-క. సుభాషిణి

ప్రత్యక్షంగా, పరోక్షంగా స్త్రీలపై జరిగే హింస వివిధ రూపాల్లో వుంటుంది. శారీరక హింస, మానసిక హింస, లైంగిక హింస, నైతికంగా దిగజార్చడానికి ప్రయోగించే హింస, ఆర్థికపరమైన హింస, కుల, మత, జాతుల పేరిట స్త్రీలపై జరిగే హింస, ఆత్మహత్యలను ప్రేరేపించడానికి జరిగే హింస యిలా చెప్పుకుంటూపోతే ఎన్నో…! వయసు, ప్రాంతం తేడా లేకుండా స్త్రీలందరూ బాధితులే.

స్త్రీలపై జరిగే యిన్ని రకాల హింసలు భూమిమీద ఏ ప్రాణి మీద కూడా జరగవు. ఒక పురుషుడు బయటి ప్రపంచంలో ఎంత దోపిడికి, హింసకు గురి అవుతున్నప్పుటికీ యింటి విషయం వచ్చేటప్పటికి తనయింటిలో తనతోపాటు బ్రతుకుతున్న స్త్రీలపైన పెత్తనం చేలాయించటం తన సహజ హక్కు అనుకుంటాడు.

రాష్ట్రంలోని యితర ప్రాంతాలతో పోల్చి చూస్తే వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు ఒక ప్రత్యేకమైన ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక జీవనం వున్నది. ఈ ప్రాంతంలో స్త్రీలు ప్రకృతి ద్వారా కూడా హింసను ఎదుర్కొవాల్సి వస్తుంది. రాయలసీమలోని నాలుగు జిల్లాలల్లోనూ భారతదేశ సగటు వర్షపాతం కన్నా చాలా తక్కువ. నీళ్ళే నాగరికత. నీళ్ల వాడకాన్ని బట్టి వాళ్ల ఆర్థిక, సాంఘీక జీవితాలను అంచనా వేయచ్చు అంటారు. ఇక్కడ నీళ్లే అపురూపం ఇప్పటికి ఎవరైనా ఒక చెంబెడు నీళ్లు వృధాగా పారేస్తే విలవిల్లాడే వృద్ధులు ఇక్కడ కనిపిస్తారు. తాగే నీళ్ళ కోసం ఎక్కడ నీటి ఊట వుంటే అక్కడ గంటల తరబడి ఎదురు చూసి ఊరే నీటిని తోడుకోని బిందెలల్లో నింపుకొని వాటిని నెత్తిమీదపెట్టుకొని కాళ్లీడ్చుకుంటునో, సైకిళ్లకు కట్టుకొని వాటిని తోసుకుంటూ వెళ్లే దృశ్యాలు యిప్పటికీ ఈ ప్రాంతాలల్లో కనిపిస్తాయి. నీటి ఎద్దడి, కరువు ప్రభావాలతో అల్లకల్లోలమై జీవితాల్లో సుఖాన్ని, శాంతిని కొల్పోయి నిరంతరం ఘర్షణకు గురి అవుతున్న రాయలసీమ స్త్రీల జీవితాలను కథల రూపంలో బయటి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ఇక్కడి రచయితలు చేసారు.

వేళాపాళ లేకుండా వచ్చే నీటి సరఫరా వలన పట్టణ స్త్రీలు నీళ్ల కోసం నిద్రను త్యాగం చేయాల్సివస్తోంది. ఒకానొకప్పుడు వీధి కోళాయిల దగ్గర, ప్రస్తుతం నీళ్ళ ట్యాంకుల దగ్గర స్త్రీలు తమ తోటి స్త్రీలతో యుద్ధం చేస్తూనే వుంటారు. పోరాటం చేస్తేనే వాళ్లకు నీళ్లు దక్కేది. వీధి కొళాయి దగ్గర ఒక బిందె కోసం ఇద్దరాడవాళ్ల మధ్య తలెత్తిన కొట్లాట మగవాళ్ల మధ్య యుద్ధం అయ్యింది అంటారు. కథా రచయిత స్వామి ”నీళ్లు” కథలో (1991), (సీమ కథలు, కథల సంకలనం, 1992, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌). ఈ కథలో అన్నం తిని, తాగే నీళ్లతో చేతులు కడుక్కుంటున్న కొడుకును తల్లి చావబాదుతుంది. ఎందుకంటె బిందె నీళ్లు సంపాదించాలంటే ఎంత యాతనపడాలో, ఎంత పోరాటం చేయాలో ఆ తల్లికి మాత్రమే తెలుసు. గొంతు తడుపుకోటానికి గుక్కడు నీళ్లు లేక చనిపోయిన ముసలిదాని మరణం. ముసలిది చనిపోయింది అన్న విషయాన్ని గ్రహించలేకపోతుంది పసిపిల్ల పోలి. అవ్వ కోసం చెంబెడు నీళ్ళు సంపాదించటానికి ఇల్లిల్లు తిరిగి ఎవ్వరు యివ్వకపోతే కోనేట్లో చెంబు ముంచడానికి పోయి భయంతో కోనేట్లో మునిగి చనిపోయిన పోలిలాంటి మనుషులను దాదాహయత్‌ ”గుక్కెడు నీళ్ళు” కథలో చూస్తాం (1985), సీమకథలు, కథల సంకలనం, 1992, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌). కథ చదివిన పాఠకుల గొంతులు దాహంతో పిడచకట్టుకుపోతాయి. వేసవి కాలంలో నీటి ఎద్దడి వున్న ప్రాంతాలకు నీళ్ల ట్యాంకులు పంపుతారు. ఆ పథకాలు నీటి కష్టాలను పూర్తిగా తీర్చడానికి ఏ మాత్రం సరిపోవు అన్న విషయాన్ని మిగిలిన సమాజం గుర్తించాలి.

తాగేనీళ్ళ కోసమే యిన్ని తిప్పలు పడే రాయలసీమ ప్రజలకు యిక వ్యవసాయం చేసుకోడానికి నీళ్లు ఎక్కడ నుండి వస్తాయి? పిలిచినా, పిలవకపోయిన ఈ ప్రాంతానికి తరుచు వచ్చే అతిధి కరువు. సకాలంలో వర్షాలు రాక, వున్న వూర్లల్లో పనులు లేక వ్యవసాయ కూలీలుగా వలస పోవటం యిక్కడ పరిపాటి. ఊర్లకు ఊర్లే ఖాళీ అవుతుంటాయి. వలసపోయిన ప్రాంతాలల్లో నివాసం వుండటానికి అనుకులంగా వుంటే సంసారాలు మొత్తం వలసపోతుంటాయి. ఆ సౌకర్యం లేనప్పుడు పనిచేయగలిగే మగవాళ్లు మాత్రమే వలస వెళ్తారు. యిక ఇంటిలో మిగిలిపోయిన వృద్ధులు, పిల్లల సంరక్షణ భారం పూర్తిగా స్త్రీల మీదేపడుతుంది. మామూలుగానే పేద కుటుంబాలల్లో సంసార భారాన్ని స్త్రీలే ఎక్కువ మోస్తుంటారు. ఎందుకంటే మగవారి సంపాదనలో ఎక్కువ భాగం కల్లు, సారా, చీప్‌ లిక్కరే మింగేస్తుంటాయి. ఒకవైపు కుటుంబ ఆర్థిక భారం మోస్తూ, యింకొక వైపు వలసపోయిన మగవారి క్షేమసమాచారం పట్ల క్షణ క్షణం ఆందోళన పడుతుంటారు. చక్రవేణు వ్రాసిన ”కసాయి కరువు” (1986), (సీమ కథలు, కథల సంకలనం, 1992, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌). కథలో తాగడానికి నీళ్లు, పశువులకు గడ్డి, మనుషులకు తినడానికి తిండి లేని గడ్డు పరిస్థితులల్లో నాగమ్మ భర్త వలస పోతాడు. తీవ్ర జ్వరంతో పడిపోయిన కూతుర్ని కాపాడుకోడానికి కొడుకుకు ఎంతో ఇష్టమైన కర్రావును బెంగుళూరు కబేలాకు అమ్మేస్తుంది నాగమ్మ. కర్రావు మీద బెంగతో కొడుకు జ్వరం తెచ్చుకుంటాడు. కర్రావు అమ్మకుంటే కూతురు ఆరోగ్యం నయం కాదు అమ్మితే కొడుకు ఏమయిపోతాడో అనే ఆలోచనతో నాగమ్మ నలిగిపోతుంది. సమయానికి తనకు అండగా పక్కన వుండవలసిన భర్త లేకపోవడంతో అతని గురించి దిగులు పడుతూ ఎక్కడ వున్నాడో ఏం తింటున్నాడో అని భర్తను తలుచుకుంటూ తీవ్రవేదనకు గురి అయ్యే నాగమ్మలాంటి స్త్రీలు ఎందరో! కరువు అయిన వాళ్లను దూరం చేయడమే కాకుండా భార్యభర్తలను కూడా దూరం చేస్తుంది.

ఊర్లో పనులు లేక కొడుకు, కోడలు వలసపోతే కుంటి భర్త, కొడుకు పిల్లల కోసం ముసలి వయసులో రేయింబగలు రెక్కలు ముక్కలు చేసుకోనే ఈరమ్మను ”కరువెవరికి” (కె. సుభాషిణి, మర్మమెల్ల గ్రహించితి తల్లీ, కథా సంకలనం, 2008, స్ఫూర్తి ప్రచురణలు) కథలో చూస్తాం. అంకిరెడ్డి యింట్లో పశువుల పని అయిపోగొట్టుకొని, బడిదగ్గర చిన్న పిల్లలకు తినుబండారాలు అమ్ముతూ ఇల్లు నెట్టుకొస్తోంటుంది ఈరమ్మ. బడికి సెలవులు యిస్తే ఆ వచ్చే చిల్లర ఆదాయం కూడా లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది అని ఈరమ్మ భయపడుతుంది. ”తిండి తిన్నా, తినకపోయినా అందరం ఒకేచోట పడింటాం…” అని కసాయి కరువు కథలో నాగమ్మ అనుకుంటుంది. నాగమ్మలాగే కరువెవరికి కథలో ఈరమ్మ కూడా అదేరకంగా ఆలోచిస్తుంది. అయితే నాగమ్మలాగా ఈరమ్మ బేల మనిషి కాదు. ”ఈన్నే అందరంవుంటె.. వున్న కాటికి తింటాము… లేకపోతే అందరం పస్తులతో సత్తాం… యిన్ని బియ్యంనూకలు సంపాదించు కోలేక సావాల్నా.. ఎందుకు సావాలా…” (మర్మమెల్ల గ్రహించితి తల్లీ కథా సంకలనం, పుట 66) అని మొండి ధైర్యం తెచ్చుకున్న ఈరమ్మకు పనికి ఆహార పథకం కింద అంకిరెడ్డి ఇంట్లో పేర్చిన బియ్యం బస్తాలు గుర్తుకు వస్తాయి. ఆ బియ్యం దక్కించుకోడానికి కరువుదాడి వ్యూహరచన చేస్తుంది ఈరమ్మ.

కరువుతో బడుగు జీవుల జీవితాలు చిన్నాభిన్నమై చీకట్లు అలుముకుంటే అదే కరువు గుప్పెడు పెట్టుబడిదారుల సంపదను మరింత పెంచుతుంది అన్నది పచ్చి నిజం. దీనికి నిదర్శనం ఆదాయానికి మించిన రెవెన్యూ అధికారుల సంపద, మార్కెట్టును తమ చేతుల్లో పెట్టుకొని ఆడించే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులను చూస్తే తెలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాలకంటే కూడా రాజకీయనాయకులు, మార్కెట్టు సృష్టించే కరువు యింకా భయంకరమైనది. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయట పడేదారి కానరాక ఆత్మహత్య చేసుకున్న వరదప్ప అనే రైతు జీవితమే స్వామి రాసిన ‘రంకె’ (2009 ఏప్రిల్‌, 22-29 ఆదివారం వార్త) కథ. వరదప్ప ఆత్మ భార్య, కూతురు, కొడుకు పడే కష్టాలను నిస్సహాయంగా చూస్తువుంటుంది. అప్పులు తీర్చడానికి వున్న రెండు ఎద్దులలోఒక ఎద్దును అమ్మేస్తుంది అతని భార్య. యింకొక ఎద్దును కొనలేక ఎద్దు స్థానంలో కాడిని తమ మెడమీద మోపుకొని విత్తనాలు వేస్తారు భార్య, కూతురు. ఆత్మహత్య చేసుకున్న రైతుల భార్యల పరిస్థితి ఎలా వుంటుందో వరదప్ప భార్యను చూస్తే తెలుస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్త్రీలను సానికొంపలు డేగ కళ్లతో వెతుకుతుంటాయి. పట్టణంలో కాయగూరలు అమ్ముకుంటున్న భార్య ఎక్కడ సానికొంపల వాళ్ల కబంద హస్తాల్లో చిక్కుకుంటుందో అని వరదప్ప ఆత్మ తల్లడిల్లిపోతుంది. ఆత్మహత్య చేసుకున్నందుకే కదా తన భార్యకు ఈ కష్టాలు అని తనను తాను తిట్టుకుంటుంది వరదప్ప ఆత్మ. కుటుంబాలను ఋణ భారం నుండి విముక్తులను చేయడానికో, పిల్లల కడుపులు నింపి వాళ్ల ఆకలిని తీర్చడానికో విధిలేని పరిస్థితుల్లో కొంతమంది స్త్రీలు అనివార్యంగా వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్నారు. భార్యనే వ్యభిచార వృత్తిలోకి దింపే చినబ్బలాంటి భర్తను చక్రవేణు వ్రాసిన ”కువైట్‌ సావిత్రమ్మ” (తెలుగు కథకి జేజే! కథల సంకలనం, 2007, అభినవ ప్రచురణలు) కథలో చూస్తాం. ఆకస్మాత్తుగా సావిత్రమ్మ భర్త చనిపోతే భర్త తరపు వాళ్లు ఆదుకోకపోగా ఆమెను బెదరించి, భయపెట్టి లొంగదీసుకుంటాడు ఆమె మరిది చినబ్బ. తర్వాత అతనే పంచాయితి పెట్టించి సావిత్రమ్మను వూరి నుండి వెళ్లగొడతాడు. రెహమాన్‌ సహాయంతో కువైట్‌ చేరుకొని అక్కడ డబ్బులు సంపాదించి పిల్లలకు ఘనంగా పెండ్లి చేస్తుంది సావిత్రమ్మ. వూరందరికి తెలుసు కువైటులో సావిత్రమ్మ ఏం చేసి డబ్బులు సంపాదించిందో. వదిన వెంట భార్య రామల్ష్మమ్మను కూడా కువైటుకు పంపి అక్కడ భార్య సంపాదించే డబ్బులతో సంసారం పైకి తీసుకురావాలనుకుంటాడు చినబ్బ. అసలు విషయం తెలియని రామలక్ష్మిమ్మకు సావిత్రమ్మ కువైట్లో చేయాల్సిన పని గురించి చెబుతూ” నాకు ఎందునా యిదిలేక, బిడ్డల్ని పస్తులు పండుకోమని చెప్పలేక, వాళ్ల తిండి కోసమని, కానికూడని పనికి కక్కుర్తిపడితే, ఇప్పుడు నీ మొగుడు తెలిసి కూడా అతనే నిన్ను వ్యభిచారంలోకి దింపుతాన్నాడు. (తెలుగు కథకి జేజే! కథల సంకలనం, 2007 అభినవ ప్రచురణలు పుట 128)” అన్న సావిత్రమ్మ మాటలతో ఆమె వొళ్లు బలిసి చేస్తున్న పనికాదని, పిల్లలను బ్రతికించుకోడానికి ఈ పని చేసిందని తెలుస్తుంది. గత్యంతరంలేక సావిత్రమ్మ, మొగుని హింస తట్టుకోలేక రామలక్ష్మమ్మల మాదిరిగా కడప జిల్లాలో ఎందరో స్త్రీలు కువైటుకు వెళ్లి అక్కడ అనుభవించే క్షోభ అంతాయింతా కాదు.

ఏ మనిషికైనా బ్రతకడం ముఖ్యం. అందులోనూ తన కళ్ల ఎదురుగా పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే చూస్తూ చూస్తూ చేతులారా తన పిల్లలను తనే ఏ తల్లి చంపుకోదు. ఎంత కష్టం చేయడానికైనా సిద్ధపడుతుంది. ఈ సమాజంలో స్త్రీ శక్తి మీద కంటే ఆమె శరీర భాగాలపైననే వ్యాపార వర్గాలకు ఆసక్తి. వాటితో వ్యాపారం చాలా లాభదాయకం. పనులు దొరకని పేద స్త్రీలను ఎర వేసి తమ గాలంలో పడేట్టుగా చేసుకొని వారిని వ్యాపార నిమిత్తం వూరూరు తిప్పుతుంటారు. ప్రేమ పేరుతో అమాయక ఆడపిల్లలకు మాయమాటలు చెప్పుతూ, వస్తువులను ఆశగా చూపెడుతూ అరచేతిలో స్వర్గం చూపెట్టి చివరకు ఆడపిల్లలను ఆంగడి బొమ్మలుగా మార్చేస్తున్నారు. ఒకసారి సాలెగూటి లాంటి ఆ రొంపిలోకి దిగాక అందులో నుండి బయట పడటం అసంభవం. చిన్న వయస్సులోనే శక్తి అంతా హరించుకొనిపోయి రకరకాల రోగాలతో చావలేక జీవచ్చవాలుగా బ్రతుకు వెళ్ళదీస్తుంటారు. అంతవరకు ఆ సంపాదన మెదనే ఆధారపడిన కుటుంబం రోగిష్టి అయిన తర్వాత ఆ స్త్రీని చేరదీయడానికి వెనకంజ వేస్తారు. కరువుకోరలకు చిక్కి, ఖాళి కడుపులతో అలమటించి చేతిలో నయాపైసా లేక వ్యభిచార వృత్తిలోకి బలవంతంగానెట్టివేయబడి రకరకాల రోగాలు తెచ్చుకుంటున్నరాయలసీమ పల్లెస్త్రీల గాథలకు ఆక్షర రూపం యిచ్చారు. జి.నిర్మలారాణి ”కాటేసిన కరువు”కథలో (గాజు కళ్లు, కథా సంపుటి 2003). పదేళ్ళ క్రితం ఇల్లు వదిలి పారిపోయిన నాగప్పకు తండ్రి పక్షవాతంతో మరణించిన విషయం తెలియదు. ఆకలికి తట్టుకోలేక దొంగతనాలకు పాల్పడి జైలు పాలయ్యి, పదేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన అతనికి దిగజారిపోయిన యింటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. తమ గుడిసెకు దగ్గరగా లైట్లతో దేదిప్యమానంగా సందడి సందడిగా వెలిగిపోతున్న మేడ గురించి తల్లిని అడిగితే ”ఆళ్లు దేవుళ్లట్లాసామి. ఆళ్లే ఇంత పని ఇస్తాండారు. లేకుంటే ఆకలితో మాడి ఏనాడో సచ్చివుంటాంటిమి”అన్న తల్లి మాటలకు నాగప్పకు ఏవో అనుమానాలు మొదలవుతాయి. తర్వాత ఆ మేడ ఆడపిల్లలతో వ్యభిచారం చేయిస్తూ పెద్ద పెద్ద పట్టణాలకు రవాణా చేసే కంపెని అని, వారి చేతుల్లోనే తన చెల్లెలు లక్ష్మి చిక్కుకుపోయిందని అర్థమవుతుంది. సానికొంపల్లో పెట్టే హింస భరించలేక పారిపోయి వచ్చేస్తుంది లక్ష్మి. కూతురు వెళ్లకపోతే అడ్వాన్సుగా తీసుకున్న డబ్బుల్ని వెనక్కు యివ్వలేని దౌర్భగ్య పరిస్థితి కాబట్టి కూతుర్ని నయానో భయానో వెనక్కి పంపాలనుకుంటున్న తల్లిని చూసి ”దుడ్లు కాదే, వంటినిండ రోగాలిచ్చినారు. ఆ రోగాలూ రొచ్చులకే ఆ దుడ్లన్నీ అయిపోయ్యినాయి. చూడు! వాళ్ల కోరిక తీర్చలేదని ఎట్లా వాతలు పెట్టినారో, వాళ్లు మనుషులు కాదమ్మా, రాక్షసులు… యాడికైనా పారిపోదాం. అదికాకుంటే ఇంత విషం తాగి చచ్చిపోదాం” అని లక్ష్మి హృదయవిదారకంగా ఏడ్చడంచూస్తే పేదరికంతోకూడుకున్న గ్రామీణ స్త్రీల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని బోగం కంపెనీలు నడుపుతున్న, వాటిని పెంచి పోషిస్తున్న పాలక, పోలీసు వర్గాలను చూస్తే వీళ్లా స్త్రీలకు రక్షణ కల్పించేది అన్న సందేహం ఎలాంటి వారికైనా కలుగుతుంది. ఈ కథ చదివిన తర్వాత, సిమోన్‌ ద బూవుఆర్‌ తన సెకండ్‌ సెక్స్‌లో ”ఎక్కడ పేదరికం, నిరుద్యోగం, నిర్దాక్షిణ్యం ఎవరికైతే వుంటాయో, వారు ఏ వృత్తికైనా పాల్పడతారు” అన్న మాటలు నాగప్ప, లక్ష్మిల పాత్రలు ఇందుకు నిదర్శనం.

ప్రేమ పేరుతో అమాయక ఆడపిల్లలకు మాయమాటలు చెప్పుతూ, వస్తువులను ఆశగాచూపెడుతూ అరచేతిలో స్వర్గం చూపెట్టి చివరకు ఆడపిల్లలను ఆంగడి బొమ్మలుగా మార్చేస్తున్నారు. అలా లొంగని అమ్మాయిలను ఏదైనా ఫ్యాక్టరీలలో పని చూపిస్తామనో, లేక నీడ పట్టున వుండేట్టుగా పెద్ద పెద్ద ఇండ్లల్లో పనిమనుషులుగా కుదిర్చి పెడ్తామని నమ్మకంగా పలికి చివరకు వాళ్ల చేత బలవంతంగా వ్యభిచారం చేయించే ముఠాలు ఇప్పుడు గ్రామాల చుట్టూ తిరుగుతున్నాయి. అలాంటి ముఠాలకు దళారిగా పనిచేసే వెంకటరమణ లాంటి మోసగాళ్ల ఉచ్చులో పడిన యువతులు వారి కష్టాలను ఆర్‌.శశికళ ”డ్రాపవుట్‌” (చెదిరిన పిచ్చుకలగూడు, కథా సంపుటి, 2001, విరసం ప్రచురణలు) కథలోవివరిస్తారు. అలాంటివారి చేతుల్లో పడితే యువతులు తమ జీవితాలనుండే డ్రాపవుట్‌ అవుతారని హెచ్చరించిన కథ ఇది. వరుస కరువులతో వ్యవసాయం గిట్టుబాటుకాక, చేసిన అప్పులు తీర్చలేక పురుగు మందు తాగి తండ్రి చనిపోతే బడికి పోవడం మానేస్తుంది రమ. ఇల్లు జరుగుబాటు కాని స్థితిలో వెంకట రమణ చెప్పిన పనిలో చేరడానికి పోతాను అని అడిగితే దానికి సమధానంగా రమ తల్లి కాంతమ్మ’ వాడుత్త లోఫరోడు… ఇద్దరాడ పిల్లలను బొంబాయికి ఎత్తి కెల్లి అమ్మి కమీషన్‌ తింటాడని వూర్లో అనుకుంటాండారు…” అని అసలు విషయం రమకు చెప్పి కూతురిని వెంకటరమణ బారిన పడకుండా కాపాడుకుంటుంది. అయితే తర్వాత రమ కంటే రెట్టింపు వయస్సువానితో పెండ్లి చేస్తుంది కాంతమ్మ. ఒక నరకం తప్పించుకోడానికి యింకొక నరకంలోకి రమ నెట్టి వేయబడుతుంది. ఆడుకుంటూ, చదువుకుంటూ ఆనందంగా గడిపివేయాల్సిన బాల్యం మొగ్గ దశలోనే చిదిమివేయబడి జీవితాన్నే కోల్పోయింది రమ అంటారు రచయిత్రి.

తోటలకు కాపలా కాసే కాపలదారుడు తన కుటుంబంతో పాటు తోటలోనే కాపురం వుంటాడు. ఆ కుటుంబాలలోని స్త్రీలపై తోటల యజమానులు, వారి బంధు మిత్రులు చేసే అత్యాచారాలు, వేధింపులు ఎక్కడా రికార్డ్‌ కూడా కావడం లేదు.ఫిర్యాదు చేస్తే కుటుంబానికి అసరాగావున్న ఆ కాస్త పని కూడా పొగొట్టుకోవాల్సి వస్తుందనే భయంతోఆ స్త్రీలు ఆ అవమానాలను తమలోనే దిగమింగుకొని మౌనంగా ఆహింసను భరిస్తుంటారని మధురాంతకం నరేంద్ర తన ”ఆత్యాచారం” కథలో అంటారు. వ్యవసాయ కూలీలల్లో పురుషులకు యిచ్చే కూలి కంటేమహిళలకు యిచ్చే కూలి తక్కువ వుండటమే కాక అదనంగా స్త్రీలపై వేధింపులు, ఆత్యాచారాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా బాలికలు పనిచేసే ప్రాంతాలల్లో ఇవిఎక్కువగాచోటు చేసుకుంటున్నాయి. పదినుండి పదహైదు సంవత్సరాల వయస్సు వున్న బాలికలను పత్తిచేలల్లో పత్తి కోయడానికి నియమించు కుంటుంటారు.

ఎక్కువగా పిల్లలే కావడంతో వాళ్ళపై జరిగే అత్యాచారాల గురించిన సమాచారం బయట ప్రపంచానికి తెలిసేది చాలా తక్కువ.తెలిసిన రాజీయత్నాలు, పంచాయితీలు ఎక్కువుగా బెదిరింపులతో అవి బయటకు రాకుండా చూస్తారు. జి. వెంకట కృష్ణ రాసిన ”క్రీడ”(చిలుకలు వాలినచెట్టు, కథా సంపుటి 2010,స్ఫూర్తి ప్రచురణలు) కథలో సంతానం ఎక్కువ కావడంతో పిల్లలను చదివించే స్తోమత లేక కూతుర్లు తార, నక్షత్ర యిద్దరూ పసి పిల్లలు అయినప్పటికి వాళ్లని పత్తిచేలలోకి పనికి పంపుతారు. తల్లిదండ్రులు. ఆపత్తి చేలలో తార, నక్షత్రలపై అత్యాచారం చేసి ఆపై వాళ్లనిహత్య కూడా చేస్తారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను రక్షించడానికి పూనుకున్న అధికార బలం కలిగిన మేయర్‌ దశరథరామిరెడ్డిని, అతడికి అన్ని రకాలుగా సహకరించిన జిల్లా ఎస్‌.పి లను రచయిత దుయ్యబడ్తాడు. వెనుకబడిన కులాలకు చెందిన కలెక్టర్‌ దుండగులను శిక్షించాలని ప్రయత్నిస్తే, అదే వర్గానికి చెందిన ఎస్‌.పి. మాత్రమే డబ్బుకు, అధికారానికి లోబడి దుండగులను కేస్‌ నుండి తప్పించడానికి అమాయకులను కేసులో యిరికిస్తాడు. యిక బాధితులకు ఈ సమాజంలో ఏం న్యాయం జరుగుతుందని రచయిత ఆవేదన వ్యక్తం చేస్తాడు.

కంటికి బాగాకనిపించిన స్త్రీ ఆమె వేరొకరికి భార్య అయినప్పటికి లొంగదీసుకోటానికి కొంతమంది ఎప్పుడూ ప్రయత్నిస్తూనే వుంటారు. అందులోనూ తమకన్నా ఆర్థికంగా దిగువున వున్నస్త్రీలను, దిగువ కులాల స్త్రీలను మరింతగా వెంటాడుతారు. ”సాలెగూడు” (కథా కెరటాలు, కథా సంకలనం, 2001, విరసం ప్రచురణలు) కథలో ఆస్తిని, ఆడదాన్ని ఆదీనంలోకి తెచ్చుకోవడంలోనే మొగాడి పెత్తనం వుంది అంటారు రచయిత పినాకపాణి, సారాయి అంగళ్లను సొంతం చేసుకున్న మల్లయ్య మెల్లిగా మల్లారెడ్డిగా మారిపోతాడు. అదే వూర్లో అందంగాఛలాకిగా కనిపించే ఈశ్వరయ్య భార్య జయమ్మ మీద మల్లయ్య కన్ను పడుతుంది. మార్కెట్టులో పండిన పంటలకు సరైయిన ధర లభించక ఈశ్వరయ్య మల్లయ్య దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆ అప్పునుసాకుగా చూపించి ఈశ్వరయ్యను బెదిరించి జయమ్మను బలవంతంగా లొంగదీసుకుంటాడు మల్లయ్య. తర్వాత ఈశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్నాకా. ఈశ్వరయ్య నాలుగు ఎకరాల భూమితో పాటు జయమ్మ పూర్తిగా మల్లయ్య అధీనంలోకి వెళ్లిపోతుంది. తల్లి ప్రవర్తన జయమ్మ కొడుకు మద్ధిలేటకి నచ్చదు. మల్లయ్యను, జయమ్మను బూతులు తిడుతూతల్లిని అతని దగ్గర నుండి వచ్చేయమంటాడు. మల్లయ్య శత్రువు శంకరెడ్డి మద్ధిలేటిని చేరదీస్తాడు. కక్ష పెంచుకున్న మల్లయ్య మద్ధిలేటిని మనుషులను పెట్టి తన్నిస్తాడు. కొడుకును చూడటానికి పోయిన జయమ్మ మీద మల్లయ్య యింతెత్తున ఎగిరిపడ్తాడు. మగవాడి పెత్తనానికి లొంగి భూమికి, కొడుకుకు దూరమయ్యి జయమ్మ పడే హింసకు కారణమైన ఈ వ్యవస్థను కన్నీళ్లు, వేడుకోళ్లు, కరిగించలేవు అన్న విషయం తేటతెల్లమవుతుంది.

రాయలసీమ స్త్రీలజీవితాలలో దాగివున్న హింసను ప్రతిభావంతంగా చిత్రించిన ఈ కథలను ప్రతి ఒక్కరు చదవాలని మా ఆకాంక్ష. మిగిలిన అన్ని ప్రాంతాలవారు కూడ రాయలసీమ స్త్రీల స్థితిగతులను సానుభూతితో అర్థం చేసుకొని వారికి అండగానిలబడే చైతన్యం నేటి యువతరానికి కలగచేయాలంటే ఈకథలను డిగ్రీ, పి.జి తరగతుల వారికి పాఠ్యాంశాలుగా చేర్చాలి. స్త్రీలను శారీరకంగా బలహీనులుగా వుంచడానికి, ఆర్థికంగా అణచి వుంచడానికి ఈ వ్యవస్థ భిన్న పద్ధతుల్లో హింసను ఉపయోగి స్తుంటారు. వీటిని ప్రొత్సహిస్తున్న వ్యాపార, పాలక వర్గాల కుట్రలను స్త్రీలందరు గ్రహించి ఈ హింసను ఎదుర్కోవడానికి అన్ని ప్రాంతాల స్త్రీలు వ్యక్తులుగా, సమూహాలుగా, సమిష్టిగా, సంఘటితమై తగిన కార్యచరణను చేపట్టాలి.

(2013 మార్చి 25, 26 తేదిలలో యూజిసి సౌజన్యంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, మహిళ అధ్యయన కేంద్రం నిర్వహించిన ”ఈరిళీలిదీరీరిళిదీరీ ళితీఖీరిళిజిలిదీబీలి బివీబిరిదీరీశి గీళిళీలిదీ” అన్న అంశంపై జరిగిన జాతీయ సదస్సులో సమర్పించిన పత్రం).

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.