ఆధునిక తెలుగు సాహిత్యంలో నూతన మానవ ఆవిష్కారం విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాల 11,12 జనవరి 2013, సుందరయ్య విజ్ఞాన కేంద్రం (అమరుడు కామ్రేడ్‌ షంషేర్‌ హాల్‌), హైదరాబాద్‌

 సాహిత్యం సుదీర్ఘ గతంలోకి వెళ్లి మానవ జీవితాన్ని చిత్రిస్తుంది. వర్తమాన సంఘర్షణలను యథాతథంగా చిత్రికపట్టడమే గాక భవిష్య మానవుడ్ని ఊహిస్తుంది. సమాజం సంఘర్షణా భరితం అయ్యేకొద్దీ మనిషిలోని చైతన్య వికాసం సాహిత్యంలో విస్తృతమవుతుంది. నవ మానవావిష్కారం దిశగా కళా సాహిత్యాలు రాబోయే సమాజాన్ని, విలువలను సూచిస్తుంటాయి. ఈ లక్షణం పుష్కలంగా ఉన్నందునే తెలుగు సాహిత్యం ప్రతి దశలోనూ నవ నవోన్వేషంగా సాగిపోతోంది.

తొలి మానవుని కళా సృజనను అనేక ప్రతీకలు, సంకేతాలు సూచించినట్లే జానపదుల కళలు వారి శ్రమ జీవితానికి నిజ వ్యక్తీకరణలు. సమాజంలోని ఆధిపత్య వ్యవస్థల దుర్మార్గాన్ని, వాటిపట్ల రకరకాల విమర్శలను, నిరసనలను, ధిక్కారాలను అవి ప్రకటించాయి. జానపద కళలు బ్రాహ్మణీయ, శిష్ట సాహిత్యానికి సమాంతరంగా దళిత బహుజన జీవన తత్వాన్ని వినిపించాయి. అందులోని శ్రమ సౌందర్యం, స్వేచ్ఛా భావన ఆధిపత్య వర్గాల, కులాల సాహిత్యానికి ప్రత్యామ్నాయమైన విలువలను ప్రతిపాదించాయి. ప్రజా కళా సాహిత్యాలకు చారిత్రకంగా జానపద సాహిత్యంలో మూలాలు ఉన్నాయి. అట్టడుగు మనిషి గురించి, మానవ సంబంధాల గురించిన కళా వ్యక్తీకరణను అక్కడి నుంచే చూడాలి. భాష ఉత్పత్తితో సహా కళా సాహిత్యాల వికాసమంతా జానపదుల శ్రమ జీవన సంస్కృతిలో భాగం.

తెలుగులో ఆధునికతకు గురజాడను కొండగుర్తుగా భావించినా ప్రజా సాహిత్యం ఆయనతోనే మొదలు కాలేదు. కానీ ఆధునికత మాత్రం పూర్తి అర్థంలో గురజాడతోనే ప్రారంభమైంది. సుదీర్ఘమైన ప్రజా సాహిత్య సాంప్రదాయం ఆధునికతతో అతి పెద్ద మలుపు తిరిగింది. గురజాడకు పూర్వం అస్థానేతర ప్రజా సాహిత్యంలో ఆధిపత్య వ్యవస్థలపై దళిత, బహుజన కులాల ధిక్కారం కనిపిస్తుంది. భక్తి ఉద్యమంలో దేశీయ కవితా ధారకు పాల్కురి సోమనాధుడు నిలువెత్తు ప్రతినిధి. ఆయన తర్వాత వేమన, వీరబ్రహ్మం, మొల్ల వంటి బ్రాహ్మణేతర రచయితలు ఎందరో ప్రజా సాంప్రదాయాన్ని కొనసాగించారు. అట్టడుగు కులాల, వర్గాల, ప్రజల జీవితంలో ధిక్కారంతోపాటు, ప్రజాస్వామిక ధార ఉన్నందువల్లే మొదటి నుంచీ కళాసాహిత్యాల్లో ప్రజా సంస్కృతి వ్యక్తమవుతూ వచ్చింది. అట్లాగే గురజాడ కంటే ముందే బండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి వారు ఆధునిక భావాలతో కథా ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఆలోచనల్లో, కళా ప్రక్రియల్లో ఆధునికతకు ప్రతినిధి గురజాడ. అయితే ఇవేవీ గతంలోని ప్రజా సంప్రదదాయాలతో సంబంధం లేకుండా వచ్చినవి కావు. దృశ్య, మౌఖిక రూపాల్లోని జానపద కళలు, ఆస్థానేతర సాహిత్యం, దేశీ ఛందస్సు, అచ్చ తెనుగు నుడికారం అనే వారసత్వం లేకుండా వాడుక భాష, ముత్యాల సరాలనే ఛందస్సు, నాటకం గురజాడకు అంది వచ్చేవి కావు.

అయితే ఆధునికతను చారిత్రకంగా ఆయన జీవించిన కాలమే ఆయన ముందుకు తీసుకొని వచ్చింది. దాన్ని ఆయన తన సమకాలికులకంటే చాలా గాఢంగా స్వీకరించాడు. 17వ శతాబ్దంలో యూరప్‌లో మొదలైన జ్ఞాన వికాసం హేతు చింతనను ప్రవేశపెట్టింది. శాస్త్ర పరిశోధనలు ప్రకృతి రహస్యాలను, సామాజిక బంధనాలను ఛేదించే విజ్ఞాన శాస్త్రాలను, సామాజిక శాస్త్రాలను అందించాయి. మార్క్సిజం కూడా ఆ వొరవడిలో వచ్చిన ఆధునిక శాస్త్రీయ సామాజిక సిద్ధాంతం. పారిశ్రామిక విప్లవంతో కార్మిక వర్గం ఆవిర్భవించి పెట్టుబడిదారీ రాజకీయార్థిక వ్యవస్థపై తిరగబడింది. ఫ్రెంచ్‌ విప్లవం ప్రజాస్వామిక భావనను ప్రపంచమంతా ఎత్తిపట్టింది. ఇవన్నీ అనేక కీలక మార్పులకు దారి తీయడమేగాక మానవజాతిని కొత్త చరిత్ర ఆవరణలోకి తీసికెళ్లాయి.

మనలాంటి దేశాల్లోకి వలసవాదం ద్వారా ఆధునికత ప్రవేశించడం చారిత్రక ప్రత్యేకత. సమాజంలో ఆధునికతా వికాసం జరుగుతున్న, వలసపాలన వ్యవస్థీకృతమవుతున్న కాలంలో గురజాడ రూపొందాడు. అంతేకాదు, ఈ రెండింటి ప్రత్యక్ష, పరోక్ష ప్రేరణలతో పునరుజ్జీవన, సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు, అప్పుడప్పుడే స్పష్టమైన అవగాహనతో పుంజుకుంటున్న వలసవాద వ్యతిరేక ఉద్యమాల ఆవరణలో గురజాడ సాహిత్య రంగంలో ముందుకు వచ్చాడు. ఆ కాలంలో ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ, గురజాడలో కొన్ని రాజకీయ పరిమితులు ఉన్నప్పటికీ వలసవాదంతోపాటు వచ్చిన ఆధునికతలోని హేతుబుద్ధిని, శాస్త్రీయ దృక్పథాన్ని ఆకళింపు చేసుకోవడమే ఆయన ప్రత్యేకత. ప్రాచీన భారతదేశంలో వైదిక సంప్రదాయానికి ప్రత్యామ్నాయంగా దళిత, బహుజన ఆలోచనాపరుల తర్కదృష్టికి, ఆధునికతలోని హేతు చింతనకు చాలా తేడా ఉంది. అనుభవం నుంచి నిగ్గుదేలిన వివేకానికీ, పరిశోధనాపూర్వకమైన శాస్త్ర దృష్టికీ ఉండే మౌలికమైన తేడా ఇది. అందువల్ల ఆధునికత ప్రవేశించాక పరంపరాగతమైన ప్రజా జీవితంలోని ప్రజాస్వామిక తత్వానికి హేతుబద్ధమైన పునాది సమకూరింది.

గురజాడ వలస పాలనపట్ల వ్యతిరేకత ప్రకటించకపోయినప్పటికీ మన సాంఘిక వ్యవస్థల మీద, పునరుజ్జీవన, సంఘసంస్కరణోద్యమాల మీద, కాంగ్రెస్‌ ఉద్యమాల మీద నిశిత విమర్శ పెట్టడానికి ఆయనకు ఆధునికతే గీటురాయి. ఆయన స్వీకరించిన సాహిత్య వస్తువులు కాలగతిలో కలిసిపోయినా, ఆయన ప్రాసంగికతకు కారణం ఆయన ఆధునిక దృక్పథమే. చారిత్రకంగా ఆయన బూర్జువా ఆధునికతకు చెందినవాడే అయినా మన సాంఘిక, సాంస్కృతిక వ్యవస్థలపై తరతరాలుగా సాగుతున్న విమర్శను ఆయన ఆధునికంగా తీర్చిదిద్దాడు.

గురజాడ తర్వాత ప్రగతిశీల, వామపక్ష శక్తులు ఆయనలోని ఆధునిక దృక్పథాన్ని, ఆయనకు ముందు నుంచీ కొనసాగుతూ వస్తున్న ప్రజా, మౌఖిక, దృశ్య కళా సాహిత్య సాంప్రదాయాన్ని ఎత్తిపట్టాయి. మానవజాతి సాధించిన అద్భుత విజయమైన సోవియట్‌ విప్లవం వల్ల, భారతదేశంలోని కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం వల్ల శ్రీశ్రీ లాంటి వారు తెలుగు కవిత్వానికి అంతర్జాతీయ కార్మికవర్గ దృక్పథాన్ని అందించారు. చలం పితృస్వామ్య కుటుంబ వ్యవస్థపై విమర్శలు సంధిస్తే, జాషువాలాంటి కవులు కులవ్యవస్థపై, బ్రాహ్మణిజంపై పోరాటాన్ని ఎక్కుపెట్టారు. మాకొద్దీ తెల్ల దొరతనం అని గరిమెళ్ల వలసవాదాన్ని నిరసిస్తే, మాకొద్దీ నల్ల దొరతనం అని కుసుమ ధర్మన్న గానం చేశాడు.

ప్రపంచంలోనే పేరెన్నికగన్న సాయుధ ఉద్యమంలో ఒక్కటైన తెలంగాణ పోరాటం బండి యాదగిరి, సుద్దాల హనుమంతు, నాజర్‌ వంటి అట్టడుగు కులాలనుంచి, నిరక్షరాస్యుల నుంచి వాగ్గేయకారులను, కళాకారులను అందించింది. నాటకాన్ని, ప్రజాకళలను ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక ఉద్యమంలో ఆయుధాలుగా డాక్టర్‌ గరికపాటి రాజారాం, సుంకర, వాసిరెడ్డి తీర్చిదిద్దారు. తెలంగాణలోని పోరాట ‘సంగం’ గురించి కోస్తా ప్రాంతంలో తిరునగరి రామాంజనేయులు అక్షరీకరించి ప్రచారం చేశారు. ప్రజానాట్యమండలి, అరసం ఆనాటి ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక సాంస్కృతిక ఉద్యమానికి నాయకత్వాన్ని అందించాయి. వలసపాలనతో ప్రత్యక్ష సంబంధంలేని హైదరాబాదు సంస్థానం ప్రజాకవి అనే మాటకు వేమన తర్వాత చరిత్రలో నిలిచిపోగల కాళోజీని అందించింది. తొలి తెలంగాణ నవలలో మనుషులను పోరాటాలు ప్రజల మనిషిగా, నూతన మానవుడిగా ఎలా పునర్నిర్మించగలవో అళ్వారుస్వామి రాశాడు.

కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని వదిలిపెట్టి పార్లమెంట్‌లోకి వెళ్లిపోయాక, తిరిగి శ్రీకాకుళంలో పోరాటం మొదలయ్యే వరకు తెలుగు సాహిత్యంలో మానవీయతను, ధిక్కారాన్ని, కమ్యూనిస్టు చైతన్యాన్ని నిలబెట్టినవారు ఎందరో ఉన్నారు. సాంఘిక విప్లవాన్ని ప్రతిపాదించిన సీవీ రచనలు ఆనాటి యువతరాన్ని కదిలించాయి. ఏం రాసినా సరే ప్రతి అక్షరాన్ని మార్క్సిస్టు దృక్పథాన్ని చాటడానికే వెచ్చించిన కుటుంబరావు, కేవీఆర్‌, అధో జగత్‌ సహోదరుల గురించి రాసిన రావిశాస్త్రి ఈ వ్యవస్థ బాగా లేదని చెప్పడమేగాక, ఇక్కడినుంచే ఎప్పటికైనా కొత్తకాంతి ప్రసరిస్తుందని చాటారు. దిగంబర కవులు సృష్టించిన భావ సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రాచీనమైన దేశీయ కళా సాంస్కృతిక వారసత్వం నుంచి నవచైతన్యం వికసించిన ఆధునిక సాహిత్యం దాకా వ్యక్తమవుతూ వచ్చిన ప్రత్యామ్నాయ భావనను బైటి నుంచి చైనా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం ఒక స్థిరమైన ఆచరణాత్మక సిద్ధాంత పునాదిమీదికి తీసికెళ్లింది. ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయం నిర్మించడం సాధ్యమేననీ, దాన్ని సాధించే క్రమంలో మనిషి నూతన మానవుడిగా రూపొందుతాడనీ నక్సల్బరీ పంథా ముందుకు వచ్చింది. సాయుధ పోరాట కవిగా పాణిగ్రాహిది చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోని సాహిత్య మూర్తిమత్వం. ఆయన ప్రేరణతో సాహిత్యంలోకి వర్గపోరాట రాజకీయాల్ని తీసుకొని వచ్చి, బహిరంగంగా సాయుధపోరాట ప్రచారం చేయడానికి విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించడం పైన చెప్పిన ఆధునిక పూర్వ, ఆధునిక ప్రజా సాహిత్య సాంప్రదాయాలకు మేలి మలుపు. శ్రీకాకుళ పోరాట కాలంలో సుప్రసిద్ధ కవుల దగ్గరి నుంచి ప్రజా కార్యకర్తల దాకా ఎందరో కవిత్వాన్ని అల్లి విప్లవ సందేశాన్ని ప్రజల దగ్గరికి తీసికెళ్లారు. కొండగాలి కథలతో భూషణం విప్లవ కథకు ఆద్యుడిగా నిలిచిపోయాడు. సామాజిక, ఆర్థిక బంధనాలను తెంచుకొనే క్రమంలో అట్టడుగు మనిషి నూతన మానవిగా, మానవుడుగా ఎలా రూపాంతరం చెందుతారో తెలంగాణ నుంచి వచ్చిన విప్లవ సాహిత్యం చిత్రించింది. ప్రజల నుంచి ప్రజలకు అనే మావో మాటను నిజం చేసిన సంస్థ జననాట్యమండలి. తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో జననాట్యమండలి అసాధారణ ప్రయోగాలు చేసిన అరుదైన సంస్థ. ఈ వొరవడి అనేక పాయలుగా జనసాహితి, అరుణోదయ, ప్రజాకళా మండలి, అనేక దళిత, బహుజన సాంస్కృతిక వేదికలుగా విస్తరించింది.

1980ల నుంచి స్త్రీవాద, దళితవాద సాహిత్యాలు వర్గపోరాటంతో పేచీ పెట్టుకొని మొదలైనప్పటికీ అంత వరకు పెద్దగా స్పృశించని సాహిత్య వస్తువులను, కవితా నుడికారాన్ని తీసుకొని వచ్చాయి. కారంచేడు ఘటన తర్వాత దళితుల, వెనకబడిన కులాల ఆర్తి, వేదన, స్వీయ గౌరవం, భాషా సౌందర్యం సాహిత్యంలోకి వచ్చాయి. కుటుంబం, కులం అనే సాంఘిక వ్యవస్థల తరతరాల అణచివేత నుంచి విముక్తి కాంక్ష సాహిత్యంలో బలంగా వ్యక్తమైంది. దళిత మహిళల సాహిత్యం సామాజిక వ్యవస్థలో చిట్టచివరినుంచి వ్యవస్థీకృత విలువలన్నిటినీ ప్రశ్నిస్తోంది. అప్పటికే మొదలైన ముస్లిం సాహిత్య వ్యక్తీకరణ బాబ్రీ మసీదు విధ్వంసంతో విస్తృతమైంది. అతి సున్నితమైన, కఠినమైన శ్రమలన్నీ చేస్తూ ఈ దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని నిలబెడుతున్న ముస్లిం సమాజం నుంచి నిండైన లౌకిక మానవ స్వప్నాన్ని ఆవిష్కరించే సాహిత్యం వస్తోంది.

సరిగ్గా ఈ కాలంలోనే- అంటే 1980ల నుంచే విప్లవోద్యమం దండకారణ్యంలోకి ప్రవేశించడంతో అక్కడి నుంచి పెద్ద ఎత్తున కళా రూపాలు, కవిత్వం, వచన సాహిత్యం రావడం మొదలైంది. అప్పటిదాకా తెలుగు సాహిత్యకారులు పెద్దగా శ్రద్ద పెట్టని ఆదివాసీ జీవితాన్ని, పోరాటాన్ని దండకారణ్య రచయితలు చిత్రించడం ప్రారంభించారు. కొమురం భీంతో మొదలైన ఈ సాహిత్య ధార నిజమైన అర్థంలో నూతన మానవావిష్కారం దిశగా సాగుతున్నది. పోరాటం- సమస్యల పరిష్కారం, ఆశావహ దృక్పథం మాత్రమేగాక రాజకీయార్థిక సాంఘిక పాలనాపరంగా ప్రత్యామ్నాయ వ్యవస్థలను నిర్మిస్తున్న దండకారణ్య విప్లవోద్యమంలో నూతన మానవావిష్కార ప్రయత్నం ఉన్నది. జానపదుల నుంచి ఆధునిక చింతనాపరులైన సాహిత్యకారుల దాకా ఆశిస్తూ, వ్యక్తావ్యక్తంగా చెప్తూ వచ్చిన నూతన మానవుడు, మానవి దండకారణ్యంలోని విప్లవ ప్రయోగంలో రూపొందుతున్నారు. ముఖ్యంగా రాజకీయార్థిక పోరాటాల ప్రాతిపదిక మీద సాంఘిక విముక్తి సాధ్యమైతే ఎలాంటి పరివర్తన జరిగేదీ, ఒక కొత్త మనిషిగా ఎలా రూపాంతరం చెందేదీ రాగో నవలలో చూడవచ్చు. ఈ నవలకు నేపథ్యంలో నిర్మాణమవుతున్న జనతన సర్కార్‌లో కూడా దాన్ని చూడవచ్చు. అయితే ముందే అన్నట్లు ఈ ప్రయోగం కానీ, దాని ప్రతిఫలమైన సాహిత్యం కానీ ప్రాచీన ఆదివాసీ వివేకం గీటురాయిగా సాగుతున్నవి కావు. మార్క్సిజమనే ఆధునిక సామాజిక శాస్త్రం ఆధారంగా మావోయిస్టులు నిర్మిస్తున్న విప్లవోద్యమం నుంచి అక్కడి సాహిత్యం, కళలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల మీద నిరసన, కొత్తది కావాలనే కోరిక ఆది నుంచి మానవులకు ఉన్నదే. అయితే ఈ నిరసనకూ, కొత్త వ్యవస్థ నిర్మాణానికీ ఆధునిక శాస్త్ర దృక్పథాన్ని మార్క్సిజం అందించింది. అందుచేత మానవ చరిత్రలో ఆధునికత ఒక ముఖ్యమైన విభజన రేఖ అయింది.

అందువల్ల ఈ సాహిత్య పాఠశాల ఇతివృత్తం ‘సాహిత్యంలో నూతన మానవావిష్కారం’ అనే అంశానికి ఆధునికత అనే పరిమితి పెట్టడం సబబనిపించింది. కార్మిక వర్గం సమ సమాజమనే నిజమైన ఆధునిక వ్యవస్థను నిర్మించే క్రమం వేగవంతం అయ్యే కొద్దీ సాహిత్యంలో అనేక ప్రజాస్వామిక ధోరణులు వికసిస్తాయి. అవన్నీ మానవ జీవితంలో పాదుకోవాల్సిన నూతన విలువలను, సంస్కృతిని ప్రతిపాదిస్తుంటాయి. బలోపేతం చేస్తుంటాయి. విముక్తి, సమానత్వం లక్ష్యంగా సాగే ప్రయత్నంలో అన్ని రకాల బంధనాలు, వివక్షలు, అణచివేతలు, దోపిడీ రూపాలు ధ్వంసమై నిండైన అర్థంలో ప్రజాస్వామ్య సంస్కృతి ఆవిష్కారమవుతుంది. ఇప్పటికైతే దండకారణ్య సాహిత్యం ఈ విషయంలో శిఖరాయమానంగా నిలిచి ఉన్నది. భారతదేశంలో మరే సాహిత్య కళా సంస్థలో లేని విధంగా పదివేలమందికి పైగా సభ్యులున్న దండకారణ్య చేతనా నాట్యమంచ్‌ ఆదివాసీ కళా సాహిత్యాలను ఆధునిక దృక్పథంతో విప్లవకరంగా తీర్చిదిద్దుతున్నది. వర్గపోరాటం, ప్రయోగం ఉత్పత్తి అనే గీటురాళ్ళమీద దండకారణ్యంలో ప్రత్యామ్నాయ వ్యవస్థల నిర్మాణం జరుగుతున్నట్లే ప్రత్యామ్నాయ సాహిత్య సృజన సాగుతున్నది.

ఈ వర్తమాన సాహిత్య సందర్భంలో నిలబడి గురజాడ – ఆధునికత, వలస కాలపు సాహిత్యంలోని ప్రజాస్వామిక సాంప్రదాయాలు, వలసానంతర సాహిత్యంలోని ప్రజాస్వామిక సాంప్రదాయాలు, హైదరాబాద్‌ రాష్ట్రంలోని ప్రజాస్వామిక సాహిత్య సాంప్రదాయాలు, దండకారణ్యంలో ప్రత్యామ్నాయ వ్యవస్థలు- కల్పనా సాహిత్యం అనే అంశాలపై ప్రసంగాలను ఈ సాహిత్య పాఠశాలలో ఏర్పాటు చేశాం. రచయితలకు, కళాకారులకు, విప్లవాభిమానులకు అందరికీ ఇదే సాదర ఆహ్వానం.wa

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.