రవ్వంత ఆరంభం…

.కుప్పిలి పద్మ

అతను మాట్లాడాడు.

గాయాల బాధ నుంచి వేదనాభరిత స్వరంనుంచి, పీడకలని కాంచిన దు:ఖం నుంచి ఆ స్నేహితుడు ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడాడు. గుండె గొంతులోన కొట్లాడుకుంటూ వొకొక్క మాట పేర్చుకొంటూ ఆ స్నేహితుడు విపులంగా మాట్లాడాడు.

నిర్ఘాంత పోయారు వింటున్నవాళ్లు. నశించిన మానవత్వం వో వైపు. పట్టనితనం మరో వైపు. వీటన్నిటి నడుమ స్టేట్‌కి సంబంధించిన విపరీతమైన కాలయాపన. అనేకానేక సందేహాలు, ప్రశ్నలతో మనసంతా కిక్కిరిసిపోయింది.

ఎందుకీ లోకంలో పిల్లలని, స్త్రీలని, బలహీనులని రక్షించుకోలేమా…అని నిస్సహాయంగా ప్రశ్నించుకొన్నాం. యీ ప్రశ్నని మనం చాలాకాలంగా వేసుకుంటూనే వున్నాం. స్త్రీలని గౌరవించాలని, చులకనగా చూడకూడదని, పెత్తనం చేయకూడదని, సమానంగా చూడాలని మనం అనేక విషయాలని మాట్లాడుతూనే వున్నాం. నిజమే గౌరవంగా చూడరు. చులకనగా మాట్లాడతారు. పెత్తనం చేస్తారు. సమానంగా చూడరు. యివన్నీ నిజమే. రోజురోజుకి జనరల్‌ సొసైటీలో హింస అనేకానేక రూపాలలో చెలరేగుతోంది. యెప్పుడైతే అది పెరుగుతుందో జండర్‌ వైయొలెన్స్‌ పెరుగుతుంది. యీ మొత్తం సమాజం లేదా ఆ సమాజంలో యీ పితృస్వామ్యపు ధోరణి మారేవరకు మనం యీలా యిరవై నిమిషాలకో అత్యాచారాన్ని భరించాల్సిందేనా… అత్యాచారపు రణరంగంలో ప్రాణాలు కోల్పోతున్న లెక్కల వైనాన్ని చూసి యెప్పటిక్పుడు వికలమనసులతో యెందుకు మేమంటే యింత ద్వేషం. యింత కసి. యింత పైశాచికానందం అని ఆక్రోశించాల్సిందేనా. వద్దు.. యిదంతా వద్దు. యీ ప్రపంచంలో మనం యిరువురం సమభాగాలం… మమ్మల్ని మీరు యెలా అర్థం చేసుకోవాలో చెవుతాం. జండర్‌ సెన్స్‌టివిటిని పెంచుకోండి…యిలా మనం చాలా సంవత్సరాలుగా ఫెమనిస్ట్‌ ఐడియాలజీ నుంచి అనేకానేక విషయాలని మాట్లాడుతూనే వున్నాం.

పితృస్వామిక వ్యవస్థ ఎప్పుడు మారుతుందో తెలియదు. అది మారే వరకు యీ విధ్వంసాన్ని యిలా భరించాల్సిందేనా. యీ మైండ్‌ సెట్‌ మార్చటం అనే ప్రోసెస్‌ వో పక్క జరుగుతూనే వుంది. అది వో నిరంతర ప్రక్రియ. అప్పటివరకు యీ మొత్తం యెప్పుడు మారుతుందోనని యెదురు చూడాల్సిందేనా. లేక మనం రోజువారి జీవితంలోని చిన్న చిన్న మార్పులని చేసుకోవాలి. చిన్నచిన్న వ్యవస్థలని మార్చుకోవాలి. యిలా యెందుకనిపిస్తుందంటే ఆ స్నేహితుడు మాట్లాడిన విషయాలలో వ్యవస్థలోని స్థబ్ధత వొకటి. ఆ విషయాలని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.

ఏదైనా ప్రమాదంలో వున్నప్పుడు పోలీస్‌లకి ఫోన్‌ చేస్తే ఆ కాల్‌ ఎక్కడికి వెళుతుంది. ఆ కాల్‌ తీసుకొన్నవాళ్ళు యేం చెయ్యాలి. వాళ్ళ బాధ్యత యేంటి. ఆ విషయాన్ని ఆ కాల్‌ తీసుకున్న వాళ్ళు ఎవరికి చెప్పాలి. ఆ కాల్‌ చేసిన వాళ్ళు యెవరి దగ్గరకు వెళ్ళాలి. అసలు యిదంతా యెంత సమయంలో జరగాలి. వొకవేళ వాళ్ళ నిర్లక్ష్యం వలన ప్రమాదంలో వున్న వాళ్ళకి అందవలసిన హెల్ప్‌ ఆలశ్యం అయితే ఎవరు దానికి బాధ్యులో సరిగ్గా గుర్తించే సిస్టమ్‌ వుండాలి. ప్రతి వాళ్లు యెదుటివాళ్ళ మీదకి నెపాన్ని తోసేటానికి వీలులేని సిస్టమ్‌ స్పష్టంగా వుండాలి.

అలానే అత్యాచారానికి గురైన వ్యక్తికి వైద్యం కోసం అంబులెన్స్‌కి ఫోన్‌ చేస్తే సకాలంలో అంబులెన్స్‌ వచ్చిందా? లేదా… ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పుడు ఎమర్జన్సీ వార్డ్‌లో పేషెంట్‌కి అందించాల్సిన వైద్యం సకాలంలో అందిందా లేదా…అందకపోతే ఎందుకు అందలేదు.. అందకపోవడానికి బాధ్యులు ఎవరు… యిలాంటి విషయాలని మనం మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ నుంచి సరిగ్గా డిజైన్‌ చేయవచవ్చని ఖచ్చితంగా వొత్తిడి తీసుకురావాలి. యిప్పటికే వున్న యిలాంటి సిస్టిమ్స్‌ లేదా యిప్పుడు మరింత పకడ్భందీగా అడుగుతోన్న సిస్టమ్స్‌ని సక్రమంగా అమలవటానికి ఆయా డిపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్నవాళ్లు సీరియస్‌గా అవసరమైన బాధ్యతని తీసుకోవాలి.

యిలాంటివే చిన్నచిన్న సిస్టిమ్స్‌ని యేర్పాటు చేసుకొంటే ఢిల్లీలో ఆ రోజు రాత్రి మన ఊహకు కూడా అందని సంఘటన జరిగినప్పుడు వో రెండు గంటల సమయం వాళ్ళ వాళ్ళ మాటలో వ్యర్ధం అయ్యేదే కాదు కదానిపిస్తుంది. అంతేకాకుండా భీతిల్లే, అత్యాచారానికి గురైన వొక యువతిని కళ్ల ముందు చూస్తూ కూడా అంత సమయాన్ని అలా యెలా వృధా చేయగలిగారో వింటుంటే అంత బాధ్యాతారహిత్యాన్ని వాళ్లు యింత ధైర్యంగా యెలా చాటుకున్నారో వింటుంటే యీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఎంత వదులుగా వుందోననిపించింది. దీనిని సరి చెయ్యాలిసిన అవసరం ఎంతైనా వుంది.

అలానే ఆ రాత్రి ఆ రోడ్డు మీద అటు ఇటు వెళుతున్న ప్రజలు అతను సహాయాన్ని అడుగుతుంటే కూడా స్పందించలేదని వింటుంటే అంతటి స్తబ్దత భయోద్వేగాన్ని కలిగించింది. అది దేశ రాజధానా ..కీకారణ్యమా అనే సందేహం వచ్చింది. వో చిన్న వూరులో కూడా స్పందన యింత దారుణంగా వుండదనిపించింది. నగరీకరణలో పబ్లిక్‌ స్పేసెస్‌ సంతరించుకొన్న జడత్వాన్ని మనం యే నెట్‌వర్క్‌ నుంచి మాట్లాడాలి. యీ స్పందించనితనం వేయిపడగలతో బుసలు కొడుతూనే వుంది. యీ విషయాన్ని మనం మాట్లాడాలి.

మనం యీ విషయాలన్నీ తిరిగి తిరిగి మాట్లాడుతుండాల్సిందే. లేకపోతే పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తున్న మన స్థితి వో మేడిపండు. ప్రశ్నించితేనే ఏం కావటం లేదు కదా మరి మనం రవ్వంత ఎమరుపాటుగా వుంటే అన్ని చోట్లా మృగయా వినోదం రహదారుల్లో నిర్భీతిగా సంచరిస్తుంది. మనం ఎక్కడా సేద తీరకూడదు. కాళ్లకింద భూమి కదిలితే యీ పబ్లిక్‌స్పేస్‌ ఎంత ప్రమాదకరమైనదో యింక మేం యీ పరిస్థితులని ఏ మాత్రం సహించలేమని వో సరికొత్త ధర్మావేశాన్ని మనం చూసాం. వారి వారి మనసుల్లో సుడులు తిరుగుతున్న అభద్రతా వలయాలని రూపుమాపి వో భద్రత నిండిన రహదారిని మనమంతా తిరిగి తిరిగి నిర్మించుకోవాలి. ఆ రహదారుల్లోకి బుసబుసలాడుతూ హింసావిషాగ్నిని మనపై కుమ్మరించడానికి సామూహికంగా సమాయత్తమవుతున్న వాళ్ళ మనసులని యింత విషపూరితం చేస్తున్న ఆ విద్వేషపు వ్యవస్థలపైనా మనం చూపు సారించాల్సిందే.. వీటన్నింటిని మనం తిరిగి తిరిగి మన రోజు వారి జీవితాల నుంచి చిన్న చిన్న విషయాల నుంచి వో సిస్టమిక్‌ ఛేంజ్‌ కోసం ప్రయత్నిస్తే మెల్ల మెల్లగా మార్పు రావొచ్చు.

ఆ స్నేహితుడు ఆ రోజు జరిగిన సంఘటనని యీ సమాజం ముందు వెల్లడించిన దాంట్లో పబ్లిక్‌ ప్లేస్‌స్‌లో సమాజంలో వ్యక్తులలో స్పందన, బాధ్యత లేకపోవడం వో ప్రధాన విషయం. యిది ఎవరికి వారు తమలోకి తాము చూసుకోవాల్సిన విషయం. ముందు యీ సమస్యని రోజువారి పనులలో ఎవరికి వారు ఎడ్రస్‌ చేసుకోవచ్చనుకొంటే యిక్కడ నుంచి మొదలుపెట్టొచ్చేమో…

Share
This entry was posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో