”కమలిని, మెటిల్డా పాత్రలు – పరిశీలన”

డా|| సి.హెచ్‌.ఎమ్‌.ఎన్‌. కుమారి

మహాకవి గురజాడ అప్పారావు గారు సామాజిక వాస్తవికతా దృక్పధంతో కథానికలు రాశారు. సమాజం పట్ల రచయితకున్న బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించిన మేటి కథకుడు. ఈయన రాసిన అయిదు (5) కథలు జీవితం నుంచి పుట్టాయి. జీవితాన్ని వ్యాఖ్యానించాయి. వాటిల్లోని పాత్రలు అనునిత్యం మన కళ్ళముందు మెదిలే కొందరికి ప్రతిబింబాలు. ఈ కథానికలు కేవలం స్త్రీ సమస్యలనే ప్రధానంగా తీసుకొని రాయబడ్డాయి. ఇందులో మోసగాళ్ళు, దుర్మార్గులు చెప్పే నీతికి చేసే చేతకి సంబంధంలేని పురుషులు కనిపిస్తారు. మగవాళ్ళను మార్చగలిగిన స్త్రీలు, మగవాళ్ళ చేత హింసించబడ్డ స్త్రీలు కనిపిస్తారు.

కె.వి. రమణారెడ్డి గారు పేర్కొన్నట్లు ”గురజాడ కథానికలు” ఐదు కూడా జీవిత వాస్తవాన్ని ఆశ్రయించుకున్న సామాజిక చిత్రణలు. ఈ కథానికలలోని ”స్త్రీ” పాత్రను సృష్టించడంలో, ఆయన సామాజిక స్పృహ, సంస్కరణాభిలాష స్పష్టమవుతాయి. వీటిల్లో..

దిద్దుబాటు – కథానికను 1910లో ”ఆంధ్రభారతి” పత్రికలో ప్రచురించారు. దీన్ని మొదట ”కమలిని” అనే పేరుతో గ్రాంధికంలో రాశారు. తరువాత తానే వ్యావహారిక భాషలోకి మార్చారు. 20వ శతాబ్దపు మొదటి భాగంలో తెలుగుదేశంలో వేశ్యావ్యవస్థ పటిష్టంగా వుండేది. వేశ్యల్ని ఉంచుకోవటం సామాజిక గౌరవంగా భావిస్తున్న కాలం అది. ఆయా సంస్థానాల రాజులు వేశ్యలను పోటీపడి పోషించేవారు. ఇది క్రమంగా సామాన్య ప్రజలలోకి పాకింది. వేశ్యా వ్యవస్థ వల్ల కొన్ని సంసారాలు కూలిపోయే స్థితికి కూడా వచ్చాయి. ఆనాటి ఈ సామాజిక సమస్యను తీసుకొని రాసిన కథే, ”దిద్దుబాటు”, ఇందులో కమలిని, గోపాలరావులు భార్య-భర్తలు. ఇద్దరూ చదువుకున్నవారే. వేశ్యా వ్యామోహంలో పడి, భార్యను నిరాదరించిన భర్తను, తన తప్పు తెలుసుకునేలా చేసింది కమలిని. ఇక్కడే సరిదిద్దవలసింది మగవాడు – భర్తని, భర్తను సరిదిద్దవలసిన వ్యక్తి కుటుంబంలో భార్య మాత్రమే. భర్త సంస్కరణ సభలకు వెళ్తున్నానని చెప్పి, సానిదాని ఇంట్లో ఆటపాటల సరదాలతో కాలం గడిపి వస్తున్నాడు. అటువంటి వానిని భార్య సంస్కరించాలి. అది ఆమెకు తప్పనిసరి, కారణం – మోసపోతున్నది, నష్టపోతున్నది ఆమె కాబట్టి, భార్య, భర్తని సంస్కరించటానికి కొన్ని పద్ధతులున్నాయి. మంచి మాటలు చెప్పటం, ఇరుగు పొరుగు వాళ్ళచేత చెప్పించటం, గొడవ చెయ్యడం, పుట్టింటికి వెళ్ళడం, విడాకులివ్వడం – లాంటివి. ఈ కథాకాలం – స్త్రీ గొడవ చెయ్యడానికి, ఎదురు తిరగడానికి, విడాకులివ్వడానికి వీలుకానిది. అంటే ”స్త్రీ” అంతగా ఎదగని కాలం అది. చెడుమార్గంలో వెళ్ళే వాళ్ళకు మంచి మాటలు రుచించవు కదా! అందుకే సున్నితంగా ఎదిరించినట్లుండాలి, సున్నితమైన తిరుగుబాటు చేయించటమే గురజాడ ధ్యేయం. అప్పటికి అదే గొప్ప. అందుకే కమలిని పుట్టింటికి వెళ్ళే పద్ధతినే ఎంచుకుంది. వెళ్ళలేదు. వెళ్ళినట్లు ఉత్తరం రాసి, టేబుల్‌ మీద పెట్టి, మంచం కింద దాక్కుంది. తెగతెంపులు చేసుకోవడం ఆమెకిష్టం లేదు. భర్త మనోభావాలు దెబ్బతినకుండా బెదిరించాలి. అందుకు అనుకూలమైన పద్ధతి ”ఉత్తరం రాసి పెట్టడం”. ”గోపాలరావు దాన్ని చదివి, తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. ఇందులో స్త్రీ ద్వారా, అందులోనూ భార్య ద్వారా భర్తను సంస్కరించాడు గురజాడ.

వేశ్యాలోలుడు కాబోయే భర్తను, ఆ దారి నుండి మరలించి, కుటుంబ జీవితాన్ని దిద్దుకుంది కమలిని. ఆదర్శ దాంపత్యం మీద అల్లబడిన ఈ కథలో – సంస్కారవంతుడైన భర్త, మార్గం తప్పినపుడు, చదువుకున్న భార్య యొక్క కర్తవ్యమేంటో చక్కగా సూచించబడింది.

గోపాలరావు చదువుకున్నవాడు, సంస్కారశీలి, స్త్రీకి ”విద్య” అవసరం అన్న సిద్ధాంతం నమ్మినవాడు. వాళ్ళ నౌకరు రాముడు – ”ఆడోరు సదువుకుంటే యేటౌతది బాబూ” అని అంటే ”విద్య విలువ నీకేం తెలుసురా రామా”! అంటాడు. రాముడు ”ఆడోళ్ళకు రాతలూ కోతలూ మప్పితే, ఉడ్డోరం పుట్టదా బాబూ! అంటే ”ఓరి మూర్ఖుడా! భగవంతుని సృష్టిలో కల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీ రత్నమే! అని, ”నీ కూతుర్ని బడికి పంపిస్తున్నావు కదా! విద్య యొక్క విలువ నీకే బోధపడుతుంది. మీ వాళ్ళ కంటే అప్పుడే, దానికి యెంత నాగరికత వచ్చిందో చూడు” అంటాడు. ఇందులో గోపాలరావు పాత్ర ద్వారా స్త్రీ విద్యను ప్రోత్సహించాడు – గురజాడ.

”కమలిని” అనే పదానికి ”తామరపువ్వు” అని అర్థం. ”పద్మం” జ్ఞానానికి ప్రతీక. కమలిని జ్ఞానవంతురాలు. తన కాలపు సగటు ఇల్లాళ్ళలా అబల కాదు, సబల. ”ఆధునిక స్త్రీలు మానవచరిత్రను తిరిగి రచిస్తారని ”గురజాడ వెలిబుచ్చిన ఆశాభావానికి, వ్యాఖ్యాన రూపమే ఈ కథానిక. వైవాహిక వ్యవస్థలోని నైతికతకు దర్పణం ఇది.

ఇందులో కమలిని తన భర్తలోని చెడు అలవాటుని మార్చగలిగిన విద్యావంతురాలైన, ఉన్నతమైన వ్యక్తిగా కనబడుతుంది. ”కమలిని” స్త్రీ చైతన్యానికి ప్రతీక.

నేటి సమాజంలో భర్త కోసమో, పిల్లల కోసమో తన అంతర్గత శక్తులను వినియోగించి, అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. విద్యావంతులైన స్త్రీలు, తమ సంసారాలను తామే చక్కదిద్దుకుంటున్నారు. కొంతమేరకు, గురజాడ ఆశించినవి జరుగుతూ ఉన్నాయి.

”మెటిల్టా” – నాటి (1910 నాటి) సమాజంలో అసమ వయస్కుల మధ్య వివాహాలుండేవి. బాల్య వివాహాలు కొంతవరకు తగ్గుముఖం పట్టినా, భర్త ఎక్కువ వయస్సు, భార్య తక్కువ వయస్సు కలదిగా ఉండేది. ఈ కథలో భార్యభర్తలు అలాంటి వాళ్లే. మెటిల్డా సౌందర్యవతి. వయస్సు 20-25 సంవత్సరములు ఉండవచ్చు. ఆమె భర్తకు 50-55 సంవత్సరములు ఉండవచ్చు. చుట్టు ప్రక్కల వాళ్ళచేత పులి, వలసల పులి ”అని పిలువబడుతూ, మెటిల్డాను గృహనిర్బంధంలో ఉంచేవాడు. ఎప్పుడూ ముఖాన విచారం కనబడేది. ఎం.ఏ. వృక్షశాస్త్ర విద్యార్థి, కాలేజికి వెళ్తూ, మెటిల్డాను చూసాడు. ముసలిపులి (భర్త) అతనిని పిలిచి, ”ఈ ముండని తీసుకుపో, నీకు దానము చేశాను, తీసుకుపో, నాకు శని విరగడైపోతుంది” అంటాడు. మర్నాడు మెటిల్డా ఆ కాలేజి విద్యార్థిని ప్రాధేయపడుతూ ”మీరు మీనేస్తులూ, నా కాపురం మన్ననివ్వరా? మీకు నేనేం అపకారం చేశాను? తలవంచుకుని మీతోవను మీరుపోతేనే బతుకుతాను. లేకపోతే నాప్రాప్తం” అని చీటీలో రాసి, ఆ ఇంటి వంట బ్రాహ్మణుడితో పంపిస్తుంది. భర్తకు ఆమె శీలం పట్ల అనుమానం. ముఖ్యంగా తనను విడిచిపోతుందేమోనన్న బాధ. అలాంటి మనస్తత్వం గల భర్త, భార్య ప్రవర్తనతో నిజమైన పశ్చాత్తాపం పొంది, తర్వాత కొన్నాళ్ళకు ఆ వృక్షశాస్త్ర విద్యార్థిని పిలిచి, వాళ్ళ వల్ల తాను చాలా తెలుసుకున్నట్లు, మారినట్లు చెబుతాడు. ”నాకు నీవూ, నీ స్నేహితుడు రామారావు గొప్ప ఉపకారం చేశారు. మీ మాటల వల్ల , చేష్టల వల్ల నా భార్య యోగ్యురాలని తెలుసుకున్నాను. ఆలోచించుకోగా, ఆనాటి నుండి కళ్ళెం వొదిలేశాను. నా పెళ్ళాం బహుబుద్ధిమంతురాలు. ఇచ్చిన స్వేచ్ఛనైనా పుచ్చుకోలేదు. ఎక్కడికి వెళ్ళకోరలేదు, ఎవర్నీ చూడకోరలేదు. నాకు నీతో లోకం, మరి ఎవరితో యేంపనంది. అలాగే సంచరించింది” అన్నాడు. నిజమైన పశ్చాత్తాపంతో అన్న మాటలివి. లోపం వుందని గుర్తించినపుడు, ఆ లోపాన్ని సరిదిద్దగలగాలి. అంతేగాని, మూలచ్ఛేదం చేయకూడదు. గురజాడ చేసిన పని అదే. తన కాలం నాటికి, వ్యవస్థలో ఉన్న లోపాన్ని గుర్తించాడు. వాస్తవిక కథలోని దారుణాన్ని కళాత్మకంగా మార్చాడు. ”ముసలిపులి” లో పరివర్తన తెచ్చాడు. ఆనాటికి, అదే ప్రగతిశీల భావన.

నాటి సమాజంలో ”స్త్రీ” ఒక భోగ వస్తువు. తక్కువ రకం ప్రాణి. శరీరమే గాని, మనసున్న మనిషిగా గుర్తించబడలేదు. భార్యకు కనీసావసరాలు తీరిస్తే చాలనుకునే పురుషాధిక్య సమాజంలో మెటిల్డా అణచివేయబడింది. వివాహ వ్యవస్థ స్త్రీని బానిసగా చేసిందనటానికి ”మెటిల్డా” పాత్రే ఉదాహరణ.

ముసలిపులి తన కంటే చాలా చిన్నదైన అందమైన అమ్మాయిని పెళ్ళాడి, తాను అనుమానంతో యాతనపడి, భార్యను నానాబాధలు పెట్టడం కన్పిస్తుంది. భర్త ఖాయిదాలో భార్య ఎంతగా హడలెత్తి వుంటుందంటే, పంజరానికి అలవాటుపడ్డ చిలుకలాగా, భర్త స్వేచ్ఛ యిచ్చినా, పుచ్చుకోదు, ముసలిపులి నోట్లో చిక్కుకున్న నిస్సహాయత, దైన్యస్థితి భార్యలో కన్పిస్తుంది. యావజ్జీవిత శిక్షననుభవిస్తూ, పంజరమే స్వర్గమనుకొని, అది వదిలివెళ్తే ఏం ప్రమాదం వస్తుందోనని హడలి చచ్చే చిలుకకు ఏ స్వేచ్ఛా ఇచ్చినా అక్కరలేదు. ఆ ”ముసలిపులి” హఠాత్తుగా భార్యకు ప్రసాదించిన స్వేచ్ఛ – ఆమె ఏం చేస్తుందో చూసి, పని పడదామనే ఉద్దేశంతోనే, అలాంటి సంబంధాల వల్ల మానవమనుగడకే, ప్రాణప్రదమైన వివాహవ్యవస్థ పాశవికంగా మారుతుందని ఈ కథానిక ద్వారా సూచించాడు. ఇది నాటి సమాజంలోని స్త్రీల మూగరోదనను తెలుపుతుంది.

సామాజిక పరిణామ చరిత్రలో వివాహ వ్యవస్థకున్న ప్రాధాన్యాన్ని నేను తక్కువ చేస్తున్నాననుకోకు …. వివాహ వ్యవస్థ పురోగతికి దోహదం చేసినదన్నమాట నిజమే అయితే వివాహబంధాన్ని తెంచుకోరాదనే నియమం చెప్పనలవికాని కన్నీటి గాథలకు కారణం. ఈ సత్యాన్ని మనమెవ్వరమూ విస్మరింపలేము. ”… అని గురజాడ తన శిష్యమిత్రుడు ఒంగోలు ముని సుబ్రహ్మణ్యానికి ఒక లేఖలో రాశారు. మగవాడు తిట్టినా, కొట్టినా పడివుండటం అనేది వివాహ వ్యవస్థ శిథిలత్వానికి నిదర్శనం. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవటమే దీనికి కారణం అనే వాస్తవాన్ని గుర్తించిన వ్యక్తి గురజాడ. తన కాలం కంటే ముందు చూపు ఇది. ”ఈ సమాజంలో స్త్రీల కన్నీటి గాథలకు కారణం నాకు తెలుసును. తిరిగి వివాహమాడకూడదనే నియమం, విడాకుల హక్కులేని కారణం, ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం స్త్రీల కన్నీటి గాథలకు హేతువులు” అని తన మిత్రునికి స్పష్టం చేశారు గురజాడ. అటువంటి స్త్రీలకు చెందినదే మెటిల్డా. గురజాడ వృక్షశాస్త్ర విద్యార్థి పాత్ర ద్వారా ఆమె యొక్క మూర్తిని వర్ణిస్తూ, ”నా కళ్లకి కట్టినట్లు ఆ వొంచిన మొఖం, బిందువులుగా స్రవించిన కన్నీరు, ఆచుకొన్న నిట్టూర్పుల చేత కంపించిన రొమ్ము ఏ మహాకవి రచనలోనూ లేదనగలను” అని చెప్పాడు. ఇది గురజాడ స్త్రీ జన పక్షపాతానికి నిదర్శనం.

”మెటిల్డా” – భర్తని గౌరవించి, అతని అభిప్రాయాలకు అనుకూలంగా మసలుకొనే ఉత్తమ గృహిణి. భర్త పెట్టే హింసతోపాటు, ఆడబిడ్డ జగడాలను కూడా భరించే సహనమూర్తిగా కనిపిస్తుంది. ఆనాటి పరిస్థితుల్లో మెటిల్డా ధైర్యం చేసి, వృక్షశాస్త్ర విద్యార్థికి ఉత్తరం రాయడం (చీటీ) గురజాడ ముందుచూపుతో ఆమెలో ఈనాటి స్త్రీ చైతన్యాన్ని ఆశించి రాయడమే.

అందమైన స్త్రీలను అదేపనిగా చూస్తూ, ఆ పని చెడ్డతలంపుతో చెయ్యడంలేదనీ, సౌందర్యపిపాసతో చేస్తున్నామనీ, సమర్థించుకునేవారికి – చెడ్డ తలంపు చెప్పిరాదన్న మంచి ఉపదేశం యీ కథలో ఒక పాత్ర, ఇంకొక పాత్రకు చేస్తుంది. ఈ విషయాన్నే తర్వాత, స్త్రీవాద కవయిత్రి జయప్రభ గారు ”ముళ్ళు” అనే కవితలో ఇలాంటి వాటిని బలంగా ఎదుర్కోవాలని తెలిపారు.

కమలిని, మెటిల్డా – ఇద్దరూ చదువుకున్నవారే. దాంపత్య వ్యవస్థలోని వాళ్ళే. వివేకంతో, వినూత్న చైతన్యంతో తమ సమస్యలను తామే పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. మహిళలు – వాళ్ళ స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని, హక్కుల్ని, శక్తిని వాళ్ళు గుర్తించేలా చేశాడు గురజాడ. పరాధీనతను వదిలించి, ప్రగతి మార్గంలోకి నడిపించాడు. మహిళా చైతన్యానికి మార్గదర్శి అయ్యాడు.

గురజాడ ”తెలుగు సాహిత్యానికి సరిహద్దు” అని ఇంద్రగంటి వారన్నారు. అంతేకాదు, ”గురజాడ అప్పారావు గారు తెలుగువాడి ఆధునిక భావాలకు ”తొలిప్రొద్దు”.

కమలిని, మెటిల్డా పాత్రలు అనంతర సాహిత్యంలో మరింత అభ్యుదయ మార్గంలో పయనించాయని చెప్పవచ్చు.

ఓల్గా గారు ”రాజకీయ కథలు” ద్వారా అనేక స్త్రీ సమస్యలను ఎత్తి చూపారు. స్త్రీలు ఎంతగా అణచివేయబడుతున్నారో ఈ కథల్లో తెలిపారు. కళ్ళు అనే కథలో ఆడపిల్లల్ని దిక్కులు చూడకుండా నడవమనడం మొదలైన ఆంక్షలు, నిబంధనలను గురించి తెలిపారు. ఆడపిల్ల పెళ్ళిని, జీవితాన్ని ఒక అలంకరణ వస్తువుగా చేసి, ఆమె ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఎలా జరుగుతాయో ”ముక్కుపుడక” కథ తెలుపుతుంది. ”నోర్ముయ్‌” అనే కథలో జానకి చిన్నప్పటి నుంచి ఇంట్లోవాళ్ళ నిర్భంధాలకు అనుగుణంగా, తన మాటను తగ్గించుకుంటుంది. పెళ్ళయ్యాక భర్త ఆమె మితభాషిత్వానికి మండిపడతాడు. దాంతో మళ్ళీ మాట్లాడుతుంది. కొన్ని విషయాలు వివరంగా అడిగేసరికి ”నోర్ముయ్‌” అంటాడు. ఈ కథలో జానకి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లేని ”స్త్రీ” గా కనబడుతుంది.

”ఆర్తి” కథ తల్లిదండ్రుల దగ్గర, భర్త దగ్గర స్త్రీకి వుండే స్వేచ్ఛారాహిత్యాన్ని తెలుపుతుంది.

”భద్రత” అనే కథలో – భద్రత అనేది వారి జీవితాన్ని వారు నిర్దేశించుకోవటంలోనే వుందని చెప్తుంది. అబ్బూరి ఛాయాదేవి గారు, తురగా జానకిరాణి, పోలాప్రగడ రాజ్యలక్ష్మీ, నిడదవోలు మాలతి మొదలైన సుప్రసిద్ధ రచయిత్రులు అనేక స్త్రీ సమస్యలపై కథలు రాశారు.

వారేగాక, పి. సత్యవతి గారి ”ఇల్లలకగానే” కథలలో పెళ్ళయిన స్త్రీ తన పేరు మరచిపోయేంత అధ్వాన్నస్థితి కన్పిస్తుంది. మిగతా కథానికల్లో స్త్రీలకు గౌరవిస్తున్నట్లు, ప్రేమిస్తున్నట్లు కన్పిస్తూనే స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఉనికిని నిర్లక్ష్యం చేసే పురుషుల జీవితాలను గురించి తెలిపారు.

కొండేపూడి నిర్మల గారు రాసిన ”అతని భార్య” అనే కథలో – భార్య ప్రతిభను మరుగున పడేసి, భర్త సంగీత సాధనకు తోడ్పడి, అతనికి మంచిపేరు రావడం కోసం ప్రయత్నిస్తుంది. తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోయి, కేవలం అతని భార్యగా మిగిలిపోవాల్సిన స్థితిలో, ఆమెలో వివేకం మేల్కొంటుంది.

కుప్పిలి పద్మగారి ”ముక్త”, ”మనసుకోదాహం” అనే కథాసంపుటి, ”విసురాయి” కథాసంపుటిని ముదిగంటి సుజాతారెడ్డిగారు ప్రచురించారు. నల్లూరి రుక్మిణి గారు అనేక స్త్రీవాద కథలు రాశారు. వీరంతా కథలు రాయడమే కాక, స్త్రీల అస్తిత్వం కోసం పోరాడుతున్నారు.

ఆధునిక మహిళ సమానత్వం కోసం, సాధికారతకోసం ప్రయత్నిస్తున్న దిశకు ఎదిగింది. అయితే నేడు భారతీయ మహిళల మనోగతంపై ”యునిసెఫ్‌” తాజాగా ఓ సర్వే చేసింది. భర్త వేధింపులతో అనుక్షణం రాజీపడుతూ, భర్త చావగొడుతున్నా భరిస్తున్న భార్యలు భారత్‌లో 52 శాతం ఉన్నారని – ఆ సర్వేలో తెలిపింది. అంటే సగం మంది గృహిణులు గృహహింసను పంటి బిగువున భరిస్తున్నారు. బయటకు చెప్పుకోలేక, సంసారం ఎక్కడ చెడిపోతుందేమోనన్న భయంతో తమలో తామే కుమిలిపోతున్నారు.

అనగా – గురజాడ గుర్తించిన కమలిని, మెటిల్డాల గృహహింసని నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తించి – దాని నిర్మూలనా దిశగా పయనించడం, గురజాడ అడుగుజాడల్లో నడుస్తున్న విషయం స్పష్టమవుతుంది.

ఆధార గ్రంథాలు

1. ”గురజాడ – తొలి కొత్త తెలుగు కథలు” గురజాడ కథలపై విమర్శ – రాచపాలెం చంద్రశేఖరరెడ్డి

2. గురజాడ యుగం తెలుగు భాషా సాహిత్యాల నవయుగోదయం – సెట్టి ఈశ్వరరావు

3. మహోదయం – కె.వి. రమణారెడ్డి

4. మహాకవి గురజాడ జీవిత విశేషాలు – సాహిత్య సమీక్ష – దేవులపల్లి ప్రభాకరరావు

వ్యాసాలు :

5. వాజ్ఞ్మయి సంపాదకులు : డా|| ఎండ్లూరి సుధాకరరావు

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ – 500 004. వ్యాసం : గురజాడ కథలు – ఆచార్య అత్తలూరి నరసింహారావు

6. వాజ్ఞ్మయి (వ్యాసం – ”గురజాడ అప్పారావు గారు కథానికలలో జండర్‌” స్పృహ).

డా|| అనప్పిండి సూర్యనారాయణమూర్తి

7. ”భిన్న పార్శ్వాల గురజాడ” – డా|| యు.ఎ. నరసింహామూర్తి,

విజయనగరం మహారాజ కళాశాల (విశ్రాంత) తెలుగు శాఖాధ్యక్షులు

ఈనాడు దినపత్రిక, శుక్రవారం, సెప్టెంబర్‌ 4, 2012.

8. ఆకాశంలో సగం – అగాధంలో నేనా! – కొత్తూరి సతీష్‌ కుమార్‌

ఈనాడు దినపత్రిక, ఆదివారం, ఆగష్టు 4, 2012.

9. సాధికారకాతకా సంకెళ్ళు – దత్తు, బుధవారం, అక్టోబర్‌ 24, 2012.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో