అభివృద్ధి, సాధికారత ప్రక్రియల మధ్య సమన్వయం లేకుంటే సాధించేది శూన్యమే

పరుచూరి జమున

‘కుటుంబశ్రీ’ అనే పథకం గురించి తెలుసు కొనేందుకు మన మంత్రివర్యులు, సి.ఇ.ఓ. శ్రీ రాజశేఖర్‌ గారితో కలసి కేరళలో మూడు రోజుల పాటు పర్యటించే అవకాశం కలిగింది. అరేబియా సముద్రానికి ఆనుకొని కొండమీద కట్టిన అతిథి గృహంలో మాకు బస ఏర్పాటు చేశారు. 12-30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరితే మేం సాయంత్రం 5-30 గంటలకు అతిథి గృహం చేరగలిగాం. 3 గంటలు విమానంలోనే కూర్చు న్నాం. సముద్రం హోరు చెవుల్లో గింగుర మంటోంది. మరోవైపున సముద్రం మీది నుంచి వచ్చిన గాలి మా తలుపులు కొడుతూనే ఉంది.

మరుసటి రోజు నుంచి మా ‘కుటుంబశ్రీ’ యాత్ర మొదలైంది. గ్రామ పంచాయితీల్లో స్త్రీల భాగస్వామ్యం పెంచడానికి, మహిళల సాధికారత కోసం కేరళ ప్రభుత్వం 1998లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని పంచాయితీల ద్వారానే మూడు స్థాయిల్లో మహిళలతో ఏర్పాటు చేసిన సంఘాల ద్వారా అమలు జరుపుతోంది. (1) నైబర్‌హుడ్‌ గ్రూపులు (ఎన్‌.హెచ్‌.జి.లు) అంటే ఇవి మన స్వయం సహాయక సంఘాల్లాంటివి. (2) ఏరియా డెవలప్‌మెంట్‌ సొసైటీలు (ఎ.డి.ఎస్‌.) అంటే గ్రామంలో ఉన్న ఎన్‌.హెచ్‌.జీలు అన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ – మన గ్రామసంఘం లాంటిది. (3) బ్లాక్‌ స్థాయిలో కమ్యూనిటి డెవలప్‌మెంట్‌ సొసైటీ ఇందులో ఎ.డి.ఎస్‌.లన్నీ సభ్యత్వం కలిగి ఉంటాయి.

మన రాష్ట్రంలోని పంచాయితీలతో పోలిస్తే కేరళ పంచాయితీలు చాలా పెద్దవి. ఒక్కో గ్రామ పంచాయితీలో సగటున 20 వేల జనాభా ఉంటుంది. కేరళలో 999 గ్రామ పంచాయితీలు, 152 బ్లాక్‌ పంచాయితీలు, 14 జిల్లా పంచాయితీలు ఉన్నాయి. ప్రతి పంచాయితీకి ఏడాదికి ఇంటిపన్ను, ఆస్తిపన్ను, సేవాపన్ను, వివిధ లైసెన్సుల మంజూరు ద్వారా కనీసం ఒక కోటి రూపాయలనుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అంతేగాక ప్రభుత్వం నుంచి దాదాపు 5 కోట్ల రూపాయల మేర ప్రణాళిక నిధులు లభిస్తాయి.

పంచాయితీ కార్యాలయాలు మన మునిసిపల్‌ ఆఫీసులకన్నా, మండలాల ఆఫీసులకన్నా పెద్దగా ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా పంచాయితీలు నిర్ణయాలు తీసుకునే సమావేశాల్లో పాల్గొంటాయి. వీరంతాకూడా చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారు. అధికారులు సెక్రటేరియల్‌ సేవలు అందిస్తే పంచాయితీల్లో ఎన్నికైన అభ్యర్థులందరూ సంస్థాగతమైన అధికారంతో పంచాయితీలో కార్యక్రమాలన్నింటిని అమలు చేస్తారు. విద్య, వైద్యం, జీవనోపాధుల కల్పన వంటి కార్యక్రమాలను అమలు చేయడానికి పంచాయితీ వ్యవస్థలోనే విడి విడిగా స్థాయి సంఘాలు ఉంటాయి. మూడు నెలలకొకసారి గ్రామసభ నిర్వహించడం తప్పనిసరి. కనీసం 10 శాతం మంది జనాభా హాజరుకావాలి. పంచాయితీలు పెద్దగా ఉన్నందున వార్డుల వారీగా ఈ సభలు పెడతారు. గ్రామసభల్లోనే ఎన్‌.హెచ్‌.జీ.లు లబ్ధిదారులను గుర్తించి వారికి సంబంధించిన సూక్ష్మప్రణాళికను రూపొందిస్తాయి. ఇలాంటి సూక్ష్మ ప్రణాళికలన్నింటిని కలిపి గ్రామస్థాయిలో ఏరియా డెవలప్‌మెంట్‌ సోసైటీ ఒక గ్రామ ప్రణాళికను తయారు చేస్తుంది. ఈ గ్రామ ప్రణాళికలను, గ్రామ సభల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులను కాని మరివేటినీ కూడా పంచాయితీలు మార్చలేవు. తారుమారు చేయడానికి వారికి ఎలాంటి అధికారాలు లేవు. ఈ గ్రామ ప్రణాళికలను అన్నింటిని కలిపి పేదరిక నిర్మూలన కోసం బ్లాక్‌ స్థాయిలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక పాలనావ్యవస్థ రూపొందించుకున్న ఉప ప్రణాళికగా తయారు చేస్తారు. ఈ ఉప ప్రణాళిక తయారుచేయడంలో దానికి తుదిమెరుగులు దిద్ది ప్రధాన ప్రణాళికలో అంతర్భాగంగా చేసే ప్రక్రియలో ప్రతి గ్రామ సర్పంచి తప్పని సరిగా పాల్గొంటారు.

ఆశ్రయ పథకం

పంచాయితీలు ‘కుటుంబశ్రీ’ పథకంలో భాగంగా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను మేము సందర్శించాము. గ్రామంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి, కుటుంబానికి సహాయసహకారాలు అందించే కార్యక్రమమే ఆశ్రయ పథకం. అట్టడుగు స్థాయి అంటే ఏమిటి అని పథకంలో అందరికి అర్థమయ్యేలా కొన్ని సూత్రీకరణలు పెట్టుకున్నారు. అందరికంటే నిరుపేద తన హక్కులు తనకు తెలియని మనిషి, వాటిని అందుకోలేని వ్యక్తి, సమాజంలో తన పెరుగుదల కోసం వేరేవారితో పోటీపడలేనివారు, తమ అవకాశాల కోసం ఇతరులతో సంప్రదింపులు సాగించలేని, బేరసారాలు చేయలేనివారు – అంటే ఏమాత్రం అధికారం, పలుకుబడి లేని నిస్సహాయులుగా ఉన్నవారు. అన్ని రకాల లొంగుబాట్లకు లోనయ్యే స్థితిలో ఉన్నవారు, ఈ ముప్పులనుంచి తప్పించుకొనే రక్షణ వలయాలు లేనివారు. కనీస జీవన స్థాయికంటే కూడా దిగువన సరిపడినంత ఆదాయాలు ీలేక నానా యాతనలు పడుతున్నవారు సమాజంలో అట్టడుగున ఉన్నట్టుగా గుర్తించారు.

అంగవైకల్యం, స్త్రీత్వం, ఒంటరితనం, వైధవ్యం, వదిలివేయ బడటం, షెడ్యూల్డ్‌ కులాలకు, జాతులకు చెందడం వంటి అంశాలన్ని కలిసి లేదా విడి విడిగా ఒక స్త్రీని మరింత నిస్సహాయత స్థితిలోకి నెడతాయి. పితృస్వామిక, అంచెలంచెల అధికారిత సమాజంలో పేదలు మరింత పేదలు కావడానికి, అనాథలు కావడానికి, ఇతరుల ధాతృత్వం మీద ఆధారపడి బతికే స్థితికి దిగజారడానికి, చివరికి ఏ దిక్కు దివాణం లేని, ఆశ్రయం లేని అడుక్కొని తినే యాచకులుగా వీధుల్లోకి నెట్టివేయబడడానికి ఈ అంశాలన్ని దోహదం చేస్తాయని ప్రాజెక్టులో పనిచేసే అందరు గుర్తించారు. ”ఇటువంటి స్థితిగతులకు గురైన వారికి ముందుగా వారిలో ఆత్మవిశ్వాసం పాదుకొలపడానికి, వారికి గుర్తింపు కలిగించడానికి ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి. శ్రద్ధతో వ్యక్తిగతమైన సేవలు క్రమం తప్పకుండా కొంతకాలం పాటు అందించాలి. నిత్యం వారికి చేదోడువాదోడుగా వ్యవహరించడం ద్వారా మాత్రమే వారిని స్వావలంబన స్థితికి తీసుకొని రాగలము. ఇదంతా చేయడం ద్వారా అవసరమైనంత కాలాన్ని, డబ్బుని, ఒక సంక్షేమ దృక్పథంతో బాధితులపై వెచ్చించగలిగినప్పుడే వారిని అట్టడుగు స్థాయినుంచి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న సాధారణ పేదరిక స్థాయికి తీసుకొని రాగలగుతాము.” అని వెంగనూరు గ్రామ పంచాయితీ పెద్దలు ఆశ్రయ పథకం గురించి ఎవరి కోసం ఏ అవగాహనతో రూపొందించారో మాకు చక్కగా వివరించారు.

వెంగనూరు గ్రామంలో మేము ఓమన అనే 50 సంవత్సరాల వింతతువు, నిస్సహాయ మహిళ ఇంటికి వెళ్ళాము ఆమె చాలాకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఆమెకు ఉండడానికి సరైన ఇల్లు లేదు. భర్త తాగుడు వ్యసనంతో ఆమెను సరిగా చూసుకొనేవాడు కాదు. చివరకు అదే వ్యసనంతో చనిపోయాడు. కొడుకులు లేరు. పక్కకే ఒక్కగానొక్క కూతురు నివసిస్తుంది. కానీ ఆమె పరిస్థితి కూడా దీనాతిదీనంగానే ఉంది. ఆమెకు చదువు లేదు, భర్తకూడా తాగుడుకు అలవాటు పడినవాడే. అక్కడ చాలా మంది ఇరుగుపొరుగు వాళ్ళు కూడా తమ సమాజంలో మద్యపానం ఒక పెద్ద సమస్య అని పురుషులు తమ సంపాదనలో చాలా భాగాన్ని మద్యానికే ఖర్చు చేస్తారని చెప్పారు.

పంచాయితీ ఓమన అవసరాలను గుర్తించింది. ఆమెకు మందులు, ఆహారం నాలుగు నెలలపాటు అందించింది. ఆమెను తరచు ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యపరీక్షలు చేయించి అవసరమైన చికిత్స చేయించింది. ఈ రకంగా నాలుగు నెలలు సాదిన తర్వాత ఓమనకు కొంత ఓపిక వచ్చింది. తనంత తానే వంట చేసుకుంటానని చెప్పింది. పంచాయితీ వెంటనే ఆమెకు రేషన్‌ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులన్నీ మందులతో పాటు సమకూరుస్తుంది. అంతేగాక ఒక మనిషి ఆమెను రోజూ సందర్శించి ఆమె క్షేమాన్ని కనుక్కొంటున్నారు. వండుకున్నదా, తిన్నదా లేదా మందులు వేసుకున్నదా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఆమెకు ఇల్లు కట్టుకోడానికి మూడు సెంట్ల స్థలం ఇచ్చారు. త్వరలోనే ఇల్లు కట్టడానికి నిధులు మంజూరు చేస్తామని కూడా చెప్పారు.

వెంగనూరు గ్రామంలో 84 మంది మహిళలు ఇంకా పెళ్లి కావలసిన వాళ్ళు వరకట్నం ఇవ్వలేక పెళ్లి చేసుకోలేని వాళ్ళు ఉన్నారని తెలియజేశారు. కల్వతుక్కల్‌ అనే గ్రామ పంచాయితీలో కూడా 300 మంది ఇటువంటి మహిళలే ఉన్నారని చెప్పారు. పెళ్ళిళ్ళు కాకపోవడానికి వారే వారి కుటుంబంలో సంపాదనపరులు కావడం, కుటుంబ పోషకులు కావడం ఒక కారణం. ఫలితంగా కుటుంబాలు వారికి పెళ్ళి చేసి వారిని వదులుకోవడానికి సిద్ధంగా లేవు. కొన్ని కుటుంబాలలో ఆడపిల్లకు వాటాగా ఇవ్వవలసిన ఆస్తిని ఇవ్వడానికి సిద్ధపడడం లేదు. కట్నం ఇచ్చుకోలేకపోతున్నారు. ఫలితంగా పెళ్ళిళ్ళు కావడం లేదు. కోవలంలో మత్స్యకారుల కుటుంబాల్లోని మహిళలు కూడా కేరళలో వరకట్నం అనేది చాలా పెద్ద సమస్యగా పేర్కొన్నారు. కేరళలో కనీసమైన పెళ్ళి వయస్సు 22 సంవత్సరాలుగా ఉంది. ఇలా వివాహ వయస్సు ఎక్కువగా ఉండడం అనేది అభివృద్ధికి సూచికగా మనం తీసుకుంటాము. కానీ కేరళలో పరిస్థితి వరకట్నం ఇవ్వలేనందుకు ఆడపిల్లలు పెళ్ళికాకుండా మిగిలిపోయి సగటు వివాహ వయసు పెరిగింది. చాలా కుటుంబాలు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేయడానికి ఇళ్ళు అమ్మేస్తారు. ఆ తరువాత పంచాయితీకి తమకొక ఉండడానికి ఇల్లు ఇవ్వవలసిందిగా దరఖాస్తు పెట్టుకుంటారు. ఆలస్యంగా పెళ్ళిళ్ళు కావడం, అసలు పెళ్ళిళ్ళు కాకపోవడం జనాభా పుట్టు రేటు మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. కేరళలో పుట్టుక రేటు కూడా తగ్గిపోయింది.

చాలా ప్రగతిశీలకమైన రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న కేరళలో వరకట్నం చాలా తీవ్రమైన సామాజిక సమస్య. ఇది కింది స్థాయి కుటుంబాలను, మధ్యతరగతి ఆదాయవనరులు కలిగిన కుటుంబాలను, ఆర్థిక సంక్షోభానికి గురిచేస్తున్నాయి. పెళ్ళి వస్త్రాలు, బంగారు నగల మీద విపరీతరగా ఖర్చు పెట్టడము, అత్తమామలకు జేబు ఖర్చుకు బహుమతుల రూపంలో ఇవ్వడము, వివాహం జరిపేటందుకు భవనాల అద్దె ఖర్చు, పెళ్ళి వేదికలు, విపరీతమైన విందు ఖర్చులు, బ్యాండుమేళాలు అన్ని కలిసి కట్నానికంటే మించిపోయిన పెళ్ళిఖర్చులతో కుటుంబాలు అప్పుల వలయంలో చిక్కుకు పోతున్నాయి. ఆశ్రయ పథకాన్ని పంచాయితీలు ఇటువంటి అనేక రకమైన సామాజిక దురాచారాలు కారణంగా బాధితులైన వారికి మద్దతు కల్పించేందుకు వారి జీవితాలకు ఒక పరిష్కార మార్గంగా అమలుచేస్తున్నాయి.

ఓమనలాంటివాళ్ళు అన్ని రకాల అభివృద్ధి ప్రక్రియలకు బయటనే ఉన్నటువంటివారు కేరళ వంటి అత్యంత ప్రజాస్వామిక వికేంద్రీకరణ జరిగిన సమాజంలో రెండు శాతం మందికి పైగానే ఉన్నారు.

తొలుత గ్రామ పంచాయితీల్లో ఎన్నికైన అభ్యర్థులందరు తమ సమాజంలో విపరీతమైన దారిద్య్రానికి గల వివిధ కారణాలను, వివిధ కోణాలను విస్తృతమైన చర్చల ద్వారా విశ్లేషించారు. భూమిలేని వారిని, 5 సెంట్ల భూమికంటే తక్కువ ఉన్నవారిని, ఇల్లు లేనివారిని, కూలీపోయే స్థితిలో ఉన్న ఇంటిని కలిగిన వారిని, మరుగుదొడ్డి లేనివారిని, 150 మీటర్ల దూరంలో మంచినీటి సదుపాయం లేనివారిని, స్త్రీలే కుటుంబ పెద్దలుగా ఉన్న కుటుంబాలను – అంటే వితంతువు, విడాకులు తీసుకున్న మహిళ, పెళ్ళి కాకుండానే తల్లి అయిన స్త్రీ, భర్తచేత వదిలివేయబడిన స్త్రీ, ఒంటరిగా జీవిస్తున్న మహిళ-ఇటువంటి మహిళలకు సంబంధించిన కుటుంబాలన్నింటిని పంచాయితీలు పేదరికంతో బాధపడుతున్న కుటుంబాలుగా గుర్తించాయి. అలాగే కుటుంబంలో ఒక్కరికన్నా నిరంతర సంపాదన లేని వారిని, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన వారిని, మానసిక, భౌతిక వికలాంగతకు గురైన వ్యక్తి ఉన్న కుటుంబాన్ని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వ్యక్తి ఉన్న కుటుంబాన్ని, వ్యసనపరులున్న ఇంటిని, నీడలేక రోడ్లమీద నిద్రపోయేవాళ్ళని, అత్యాచారాలు, అక్రమ రవాణాకు గురైన మహిళలను, యాచకులను కూడా పేదరికంతో పీడింపబడుతున్న నిస్సహాయ కుటుంబంగానే పంచాయితీలు గుర్తించాయి.

ఇలా గుర్తించిన ప్రజలందరి గురించి తగు జాగ్రత్తలు తీసుకొని వారి అవసరాల మేరకు అవసరమైన సదుపాయాలు, సేవలు, ఆర్థిక సహాయం, అందించడం ద్వారా వారి జీవన స్థితిగతులు మెరుగుపడ డానికి కృషి చేస్తుంది. ఆహార భద్రత, వైద్యసదుపాయం, వృద్ధాప్యంలో ఆసరా, స్థలంతో సహా శాశ్వత గృహం, మంచినీరు, మురుగునీటి పారుదల, మరుగుదొడ్డి సదుపాయాలు, పిల్లల చదువుకవసరమైన మద్ధతు, పిల్లలను స్కూలు వరకు చేర్చేటందుకు రవాణా సదుపాయం, ఉత్పాదకతతో కూడిన స్థిరమైన జీవనోపాధికి అవసరమైన ఆర్థిక, ఇతర సహాయ సహకారాలు పంచాయితీ అందజేస్తుంది.

సాధికారత

కేరళ మహిళలు సాధించిన సాధికారత గురించి జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే – 3 ఎన్నో విషయాలను తెలియజేసింది. పంచాయితీలు ఎంత బాధ్యత తీసుకున్నప్పటికి, ఆశ్రయ లాంటి చాలా గొప్ప అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నప్పటికి కేరళ సమాజంలో 33 శాతం మంది స్త్రీలు, 45 శాతం మంది 6 నెలల నుంచి 5 ఏళ్ళలోపు పిల్లలు, 8 శాతం మంది పురుషులు రక్తహీనతతో బాధపడుతూనే ఉన్నారు. 66 శాతం మంది మహిళలు తమ భర్తలు తమను కొట్టవచ్చని సమాధానం ఇస్తున్నారు. భార్య అత్తమామలను అగౌరవపరిస్తే భర్త కొట్టవచ్చనే వారు 45 శాతం మంది. ఇంటిని పిల్లలను నిర్లక్ష్యం చేస్తే కొట్టొచ్చనేవారు 44 శాతం మంది ఉన్నారు. 54 శాతం మంది పురుషులు కూడా తమ భార్యలను కొట్టే అధికారం, హక్కు తమకున్నాయని సమర్ధించుకుంటున్నారు. ప్రతి ఏడుగురు వివాహిత మహిళలలో ఒకరు భర్తచేత చెంపదెబ్బలు తింటున్నారు. హింసకు గురైనవారిలో 36 శాతం మంది మాత్రమే ఇతరులనుంచి సహాయాన్ని అర్ధించారు. 46 శాతం మంది కనీసం వేరేవాళ్ళకు చెప్పుకోడానికి కూడా ఇష్టపడడం లేదు. లైంగిక వేధింపులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. 2010లో 634 అత్యాచారాల కేసులు రిపోర్ట్‌ అయితే 2011లో 1132 రిపోర్ట్‌ అయ్యాయి. వరకట్న వేధింపులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. 2009లో 4007, 2010లో 4797, 2011లో 5377 రిపోర్ట్‌ అయ్యాయి. కేరళ ఆత్మహత్యల్లో 74 శాతంతో పురుషులదే పైచెయ్యిగా ఉంది. ఏమైనప్పటికి చాలా ప్రగతిశీలకమైన రాష్ట్రంలో కొట్టేవారు, కొట్టించుకొనేవారు స్త్రీ, పురుషులు ఉభయులు గృహహింసను సమర్ధించడం, స్త్రీలు భౌతిక దాడులకు, లైంగిక హింసకు గురికావడం చాలా ప్రశ్నలకు తావిస్తోంది.

కుటుంబశ్రీ వంటి పథకాలు అమలు జరుగుతున్నప్పటికి స్త్రీలు చాలా నిర్ణయాత్మకంగా పంచాయితీల్లో వ్యవహరిస్తున్నప్పటికి కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడంలో వెనకబడే ఉన్నారు. మార్కెట్‌కి వెళ్ళేందుకు 52 శాతం మందికి, ఆసుపత్రికి వెళ్ళేందుకు 54 శాతం మందికి, ఊరు వదిలి పక్క ఊరు వెళ్ళడానికి 41 శాతం మందికి మాత్రమే స్వేచ్ఛ ఉంది. కేవలం 35 శాతం మందికి మాత్రమే ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళడానికి అనుమతి ఉంది. తన స్వంత ఆరోగ్యాన్ని గురించి, ఇంటికోసం ఎక్కువగా చేసే కొనుగోళ్ళకు సంబంధించి, స్నేహితుల ఇళ్ళకు వెళ్ళే విషయంలోనూ స్వేచ్ఛగా ఆలోచించి స్వంతగా నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళు 47 శాతం మంది మాత్రమే ఉన్నారు. 91 శాతం మంది డబ్బు సంపాదిస్తున్నా 27 శాతం మంది దగ్గరే తమ స్వంత నిర్ణయాలతో ఖర్చు పెట్టేటందుకు ఎంతో కొంత డబ్బు ఉంది.

పోషకాహార లోపం కూడా అధికంగా ఉంది. తక్కువ బరువుతో పుట్టే పిల్లలు 13.3 శాతంగా ఉన్నారు. నీటి కారణంగా వచ్చే జబ్బులతో జనాభా మొత్తం బాధపడుతున్నది. 30 లక్షల మంది ఇంకా బావుల్లో నీళ్లు చేదుకొని తాగుతున్నారు. జనాభాలో 0 – 6 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలకు సంబంధించి 2001లో మగపిల్లలు 12.51 శాతం ఉంటే, ఆడపిల్లలు 11.35 శాతం ఉంది. 2011లో ఈ తేడా ఎక్కువైపోయింది. మగపిల్లల శాతం 10.59 అయితే ఆడప్లిలల శాతం 9.36గా ఉంది. మొత్తం జనాభాలో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో చూసినట్టయితే స్త్రీలే చాలా అధికంగా ఉన్నట్టు కనబడుతారు. సాధికారత కొరవడిన రాష్ట్రంలో నిష్పత్తి బాగుండడానికి కారణాలు రకరకాలుగా ఉండవచ్చు. పెళ్ళిళ్ళు కాకపోవడం, పిల్లలను కనకపోవడం, మగవాళ్ళు ఎక్కువగా వలస వెళ్ళడం, పురుషులు వ్యసనపరులై త్వరగా మరణానికి గురికావడం, సహజంగానే మహిళల జీవితకాలం ఎక్కువగా ఉండడం మొదలైన కారణాలన్ని పరిశీలించాలి.

అభివృద్ధి

కేరళలో ఉన్న ఈ రెండు భిన్న పరిస్థితులను చూసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు వాటంతట అవే కుటుంబంలో, స్త్రీల జీవితంలో, సమాజంలో స్త్రీల హోదాలో మార్పులు తేలేవని స్పష్టమవుతున్నాయి. సాధికారత అనేది ఒక వ్యక్తి జీవిత వికాసం, జీవన ప్రామాణికాలు మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి ప్రగతిశీలకమైన జీవనానికి అనుకూలమైన అభివృద్ధి ఫలితాలను సాధించే క్రమాన్ని కూడా మనము సాధికారత అనవచ్చు. ఏమైనప్పటికి సాధికారత చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇది భిన్నస్థాయిల్లో, భిన్న దిశల్లో పొరలు పొరలుగా ఉంటుంది. ఒక పొర తీస్తే మరొ పొర దర్శనమిస్తూ ఉంటుంది. ఈ సాధికారత మార్గంలో ప్రయాణించటం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మొదలుపెట్టవచ్చు కానీ దానికి అంతము ఉందనేది మాత్రము కష్టమే ప్రస్తుతానికి.

మహిళా సాధికారత ఆయా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సందర్భాలను బట్టి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, రాజ్య స్థాయిల్లో భిన్నభిన్నంగా ఉంటుంది. మహిళల ఆలోచనల ధోరణులు, అవగాహన సామర్థ్యం, వారి నిర్ణయాత్మక శక్తిని తెలియ జేస్తాయి. వివిధ వనరులపై మహిళలకున్న ఆధిపత్యం, అందుబాటు, అదుపు మొదలైన అంశాలన్నింటి పైన సాధికారత క్రమం ప్రభావం చూపుతుంది. మహిళలు తమ కనీస అవసరాలైన తిండి, బట్ట, నీడ, విద్య, వైద్యం, పని వంటి వాటికోసము పోరాడటమే కాక హింసలేని జీవితం, లైంగిక వేధింపులు లేని భద్రమైన సమాజం కోసం కూడా పోరాడే క్రమాన్ని సాధికారత ప్రక్రియ సాగే క్రమంగా పేర్కొనవచ్చును. పితృస్వామ్య సమాజంలో సాధికారత క్రమం లేకుండా మహిళలకు కుటుంబాల్లో సమాన వాటా, సమాజంలో సమానత్వం రాదు. మహిళలు సంపూర్ణ సాధికారత పోరాట క్రమాన్ని అనుసరించకుండా నిత్యవిశ్లేషణలో లేకుండా సంపూర్ణ స్వాతంత్య్రాన్ని పొందలేరు.

అందుకనే మహిళలు అభివృద్ధి క్రమంలో ఇల్లు, వాకిళ్ళు ఉన్న అనాథలుగా, డబ్బు సంపాదించే మర మనుషులుగా, అనేక రకాలైన హింసను సహిస్తూ అనంతమైన సేవలను అందించే పని మనుషులుగా, సరుకులుగా మిగిలిపోతారు. కేరళ నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి.

ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినా అందులో అంతర్భాగంగా జెండర్‌ స్పృహతో ఈ సాధికారత ప్రక్రియను ప్రారంభించడం తప్పనిసరి.

కింది స్థాయిలనుంచి కుటుంబశ్రీ పథకాల ప్రణాళికల తయారీని, అమలును నిర్వహించినట్లే మన రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఉప ప్రణాళికలను, నిధులను మండలాలు, పంచాయితీల ద్వారా ఖర్చు చేసేందుకు నిర్ధిష్టమైన కార్యక్రమాన్ని నియమావళిని రూపొందించుకోవాలి. ఈ ఉప ప్రణాళికలో ఆశ్రయ పథకంలో మాదిరిగా అట్టడుగునున్న అత్యంత నిరుపేదలను మహిళలను పైకి తీసుకురావడానికి నిధులను, కార్యక్రమాలను రూపొందించాలి. రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన మానవాభివృద్ధి ప్రణాళికను తయారు చేసి అమలుచేయాలి.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో