సాంఘిక దురాచారానికి వ్యతిరేకం – రమాదేవి

అనంతపురం జిల్లా చిప్పలమడుగు అనే గ్రామానికి చెందిన ఈమె పేరు రమాదేవి. పదిహేనేళ్ళ వయసులో బాల్య వివాహం, అటుపై వరకట్నం వేధింపులు భరించలేక పుట్టింటికి తిరిగి వచ్చేసింది. తండ్రికి భారం కాకూడదని ఇసుక బట్టీలో కూలి చేసేది. సరిగ్గా అదే సమయంలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ భూతం కంటపడింది. ఆ ఊరికే చెందిన రమణ, నాగమ్మ అనే వ్యక్తులు రమాదేవితో పాటు మరో యువతిని మహారాష్ట్రలోని ఒక వ్యభిచార గృహానికి అమ్మేశారు. భివండికి సమీపంలో ఒక నరకకూపంలో బంధించి ఆమెను చిత్రహింసలకు గురిచేసి వేశ్యవృత్తిలోకి దింపారు. తమ శరీరంపై సంపాదన హక్కులు కోల్పోయి బానిసలుగా గడుపుతున్న తనలాంటి తోటి స్త్రీలందరిని కూడగట్టుకుని అక్కడ్నించి పారిపోయే ప్రయత్నాలెన్నో చేసింది. కానీ కరడుగట్టిన ఆ వ్యవస్థనుంచి తప్పించుకోలేక పోయింది. అయినా పట్టు వదలకుండా తోటివారికి ధైర్యాన్ని నూరిపోసింది. రమాదేవి అక్కడే కొనసాగితే తమ వ్యాపారానికి ముప్పు కలుగుతుందేమోనని నిర్వాహకులు తరిమేశారు. ఊరు కాని ఊరు, భాష రాదు. అయోమయ స్థితిలో ఉన్న రమాదేవిని ఒక తెలుగు వ్యక్తి సహకరించి ఇంటికి పంపించారు. ఊరికి తిరిగొచ్చిన ఆమెకు తన తల్లితండ్రులు కూతురు పరిస్థితి మరింత చితికిపోయి కనిపించింది. జరిగిందేదో జరిగిందని ఊరుకోకుండా రమాదేవి వారినెలాగైనా పోలీసులకు అప్పగించాలని తీర్మానించింది. అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న రెడ్స్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పోలీసుల్ని ఆశ్రయించింది. కానీ పోలీసుల నిర్లక్ష్య వైఖరితో కేసులు నమోదు చేయలేదు. తనని అమ్మిన వ్యక్తులు కళ్లెదుట స్వేచ్ఛగా తిరుగుతూఉంటే వీరి వల్ల మరెందరో అమాయకులు బలైపోతారని అలుపెరగని పోరాటం ప్రారంభించింది. హైదరాబాద్‌లోని పోలీస్‌ ఉన్నతాధికారుల్ని, రెడ్స్‌ సంస్థ ద్వారా, మీడియా ద్వారా కలిసి తనని అమ్మేసిన వారిపై కేసులు బుక్‌ చేయగలిగింది. పోలీస్‌ శాఖ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌కి సహకరించి భివండిలోని స్వగృహం నుంచి తోటి స్త్రీలకు విముక్తి కలిగించింది. కానీ ఈ నాటికీ స్థానికంగా ఈమెను అమ్మేసిన బ్రోకర్లు మాత్రం కళ్లెదుటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్లకి శిక్ష పడనంత వరకు మరెందరో అమాయకులు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కి బలై పోతూనే ఉంటారు. అందుకే రమాదేవి తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కి బలై అదే ట్రాఫికింగ్‌పై సాహసంతో సమరం సాగిస్తున్న రమాదేవి ‘సాంఘిక దురాచారానికి వ్యతిరేకం’ విభాగంలో నవీన మహిళ అవార్డ్‌కు ఎంపికైంది.

హక్కులకోసం పోరాటం – నాగమణి

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన ఈమె పేరు నాగమణి. నిరుపేద రైతు కూలీల బిడ్డగా జన్మించిన ఈమె చదువుల ప్రస్థానం కొనసాగించింది. ఈ ఊరిలో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి మహిళ ఆమె. ప్రస్తుతం అడ్డతీగలలో వ్యవసాయాధికారిగా బాధ్యతలు స్వీకరించిన నాగమణికి ఉద్యోగవిధులు నిర్వహించే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. రైతు సమస్యల్ని అర్థం చేసుకుంటూ వ్యవసాయ అధికారిగా వారి అభివృద్ధే ముఖ్యమని భావించే నాగమణి రైతులకు చెందాల్సిన సంక్షేమ పథకాలు గట్టిగా అమలు పర్చేది. రైతులకు సరైన ధరలలో ఎరువులు అందుబాటులో ఉంచేది. ఎరువుల బ్లాక్‌ మార్కెటీర్లపై కఠిన చర్యలు తీసుకొనేది. ఇది మింగుడుపడని ఎరువుల డీలర్లు రాజకీయంగా ఒత్తిడి తెచ్చి ఆమెను ట్రాన్స్‌ఫర్‌ చేసే ప్రయత్నం చేశారు. భయపడేది లేదని నాగమణి ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. ట్రిబ్యునల్‌ నుంచి ఆ ఉత్తర్వులు చెల్లవని తీర్పు పొందింది. నిజాయితీగా పనిచేసే ఆమెపై ఓ ఎరువుల డీలర్‌ అక్రమ కేసుపెట్టి వేధించడం మొదలుపెట్టాడు. ఫలితంగా ఆమెను ట్రాన్స్‌ఫర్‌ చేయించలేని వారు సస్పెండ్‌ చేయించగలిగారు. దీనిపై న్యాయపోరాటం ప్రారంభించింది నాగమణి. ఈ సస్పెన్షన్‌ అకారణమని, అక్రమమని తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకొమ్మని ఎ.పి.ఎ.టి. తీర్పునిచ్చింది. అయినా ఆమెను 14 నెలలు విధుల్లోకి తీసుకోకుండా విచారణ పేరుతో రాజకీయ నాయకులు, పై అధికారులు వేధించారు. ఎన్ని ట్రాన్స్‌ఫర్‌లు, సస్పెన్షన్‌ వంటి వేధింపులు ఎదురైనా నిర్భయంగా రాజకీయ చదరంగంలో ఒంటరి పోరాటం చేస్తున్న దళిత మహిళ నాగమణి. ఈ ట్రాన్స్‌ఫర్‌లు, తప్పుడు కేసులతో విసిగిపోయిన నాగమణి చివరకి నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ షెడ్యూల్‌ కాస్ట్‌ని ఆశ్రయించింది. అక్కడకూడా విజయం ఆమెవైపే ఎదురైంది. కానీ ఈ ఉత్తర్వుల్ని న్యాయశాఖ అమలు చేయలేదు సరికదా ఇప్పటివరకు ఆమెకు రావాల్సిన అలవెన్స్‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. తన హక్కుల కోసం నిర్భయంగా పోరాటం చేస్తున్న దళిత మహిళ నాగమణి నవీన మహిళ అవార్డుల్లో ‘హక్కుల కోసం పోరాటం’ విభాగంలో నవీన మహిళ అవార్డ్‌ని అందుకోబోతున్నారు.

యువ విజేత – జ్యోత్స్న

కళ్ళల్లో అమాయకత్వం తొణికిసలాడుతున్న ఈ పదేళ్ళ చిన్నారి పేరు జ్యోత్స్న. తన చిట్టి చేతుల్తో విల్లు ఎక్కుపెట్టి బాణం గురిపెట్టిందంటే అవే కళ్ళు తీక్షణంగా మారిపోతాయి. పదేళ్ళ ఈ పాప ఔరా అనిపించేలా ఆర్చరీలో జాతీయ స్థాయిలో దూసుకెళ్ళి పోతోంది. విజయవాడలో ఐదవ తరగతి చదువుతున్న జ్యోత్స్న జీవితం వడ్డించిన విస్తరి కాదు. పసితనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఈ చిట్టితల్లిని గుర్తించిన ప్రముఖ ఆర్చర్‌ స్వర్గీయ చెరుకూరి లెనిన్‌ ఆమెను దత్తత తీసుకుని చెరుకూరి వోల్గా ఆర్జెరీ అకాడమిలో ట్రైనింగ్‌ ఇచ్చారు. జ్యోత్స్నలో ప్రతిభను చిన్నప్పుడే గుర్తించిన లెనిన్‌, ఆమె పతకాలు చూడకుండానే దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా, పట్టువదలని జ్యోత్స్న తన గురువు, అన్న లెనిన్‌ కల నెరవేర్చాలనే లక్ష్యంతో మరింత కఠోర సాధన ప్రారంభించింది. ఏదీఖిలిజీ 13 ళీరిదీరి దీబిశిరిళిదీబిజి బీనీబిళీచీరిళిదీరీనీరిచీ లో 2009లో మొదటి ర్యాంక్‌ సాధించింది. ఎప్పటికైనా ఒలింపిక్‌లో పతకం గెలవాలన్న ఆశతో ముందడుగు వేస్తున్న ఈ చిన్నారి ఆలనా పాలనా చెరుకూరి వోల్గా లెనిన్‌ ఫౌండేషన్‌ చూసుకుంటోంది. చిన్న పోటీల్లో పెద్ద నిర్ణయాలతో దూసుకుపోతున్న జ్యోత్స్న ఎన్‌.ఎం.సి. 2012లో యువ విజేతగా అవార్డ్‌ అందుకోబోతుంది.

స్వచ్ఛంద సంస్థ – సమత దండు

వంగపూత రంగు చీరలు కట్టుకున్న వీరంతా ఏ ఉద్యోగం కోసమో ఈ యూనిఫామ్‌ ధరించలేదు. మహిళలకు బాసటగా నిలిచే సమత దండుగా ఏర్పడ్డ వీళ్ళు ఈ చీరలు ధరించి కదిలారంటే ఎక్కడో స్త్రీ సమస్యలో ఉన్నట్టు అని అర్థం. వరంగల్‌ జిల్లా నెల్లికుదురు మండలంలోకి అడుగుపెడితే ఈ సైన్యం మనకి కనిపిస్తుంది. ఏపి మహిళా సమతా సొసైటీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సమతదండులోని ప్రతి మహిళ గ్రామీణ మహిళా సాధికారతకి ప్రతీక. వరంగల్‌ జిల్లా నెల్లికుదురుమండలంలో అడుగుపెడితే సమస్యలపై సమైక్యంగా పోరాటం చేస్తున్న దండు మనకి కనిపిస్తుంది. స్త్రీల సమస్యలు, ఆడపిల్లల అంశంపై పనిచేస్తూ, అవగాహన కల్పిస్తూ చురుగ్గా తిరిగే ఈ బృందంలోని గ్రామీణ మహిళలందరూ నిరుపేద మహిళలే. వరంగల్‌ జిల్లా నెల్లికుదురు మండలంలోని పది గ్రామాల్లోని నలభైమంది మహిళలు సమత దండుగా ఏర్పడ్డారు. మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగినా అండగా నిలుస్తారు ఈ సభ్యులు. మహిళలు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించటం కోసం న్యాయ కమిటీల్ని ఏర్పాటు చేసుకున్న వీరు గృహహింస, బాల్య వివాహం, వరకట్న వేధింపులు, స్త్రీల ఆస్థి హక్కు వంటి కేసుల్లో సహకారం అందిస్తున్నారు. వీరి బృందానికి పోలీస్‌ శాఖతో పాటు ఎమ్మార్వో, ఎంపిడివో, ఎంఇవో, ప్రభుత్వ అధికారులు సైతం సహాయ సహకారాలు అందిస్తున్నారు. సమైక్యంగా ఉంటూ స్త్రీల రక్షణకి కదిలిన సమైక్య సమతదండు నవీన మహిళా కాంటెస్ట్‌ 2012లో ‘స్వచ్ఛందసంస్థ’ల విభాగంలో నవీన మహిళా అవార్డుని అందుకో బోతున్నారు.

స్ఫూర్తి ప్రదాత – మాణిక్యమ్మ

గుంటూరు జిల్లా తెనాలి మండలం కోపల్లె గ్రామానికి చెందిన ఈమె పేరు మాణిక్యమ్మ. పెద్ద చదువులు చదవని గ్రామీణ మహిళలకు రాజకీయాలు, గ్రామ సంక్షేమం ఏం తెలుస్తుందని ప్రశ్నించేవారికి ఈ మాణిక్యమ్మ సరైన జవాబు. ఈ మట్టిలో మాణిక్యం ఐదేళ్ళ క్రితం వరకు ఓ సామాన్య నిరుపేద మహిళే. కాని ఇప్పుడామెను కదిలించి చూడండి. ఆమె ఓ చైతన్య స్రవంతి. తమ ఊరికి సర్పంచ్‌గా ఎన్నికైన నాటినుంచి ఆమె దృష్టంతా అభివృద్ధిపైనే నిలిపింది. చదువు రాదన్న వాళ్ళని స్త్రీలకు రాజకీయాలెందుకు అని ఎద్దేవా చేసే వాళ్ళని ఆశ్చర్యపడేలా చేసింది. తమ ఊరికి రోడ్లు వేయించింది, లైట్లు వెలిగించింది. ఊళ్ళో అందరికీ పక్కా ఇళ్ళు అందేలా చేసింది. పదవిలోకి రాగానే ముందు సారా బెల్ట్‌ షాపులపై కొరడా ఝుళిపించింది. సారా లేకుండా చేయడంతో ఊరిలో ప్రశాంతత నెలకొంది. బెల్ట్‌షాపులు తిరిగి తెరిపించడానికి ఎంతమంది రాజకీయ ఒత్తిళ్లు తెచ్చినా ఆమె లొంగలేదు. ఐదేళ్ళ ఆమె పదవీకాలంలో ఎన్నో ట్రైనింగ్‌లకెళ్ళింది. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంది. స్త్రీల సంక్షేమం, పెన్షన్స్‌, గ్రూప్‌లు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చింది. ఊరిలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండేలా పథకం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆమె ఊరు ఆదర్శగ్రామంగా ఎంపికైంది. రాష్ట్రపతి పురస్కారంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయల గ్రాంట్‌ను కూడా అందుకుంది. ఇదంతా మాణిక్యమ్మ నాయకత్వ ప్రతిభే అని చెప్పాలి. పదవీకాలం పూర్తయినా చురుగ్గా అభివృద్ధి పనుల్లో పాలుపంచుకునే మాణిక్యమ్మ ఇప్పటికీ ఓ సాధారణ ఇంట్లో నివసించే సామాన్య మహిళలా కనిపిస్తుంది. సామాన్య మహిళల్లో సైతం మట్టిలో మాణిక్యాలు ఉంటారని నిరూపించిన మాణిక్యమ్మ ‘స్ఫూర్తి ప్రదాత’ విభాగంలో అవార్డును అందుకోబోతోంది.

సాహసం – తిరుపతమ్మ

హైదరాబాద్‌లో బోరబండలో నివాసం ఉంటున్న ఈమె పేరు తిరుపతమ్మ. మట్టితో కుండలు గల్లాగురుగులు చేసుకునే ఓ సాధారణ కుమ్మరి ఈ తిరుపతమ్మ అసాధారణ పోరాటం చేస్తోంది. తిరుపతమ్మ కూతురిపై దుండగులు అత్యాచారం చేశారు. అడ్డువచ్చిన ఆమె కొడుకుని తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకి ఆమె కూతురు మరణించింది. ఇప్పటి ఢిల్లీ సంఘటనలా తిరుపతమ్మ కూతురు ఘటన ప్రజాగ్రహాన్ని చవిచూడలేదు. తిరుపతమ్మకు ఎవరూ సహాయం అందించలేదు. కానీ తిరుపతమ్మ నిశ్శబ్దంగా ఉండిపోలేదు. బలైన తన కూతురి కోసం పోరాటం ప్రారంభించింది. ఎందరో కుటుంబ పరువు మర్యాద అంటూ అడ్డు తగిలినా పట్టు వదల్లేదు. కూతురికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదని దుండగులందరిపై కేసులు నమోదు చేసింది. కేసు కోర్టు వరకు వచ్చి తీర్పు వెలువడేంత వరకు స్థెయిర్యం కోల్పోలేదు. నిందుతులందరికీ శిక్ష పడేలా చేసింది. ప్రస్తుతం ఆ దుండగులందరూ జైల్లో ఉన్నారు. తన కూతురిపై అత్యాచారం చేసిన నిందితులకు శిక్ష పడేంతవరకు అలుపెరగని పోరాటం చేసిన ఈ సాహస వనిత నవీన మహిళా కాంటెస్ట్‌ 2012లో ‘సాహసం విభాగం’లో అవార్డ్‌ అందుకోబోతోంది.

 

Share
This entry was posted in అవార్దులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.