….

కవిని

సమయం ఉదయం 5 గంటలు కావస్తోంది. అలారం మోగుతోంది. గాఢ నిద్రలో ఉన్న శాంతి ఉలిక్కిపడి లేచింది. మోగుతున్న అలారాన్ని ఆపింది. పక్కమీంచి కదలకుండానే సుందరం నిద్రలోనే ”అబ్బబ్బ – అలారం పెడ్తారు. నేను లేచి ఆపాలే తప్ప ఒక్కళ్ళు కూడా లేవరు….” అంటూ తిట్ల దండకం మొదలు పెట్టాడు. శాంతమంచం మీంచి దిగి హాల్లో లైటు వెలుగుతుంటే హాల్లోకి వెళ్ళింది. 10వ తరగతి చదువుతున్న శాంత కూతురు ఉష హాఫెర్లీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతోంది. ”ఇది ఎప్పుడు నిద్రలేచిందో? ఏమో? ఎగ్జామ్స్‌ కదా చదువుకుంటుంది” అని మనసులోనే అనుకుంటూ ”ఉషా… ఎప్పుడు లేచావే? పాలు తాగుతావా?” అని అడిగింది శాంత.

చదువుతున్న పుస్తకంలోంచి తల పక్కకు తిప్పకుండానే ”సరే… నీఇష్టం… ఇవ్వమ్మా” అన్నది ఉష. పాలు వేడిచేసి ఉషకు ఇచ్చి వంటపనిలో పడిపోయింది శాంత.

ఫోను అదేపనిగా మోగుతోంది. అప్పటికి రెండుసార్లు మోగి ఆగిపోయింది. ఫోను రిసీవ్‌ చేసుకుందామని శాంత అనుకున్నది. కానీ సాహసించలేకపోయింది. సుందరం ఆర్డరు అలాంటిదాయె ! ఫోన్లు సుందరం, పిల్లలు తప్ప శాంత తీయకూడదు మరి! మూడవసారి ఫోను మోగుతుండేసరికి ఇక తప్పదనుకుని ఫోను తీశాడు సుందరం.

”హలో…”

”ఆ సుందరం… నేను సత్యాన్ని ఈ రోజు కలుస్తానన్నావు కదోయ్‌.” సత్యం గొంతు వినగానే నాలుక కరుచుకుని ”ఆఁ సత్యం నేను ఆల్‌రెడీ బయలుదేరుతున్నాను. ఆమె టీ ఇస్తానంటే ఆగాను. నేను అంతకీ చెప్తూనే ఉన్నాను. సత్యం రమ్మన్నాడు. లేటయితే ఆఫీసుకు వెళ్తాడు అని. కానీ వింటే కదా ! హోం డిపార్ట్‌మెంట్‌ ఆజ్ఞ. కాదనగలమా! అందుకే లేటయ్యింది. అయినా 15 నిముషాలలో వచ్చేస్తాను.”

సుందరం మాటల చమత్కారి. భలే సరదా మనిషి. అయినా జీవితంలో ఎన్నెన్నో సరదాలు. ఇప్పటి కాలంతో అయితే ఇలాంటి సరదాలకు కొదవే లేదు. శాంత కూడా తక్కువేం కాదు. భలే సరదా మనిషి. సుందరంతో సహజీవనం శాంతకు చాలా చాలా సరదాలకు అలవాటు పడేటట్టు చేసింది. సరదాసరదాలో భాగంగా సుందరం ఎవరి దగ్గరైనా తను తప్పించుకోవలసి వచ్చినప్పుడు సాధ్యమయినంతవరకు నెపం శాంత మీద వేసేస్తుంటాడు. సుందరం అవసరాలకు తగినట్టుగా శాంత వ్యక్తిత్వం తమాషాగా మారిపోతూ ఉంటుంది.

ఒక్కోసారి డామినేట్‌ చేసే భార్యలాగా, మరొకసారి భర్తకు భయపడే భార్యలాగా ఇంకొకసారి డబ్బుకోసం, నగలకోసం భర్తను వేధించే భార్యలాగా, మొగుడ్ని, పిల్లల్ని అస్సలు పట్టించుకోని భార్యలాగా.. ఇలా ఇలా ఎన్నెన్నో సరదాలు. సుందరం తన స్నేహితులతో, పరిచయస్థులతో శాంతకు పెద్దగా పరిచయాన్ని పెరగనీయడు కాబట్టి ఏ రకమైన వ్యక్తిత్వం చూపితే ఎదుటివాళ్ళు అదే ఆమె వ్యక్తిత్వమని పొరబడే అవకాశముంది. శాంతకు ఇలాంటి సరదాలన్నీ షరా మామూలే…

మొహం డుక్కుంటూ ‘చాయ్‌… చాయ్‌’ అని అరిచాడు సుందరం. అప్పటికే పెట్టి ఉంచిన టీని స్టౌమీద వేడిచేసి సుందరానికిస్తూ ”నేను పొద్దున 5గం||లకు లేవగానే చాయ్‌ పెట్టాను. ఇంతకు ముందే నేను తాగేశాను.” అన్నది శాంత. ”మొగుడు టీ తాగితేనే పెళ్ళాం తాగాలి. మొగుడికంటే ముందు పెళ్ళాం తాగుతుందా?” మొహం చిన్నబుచ్చుకున్న శాంతను చూస్తూ ”నేను ఊరికే అన్నవన్నీ నిజంగా తీసుకుంటావేంటి?” అని అన్నాడు.

ఏం మాట్లాడాలో అర్థంకాక నిలబడిపోయింది శాంత. ఏ మాత్రం స్పందించినా సీరియస్‌ అయిపోయి ఘాటైన మాటల్ని అవలీలగా అనేయనుగలడు, సరదాకి అన్నానని సమర్థించుకోనూ గలడు. నిజంగా అన్నాడనుకుంటే సరదాకి అన్నా అంటాడు. సరదాకి అంటున్నాడనుకుంటే నిజంగా అన్నానంటాడు. ఏది నిజమో? ఏది సరదానో? అనేది శాంతకు ఎప్పటికీ సందిగ్ధమే… అన్నింటికీ మౌనంగా ఉండటాన్ని అలవాటు చేసుకుంది శాంత. వంటగదిలోకి వెళ్తున్న శాంత వెనకాలే ఉషకూడా వెళ్తూ…

”అమ్మా.. ట్రిగ్నామెట్రీలో ఈ లెక్క కొంచెం చెప్పవా” అన్నది.

”ఒక్క నిముషం.. పప్పును మాడకుండా కలియపెట్టినీరూములోకే నే వస్తా…” అంది శాంత. అప్పుడే అక్కడకు వచ్చిన సుందరం.. ”ఈ లెక్క చేయకపోతే నష్టమేమీ రాదులే” అన్నాడు.

”ఈ చాప్టరు నుండి తప్పనిసరిగా ఇస్తారు నాన్నా…” అన్నది ఉష.

”సర్లే… నువ్వు 10వ తరగతి తప్పినా ఈ దేశానికి కానీ, మాకు కానీ ఏ నష్టమూ రాదు. నువ్వసలు 10వ తరగతి పరీక్ష రాయకపోయినా నష్టం లేదు.” అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు.

”నాన్న చూడు ఎలా అంటున్నాడో? నేనింక ఈ ఎగ్జామ్‌ రాయను? నేను నిజంగానే తప్పుతా…అదే ఆయనకు ఇష్టం కదా!” కళ్ళల్లో నీళ్ళుతిరుగుతుండగా అన్నది ఉష.

”ఆయన అలాగే తమాషా చేస్తారు. మీ నాన్న గురించి నీకు తెలియదా! పట్టించుకోకుండా చదువుకోవటమే.. కళ్ళుతుడుచుకో పరీక్ష బాగా రాయాలి… సరేనా…” తల ఊపుతూ కళ్ళుతుడిచుకుంటూ వెళ్ళింది ఉష.

ఇంటర్‌ చదువుతున్న శాంత కొడుకు రవి వంటగదిలోకొచ్చి ”అమ్మా మా ఫ్రెండ్సంతా కంప్యూటర్‌ కోర్సుల్లో జాయిన్‌ అవుతున్నారు… ఏ కోర్సు నేర్చుకుంటే మంచిది.”

”డిగ్రీలో నీకు ఉపయోగంగా ఉండే కోర్సులో జాయిన్‌ అయితే బాగుంటుంది.”

”అదే… నువ్వే చెప్పమ్మా…” అన్నాడు రవి.

స్నానం చేసి హాల్లో బూట్లు వేసుకుంటున్న సుందరం ”వంటింట్లో వంటలు చేసుకునే వాళ్ళు నీకేం చెప్తార్రా? నో.. పోయి.. మీ ఫ్రెండ్సునడుగు. వాళ్ళు ఎందులో చేరితే నువ్వు అందులో చేరు… పోరా.. పో వంటింటి రాజకీయం. వంటింటి రాజకీయం..” అంటూ సత్యం దగ్గరకెళ్ళి స్కూలుకు వెళ్లానని చెప్పి.. ఇదిగో ఆ కంప్యూటర్లో రెడిఫ్‌మెయిల్‌లో పాస్‌వార్డు మార్చేయాలి… అదేందో ఎంత చేసినా నాకు అర్థమయిచావదు.. నీ పనైనాక అది కొంచెం చూడు…” అంటూ వెళ్ళిపోయాడు సుందరం.

సుందరం వెళ్ళేదాకా మౌనంగా ఉన్న రవి ”ఏం మాట్లాడతాడమ్మా డాడీ… మేము నిన్ను అడక్కూడదా? నీకు కంప్యూటర్‌ రాదనుకుంటే మరి ఆయన కంప్యూటర్‌ పనులు నీతో ఎందుకు చేయిస్తున్నాడు.” సుందరం సరదాల్ని కొడుకు అర్థంచేసుకోలేక పోతున్నందుకు నొచ్చుకుంటూ… ”ఇట్లా అన్నీ పట్టించుకుంటే ఎట్లారా? టైమవుతోంది టిఫిను తిని బయల్దేరు..”

రవి, ఉషా తయారయి వెళ్ళిపోయారు.

పిల్లల్ని పంపించాక ముందు గది తలుపులు పెట్టేసింది శాంత. నెమ్మదిగా బీరువా దగ్గరకు వెళ్ళింది. బీరువాలో తన చీరల మాటున దాచుకున్న పెద్ద నోట్సును తీసింది. ఆ నోట్సు చేతిలోకి తీసుకుంటూ చెప్పలేని ఆనందంతో గుండెకు హత్తుకుంది. ఆ నోట్సులోనే తన కథలను భావాలను రాసుకుంటూ ఉంటుంది శాంత. ఒక కథ రాయటమంతా అయిపోయింది కానీ ముగింపు మాత్రమే మిగిలిపోయింది. ముగింపు రాయటానికి ఒక్క చిన్న అవకాశం కోసం చూస్తోంది శాంత. అంతా రహస్యంగానే పూర్తి చేయాలి. తన కిష్టమైన సాహిత్యం, సాహిత్యాన్ని మంచి నీళ్ళలాగా తాగేయాలన్న తృష్ణ. కానీ జీవితపు తమాషా సరదాలలో ఆ తృష్ణ ఎండమావిగానే మిగిలిపోయింది. శాంత సాహిత్యాభిలాషకు ఎలా అడ్డుకట్ట వేయాలో సుందరానికి బాగా తెలుసు. తను రాసిన ఆ కథకు ముగింపు సజీవంగా యదార్థంగా ఉండాలని శాంత తపన. సహజంగా ఉదయంపూట టీ తాగంగానే ఉద్రిక్తంగా సాహిత్య భావనలు వస్తూంటాయి. ఆ భావనలను కాగితం మీద పెట్టటానికి అప్పుడు అవకాశమే ఉండదు. వంటపనికి ఇంటి పనికి ఆ సమయాన్ని అంకితం చేయాల్సిందే. ఆ తర్వాత ఎప్పటికో భావనను బలవంతంగా తెచ్చుకుని కాగితం మీద పెట్టాలి. అదీ అవకాశం దొరికితేనే… లేకపోతే కొన్ని రోజులపాటు బలవంతంగా భావనలను చింపేసి ఎప్పుడో కుదిరినప్పుడు భావనను తెచ్చుకోవటానికి నానా తంటాలు పడాలి. అంతగా ప్రయత్నిస్తేనే కాగితం మీద మరలా పెట్టగలిగేది. కొంత ప్రయత్న చేశాక కలం భావనకు అనుకూలంగా దానంతటదే సాగిపోతూ ఉంటుంది. కొంత రాశాక మరలా ఏదో ఒకరకంగా పక్కకు పెట్టాల్సిందే.. తన చిన్నతనంలో తాను రాస్తేనే చాలు ఇంటిల్లిపాదికి చదివి వినిపించేది. ఇంట్లో అమ్మా, నాన్న, అక్కలు, అన్న అందరూ వినేవాళ్ళు. తోచిన సలహాలు ఇచ్చేవాళ్ళు. జీవితంలో ఎంతటి మార్పు… నక్కకు నాగలోకానికి ఉన్నంతగా…” నిట్టూర్చింది శాంత.

ఆలోచనగా ఉడుకుతున్న అన్నం కింద మంట తగ్గించి కథను చదవటం మొదలు పెట్టింది. ఆ కథలోని స్త్రీ పాత్ర జీవితాన్ని నవవసంతంలా ఊహించింది. వెన్నెల పంటలా, సన్నని చిరుగాలిలా జీవితం సాగిపోతుందని కలలు కంటుంది. తను వివాహం చేసుకోబోతున్న వ్యక్తిని చంద్రునిలా, మల్లెల గులాబీల సువాసనల భరితం అతని మనసు అని భ్రమ పడింది. వాస్తవ విరుద్ధమయిన ఈ ఊహలు పటాపంచలయిపోతుంటే యదార్థ జీవితంలో తన పట్ల అతనికున్న నీచపు అభిప్రాయాలకు, వ్యతిరేకతకు అతనిలోని స్వార్థానికి మానసికంగా కృంగిపోయింది. కల్పనకూ, యదార్థానికీ మధ్య ఉన్న అంతరాన్ని చూపటమే ఈ కథ ఉద్దేశ్యం.

బెల్‌ మోగుతోంది. శాంతలో ఒకటే టెన్షన్‌, దడ. ఎవరు వచ్చారో? ఏమో? ఒకవేళ సుందరం వచ్చాడేమో? ఈ నోట్సును ఎక్కడ దాయాలి. ఏమీ తోచడంలేదు. గబగబా ముందు గదిలోకి వచ్చి మరలా పరుగెత్తుకుంటూ వంట గదిలోకి వెళ్ళింది. రెండవసారి బెల్‌ మోగింది. టెన్షన్‌, టెన్షన్‌ అయ్యి కందిపప్పు డబ్బా వెనుక పుస్తకాన్ని పెట్టింది. గబగబా ముందు గదిలోకి వెళ్ళి తలుపు తీసింది.

ఎదురుగుండా గ్యాసతను.

”అమ్మా…. గ్యాస్‌” అన్నాడు.

ఖాళీ సిలిండరు ఇచ్చేసి కొత్తది తీసుకుని స్లిప్‌మీద సంతకం చేశాక కానీ మనసుకుదుట పడలేదు శాంతకి. తలుపు పెట్టేసి వంట గదిలోకి వచ్చింది. అన్నం ఉడికింది. స్టౌ కింద కట్టేసి కందిపప్పుడబ్బా వెనుక ఉన్న నోట్సును చేతిలోకి తీసుకుని బెడ్‌రూమ్‌లోకి వచ్చింది. ఆ కథకు ముగింపు నాలుగు వాక్యాలే కానీ అవి పాత్ర మానసిక స్థితిని ప్రతిబింబించేవిగా ఉండాలి. ఈ కథకు ఆ నాలుగు వాక్యాలే మూలం.

మళ్ళీ కాలింగ్‌బెల్‌ మోగుతోంది. టైము 10గం||లే అయ్యింది. ఎవరై ఉంటారు? పిల్లలయితే ఇప్పుడే రారు. బహుశా సుందరం… నోట్సు ఎక్కడ పెట్టాలి? గబగబా లేచి సెల్ఫులో ఉన్న రోజువారీ బట్టల కింద పెట్టింది. సుందరం రాగానే లుంగీకోసం ఈ బట్టలు తీస్తే? ఈ నోట్సు కనపడుతుందేమో? ఇక్కడ లాభంలేదు. కాలింగ్‌బెల్‌ ఆగకుండా మోగుతూనే ఉంది. ఆగకుండా కాలింగ్‌బెల్‌ మోగుతుంది అంటే ఖచ్చితంగా సుందరమే! ”ఇప్పుడు ఏం చేయాలి?” గబగబా పరుపుకింద నోట్సును పెట్టి వెళ్ళి తలుపుతీసింది ఎదురుగుండా ఉష..

”అప్పుడే వచ్చావేం… ఉషా? పరీక్షజరగలేదా?” టెన్షన్‌ నుంచి బయటపడ్తూ అడిగింది శాంత.

”ఈరోజు పరీక్ష క్యాన్సెల్‌ అయ్యింది. మమ్మల్ని పంపించేశారు.” ఇంటిలోపలకు వస్తూ…

”సరే కానీ అమ్మా.. ఎంత బెల్‌ కొట్టినా తలుపు తీయటం లేదు ఎందుకని.” అడిగింది ఉష.

తలుపు బోల్టు పెడ్తూ ”ఒక కథ మొత్తం రాశాను. ముగింపు రాయాలి. మీ నాన్న వస్తాడేమోనని…” అన్నది శాంత.

”సరే… నవ్వు రాసుకోమ్మా” అన్నది ఉష. శాంత పరుపుకింద దాచిపెట్టిన నోట్సును బయటకు తీసింది. తొందరలో తాను రాస్తున్న పేజీకి గుర్తు పెట్టుకోలేదు. నెమ్మదిగా పేజీలు తిరగేసింది. పెన్ను ఎక్కడ పెట్టుకుంది. ఆఁ కంప్యూటర్‌ దగ్గర పెట్టింది. గుర్తుకు రాగానే హాల్లోకెళ్ళి పెన్నుతెచ్చుకుని మంచం మీద రెండు కాళ్ళను బాసిపట్టావేసుకున్నట్టుగా కూర్చుని ”ఉషా… ఎవరైనావస్తే కొంచం చూడవే..” అంటూ కథను మరొకసారి చదవటంలో నిమగ్నమైపోయింది శాంత.

ఉషా ఫ్రెష్‌ అయి హాల్లో టి.వి. చూస్తూ కూర్చుంది. కొంతసేపటికి మళ్ళీ బెల్లు మోగింది. ఉష లేచి తలుపు తీద్దామనుకునేలోపే… ”అయ్యో.. ఉషా… ఉండే ఉండు.. మీ నాన్నేమో? ముందీపుస్తకాన్ని దాయనీ…” గందరగోళం అయిపోయింది శాంత. ”ఈ నోట్సు ఎక్కడ దాచాలో అర్థం కావటం లేదు.”

”ఇందాక ఎక్కడ దాచావు…” అడిగింది ఉష.

”ఇందాక… ఆ పరుపుకింద” అన్నది శాంత.

”అక్కడ లాభం లేదు నాన్న ఒకోసారి రావటంతోటే సరాసరి బెడ్‌రూములోకి వచ్చేస్తాడు…” గట్టిగా అరిచినట్టుగా అన్నది ఉష.

”మరెక్కడ దాయను…? హడావుడిగా పుస్తకంతో సహా పిల్లల రూములోకి పరుగెత్తి అక్కడి నుండి వంట గదిలోకి మళ్ళీ హాల్లోకి పరుగెత్తి… ”సరే బెల్‌ కొట్టి చాలాసేపు అవుతోంది. నేను ఎక్కడో ఒకచోట దాస్తాలే కానీ నువ్వయితే తలుపుతీ…” ఆదుర్దాగా అన్నది శాంత.

పనిమనిషి లక్ష్మమ్మ. లక్ష్మమ్మను చూస్తూనే ”ఏం లక్ష్మమ్మా! సాయంత్రం వచ్చేదానివి ఈ రోజు తొందరగా వచ్చావు?..”

”పిల్లోడికి బాలేదమ్మా. జ్వరమొచ్చింది. సందెకాడ హాస్పిటలుకి తీస్కుపోవాలె..” అన్నది లక్ష్మమ్మ.

గిన్నెల్ని ఖాళీచేసి అంట్లు వేసే పనిలో పడిపోయింది శాంత. హాల్లో సోఫామీద కూర్చొని టి.వి. చూస్తున్న ఉష… ”అమ్మా.. ఇట్రా.” అని పిలిచింది శాంతను.

”ఆఁ..వస్తున్నానుండు..” అంటూ హాల్లోకి వచ్చింది శాంత.. ”ఏంటి ఉషా” అన్నది.

”అమ్మా… ఈ సోఫా దిండు కింద…”

”నేను ఇందాక నోట్సు పెట్టాను..” దిండుకింద నుంచి నోట్సును తీస్తూ అన్నది శాంత.

”అమ్మా… నోట్సును తెచ్చి సోఫాకింద దాచావు.. ఎవరికైనా చూడంగానే సోఫాకింద ఏదో ఉందని అర్థమవుతుంది. ఇక్కడా అమ్మ దాచేది?” ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అన్నది ఉష.

”ఏం చెయ్యను… హడావుడి… మీ నాన్న కంటపడకుండా ఎక్కడో ఒకచోట దాచాలి కదా..”

”ఎక్కడో ఒకచోట అని కరక్టుగా కనపడే చోటే దాస్తావా అమ్మా.. కనీసం నువ్వు రాసింది దాచుకోవటం కూడా తెలియదు. ఇంత అమాయకం ఏంటమ్మా..?” శాంత అమాయకత్వానికి ఆశ్చర్యపడ్తూ శాంతనే చూస్తూ అన్నది ఉష.

”అమాయకం కాబట్టేగా… మీ నాన్న నన్ను చేసుకున్నాడు…”’ అంటూ సోఫాకింద నుంచి నోట్సు తీసుకుని బీరువా తెరిచి తన చీరల కింద పెట్టింది శాంత.

”బీరువాలో నాన్న బట్టలూ ఉన్నాయి, నీవి ఉన్నాయి. బీరువా తెరవమని నాన్న అన్నప్పుడల్లా నువ్వు టెన్షను పడ్తూంటావు. ఇంకో ప్లేసులో దాచుకోవచ్చు కదమ్మా” అన్నిది ఉష.

”సరే… నాకయితే తోయటం లేదు. నువ్వే ఆలోచించి చెప్పు. ఎవరికీ కనపడకుండా ఎక్కడ దాయాలో…” అన్నది శాంతి.

ఉషా బెడ్‌రూమ్‌లోకి వస్తూ ”అమ్మా నేనొకటి అడుగుతాను… నిజం చెప్తావా…”

”నిజం చెప్పడం ఏమిటే కొత్తగా… అడుగు” ఉష అడగబోయే ప్రశ్నను ఊహిస్తూ అన్నది శాంత.

”నాన్న మందునుంచీ ఇలాగే ఉన్నాడా?”

”ఏమో… నేనే అర్థం చేసుకోలేక పోయానేమో!” నోట్సు బీరువాలో దాస్తూ అన్నది శాంత.

”నాకయితే అర్థమయ్యింది… నాన్నయితే నీ అమాయకత్వాన్ని చూసి తనకు అనుకూలంగా మార్చుకోవచ్చని అనుకున్నాడు…”

”అదికాదే… మీ నాన్నకు కొన్ని విషయాలు నచ్చవు తెలుసా!”

”ఏ విషయాలు… నీ అభివృద్ధికి సంబంధించినవా.”

”నాకొకటి గుర్తుకొస్తోంది… ఒకసారి ఏమయ్యిందంటే…” చెప్పడం ఆపింది శాంత.

”ఏమయ్యింది… చెప్పు… చెప్పు…” ఆత్రంగా అడిగింది ఉష.

”మీ నాన్న హెడ్‌మాస్టరు కదా! మొన్నీ మధ్య ఒకసారి టీచర్లు మహిళా దినోత్సవం నాడు మీటింగ్‌ పెట్టుకున్నారట. ముఖ్య అతిథి మీ నాన్నే. మీ నాన్న స్టేజ్‌మీద మాట్లాడుతుంటే ఒక టీచరు ప్రశ్నించిందంట. పురుషులందరూ తమ అభివృద్ధి వెనుక ఒక స్త్రీ ఉందంటారు. మరి మీ వెనుక మీ భార్య ఖచ్చితంగా ఉండి తీరాలి” అని చెప్తూ ఒక్క నిమిషం ఆపింది శాంత.

”ఊ…. అయితే నాన్న ఏమన్నారు”

”ఏమంటారు. గబగబా స్టేజ్‌ దిగేసి, మీటింగ్‌ బాయ్‌కాట్‌ చేసి ఎవరెంత చెప్పినా వినకుండా ఇంటికి వచ్చేశారు. ఈ విషయం నాకు చెప్తూ… పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపొమ్మని రాత్రంతా నన్ను ఒకటే తిట్లు. ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం ముగ్గురం!”

”ఇప్పటికైనా అర్థమయ్యిందా? మీ వెనుక మీ భార్య ఉందా? అని ఒకామె అడిగేసరికి నాన్నకు ఎంత ‘ఇగో’ ప్రాబ్లమ్‌ వచ్చిందో?” అన్నది ఉష.

”ఇందులో అర్థమయ్యేది ఏముందే?…. ఆవిడ ఆలోచన లేకుండా అంతమందిలో అడిగితే ఎట్లా చెప్పు… ఏమని చెప్పుకుంటారు.. అందుకే వచ్చేశారు. ఆయన పైకి అలా ఉంటారు. కానీ మనసు మంచిదే ఉషా…”

”ఇంక నేను చెప్పలేనమ్మా…నీకు” అంది ఉష…

”దీనికసలు ఏమి అర్థంకావు. ఎట్లానో? ఏమో?” మనసులో అనుకోబోయి పైకే అనేసింది శాంత.

”అమ్మా ఇంకొకటి చెప్పు… నాన్న నిన్ను నిజంగా ప్రేమించే పెళ్ళి చేసుకున్నారా?”

”ఏమో ఉషా.. ఇప్పటంతగా అప్పుడు మాకు తెలియదు. ఏదో మంచి వ్యక్తన్న నమ్మకం… ఒకసారి నేను ఇదేమాట మీ నాన్ననడిగా. ఉగ్రుడై పోయి ”మనం కలిసి ఉన్నామా? లేదా?” అని అడిగాడు. అనడు మరి ఇలాంటి వెర్రిమొర్రి ప్రశ్నలేస్తే…!! అని ఆపింది శాంత.

”నీ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నిన్నే ప్రశ్నేశాడంటే….” ఉష వాక్యాన్ని పూర్తి చేయకముందే ”అబ్బబ్బ… ఈ కాలం పిల్లలు.. దీంతో పడలేక పోతున్నాను బాబా…” అన్నది శాంత.

ఇంతలోకి రవి కాలేజినుండి, సుందరం స్కూలునుండి వచ్చారు. వస్తుండగానే సుందరం చెప్తున్నాడు. ”ఒక గంటకల్లా అందరూ తయారుగా ఉండాలి. బుక్స్‌ ఎగ్జిబిషన్‌కు వెళ్తున్నాం.” లక్ష్మమ్మ పని ముగించుకొని వెళ్ళిపోయింది. రవి, శాంత దగ్గరకు వచ్చి ”బుక్స్‌ ఎగ్జిబిషనుకు నేను రాను” అన్నాడు.

”ఎందుకురా రవి, చక్కగా నీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కో… మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కదా”. ”కాదమ్మా…నాన్న అద్దాలన్నీ బిగించి కార్లో కూర్చోబెడతాడు. ఎ.సి.ఉండదు. హైద్రాబాదంతా తిప్పుతాడు ఒక చోట ఆపటం…. అందరూ ఒకచోట దిగటం… ఏమీ ఉండదు…. అద్దాలలోంచి బయటకు చూడాలి తప్ప మామూలుగా చూడటానికి ఉండదు… అబ్బా… మనం ఏమన్నా ఎవరూ చూడకూడని మనుషులమా అమ్మా!…. ఒక్కొక్కసారి తిడుతుంటాడు. ఒక్కోసారి సీరియస్‌గా ఉంటాడు. ఇంన్సల్టు చేస్తుంటాడు. నరకం అమ్మా… రాలేనమ్మా…” సుందరం సరదాల్ని ఏమాత్రం అర్దంచేసుకొని పిల్లల్ని చూస్తూ…. ”అన్నీ అలాగనుకుంటే ఎలాగురా… టేకిట్‌ ఈజీగా ఉండాలి….”అన్నది శాంత. ”నువ్వేమో కానీ అమ్మ.. నీ కోడలయితే మాత్రం ఇట్లుండదు. లాగి లెంపకాయ కొట్టి ‘ఏందిరా ఇది’ అని అడుగుతుంది. వెంటనే డైవర్సు ఇచ్చి వెళ్ళిపోతుంది.” ”ఏంటి ఇంకా తయారు కాలేదా?” చెప్పులేసుకుంటూ సుందరం అంటున్నాడు.

”ఆ…..వచ్చేస్తున్నాం” అంది శాంత.

మారుతి 800 కార్లో కూర్చోగానే గబగబా అద్దాలెక్కించేశాడు సుందరం. బయట ఎండ వేడి. కారులో ఎ.సి. ఆన్‌ చేయలేదు. బయట నుండి ఏదో ఒకగాలి కారులోకి రాకపోవటాన కారులో కూర్చోవటమే కష్టంగా ఉంది. రవి తల పట్టుకు కూర్చున్నాడు. ఉష మౌనంగా పాటలు వింటూంది. సుందరం చాలా సీరియస్‌గా ఫోన్లు రిపేర్‌ చేసుకుంటున్నాడు. కారు నెక్లెస్‌ రోడ్డులోని బుక్‌ ఎగ్జిబిషన్‌ దగ్గర ఆగింది. ఉష, శాంత, రవి దిగారు. సుందరం కారు పార్కు చేయటానికి వెళ్ళాడు. రవి శాంతతో ”చూశావుగా అమ్మా! నేనిందుకే రానన్నది”. శాంత విని నవ్వి ఊరుకుంది. బుక్‌ ఎగ్జిబిషన్‌ అంతా ఒకసారి కలియ దిరిగారు. సాహిత్యం దొరికే వైపుకు వెళ్ళాలనేది శాంత ఆలోచనకానీ సుందరం అటువైపు చూడను కూడా చూడటం లేదు. ఒకప్పుడు సుందరం కూడా సాహిత్యాభిమానే…! కానీ ఇక్కడ ఏదో జనాభా లెక్కల సి.డిలు, పాటల సి.డిలు, ప్రపంచ అట్లాస్‌ సుందరం తీసుకున్నాడు. ఉషా, రవి మొక్కుబడిగా ఉండి పోయారు. ఉండబట్టలేక శాంత సుందరంతో కొత్తగా వస్తున్న సాహిత్యాన్ని చూద్దామన్నది. సుందరం చాలా చిరాకుగా మొఖం పెట్టి ”ఇయాల రేపు సాహిత్యం ఎవరు చదువుతున్నారు. రాసుకున్న రచయితలే ఒకళ్ళవి ఒకళ్ళు చదువుతున్నారు తప్ప పాఠకులు ఎవరూ చదవట్లే… అంతెందుకు నేనే చదవట్లే…” శాంత మనసు చివుక్కుమంది. ‘ ఇక చూసింది చాలు పదండి’ అని సుందరం బయటకు వచ్చాడు మిరపకాయ బజ్జీలు తింటూ టీ తాగుతూ ఒక గంట కూర్చుని ఇంటి దారి పట్టారు.

రాత్రి ఒంటిగంట కావస్తోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. శాంత నెమ్మదిగా లేచి దిండు కింద ఉన్న నోట్సును బయటకు తీసింది. బెడ్‌ లైటు కాంతిలో ఆ కథకు ముగింపు వాక్యాలు రాసింది- ”అతని తోచివేత పర్వంలో ఒకప్పుడు నా కళ్ళు కన్నీటిని కార్చి ఇంకి పోయాయి. తర్వాత నా కళ్ళు రక్తాన్నే కార్చి ఎండిపోయి నిర్జీవమయినాయి. ఇక మానసిక అనుబంధం….?” వాక్యాల్ని ముగించేలోపే ఎవరో బాత్‌రూమ్‌కు వెళ్లటానికి హాల్లో లైటేశారు. బహుశా సుందరమేమో! గబగబా నోట్సును దిండు కింద దాచేస్తూ… ”నీలాకాశం నీదేకాదు. నాది కూడా” అని మనసులో అనుకుంటూ నిద్రకుపక్రమించింది శాంత.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో