– జార్‌ఘణ కర్గర్‌ , ఆఫ్‌ఘనిస్తాన్‌. అనువాదం: హేమంత్‌ కాకర

”డియర్‌ జారి” – జార్ఘానా కార్గర్‌ మహిళ రచించిన పుస్తకం. ఈమె ప్రస్తుతం లండన్‌లో నివసిస్తూ బిబిసి వరల్డ్‌ సర్వీస్‌ లో ”ఆఫ్‌ఘాన్‌ వుమెన్స్‌ అవర్‌” అనే రేడియో కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమం కొన్ని లక్షల మంది ఆఫ్‌ఘానీ స్త్రీ. పురుషులను ప్రభావితం చేసి వారికి విద్య మరియు ప్రోత్సాహాన్ని అందించటంలో దోహద కారకమైంది. కొన్ని సంవత్సరాల తరబడి ”ఆఫ్‌ఘాన్‌ వుమెన్స్‌ అవర్‌” కార్యక్రమమం ద్వారా ఎన్నో చర్చలు, అవి కూడా కష్టమైన ఇంకా సమాజంలో నిషేదించబడిన లేదా వెలివేయబడిన అంశాలను గురించి ప్రసారం చేయడం జరిగింది. కొన్ని వందల మంది ఆఫ్‌ఘానీ మహిళలు తమ కథలను కార్గర్‌తో వుత్సాహంగా పంచుకున్నారు. ఈ నిజ జీవిత గాధలే ఆమెను ఈ పుస్తకం రాయటానికి ప్రేరేపించాయి. ఇది ఆఫ్‌ఘానీ మహిళల అణచివేత మరియు దుర్భర జీవన చిత్రం యొక్క ఒక శక్తివంతమైన కథల సమాహారం.

”సమీర కథ” – జారి పుస్తకంలోని 13 కథలలో ఒకటి

ఖమర్‌ ఒక తుర్క్‌మనీ అమ్మాయి. ఈమె రచించిన కార్పెట్‌ / తివాచీ నేతకు సంబంధించిన ఒక కవితను మేము ప్రసారం చేసాము. మా రిపోర్టర్‌ ఆమెను మొదటిసారి కలిసినపుడు ఆమె వయస్సు 16 సంవత్సరాలు ఉత్తర ఆఫ్‌ఘనిస్తాన్‌లోని ”జవ్‌ఘాన్‌” ప్రావిన్స్‌లోని ”షిర్‌ బిఘన్‌” లో నివసిస్తోంది. వీలైతే స్కూలు కెళ్ళి డాక్టరో, టీచరో అవటం నా కోరిక కాని నా కుటుంబంలో నేనే ప్రధాన సంపాదనాపరురాలు కావటం వల్ల నాకా అవకాశం లేదు. అందుకే నా రోజులు మగ్గం ముందే గడిచిపోతాయి” అని ఖమర్‌ మాతో చెప్పింది. ఖమర్‌ కవిత ప్రసారం చేయడం ద్వారా ఆఫ్‌ ఘానీ కార్పెట్ల వెనుక దాగి వున్న ఎందరో ఆఫ్‌ఘానీ మహిళల, బాలికల శ్రమ, పనితనం గురించి మా శ్రోతలకు తెలియచేయాలనేది మా ప్రధాన వుద్దేశం.కొన్ని వందల డాలర్లకు అమ్ముడయ్యే ఈ తివాచీల వెనుక నున్న చిన్న లేబుల్‌పైన ఎప్పుడైనా ఖమర్‌ వంటి స్త్రీల పేర్లు ఎప్పుడైనా మనం చూశామా?

ఆఫ్‌ఘనిస్తాన్‌ కథ, చాలా వరకు, అక్కడి తివాచీలలో అభివ్యక్తమవుతుంది. ఆ దేశ విభిన్న జాతులభిన్నత్వం ఉదాహరణకు తుర్క్‌మన్‌, ఉజ్బెక్‌, తజక్‌ మరియు పాష్‌తూన్‌ వంటివి, వారి వారి తివాచీ నేత పద్ధతులు, డిజైన్లలో, తయారీ ప్రక్రియలలో వ్యక్తమవుతుంది. ఆఫ్‌ఘానీ కొండలపై మేసే గొర్రెలు, మేకలు ఒంటెల నుంచి ఉన్ని తయారు చేస్తారు. సాంప్రదాయ పారంపరిక రంగులు మొక్కలు, పండ్లు కాయగూరల నుంచి తయారు చేస్తారు. దానిమ్మ తొక్కలు, అక్రోటు గింజల నుంచి బ్రౌన్‌, మద్దర్‌ మొక్క వేర్ల నుంచి ఎరుపు రంగు, కుంకుమ పువ్వు మరియు కేమోమైల్‌ నుంచి పసుపు రంగు, ఇండిగో మొక్క నుంచి నీలం తయారు చేస్తారు. ఈ పదార్థాలన్నింటి కంటే మించి ఈ తివాచీలు తయారుచేసే మహిళలు, బాలికల భావోద్వేగాలు ఈ కార్పెట్ల దారాలలో మమేకమై అల్లుకుని వుంటాయి.

ఆఫ్‌ఘానీ మహిళలు ఈ తివాచీ నేత ఎప్పుడు మొదలు పెట్టారో ఎవరికీ తెలీదు. నేను ఎప్పుడు దీని చరిత్ర గురించి కనుక్కుందామని ప్రయత్నించినా, ఇది కొన్ని శతాబ్దాల వెనుకటి కళ అని, ఇది తల్లి నుంచి కూతురికి వంశపారంపర్యంగా, ప్రత్యేకమైన తివాచీ డిజైన్లతో నేర్పబడుతుంది అని మాత్రమే తెలిసింది. ఏది ఏమైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా నిజం. అదేంటంటే ఈ తివాచీలు సునిశితమైన ఆఫ్‌ఘానీ కళాకౌశలానికి నిరద్శనం. పూర్వకాలంలో ఈ కార్పెట్లను ఆఫ్‌ఘానీ రాజులు తమ విదేశీ అతిధులకు బహుమతులుగా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ దేశ రాష్ట్రపతి విదేశీ దేశాధినేతలకు బహుమతులుగా సమర్పిస్తున్నారు. ఏదైనా అధికారిక కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొనేట్లైతే వారు తప్పకుండా ఆఫ్‌ఘానీ ఎర్రతివాచీపైనే నడుస్తారు. అంతేకాక ప్రతి ఆఫ్‌ఘానీ నవ వధువుకు వివాహ సమయంలో తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ తన పడక గది కోసం ఒక తివాచీని బహురించడం రివాజు.

ఇంట్లో మగ్గం ఏర్పాటు చేసుకోవడం తేలికేనేత కోసం కావల్సిన పనిముట్లు కూడా చాలా తక్కువ ధరకే లభ్యమౌతాయి. కొన్ని సంచార జాతులు వారికైతే ఒకచోట నుంచి మరోచోటకి తరలించటానికి వీలుగా, ఉన్ని దారాలు వాటికే తగిలించివుంచే మోయగలిగిన తేలికైన మగ్గాలు కూడా వుంటాయి. వీటిని గాడిదల మీద మోసుకెళ్తారు. తివాచీ నేత అనేది ఎక్కువగా మహిళలు, పిల్లలు ఇల్లు విడిచివెళ్ళే అవసరం లేకుండ ఇంట్లోనే చేసుకోగలిగే పని. తాలిబాన్ల కాలంలో మహిళలు పని కోసం బయటికి వెళ్ళడం నిషేదించారు. అలాగే బాలికలు స్కూలుకి వెళ్ళడం కూడా నిషిద్ధమే. అయినా కూడా వారు తివాచీలు నేయడం ద్వారా డబ్బు సంపాదించేవారు. స్వతహాగా తివాచీ నేత అలవాటు లేని కుటుంబాల నుంచి వచ్చిన బాలికలు కూడా తాలిబాన్ల కాలంలో ఈ పని నేర్చుకున్నారు. ఆ పైన ఆఫ్‌ఘానీ కాందిశీకులు గా మారి పాకిస్తాన్‌లో జీవిస్తున్నపుడు మళ్ళీ తివాచీ నేత ఆరంభించి వారి హస్తకళలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేశారు.

”ఆఫ్‌ఘాన్‌ వుమెన్స్‌ అవర్‌” నిర్మాణంలో భాగంగా నేను ఎంతో మంది తివాచీ నేత కళాకరులను కలుసుకున్నాను. కాని అప్పటి వరకు ఈ కళాఖండాలను తయారు చేయటానికి ఎన్ని బాధలు, కష్టాలకు ఓర్చి ఈ పని చేస్తున్నారో ఎంత నిరాశతో జీవితాన్ని వెళ్ళదీస్తున్నారో నాకు తెలీలేదు. దేశ ఉత్తర భాగంలో బాలికల నేత పనితనాన్ని బట్టి వారి విలువ ఆధారపడి వుంటుంది.

ఈ బాలికలు వారి హృదయాంతరాళాలలోని భావోద్వేగాలను ఈ తివాచీలలో సమ్మిళితం చేసి మన ముందు పరుస్తున్నారు. కానీ వారి మనోభావాలనూ ఎవరూ పట్టించుకోరు. అందరికీ కావాల్సింది ఆ తివాచీ ఎన్ని డబ్బులు సంపాదించగలదు అనే. తమని తివాచీ తయారీ యంత్రాలుగా బలవంతంగా మా తల్లిదండ్రులే మార్చేశారని కొంతమంది బాలికలు నా దగ్గర వాపోయారు. ముడివేయటం, ఒత్తటం, కట్టటం, కోయటం ప్రతిరోజూ కొన్ని గంటల తరబడి చేయాల్సిన పని. ఈ మగ్గాలవెనుకే వారు వయస్సు మళ్ళి అలసిపోతున్నారు. వారి హుషారు, అందం, ఆరోగ్యం అన్నీ ఈ మగ్గాల ముందే కనుమరుగై పోతున్నాయి. అలసి సోలసి ఆవిరైపోతున్నాయి. వారు నేసే తివాచీలు ఎంత డబ్బు సంపాదించి పెడతాయో వారికి తెలీదు, తెలిసిందల్లా వారి జీవితాలు ఈ మగ్గాలనే సంకెళ్ళకు చిక్కి బందీలైనాయని మాత్రమే. ఇప్పుడు మా ఇంట్లోని ఆఫ్‌ఘనీ తివాచీలను కొత్త కోణలో చూడటం మొదలుపెట్టాను. అవి చూస్తే నాకు వాటిని తయారు చేసిన స్త్రీలు, పిల్లలు గుర్తుకొస్తారు.

సమీర కూడా ఖమర్‌ లాగానే షిర్‌ బిఘాన్‌ లోని ఒక మామూలు తివాచీ నేత కళాకారిణి. ఖమర్‌ కవిత చదివినాక, నాకు తనలాంటి మిగతా బాలికలను కలుసుకోవాలనే ఆలోచన కలిగింది. ఉత్తర ఆఫ్‌ఘనిస్తాన్‌లో ఇలాంటి బాలికలను కలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒక చెక్క మగ్గం వుంటుంది. దేశ ఉత్తర భాగంలో, ప్రధానంగా తుర్క్‌మన్‌ మరియు ఉజ్బెక్‌ జాతులు వారు ఉంటారు, అంతేకాక వీరు ఖచ్చితంగా వారి స్త్రీలనువారి తివాచీ నేత పనితనం ఆధారంగానే విలువనిస్తారు. ఉదాహరణకి ఒక బాలిక తన అందమైన తివాచీనేత పనితనం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించగలదు అనుకుంటే ఆమెతో వివాహం కోసం వరుడి కుటుంబం వధువు కుటుంబానికి ఎక్కువ డబ్బు ముట్టజెపుతుంది. ఇలాంటిసందర్భాలలో ”ఆమె అయిదు వేళ్ళు అయిదు చెదరని దీపాలు (చిరాగ్‌) అని ఆ బాలిక కుటుంబీకులు మురిసిపోతారు. నేను కొన్న తివాచీలు చూస్తే నాకెప్పుడూ ఈ అయిదు దీపాలే జ్ఞాపకమొస్తాయి. సమీర, ఖమర్‌ కథలు విన్నాక నాకు ఈ తివాచీలు మరింత విలువైనవిగా, అపురూపంగా తోస్తాయి. ఎందుకంటే వాటి తయారీ వెనకున్న త్యాగం, నిబద్ధత, బాధా, బంధనాలు వెలకట్టలేనివని నాకు తెలుసు.

సమీర రంగు రంగుల దారాలన్నీ చక చకా అల్లేస్తోంది. తన పక్కనే నేల మీద దారాలు తుంచే చాకు వుంది, ఎదురుగా తివాచీ డిజైను పరిచివుంది. కానీ తనెక్కడా దానివంక చూస్తునట్టు లేదు. ఎందుకంటే తనకా అవసరం రాలేదు, అనేకంటే రాదు అంటే సబబేమో. ఆమె కళ్ళు మూసుకుని తివాచీ నేయగలదు. కొంతసేపటికి దారం చుట్టీ, తిప్పి, మెలేసి తన చిన్ని వేళ్ళు నొప్పి పుట్టసాగాయి. ఖర్గా (ఒక రకమైన చెక్క మగ్గం, దీనికి దారాలు సాగదీసికట్టివుంటాయి.) ముందు ఒక గుండ్రటి దిండు మీద కూర్చుని వుంది సమీర. అది ఆరు మీటర్ల కంటే ఎక్కువ పొడవుండి, దాదాపు గది అంతా ఆక్రమించుకుని వుంది. సమీర దాని ముందు ఇరుక్కుని ముందుకి సాగి అల్లుతోంది.

తను కూర్చున్న గది ఎంతో చీకటిగా, వున్ని దుమ్ముతో నిండివుంది సమీర రోజూ తెల్లవారుఘామునే తన తల్లి కంటే ముందే నేత మొదలు పెడుతుంది. తనే అందరి కన్నా పెద్దది. తమ్ముడేమో స్కూలు కెళతాడు, చెల్లెలు ఇంకా చంటి పాప. తన తమ్ముడు స్కూలుకెళ్ళే సమయం కంటే ఎంతో ముందుగానే సమీర తండ్రి తయారు చేసిన ఖర్గా ముందు పనిలో నిమగ్నమైపోతుంది. సమీర, ఇంకావాళ్ళ అమ్మ రోజు మొత్తం ఖర్గా ముందే గడిపేస్తారు. అదేవారి పని. సమీర ఒక స్కార్ఫ్‌ తలకి గట్టిగా కట్టుకుని తన దారాల ముందు కుదురుకుని అల్లుకుంటూ పోతోంది. కొన్ని సార్లు అలసిపోయినపుడు ఖర్గా మీదే వాలి దానికొనుకుని సేద దీరుతుంది. సమీర గబగబా అల్లుతూ దారాలు తుంచుతుండగానే అమ్మ అరుపు వినిపించింది.

”ఏం పిల్లా నీకెంత బద్దకమే, ఒక్క నిమిషం అటు తిరిగితే చాలు పని మాని ఖర్గా మీద వాలిపోతావు!”

సమీర ఇంకా వేగంగా అల్లుతూనే తల్లికి సమాధానమిచ్చింది.

”లేదమ్మా, నువ్వు లేనంత సేపూ నేను అల్లుతూనే వున్నాను, వచ్చి చూడు, అప్పుడే మొదటి డిజైను పూర్తయిపోయింది కూడా నీకిప్పుడు సంతోషమేనా?”

అమ్మ వచ్చి సమీర అప్పటి వరకూ అల్లిన డిజైను జాగ్రత్తగా పరీక్షించింది.

”చాలా బాగుంది కన్నా, నువ్వు ఎంతో అందంగా నేసావు. కానీ నువ్వు ఇంకా వేగంగా పని చేయాల్సి వుంటుంది. ఎందుకంటే నీ చెల్లెలి వల్ల నేను అనుకున్నంతగా నేత పని చేయలేకపోతున్నాను. అందువల్ల మనం అనుకున్న సమయానికి తివాచీ పూర్తి చేయలేకపోతే మీ నాన్నకు చాలా కోపం వస్తుంది. అదీకాక ఆ ట్రోజర్‌ (వర్తకుడు)కి ఏమని సమాధానం చెప్పగలం చెప్పు?”

సమీర ఖర్గాని దీర్ఘంగా చూసి మళ్ళీ చక చకా నెయ్యటం మొదలుపెట్టింది. వేసే ప్రతి ముడికి తనకి ఇంకా కోపం రాసాగింది. ప్రతి శ్వాసతో నోరంతా తివాచీ దుమ్ముతో నిండిపోతోంది. ఇంతలో అమ్మ వచ్చి తన పక్కనే కూర్చుంది.

సమీర ఎప్పుడూ అమ్మని ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే వుంటుంది. అమ్మ కూడా ఒక పక్క నేస్తూనే ఒక్క ముడికూడా తప్పకుండా, సమధానమిస్తుంది. ఇంకో పక్క నుంచి సమీర నేతను కూడా పరికిస్తూనే వుంది. కూతురి నేతను జాగ్రత్తగా గమనిస్తూ తప్పులు సరిచేసి, అల్లికలో మెళకువలు వైనాలు నేర్పుతోంది. అమ్మకి రంగులు కలపటంలో, కొత్త అందమైన డిజైన్ను తయారు చేయటంలో మంచి నైపుణ్యం వుంది.

”అమ్మా ఈ తివాచీ పూర్తి చేసినాకా ఇంకొకటి మొదలు పెడతావా?” సమీర అమాయాకంగా ప్రశ్నించింది.

నవ్వుతూనే అమ్మ సమాధానం

”నా చిట్టితల్లి నువ్వు ఈ ప్రశ్న మనం రోజూ పని మొదలుపెట్టగానే అడుగుతావు, నా జవాబు ఎప్పుడూ మారదు. అవును మనం మళ్ళీ మళ్ళీ ఇదే పని చేయాల్సి వుంటుంది. మనం ఇలా నేస్తూనే వుండాలి. ఎందుకంటే మీ నాన్న ట్రోజర్‌ దగ్గర నుంచి ఎన్నో ఆర్డర్లు తీసుకున్నారు”.

అవునమ్మా, నాకు తెలుసు, కాని నాకు విసుగొస్తోంది. నాకు కూడా నయీమ్‌లాగా స్కూలుకెళ్ళాలనుంది. ఎందుకని తను స్కూలుకెళ్తున్నాడు, నేను వెళ్ళట్లేదు? నాకు 11 ఏళ్ళు, వాడికి 10 ఏళ్ళు. మా ఇద్దరికీ వయస్సులోపెద్ద తేడా లేదుగా! వుందా?”

”చూడమ్మా నా మాట విను, నేను స్కూలు కెళ్ళానా?”

”లేదు, నాకు తెలుసు, నువ్వు స్కూలు కెళ్ళలేదు” సమీర తల అడ్డంగా వూపింది.

అమ్మ పెద్ద లోహపు సూది చూపుతూ సమీరతో అంది.

”అదుగో అక్కడే వుంది నీ జవాబు. మీ అమ్మ స్కూలు కెళ్ళలేదు అందుకే నువ్వు కూడా వెళ్ళవు. కానీ మీ నాన్న స్కూలు కెళ్ళాడు తన చిన్నతనంలో, అందుకే నీ తమ్ముడు కూడా స్కూలు కెళ్తున్నాడు. మరచిపోకు, నీకు ఒక్కడే తమ్ముడు, ఏదో ఒకరోజు నువ్వూ, నీ చెల్లెలు వేరొకరి ఇంటికి వెళ్ళి జీవించాల్సాస్తుంది. అప్పుడు మీరిద్దరూ కూడా మీ భర్తలకు నాలాగే ఇంటి విషయాల్లో సాయం చేయాలి.”

సమీరకు తల్లి సమాధానం అస్సలు నచ్చలేదు. కానీ మౌనంగా నేస్తూ వుండిపోయింది. వారి వేళ్ళు దారాల మధ్య లోపలికి, బయటికి వేగంగా కదులుతున్నాయి. అంతలోనే మధ్యాహ్నం అయ్యింది. కాసేపు పని ఆపి ఎదన్నా తింటానని అమ్మని అడిగింది సమీర. అమ్మ ఒప్పుకోవటంతో సమీర గది బయటికి అడుగుపెట్టింది. బయట గాలిచాలా పొడిగా వుంది. చెట్ల ఆకులు పసుపు, నారింజ రంగులకు మారి వున్నాయి. బలంగా వీస్తున్న గాలికి అవన్నీ నేలకొరుగుతున్నాయి. సమీర తలెత్తి ఆకాశం వంక చూసింది. చలిగా వున్నా సూర్యరశ్మి ప్రకాశవంతంగానే వుంది. సమీర కళ్ళు తెరవలేకపోయింది. బయటి కాంతి కళ్ళకు గుచ్చుతోంది. అందుకే కళ్ళను చేత్తో మూసుకుంది. తన చేతి వేళ్ళు ముఖానికి తాకుతుంటే వేళ్ళ కణుపుల్లో నొప్పి తెలుస్తోంది. గంటల తరబడి ఖర్గా ముందు వంగి చీకటి గదిలో పనిచేయటం వల్ల తనింక నిటారుగా నిలబడలేకపోతోంది. తెల్లవారు ఝామునే పనిలో కూర్చోవడం వల్ల రోజులో ఇప్పుడే మొదటిసారి సూర్యకాంతిని చూస్తోంది.

సమీర మెల్లగా వంటగది వైపు నడిచి తిన్నగా రొట్టెలు చుట్ట దగ్గరకు వెళ్ళింది. దాన్లో తల్లి ఆ రోజు ఉదయం తండూర్లో కాల్చిన గుండ్రటి రొట్టెలున్నాయి. అందులోంచి రోట్టె తీసుకుని టీ కోసం పొయ్యి వెలిగించింది. ప్రతిరోజూ మధ్యాహ్నం వంట గది కొచ్చి గ్రీన్‌ టీ తయారు చేసి రెండు కప్పులు, పంచదార, టీ రొట్టెలు ఒక ట్రేలో తీసుకుని తిరిగి నేత గదికి వెళ్తుంది సమీర. ఇది వారి మధ్యాహ్న భోజనం. అమ్మ సాయంకాలం నాన్న ఇంటి కొచ్చే వేళ మాత్రమే వంట చేస్తుంది. పిల్లల కోసం భోజనం తయారు చేయడానికి నేత మధ్యలో విరామం తీసుకోదు. అంతేకాక రోజుకి ఒకసారి వంటచేస్తేనే ఖర్చు తగ్గుతుంది.

సమీర చిన్న కిటికీ ప్రక్కగా కూర్చుంది. పక్కనే గహ్వారా (ఉయ్యాల)లో తన చిన్ని చెల్లి పడుకుని వుంది. అమ్మకీ, తనకీ టీ పోసి చాలా చెక్కెర వేసుకుని అందులో రొట్టె ముంచి తినసాగింది. టీలో ప్రతి చుక్క, రొట్టెలో ప్రతి ముక్క ఎంతో ఆస్వాదిస్తూ తింది. కొంత సేపటికి అమ్మ ఒకసారి పాపను చూడమంది. ఆ చంటిపాప అటూ, ఇటూ కదిలి చాలాసేపయ్యింది, అందుకే సమీర గహ్వారాలోకి వంగి దగ్గరగా పరీక్షించింది.

”అమ్మ అంతా బాగానే వుంది, చెల్లి వూరికే నిద్రపోతోంది”. ”అదే అర్ధం కావట్లేదు. ఇంకా ఎందుకు లేవలేదు. ఉదయం తొమ్మిది నుంచీ అలాగే నిద్రిపోతోంది. ఇప్పుడు ఒంటి గంటవుతోంది. ఇంకా లేవలేదు”,

”మనలాగే అలసిపోయిందేమో” అంది సమీర సరదాగా, మళ్ళీ అమ్మని అడిగింది. ”అమ్మా! చెల్లి పెద్దయినాక తన చేతకూడా తివాచీలు అల్లిస్తావా?”

”తప్పుకుండా, తనేమీ నీకంటే, నాకంటే వేరుకాదు. తనుకూడా అమ్మయే అందుకని తనుకూడా తప్పనిసరిగా నేత పని నేర్చుకోవాలి. లేకపోతే ఏ మగాడు తనని పెళ్ళి చేసుకోడు”,

సమీరకి తల్లి ఏం చెబుతోందో అర్ధం అయ్యింది. అమ్మే కాకుండా, ఇంకా చుట్టు పక్కల అమ్మవాళ్ళు కూడా తనకెన్నోసార్లు చెప్పారు. మంచి భర్తను పొందాలంటే తుర్క్‌మన్‌ అమ్మాయిలకు తప్పనిసరిగా అందమైన తివాచీలు నేయటం తెలిసుండాలి. దాదాపు ఊర్ళో అందరు ఆడపిల్లలు ఏడెనిమిది ఏళ్ళ వయస్సు నుండే తమ తమ తల్లులు లేదా ఇతర బంధువుల నుండి తీవాచీ నేత నేర్చుకోవడం మొదలు పెడ్తారు. ఈ లోపల కుటుంబంలోని మగవారు ఆ తివాచీలు అమ్మడానికి వర్తకులను వెదకటం లేదా అనుకూలమైన విపణుల్లో తామే స్వయంగా కొనుగోలుదార్ల కోసం ప్రయత్నించటం చేస్తుంటారు.

కొంతమంది మగపిల్లలు స్కూలు కెళతారు, కానీ అందరూ కాదు. కొన్ని కుటుంబాలలో తమ కొడుకులకి కూడా నేతపని నేర్పిస్తారు. కానీ సమీర తమ్ముడు నేత పని నేర్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అతను ఆ కుటుంబానికి ఒక్కడే మగ సంతానం కాబట్టి అతను ఆ కుటుంబానికి ఎంతో అపురూపం. అంతేకాదు అమ్మకి తెలుసు తివాచీ నేత ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంతోమంది స్త్రీలు పిల్లలు దుమ్ముతో కూడిన వాతావరణంలో పనిచేయడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అంతేకాక సమీర తమ్ముడు బాగా చదువుకుని డాక్టరై అమ్మకి, అక్కలకి వున్న నొప్పులు, బాధలు అన్నీ తగ్గించాలని అమ్మ కోరిక.

రొట్టెలో ఆఖరి ముక్క తింటూ అమ్మని అడిగింది సమీర

”అమ్మా నా అయిదు వేళ్ళూ, అయిదు దీపాలైనట్టు నీకనిపిస్తుందా?” అమ్మ చిన్నగా నవ్వింది. దగ్గరకెళ్ళి సమీర చేతిని తన చేతిలోకి తీసుకుంది, ఆ చిన్ని వేళ్ల వంక చూసింది.

”నా బంగారు తల్లీ, నీవేళ్ళు ఇంకా చెదరని దీపాలు (చిరాగ్‌) కాలేదు కానీ తొందర్లోనే అయ్యేట్లున్నాయి. అవి ఎప్పుడు దీపాలౌతాయో చెప్పనా?”

”చెప్పమ్మా”. ఎంతో వుత్సాహంగా అడిగింది సమీర.

”నా చిన్న రాకుమారీ, ఏ రోజైతే నేను చెప్పగానే వుదయాన్నే లేచి తిన్న ఖర్గా ముందు కూర్చుంటావో ఆ రోజు, ఏ రోజైతే తమ్ముడు బడి కెళ్తున్నాడు, నేను వెళ్లట్లేదు అనే ఫిర్యాదులు మానేస్తావో ఆ రోజు, ఏ రోజైతే నా వేళ్ళు అలసిపోయినయ్యి, నేనింక నేత చెయ్యను అని మారం చేయ్యటం ఆపేస్తావో ఆరోజు, ఇంక ఆఖరుగా ఏ రోజైతే ఆరు మీటర్ల అందమైన తివాచీని ఏ వంకలూ లేకుండా నీ అంతట నువ్వే పూర్తి చేస్తావో ఆ రోజు నీ అయిదు వేళ్ళు ఎప్పటికీ వెలుగుతూనే వుండే అయిదు దీపాలౌతాయి.”

తన ప్రశ్నకి వచ్చిన జవాబు సమీరకి అస్సులు రుచించలేదు. అయినా మారు మాట్లాడకుండా లేచి వెళ్ళి ఖర్గా ముందు కూర్చుని నేత మొదలు పెట్టింది. గబగబా అల్లి దారాలు కత్తితో తుంచసాగింది. అమ్మ తన పక్కన కూర్చునే ముందు ఒకసారి పాపను చూసొచ్చింది. ఆపై సమీర అప్పుడే అల్లిన భాగాన్ని పరిశీలించ సాగింది.

”ఆపు. సమీర ఆపు చూడు నువ్వు ఏం చేస్తున్నావో.” సమీర వెంటనే ఆపేసింది. ”నేనేం చేశాను నీలాగే అల్లుతున్నానుగా?” అమ్మ చాకు తీసుకుని సమీర అప్పుడే వేసిన కుట్లను తుంచ సాగింది. నువ్వు దారం సరిగ్గా తుంచకపోయినా, లోపలికి సరిగ్గా తొయ్యకపోయినా, డిజైను సరిగ్గా చెయ్యకపోయినా, మనం నెలల తరబడి చేసిన శ్రమ వృధా అవుతుంది.

సమీర తను అప్పుడే వేసిన దారాల ముడులను విప్పిటం మొదలు పెట్టింది. తర్వాత అమ్మ చేత మొదలుపెట్టించి, ఎలా వేస్తోందో గమనించి తను కూడా అమ్మని అనుకరించసాగింది. ఆపై ఇద్దరూ మౌనంగా నేత కొనసాగించారు. వారి నిశ్శబ్దానికి మగ్గం అప్పుడప్పుడు మగ్గంలోని చెక్కలు అంతరాయం కలిగిస్తున్నాయి. అమ్మ ఏ రోజుకి ఎంత పని పూర్తి చేయాలి అనేది ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. అది పూర్తయ్యే వరకూ మరుగుదొడ్డికి, వంటగదికి తప్పితే ఆ గది విడిచి వెళ్ళటానికి సమీరకు అనుమతిలేదు. అమ్మకి బాగా తెలుసు, కొంచెం అలుసిస్తే చాలు సమీర పని మాని తప్పించుకుంటుంది అని. సమీర చాలా చిన్నపిల్ల, తను నేసే తివాచీలు ట్రోజర్‌కి నచ్చుతాయా లేదా అనే ఆలోచన పట్టదు. నేతపని తనకి విసుగొస్తోంది. బయటికి వెళ్ళి స్నేహితులతో ఆడుకోవాలని, తన బొమ్మలకి బట్టలు కుట్టాలని ఏంతో అనిపిస్తుంది. సమీర నేత పని మొదలు పెట్టి మూడు సంవత్సరాలవుతోంది. రోజంతా పని చేయాల్సిందే తప్ప బయటికి వెళ్లి ఆడుకోడానికి అనుమతి లేదు. అమ్మనాన్నల దృష్టి తనకి ఇంటి పట్టున వుండి, నేతలో నైపుణ్యం పెంచుకునే వయసొచ్చింది.

”అమ్మా ఒకవేళ నేను గబగబా నేసి ఇవాల్టిపని తొందరగా ముగిస్తే, షకీల ఇంటికెళ్ళి తన బొమ్మలతో అడుకోవచ్చా?”

”సమీర నావంక చూడు. ఇవాళ ఉదయం నుంచి నన్ను వంకర ప్రశ్నలతో విసిగిస్తున్నావు. మాట్లాడకుండా కూర్చుని పనెందుకు చెయ్యవు? మాటలాపి పని మీద ధ్యాస పెట్టు”. అంతలోనే అమ్మ గహ్వారా వంక చూసింది.

”నువ్వేమో నన్నిలా విసిగిస్తున్నావు. అటుపక్క నీ చెల్లెలు ఇంకా లేవలేదు. ఎప్పుడనగా నిద్రపోయింది. నాకేంటో ఆందోళనంగా వుంది”. అమ్మ గహ్వారా వంక చూస్తూనే వుంది. కానీ అలా చూస్తూ వుండలేకపోయింది. చివరికి నేత మానేసి ఉయ్యాల దగ్గరకెళ్లింది. ఉయ్యాలలోంచి పాపని తీసుకుని ఎత్తుకుంది. ముఖమంతా తడిమింది. సమీరని పరుగున వెళ్ళి నీళ్ళు తీసుకుర్మంది. పాప ముఖం పాలిపోయినట్లు చాలా మెల్లగా వూపిరి తీసుకుంటోంది. పాప స్పృహ లేనట్టుగా వుంది. అమ్మ పాపను నిద్రలోంచి లేపలేకపోయింది. సమీర నీళ్ళు తీసుకొచ్చింది. అమ్మ స్పూనుతో కొన్ని చుక్కలు పాప నోట్లో పోయటానికి ప్రయత్నించింది. పాప నీళ్ళు తాగింది కానీనోరు తెవరలేదు ఇప్పుడు అమ్మకి ఇంకా ఖంగారుగా అనిపించింది. తనకి సాయం కావాలి. అమ్మ సమీరని పక్కింట్లో ”ఖాళాషాగుల్‌”ని పిలుచుకు రమ్మనింది.

”ఇక్కడికి రమ్మనిచెప్పు నీ చెల్లెలు నిద్రలేవట్లేదని చెప్పు”. చెల్లి గురించి ఆందోళన గానే వున్నా ఆ కొద్ది విరామం దొరికినందుకు హుషారుగా పరుగెత్తింది సమీర. పక్కింటికి పరుగెడ్తుంటే వెనుక నుంచి తల్లి అరుపు వినిపించింది.

”పక్క దారి పట్టి మిగతా అమ్మాయిలతో ఆటలకి పారిపోకు, తిన్నగా వెళ్ళి తిన్నగా వెనక్కిరా”.

ఖాలా షా గుల్‌ ఆ చుట్టు పక్కల మహిళలందరిలో పెద్దావిడ. అందరికీ కాన్పులకి సహాయం చేస్తుంది. ఆమే 12 మంది సంతానానికి జన్మనిచ్చింది. అందులో చాలా మంది పెళ్ళిళైపోయి పిల్లలు కూడా వున్నారు. సమీర కుటుంబానికి దగ్గర్లోనే వుంటారు. ఖాలా షాగుల్‌ కుటుంబం కూడా తివాచీ నేత వృత్తిలో వున్నారు. కానీ ఆమె నుంచి అందరూ రకరకాల సలహాలకి సంప్రదిస్తూ వుంటారు. ముఖ్యంగా చంటి పిల్లలను నిశ్శబ్దంగా వుంచటానికి వుపయోగపడే సలహాలు, దాని వల్ల తల్లుల తివాచీనేత పనికి అంతరాయం కలగకుండా వుండేందుకు.

సమీర కోసం ఎదురు చూస్తూ అమ్మ పాపని ఉయ్యాల వూపుతోంది. పాప చిట్టి చేతులు పట్టుకుని వుండిపోయింది. కానీ ఆ చిన్న శరీరం ఓపిక లేనట్టుగాఏదో మైకంలో వున్నట్టుగా వుంది. అమ్మ పాప చేతులు కాళ్ళు ముద్దాడసాగింది.

”నా చిన్న బంగారు తల్లి, లేవమ్మా, మీ అమ్మకోసం మేలుకో తల్లీ, ఇంకా ఎందుకు బొజ్జున్నావు? అమ్మకి కంగారుగా వుంది అలా పాపను ఎత్తుకుని ఏదో మాట్లాడుతూనే వుంది.

”నాకు తెలుసు నువ్వు అరుస్తుంటే, నిద్రపోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు నీకిష్టమైన పాలు తాగే సమయమైంది. లే తల్లీ, నా బంగారం లేమ్మా!”. ఆ చంటిపాప నిదానంగా శ్వాసిస్తోంది కానీ కదలలేదు. అమ్మకి కంగారు ఎక్కువ అయ్యింది. తన దుస్తుల ముందు భాగం తెరచి, తన చనుబాలను మెల్లగా పాప ముఖానికి రాసింది. పాల చుక్కలు పాప నోటిపైకి జారాయి. కానీ పాప అందుకోలేదు. పాలు పాప ముఖమంతా చిమ్మాయి. కొంతసేపటికి ఖాలా సాగుల్‌తో సమీర తిరిగొచ్చి అమ్మ దగ్గరికి పరుగెత్తింది.

”ఖాలా చూడు, నా పాప కదలట్లేదు, ఏడవట్లేదు, పాలు తాగటం లేదు. గంటల తరబడి నిద్రపోతూనే వుంది. నాకు చాలా కంగారుగా వుంది. నా పాపకి ఏదో అయింది నేనిప్పుడేం చెయ్యను?”

”ఏదీ నన్నొకసారి చూడనీ, ఏం కంగారు పడకు అంతా బాగానే వుంటుంది”.

అమ్మ పాపని ఖాలా చేతి కందించి సమీరని నేత మొదలు పెట్టమంది, తను వంటగదివైపు నడిచింది. వచ్చిన అతిధికి టీ కోసం సమీర ఖర్గా ముందు కెళ్ళి దారాలు కదపటం మొదలుపెట్టింది. కొంతసేపైనా బయటకు వెళ్లగలిగినందుకు సంతోషంగా వుంది. ఈ లోపల ఖాలా సాగుల్‌ పాపని తన ఒడిలో పెట్టుకుని కూర్చుంది. పాప బుగ్గలు తడిమింది. నాడి నిదానంగా, లయగా కొట్టుకుంటోంది. చర్మం చల్లగా వుంది. అమ్మ ఒక ట్రేలో టీ తీసుకొచ్చి ఖాలా ముందు నేలపై వుంచింది.

”ఖాలా నా పాపకి ఏమైంది, బాగానే వుంది కదా? ఎందుకు నిద్రలేవట్లేదు?” గాభరాగా అడిగింది.

ఖాలా మాత్రం చాలా ప్రశాంతంగా వుంది. ”చూడమ్మా నీ పాపకి ఏం కాలేదు, మంచి గాఢ నిద్రలో వుంది అంతే. నేను చూసిన దాన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే నువ్వు పాపకి కొంచెం ఎక్కువగా నల్లమందు ఇచ్చినట్లున్నావు”.

అమ్మ పాప తల నిమిరింది ”వూరుకో అత్తా నేనంత ఎక్కువేమీ ఇవ్వలేదు. నువ్వు చెప్పినంతే ఇచ్చాను, అది కూడా ఒక్కగింజే”. ఖాలా షాగుల్‌ పాపని అమ్మకి అప్పగించింది. ”ఇదిగో పాపని తీసుకో, మళ్ళీ పాలు పట్టటానికి ప్రయత్నించు, బలవంతంగానైనా కొంచెం నీళ్ళు పట్టించు మత్తు వదిలితే తనే లేస్తుంది. ఏం కంగారు పడకు”.

ఖాలా షాగుల్‌ తన బట్టల జేబులోంచి ఒక చిన్న ముక్క నల్లమందు బయటికి తీసింది. అందులోంచి చిన్న ముక్క విరిచింది ఒక చిన్న గోధుమ గింజంత తీసి తన అరచేతిలో వుంచి చూపింది.

”రేపు నల్లమందు ఇంకా తగ్గించి ఇవ్వు పాపకి, ఎందుకంటే దీన్ని బట్టి తెలుస్తోంది కదా నీ పాపకి ఎక్కువ మందు సరిపడదని. ఏం కంగారు లేదు. తనే అలవాటు పడుతుందిలే. అంతలోనే ఒక రోజోస్తుంది తను ఏడ్చి ఏడ్చి నిన్ను పని చేసుకోనీదు. అప్పుడు నువ్వు ద్రాక్ష, పండంత నల్లమందు పెట్టినా నిద్రపోదు.”

ఖాలా షాగుల్‌ నవ్వింది. మోతచేస్తూ టీ తాగసాగింది. సమీరని పిలిచి అమ్మ చెప్పింది. ”సమీరా ఖాలా చెప్పులు తయారుగా వుంచు”.

సమీర వెంటనే చెప్పులు గుమ్మానికి ఎదురుగా ఖాలా ఇంట్లోంచి తిన్నగా చెప్పుల్లో అడుగు పెట్టేందుకు వీలుగా వుంచింది. ఆ పెద్దావిడ సమీర వంక ప్రసన్నంగా చూసింది.

”బాగా చేశావు. దేవుడు నిన్ను దీవిస్తాడు. తివాచీ నేతతో పాటు నీకు పెద్ద వాళ్ళకు ఎలా మర్యాద చేయ్యాలో కూడా తెలుసు”.

ఖాలా షాగుల్‌ వెళ్లగానే సమీర తలుపులు మూసి వచ్చి అమ్మబడిలో నిద్రపోతున్న చెల్లిని ముద్దాడింది. పాప బుగ్గలపై ముద్దు పెట్టినిద్రలేపటానికి ప్రయత్నించింది, కానీ పాప కదలలేదు. అమ్మ సమీరని పిలిచి ఉయ్యాల కిందకుండని ఖాళీ చెయ్యమంది. సమీర మారుమాట లేకుండా తల్లి చెప్పిన పని చేసింది. అమ్మ పాప బట్టలు మార్చి పాలు పట్టడానికి ప్రయత్నించింది. ఈసారి పాప మెల్లగా పెదాలు కదిపి పాలు తాగటం మొదలుపెట్టింది. అంతే అమ్మ సంతోషానికి అవధులులేవు. పాప నుదుటిని ముద్దాడింది.

”భగవంతుడా నీకు ధన్యవాదాలు, నాపాప క్షేమంగా వుంది. నేను చాలా అదృష్టవంతురాల్ని” ఒక పక్క పాప పాలు తాగుతోంది. మరో పక్క అమ్మ చెక్కిళ్ళపై కన్నీరు కారుతోంది. అమ్మకు ఇప్పుడెంతో ప్రశాంతంగా వుంది. ఎవరో తనకి మళ్ళీ జీవించటానికి అవకాశం ఇచ్చినట్లు అనిపిస్తోంది. సమీర అమ్మ కన్నీళ్ళను తన చిన్న వేళ్ళతో తుడిచింది.

‘అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అంతా బాగానే వుందా?’ అమ్మ సమీర నుదుటిపై ముద్దు పెట్టింది.

”చూడమ్మా ఇవి సంతోషంతో వస్తున్న కన్నీళ్లు, చూడు నీ చెల్లెలు పాలు తాగుతోంది. తను బాగానే వుంది. అందుకు నాకు చాలా ఆనందంగా వుంది.”

సమీర కూడా సంతోషంగా వుంది. కుండ తీసుకొచ్చి ఉయ్యాల కింద వుంచింది. అమ్మ పాపని తిరిగి గహ్వారాలో పడుకో బెట్టింది. ఇప్పుడు పాప కళ్ళు తెరిచింది.పాపని దుమ్ముకు దూరంగా వుంచటానికి గహ్వారాని ఖర్గాకి దూరంగా తీసుకెళ్ళింది సమీర. అమ్మకి కప్పులో టీపోసి ఇచ్చింది.

”దేవుడు నిన్ను దీవిస్తాడు, సమీర ఇంక పద తొందరగా అల్లి నేత పూర్తి చేయాలి. ఎంతో సమయం వృధా అయింది.”

సమీరకి చెల్లి గురించి ఆందోళనగా వున్నా, నేత నుంచి అనుకోని విరామం లభించటం వల్ల అలసట లేకుండా ప్రశాంతంగా వుంది. అందుకు కారణం పాప ధ్యాసలో పడి అమ్మ తనని ఎక్కువగా గమనించలేదు.

”అమ్మా చెల్లి ఎందుకు అంతసేపు నిద్రపోయింది? ఏం మందు ఇచ్చావు చెల్లికి నువ్వు?”

”ఇది నేను ఇచ్చిన నల్లమందు మోతాదు వల్ల వచ్చిన సమస్య” ఇవాళ మొతాదు ఎక్కువైంది. రేపట్నుంచీ నేను ఇచ్చే మోతాదు ప్రతి ఉదయం నీకు చూపిస్తాను. నువ్వు నాకు సాయం చేయాలి. ఆ మోతాదు ఒక గోధుమ గింజ పరిమాణం కంటే ఎక్కువ వుండకుండా చూడాలి.

”కానీ అమ్మా ఈ మందు చెల్లికి సరిపడకపోయినా ఎందుకు ఇవ్వాలి?”

”నువ్వు చంటిపాపగా వున్నప్పుడు నీకు కూడా ఇచ్చేదాన్నె, దీని వల్ల పాపాయిలు బాగా నిద్రపోతారు. లేకపోతే నీ చెల్లి రోజంతా మెలకువగా వుండి అల్లరి చేస్తే అమ్మ తన చిలిపి అక్కతో అంతపెద్ద తివాచీ ఎలా పూర్తి చేయించగలదు?”

అమ్మ నవ్వుకుంటూ పెద్ద కూతురి వంక చూసి నేత పని కొనసాగించింది. సమీర దీర్ఘంగా శ్వాస తీసుకుని నిట్టూర్చింది. తన ముందున్న ఖర్గాని చూస్తూ ఆలోచించ సాగింది. తన జీవితం అంతా ఆ మగ్గం ముందే గడపాల్సిందేనా? తనకి దాని నుండి స్వేచ్ఛ కావాలని వుంది. కాని అది సాధ్యపడదని, దాని నుండి విమోచనలేదని తెలుసు. తన భవిష్యత్తు అంతా తన కళ్ల ముందు కనబడుతోంది. అందులో తను తివాచీలు నేస్తోంది, నేస్తోంది, ఇంకా నేస్తూనే వుంది. చివరకు అమ్మ తన అయిదు వేళ్ళూ అయిదు దీపాలని చెప్పగానే తనొక తుర్క్‌మన్‌ అబ్బాయికి వధువు అవుతుంది. అప్పుడతని కోసం తివాచీలు నేసి పిల్లల్ని కని పెంచాలి.

సమీర లేచి వెళ్ళి రేడియో ఆన్‌ చేసింది. అందులో సంగీతం మొదలవగానే సౌండ్‌ పెంచింది. అమ్మతో అంది.

”మనమిలా జీవితమంతా ఈ చీకట్లోనే వుండాల్సొస్తే కనీసం మనకిష్టమైన సంగీతం వింటూ సంతోషంగా గడిపేద్దాం”. తల్లీ కూతుళ్ళు చిన్నగా నవ్వుకుని నేత కొనసాగించారు.

సమీర తల్లి బిడ్డకి నల్లమందు (ంచీరితిళీ) ఇవ్వడం వింతేమీ కాదు. విచారించగా నాకు తెలిసిందేంటంటే తివాచీ నేత కుటుంబాలలో చంటి పిల్లలను నిశబ్దంగా వుంచటానికి తరతరాలుగా పిల్లలకు రెండు మూడు సంవత్సరాలు వచ్చేవరకు నల్లమందు ఇచ్చి నిద్రపుచ్చే అలవాటుంది. ”ఆఫ్‌ఘన్‌ వుమెన్స్‌ అవర్‌”లో మేము ఒక డాక్టరును ఆహ్వానించి చంటి పిల్లలకు నల్లమందు ఇవ్వటం వల్ల వచ్చే అనర్థాలను వివరించమన్నాము. నల్లమందు వల్ల పిల్లల మెదడు, ఎదుగుదల, దీర్ఘకాల శారీరక మానసిక అభివృద్ధిపై దుష్ప్రభావాలు కలుగుతాయని ఆయన మాకు చెప్పారు. ఆఫ్‌ఘనిస్తాన్లో ఎక్కువ మంది ప్రజలు మత్తు మందులకు బానిసలవ్వటానికి ఇది ఒక ప్రధాన కారణం. అంతేకాక చంటి పిల్లలు గట్టిగా ఏడ్చి గోలచేయటం, నల్ల మందు ఇవ్వగానే నిద్రపోవటం అనేది వీరు చంటిపిల్లలుగానే మత్తు మందుకు బానిసలయ్యారనటానికి ఒక నిదర్శనమని ఆయన చెప్పారు.

దూరదృష్టవశాత్తు ఈ సమాచారమేదీ సమీర తల్లికి ఆప్పుడు అందుబాటులో లేదు. కానీ ”బిబిసి వరల్డ్‌ సర్వీస్‌ ట్రస్ట్‌” కోసం ”ఆఫ్‌ఘన్‌ వుమెన్స్‌ అవర్‌” కార్యక్రమంపై చేసిన సర్వేలో తెలిసిందేంటంటే ఎంతో మంది శ్రోతలు ఆమె పరిస్థితికి జాలి పడ్డారు. అంతేకాక శ్రోతలకు మేమీ సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతో మంది తల్లులు ఇకపై తమ పిల్లలకు నల్లమందు ఇవ్వటం మానేస్తామని, దానివల్ల కలిగే నష్టం ఏమిటో అర్థం అయ్యిందని చెప్పారు. నేనూ నా రిపోర్టరు కలిసి ఈ విషయాన్ని శ్రోతలకు చేరవేయగలిగినందుకు నాకు చాలా సంతోషమేసింది. కానీ మా ఇళ్ళలో అలంకరించిన తివాచీ నేసిన, నేస్తున్న మహిళల బాధను తగ్గించలేనని నాకు తెలుసు.

సమీర, ఆమెతల్లి, ఇంకా అటువంటి ఎందరో మహిళల కళా నైపుణ్యం, నిబద్ధత వల్ల ఆఫ్‌ఘనిస్తాన్‌ సాంప్రదాయ చేతి వృత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి. కానీ దాని కోసం వారు చెల్లించిన మూల్యం ఎటువంటిది? వున్ని వుండలను అందమైన తివాచీలు, కళాఖండాలుగా మలచటంలో దాగి వున్న సమీర, ఆమె తల్లి ఇంకా అటువంటి ఎందరో మహిళల వ్యధాభరిత జీవితాలను ఎవ్వరూ గుర్తించరు. ట్రోజర్లు అడిగినా ఆర్డర్లు సమయానికి అందించటానికి తల్లులు నల్లమందు పెట్టి తమ చంటి పిల్లలను నిద్రపుచ్చాల్సిన దుస్థితి గురించి ఎవ్వరూ ఆలోచించరు.

Share
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో