ఎక్కణ్ణుంచి…?!

పసుపులేటి గీత

ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? నాలుక నుంచా, చెవుల నుంచా, కళ్ళ నుంచా…, దేహం నుంచా, మోహం నుంచా…, కామదాహం నుంచా…, ఎక్కడి నుంచి మొదలుపెడదాం? తెల్లవారిన దగ్గర్నుంచీ నోటి నిండా, ఒంటి నిండా, ఇంటి నిండా, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ప్రవహిస్తున్న మురుగును శుభ్రం చేయడాన్ని ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలి?

పొద్దుటే న్యూస్‌పేపర్‌ తిరగేస్తూ, వార్తలకన్నా ముందుగా సినిమా బొమ్మల్నే చూస్తూ, ‘అబ్బబ్బ, దీనమ్మా…, ఇరగదీసిందిరా’ అంటూ చొంగకార్చుకునే మొగుడు లేదా తండ్రి లేదా అన్న…, పొద్దుట నిద్ర లేచిన దగ్గర్నుంచీ ఇలాంటివాళ్ళు స్త్రీ, పురుష తారమత్యం లేకుండా సమన్యాయాన్ని పాటించేది ఒక్క విషయంలోనే – అదే ‘బూతులు’! తొడల మధ్య ఉండాల్సిన ఒక లైంగికావయం (అది స్త్రీదైనా, పురుషునిదైనా) వీళ్ళ నోళ్ళలోకి, నాలుకల మీదికి ఎలా వచ్చేస్తుందో తెలియదు. చావుకీ, బతుక్కీ ఒక్కటే పురాణం – బతుకంతా బూతు పురాణం. ఈ బూతంతా ఎక్కువగా ఆడవాళ్ళ శరీరాల చుట్టూ తిరుగుతుంటుంది. సామెతలు, వక్రోక్తులు…, అన్నీ ఆడవాళ్ళ శరీరాలు, పునరుత్పత్తి ప్రక్రియల చుట్టూ తిరుగుతుంటాయి. ఎంతో ఎదిగామనుకుంటున్న మన జీవితంలో బూతు ఇంకా ఒక దైనందిన అవసరం. ప్రపంచంలో ఏ భాషలోనైనా బూతు తప్పనిసరి. ఆగ్రహానికి, అపహాస్యానికి, ఆక్రోశానికి, ఉక్రోషానికి…, చివరికి ఆనందానికి ఏకైక వ్యక్తీకరణ, సామాజిక అనుమతిని పొందిన దాష్టీకం. మానవజాతికి అత్యాచారాల్ని సహజాతం చేసే మాటల పునాది. పురాతన, సనాతన జన్యువు మాట నేర్చిన మనిషికి ఇచ్చిన శాపం.

మెరుగైన సమాజం కోసమే తెరల్ని బార్లచాపి, అష్టకష్టాలు పడే టీవీ చానళ్ళలో ప్రవహించే ‘మురుగు’కు అంతే లేదు. ‘ముద్దుగుమ్మ’, ‘అందాల ఆరబోత’, ఇంకా అనేకానేక భాషా రాక్షసాలు. అత్యాచారాలు జరిగిపోయాయంటూ వార్తలు, వాడే భాష, చూపించే విజువల్స్‌ ప్రోవోకింగ్‌గా ఉండేలా బాగా జాగ్రత్తలు తీసుకున్నట్టే కనిపిస్తుంటుంది. సరే, సామాజిక హితాన్ని దృష్టిలో ఉంచుకుని దాన్ని సహించినా, ఆ వార్తలు పూర్తయ్యీ, కాకముందే, సినిమా హీరోయిన్ల గురించి నానాబూతులు కట్టలు తెంచుకుంటాయి. రోజూ రోడ్ల మీద, ఆటోల్లో, టీవీల్లో, సినిమాల్లో, సెల్‌ఫోన్లలో, ఐపాడ్‌లలో గోలపెట్టే పాటలు శృంగారగీతాల పేరిట వినిపించే రతిక్రీడే తప్ప మరోటి కాదు. చెవుల్లోకి పొంగిపొరలే బురద కాలువలు. నిజానికి ప్రసార సాధనాలు, సినిమా వంటివి సామాన్యజనజీవితంలో భాగమైపోయాయి. అందుకే వాటివల్ల జరిగే ‘బూతు ప్రమాదానికి’ మొత్తం సమాజం మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది.

ఇక రోడ్ల మీద, పనిచేసే చోట, చదువు అనే పాదరసం గురించి తెలియని మురికివాడలు, నిమ్నవర్గాల జనజీవితంలోను బూతు విడదీయలేని అంశం. ఎంత కష్టపడితే, ఎంత అలసిపోతే బూతు తీవ్రత అంత ఎక్కువ. వాళ్ళని తప్పుపట్టలేం. ఎందుకంటే అంతటి శారీరక శ్రమ అవసరం లేని జీవితాల్ని గడుపుతున్న మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నతవర్గాల్లోనే బూతు సహజమైనప్పుడు శ్రమజీవుల కోపానికి, అక్రోశానికి, ఉక్రోషానికి ఆ మాత్రం అండదండలుండాల్సిందే. కానీ బూతు సహజం కాదు. కోపమూ, రోగమూ…, వీటిని ఎంత దూరం పెడితే అంత ఆరోగ్యం. సహజమైందే కదాని మరణాన్ని ఎవ్వరూ ఆహ్వానించట్లేదు కదా!

స్త్రీలు బూతులు మాట్లాడరా అంటే, వాళ్ళూ మాట్లాడతారు! అదొక సామాజిక లక్షణంగా రక్తంలో జీర్ణించుకుపోయింది. కానీ తిరిగి, తిరిగి అది వాళ్ళని వాళ్ళే తిట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణ శకుంతల (పాపం, ఆవిడ తప్పేం లేదు…, ఆమెను తిరగబడే మనిషిగానో, కోపిష్టిగానో చూపించడానికి రచయితలు వాడే భాషాగ్నికి ఆమె సమిథ మాత్రమే!) నోరు తెరిస్తే, ‘నీయమ్మ…,’నే కదా! అలాగే మహిళా టీవీ యాంకర్లు (ఈ పిల్లలకు అసలు తాము ఏ భాషలో మాట్లాడుతున్నామో కూడా తెలియదు…, అసలు తెలుగే తెలియదు, మగ స్క్రిప్టు రచయితలకు ఆడగొంతుల్ని వీళ్ళు అరువిస్తూంటారు.) చెప్పే సినిమా కబుర్లలో కూడా హీరోయిన్ల గురించి అవాకులు, చెవాకులకు లోటేమీ ఉండదు.

ఇక్కడ మనుషులు ప్రేమించలేరు, కామించగలరు. ఇక్కడింకా శరీరాలే తప్ప మనస్సులు వికసించలేదు. మనమంతా ఇక్కడ ఇంకా ఎంతమాత్రమూ సంస్కారానికి నోచుకోని ఆదిమ మానవ జన్యువుతో పోరాడుతున్నవాళ్ళమే. ఆడగా, మగగా విడిపోయిన మానవ శకలాలం. సమగ్రత గురించి, సామాజిక ఔన్నత్యం గురించి, ఏకరూపత గురించి కలలు కూడా కనడానికి అర్హత లేని పరమ అవిద్యావంతులం, అనాగరికులం. ఇక్కడ స్వేచ్ఛ గురించి, సంస్కారం గురించి, అమలిన జీవన సౌందర్యం గురించి కలలు కనడానికి మనం ఇంకా అర్హతను సంపాదించుకోలేదు. అందుకే మనకు కఠినమైన చట్టాలు కావాలి, మనం గొర్రెలం…, అందుకే మనకు కాపరులు కావాలి. మనకు నాయకులు కావాలి…, ఎవరో ఒకరు ముందుండి మనల్ని నడిపించాలి…, వాళ్ళు లేకుంటే మనం నడవలేం. మన చుట్టూ నాయకులే! అన్ని స్థాయిల్లో, అన్ని రంగాల్లో నాయకత్వ లక్షణాల్ని పోగుచేసుకున్న ప్రత్యేక సంతతి మనకు ఆక్సిజన్‌ కన్నా అత్యవసరమై పోయింది. మనం కేవలం ఆడవాళ్ళం, మనం కేవలం మగవాళ్ళం… అంతే…, మరే మానవీయ ఔన్నత్యాన్ని కలగనలేని అంధులం!

ఇప్పుడు దేశంలో జరిగిన, జరుగుతున్న అత్యాచారాల పర్వం ఒక అవసరాన్ని తట్టి లేపింది. ‘ఆడవాళ్లని గౌరవించడాన్ని పిల్లలకు నేర్పాలి’ అని అంతా అంటున్నారు. కానీ మనం కేవలం ఆడవాళ్ళమైనందుకే మనల్ని గౌరవించాలని చెప్పాల్సి రావడం దైన్యమే కదా. ఆడవాళ్ళని గౌరవించడం కాదు, అసలు మనుషుల్ని గౌరవించడమెలాగో నేర్పాలి. ఎంతమంది తల్లులు తమ మగపిల్లల్ని, ఆడపిల్లల్ని లైంగిక వివక్షకు అతీతంగా పెంచుతున్నారు? ఎంతమంది భర్తలు ఆడపిల్లల్ని కన్న భార్యల్ని ప్రేమించి, గౌరవిస్తున్నారు? ఎందరు ఆడవాళ్ళు తాము నెలసరి అయ్యామని బాహాటంగా చెప్పగలరు? దుకాణాలకు వెళితే శానిటరీ నాప్‌కిన్స్‌ని నల్లటి కవరులో ఎవరికీ కనబడకుండా దాచి ఇచ్చే షాపు సిబ్బందికి, అది ప్రకృతి సహజమైన భౌతిక చర్య అని, అదేమీ నేరం కాదని చెప్పగలుగుతున్నామా? శానిటరీ నాప్‌కిన్‌లు, బ్రాలు, పాంటీల్ని షాపులకు వెళ్ళి ఏమాత్రం సంకోచించకుండా కొనగలిగే మగవాళ్ళున్నారా? ఒకవేళ అలాంటి మగవాళ్ళున్నా, వాళ్ళని వింతగా చూసే ఆడవాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఆడ బాధ్యతలు, మగ బాధ్యతలు అంటూ విడగొట్టి, గిరిగీసిన మన కుటుంబ వ్యవస్థలో లైంగిక తేడాలతో నిమిత్తంలేని మానవీయ గౌరవాన్ని, జీవితాన్ని ఊహించగలమా? ఆడవాళ్ళ శ్రమను, గౌరవాన్ని దోచుకోకుండా జీవించగలిగే కొత్త కుటుంబ వ్యవస్థను, కుటుంబ సంబంధాల్ని మనం నిర్వచించగలమా, నిర్మించుకోగలమా? ఆడ, మగ అనే రెండు జాతుల సిద్ధాంతపు పునాది మీదే నిర్మితమైన ఈ వ్యవస్థను ప్రపంచం ముఖమ్మీది నుంచి తుడిచేసి, లైంగికావయవాలు, లైంగిక జీవితాలు కేవలం పునరుత్పత్తికి మాత్రమే పరిమితమై, అందరం మనుషులుగానే జీవించే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏనాటికి రూపుదిద్దుకుంటుంది? హింసను, దౌర్జన్యాన్ని, దోపిడీని, ఆధిపత్య భావజాలాన్ని, మచ్చలతో సహా గాయమన్న భావనను, స్పృహను మానవ జీవితం నుంచి శాశ్వతంగా తొలగించే వ్యాధినిరోధక టీకాల్ని ఎవరు తయారుచేస్తారు? ఇప్పుడిక పిల్లలకి ఏం నేర్పుదాం? ఎక్కణ్ణుంచి శుభ్రం చేద్దాం? దేన్ని శుభ్రం చేద్దాం?

మొదట మన సమక్షంలో, మన ఇళ్ళలో, మన కుటుంబీకుల వాడుక భాషలో…, వీటినుంచి బూతును మినహాయించే పనిని చేపట్టాలి. ‘రేప్‌’లకు ఇక్కడే, మన నాలుకల మీదే పునాదులున్నాయన్న మాట మరువకండి. మాట శక్తివంతమైంది. అలాగే కోపమూ శక్తివంతమైంది. అందుకే వాటి విలువ తెలిసి ప్రవర్తించేలా మన మనుషులకు శిక్షణనిద్దాం. ఎవరినీ కించపరచకుండా ఆగ్రహించేం దుకు, దేన్నీ గాయపరచకుండా నినదించేందుకు ఒక కొత్త భాషను కలగందాం, కలలు నిజమయ్యేందుకు మనవంతు కృషి చేద్దాం.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో