దెబ్బలతో శరీరమంతా కాయలు కాచి…. పితృస్వామిక అణచివేత లోనూ, దిగుళ్ళతోనూ వట్టిపోయి జీవితమంటే నే తెలియకుండా భయం భయంగా వుండేది.

అటువంటి మామూలు తల్లి సామాజిక చైతన్యాన్ని పొంది, ధైర్య సాహసాలను సంతరించుకుని, రహస్యోద్యమంలో పాల్గొనేంతటి క్రియాశీలక కార్యకర్తగా రూపొందిన క్రమమే ‘అమ్మ’ నవల… అంటే మొత్తంగా పెలగీయానీలోన్నా క్రమోన్మీలన వ్యక్తిత్వ వికాసమే ‘అమ్మ’.
నవలలోని ప్రధాన పాత్రలైన ‘అమ్మ’, కథానాయకుడు పావెల్ యిద్దరూ కూడ వాస్తవంగా జీవించిన వ్యక్తులే…. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను, వాస్తవికంగా జీవించిన వ్యక్తులను, పాత్రలుగా మలిచి ఒక కళాత్మక రూపాన్నిచ్చాడు గోర్కీ…
ఆనాడా మేడే ప్రదర్శనను నడిపించిన ప్యోత్ జలమోవ్ ‘అమ్మ’ నవలలోని పావెల్ పాత్రకు ప్రేరణ…. అతడి తల్లి అన్నాకిరీలోన్నా నీలోన్నా పాత్రకు ప్రేరణ అంటారు…. పోరి మోత్సోవ్ అన్న మరో కార్మికుడి తల్లి లక్షణాలను కూడ గోర్కీ అమ్మ పాత్రకు జోడించాడు. ఈ యిద్దరు తల్లులు కూడ అనేక విధాలుగా బిడ్డలకు వారి ఉద్యమంలో సహకరించిన వారే….

అలాగే తమ బిడ్డలను విప్లవంలోకి నిరాఘాటంగా పంపించిన మరి కొందరు తల్లుల లక్షణాలను కూడ గోర్కీ ఈ అమ్మ పాత్రకు ఆపాదించాడు. ఒక పాత్ర అనేక పాత్రల సమాహారంగా వుండాలన్నదే గోర్కీ సిద్ధాంతం.
పరమ కిరాతకుడు, పశుప్రాయుడు, నిర్వీర్యుడు (కార్మికుల ఈ కిరాతకత్వానికి, తాగుడువంటి అలవాట్లకి ముఖ్యకారణం ఆ ఫ్యాక్టరీలోని ఎడతెగని పని ఒత్తిడేనని గోర్కీ మరో చోట సూచిస్తాడు) అయిన తండ్రి మరణం తరువాత అదే బాటలో నడవబోయిన కొడుకు పావెల్ను తన దుఃఖపు మాటలతో ఆలోచనలో పడేలా చేస్తుంది నీలోన్నా.
‘మీ నాన్న మీ యిద్దరికీ సరిపడా తాగేశాడురా… నువ్వు మీ నాన్నలా తయారయితే నేను ఏ నుయ్యో, గొయ్యో చూసుకోవాల్సి వుంటుందిరా…’ అంటూ బావురుమంటుంది…. బుద్ధిమాటలు చెప్తుంది.

పావెల్ పశ్చాత్తాపంలో కరిగి…. క్రమంగా విప్లవోద్యమానికి దగ్గరయి…. విప్లవ కారులయిన స్నేహితుల్ని యింటికి తీసుకు రావడం మొదలయ్యాక అందరు తల్లుల్లానే అమ్మ కూడ భయపడుతుంది. కానీ వారు సత్యాన్వేషణలో ముందుకు సాగుతున్నారన్న సంగతి కొంత కొంత అర్థమయ్యాక “ఇంత మంచి పనులు చేసేవారిని పోలీసులు ఎందుకు పట్టుకుపోతారో” అర్థంకాక సతమతమవుతుంది.

ఆ తర్వాత వారు చూపిస్తోన్న ప్రేమా దరాలు, అందరితోనూ పాటిస్తోన్న సమాన మయిన మానవ సంబంధాలుగా చూసి ఉద్రిక్తయై తనపాత భయాందోళనలనన్నింటిని పారద్రోలి, ధైర్య, ధృడ సంకల్పాలని తోడు చేసుకుని విప్లవ కార్యకలాపాల్లో తానూ భాగమయింది….

ఉద్యమబాట ఎప్పుడూ పూలు పరిచి వుండదు…. సంక్లిష్టంగా, కష్ట భూయిష్టంగా వుండేటువంటి ఆ బాటలో నుండి స్త్రీలు కూడ చైతన్యవంతులయి అంతంత దూరాలనుండి రాత్రివేళ మంచులో మేజోళ్ళు కూడ లేకుండా నడిచిరావడం అమ్మకి అత్యంత ఆశ్చర్య కరమూ, స్ఫూర్తివంతమూ అవుతుంది. ….నటాషా కోసం అమ్మ స్వయంగా మేజోళ్ళు అల్లి పెడతానంటుంది.

శ్రామిక వర్గ మహిళలు పాల్గొనకుండా మానవాళి చరిత్రలో ఏ ప్రజా విప్లవోద్యమమూ పురోగమించింది లేదు…. పీడిత స్త్రీజనం యొక్క విముక్తి మార్గము సోషలిస్టు విప్లవ విజయంలోనే యిమిడి వుందని లెనిన్, స్టాలిన్ల అభిప్రాయం. సమసమాజం ఏర్పడితే అనివార్యంగా స్త్రీలకు స్వేచ్ఛ లభిస్తుందని వారు నమ్మారు. దోపిడీ వర్గ పీడన నుంచి, మతం పేరిట జరుగుతోన్న అణిచివేత నుంచి పితృస్వామిక పెత్తనాల నుంచి కూడ విముక్తిని విప్లవోద్యమంలోనే కనుగొనడం ‘అమ్మ’ విశేషం…

పితృస్వామిక అణిచివేతల్లో నిరంతరం బానిసలుగా మాత్రమే బతుకుతూ వచ్చిన స్త్రీలు…. సోషలిస్టు సమాజంలో తాను కూడ ఒక మనిషిగా గుర్తించబడి పురుషుడితో సమానంగా గౌరవించబడడం విశేషం…. కట్టుదిట్టమైన పితృస్వామిక వ్యవస్థలోని చట్టాన్ని యివ్వాల్టికీ స్త్రీలు బద్దలుకొట్టలేని స్థితిలో పోరాడుతూంటే నూరేళ్ళ క్రితమే ఈ పితృస్వామిక సంస్కృతి చట్రం నుండి చైతన్యవంతంగా బయటపడి మార్గదర్శకులుగా వున్నటువంటి స్త్రీ పాత్రలను ‘అమ్మ’ నవలలో మనం చూస్తాం.

మారుతున్న సమాజంలో స్త్రీలలో వచ్చే మార్పు అత్యంత ప్రధానమైనదిగానూ, అవసరమైనదిగాను గోర్కీ గుర్తించాడు…. పెత్తనం, దోపిడీ, పీడన, అణిచివేతలతో కూడిన ఈ వ్యవస్థయొక్క మార్పుకి స్త్రీల పాత్ర ఎంతయినా వుందన్న విషయాన్ని సరిగ్గా అంచనా వేసి స్త్రీ పాత్రలను మలిచాడు….
1900 కాలంలో రష్యా నలుమూలలా విజృంభించిన విప్లవోద్యమంలో ఒక నూతన విప్లవ తేజంతో, గొప్ప ఆత్మిక బలంతో చైతన్యవంతులయి రష్యా అంతటా కదంతొక్కిన అద్భుత స్త్రీ మూర్తులు మాగ్సిం గోర్కీ కళాహృదయంలోకి నేరుగా చొచ్చుకు పోయి ‘అమ్మ’ నవలలోకి విస్తరించారు అంటారు సూర్యసాగర్గారో చోట….

అన్నట్లుగానే నవల చదూతూంటే అమ్మ నీలోన్నా, సాషెంకా నటాషా, సోఫ్యా, లుద్మలా, తత్యానా వీళ్ళంతా కూడ నవలలోని పాత్రలుగా కాక, రక్తమాంసాలున్న మనుషు లుగా మాత్రమే మనం గుర్తిస్తాం…. వాళ్ళంతా కూడ మన ఎదురుగా నిల్చుని వున్నట్లు, వారితో మనం కూడ సంభాషణలలో పాలు పంచుకున్నట్లు…. వారితో కరస్పర్శ చేస్తున్నట్లుగా ఎంతో స్ఫూర్తివంతంగా అన్పిస్తుంది.
వాళ్ళంతా ఒక సత్యాన్వేషణ వైపుగా కార్మిక, కర్షకులతో కలిసి ఏకతాటిన ధృడ విశ్వాసంతో నడుస్తున్నట్లుగా తెలుస్తుంది.

‘అమ్మ’ నవలలో ఒకే ఒకసారి కన్పించినా మనం ఎంతమాత్రమూ విస్మరించలేని పాత్ర తత్యానా…. ఆమె ఒక రైతు మహిళ.
ఇవ్వాళ చాలా మంది స్త్రీలని మనం చూస్తూంటాం…. భర్తల బాధ్యతారాహిత్యాన్ని నిరసిస్తూ ‘యింత బాధ్యత లేని వాళ్ళు అసలు పెళ్ళే చేసుకోకూడదు’ అని అంటూంటారు…. తత్యానా ఏమంటుందంటే తన భర్తే కాదు మొత్తం రైతు అన్నవాడు పెళ్ళే చేసుకోకూడదు అంటుంది. ….తమ వ్యవసాయపు పనుల్లో భాగం కావడానికి మాత్రమే రైతులు పెళ్ళి చేసుకుంటారని…. భార్యలని తెచ్చుకుంటారనీ అంటూ
‘ఏం పనియిది?…. ఈ పనిలో ఏమంత తెలివుంది?…. ఏరోజు కారోజు అర్థాకలితో బతకడమే కదా. పిల్లలుంటే వాళ్ళ మంచి, చెడ్డా చూడ్డానిక్కూడ ఈ చాకిరీ మూలాన తీరికుండదు… సావకాశముండదు. ఇంతైనా కడుపు నిండా తినడానికి తిండివుండదు…. ఏమైనా సుఖముందా? పైపెచ్చు ఈ పెళ్ళివల్ల ఒక మంచి జీవితం కోసం పనిచేస్తూ బతక్కుండా తన జీవితాన్ని కట్టేసు కుంటున్నాడు…. పెళ్ళి చేసుకోకపోయి నట్టయితే అదిగో ఆ మనిషిలాగా సత్యాన్ని అన్వేషించడానికి సూటిగా పనిచేయ గలుగుతాడు, అంతే కదమ్మా” అంటూ విప్లవయోధుడు రైతు రబిన్ని గురించి ప్రస్తావిస్తూ తత్యానా తన వేదననంతా అమ్మతో చెప్తుంది….

అలాగే నటాషా ఒకసారి అమ్మతో
“ఒకప్పుడు నాకో దాది వుండేది…. ఆమె నా పట్ల మహాదయగా వుండేది…. నీలోన్నా అదేమి చిత్రమోగాని ఎంతో కఠినమైన జీవితాన్ని, అభాగ్యజీవితాన్ని గడుపుతోన్న కార్మికజనం ఇతరులకన్నా దయగా వుంటారు సుమా…” అనడం నటాషాకి నిమ్నవర్గాల పట్ల వున్న ప్రేమని తెలుపుతుంది.
“లోకువ కట్టేందుకు మనుషులకు అవకాశమివ్వకూడదు” అని ప్రకటించే సాషెంకా నవలలోని మరో ముఖ్యమైన స్త్రీ పాత్ర… యువ విప్లవకారిణి. అలసత్వాన్ని ఎంత మాత్రమూ క్షమించని చురుకైన కార్యకర్త….
“ఎన్ని చెప్పినా జైలు జీవితం మనిషిని నీరసింప చేస్తుంది…. అబ్బఁ దిక్కుమాలిన సోమరితనం అంతకన్న అధ్వాన్నమైనది యింకొకటి లేదు. చేయాల్సిన పని యింత వున్నదని తెలిసీ కూడ… అక్కడ బోనులో జంతువులా వుండడం మహాకష్టం….” అని అమ్మతో చర్చిస్తుంది సాషా….
పావెల్ని హృదయమంతటా నింపు కుంటుంది…. అయితే విప్లవోద్యమ కార్యక్రమాల దృష్ట్యా యిద్దరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమానురక్తులై వుండి కూడ వివాహానికి సిద్దపడరు…. ప్రేమని హృదయం లోనే అణిచి పెడ్తారు…. సాషా, పావెల్ యిద్దరూ…
ఇటువంటి స్త్రీ మూర్తుల మధ్య శనివారపు కార్యక్రమాల్లో పాల్గొన్న అమ్మ క్రమక్రమంగా చైతన్యాన్ని సంతరించు కుంటుంది….

నవలా ప్రారంభం నాటికి నాలుగు పదులు నిండిన భయవిహ్వల, అత్యంత దైవభక్తి కలిగిన అమ్మ పెలగేయా నీలోన్నా క్రమక్రమంగా కొడుకుతో కలిసి పోరాటబాట పట్టడం మొదలయ్యాక ప్రార్థనలు చేయడానికి సాధ్యమైనది కాదు…. నిజంగా దేవుడనే వాడుంటే అంతులేని సంపదలొకవైపు, ఆకలి కడుపులు మరోవైపు…. మనుషుల్లో యింత అసమానతలుంటాయా?…. మానవాళి నంతటినీ ఒకే విధంగా…. సమానంగా చూసేటువంటి పరమ దయాళువైన భగవంతుడు…. నిజంగా వుండి వుండడు అని ఆమెకి అర్థమైంది….
కొడుకు జైల్లో వున్నప్పుడు రహస్య కరపత్రాలు అందించడానికి వేరెవరినో నియమించడానికి యిష్టపడక తానే స్వయంగా సిద్దపడుతుంది…. రహస్యోద్యమంలో వున్నవారు వేరెవరి మీదనో బాధ్యతలు మోపడం కాక సాధ్యమైనంతవరకూ తామే స్వయంగా నిర్వర్తించుకునే జాగ్రత్త వుండి తీరాలంటూరు మేధావులు….

ఈ రహస్య మార్గంలో అమ్మ పోలీసుల చేత దెబ్బలు కూడ తింటుంది…. ఆ దెబ్బలతో ఉడుగ్గా, ఉప్పగా కారుతున్న రక్తాన్ని చూసి బెదిరిపోక…. కరపత్రాలు ప్రజలకందేలా చెల్లాచెదురుగా జారవిడుస్తుంది.
“రక్తసముద్రం కూడ సత్యాన్ని ముంచేయలేదు’ అంటూ నినాదాలు చేస్తుంది…. ఆ నినాదాలు యివ్వాల్టిక అధః సహోదరుల చెవుల్లో మారుమోగుతూనే వుంటాయి….
అత్యంత ఉత్తేజకరమైన, ప్రాముఖ్యమైన పావెల్ పోర్టు ప్రసంగాన్ని గురించి కొంతయినా చెప్పుకోకుండా అమ్మమీద వ్యాసాన్ని ముగించుకోలేం….
“మేము సోషలిస్టులం…. స్వంత ఆస్థి సంపాదనకు వ్యతిరేకులం, స్వంత ఆస్థి వ్యవస్థ వల్ల సంఘం విచ్ఛిన్నమై పోతుంది …. ప్రజలు ఒకరితో ఒకరు కలహిస్తారు…. వ్యక్తిగతమైన లాభం కొరకు విరోధులవుతారు….. సొంత ఆస్థి జనాన్ని అబద్ధాలాడిస్తుంది…. అవినీతిపరులను చేస్తుంది. దగా చేస్తుంది…. ద్వేషాన్ని పెంచుతుంది” అంటూ…..
మొత్తం మానవాళి జీవన విధానాన్నే ఈ సొంత ఆస్థి ఎలా శాసిస్తుందో, ఎలా నిర్దేసిస్తుందో చెప్తాడు…. ఈ మాటల్ని మనం నిశితంగా పరిశీలించినట్టయితే వందేళ్ళ క్రితమే కాకుండా యివ్వాల్టికీ అవి ఎంత సందర్భోచితంగా వున్నాయో మనకి తెలుస్తుంది.
‘ఈ మానవ సమాజంలో అసమానత లున్నంతకాలమూ మా పోరాట ముంటుంది …. ప్రజలను సంకెళ్ళనుండి తప్పించడమే మా విధిగా మేము భావిస్తున్నాము…. ఎంతకాలమైతే కొందరు ఏపనీ, బాటా లేకుండా ఇతరులను ఆజ్ఞాపిస్తూ వుంటారో మరికొందరు పనిచేసి కూడ ఆకలి దప్పులతో అలమటిస్తూ వుంటారో అంతకాలం వరకు మేము విప్లవకారులుగానే వుంటాము’ అంటాడు పావెల్…
“అమ్మ” నవలా లక్ష్యమూ, అత్యంత కీలకమూ అయిన ఈ పోర్టు ప్రసంగాన్ని కరపత్రాలుగా చేసి ప్రజలందరికీ పంచడానికి అమ్మ నీలోన్నా చాల ఆసక్తినీ, ధైర్యాన్నీ ప్రదర్శిస్తుంది.

కలలు నిజమవుతాయా?
నిజమవుతాయని మనకి ‘అమ్మ’ చెప్తుంది…. ఉన్నత లక్ష్యంవైపు ఒక సుదీర్ఘ ప్రయాణం ‘అమ్మ’…. సాకారమైన ఒక కల ‘అమ్మ’
నవల ముగిసి పోయినప్పటికీ యిందులోని ప్రధాన పాత్రలు ప్వోత్ జలమోవ్ (పావెల్) అతడివల్ల అన్నా కిరీలోన్నా (నీలోన్నా) యిద్దరూ కూడ పెట్టుబడిదారీ రష్యా…. సోషలిస్టు సోవియట్ యూనియన్గా మారిన సాకారమైన కలని కళ్ళారా చూసిన ధన్యజీవులు.
మామూలుగా రచనలని యిష్టపడ్డా ప్రజలు రచయితలని ప్రేమించడం అన్నది అరుదుగా కన్పిస్తుంది…. ఆనాటి రష్యన్ సమాజంలో ప్రజలంతా గోరీని అమితంగా ప్రేమించారు. ‘అమ్మ’ వారందరికీ దారి చూపిన కరదీపిక ప్రామాణిక గ్రంథమై పోయింది.

ఇవ్వాళ మనం గత యిరవై ఏళ్ళుగా ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణలను గురించి వింటున్నాం కానీ పందొమ్మిదో శతాబ్దాంతానికే రష్యాలో పెట్టుబడిదారీ ప్రపంచంలో వ్యాపించిన పారిశ్రామిక సంక్షోభం మూలంగా వేలాది పరిశ్రమలు మూతబడి, లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయిన కాలంలో…. అంటే దాదాపుగా ఇరవయ్యో శతాబ్ధం ప్రారంభం నాటికి, నూతన కార్మిక వర్గ నాయకత్వంలో శ్రామిక విప్లవోద్యమం ప్రారంభమయింది….
అందుకే లెనిన్ సరయిన సమయంలో సరయిన పుస్తకాన్ని అందించావంటూ గోర్కీని అభినందించాడు… అలాగే మన దేశంలో జాతీయోద్యమ పోరాట సమయంలో ‘అమ్మ’ని అనువదించడం సమయోచితంగా వుందని క్రొవ్విడి లింగరాజుగారు మేధావుల ప్రశంసని పొందాడు…. మందే చెప్పుకున్నట్లుగా సకల ప్రజా పోరాటాలకూ కార్మికుడే నాయకశక్తి అని బలంగా, కళాత్మకంగా నిరూపించిన నవల ‘అమ్మ’
అయితే యివ్వాళ కార్మికుడు కూడ నిరాసక్తుడైపోయి కేవలం తమ జీతభత్యాలు గురించిన ఆరాట పోరాటాలే తప్ప కార్మికశక్తి మౌలికమైన వ్యవస్థ మార్పుకి దోహదం చేసే ఒక చోదక శక్తి అన్న విషయాన్ని విస్మరించే స్థితికి ఎలా నెట్టబడ్డాడు…? గ్రామీణ రైతాంగం నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయి ఆత్మహత్యల దిశగా నెట్టబడ్డ వైనమేంటి?….

దేశ నూతన ఆర్థిక విధానాలు…. సరళీకరణ, ప్రైవేటీకరణవంటికి కార్మిక, కర్షక శక్తి మీద ఎలాంటి ప్రభావం చూపాయి? ఇప్పుడు మనమంతా ఏం చేయాలి?…. ఇవ్వాళ మనమున్న ఈ అన్ని పరిస్థితులకు జవాబులు వెతుక్కోవడం కోసం, స్ఫూర్తిని పొంది ఉద్యమదిశగా సాగడం కోసం మళ్ళీ మళ్ళీ మనం ‘అమ్మ’ ని చదవాల్సిందే…. కొత్త తరానికి మనం ‘అమ్మ’ని గురించి తెలియజెప్పాల్సిందే…
గోర్కీ చెప్పినట్లుగా
“కవీ, కళాకారుడా
అటా ఇటా నవ్వెటువైపూ”
అన్నది మనం ఖచ్చితంగా తేల్చుకోవాల్సిందే.

మార్కెట్ మాయాజాలంలో చిక్కుకుని, ప్రపంచీకరణ బురదలో కూరుకుపోయి ఒక తెలీని ప్రవాహంలో, అత్యంత వేగంగా కొట్టుకుపోతున్న ఈ నాటి మానవాళికి ‘అమ్మ’ ఒక నిరంతర ఉద్యమ స్ఫూర్తి.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

One Response to నీలోన్నా క్రమోన్మీలన వ్యక్తిత్వ వికాసం “అమ్మ”

  1. Pingback: పుస్తకం » Blog Archive » నా అసమగ్ర పుస్తకాల జాబితా -3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.