” ”

– సామాన్య

ఈ మార్చ్‌ పన్నెండున అపర్ణ సేన్‌ కొత్త (బెంగాలీ) సినిమా ”గోయినార్‌ బాక్షో” విడుదలయింది. గోయినార్‌ బాక్షో అంటే నగల పెట్టి అని అర్థం. ఈ సినిమాకి మూలం అదే పేరుతో వున్న శీర్షేందు ముఖోపాద్యాయ్‌ నవలిక మూడు తరాలకి చెందిన ముగ్గురు ఆడవాళ్లు, ఒక నగల పెట్టి వాళ్ళ జీవితాలతో పెనవేసుకున్న తీరు, వారి వివాహాలు, మోహాలు, దుఃఖ్ఖాలు, విజయాలు అన్నింటినీ స్పృశిస్తూ స్త్రీల దృష్టికోణం నుండి స్త్రీవాద అవగాహనతో తీసిన సినిమా గోయినార్‌ బాక్షొ.

మొదటి తరం స్త్రీ రాస్‌ మణి. చిన్న వయసులోనే విధవగా మారిన జమీందారు కూతురు. ఈమె కాలంలో దేశ విభజన జరుగుతుంది. వున్న స్తిరాస్తులను వదలుకుని వారి కుటుంబం పశ్చిమ బెంగాల్‌కి వలస వస్తుంది. కుటుంబ పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతగా మారుతుంది. అయినా యెన్ని విపత్తులు వచ్చి పడినా గయ్యాళి నోటి రాస్‌ మణి తన నగలపై ఈగని కూడా వాలనీయదు. ఆ ఇంటికి కొత్త కోడలిగా అడుగు పెడుతుంది సోమలత. ఆమె వచ్చిన కొన్ని రోజులకే ఆమె భర్త పిషి మా (మేనత్త) రాస్‌ మణి మరణిస్తుంది. అనుకోకుండా రాస్‌ మణి గదిలోకి వెళ్ళిన సోమలతకు రాస్‌ మణి దెయ్యం కనిపించి పెట్టె తాళం చెవులిచ్చి నగల పెట్టెని తీసికెళ్ళి దాచమంటుంది. అది మొదలు రాస్‌ మణి దెయ్యం సోమలత కదలికలను నియంత్రిస్తూ నగలని జాగ్రత్తగా కాపాడుకుంటూ వుంటుంది. అయినా భర్త ఆత్మ హత్యకి ప్రయత్నిస్తున్న సందర్భంలో సోమలత రాస్‌ మణి నగలు కొన్నింటిని కుదువ పెట్టి బట్టల దుకాణం తెరుస్తుంది. అది తెలిసి రాస్‌ మణి సోమలతతో ఘర్షణ

పడ్డా, శారీ స్టోర్‌కి ”రాస్‌ మణి శారీ స్టోర్‌” అని పేరు పెట్టారని తెలిసి విధవ …. విధవ అని జీవితమంతా పిలిపించుకున్న తన పేరుకి వచ్చిన గౌరవాన్ని చూసి ఉప్పొంగిపోతుంది.

మూడవ తరం స్త్రీ చైతాలి. స్కూటర్‌ నడపగల, ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకోగల స్వేచ్ఛా మానసం వున్న ఆధునిక యువతి. చైతాలికి చిన్నప్పటి నుండీ రాస్‌ మణి దయ్యం కనిపిస్తూ వుంటుంది. నగల మీద ఏ మాత్రం ఆసక్తి లేని చైతాలీని తన నగలని అప్పుడు నడుస్తున్న బంగ్లాదేశ్‌ స్వాతంత్ర పోరాటం” ముక్తి వాహిని ”కోసం వినియోగించమని రాస్‌ మణి ప్రోత్సహి స్తుంది. చైతాలి రాస్‌ మణి నగల ఆధునిక ప్రయోజనం గుర్తించడంతో సినిమా ముగుస్తుంది.

ఆపర్ణ సినిమా కోసమని నవలికలో కొన్ని మార్పులు చేసారట. దాన్ని గురించి ప్రశ్నించినపుడు రచయిత శీర్షేందు ”ఆ నవలని నేను 90లలో రాసాను. అప్పట్లో ఏం రాసానో నాకు జ్ఞాపకం కూడా లేదు. అపర్ణ ఏం మార్పులు చేసి వున్నా నాకు సంతోషమే” అన్నారు. బెంగాలీ మేధావులు, కళాకారులు ఒకరినొకరు బాగా గౌరవించు కుంటారు. ఆ కారణం చేత కూడానేమో వాళ్ళెప్పుడూ అవార్డుల వరుసలో ముందుం టారు. ఒకరి కాళ్లు ఒకరు పట్టి క్రిందికి లాక్కునే తెలుగు వారి సంస్కృతికి ఇది చాలా భిన్నం. ఈ నవల నేను ఇంకా చదవలేదు కనుక ఆ మార్పులేమిటో చెప్పలేను కానీ, ఆ మార్పులు తప్పకుండా స్త్రీల సమస్యలను ప్రశ్నించేవిగా ఉంటాయని నాకు తెలుసు. ఆ ప్రశ్నలని ఆకాంక్షలని ఇక్కడ డికోడ్‌ చేస్తాను.

మాట్లాడలేని లోహాభరణాలకి మాట్లాడే రాస్‌ మణి ప్రతినిధి. మూడు తరాలలో బంగారం ఏయే రూపాన్ని పొందిందో రాస్‌ మణి పాత్ర చెప్తుంది. దెయ్యమైన రాస్‌ మణి శరీరధర్మ రీత్యా మరణించిన వయసులోనే ఆగిపోయినా, మానసికంగా తరం తరువాత తరానికి మారుతూ వస్తూ వుంటుంది. తన నగలని ఆస్తిగా గుర్తించినా వాటిని ఆచలంగానే వుంచేసిన మొదటి తరం రాస్‌ మణి, సోమలత వాటికి ద్రవ్య రూపాన్నిచ్చి తన పేరుకో గుర్తింపుని తెచ్చి పెట్టినపుడు ఆ మార్పుని స్వీకరించి ఆధునికం అవుతుంది. చైతాలి సమయం వచ్చేసరికి మనవరాలికంటే ముందుకెళ్ళి ఆలోచించి తన నగలని ముక్తి వాహిని కి వినియోగించమంటుంది. అట్లా ఈ పాత్ర కాలంతోపాటు మారుతూ వచ్చి మారిన ఆధునిక భారత స్త్రీకి ప్రతినిధిగా నిలుస్తుంది. అపర్ణ తన ప్రతి సినిమాలోనూ స్త్రీ పురుష సంబంధాల ప్రశ్నలు వేస్తూనే వుంటుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు. సోమలత భర్త సంప్రదాయ భర్తలకి ప్రతినిధి. మామూలు భర్తలకి వుండే సుగుణాలు దుర్గుణాలు వున్నావాడు. అతనో సారి వ్యాపార నిమిత్తమై దూర ప్రాంతాలకి వెళ్తాడు. ఒంటరిగా శారీ స్టోర్‌ కి వెళ్లి వస్తున్న సోమలతను పరాయి మగవాడురోజూ వెంబడిస్తూ ఉంటాడు. అది గమనించి రాస్‌ మణి అతనితో సంబంధం పెట్టుకోమని సోమలతని ప్రోత్సహిస్తుంది. ఆ సన్నివేశం చూసి మనం ఆశ్చర్యపడతాం. మన ఆశ్చర్యం పై దెబ్బ కొడుతూ స్క్రీన్‌ ప్లే రాసిన అపర్ణ ”ఏం మగవాళ్ళకేనా అన్ని ఆనందాలు?” అని ప్రశ్నిస్తుంది. అన్నట్టుగానే సోమలత ఒకసారి ప్రియుడి సముఖానికి వస్తుంది. అప్పుడే భర్త తిరిగి వస్తాడు. ఆ ఏడాది సోమలతకి చైతాలిపుడుతుంది. పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తల్లి మాత్రమే చెప్పగలదనె మాట గుర్తొచ్చి మనం ఆశ్చర్యపడతాం.

రచయితగా చలం కానీ దర్శకురా లుగా అపర్ణ కానీ వివాహ విచ్ఛిన్నతని, విశృంఖలతని ప్రతిపాదించరు. ఆలోచించ డాన్ని స్వంతంగా మెదడూ, శరీరానికి కోరికలూ వున్న స్త్రీకి సమాజం, వ్యక్తీకరణని నిషేధించి ఎలా బంధించి వేసిందో చెప్తారు. విముక్తిని కలగంటారు. పురుషులు వివాహే తర సంబంధాలలోనో ప్రేమ సంబంధాల లోనో వున్నపుడు ఆ సంబంధాలలో స్త్రీలు కూడా వుంటారు. కానీ మన కపట ప్రపంచం ప్రేమనో వ్యామోహాన్నో పురుషుడు ప్రకటించినట్లుగా స్త్రీని ప్రకటించనీయదు. అటువంటి సంబంధాలలో వున్న స్త్రీ కూడా సమాజానికి భయపడి పైకి పాతివ్రత్యాన్ని వుపన్యసిస్తుంది. ”ఏం ఆనందాలన్నీ మగవాళ్ళకేనా” అన్న ప్రశ్న అట్లాంటి ఈ కపట ప్రపంచాన్ని షాక్‌కి గురి చేయడానికి వుద్దేసించినదే. అపర్ణ తన ప్రతి సినిమా లోనూ నిలవనీటి మురికి గుంటలాంటి ఈ సమాజాన్ని ప్రశ్నల రాళ్ళు వేసి చెదరగొట్టి చలనం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ వుంటుంది.

అణచివేతలకి సంబంధించిన ఇంకో ప్రశ్న రాస్‌ మణి ప్రణయ ప్రయత్నం. నిండు యవ్వనంలో వున్న విధవ రాస్‌ మణి తన ఇంట్లో బొగ్గులు కొట్టే పని వాడితో ప్రణయానికి ప్రయత్నిస్తుంది. చీకటి పడ్డాక గదికి రమ్మని పిలుస్తుంది. పిలుపునందుకుని వచ్చిన ఆ కుర్ర వాడు దురదృష్టవశాత్తు పట్టుపడి తన్నులు తింటాడు. అట్లా రాస్‌ మణి కోరికని భుగ్గిపాలు చేస్తాడు. ఈ సన్నివేశం నాకు ప్రఖ్యాత ఆంగ్ల చిత్రం ”టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌” ని జ్ఞాపకం తెచ్చింది. రెండు చిత్రాలలోనూ స్త్రీలు అగ్రవర్ణులు. ఇద్దరూ కూడా అణచివేతలో తమకన్నా ఒక మెట్టు క్రింద వున్న పురుషులను ప్రలోభ పెట్టాలని చూస్తారు. ఈ ప్రయత్నంలో మాకింగ్‌ బర్డ్‌లో శ్వేత స్త్రీ ”మయెల్ల” అమాయుకుడైన నల్లజాతి యువకుడి మరణానికి కారణమవుతుంది. కొడవటిగంటి కుటుంబ రావు ఒక కథలో తన స్వార్థ ప్రయోజనం కోసం నాయిక (బహుశా) పార్వతి ఒక దళితుడిని పెళ్ళాడి అతని జీవితాన్ని కల్లోలం చేసి దుఃఖితుడ్ని చేస్తుంది. స్త్రీలయినప్పటికీ అగ్రవర్ణ స్త్రీలు అణచి వెయబడ్డ కులాల పురుషల్ని ఏ దృష్టి కోణంతో చూస్తారో, అణచివేతలో వారు కూడా ఎలా పాలు పంచుకుంటారో చెప్పిన అపర్ణ, చైతాలి పరంగా ఇప్పుడు రావాల్సిన మార్పును కూడా చెప్తుంది.

ముక్తి వాహిని ఉద్యమంలో చురుకుగా ఉంటున్న చైతాలి స్నేహితుడ్ని చూసిన రాస్‌ మణి ఆ యువకుడిని పెళ్లి చేసుకోమని చైతాలితో అంటుంది. సినిమాలో ఆ యువకుడి పాత్రను అప్పుడు రాస్‌ మణి మోహించిన యువకుడి పాత్రను వేసిన నల్లటి యువ నటుడు ఒక్కరే కావడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. అణచివేయబడ్డ కులాల వారు చదువుకుంటున్నారు, ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు అని చెప్పడంతో సరి పెట్టుకోదు అపర్ణ, ఇప్పుడు, అత్యాధునికంగా మారిన రాస్‌ మణి చేత అతడిని పెళ్ళెందుకు చేసుకోకూడదు అన్న ప్రశ్న కూడా వేయిస్తుంది.

నాకు వ్యక్తిగతంగా నా కులం, నా భాష, నా భారతదేశం అనే భావాలు వుండవు. అందుకని అపర్ణా సేస్‌ భారత దేశం గర్వించ దగ్గ దర్శకురాలు అని స్టేట్‌ మెంట్‌ ఇవ్వను. కానీ, ఒకటి మాత్రం చెప్పగలను మనిషిగా, అందునా స్త్రీ ప్రకృతిగా నేను అపర్ణని చూసుకుని గర్వ పడతాను. ఆనంద పడతాను. ప్రేమిస్తాను.

Share
This entry was posted in సినిమా లోకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.