‘నిర్భయ’ సమాజానికి పూలన్‌దేవులవ్వాలి

జూపాక సుభద్ర

నేను హైస్కూల్‌ హాస్టల్లుండగా రమేజాబి కేసు మీద ఎవరెవరో ఆడవాల్లొచ్చి ఉపన్యాసాలిచ్చి మమ్మల్ని ధర్నాలకు లొల్లికి పిలచేటోల్లు. అప్పుడది పెద్ద ఉద్యమం. మహిళా సంగాలు పెద్ద ఎత్తున కదిలిండ్రు.

దాని తర్వాత యిప్పుడు ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ సంఘటన. ఒక దుర్మార్గం, హింస, నేరం పట్ల దేశంలో వున్న బలమైన శక్తులు కదలడం, పార్లమెంట్‌ మహిళలు కూడా కన్నీటి పర్వంతంగా నిరసనలు తెలపడం న్యాయం కోసం ఘోషించడం వంటి స్పందనలు చూస్తే యిట్లాగే సమాజంలో సామాజిక బాధ్యతలుంటే సమాజంలో వుండే అసమానతలు, హింసలు ఎప్పుడో మారిపోయేవిగదా అని ఒక్క నిమిషమనిపించింది.

భారతదేశంలో ప్రతి ఏడు నిమిషాలకువొక అత్యాచారం జరుగుతుందని లెక్కలు చెప్తున్నాయి. ఢిల్లీలో లాంటి స్పందనలుంటే ఆడవాల్ల మీద యిట్లా పెరుగుతున్న అత్యాచారాలు కొంత తగ్గుముఖం పట్టేవి. ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ ఘటన ఎంత నేరపూరితం, హింసా పూరితమో దీని మీద రాజకీయ నాయకులు, మతవాదులు, బాబాలు చేసిన వ్యాఖ్యానాలు యింకా హింసాత్మకమైనవి నేరపూరితమైనవి. బట్టలు నిండుగ వేసుకుంటే యిలాంటివి జరగవనీ, రాత్రి తిరగడం ఆడపిల్లకేం పని అనీ, భారత్‌లో (గ్రామాల్లో) అత్యాచారాల్లేవు. ఇండియా (పట్టణాల్లో)లోనే యీ అత్యాచారాలున్నయనీ, ఆ అమ్మాయి ‘అన్నా’ అని శరణుజొచ్చితే యిలా జరిగి వుండేది కాదనీ తప్పు ఆమెవైపు కూడా వుందనీ వ్యాఖ్యానించి నేర స్వభావాల్ని యింకాపెంచి పోషించే ప్రయత్నం చేశారు. మహిళలంతా యిలాంటి భావజాలాల్ని నిలువరించే ఉద్యమాలు చేయాలి. బట్టలు నిండుగ వేసుకోని వాల్లమీదనే అత్యాచారాలు జరుగుతున్నాయనేది పచ్చి అబద్ధం. దళిత ఆదివాసీ స్త్రీల మీద అజమాయిషిగా, వారి హక్కులను ధ్వంసం చేస్తూ, అహంకార పూరితాలుగా జరిగే అత్యాచారాలు దళిత ఆదివాసీ వస్త్రధారణ సరిగ్గాలేకనే జరిగాయా! వాకపల్లి గిరిజన మహిళల వస్త్రధారణ సరిగ్గా లేకనే పోలీసులు అత్యాచారం చేశారా! కైర్లాంజి, ప్రియాంక వాల్లమ్మ అర్ధరాత్రులు తిరిగితేనే వారి మీద అత్యాచారం జరిగి చంపబడినారా! ఖండ ఖండాలుగా నరికినా కనీసం వార్త కాకుండా పోయిన దాని మీద ఎవర్ని నిందితుల్నిచేయాలి? అధికార లెక్కలు సర్వేలు నిత్యం జరిగే అత్యాచారాలు దళిత ఆదివాసీ మహిళలే తొంబది తొమ్మిది అని చెప్తే ఏ మానవస్పందనలు, ప్రజాస్వామిక వాదాలు నోరు చేసుకోవు, పెన్ను చేసుకోవు, రోడ్డు మీదకు చేరవు.

ఢిల్లీ ఘటన తర్వాత ఒక విప్లవ నాయకుడైతే మతవాదుల్ని, బాబాల్ని మించిన అభిప్రాయాల్ని వ్యాసీకరించిండు.’నిర్భయ మృగాల్ల కామవాంఛలకి సహకరించి వుంటే క్షేమంగా వుండేది. అట్లా జరిగితే యీ దుర్ఘటన వెలుగు చూడని వేలాది లైంగిక అత్యాచారాల్లోకి చేరేది. మనసు చంపుకొని లైంగిక అత్యాచారాలకు అంగీకరించాల్సిన పరిస్థితులు సమాజంలో వున్నయనీ దీన్ని చీల్చి చెండాడం వల్లనే నిర్భయ కోట్లాది ప్రజల్ని మేల్కిల్పి రోడ్డు మీదికి తెచ్చిందని చెప్తాడు. ఎంత దుర్మార్గం. మహిళలు అత్యాచారల్ని అంగీకరించినందువల్ల ప్రజలు స్పందించలేదనడం ఏం సామాజిక విశ్లేషణ?

హర్యానాలో ఒక్క నెలలో 20 మంది దళిత బాలికలు అత్యాచారానికి గురైనపుడు దేశం గొడ్డు పోయింది. వాకపల్లి మహిళలకు న్యాయమే జరగలే. అయినా అదో శోకంగానే యీ కుల సమాజం పట్టించుకోలే. ఎవ్వరికి పుట్టినవు. బిడ్డాంటే ఎక్కెక్కి పడి ఏడ్చినట్లే వుండది. నిత్యం జరిగే అత్యాచారాలు దళిత, ఆదివాసీ మహిళల మీద జరుగుతున్న చీమ కుట్టిన స్పందనలు కూడా చూడబోం.

కాని, ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ దేశంలో ఎప్పుడు, ఎక్కడా జరగనట్లు మీడియా, సంగాలు, రాజకీయ పార్టీలు చేయడం ఆశ్చర్యమైనా అట్లా స్పందించే మానవత్వం కొనసాగాలనీ, అట్టనే కొనసాగితే జరుగుతున్న అత్యాచారాలకు న్యాయం దొరకడమే కాకుండా తగ్గే అవకాశాలుంటాయని ఆశించొచ్చు. కాని యీ కుల సమాజంలో, అసమాన, అప్రజాస్వామిక సమాజంలో అట్లా జరుగుతుందని ఆశించలేము. పల్లెల్లో, పట్నాల్లో దళిత, ఆదివాసీ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల మీద, ఎవరికీ పట్టకపోవడానికి కులం పాత్ర కూడా వుంది. దళిత స్త్రీల మాన ప్రాణాలను పట్టించుకొనే విలువలు సమాజానికి లేవు. వారి మీద దాడులు, అత్యాచారాలు జరగడం సామాన్యమే అనే ధోరణులువల్లనే యీ కుల సమాజం నిమ్మకు నీరెత్తినట్లుగా ఏమి జరగడంలేదనట్లుగా వ్యవహరిస్తుంది. యీ విలువల్ని సినిమాలు, సీరియల్లు యితర మాధ్యమాల ద్వారా మార్చరు. కానీ యీ మాధ్యమాలతోనే వెదజల్లుతున్న సీరియల్లలో, సినిమాల్లో వున్న అంశాలు, యితి వృత్తాలు ఆడవాల్లమీద మగ ప్రాధాన్యత, మత విలువలు, కుల విలువలకేమి లోటు లేదు. యీ దాడులన్నింటి క్కారణాలు యివన్నింటినీ చెప్పుకోవాలి. యిలాంటి అమానవీయ విషసంస్కృతిని నిలువరించకుంటే యీ అత్యాచారాలకు అడ్డుకట్టవేయలేం. యీ సందర్భంలో ఫూలన్‌ దేవి పోరాట స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ప్రతి మహిళకుంది. ఫూలన్‌దేవి భూస్వామ్య మగపెత్తనాల్ని, కుటుంబ మగపెత్తనాల్ని, బందిపోటు మగతనాల్ని, రాజ్య మగతనాల్ని (పోలీసులు) ధీరోదాత్తంగా ఎదుర్కుంది. నిజానికి ఫూలన్‌దేవి ఒక వెనుబడిన కులం నుంచి వచ్చిన పేదసగటు మహిళ. మొత్తం ప్రభుత్వాల్ని, మగదురహంకారుల్ని, బందిపోట్లదాకా గడగడలాడించింది. ఆమెను బందిపోటుగానే చూడ్డమంటే ఆమె సామాజిక ఆర్థిక నేపథ్యాల్ని వివక్షతతో చూడ్డంగానే అర్థం చేసుకోవాలి.

ఫూలన్‌దేవి బలాలు, ధైర్యాలు పొందేందుకు మహిళలంతా ఆమె జయంతులు, వర్థంతులు చేసుకోవాలి. ఆడవాల్ల మెదల్లో ఆమె ఆయుధమై మెరవాలి. అగ్రవర్ణ పితృస్వామ్య వ్యవస్థ ఫూలన్‌దేవి తిరుగుబాటును బందిపోటుగా ముద్రవేసి పక్కన పెట్టినట్లు మహిళలు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకు నష్టపోయేది మహిళలే.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.