లంచ్‌టైం

వి. శాంతిప్రబోధ

”అబ్బ.. మస్తువత్తుగస్తున్నది. అప్పటికెల్లి ఆపుకొనుడు ఎంత కష్టమయితున్నదో.. సార్‌ చెప్పిన పాఠం ఒక్క ముక్క నెత్తికెక్కలే…” శారద చెవిలో గుసగుసగా చెప్పింది కళ్యాణి క్లాస్‌ రూంలోంచి బయటకు అడుగు వేస్తూ.

”త్వరగా రండక్కా” పొట్ట చేత పట్టుకున్న మాధవి 8వ తరగతిలోంచి బయటకు వచ్చి ఆ వెనకే శ్వేత శ్రీ, లత, అంజలి.

”రండి.. రండి” తొందరపెట్టింది కళ్యాణి.

”ఏరి వీళ్ళు..! గంగాలక్ష్మి, మేరీ వాళ్ళ బ్యాచ్‌..” అప్పర్‌ ప్రైమరీ క్లాసులకేసి చూస్తూ రేఖ ”అదిగో వాళ్ళూ వస్తున్నారు. మనం నడుస్తూందాం. వాళ్ళు వచ్చి మనలో కలుస్తరులే..” అంటూ ముందుకు కదిలింది కళ్యాణి.

ఆమెను అనుసరిస్తూ మిగతావాళ్ళు.. ఆ మధ్యాహ్నపు వేళ..

కమ్ముకొస్తున్న కారు చీకట్లు.. కుంభవృష్టి కురుస్తుందా అన్నట్లు..

మారు మూల ప్రాంతంలో ఉన్న హైస్కూలు అది. ఆరు నుండి పది తరగతులలో మొత్తం 286 మంది పిల్లలు ఉంటే అందులో 42 మంది మాత్రమే ఆడపిల్లలు. వారిలోను పదిహేడు మంది బయట ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళే. అంతా కలసి గుంపులుగా గుంపులుగా లంచ్‌టైంలో తమ జీవ అవసరాలు తీర్చుకోడానికి వెళ్తారు. రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న చెట్లపొదలే వారి మరుగుదొడ్లు. గతంలో ఒంటరిగా వెళ్ళిన ఓ అమ్మాయిని తుంటరి అల్లరి పెట్టాడు. ఒకళ్ళిద్దరు వెళ్ళడానికి సాహసించరు. అంతా కలిసే వెళ్తారు.

మధ్యాహ్న భోజనం బడిలోనే ఏర్పాటు చేయడం వారికో వెసులు బాటు. భోజనానికి పై మూడు తరగతుల ఆడపిల్లలూ ఓ చెట్టుకింద, కింద రెండు తరగతుల వాళ్ళూ మరో వేప చెట్టుకింద కూర్చొని కబుర్లు కలబోసుకుంటూ, మంచి చెడులు పంచుకుంటూ తినడం వారికల వాటు. సాధారణంగా సినిమాలు, బట్టలు, ఫ్యాషన్స్‌.. టీచర్స్‌ గురించి వాళ్ళ కబుర్లలో విన్పిస్తుం టాయి.

మూడో పీరియడ్‌లో మొదలయిన తలనొప్పి ఇంకా తగ్గకపోవడంతో కణతలు ఒత్తుకుంది కళ్యాణి.

”ఏమైందే.. పని అయిపోయింది కదా..! ఇంకా అట్ల ఉన్నావేం?” ప్లేటులో కూరవేస్తూ కళ్యాణి మొహం చూసి అడిగింది శారద. మాధవి, శారదల డ్యూటీ మధ్యాహ్న భోజనం వడ్డించడం.

”అన్నం తినాలనిపిస్తలేదు. తలనొప్పి” కళ్యాణి.

”తినాల్సిందే.. తిను.. లేకపోతే కళ్ళు తిరుగుతాయి” అధికారయుతంగా శారద.

”మనం ఒంటెల్‌కి పోకుండ ఆపుకుంటాం కద! అట్ల చేస్తే తలనొప్పి, కిడ్ని నొప్పి వస్తాయట. ఆపుకోవద్దని మా పిన్ని చెప్పింది. ఆమె నర్సు కద” ముద్ద నోట్లో పెట్టుకోబోతూ రేఖ.

”ఆపుకోకుంటే.. ఎట్ల!” కళ్యాణి

”యాడుంటే ఆడ్నే పోస్తే సరి…” కిసుక్కుమంది మేరీ.

అంతా పకపకా నవ్వారు.

పక్క చెట్టుకింద కూర్చున్న గంగాలక్ష్మి వాళ్ళ బ్యాచ్‌కి ఈ మాట వినపడిందేమో వాళ్ళు వీళ్ళ నవ్వులతో శృతి కలిపారు.

”ఈ పరేశానంత ఎందుకట.. అని నేను కొన్నే నీళ్లు తాగుత..” శ్వేతశ్రీ చెప్తూండగా మధ్యలో మేరీ అందుకొని ”ఏం క్లాసులో పోవాల్సి వస్తదనా..?” అంది కొంటెగా చూస్తూ.

”మంచి నీళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఎక్కువ సార్లు తాగాలనీ, మల మూత్రాలను ఆపుకోకూడదనీ మొన్న టి.వి.లో చెప్తుంటే విన్న” శారద అంది.

”నిజమే కావచ్చు. కానీ వాళ్ళు చెప్పినట్లు మనం నీళ్ళు తాగితే క్లాసులో కాదు ఉండేది. అదిగో అక్కడే..” పొదలకేసి చూపుతూ ప్లేటు తీసుకొని లేచింది మధుమిత కొంచెం కూర వేయించుకుందామని.

”మన బడిలో మరుగుదొడ్లు కట్టిస్తేగానీ తప్పవు మనకీ తిప్పలు” తినకుండా ప్లేటు పక్కన పెట్టేస్తూ కళ్యాణి.

”ఏయ్‌… ఏంటే.. తిను.. ముందు ప్లేటు తీసుకో.. ఊ.. కలుపు అన్నం” పెద్దరికంగా గద్దించింది శారద.

”నేను ఇంతకు ముందు చదివిన బడిలో మరుగుదొడ్డి ఉంది. అయినా మాకీ తిప్పలు తప్పలేదు” సంధ్య

”ఏం.. ఎందుకు?” కళ్యాణి, మాధవి ఒకేసారి

”దానికి నీటి సౌకర్యం లేదు. మురుగు కాల్వలేదు. రోడ్డుకు ఆవలివైపు ఉన్న బోర్‌నుండి బకేట్‌తో నీళ్ళు తెచ్చిపెట్టమనే వాళ్ళు మా టీచర్లు. కానీ మమ్మల్ని మాత్రం వాడనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళపని అయిపోయినాక దానికి తాళం వేసి తాళం చెవి తమ దగ్గరే పెట్టుకునేవారు” ఈ మధ్యే ఈ బడిలో చేరిన సంధ్య చెప్పింది.

”బడి బందుపెట్టిందిగద.. దేవెనక్క… ఆమెది మా పక్కిల్లే. పొద్దున ఏడున్నరకు ఇంట్లోకెల్లి వస్తే మల్ల ఇంటికి పోయేప్పటికి పొద్దుమీకి ఆరున్నర, ఏడు అయితది గద. అంతదాంక ఒంటేలకు పోయేడిదేగాదు. అట్లనే ఆపుకునేది..” వర్షం వస్తుందేమోనని ఆకాశం కేసి చూస్తూ చెప్తున్న అంజలిని చూస్తూ రేఖ.

”ఆ… అక్కకు జబ్బు చేసిందట గద” అన్నం పైకి వస్తున్న ఈగల్ని కొడుతూ శారద.

”అవునక్కా… కిడ్ని కరాబయిందట. మస్తు పైసలు ఖర్చయినయట. ఆడపిల్లకు ఇంత పెద్ద భీమారయితే ఎట్ల.. రేపు పెండ్లి ఎట్లయితదని ఇంట్ల ఫికరు పడ్తున్నరట. బడికి పోవద్దంటే పోయింది. ఇప్పుడు పైసకు పైస పాయె.. పానం మీదికొచ్చె అని ఆళ్ళ నాన్నమ్మ, అమ్మ అంటున్నరట.

పెండ్లయేదాక బడికి పోనీ. ఇంట్లో ఉండి ఏం జేస్తది.. అని సందు బెట్టినవ్‌.. ఇప్పుడు జూడు ఏమైందో నాని అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని తిడ్తాంది.

అది జూసి నన్ను బడి బందు జెయ్యమని మా ఇంట్ల పోరు మొదలయ్యె. ఆల్లకు అంతో ఇంతో ఉన్నది పైస పెట్టి పిల్లను దక్కించుకున్నరు. మనతో ఎట్లయితది అని నామీద వత్తిడి పెడ్తున్నరు గోడు వెళ్ళబోసుకుంది రేఖ.

”అయ్యో.. అట్లనా” సాలోచనగా కళ్యాణి. అందరి చూపుల్లోనూ అదే భావం.

”బడిలో మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడేది మనమే. ఆరోగ్యం పాడయ్యేది మనదే. మానసికంగా ఎంతో నలిగిపోయేది మనమే. చివరికి ఆ కారణంగా బడి మాన్పించేది మననే… బంగారు భవిష్యత్తు కోల్పోయేదీ మనమే.. అన్యాయంగా లేదూ…” ఆవేశంగా శారద.

”అవునక్కా.. నువ్వన్నది నిజం. ఆడపిల్లలు బడికి వెళ్ళి చదువుకునే వాతావరణం లేదనో, సౌకర్యాలు లేవనో మనని బడి మాన్పించే బదులు, బడి వాతావరణం మెరుగు పరచడానికి, సౌకర్యాలు ఏర్పరచడానికి మన పెద్దలు కృషి చేయొచ్చు కదా..ఊహు. అట్లా చేయరు.. ఎందుకు చేయరో..” ఆలోచనలు రేకెత్తిస్తూ ఛాయాదేవి.

మనం పిల్లలం కదా.. మనం వాళ్ళ ఆస్తి అనుకుంటరు. లేదా వస్తువులం అనుకుంటరు. వాళ్ళు జెప్పినట్లే వినాలంటరు. చేయాలి అనుకుంటరు. కానీ మన బడిలో సౌకర్యాల గురించి గొంతు విప్పేంత చొరవ, తెలివితేటలు, సమయం ఉన్నాయా.. మన పెద్దలకు? అన్న నాజియా మళ్ళీ తానే

”ప్రతిరోజు ఇంటో వాకిలి ఊడ్చి, గిన్నెలు తోమి, నీళ్ళు నింపి తినీ తినక నాలుగు కిలోమీటర్లు సైకిలు తొక్కుకుంట వస్తున్ననా.. ఎందుకు? చదువంటే ప్రీతి తోటి. నా బతుకు అమ్మ బతుకు లెక్క ఉండకూడదన్న ఆశతోటి. అది అర్థం చేసుకోరు మా నాన్న. అబ్బ… మా అమ్మ నన్ను చదివించుడు ఇష్టమే. కానీ ఆమె మాటకు మా ఇంట్లో విలువేలేదు. అంతా పూచికపుల్లను చూసినంత హీనంగ చూస్తరు. ఈ మధ్య నాకు తెల్వకుంట, కనీసం మాటన్న చెప్పకుంట నా పెళ్ళి కుదిర్చాడు మా అబ్బ. సీరియస్‌గా చెప్తున్న నాజియా మాటలకు బ్రేకు వేస్తూ..

”ఓ… మా నాజియా పెళ్ళికూతు రాయెనే…” వేళాకోళం చేయబోయింది మేరి.

”నవ్వులాటనా.. అది చెప్పేది విను” కసిరింది శారద.

అవతల చెట్టుకింద కూచున్న వాళ్ళు తినే ప్లేటు, వాటర్‌ బాటిల్స్‌తో వచ్చి వీళ్ళలో కలిశారు.

”నా పెళ్ళి.. అంటే నీకు మజాకు అయితాందా.. మేరీ…

ఎవర్తోటో తెలిస్తే మూర్చబోతాతవు” అంటూ అందరి మొహాల్లోకి చూసింది నాజియా. ఎవరా అన్నట్లు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తూ..

”ఇద్దరు పిల్లల తండ్రితో… అందాజ మా అబ్బ వయస్సు వాడితో… పైసలకు ఏ మాత్రం ఇబ్బంది లేని వాడితో.. బార్యతో గొడవపడి పుట్టింటికి పంపిన వాడితో – ఆమెతో పేచీపడి పిల్లలిద్దరినీ తనతో తెచ్చుకున్నవాడితో… దాదాపు నా వయసు ఉన్న అతని కొడుకుల్ని నేను తల్లిలా సాకాలట..!

మా అబ్బకి ఎదురు ఇరవై వేలిచ్చి నన్ను తనింటికి తీసుకుపోతాడట. అప్పుల్లో ఉన్న మా అబ్బకి వరం దొరికినట్టుంది. దానికి తోడు మా దాదీమా.. నా ప్రాణం మంచిగ లేదు నేను ఎప్పుడు పోతనో తెలియదు. నాజియా పెళ్ళి చేసెయ్‌ అని అబ్బమీద వత్తిడి చేస్తాంది. చేతికి పైసలు వస్తయి. డబ్బున్న బావతో సావాసం చెయ్యొచ్చని అన్న ఆశ. ఎవరూ నా గురించి ఆలోచిస్తలేరు. అడుగుతలేరు. ముహూర్తం పెట్టించేశారు. ఈ వారమయితే నేను బడి బందే.. ఏం చేయను..? తండ్రి లాంటి వాడితో పెండ్లికి ఎట్ల ఒప్పుకోను..?

అట్లని నాకీ పెండ్లి వద్దని ఇంట్లో ఎట్ల జెప్పను? సమజ్‌గాకొచ్చింది.

బాగా చదువుకోవాలి. సంపాదించు కోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలని నాకు కోరిక. అబ్బకు కష్టం కావద్దని బడి బందు ఉన్నప్పుడు పనికి పోతనే ఉన్న అయిన ఇప్పుడు ఉరుములు పిడుగులు మీద పడేట్లున్నయి. ఎట్ల.. ఎట్ల తప్పించుకోవాలె.. అని నాకు నేనే అనుకుంటున్న.. ఇప్పుడు మీతోటి చెప్పినంక ఇంచెం తేలికయింది.” గాలికి మీద పడ్డ ఆకుల్ని తొలగిస్తూ నాజియా

ఆశ్చర్యం.. ఆవేదన.. ఆందోళన.. అందరి మొహాల్లో ముప్పేటగా..

నోట్లో పెట్టుకోబోయిన ముద్దను అట్లాగే పట్టుకున్న కళ్యాణి అందరికంటే ముందు తేరుకుని ”ఏం చేద్దామనుకుంటున్నావు”

”అదే తెలియట్లే.. అందుకే మీతో చెప్పా. ఏమన్నా సలహా చెప్తారని” అందరి మొహాల్లోకి చూస్తూ నాజియా.

”బడి మానకు.. పెళ్ళి చేస్కోకు..” శారద సలహా.

”ఎట్ల.. ఊరుకుంటరా.. చదివింది చాలు అంటున్నరు అబ్బ.. అన్నా… నిన్ననే బడి బంద్‌ చేయమన్నారు.. నేను ఏడ్చిన.. పోనీ.. ఇంకా నాలుగు రోజులే ఉందా పోనీ.. బడికి పోనీ అన్నది దాదీమా..” భయంగా అంది నాజియా.

”మనమందరం వెళ్ళి పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు ఇద్దామా..” తీవ్రంగా ఆలోచించిన గంగలక్ష్మి.

”వామ్మో.. ఇంకేమన్నా ఉందా..? నన్ను బతకనిస్తరా…?” భయంతో కళ్ళు పెద్దవిచేసి గుండెలపై చేయి వేసుకొని నాజియా..

అంతా సీరియస్‌గా ఆలోచిస్తూ… ఉండగా

ఏమన్నా మిగల్చక పోతారా.. తన ఆకలి తీరక పోతుందా.. అని అంత దూరం నుండి ఆశగా ఎదురు చూస్తున్న నల్ల కుక్క.

”ఐడియా” అరిచింది శారద.

ఏంటన్నట్టు అంతా ఆమె వైపు చూశారు.

”ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ ప్రోగ్రాం ఉంది కదా…!

మనం ఫోన్‌ చేసి వివరాలన్నీ చెబుదాం.. మన పేర్లు బయటకు రావద్దని కోరదాం. కలెక్టర్‌ ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. నాజియా పెళ్ళి ఆగిపోతుంది. మనలాగే చక్కగా చదువుకుంటుంది” ఉత్సాహంగా అంది శారద. నాజియా మొహంలో వెలుగు రేఖ. అందర్లోనూ ఉత్సాహం.

”ఈ విషయం మనం జాగ్రత్తగా నడపాలి.” శారద.

”మరి కలెక్టర్‌ ఫోన్‌ నెంబర్‌ తెలియదు కదా” మాధవి సందేహంగా.

రోజూ పేపర్లో వస్తుంది కద.. అదేం కష్టం కాదులే తెల్సుకోవడం” శారద.

”విజయ బడికి రావట్లేదేంటి నాజియా” వాళ్ళిద్దరిదీ ఒకే ఊరు కావడంతో అడిగింది ఛాయ.

”అది పెద్దదయింది కద! బడి వద్దు ఏం వద్దు అంటున్నరు. ఇంటిపని; వంటపని నేర్వుమంటున్నరు కాలం మంచిగ లేదు. పెళ్ళి చేసెయ్యాల్నంటన్నరు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు. రోజు టి.విల్లో సిన్మాల్లో చూస్తలేమా.. ఆడపిల్లల్ని.. అని దాని నాన్నమ్మ అంటది.

తల్లి లేని పిల్ల కద కొడుక్కి జేస్కుంట నంటది ఆల్ల అత్తమ్మ.. దానికయితే బడికి రావాలనే ఉన్నది. ఇంట్ల ఏం చెప్పలేక సప్పుడు జెయ్యక పనిపాటలు చేస్కుంటాంది” వివరించింది నాజియా.

”బడిల సార్లు గూడ ఆడపిల్లల్ని వేరేగా జూస్తున్నరట. కొందరు సార్లయితే ప్రేమిస్తున్నామని అమ్మాయిలను మోసం జేస్తున్నారట.” జాగ్రత్తగా ఉండాలని మొన్న మా అక్క వాళ్ళు అనంగ విన్న” గుసగుసగా అంజలి.

”సినిమా హీరోలాగా ఉన్న సార్లను ప్రేమిస్తున్నామని ఆడపిల్లలు వెంటబడ్తున్నా రట కద!” ఆడపిల్లలదీ తప్పు ఉందన్నట్లుగా అంది గంగాలక్ష్మి.

”రోజులు మంచిగ లేవు అంటున్నారు కానీ, రోజులు కాదు మంచిగ లేనిది మనుషులు బుద్దులు. అవే మన బతుకుల్ని మసక బారుస్తున్నాయి” ఆవేశంగా అంది శారద.

ఆమె ఎందుకంత ఆవేశపడిందో అర్థం కాలేదు మిగతా వాళ్ళకి

”ఏయ్‌.. శారదా.. ఏమైంది మీకివాళ్ళ..” నవ్వుతూ కళ్యాణి.

”ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే శారదక్క. ఇవ్వాళ చాలా సీరియస్‌ అవుతాంది…” లత.

సీరియస్‌గా సాగుతోన్న వీళ్ల మాటలకు బ్రేక్‌ వేస్తూ వీళ్ళ మధ్య పడ్డ బాల్‌ కోసం పరిగెత్తుకొచ్చాడు ఆరవ తరగతి చదివే రవి.

”అక్క అట్ల మాట్లాడడంలో అర్థం ఉంది. పెద్ద వాళ్ళ ఆలోచనలకు, కట్టుబాట్లకు, ఆచారవ్యవహారాలకు ఆమె బతుకు చిల్లులు పడిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ చిల్లులు పూడ్చడానికి ప్రయత్నం చేస్తోంది” పెద్ద దానిలా చెప్పింది మాధవి.

”నువ్వేమంటున్నవో.. నాకేం అర్థం కాలే..” కళ్యాణి

అవునన్నట్లుగా అంది చూపులూ… మళ్ళీ మధ్యకి వచ్చిన బాల్‌ విసిరిన శారద.

”తమ్ముడూ బాల్‌ ఇటు రాకుండా ఆడుకో” అని చెప్పి, మిత్ర బృందం కేసి తిరిగి

”మాధవి చెప్పింది నిజం. నేను 8వ తరగతికి వచ్చానో లేదో.. పెళ్ళి… నాకన్నా 12 ఏళ్ళు పెద్దవాడయిన అక్క భర్తతో. అక్కకి పిల్లలు లేరు. వేరే పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాడు బావ. బయటి వాళ్ళయితే అక్క గతి ఏమవుతుందోననో, తమ బాధ్యత తీరిపోతుందనో గానీ మా బావతో నా పెళ్ళి జరిపించారు అమ్మ నాన్న. అక్క కూడా సంతోషించింది. నేనప్పటికి పెద్ద మనిషయి రెండు నెలలు కూడా కాలేదు. నాకు భార్యా భర్తల సంబంధం గురించే తెలియదు. బావతో సంసారం.. బాధ.. భయం.. ఎవరితో చెప్పుకోలేని నరకం. చివరికి సిగ్గు విడిచి అమ్మతో చెప్పా. చిన్న దానివి కదా.. అట్లాగే ఉంటుందిలే.. అలవాటయితే అంతా పోతుందిలే.. బుజ్జగింపు.. మూడో నెలకల్లా కడుపు రావడం.. మరో నెలలోపే రోడ్డు ప్రమాదంలో బావ మరణం.. నష్టజాతకు రాలినని బావను పొట్టన పెట్టుకున్నానని అత్తింటి వారు శాపనార్ధాలు పెట్టి గెంటివేయడం, తిరిగి పుట్టింటికి చేరడం.. ఆడపిల్లకు తల్లికావడం.. నాప్రమేయం లేకుండానే జరిగిపోయాయి.

ఉదయం బిందె తీసుకొని నల్ల దగ్గరకు పోతే.. తెల్లారంగనే దీని మొహం చూసావని ఈసడింపులు.. పూలు పెట్టుకుంటే.. ఎవడికి వలేయడానికో.. ఆడవాళ్ళ వెటకారపు మాటలు.. పోకిరీల వేధింపుల.. ద్వంద్వార్థపు మాటలూ… ఒకటేమిటి.. ఎన్నో.. ఎన్నెన్నో.. పద్నాలు గేళ్ళు నిండేసరికే వందేళ్ళ అనుభవాలు.

మొండి ధైర్యం, తెగింపు ఎక్కడి నుండి వచ్చాయో.. ఎట్లా వచ్చాయో.. ఓ రోజు గుడికి పోయి కుంకుమబొట్టు, దేవుడి దగ్గరి పూలు పెట్టుకున్నాను. పోశమ్మతల్లి దగ్గరి గాజులు వేసుకొని ఇంటికి వచ్చా. అమ్మ గగ్గోలు.. అక్క సమర్థన.. బడికి వెళ్తానన్నా.. అక్క సరేనంది. నా బిడ్డ బాధ్యత తను తీసుకుంటానదంది. నేను బడిలో జేరిపోయా..” తను పడ్డ వేదన.. ఆవేదన గొంతులో ధ్వనిస్తుండగా క్లుప్తంగా చెప్పింది శారద.

”నీ వెన్క ఇంత భయంకరమైన బాధ ఉన్నదా?” ఆవేదనతో కళ్యాణి.

”నువ్వు క్లాసులో చేరినప్పటినుండి చూస్తున్నా, ఎప్పుడు నవ్వుతూ… నవ్విస్తూ ఉంటావు… ఎవరికైనా చేతనయిన సాయం చేస్తావు… ఇంత చేదు గతాన్ని దిగమింగుకొని అట్ల ఎట్లా ఉండగలుగుతున్నవ్‌? శారదా… నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం… నీ గతం తెల్సి ఆవేదన… మళ్ళీ అంతలోనే… ఆనందం… ఎందుకో తెల్స…! నీవు మళ్ళీ బడికి వచ్చినందుకు. మన పెద్దోళ్ళ అమాయ కత్వాన్ని, మూర్ఖత్వాన్ని, ఆచారవ్యవహారాల్ని దాటివచ్చినందుకు” అభినందిస్తూ శారద చేయిపట్టుకొని నొక్కి వదిలింది కళ్యాణి.

ఇంకా అందరి మొహాల్లోనూ ఆశ్చర్యం.

”శారదక్క చెప్పింది విన్నంక నాకు ధైర్యం వస్తోంది” ఉత్సాహం నిండిన గొంతుతో నాజియా.

”మన బళ్ళలో సార్లు, టీచర్లు పాఠాలు చెప్పేనాకాదు. మనసొంటోళ్ళ సమస్యలు కూడ పట్టించుకోవాలి. మనోళ్ళకి అర్థమయేట్టు విషయాన్ని చెప్పాలి. మనకు అండగ నిలవాలె. అట్లయితే మనకు ధైర్యం వస్తది.” తనలో తాను అనుకొన్నట్లుగా కళ్యాణి.

”అవునే… నువ్వు అన్నది నిజం. మన సార్లు, టీచర్లు అట్లా చొరవ తీసుకుంటే, బాల్యవివాహాల్ని ఆపవచ్చు. ఆడపిల్లల చదువుకు ఆటంకం లేకుండా… ముందుకు వెళ్ళడానికి బాటలు వేయొచ్చు” వెంటనే స్పందించిన శారద.

”అంతేకాదక్కా… మన బడిలో చూడండి… అంత సార్లే. ఆడ టీచర్లు ఒక్కళ్ళు లేరు. మనం మగవాళ్ళ దగ్గరకన్న ఆడవాళ్ళ దగ్గరయితే కొంతవరకైనా మన విషయాలు, సమస్యలు చర్చించేవాళ్ళం కదా…” సాలోచనగా నాజియా.

”అసలు ఆడోళ్ళకేం రాదు. తెల్వి లేదు అనుకుంటరు. నీకేం తెల్వదు… నోర్మూసుకో… అని మన గొంతు… మన అమ్మల గొంతు బయటకు రానివ్వరు… మనకు తెలియకుంటే తెల్సుకునే అవకాశ మివ్వరు… మన ఇండ్లల్ల. అదే మన బడి హెడ్‌ ఆడవాళ్ళయితే అప్పుడు తెలుస్తది. ఆడవాళ్ళు కూడ బడి బాగ నడపగలరని. ఏ పనైనా… నేర్చుకుంటే వస్తదనీ… ఎవరైనా చేయగలరనీ…” అంది అప్పటివరకూ మౌనంగా వింటూన్న ఛాయాదేవి.

”ఇది నిజమే…” మాధవి, కళ్యాణి.

”నేను మా ఇంట్లో చాలా పనిచేస్త. ఎంత జేసినా… ఎంత సర్దుకుపోతున్నా నన్నే తిడ్తారు. మా అన్ననయితే ఏమనరు. వాడు తప్పుజేసిన ఏమనరు. అట్లాజేస్తే నాకు ఉక్రోషం వస్తుంది. కోపం వస్తుంది. ఒక్కోసారయితే నేను వీళ్ళ బిడ్డను కాదా అనే సందేహం వస్తుంది. మొన్న ఆదివారంనాడు బాగా కోపమొచ్చి అమ్మతో పోట్లాడా…” అన్నపై కోపం…కసి…గొంతులో ధ్వనింప జేస్తు చెప్పింది లత.

”ఎందుకో… అంతకోపం…” మధు మిత ఉడికిస్తున్నట్లుగా.

”కూరలో కొంచెం ఉప్పెక్కువ యిందట. పళ్ళెం నామీదికి గిరాటేసి ఇది తినేందుకేనా…? ఇట్లాగేనే వంట జేసిది? రేపు పెళ్ళయితే మొగుడికేం వండిపెడ తావ్‌…? అని నన్ను తిట్టి ఇంత పెద్దగయింది దీనికి సరిగ్గ వంట నేర్పద్దా… అంటూ అమ్మని తిట్టాడు అన్న. నాకు చాలా కోపమొచ్చింది.

మూడుపూటలా వండిపెడ్తే మంచిగ తిని, నాన్న జేబులోంచి పైసలు తీస్కోనో, అమ్మని బెదిరించో పైసలు తీసుకొని ఫ్రెండ్స్‌తో కలసి సినిమాలు, షికార్లు తిరుగుతవ్‌. నల్ల దగ్గరకుపోయి ఒక్క బకెట్‌ నీళ్ళన్న తేవుగానీ… అని కోపంతో అంటున్ననో లేదో…

ఏంటే నోరు బాగ లేస్తాంది. ఆడదానికి చదువుకుంటే కళ్ళు నెత్తిమీదుం టయ్‌. చదువొద్దు… ఏమొద్దు… అంటూ నా పుస్తకాలబాగ్‌ బయటకు విసిరాడు. పొరుగూరికిపోయి చదువట… చదువు… ఎవడో ఒకడిని తగులుకునే దంక… అంటూ అసహ్యంగా మాట్లాడుతునే ఉన్నాడు.

నువ్వు నాకు పెడ్తున్నవా… అని నేను అనబోతుంటే…

ముయ్‌… నోర్ముయ్‌… అంటు కొట్టబోయాడు. అమ్మ నన్ను పక్కకు లాగింది.

మొగోడ్తోని నీకు పోటీ ఏంది! నువ్వెప్పుడైన ఆడపిల్లవే… అన్న అని చూడకుండ మాట్లాడుడేనా…? ఇట్లయితే రేపు మొగుడి మాట ఏం వింటావ్‌… ఇట్లా ఎదురు మాట్లాడితే రేపు నిన్నెవడు చేస్కుంటడు అని అమ్మ క్లాసు పీకింది” తన గోడు వెళ్ళబోసుకుంది లత.

”మా ఇంట్లోను అంతే… తమ్మునికైతే ఏం పని చెప్పదు మా అమ్మ… నాకైతే పనంత చెప్తది. హోంవర్క్‌ చేద్దామని కూర్చుంటే చెప్పలేనన్నిసార్లు లేపుతుంది. హోంవర్కు చేయకుండా బడికి వెళ్తే సార్‌తో తిట్లు” తన బాధ చెప్పింది మాధవి.

”ఒట్టి తిట్టడమేనా?…? ఈకాడికి ఇంట్లో కూర్చొని అంట్లుతోముకోక చదువు చట్టుబండలెందుకో… అంటూ కించపరు స్తారు సార్లు” చెప్పింది శ్వేతశ్రీ.

”మొన్న పద్యం ఒప్పజెప్పమన్నడు తెలుగుసార్‌. నాకు చదవడానికి వీలు కాలేదు. చదవలేదు. మగపిల్లలు అప్పజెప్పక పోతే వాళ్ళని చింతబరిగెతో కొట్టాడు. కానీ నన్నేమనలేదు. దెబ్బలు తిన్న సంతోష్‌ లేచి ఆమె కూడ ఒప్పజెప్పలేదు కదా! మరి ఆమెనెందుకు కొట్టలేదని ఉక్రోషంతో అడిగాడు.

”ఆ… అది ఆడపిల్ల కదా… అది చదివినా చదవకపోయినా ఏముందిరా! రేపు పెళ్ళిచేస్కొని అత్తగారింటికి పోయేదే. మొగుడికింత ఉడకేసి పెట్టాల్సిందే కదా… వాళ్ళు అది సక్రమంగా నేర్చుకుంటే చాలు” అన్నాడు గారపట్టిన పళ్ళతో ఇకిలిస్తూ.

‘వీళ్ళకన్నీ కన్సెషన్‌” అన్నాడు రఘు మాకేసి తీవ్రంగా చూస్తూ.

అప్పుడు నాకు చాలా బాధ అన్పించింది. క్లాసులో పిల్లలందర్నీ సమానంగా చూడనందుకు వాళ్ళను దండించినట్లు నన్ను దండిస్తే బాధపడేదాన్ని కాదు. ఆడపిల్లకు చదువు అవసరం లేదని అనడమేకాకుండా క్లాసులో పిల్లలందరి లోనూ అదే భావన కల్గిస్తూ, సందేశం ఇచ్చినట్లుగా అన్పించింది” గాయపడ్డ మనసును సముదాయించు కుంటూ మాధవి.

”అమ్మతోనో… నాన్నతోనో, అన్న తోనో… అవ్వతోనో అయితే పోట్లాడు తున్నాం. మనను మనిషిగా గుర్తించాలని తాపత్రయపడుతున్నాం. కానీ చదువుకున్న వాళ్ళు, విద్య నేర్పే గురువులే ఇట్లా మాట్లాడితే మనమేమవ్వాలి!

”ఆడ, మగ పిల్లల మధ్య తేడా చూపిస్తూ దూరం పెంచుతుంటే ఎట్లా? మనలో ఆత్మవిశ్వాసం ఎట్లా పెరుగుతుంది? మన రాజ్యాంగం ఆడ, మగ సమానం అని చెప్తున్నా చెవికెక్కించుకోరెందుకో?” అంటున్న శారదని మధ్యలో ఆపి

”మనం క్లాస్‌మేట్స్‌ అనో, ఇరుగు పొరుగు అనో మగపిల్లలతో స్నేహంగా మాట్లాడినా, మగపిల్లలు మనతో స్నేహం చేసినా బడిలో సార్లు, టీచర్లు తప్పుడు అర్థాలు తీస్తున్నారు” సార్‌ తనకు క్లాస్‌ పీకిన విషయం గుర్తొచ్చిన సక్కుబాయి.

”కొత్తగా వచ్చిన మోహన్‌ సార్‌ మంచివాడు. మిగతా సార్లలాగా అపార్థాలు చేస్కోడు. మంచిగా మాట్లాడతాడు. పిల్లలతో స్నేహంగా ఉంటాడు కదూ…” అంది కళ్యాణి.

”నిజమే… అట్లాంటి సార్లు, టీచర్లు ఉండాలి మనకు” అంది ఛాయ.

”మనందరం రకరకాల వత్తిడులను, సమస్యలను ఎదుర్కొంటూ, భవిష్యత్తుపై గంపెడు ఆశతో ఉన్నాం. మనం మన పెద్దల్ని ఒప్పించుకొని హైస్కూలు దాకా వచ్చాం. సమాజం నుంచి వచ్చే సవాళ్ళని ఎదుర్కొంటున్నాం. భవిష్యత్తులో మనం ఒక్కళ్ళుగా కాకుండా అందరం కలసికట్టుగా ఉందాం. మన సమస్యలకు మనమే పరిష్కారాలూ వెతుక్కుందాం. ఏం చేయాలో రేపు లంచ్‌టైంలో ఆలోచిద్దాం. అవసరమైతే మోహన్‌ సార్‌ సలహాలు తీసుకుందాం” అంటూ ప్లేటు కడగడానికి లేచింది శారద.

గణగణ బడిగంట మోగింది.

అమ్మాయిలూ ఇంకా అవలేదా…! విజిల్‌ వేసి పిఇటి… అరుపు…

అప్పుడే లంచ్‌ టైం అయి పోయి ందా.అని బిలబిల క్లాసుకేసి పరు గెత్తారు… రెక్కలు విప్పుతున్న ఆలోచనలతో… దూది పింజల్లా విడిపోతున్న మబ్బుతునకలు ఆకాశంలో… సన్నగా వీచే చిరుగాలి వాళ్ళ ముచ్చట్లను దూరతీరాలకు మోసుకెళ్తూ…

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.