జాషువా – స్త్రీ జనాభ్యుదయ దృక్పథం

కోలా జగన్‌

ఈనాడు బాగా ప్రచురితమవుతున్న స్త్రీవాదానికి సహకరించే ఎన్నో లోతైన భావాలు ‘మహాకవి’ జాషువా కవిత్వంలో కనిపిస్తాయి. కేవలం స్త్రీల దుస్థితికి జాలిపడటం, వారి అభివృద్ధిని కాంక్షించడం మాత్రమే కాదు. ఈనాడు ప్రచారంలో వున్న భావాలకి దగ్గరగా జాషువా భావాలు కనిపించడం ఆశ్యర్యకరం.

‘ఉక్కు పదాల సాంఘికపుటుగ్ర పిశాచమొనర్చు గర్జకున్‌

కుక్కిన పేనులై ప్రతిభ గోల్పడి

……..

నీ అందచందాలతో వన్నెల్‌ దీర్చి కవిత్వమల్లుకొనుచున్‌

పైపై పరామర్శలన్‌

నిన్నున్‌ నీదు శరీరమున్‌ హృదయమున్‌ ఛేదించి వేధించి

ఇంతన్నంబున్‌ పడవేయు సంఘమును

బిడ్డా! ఎట్లు హర్షింతు” అని జాషువా ప్రకటించారు. అంతేగాక తిరగబడి హక్కులు సాధించుకొమ్మని ప్రబోధించడం గమనించదగ్గ విషయం.

అబలయన్న బిరుదమంటించి కాంతల స్వీయ శక్తుల/ చిదిమినారు/సబలయన్న బిరుదు సాధించి/ హక్కులు గడన చేసికొమ్ము కష్ట చరిత అంటూ చైతన్యానందించారు.

సంఘ నిర్మాతలు పురుషులు. అందువల్ల వారు ఏ విధంగా సంఘాన్ని కావాలని కోరితే ఆ కోరిక మేరకు అది రూపొందింది. పురుష నిర్మిత సంఘంలో స్త్రీకి ఎప్పుడూ తక్కువ స్థానమే. ఆ స్థానాన్ని గమనించి జాషువా స్త్రీల తరపున వేదికను వాదన చేసారు.

పురుషుల్‌ నిర్మితి చేయు సాంఘీక మహాభూతంబు పెన్గోరలం/ దిరికింపంబడి దుష్ట భర్తల కృపాహీన ప్రవృత్తుల్‌ హృదం/ తరమున్‌ ఱంపపుకోత గోయ నిజహత్యానేరముల్‌ చేయు సుందరుల నీ వెటులూరడింతువొ మహాత్మా! ప్రేమ వారాన్నిధీ! (కొత్త లోకం)

పురుష సంఘం కోరల్లో చిక్కుకొన్న స్త్రీలు తమ భర్తల తృణీకారాన్ని, తూక్ష్నీభావాన్ని, నిరాదరణను సహించలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారినాదరించడం ఎలాగో ఆలోచించుమని, అటు పుట్టినింట, ఇటు మెట్టినింట స్త్రీజగతికన్యాయం జరుగుతున్నదని, ఆ విధమైన అన్యాయాన్ని పరిమార్చి ‘సమాన గౌరవ విభూతిన్‌ కాంతకు’ కూర్చుమని భగవంతుని ప్రాధేయపడడంలోనే మహాకవి స్త్రీజన పక్షపాతి అనే అంశం బోధపడుతున్నది.

పురుష సంఘం స్త్రీని శాసించి జీవిత పర్యంతం బానిసతనంలో విద్యాస్పర్శ లేకుండా కట్టివేసినదట. ‘ఉల్లము లేని శాసనపుటుచ్చులకుం గురియై తపింతురా’ లే లేచిరమ్మని స్త్రీజనానికి మేలుకొలుపులు గానం చేసి హెచ్చరించారు. తరతరాలుగా పేర్కొనివున్న మూఢాచారాలైన ముడుపులు కట్టి పూజారుల పొట్ట నింపడం, రోగిష్టియై కొడుకు మరణిస్తే దేవతల దూషించడం వంటి దుష్ట ఆచారాలననుసరిస్తూ వంటింటి కుందేలై ఉండక ‘సర్వసత్కళా జడధి మధించి విశ్వ పరిషత్సభయందొక సభ్యురాలివై నడుపుము. భారతీయ లలనా, మగవానికి తోడునీడవై’ అని ఆమెను మత్తును వదిలించుకొని బయటకు రావల్సిందిగా ఆహ్వానించారు. అంతేకాదు మగనికి తోడునీడవు కమ్మని దీవించారు. ఆ విధంగా స్త్రీపురుష సమానత్వాన్ని సమర్థించి ప్రోత్సహించారు జాషువా.

భారతనారి మనసును బాల్యంలోనే వేర్వేరు తత్త్వాలతో, బోధలతో నింపి ‘వ్రతములని, నోములని’ ఆమె బుద్ధిబలాన్ని అదిమిపెట్టి ఎదగనీయడం లేదని కవి ఆగ్రహించారు. ఇక్కడ మహాకవి ఉద్దేశం భారత స్త్రీలకు బాల్యంలోనే బ్రెయిన్‌ వాష్‌ చేస్తున్నారని, ఆ విధమైన వ్రతాల వల్ల, నోముల వల్ల స్త్రీ జీవితం భర్త, భక్తి అనే చెరసాలలో బందీని చేసి ‘సతుల నైసర్గిక జ్ఞాన సుస్యరమను చిత్ర చిత్రంబుగా హత్య చేసినారు’ అని భారతమాతచే నేతాజీకి ఫిర్యాదు చేయించారు.

పూర్వధర్మాలకు కాలం తీరిపోయింది. అయినా వానిని తిరిగి స్త్రీలపై రుద్దుతున్నది పురుష సంఘం. తాను సబలయే కాని అబల కాదని చరిత్రలో స్త్రీమూర్తి రుజువు చేసినప్పటికీ, ఆమెను ‘అబల’ అని పిలిచి వర్గీకరించి మొత్తం స్త్రీజాతి అవయవాలలో చల్లని పిరికి నెత్తురు ప్రవహింపచేస్తున్నది. దుర్మార్గుడైనప్పటికి భర్తను తృణీకరింపరాదని హెచ్చరించి మనసు విప్పి మాట్లాడటానికి గాని, కోరికను వ్యక్తం చేయడానికిగాని వీలుకాని చిలుకపలుకుల చదువు నేర్పించి, స్త్రీని వంటింటి కుందేలుగా సృష్టించింది. ఈ విధమైన దురాగతాలకు జాషువా హృదయం గాయమైంది తనను తాను అభివృద్ధిపరచుకొనడానికి దోహదకారిగాని జ్ఞానసంపత్తిని తునాతునకలు చేసి, లేదా ఒక క్రమం ప్రకారం విధ్వంసం చేసిందని పురుష నిర్మిత సంఘాన్ని జాషువాకవి ఈసడించారు. స్త్రీ ఇల్లు చక్కబెట్టే ఒక యంత్రమట. వీరిని గృహపరిధి పరదాలోనే బంధించినందువల్ల స్వార్థపరులు వాకృచ్చే మాటల్లోనే తమ స్వర్గం ఉన్నదని నమ్మే అమాయక జనం స్త్రీలట. వీరికున్న లోకం అంతా వంటిమీద సొమ్ములు, పురాణకథా కాలక్షేపమేనట. వారిని అలా తయారుచేసిందట పురుష లోకం. ఆ స్థితి పోతే గాని వారిలో చైతన్యం రాదట. ఆ చైతన్యం వస్తేనే గాని సంసారమనే వాహనానికుండే రెండు చక్రాలుగా భార్యాభర్తలు అమరి ఒడిదుడుకులు లేకుండా సంసారయాత్రను కొనసాగించలేరని జాషువా సందేశం.

పద్యాల్లో స్త్రీవాదానికి ఒక నిండైన రూపాన్నిచ్చింది కూడా జాషువాయే. స్త్రీలు పైకి రావాలని చెప్పడమే కాకుండా ఎన్ని విధాలుగా అణచివేతకు గురౌతున్నారో చెప్పడం జాషువా కవిత్వంలోని కొత్త అంశం. కొన్నిచోట్ల ఆయన భావాలు సరిగ్గా ఈనాటి భావాలకి చాలా దగ్గరగా ఉండడం గమనించదగ్గ విషయం. స్త్రీని అణచడంలో ఒక అంశం, ఆమెను పొగడడం అనేది జాషువా గుర్తించారు. ఈ విషయాన్ని ఎంత సూటిగా, ఎంత హెచ్చరికగా చెప్పారో ఈ పద్యంలో గమనించవచ్చు.

వలపులరాణిగా, చిలకపల్కుల/చక్కెర పిండి బొమ్మగా

అలికులవేణిగా పొగడి ఆకసమందొక మేడగట్టి/ఊయెలనిడి ఊచు నిప్పురుషుడిన్నియుగంబులు నిన్ను/కాళ్ళతో నలుచుటలోని గుట్టు లలనా! గ్రహియింపవిదేమి చిత్రమో!

‘స్వప్నకథ’లోని అనాథ దయనీయమైన భాగం సలసల క్రాగి చిందిన కన్నీటి బిందువైనందువల్ల సహజంగానే కరుణామయమైన కథావస్తువుగా పేరొందినది.

”ఏడు సముద్రముల్‌ గడచి ఎక్కడకే పనిమీద పోయి యున్నాడవురా పరాత్పరా! నా కడగండ్లకు మేర వున్నదా/ ఏడకు బోవుదాన, నెటులలా కసుగందుల పొట్టనించు నీయాడు దటంచు……..” అనాథ విలపించినపుడు ఆమె మూర్తి పాఠకుల మనసుల్లో తిష్టవేసికొంటుంది. తన కడుపున పుట్టిన బిడ్డలను చూపి ‘వీరు దిక్కులేనివారు పంతులుగార’ని కన్నతల్లి అంటూ వుంటే ఏ కన్నులు చెమ్మగిలవు? జాషువా కవి ఈ అనాథకీ స్థితి రావడానికెవరు కారణమని, ఈమె అనుభవించవలసిన జీవితవిశేషాలెవరి సొత్తై పోయినవి, ఎవరి హక్కు భుక్తం, అనుభవనీయమై పోయినవని ప్రశ్నిస్తున్న పద్యం కవి యొక్క వేదనను, లోకంలో జరిగే అన్యాయాలను, ఆ అన్యాయాలవల్ల అమాయకజనం పొందుతున్న అష్టకష్టాలను పాఠకుల మనసుల్లో ముద్రిస్తున్నవి.

”ఎవడారగించు నమృత భోజనంబున/గలిసెనో ఈ లేమ గంజిబువ్వ /ఎవడు వాసము సేయు శృంగార సౌధాన/మునిగెనో యిన్నారి పూరిగుడిసె/ఎవని దేహము మీది ధవళాంబరములలో/ నొదిగెనో యిన్నాతి ముదుకపంచె/ఎవడు దేహము సేర్చు మృదుతల్పములలోన/ నక్కెనో ఈయమ్మకుక్కిపడక/ వసుధపైనున్న భోగ సర్వస్వమునకు/ స్వామిత వహించి మనుజుండు ప్రభవమందు/నెవడపహరించెనేమయ్యె నీమె సుఖము/కలుషమెఱుగని దీని కొడుకుల సుఖము” కరుణ రసానికే ప్రతీకగా ఈ పద్యం సాహిత్యంలో స్థిరత్వం పొందినది.

‘వంచిత’ అన్న శీర్షికలో జాషువా నేటి భారతనారికి కావలసిన ఉద్బోధ గావించారు. స్వార్థపరులైన పురుషులు సంకుచితాభిప్రాయం వలన వంటింటికే ఆమె కార్యకలాపాలు పరిమితమైపోయి కిక్కురుమనక, సంసారకూపంలో పడి వున్నదట. ఇంటి తల వాకిలి దాటని పుట్టుఖైదీఅట స్త్రీ. స్త్రీని పురుషుడు పెట్టే బాధలను వర్ణించి ఈ పురుషుడు ఎన్ని యుగాలుగా నిన్ను తన పదఘట్టనల క్రింద నలిపివేస్తున్నాడొ నీవెపుడు గ్రహిస్తావని హెచ్చరించారు. భార్య మరణిస్తే మరుక్షణంలో పురుషుడు మరొక స్త్రీకై అన్వేషణ ప్రారంభిస్తాడు. కాని భర్త చనిపోయిన స్త్రీ శేషజీవితాన్ని వైధవ్యంలో గడపవలసిరావడం ఈ సంఘం స్త్రీకి చేసిన అన్యాయమని జాషువా ఎలుగెత్తి చాటారు. ఇక స్త్రీ అమాయకత్వాన్ని, మూఢాచారాన్ని జాషువా వర్ణిస్తూ,

పాములు సంతాన వరదాయకములంచు/ప్రార్థించు పెనువెఱ్ఱి బాగులమ్మ/ఔషధసేవ జేయక సత్తులకు మ్రొక్కి/ప్రాణాలు బలిపెట్టు పరమ మూఢ/కృతకంబులైన పుక్కిటి కథానకములు/సత్యంబులని మ్రొక్కు చపల హృదయ/వికట సాంఘిక శక్తులకు దేహమర్పించి/తలవ్రాతకేడ్చు విద్యావిహీణ/పసుపు రాయుచున్న ముసుగు బెట్టుచునున్న/మారుపల్కలేని మందభాగ్య/ఖండపంచకమున కలికంబునకు లేదు/తలుపవేల? భావ దాసురాల

అందువల్ల ‘అబల’గా గాక ‘సబల’గా హక్కుల ”గడన చేసికొమ్ము కష్టచరిత” అని ప్రబోధించాడు. పై పద్యంలో స్త్రీజన స్వభావాన్ని, వారి పరిస్థితులను సూచించే పదాలను గమనిస్తే నేటి స్త్రీజన దుస్థితికి ఆయన హృదయం ఎంత పరితపించిందో, వారి ఉద్ధరణకు ఎంత తహతహలాడిందో బోధపడగలదు. తనకు సంతానప్రాప్తిని ప్రసాదించే వరగుణాలు పాములకున్నవని నమ్మే వెర్రిబాగులమ్మట. ముందువెనుకలు, లోతుపాతులు తెలియని అమాయకుల కంటే అమాయకురాలు. రోగం వస్తే ఔషధాలకు గాక సత్తులకు మ్రొక్కి తుదకు ప్రాణాలనే బలిచేసే మూఢురాలట. కల్పనాకథలను, కట్టుకథలను వాస్తవాలని నమ్మే చపల హృదయట. క్రూర సాంఘిక చట్టాలకు లోనై పరాభవాన్ని పొంది ఇది నా వ్రాత అని ఏడ్చే విద్యావిహీన. తన ముత్తైదువతనాన్ని తీసివేసి విధవగా తయారిస్తూ వుంటే నోరుమెదపలేని మందభాగ్యట. ఈ విధమైన స్త్రీల స్థితి ఈ దేశంలోగాని మరే దేశాలలో లేదు. ఆ విషయాన్ని ఆలోచింపవేమి ‘భావదాసురాల’ అన్నాడు. ‘వెర్రిబాగులమ్మ’, ‘పరమమూఢ’, ‘చపల హృదయ’, ‘విద్యావిహీన’, ‘మందభాగ్య’, ‘భావదాసురాల’ వంటి ప్రయోగాలు భావగర్భితాలై స్త్రీజన దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ స్థితి తొలగిపోతేనే గాని ఈ దేశానికి ముక్తి లేదనే సూచన పై పద్యంలో వుంది.

జాషువా మహాకవి స్త్రీ జనాభ్యుదయాన్ని తన కవితాగమ్యాలలో ఒకదానిగా స్వీకరించారు. ఆయన స్త్రీజన పక్షపాతి అనే విషయం ఆయన ఖండికల్లో, కావ్యాల్లో స్పష్టమైంది.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో