ప్రమీలాతాయి

(సుగుణమ్మగారి జీవితానుభవాలు కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రస్తుత సంచికలో ప్రచురించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. వారు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసారు. వారితో చర్చించిన తరువాత మిగతా భాగం ప్రచురించగలమని తెలియజేస్తున్నాం. – ఎడిటర్‌)

నేను బొంబాయిలో ఒక అనాథాశ్రమంలో పెరిగాను. ఒకసారి నేను వియత్నాం దేశస్థులతో అన్నాను- భూమి ఒకసారి అమ్ముడుపోయిన తర్వాత మళ్ళీ విత్తనం చల్లితే కూడా మొలకరాదు అని. నా విషయంలో మాత్రం అదే నిజమయింది.

నేను చిన్నపిల్లగా వున్నప్పుడు కూడా ఎప్పుడదే ఆలోచించే దాన్ని. అందరు పిల్లల్లాగా పెరగలేదు నేను. ఎప్పుడు ఏదో ఆలోచిస్తుండేదాన్ని. 1939లో యుద్ధం మొదలై గాంధీజీ సత్యాగ్రహం మొదలుపెట్టినపుడు నేను దాని గురించంతా చదివాను. నాకప్పుడే సిద్ధాంతం మీదా నమ్మకం లేకపోయినా నేను దొరికందల్లా చదివేదాన్ని. అధికారి రాసిన వ్యాసం చదివాను. అందులో మనదేశానికి గాని, మొత్తం ప్రపంచానికిగానీ సత్యాగ్రహం అనే పద్ధతి ఎందుకు పనికిరాదనే విషయం గురించి వివరించాడాయన. అదే మొదలు. 1942లో నేను హైదరాబాద్‌ వచ్చాను. బన్సీలాల్‌ బాలికల ఉన్నత పాఠశాలకు నేను హెడ్‌ మిస్ట్రెస్‌నయ్యాను. అప్పుడు కమ్యూనిస్ట్‌ పార్టీతో పరిచయం కలిగింది. పార్టీ అప్పుడు నిషేధంలో వుంది. దాని సాహిత్యం ఎక్కడా దొరకట్లేదు. ఎట్లాగో ప్రయత్నం చేసి కొంత సాహిత్యాన్ని సంపాయించి చదివాను. అది చదివినప్పుడనిపించింది -నా దేశం కానీ, మొత్తం మానవాళి కానీ బాగుపడాలంటే ఇదొక్కటే మార్గం అని. అయితే ఇందులోకి పూర్తిగా వచ్చేముందు ఇంక కొంత సాహిత్యం చదివాను. వ్యక్తిగతంగా నేను చాలా దౌర్భాగ్యస్థితిలో వున్నందుకే దౌర్భాగ్యులవైపు ఆకర్షించబడటానికి కారణం అయివుండొచ్చు.

నా చదువంతా నా స్వయంకృషితో జరిగిందే. తర్వాత స్కూలు హెడ్‌ మిస్ట్రెస్‌నయ్యాను. బి.ఏ., ఎమ్‌.ఏ. అంతా నా కృషే. బెనారస్‌ నుంచి చేశాను. 1942 లో బెనారస్‌ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్‌ చేశాను. వందేమాతరం వుద్యమం మూలంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం బహిష్కరించబడింది. అదేకాదు. స్త్రీలకేమాత్రం ప్రాముఖ్యత ఇవ్వలేదు. బెనారస్‌ విశ్వవిద్యాలయం స్త్రీలకవకాశం ఇవ్వటమేకాకుండా వుద్యోగినులకు కూడా అవకాశం యిస్తున్నదని తెలిసి నేనక్కడనే ఇంటర్మీడియట్‌ చేయటం జరిగింది. తర్వాత బి.ఏ. చేశాను. ఎమ్‌.ఏ. మాత్రం 1952లో నేను జైలునుంచి బయటకొచ్చిన తర్వాత చెయ్యటం జరిగింది. ఎందుకో నాకదిచెయ్యటం చాలా అవసరమయింది. నేనెప్పుడు కాలేజి మొహం చూళ్ళేదు. బన్సీలాల్‌ ఇక్కడ మొదట హిందీ మీడియం స్కూలు. హిందీ నిజాంకు వ్యతిరేకంగాకపోయినా ఎందుకో హిందీని నిజాం వ్యతిరేకభాషగా చూసేవాళ్ళు. షావుకార్లు, రాజాలు అందరూ నిజాం ప్రభుత్వానికి బంట్లే (నౌకర్లే) కద. అయినా ఎందుకో అదేభావం వుండేది. నేను బొంబాయినించి ఇక్కడికొచ్చినపుడు వుత్త మెట్రిక్యులేట్‌ని.

నేను 1943లో స్కూలు వొదిలిపెట్టాను. 1942లో కమ్యూనిస్‌పార్టీలో చేరడంమూలంగా ఒకటిన్నర సంవత్సరం మాత్రం పనిచేశాను. పార్టీ నా సామర్థ్యాన్నీ, దీక్షనూచూసి నన్నువెంటనే జిల్లాకమిటీలోకి తీసుకుంది. కమ్యూనిస్ట్‌పార్టీలో హోల్‌టైమరుగా చేరాను కాబట్టి స్కూలుపని మానేయాల్సి వచ్చింది. అప్పుడు స్త్రీని నేనొక్కదాన్నే. స్త్రీల కమిటీలేం లేవు అప్పట్లో. తర్వాతే మిగతా స్త్రీలందరూ వచ్చారు. అవి యుద్ధంరోజులని మర్చిపోవద్దు. కొంతమంది స్త్రీలుకాంగ్రెసులో వుండేవాళ్ళు. కొంతమంది ప్రభుత్వానికి సంబంధించినవాళ్ళు. నీలోఫర్‌ రాజకుమారి, దురేషావర్‌ రాజకుమారి కూడా వుండేవాళ్ళు. శత్రువులు విమానాలతో దాడులు జరిపితే ఆత్మరక్షణ ఎట్లా చేసుకోవాలని వాళ్ళు శిక్షణ ఇచ్చేవాళ్ళు. నన్ను వాళ్ళకు సహాయం చెయ్యమన్నారు. మొదట నేను వాళ్ళతో కలవనన్నాను. తర్వాత నాకు నేనే ఆలోచించుకున్నాను. ఇట్లాకాకపోతే నేను ప్రజలతో సంబంధం పెట్టుకోవటం ఎట్లా? నాకు నా స్కూలుపిల్లలతోతప్ప ఎవరితోనూ పరిచయం లేదు. అట్లా నా పిల్లలతోటి తల్లులతోటి మొదలుపెట్టాను. తర్వాత వాళ్ళందర్ని వాళ్ళ బస్తీలల్లో కలిసేదాన్ని. నూలువడకటం, నేయటంలాంటి కాంగ్రెసు ప్రోగ్రాములు కూడా వుండేవి. తర్వాత ఒక బస్తీనుంచి ఇంకొకబస్తీకి తిరుగుతూ స్త్రీలను కలవటం మొదలుపెట్టాను. ఎంతైనా ఇవన్నీ మన జీవితాలకి దగ్గరయిన సమస్యలు కావు కదా! విద్యలాంటి స్త్రీల సమస్య వుంది. స్త్రీలకు విద్య లేదు.

నాకు గుర్తుంది-మేం ఇంటింటికీ తిరిగేవాళ్ళం. వాళ్ళను కున్నారు-నేను వాళ్ళ భార్యల్ని ఇందులోకి లాగటానికి చూస్తున్నానని. అప్పుడొచ్చింది నవజీవన మహిళామండలి. దాన్ని మొదలు పెట్టినవాళ్ళు యశోదాబేన్‌, సర్జూబేన్‌, ప్రేమలతాగుప్తా (పెద్ద ఆఫీసరయిన ఎల్‌.ఎన్‌. గుప్తా భార్య) అయినప్పటికీ అభ్యుదయ భావాలున్నాయివాళ్ళకి. అట్లా ఈ నవజీవన మహిళామండలి ఒకటి వేరే వుండింది. మాకీ కార్యక్రమం వుండింది. అప్పుడు యుద్ధమొకటి. ఆర్థికసమస్యలన్నిటికంటే ముఖ్యమైనవి. ఇదెంతవరకు సరైనదో నాకు తెలియదు కానీ, అప్పుడు దురేషావర్‌ రాజకుమారి వితంతువులందరికీ రూపాయికి పదమూడు కిలోల జొన్నలు రేషనివ్వటం మొదలుపెట్టింది. నేనింటింటికీ తిరిగి కూపనులిచ్చాను. అప్పుడు రేషనింగు డిపార్టుమెంటుకి మిసెస్‌ పాఠక్‌ అధికారిగా వుండేది. నా స్కూలు పిల్లలతో, టీచర్లతో కలిసి నేనిట్లాంటిపన్లు చేసేదాన్ని. మేం కూపన్లతో తాజాగా, చౌకగా పాలను కూడా అమ్మేవాళ్ళం. దానికి నీలోఫర్‌ రాజకుమారి ప్రెసిడెంటుగా, నేను సెక్రటరీగా వుండేవాళ్ళం. బేగంబజారులో ఒకటి, సుల్తాన్‌బజార్‌లో ఒకటి – రెండు షాపులుండేవి. ఇదంతా వుండేది. అయినా ప్రతిరోజు కార్యక్రమం మాత్రం బస్తీబస్తీ తిరగటం, ఇంటింటికీ పోవటం, వాళ్ళ సమస్యలేమిటో కనుక్కోవటం. చాలామంది దౌర్భాగ్యస్థితిలోవున్న స్త్రీలు ఇళ్ళనుంచి వెళ్ళగొట్టబడితే మా దగ్గర ఆశ్రయం తీసుకునేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళకేమన్నా పనులు చూపించటం, పెళ్ళిళ్ళు చేయటంలాంటి చిన్నసహాయాలు చేసేవాళ్ళం. ఇదంతా కూడా నవజీవనమండలి ద్వారానే.

1943లో అనుకుంటా ప్రభుత్వం రేషనింగ్‌ ప్రవేశపెట్టాలను కుంది. అప్పటివరకు లేదు. రెండురోజుల్లో దాన్ని ఆర్గనైజు చేయాలి. రేషనుకార్డుల్లేకుండా రేషను దొరకదు. ఎట్లా చేయాలి? కమ్యూనిస్‌పార్టీ ప్రభుత్వాన్నడిగింది. ”కార్డులు పంచటంలో మేం సహాయం చేస్తాం” అని చెప్పాం. ప్రభుత్వం వొప్పుకోలేదు. అయితే మేం నవజీవనమండలి ద్వారా వెళ్ళాం. దాదాపు నాలుగువేలకార్డులు దొరికినవి. అట్లా చేశాం. అప్పుడు జాతీయోద్యమం కదా! నవజీవనమండలిలో రాజులు, రాణులు అందరుండేవాళ్ళు. రాజా ఇందిర్‌మల్‌ చెల్లెలు మాన్‌కుమారీదేవి కూడా వుండేది. జాతీయభావాలే ఎక్కువ ముఖ్యం. జాతీయవిముక్తికోసం అందరం పనిచేస్తున్నాం. నేనన్నట్టు ఆర్‌.ఎస్‌.ఎస్‌. స్త్రీలందులో వున్నారు. కాంగ్రెసు స్త్రీలున్నారు. ఏ రాజకీయాల్లేని వాళ్ళూ వున్నారు. ముఖ్యమేంటంటే అందరం స్త్రీలకోసం కృషిచేస్తున్నాం, జాతీయలక్ష్యంకోసం పనిచేస్తున్నామని. అవును నవజీవనమండలి మానిఫెస్టో, లక్ష్యాలు, ఇతర రిపోర్టులన్నీ రజతోత్సవాల సందర్భంగా ప్రచురించాం. మీకు దొరుకుతాయి. సుశీలవర్మ-రమకు తెలుసు-ఆమెనడిగితే మీకు దొరుకుతాయి. ఫోటోలు కూడా వున్నాయి. ఆమె దానికి సెక్రటరీ అనుకుంటా నేను ఫోన్‌ చేయగలను. మీరైనా చేయొచ్చు. నేనిప్పుడక్కడికి పోవటం లేదు. నాకేం సంబంధం లేదు. ఇక్కడే బషీర్‌బాగ్‌లో మిసెస్‌ గుప్తా కూడా వుంది. ఆమె ఆరోగ్యం బాగాలేదు.

నవజీవనమండలి పని పార్టీకేవిధంగా వుపయోగపడిందనే విషయం మీకు ఆసక్తికరంగా వుండొచ్చు. నేనే స్త్రీలను కలిసి మాట్లాడటానికి వెళ్ళేదాన్ని. నా బాగ్‌లో ఎప్పుడు పార్టీ సాహిత్యం, కరపత్రాలు పెట్టుకొని తిరిగేదాన్ని, ఎవరైనా శ్రద్ధవున్నవాళ్ళు, కుతూహలం చూపించేవాళ్ళు కనిపిస్తే వెంటనే అవి తీసిచ్చేదాన్ని, నేను చేసిన పనదే. మిగతావాళ్ళకు తెలిసేదనుకో. అయినా వాళ్ళేం చేస్తారు? మండలిలో హిందీ మాట్లాడేవాళ్ళ సభ్యత్వమే రెండువేల వరకుండేది. భాషా సమస్యొకటుండేది. కాబట్టి తెలుగువాళ్ళందరికీ ఆంధ్రమహిళాసభ వుండేది. ఇక్కడ మాకు మరాఠీ, గుజరాతీ, మార్వాడీ అన్ని రకాలవాళ్ళు ఉండేవాళ్ళు. మీకు వాసుదేవనాయక్‌ తెలుసా – పక్కా కాంగ్రెస్‌ మనిషి? ఆయనొకసారి భార్యనడిగాడు ”మీరు మీ కమిటీలల్లో కొట్టుకోరా?” అని. ఆమె చెప్పింది ”ఎందుకు కొట్టుకుంటాం? మాకొక కార్యక్రమం వుంద”ని అది మాత్రం నిజం. మండలిలో మాకొక కార్యక్రమం వుండేది. మేం దాన్ననుసరించాం. మా పార్టీ సాహిత్యాన్ని అక్కడకెప్పుడూ తీసుకెళ్ళలేదు. కమ్యూనిస్ట్‌ కార్యక్రమం అంటె అంతకంటే ఏముంది? జనాన్ని సమీకరించాలి. చైతన్యం తీసుకురావాలి. అంతేకాని వూరికే చదవటం, కరపత్రాలు పంచటంమాత్రం కాదుకదా! అది పనికొచ్చేది కాదు. నాక్కొంచెం అనుభవం వుంది. జనంతో కలిసి పనిచేయటం నాకు చాలా నేర్పింది. పార్టీమీద నిషేధం వచ్చినపుడు నన్ను నేనే సపోర్టు చేసుకోవల్సి వచ్చింది. ఎక్కడికెళ్ళను? నాకిక్కడ చుట్టాలెవరూ లేరు. ఇక్కడ నాకు పరిచయంవున్న ప్రజాసంఘం సభ్యులు, బస్తీల సంఘం, స్కూలు టీచర్లు – వీళ్ళే నన్ను చూసుకున్నది. నన్నెందుకు, నన్నొక్కదాన్నే కాదు, అయిదుసంవత్సరాలు పార్టీని కూడా చూసుకున్నారు. నాకాశ్రయం ఇచ్చారు. ఆర్థికంగా సహాయం చేశారు. నేను గొప్పలు చెప్పటం లేదు. వీళ్ళేకాదు, అసంఘటితంగా వున్నవాళ్ళెంతమందో నాకు సహాయం చేశారు. అట్లాంటి చైతన్యం వుండిందప్పుడు. పరిస్థితులున్నాయి. నిజాంకు వ్యతిరేకంగా ఎట్లా పోరాడాం! కమ్యూనిస్ట్‌పార్టీ ఒక్కటేకాదు. ఐక్యసంఘటన అది మొదటినించీ చివరివరకూ, భూస్వాములుకూడా మాతో కలిశారు. అది మాగొప్పతనం మాత్రమేకాదు. ఆరోజులట్లా వున్నాయి. కమ్యూనిస్టుపార్టీకి సమీకరించగలిగేశక్తి వుంది. ఆరుట్ల కమల, నిమ్మగడ్డ సత్యవతి మా తరఫున ఆంధ్రమహిళాసభలో సభ్యులుగా వుండేవాళ్ళు. నాకు తెలుగసలొచ్చేదికాదు. అదొక సమస్యగా వుండేది.

ఇట్లా వుండేదప్పుడు – ప్రోగ్రామేదైనాసరే ముందు మేందాన్ని చర్చించేవాళ్ళం. రంగమ్మ-అవును ఓబుల్‌రెడ్డి భార్య ఆమె కూడా వుండేది నాతో. ఆమె కాంగ్రెసులో పనిచేసేది. కాని చాలా విశాలభావాలు కల మనిషి. ముందు మేం కలిసి మాట్లాడేవాళ్ళం. అట్లా మేం (నవజీవనమండలి, ఆంధ్ర మహిళాసభ) కలిసి కార్యక్రమాలు తీసుకునేవాళ్ళం. ఉదాహరణకి సూర్యాపేటలో విద్యార్థులమీద కాల్పులయితే మేమొక మీటింగ్‌ పెట్టాం. అదేదో స్థలం. ఆ, దిల్‌షాద్‌ టాకీసనుకుంటా, మీటింగును నిషేధించారుకాని, మేమందరం అక్కడే కలిశాం. రంగమ్మవుండె. నవజీవనమండలి, ఆంధ్రమహిళాసభ ఇంకా ఏవో చిన్న స్త్రీసంఘాలన్నీ కూడా వుండె. ఆరోజు కర్నాటక మహిళాసభ, ఇతర భాషాసభలు కూడా వుండె. ఒక ముస్లింస్త్రీలుతప్ప అందరూ వున్నరారోజు, ముస్లింస్త్రీలు చాలా తక్కువ. ఎక్కువమంది రాలేదు.

మీకు తెలుసనుకుంటా! అఖిలభారతమహిళా కాన్ఫరెన్సుం డిందప్పుడు. దాని విభాగం లేడీ హైదరీక్లబ్‌లో వుండేది. వాళ్ళ ప్రోగ్రాముల్లో కూడా మేం పాల్గొనేవాళ్ళం. రాదల్చుకోనివాళ్ళెవ్వరూ రాలేదనుకో. లీలామణినాయుడు రాలేదు. ఆమెకివన్నీ ఇష్టం లేదు. కాని ఆమెకిష్టంవున్నా లేకపోయినా మేం కలిసేవాళ్ళం. ఒకసారి రాజకుమారి దురేషావర్‌ ఆహారకమిటీనొకదాన్నేర్పరచింది. లీలామణి ఆమెకు ప్రైవేటు సెక్రటరినో, ఏదో, ఒక మీటింగుంటే అందులో మమ్మల్నందర్ని మాట్లాడమన్నారు. ముందుగా మా వుపన్యాసాలు రాసివ్వమనడిగారు. నేను రాసివ్వలేదు. నాకు తెలుసు ముందే నేను చెప్పబోయేది రాసిస్తే చించిపారేస్తారని. వెంటనే లీలామణి దురేషావర్‌కు చెప్పింది నేను రాసివ్వటానికొప్పుకోలేదని. ఆమె ”ఏం ఫరవాలేదు చూద్దాం ఏం చెప్తుందో” అని వదలేసింది. వాళ్ళకు తెలుసు కొన్ని విషయాలగురించి ఎవరభిప్రాయాలు వాళ్ళకుంటాయని. అట్లా కలిసి పనిచేయటాని కవకాశం వుండేది. రాచకుటుంబానికి (టర్కిష్‌ రాజవంశం) చెందినమనిషైనా దురేషాపవర్‌ చాలా విశాలభావాలున్న వ్యక్తి.

మహేంద్ర విద్యార్థిగా వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యా లయాన్ని హిందూ విద్యార్థులు బహిష్కరించారు. తను శాంతినికేతన్‌కు వెళ్ళిపోయారు. అక్కడి అభ్యుదయ వాతావరణం గురించి మీకు తెలుసు కదా, అతను కాలేజి వదిలేసి బారంపూర్‌లోని వుక్కు, బొగ్గుగనులల్లో పనిచేయటం మొదలుపెట్టాడు. సాయుధపోరాటం మొదలైనతర్వాత అతన్నిక్కడికి పిలిపించారు. ”మా కామ్రేడ్‌ వెనక్కి రావా”లన్నారు వాళ్ళు. అతనిక్కడికొచ్చేసరికి మక్దూం జ రాష్ట్రం వదిలిపెట్టిపోయాడు. రాజబహదూర్‌గౌడ్‌ జైల్లో వున్నాడు. నాయకులెవరూ మిగల్లేదు. మహేంద్ర ఇక్కడికి కొత్త. అతనికెవరూ తెలీదు. స్థలాలు సరిగ్గా తెలీదు. నేను సహాయం చేసేదాన్ని. ఐనా నేనెక్కడుండడమనే ప్రశ్న వచ్చినపుడు, ”మేం నీకాశ్రయం ఏర్పాటుచెయ్యలేం” అన్నాడతను. రహస్యంగా పోయినవాళ్ళల్లో నేను చివరిదాన్ని. నేనందరికీ వుండటానికి స్థలాలేర్పాటుచేశాను. ఆ డాక్టరిక్కడే వుండె అప్పుడు. ఆ పేరిక్కడ చెప్పటం అనవసరం అనుకుంటా. ఆమె లండన్‌లో వుందిప్పుడు. ఇక్కడికివచ్చే ప్రసక్తిలేదు కాని, ఐనా ఆమె పేరు చెప్పకపోవటమే మంచిది. మాతో మంచి స్నేహంగా వుండేది. చాలా సహాయం చేసేది. సరే మహేంద్ర మేం సహాయం చెయ్యలేమన్నాడు. ఇక నేను బొంబాయి వెళ్ళక తప్పదనుకున్నాను. నాకు మొత్తం ప్రపంచంలో వున్నదొకే ఒక చట్టం. ఇది 1946లో. నేను చాలా బాధపడ్డాను. ఉద్యమంలో వున్నాం. ఉద్యమం చాలా తీవ్రంగా వున్నపుడు నేను వదలిపెట్టిపోవల్సి వచ్చింది. నాకసలిష్టమనిపించలేదు. నేనప్పుడే చెప్పాను కదా, పట్నం మొత్తం నాకు తెలిసినవాళ్ళున్నారని. నేను తెలియని ఒక సందు లేదు, ఒక స్థలం లేదు. అయితే నాకు వెంటనే వుండటానికి స్థలం దొరికింది. నాకేకాదు మిగతావాళ్ళందరికీ కూడా ఇళ్ళేర్పాటుచేశాను. అట్లా రహస్యంగావున్న టైములోనే మహేంద్రకు నేనేమిటో తెలిసింది. అతను నన్నెందుకు వెళ్ళిపొమ్మన్నాడని మీరడగొచ్చు. అతనిక్కిడ కొత్త. చాలామందికి తెలియదు. అది కూడా మామూలుగా మీకు తెలిసిందే (నవ్వుతూ) ఆడవాళ్ళుంటే ఒక సమస్య.

(జమక్దూం మొహియుద్దీన్‌ (1908-1969) హైదరాబాదులో కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్‌ యూనియన్‌ వుద్యమం స్థాపకుడు, ప్రముఖ ఉర్దూ కవి.)

నేను 1946లో రహస్యంగా పోయాను. నామీద అరెస్ట్‌వారం టుందని చెప్పారు. 1951లో అరెస్టయ్యాను. నేను 1947లో రహస్యంగా వున్నపుడే పెళ్ళి చేసుకున్నాను. అవును. పార్టీ అనుమతికోసం ఆడగటం తప్పనిసరి. వాళ్ళేమన్నారో నాకు తెలీదు. సుందరయ్య, ఈ పెద్ద కమిటీవాళ్ళంతా వున్నారు కానీ వాళ్ళను కలిసే అవకాశం లేదు. ఒకవేళ నేను వాళ్ళ స్థానంలో వుంటే ఏమనుకునేదాన్ని? వీళ్ళిద్దరి జీవితాలు ముడిపెట్టుకోవాలను కుంటున్నారు. మంచేమిటి? చెడేమిటి. వీళ్ళెట్లా వుంటారు? ఇవన్నీ తప్పకుండా వాళ్ళలోచించేవుంటారనుకుంటా, మా వ్యక్తిత్వాన్ని గురించి కూడా ఆలోచించి వుంటారు. మాది వర్ణాంతర వివాహం. వీళ్ళాపరిస్థితెదుర్కోగలరా అనొక ప్రశ్న, అది కూడా వుద్యమం తీవ్రంగా వున్నది కాబట్టి ఈ వాతావరణాన్ని తట్టుకోగలుగుతామా అని. ఏమైనా వాళ్ళేం అభ్యంతరాల్ని పెట్టలేదు.

నేను హైదరాబాద్‌లో మొదట ఏ పార్టీలో చేరానా? ఇక్కడప్పుడుకాంగ్రెసుపైన కూడా నిషేధం వుండింది. కమ్యూనిస్ట్‌ పార్టీ గురించి నాకప్పటికి తెలీదు. కాని నేను వివేకవర్ధని బాలికాపాఠశాలలో, నారాయణగూడా బాలికాపాఠశాలలో, ఇంకా కొన్ని వేరే పాఠశాలల్లో సమీకరించటం చేసేదాన్ని. బస్తీలలో కూడా అదేపని చేసేదాన్ని. దాన్నిక్కడ కొంతమంది కమ్యూనిస్టులు గమనించారు. వాళ్ళెవరో నాకు తెలీదు. వాళ్ళే నన్ను కాంటాక్టు చేశారు. అప్పుడిక్కడ మహారాష్ట్ర కాన్ఫరెన్సుండేది. నేనందులో సభ్యురాల్ని. తర్వాత మరాఠ్వాలో కాన్ఫరెన్సు జరిగింది. నేనక్కడికి కూడా పోయాను. అక్కడివాళ్ళు నా పని విలువను గుర్తించారు.

అమ్మాయిల్ని కూడగట్టటమెట్లాగో చెప్పాను. బస్తీలల్లో చేయటం చాలా కష్టం. మొదట స్కూళ్ళకి వెళ్ళాల్సివచ్చేది. ఇప్పుడయితే విద్యార్థుల్ని సమీకరించాలంటే అన్నిరకాల సమస్యల గురించీ మాట్లాడాలి – రాజకీయంగా, ఆర్థికంగా, ఇంకా ఎన్నోరకాలుగా. అప్పుడట్లాకాదు. అప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి గురించి. రేపొక కొత్తరకమైన జీవితం మొదలవుతుంది. ఎట్లా? మనకి దానిగురించేం తెలుసు? మనమేం చేయాలి? మనకు స్వేచ్ఛ వుండాలి. కట్నం అడిగినవాళ్ళని పెళ్ళిచేసుకోకూడదు. తర్వాత అణచివేతనెదిరించి పోరాడాలి. అప్పట్లో కూడా ఇవే ప్రధాన సమస్యలు. నేనప్పుడొంటరిగా వున్నానా? (నవ్వు) అవును అయితే మా అమ్మ వుంది నాతో.

నేను రహస్యంగా వున్నపుడు గ్రామాల్లోవెళ్ళి పనిచేయాల నుండేది. నిజంగా తుపాకిపట్టుకొని పనిచేయాలనుండేది. అయితే అట్లాంటాదర్శం అందరికీ వుంటుంది. కానీ నా పార్టీ మాత్రం దానికొప్పుకోలేదు. ”నువు పట్నం పిల్లవు. నీకా భాష తెలీదు. ఆ వాతావరణంలో వుండలేవు” అన్నారు. అట్లా అని తిరస్కరించారు. ఈ టెక్నికల్‌పనే చూసుకునేదాన్ని. ఉండటానికిళ్ళు వెతకటం, కొరియర్లను చూడటం. చాలాసార్లు ఎక్కడా స్థలం దొరక్కపోతే మాతోనే వచ్చి వుండేవాళ్ళు. వాళ్ళ రేషను గురించి మేమే చూసేది. ఇతర అవసరాలన్నీ – కొన్నిసార్లు అనువాదాలు చేసేదాన్ని ఇంగ్లీషులోకి. ఎవరన్నా హిందీ, మరాఠావాళ్ళు బయటినుండి వస్తే నేననువాదం చేసేదాన్ని. ఇట్లాంటిపన్లన్నీ చేసేదాన్ని. అప్పుడు మేం యాకూత్పురాలో వుండేవాళ్ళం. ఇద్దరమే వుండేది. యశోదాబేన్‌, ఆమె భర్త ఇంకకొంతమంది కూడా మాతో వున్నారు. మా ఇంటామె చాలా స్నేహంగా వుండేది. మేం ఎప్పుడెక్కడికి వెళ్ళినా మాకెవరూ వ్యతిరేకంగా వున్నదిలేదు. మేమెప్పుడూ అందరితో స్నేహంగానే వుండేవాళ్ళం. వాళ్ళూ అట్లాగే స్నేహంగా వుండేది. నేనామెతో అనేదాన్ని నాకింకొంచెం బియ్యం కావాలని, ఆమె అడిగేది, ”అన్ని బియ్యం ఎందుకు? మీరిద్దరేగా” అని. నేను చెప్పాను” మాకు ఆంధ్రావైపునుంచి చాలామంది కామ్రేడులొచ్చేవాళ్ళు. వాళ్ళు బియ్యం అయితేనే తినగల”రని. అప్పటి రోజులు యుద్ధంరోజులు. బియ్యం దొరికేవికావు. మేము బియ్యం ఎట్లాగో సంపాయించి ఆంధ్రాకామ్రేడ్స్‌ కోసం పంపించేది. తెలంగాణా కామ్రేడ్సయితే జొన్నలు తినేవాళ్ళుగానీ ఆంధ్రావాళ్ళు మాత్రం కాదు.

నేను జిల్లా కమిటీలో వున్నప్పుడందులో సభ్యులెవరుండే వాళ్ళంటారా? రాజబహదూర్‌గౌడ్‌, మక్దూం, మహేంద్ర కూడా ఆ తర్వాతే వచ్చాడనుకోండి. ఇంకా జవాద్‌రజ్వీ, ఓంకార్‌, పర్‌షాద్‌….. నేనూ మర్చిపోయాను. కమిటీ చర్చల్లో నేనేదైనా సమస్య పరిష్కారం గురించి సలహాలు చేస్తే దానికి మిగతా వాళ్ళేవిధంగా రియాక్టయ్యారనే సంఘటనలేమన్నా గుర్తుచేసుకోగలనా? ఆ… అప్పుడు మాకు వేరే వేరే బస్తీలల్లో స్త్రీల కేంద్రాలుండేవి. ఒకటి సికింద్రాబాదులో వుండేది. బాలకేంద్రం కూడా. అక్కడ పద్మానాయుడని ఒకమ్మాయి, మీరు కూడా వినేవుంటారా పేరు, ఆ అమ్మాయి కలిసింది, వయసు చిన్నది. చాలా ఆసక్తి చూపించేది. ఆ కేంద్రం నడపడంలో మేం ఆ అమ్మాయి మీదనే ఆధారపడేవాళ్ళం. ఒకరోజు నేను పార్టీ ఆఫీసునుంచి స్త్రీల మీటింగుకు హాజరవటం కోసం లేడీ హైదరీక్లబ్‌కు వెళ్తున్నాను. నేను చాలా తొందరలో వున్నాను. దోవలో ఒక పరదాబండి పోవటం చూశాను. ఆరోజుల్లో ఎడ్ల బండైనా, గుర్రపు బండ్లైనా రెండువైపులా చిల్మన్‌తో మూసేసేవాళ్ళు. నేను గబగబ నడుస్తుంటే ఈ బండి కన్పించింది. ఎవరో చిల్మనెత్తి చూశారు. పద్మానాయుడే, నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నేననుకున్నాను – తనిక్కడెందుకుంది? సికింద్రాబాద్‌ నుంచి ఇక్కడికెందుకొచ్చింది? ఆ రోజుల్లో బస్సులెక్కువలేవు. ఇప్పటిలాగా అప్పుడు ప్రయాణం చేయడం అంత సులభం కాదు. నేను బండాపి ”ఇక్కడేం చేస్తున్నా”వని అడిగాను. ”నేనింటినుంచి పారిపోయొస్తున్నాను. తిరిగి మళ్ళీ మా అమ్మ దగ్గరికెళ్ళటం నాకిష్టంలేదని” చెప్పింది తను. ”ఎక్కడికెళ్తున్నా”వని నేనడిగాను. పార్టీ ఆఫీసు కెళ్ళాలనుంది కానీ వెళ్ళటానికి ధైర్యం చాలటంలేదంది. సరే అని నేను తనని మా ఇంటికి తీసుకుపోయి మా అమ్మతోవుంచి పార్టీ దగ్గరికి ఈ సమస్యను తీసుకుపోయాను. జరిగిందంతా వాళ్ళకు చెప్పాను. పార్టీలో కామ్రేడ్సందరూ ఆమెను తిరిగి వాళ్ళమ్మ దగ్గరకు పంపెయ్యాలని అన్నారు. నేనట్లా పంపటానికి వీల్లేదన్నాను. తాను కావాలని తానే వచ్చేసింది. తనకు నమ్మకం వుంది. మనం తనతో మాట్లాడాలి. మనం అన్నీ కనుక్కుని తనకు సరైన పని, స్థానం కల్పించాలి. కాని నేనొక్కదాన్నే ఇట్లా చెప్పింది. నా ఒక్క గొంతుకు అంత బలం లేదు. దురదృష్టవశాత్తు తనను వెనక్కి పంపించటం, వాళ్ళమ్మ వెంటనే తీసుకుపోయి మద్రాసులో ఆ అమ్మాయి పెళ్ళి జరిపించటం అన్నీ జరిగిపోయినవి. ఎవరికో యిచ్చిచేశారు. ఈ సమస్యను అందరూ ఒకే దృష్టితో అర్థం చేసుకోలేదనిగాదు… ఈ అమ్మాయిని ఒకవేళ పార్టీలోకి తీసుకుంటే పార్టీకప్రతిష్టని, ఎవరితోనో ఈ అమ్మాయికి సంబంధం వుందని అందరూ అనుకుంటారేమోననే అనుమానంతో పార్టీ తిరస్కరించటం నాకు చాలా అవమానకరంగా అనిపించింది. మగవాళ్ళెప్పుడూ అట్లాగే ఆలోచిస్తారు. అందులోనూ నాయకత్వం మరీ. నేను దానిని వ్యతిరేకించాను. కాని గెలవలేకపోయాను. మీకు చెప్పినట్లు ఆ అమ్మాయిని మద్రాసు పంపేశారు. నేను జైలునించి బయటికొచ్చిన తర్వాత రోడ్డుమీదెక్కడో కలిశాను. తనకి నల్గురుపిల్లల తర్వాత భర్త చనిపోయాడు. ఆర్‌.టి.సి.లో వుద్యోగం చేస్తున్నది. తర్వాత మళ్ళీ పనిచేసిందనుకో అయినా ఆర్‌.టి.సి.లో పని మానలేదు. ఈ పిల్లల్ని పోషించుకోవటంకోసం అక్కడ క్లర్కుగా పనిచేసేది. నేను జైలునుంచొచ్చినప్పుడు నా సమస్యలు నాకే వుండడంతో నేనెవరితోనూ అంతగా కలగజేసుకోలేదు. ఎవరైనా వస్తే తోచిన సహాయం చేసేదాన్ని కాని, ఎక్కువ వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేదాన్ని కాదు. నా బాధలే నాకెక్కువగా వుండేవి. ( ఇంకా వుంది)

(మనకు తెలియని మన చరిత్ర)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో