– రమాదేవి చేలూరు

19వ శతాబ్ధంలో భారతావని పరాయి సంకెళ్ళలో బంధీగా వున్నప్పుడు, ఆ వ్యవస్ధలో పురుషులే అస్ధవ్యస్ధమైన బానిసలుగా వుంటే, ఆ బానిసలకు బానిసలు స్త్రీలు.

అవిద్య, బాల్యవివాహాలు, బాల వితంతువులు, అక్కడక్కడ సతీసహగమనాలు, మూఢాచారాలు, ఎన్నో సాంఘిక కట్టుబాట్లు, అమాయకత్వంలో స్త్రీలు ఉక్కిరిబిక్కిరవుతున్న సందర్భంలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు చీకట్లో చిరుదెవ్వెలా, తన సాహితీ వ్యాసాంగాల ద్వారా స్త్రీల అభ్యున్నతికి పాటు పడ్డారని మనందరికీ తెలుసు. 1900 సం|| పూర్వం బండారు అచ్చమాంబ అనే విదుషీమణి వుండేదని, ఆమె కూడా స్త్రీ జనోద్ధరణకు మనసావాచ తన జీవితాన్ని ధారపోశారని మనకి తెలీదు.

కానీ ఈ మధ్య తొలి తెలుగు కథ ఎవరు రాశారనే విషయం మీద పరిశోధనలు , చర్చలు జరిగాయి. గురజాడ అప్పారావు (1910) రాసిన కధ కంటే 6 ఏళ్ళ ముందు, బండారు అచ్చమాంబ అనే స్త్రీమూర్తి తొలి తెలుగు కథ రాశారని, ఒకటీ రెండు కాదు ఏకంగా 12 కథల్ని రాశారని తెలుస్తోంది. 1905వ సంవత్సరానికే, ‘అబలా సచ్ఛిరిత్ర రత్నములు’ అనే గ్రంధం, కొన్ని వ్యాసాల్ని కూడా రాశారని తెలిసింది. ఈ మట్టిలో మాణిక్యాన్ని తవ్వి వెలికి తీసిన ఘనత కె.లలిత, సూసీతారులకు దక్కుతుంది. ‘వుమెన్‌ రైటింగ్స్‌ ఇన్‌ ఇండియా’ అనే వీరి పరిశోధనా గ్రంధంద్వారా మనకు అచ్చమాంబ పరిచయమైంది. కానీ సవివరాలతో యావదాంధ్ర దేశానికీ ఆమె కధ బహిర్గతం కాలేదు.

భండారు అచ్చమాంబ రాసిన కథల్ని సంగిశెట్టి శ్రీనివాస్‌ సంకలనం చేసి, ఆమె సాహితీ జీవితాన్ని పార్శ్వంగా మనకు ఆవిష్కరించి చూపారు. కానీ, చరిత్రకెక్కక, చీకటి వలయంలో చిక్కుకున్న అచ్చమాంబ సాహితీ విశ్వరూపాన్ని, సంస్కరణ హృదయాన్ని, వైదుష్యాన్ని, సన్మాన సత్కారాల్ని, రచనా కౌశలాన్ని, అన్వేషించి, ఆస్వాదించి, భుజాలకెత్తుకొని, సాహితీ లోకం ముంగిట దించి, సాహితీ ధృవతార తళుకుల్ని ఆద్యంతమూ మనకు పరిచయం యేసిన ఘనత మాత్రం కొండవీటి సత్యవతిదే.

”భండారు అచ్చమాంబ సచ్ఛరిత్ర” ను సర్వజనులకు విదితంగా, సరళంగా రాసి, ఆమె పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని, జీవనాన్ని మనకు ఆవిష్కరించిచూపారు. భండారు అచ్చమాంబ కృష్ణాజిల్లాలోని నందిగామ గ్రామంలో 1874 లో జన్మించింది. ఆమె తండ్రి గారి ఊరు పెనుగంచిప్రోలు. తండ్రి కొమర్రాజు వెంకటప్పయ్య, తల్లి గంగమాంబ, తమ్ముడు కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు.”భండారు అచ్చమాంబ సచ్ఛరిత్ర” ను సర్వజనులకు విదితంగా, సరళంగా రాసి, ఆమె పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని, జీవనాన్ని మనకు ఆవిష్కరించిచూపారు. భండారు అచ్చమాంబ కృష్ణాజిల్లాలోని నందిగామ గ్రామంలో 1874 లో జన్మించింది. ఆమె తండ్రి గారి ఊరు పెనుగంచిప్రోలు. తండ్రి కొమర్రాజు వెంకటప్పయ్య, తల్లి గంగమాంబ, తమ్ముడు కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు.

ఆమెకు ఆరుసంవత్సరాల వయసప్పుడు తండ్రి మరణించారు. ఇక మునగాలలో బతికే వీలు లేక పిల్లలిద్దర్ని తీసుకొని గంగమాంబ సవతి అన్న భండారు మాధవరావు దగ్గరకెళ్ళింది. ఆయన నైజాం రాజ్యంలో, దేవరకొండ అనే గ్రామంలో ఉద్యోగంలో వుండేవారు. అప్పటికే ఆయనకి వివాహమై భార్య చనిపోయింది. ఒక కూతురుండేది. పేరు మీనాక్షి. బాల్యం తిరకముందే, గంగమ్మ తన పదేళ్ళ కూతురు అచ్చమాంబకి, మాధవరావుతో వివాహం జరిపించి, తన చేతులు దులుపుకుంది.

వివాహానంతరం అందరూ నాగపూర్‌కి పయనమయ్యారు. మాధవరావుకి అక్కడ ఉద్యోగం. భర్త, సవతి కూతురు, సంసారం, బరువు బాధ్యతల్ని బాలికైన అచ్చమాంబ మోయాల్సి వచ్చింది.

స్వయంగా అచ్చమాంబే ఆనాటి సాంఘిక దురాచారాలకి బలైంది. గంగమ్మ కూతురిచే అక్షరాభ్యాసం చేయించక, బాల్య వివాహం చేసింది. స్త్రీవిద్యకి, స్వేచ్ఛకి వ్యతిరేకియైన చాంధసుడైన భర్తతో వివాహం జరిగింది. ఆయనతో సంసార జీవితానికి ప్రతిఫలంగా చిన్నారి అచ్చమాంబకే ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది. ఆ తర్వాత తన పిల్లలిద్దరూ చనిపోవటం చేత, ఆమె మనశ్శరీరాలు పరిపక్వం చెందకనే కల్గిన ఆటు పోట్లకు బాలికైన అచ్చమాబ భరించడం సాంఘిక దురాచారాల దుష్ఫలితం.

అచ్చమాంబ జీవనం ఆనాటి కోట్లాది బాలికల ప్రతిబింబం. వాళ్ళ బతుకంతా అంతే. ఆమె మిగతా స్త్రీలలా, వింత మృగంలా ఆవ్యవస్థలో వినయంగా, అమాయకంగా ఒదిగా పోయుంటే మనకీనాడు ఆమె గూర్చి తెలుసుకొని, మురిసిపోయుండే వాళ్ళంగాదు. ‘ఫీనిక్స్‌పక్షి’ ని కాల్చి చంపి బూడిద చేస్తే ఆ బూడిదలోంచి తిరిగి జీవం పోసుకొని, నవచైతన్యంతో విజృంభిస్తూ బతుకుతుందని అమెరికన్ల మూఢనమ్మకం. ఈ మూఢ విశ్వాసం చూట్టూ ఎన్నో లోకోక్తులున్నాయక్కడ. అంటే ఎంతటి వ్యతిరేక పరిస్ధితులెదురైనా కానీ, అభివృద్ధి పథం వైపు తీక్షణంగా దూసుకు పోవాలనే తపనతోనుండాలని అర్ధం.

అచ్చంగా అచ్చమాంబ విషయంలో అదే జరిగింది. భర్త మాధవ రావు స్త్రీ విద్యకి వ్యతిరేకి. సంఘానుకూలంగా, స్త్రీ నాల్గు గోడల మధ్య, పిల్లల్తో, సంసారంలో మునిగి తేలాలనేది ఆయన ఉవాచ. వద్దన్నా, విద్యంటే జిజ్ఞాస ఆమెకి. భర్తని నోప్పించక, తానొవ్వక సమయస్ఫూర్తితో విద్యాగంధాన్ని ఆస్వాదించి, పలువురికి పంచి చూపించింది.

అచ్చమాంబ తల్లి, తమ్ముడు ఆమెతో పాటు నాగపూర్‌లో వుండేవాళ్ళు. తమ్ముడి విధ్యాభ్యాసం కోసం గురువు ఇంటికొచ్చి చెప్పేవాడు. తమ్ముడు, గురువు పాఠాలు చెప్పుకుంటుంటే, వారికి సముఖంగా కాక, పరోక్షంగా చేరి ఎడంగా కూర్చొని అక్షరాభ్యాసం చేసిందామె. తమ్మునికి అక్కంటే ఇష్టం. ఆమె విద్యనభ్యసించటంలో తోడ్పడ్డాడు. ‘పోయినచోటే వెతుక్కోమన్నట్లు’ గా రాయటం, నేర్చుకొని, తెలుగు, మరాఠి, హిందీ, సంస్కృతం, గుజరాతీ భాషల్ని నేర్చుకుంది. అందుకు తమ్ముడెంతో తోడ్పడ్డాడు. ఇది అత్యంత క్లిష్టమైన పని. భర్త క్యాంపుల కెళ్ళినపుడు తమ్ముడి తెచ్చిచ్చిన పుస్తకాల్ని చదవేసేది. వేదవేదాంతాల్ని చదివిన దాఖలా మనకు కనబడుతుంది.

సంఘసంస్కర్తగాః- పదేళ్ళ వయసులో అక్షరాలు దిద్దినామె, ఇరవై ఐదేళ్ళకే సాహితీ బృందావనంలో సంస్కరణ విత్తులు జల్లి అంధకారమైన తెలుగు నాట అందమైన పూతోటను పెంచాలని వివిధ సాహితీ ప్రక్రియా కుసుమాల్ని పూయించాలని తొణికిసలాడే నవ చైతన్యంతో, నిరంతర విద్యార్ధిగా ఆమె ప్రదర్శించిన ఉత్సుకత ఎంతో ఘనమైనది.

ఒక గ్రంధం, 12 కధలు, వ్యాసాలు, ఉపన్యాసాలు రాసి, హిందూసుందరి, తెలుగు జహానా, సావిత్రి మొదలగు పత్రికలకు పంపేది. ఆమె కలానికి విశ్రాంతి లేదాయనిపించేట్టుగా రాసేసింది.అవన్నీ స్త్రీవిద్యపట్ల నిబద్ధతతో రాసినవే. ఆమె ధ్యానం, ధ్యాస, ఊపిరి, ప్రతి అడుగు స్త్రీవిద్యవైపే వేసేది. స్త్రీలు చదువుకుంటే కుటుంబం, పరిసరాలు, దేశం అభివృద్ధిలోకొస్తాయని కథల్లో, వ్యాసాల్లో రాసింది. ఎక్కడికెళ్ళినా నల్గుర్నికలిసి, స్త్రీవిద్యమీద కబుర్లు, ఉపన్యాసాలు కలబోసేది. చదువుకున్న స్త్రీలు, తమకు తెలిసిన విద్యనే, ఇరుగు పొరుగు వారిని కలిపి బోధించమని పదేపదే సలహాలిచ్చేది. బాల్యవివాహాలు బాలికల పాలిట మరణ శాసనాలని బాల్యవివాహాల్ని తల్లులే ఆపాలని బోధించేది. ప్రాత వివాహాలు వేదానుకూలమని, బాల్యవివాహాలు వేదాల వ్యతిరేకమని సోదాహరణంగా చూపించారు. వితంతువులు పునర్వివాహం చేసుకోవాలని, స్త్రీలు తిరిగి పచ్చగా జీవితాన్ని పునర్నిర్మించుకోవాలని, స్వార్ధపు పురుషాహంకారపు భావాల్ని మత మౌఢ్యాలని వదిలించుకొని, పరాశర స్మృతిలో చెప్పినట్లుగా మెలగాలని బోధించారు. బందరులో బృందావన సమాజంను, కాకినాడలో ‘విద్యార్ధినీ సమాజము’ స్థాపించి, తన సంఘసంస్కరణ భావాల్ని వ్యాపింప చేశారు.

మానవత్వపు సొబగులుః-

తన భర్త మొదటి భార్య కూతురు మీనాక్షికి, తాను తల్లి కానిలోటు తీర్చింది. ఆమెతో గాఢమైన అనుబంధాన్నేర్పరచుకుంది. ఆమెకి కష్టమొస్తే అచ్చమాంబ తీవ్రంగా దుఃఖించింది.

ఒకనాడు ఒక స్త్రీ తన ఇద్దరి పిల్లల్తో కలసి, అడుక్కోవడానికి ఇంటి ముందుకొస్తే, అడుక్కోవటం నీచమైన పనని, ఒక ఆవుని కొనిచ్చి దాని ద్వారా జీవికను కొనసాగించమని ‘శ్రమైక జీవన సౌందర్యాన్ని’ తెలియజేసింది.

తనింట్లో నల్గురైదుగురు అనాధల్ని పెంచి పెద్దచేసింది.

మధ్య పరగణాలలో కరువు తాండవించి నప్పుడు, తన ఇంట్లో రొట్టెల్ని, పప్పుని చేయించి, వారికి సరఫరా చేసింది. ఇలా నిరంతర సేవా గుణంతో నడయాడేది. దేశంలో ప్లేగువ్చాధి ప్రబలంగా వున్న కాలంలో, భర్తతో కలసి క్యాంపుకెళ్ళింది. అక్కడ తన నివాసానికి పక్క గుడారంలో ఒక స్త్రీ కేకలినిపించి అక్కడికెళ్ళింది. ఆ స్త్రీ ప్రసవవేదన చూసి, మడిదడి పక్కన పెట్టి ఆస్త్రీకి ప్రసవసమయంలో తన స్వహస్తాలతో ప్రసవం సుగమం చేసింది. కలంతో సాహితీ సుధాదారలతోనే కాదు, స్వహస్తాలతో కూడా సేవ చేసి తరించింది.

ప్రసవించిన స్త్రీకి ప్లేగు వ్యాధి సోకి ఆమె మరణించింది. క్యాంపునుంచి వచ్చిన కొద్దికాలానికే అచ్చమాంబకి తీవ్ర జ్వరం వచ్చింది. అప్పటికే బాలింత ద్వార అచ్చమాంబకి ప్లేగు సోకిన విషయం ఆమెకి తెలీదు. జనవరి, 18న అచ్చమాంబ స్వర్గస్థులైనారు(1905).

ముగింపుః-

విద్యాభూషితులు, శౌర్యం, సాహసంగల స్త్రీల చరిత్రలను విస్తృతంగా వివిధ భాషల్లోనుంచి తీసి చదివి, ‘అబలా సచ్ఛిరిత్ర రత్నమాల’గా కూర్చాలని, 3 భాగాలుగా రాయ సంకల్పించింది. ముఫ్పైనాల్గుమంది స్త్రీల చరిత్రలు చదివి రాసింది. ఇంకా రాయాల్సివుంది. 1905 నాటికే 12 కధల్ని రాశారుకదా! మరి ఇటువంటి విదుషీమణిని చరిత్రలో మరుగు పరచడానికి గల కారణాల్ని మనం చర్చించాల్సి వుంది. ఆమె ఆశయ సాధనకోసం మనం పాటు పడాల్సివుంది. ఇప్పటికైనా విస్తృతంగా ఆమె చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సివుంది.

యూరప్‌దేశాల్లోను, అమెరికాలోనే ఇటువంటి సాహితీవేత్త సంఘసంస్కర్త వుండుంటే, ఇలా చరిత్రకెక్కక, మరుగుపడి పోయుండేది? ప్రతి పాఠశాలలోను ఆమె (ఆ కధారచయిత్రి) జయంతిని, వర్ధంతిని పురస్కరించుకొని, ‘స్టోరీటెల్లింగ్‌’ ప్రోగ్రాంలు చేయించి, ఏటేటా వివిధ కథ రచయితల్ని పిలిపించి, వాళ్ళచేత కథల్ని చెప్పించి, పిల్లల చేత కథల్ని, వ్యాసాల్ని రాయించి, ఎంతో ఘనంగా ఆమెకి నివాళులర్పించేవాళ్ళు మనకున్నారు. భండారు అచ్చమాంబని ఏగతిలో స్థితిలో వుచామో ఆలోచించి, మనం సిగ్గుపడాలి.

తెలుగు యూనివర్సిటీలో ఎం.ఏ.లో భండారు అచ్చమాంబ పాఠ్యాంశంగానైన చేరింది. అందుకు సంతోషించాలి. ఆవుల మంజులత గార్కి, ఎండ్లూరి సుధాకర్‌ గార్కి ధన్యవాదాలర్పించాలి. ఆమె రాసిన గ్రంధరచన ద్వారా స్త్రీలు అబలలు, మూర్ఖులు, వివేకహీనులు కాదని, సమాజం, పురుషులే వారిని అలా తయారు చేశారని, దానికి కారణం స్వార్ధమేనని అచ్చమాంబ అంటారు. ఆమె చరిత్ర బయటికి రాకపోవడానికి ఇలాంటి స్వార్ధమే కారణమనిపిస్తుంది. ఆప్తులైన పురుషులచే నిర్భంధింపబడు స్త్రీలు రక్షితురాండ్రుకారు, ఏ స్త్రీలు తమ యాత్మను తామే కాపాడు కొందురో వారే సురక్షితురాండ్రు” అనే ఆర్ధం వచ్చేలా సంస్కృత శ్లోకంతో తన గ్రంధాన్ని ప్రారంభించారు అచ్చమాంబ. వందసంవత్సరాల తర్వాత కూడా ఈ శ్లోకంతో మన జీవితాల్ని మనం పునఃప్రారంభించు కోవాల్సివుంది. భండారు అచ్చమాంబని సంధర్భోచితంగా మనం సంస్మరించుకుందాం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.