-వి.ఎస్‌.రమాదేవి

అయిదేళ్ళ సుశి, ఇంచుమించు తన ఈడు పిల్లే, సీత చేయి పట్టుకుని మంచి ఉషారుగా పరుగెత్తుకొచ్చింది ఇంటికి. చూస్తే ఇంటికి తాళం వేసుంది. ఒక్కసారిగా బిక్కముఖం వేసింది.

”మా యింటికి రా. మా అమ్మతో చెబుదాం” అని సీత సుశి చేయిపట్టుకు లాగింది.

ఇంటికి తాళం వేసి ఉన్నా, నోటికి తాళం వేసుకోలేనంత సంతోషంలో ఉన్న సుశి సీతతో పాటు పరుగెత్తింది, రెండిళ్ళ అవతల వున్న సీత ఇంటికి.

సీత గేటు తెరుచుకుని ‘అమ్మా మరే’ అంటూ గబగబా హాలులోకి పరుగెత్తింది.

”అమ్మా” అని తనకుకూడ నోటిదాక వచ్చి నోరు తెరచుకుని అలాగే ఉండిపోయింది సుశి.

‘అమ్మా, మరే నాకు సుశికి డబుల్‌ ప్రమోషన్‌ వచ్చిందే. మేం మూడో క్లాసులోకి వచ్చేశాం… మా యిద్దరికే వచ్చిందే. సుశి ఫస్టు, నేను సెకండు” అని ఒగుర్చుకుంటూ, గట్టిగా ఊపిరిపీలుస్తూ చెప్పింది సీత.

”మా అమ్మే!” అంటూ సీతబుగ్గమీద ముద్దు పెట్టుకుంది తల్లి. ఎందురుగా తెల్లబోయి చూస్తూనుంచున్న సుశిని చూస్తే సీతతల్లికి ఎక్కడ లేని జాలీ పుట్టుకొచ్చింది. ”సుశీ… రా తల్లీ! నా దగ్గరకు రా అమ్మా” అని చేతులు చాచింది.

కొద్దిగా సంకోచిస్తున్నట్టుగ అడుగులు బరువుగా వేస్తూ దగ్గరకు వెళ్ళింది.

సుశి తలని ముద్దుపెట్టుకుని ”నీకు ఫస్టొచ్చిందా… మా సుశి ఎంత తెలివైందని” అంటూ ముద్దుచేసింది సీత తల్లి. ”మీ అమ్మే వుంటే ఎంత మురుసుకునేదో’ అనుకుంది లోన సీతతల్లి.

‘అమ్మా, మరే సుశీ వాళ్ళింటికి తాళంపెట్టి వుందే….” అంది సీత తల్లి కొంగు వేలుకుచుట్టుకుని.

”వుంటే ఏం మనింటిలో వుంటుంది చక్కగా… ఇద్దరూ ఉప్మా తిందురుగా వుండండి” అంటూ వంటగదిలోకి వెళ్ళింది సీతతల్లి.

ఉప్మా తింటోందేకాని, సుశికి ఏదో దిగులు వేసింది. ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. అందుకని ప్లేటులోది గబగబా తినేసి తన ఇంటికేసి పరుగెత్తింది. సీత వెనకనుంచి కేకేస్తున్నా వినిపించుకోకుండా.

ఇంకా తాళంవేసేవుంది. చీడీలెక్కి పై చీడీ మీద కూర్చుంది. రెండు చేతుల్లో గడ్డం పెట్టుకుని ఏడుస్తూ అక్క కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.

ఇంతలో అక్క వనజ వచ్చింది కాలేజి నుంచి, సుశిని అలా చూడగానే వనజకు కడుపులో కెలికినట్టయింది. అమ్మ లేని లోటు కొట్టోచ్చినట్టు కనపడింది. కట్టలు త్రెంచుకొని ఏడుపొచ్చింది. అయినా ఆపుచేసుకుని ”సుశీ… అప్పుడే వదిలేశారా మీ బడి… రిపోర్టిచ్చారా నీకు? అలా ఉన్నా వేం అమ్మా” అంది సుశిని లేవదీస్తూ.

ఏం చెప్పకుండా వనజకాళ్ళను చుట్టేసుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది సుశి.

ఏవమయిందమ్మా స్కూల్లో.. లోనికి పద… చెబుదువుగాని” అంటూ తాళం తీసి లోనకు తీసుకువెళ్ళింది వనజ.

కొంచెంసేపటికి అక్క ఓదార్పుకి తేరుకుని ”నాకు డబుల్‌ ప్రమోషన్‌ వచ్చింది. చెబుదామంటే, ఇంట్లో ఎవ్వరూ లేరు..” అంది సుశి.

”నిజంగానా! నాన్న రాగానే చెబుదాం. ఫస్టు రాంక్‌ నీదేనా?” అంది వనజ సంతోషంగా

”ఊ, నాదే. సెకండేమో సీతకొచ్చింది.”

”పోనీ ఇంటికి తాళం పెట్టి ఉంటే, సీతావాళ్ళింటిలో కూర్చోలేకపోయావా నేనొచ్చేవరకూ.”

”అక్కడికే వెళ్ళాం సీత. నేను… ఉప్మాకూడ తిన్నాం… సీత వాళ్ళమ్మతో చెప్పింది తనకు డబుల్‌ ప్రమోషన్‌ వచ్చిందని” అంది మళ్ళీ బిక్క ముఖం వేస్తూ సుశి.

”నువ్వు నాతో చెప్పావుగా. నాన్న గారొచ్చాక చెబుదాం” అంది వనజ. సుశి మళ్ళీ తల్లి సంగతి ఎత్తుతుందేమోనని లోలోనే భయపడుతూ.

”మరి మన అమ్మేదీ?… అప్పుడు ఊరుకెళ్ళిందని చెప్పావుగా…. ఇంకా ఎప్పుడొస్తుందేమిటి?”

”వచ్చేస్తుందమ్మా…. తొందరగా వచ్చేస్తుంది…. నువ్విట్లా క్లాసులో ఫస్టు మార్కులు తెచ్చుకుని డబుల్‌ ప్రమోషన్లు తెచ్చుకుంటుంటే దబ్బున వచ్చేస్తుంది.”

”ఊ… ఏంరాదు. మొన్న నాకు జ్వరం వచ్చినప్పుడు కూడ రాలేదుకాని, సీతకి జ్వరంవస్తే వాళ్ళమ్మ నాన్‌రొట్టి పెట్టి పాలు ఇచ్చింది. కథలు చెప్పింది….”

”మరి సీతా వాళ్ళమ్మ ఊరుకెళ్లలేదుగా. ఇక్కడే ఉందిగా. అందుకని నాన్‌రొట్టి పెట్టి, పాలు ఇచ్చింది… మన అమ్మ ఊరు వెళ్ళిందిగా… ఇక్కడ లేదుగా. అందుకని నీకు నే నిచ్చాను.”

”నిన్నిమ్మని చెప్పిందా అమ్మ నాకు జ్వరంవొస్తే.”

”ఊ… ‘సుశి అడిగినవన్నీ ఇయ్యి. నే నొచ్చేవరకూ జాగ్రత్తగా చూడు’ అని చెప్పింది” అంది వనజ గొంతులో వచ్చిన గద్గదాన్ని విశ్వప్రయతంతో అణచుకుంటూ.

”ఇంకెప్పుడొస్తుందేంటి అమ్మ… నువ్వెప్పుడూ అబద్దాలు చెబుతావు. నేను నాన్ననే అడుగుతాను” అంది సుశి.

అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన సుశి తండ్రి చెవిన ఆ మాటలుపడి కాళ్ళ చెప్పులయినా విడవకుండా అలాగే అక్కడ కుర్చీలో కూర్చుండిపోయాడు. అంతవరకు అతి ప్రయత్నంతో కన్నీళ్ళు ఆపుకుంటూ వచ్చిన వనజ తండ్రిని చూడగానే ఇక నిబ్బరంగా ఉండలేకపోయింది. తనూ పసి దానిలా ”నాన్నా’ అని కళ్ళు పమిటకొంగుతో మూసుకుంది ఏడుస్తూ. తండ్రి… లేచివచ్చి ఇద్దరు పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు.

”అక్కా, ఆకలి మండిపోతోందే. ఏదైనా టిఫిన్‌ పెట్టు” అంటూ పదేళ్ళ రామూ బుజాన పుస్తకాల సంచీతో పరుగున వచ్చాడు. తండ్రీ, అక్క, చెల్లెలు అలా విచారంగా ఉండటం చూస్తే రామానికి ఎక్కడలేని విచారం ముంచుకొచ్చింది.

”అన్నయ్యా… నాకు డబుల్‌ ప్రమోషన్‌ వచ్చిందిగా, అందుకని అమ్మ దబ్బునవచ్చేస్తుందని చెప్పింది అక్క” అని గబగబా తండ్రిచేయి తప్పించుకుని రామూ దగ్గరకు పోయి అన్న చేయి పట్టుకుంది.

తండ్రి కన్నీళ్ళు జేబురుమాలాతో ఒత్తుకుంటూ వీధి గుమ్మంవైపు వెళ్ళిపోయాడు. వనజ టిఫిన్‌ చేయడానికి వంటింటివైపు వెళ్ళింది.

”అన్నయ్యా… దబ్బునంటే రేపొచ్చస్తుందా అమ్మ?” అనడిగింది సుశి.

”అక్కయ్యా ఊరికే చెప్పింది. అమ్మ రాదు. చచ్చిపోయిందిగా.”

”అంటే?” అంది. ఒక వేపు నుంచి నిజంగానే అమ్మ రాదేమోననిపించింది. అంటే అమ్మని ఆ రోజు వాళ్ళు మోసుకువెళ్లిపోయారే.. అప్పుడు మనం అందుకే ఏడ్చాం” అన్నాడు రాము. చచ్చిపోవడం అంటే తాను చెప్పవలసిన అర్ధం అదొక్కటే కనుక.

”కాదులే, నీకు తెలియదు. అమ్మ వచ్చేస్తానని చెప్పిందట అక్కయ్యతో” అంది మళ్ళీ సుశి.

”నీ ఇష్టం. నువ్వు నమ్మితే నమ్ము అక్క మాటలు… నువ్వు చిన్నపిల్లవు. ఏడుస్తున్నావని అలా చెబుతుందక్క”.

”నువ్వు పెద్దాడివేమిటి?”

”ఆ… చూచుకో నే బూట్లు కూడా వేసుకున్నాగా”

”అయితే నేనూ వేసుకున్నాగా”

” అయితే నాకు పెన్నుంది… నీకుందా?”

”నాకు పెన్సిలుందిగా”

”అదేమరి. పెద్దవాళ్ల దగ్గర పెన్నులు కూడా ఉంటాయి. చిన్నవాళ్ళకి వట్టి పెన్సిళ్ళే వుంటాయి.”

”అయితే నేనూ అడుగుతానుండు నాన్నని పెన్ను కొనిపెట్టమని” అంటూ పరుగున వీధి గుమ్మంలోకి ”నాన్నా” అంటూ పరుగెత్తింది సుశి.

శూన్యంలోకి చూస్తూ నుంచున్న సుశితండ్రి ”ఏవమ్మా సుశీ” అని చేతుల్లోకి తీసుకుని ఎత్తుకున్నాడు.

”నాన్నా మరి నాకు పెన్ను కొనిపెట్టవూ” అంది తండ్రి కోటు జేబులోంచి పెన్ను తీస్తూ.

”తప్పకుండానమ్మా” అన్నాడు తండ్రి.

”నాన్నా, నువ్వు కొనిపెట్టకపోతే, రేపు అమ్మొస్తుందిగా. అమ్మతో చెబుతాను” అంది బుంగమూతి పెట్టుకుంటూ.

”ఓ… అట్లాగే చెబుదువుగాని…. పదమ్మా అక్క టిఫిన్‌ చేస్తోంది… తిందాం.” అంటూ వంటింటిలోకి తీసుకొచ్చాడు.

చాటలో ఉప్మారవ్వ పోసుకుని పురుగులేమన్నా ఉన్నయ్యేమోనని చూస్తున్న వనజని చూసి ”అక్కా, చూడు అన్నయ్య అంటున్నాడు అమ్మరాదని… నువ్వు అబద్దం చెప్పావంట నాకు” అంటూ ఫిర్యాదు చేసింది.

”లేదమ్మా తప్పకుండా వస్తుంది… రేపు అమ్మకి ఒకవేళ జ్వరం వస్తే జ్వరంతగ్గాక వచ్చేస్తుంది. మరి నువ్వు మారాం చేయకుండా చదువుకుంటే నీకు బిళ్ళలు, బిస్కట్లు, పెన్నులు, పెన్సిళ్ళు అన్నీ తెస్తుందట” అన్నాడు తండ్రి సమాధానపరుస్తూ.

”నేను మారం చేయకుండా చదువుకుంటాను.. మరి అమ్మని దబ్బున రమ్మంటావా?”

”ఆ దబ్బున తీసుకొచ్చేస్తాను రేపు నే వెళ్ళి”

”అమ్మో… నువ్వు కూడా వెళ్ళి రాకపోతే అమ్మలాగ”

”నేను తప్పకుండా వస్తాగా”

”పోనీ నాన్నా, అమ్మనిరమ్మని ఉత్తరం రాసేయ్‌ సుశి ఏడుస్తోందని” అంది వనజ మూకుడ్లో రవ్వవేసి గరిటతో తిప్పుతూ.

”ఆ బాగా చెప్పావమ్మా… ఇవాళే వ్రాసేస్తాను ఉత్తరం. సుశికి డబుల్‌ ప్రమోషన్‌ వచ్చేసింది. వెంటనే వచ్చెయ్‌ అని.”

”తిరుగొచ్చేస్తుందా మరి”

”ఆ .. వచ్చేస్తుందమ్మ.. నీకు అక్షరాలు వచ్చుగా… అందుకని. ‘దేవుడి తాతయ్యా… మా అమ్మని వెంటనే పంపేయ్‌’ అని నువ్వు కూడ ఒక కార్డు మీద వ్రాసెయ్‌ దాంతో దేవుడుతాత ‘నువ్వెళ్లు, పాపం సుశి నీ కోసం ఏడుస్తోందట’ అని అమ్మని పంపేస్తాడు” అంది వనజ.

”మరి అమ్మకి జ్వరంవచ్చినా పంపేస్తాడా?”

”ఆ .. జ్వరం నయమయిన వెంటనే పంపేస్తాడు” అంది వనజ నమ్మబలుకుతూ.

సుశి గబగబా తన పుస్తకాల అలమారుదగ్గరకు వెళ్ళి కాపీ పుస్తకం తెచ్చి దాంట్లో ”దేవుడు తాతయ్యా.. అమ్మని దబ్బున పంపు” అని వ్రాసింది.

తండ్రి ఇక అక్కడ నిలవలేక ”ఇప్పుడే వస్తాను” అని బయటకు వెళ్లిపోయాడు. అటూ ఇటూ తిరిగి, దుఃఖం దిగమ్రింగుకు రావడానికి.

తండ్రి వెళ్లగానే వనజ సుశిని వళ్ళో కూర్చోబెట్టుకొని ”మంచిపాపవుగా నువ్వు… ఉప్మా తినేసి ఆడుకో.. నువ్వు అస్తమానం అమ్మకోసం ఏడిస్తే అసలు దబ్బున రాదు. ఇంకో అయిదురోజుల్లో నీ పుట్టినరోజు పండగ కదూ… ఆ రోజున అమ్మ తప్పకుండా వచ్చేస్తుంది. అందాక నువ్వు చక్కగా ఆడుకోవాలి” అంది.

”అమ్మ రాకపోతే, దేవుడితాత దగ్గరికి నాన్నెళ్ళి తీసుకొస్తాడా… అప్పుడు సీత వాళ్ళమ్మ దేవుడి తాత దగ్గరకు వెళితే వాళ్ల నాన్న వెళ్ళీ తీసుకొచ్చాడుగా.”

”సీతవాళ్ళమ్మ దేవుడితాత దగ్గరకు వెళ్ళలేదమ్మా. వాళ్ళ తాత ఇంకొక తాత. బెజవాడలోనే ఉంటాడు. మన దేవుడు తాత చాలా దూరంలో ఉంటాడు. ఆకాశం చూడు” అని కిటికీ దగ్గరకు తీసుకువెళ్ళి చూపింది వనజ.

”అక్కడుంటాడా?”

”ఊ… మేఘాలు తిరుగుతున్నాయి చూశావా వాటి వెనక ఉంటాడు. నువ్వు ఉత్తరం వ్రాశావుగా.. అది అమ్మకందుతుంది. బట్టలన్నీ పెట్టెలో పెట్టుకుని అమ్మ సిద్ధంగా ఉంటుంది. అమ్మకి ఒక్కత్తికే అంతదూరం నుంచి రావడానికి భయంగా. అందుకని నాన్న ఎల్లుండి వెళ్ళి అమ్మని తీసుకొచ్చేస్తాడు” అని నచ్చ చెప్పింది.

మూడవరోజు తండ్రి ప్రయాణమై వెడుతుంటే, ”నాన్నా, నేనూ వస్తాను నీతోపాటు అమ్మ దగ్గరికి” అని మారాంచేసింది సుశి.

”నే తీసుకొస్తాగా తప్పకుండా, చిన్న పిల్లల్ని ఆ వూరు రానియ్యరు” అని నచ్చజెప్పి వెళ్ళిపోయాడు.

ఆ రోజు మరుసటిరోజు ”నాన్న, అమ్మ ఇంకెప్పుడొస్తారు. ఇంకెప్పుడొస్తారు” అంటూ పదేపదే అడుగుతూ వీధిగుమ్మంలోకి ఇంట్లోకి తిరుగుతూ గడిపింది సుశి.

మధ్య మధ్యలో సీతావాళ్ళింటికి వెళ్ళి ”సీతా, నేను దేవుడి తాతయ్యకు ఉత్తరం వ్రాశాగా మా అమ్మని పంపమని.. మా నాన్న తీసుకురావడానికి వెళ్ళాడు… అమ్మ వచ్చేస్తుంది. మా అమ్మ బోలెడన్ని పెన్నులు, చాక్లెట్లు తెస్తుందట. మనిద్దరం పంచుకుందాము. మా అన్నయ్యకివ్వొద్దు” అంటూ ఎంతో సంబరపడుతూ ఏవేవో కబుర్లు చెబుతుంటే సీతతల్లి కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి.

”ఆ వచ్చే ఆవిడ ఎలాంటిదొస్తుందో! మంచిదై పిల్లల్ని బాగా చూచుకుంటే బాధపడదు” అనుకుంది మనసులో.

ఆదుగో మానాన్న, అమ్మ అంటూ వీధిలో టాక్సీ వెళుతుంటే గబగబా పరుగెత్తింది సుశి తన ఇంటివైపుకి. ”అక్కా.. అక్కా” అంటూ గట్టిగా కేకలు పెట్టి పిలిచింది.

ఇంతలో తండ్రి, తరువాత ఎవరో క్రొత్తావిడ దిగారు… ఇంకా నెమ్మదిగా కారులోనుంచి ఎవరెవరో దిగుతున్నారు. సుశికేకలు విని ఇంట్లోనుంచి పరుగెత్తుకువచ్చిన వనజ సుశిమెడచుట్టూ చేతులువేసి దగ్గరగా తనకాన్చుకుని నుంచోబెట్టుకుని, నెమ్మదిగా చెవిలో ”అదుగో నాన్న ప్రక్కన నుంచుందే.. ఆవిడే మన అమ్మ. అమ్మకి జ్వరం వచ్చిందికదూ.. అందుకని అలా అయిపోయింది. అమ్మ ఎన్నో రోజలయిపోయింది కదూ ఆ ఊరువెళ్ళి… అసలా ఊరువెల్ళి అన్ని రోజులుంటే అట్లాగే జ్వరంవచ్చి మారిపోతారంట” అని చెప్పింది. ఆ మాటలు వింటూ ఆ క్రొత్త అమ్మవంక అలాగే తెల్లబోయి చూస్తూ ఉండిపోయింది సుశి.

(నూరేళ్ళ పంట, రచయిత్రల కథా సంకలనం, భార్గవీరావు)

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.