– కొండపల్లి కోటేశ్వరమ్మ

మానవుడు సైన్సు ద్వారా ముందుకు తీసుకొస్తున్నాడు. సైన్స్‌ డెవలప్‌ అయ్యేటప్పటికి, ఇవన్నీ కూడా డెవలప్‌ అవుతున్నాయనేది ఎంతవరకు చెప్పగలిగారు? అంతే కాకుండా ఏవేవో రాజకీయాలు చెప్పేవారు. ఈ రాజకీయాలు ‘ఇనుప గుగ్గిళ్ళిలా’గ మింగుడు పడేవి కావు. ఈ సిద్ధాంతం దేనిమీద బేసయ్యింది, దేనిమీద నిలబడింది, పునాదుల్నించి తీసుకొచ్చి వీళ్ళ బుర్రల్లో ఎక్కించినట్లయితే, ఇంకా చాలామంది స్త్రీ, పురుష కార్యకర్తలు గట్టిగా నిలబడే అవకాశం ఉండేది. కనీసం గట్టిగానిలబడి ఉద్యమంతో టచ్‌ పెట్టుకోవ టానికుండేది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలొచ్చి, అంతర్జాతీయంగా తగాదాలొచ్చి, అంతర్గతంగా తగాదాలొచ్చి, విడిపోతే విడిపోవచ్చు. కానీ అసలీ మూఢ నమ్మకాలు, ఆచారాలు వీటిపై ఇంత ప్రచారం చేశాం, ఇంత పనిచేశాం.

క్లాసులు పెట్టి, రాజకీయ క్లాసులు పెట్టేవాళ్ళు, భారత మహిళా మండలి క్లబ్బులో ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు. కాని నేననుకునేదేమంటే ఆ రాజకీయ క్లాసుల్ని వాళ్ళు ఎంతవరకు జీర్ణింప చేసుకున్నారు అనేది కాకుండా చక చకా రాజకీయాలు చెప్తూ వెళ్ళిపోయారేమో, మాకు అంతగా జీర్ణం కాలేదేమో అని ఇప్పుడు అనుకుంటున్నానన్నమాట. అన్నప్రాశంస నాడు ఆవకాయ పెట్టినట్టవుతుందేమో అన్పించింది. అదెలా అంటే జపాన్‌ ఫైట్‌ వాళ్ళనెట్లా ఎదుర్కోవాలని చెప్పి రష్యాలో సోషలిజమొచ్చింది. ఆ సోషలిజం ఏ బేసిస్‌ మీద వచ్చింది. అది దేశవ్యాప్తంగా ఎట్లా వచ్చింది, వాళ్ళెట్లా అర్థం చేసుకుని ఆ పోరాటంలో పాల్గొన్నారనేది మాకు కిందికి వెళ్ళి చెప్పలేదమో అని నా అనుమానం. ఇప్పుడు బాధ పడ్తున్నాను. ఎందుకంటే అప్పుడు మూడడుగులు ముందుకేసి ఇన్ని కార్యక్రమాలు చేసినా కమ్యూనిస్ట్‌ పార్టీ ఫామిలీస్‌ కొన్నిట్లో ఇప్పటికీ దేవుడంటే నమ్మకాలున్నాయి. వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళల్లో భర్తకులం వారి వైపు భర్త ఇవ్వాలనీ, భార్య కులంవారి వైపు భార్య ఇవ్వాలనీ, పోటీ అట్లా అట్లా వచ్చింది. ఇప్పుడు గతి తార్కిక భౌతిక వాదాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు జీర్ణింప చేసుకుంటే ఇట్లా పూజలు చెయ్యరుకదా! అది కమ్యూనిస్ట్‌ పార్టీ ఎంత వరకు నేర్పింది? అది నేర్చుకున వాళ్ళ బలహీనత చాలావరకి కార్యకర్తల్లోనే వచ్చేసింది కదా ఈ మార్పు! మరి కార్యకర్తల్లో రావటానికి కారణం? అంటే వీళ్ళు ఒక ఉత్సాహంతోటి, ఉద్రేకంతోటి వచ్చి పని చేశారు. ఆ ‘యాక్టివిటీస్‌’ పార్టీలో తగ్గిపోయేసరికి మళ్ళీ వెనక్కిపోయారు వీళ్ళంతాను. అవి ఎందుకు తగ్గాయనేది ‘ఫీల్డ్‌’లో ఉన్నవాళ్ళకి తెలుసనుకోండి. నేను పార్టీకి దూరమై బ్రతుకు తెరువు కోసం ఎక్కడికో దూరం వెళ్ళిపోయాను. తర్వాత చరిత్ర మీక్కొంత తెలిసే ఉంటుంది. నేనిప్పుడు అవగాహన చేసుకునేదేంటంటే ఇది ప్రకృతి సహజమైంది, ఈ అపారమైన శక్తంతా ప్రకృతిలో ఉంది. మానవుడు సైన్సు ద్వారా ముందుకు తీసుకొస్తున్నాడు. సైన్స్‌ డెవలప్‌ అయ్యేటప్పటికి, ఇవన్నీ కూడా డెవలప్‌ అవుతున్నాయనేది ఎంతవరకు చెప్పగలిగారు? అంతే కాకుండా ఏవేవో రాజకీయాలు చెప్పేవారు. ఈ రాజకీయాలు ‘ఇనుప గుగ్గిళ్నలా’గ మింగుడు పడేవి కావు. ఈ సిద్ధాంతం దేనిమీద బేసయ్యింది, దేనిమీద నిలబడింది, పునాదుల్నించి తీసుకొచ్చి వీళ్ళ బుర్రల్లో ఎక్కించినట్లయితే, ఇంకా చాలామంది స్త్రీ, పురుష కార్యకర్తలు గట్టిగా నిలబడే అవకాశం ఉండేది. కనీసం గట్టిగానిలబడి ఉద్యమంతో టచ్‌ పెట్టుకోవ టానికుండేది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలొచ్చి, అంతర్జాతీయంగా తగాదాలొచ్చి, అంతర్గతంగా తగాదాలొచ్చి, విడిపోతే విడిపోవచ్చు. కానీ అసలీ మూఢ నమ్మకాలు, ఆచారాలు వీటిపై ఇంత ప్రచారం చేశాం, ఇంత పనిచేశాం. మరి ఎందుకు వీళ్ళకు నిరుత్సాహం? ఈ నిరుత్సాహంతోటి దేవుడివైపు మొగ్గారా లేక వీళ్ళకీ సిద్ధాంతం వొంటబట్టలేదా అని నేను ఫీలవుతున్నాను. ఈ ఫ్యామిలీస్‌ని చూస్తూ.

మా రాజేశ్వరరావుగారు చెప్పారు కాబట్టి, సుందరయ్యగారు చెప్పారు కాబట్టి, మా ఆయన పోట్లాడి బైటికి తీసుకెళ్తున్నాడనే దాంతోటి వెళ్తున్నాం, అలాగే వెళ్ళాం కూడా! మొట్టమొదట భర్త అడుగుజాడల్లోనే ఉద్యమంలోకి వచ్చాం. సిద్ధాంతపరమైన లెనినిజం, మార్క్సిజం ఎంతవరకు తెలుసనేది కాదు. నాకు తెలిసినంతవరకు ముందు నాయకుల భార్యల్ని రమ్మనక వేరేవాళ్ళనెందుకు రమ్మంటారు. అని అడిగేవాళ్ళు. ముందు మీ భార్యల్ని రమ్మనండి తర్వాత మేం వస్తామని అనేవారు. స్త్రీలలో ఊరేగింపులు, గీరేగింపులు జరిపినపుడు వాళ్ళ భార్యలేమో చక్కగా మడి కట్టుకొని కూర్చోవాలా, మేమేమో రావాలా ఇట్లా అనేదాంతో ఫోర్స్‌ చేసి తీసుకొచ్చారన్నమాట. ఊరేగింపుల్లో, దీంట్లో నేనూ వచ్చాననుకోండి. నా పక్కనే మా అక్క, చెల్లి అంతా వస్తుంటే, పెద్ద ఊరేగింపు జరుపుతుంటే పెద్ద పండుగ. తర్వాత మా అంతట మేమే ఇంట్రెస్టుగా ఊరేగింపుల్లో వస్తామంటే ఇవ్వాళ కాదు కామ్రేడ్స్‌ వస్తారు, మీరంతా వంట చేసేయండి, ఊరేగింపులకి రాకపోయినా ఫరవాలేదులే, ఇంకా చాలామంది వస్తున్నారు, వాళ్ళందరికీ వంటా, గింటా చేయాలి కదా అని అంటే కూడా ఎందుకు చేయాలి, మేం కూడా రావాలిగా, ముందేమో ఫోర్స్‌ చేసి తీసుకొచ్చారు. ఈ రోజున మేం రావాలంటే అడ్డుగా కనబడ్తున్నామా! వెళ్ళండి, హోటల్‌కి వెళ్ళండి, తినండి అనంటే మాకు దగ్గరగా ఉండేవాళ్ళు అదికాదు కోటేశ్వరమ్మ అన్నం వండిపడేసేయ్‌. ఆవకాయ ఉందిగా, ఒక్క చారుపెట్టు అన్నీవద్దులే అని చెప్పేవారు. పదిమందని చెప్పి, పదిహేనుమంది వచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ కోటేశ్వరమ్మతో వంట చేయించటం న్యాయం కాదని వస్తూవస్తూ పళ్ళు తెచ్చేవారు. అన్నీ కలిపి అందరం తినేవాళ్ళం.

మేం పార్టీలో ఉన్నవాళ్ళం అక్క చెల్లెళ్ళం అన్నదమ్ముళ్ళం. పక్కింట్లో ఉన్నామె ఎవరో తెలియదు కానీ, ఆమె మర్దిగారు, నేను పార్టీలో పనిచేసేవాళ్ళం. అక్కా-చెల్లెల్లాగ ఉన్నాం. ఆమెకు బాబు పుట్టాడు. నాకు పాప పుట్టింది. నేను మహిళా సంఘపు కల్చరల్‌ యాక్టివిటీస్‌కి వెళ్తుంటే వచ్చేలోపల పాప ఏడుస్తుంటే తాను పాలిచ్చేది. వచ్చాక నేను వాడికి పాలిచ్చే దాన్ని. నేను పులుసు చేస్తే మా చెల్లె వేపుడు చేసేది. ఆమె ఇడ్లీ చేస్తే నేను ఇంకోటి చేసేదాన్ని. మధ్య డోర్‌ తీసేసేవాళ్ళం. వాళ్ళు మేం బంధువులనేది కాదు, అట్లా కలిసి ఉన్నాం. మేం తగాదాలనేది ఎరుగం. ఈ పార్టీ చుట్టరికమే చుట్టరికమనుకున్నాం. మా చుట్టాల్ని మర్చిపోయాం.

అప్పుడు విజయవాడలో ఆత్మరక్షణ పాఠశాల ఉండేది. జపాన్‌ పైకొస్తే ఏం చేయాలనే దానికోసం. కాకినిక్కర్లు వేసుకోవటానికి కొంత ఇబ్బందే ఉండేది. రౌడీల్ని అణిచిపెట్టేశారు. అయినా మొదట్లో భయమే ఉండేది. కొందరు సైకిళ్ళు నేర్చుకునేవారు. ఏ.ఆర్‌.పి కార్యక్రమాలు ఇవి నేర్చుకోవటానికి నచ్చచెప్పాల్సి వచ్చేది. పెరెడ్స్‌ చేసేప్పుడు కన్వీనియన్స్‌ కోసం నిక్కర్లు వేసుకునేవాళ్ళం. కానీ బైటున్నప్పుడు చీరలే కట్టుకునే వాళ్ళం. బూర్జువా లక్షణాల్లోపడి పట్టుచీరలు, నగలు పెట్టుకోవద్దని కూడా చూసేవారు. అట్లా అన్ని యాంగిల్స్‌లో చూసేవారు లెండి. రాజేశ్వరరావు గారి భార్య చంద్రహారం పెట్టుకుంది. గజ్జెలవడ్డాణం పెట్టుకుంది. ఆమె పెట్టుకోగాలేందీ మేమెందుకు పెట్టుకోకూడదూ అని తతిమ్మా వాళ్ళంటారు కదా! ముందు అన్ని బెడదలూ కార్యకర్తల భార్యలకే వచ్చేదన్నమాట. స్టేజీ ఎక్కి పాట పాడాలంటే అమె పాడాలి, నాటకంలో యాక్ట్‌ చేయాలంటే ఆమే చేయాలి. నగలన్నీ ముందు తీయాలంటే ఆమే తీయాలి అని అనుకునేవారు. కార్యకర్తల భార్యలే మహిళా ఉద్యమానికి నిర్మాతలు. వాళ్ళేకదా చేసింది. అన్నపూర్ణమ్మ, హనుమాయమ్మ వీళ్ళంతా చేశారు.

ప్రజా నాట్యమండలి తర్వాత ఇక నిషేధం దగ్గరికి వెళ్ళిపోదాం. గాంధీగారి సిద్ధాంతం ప్రకారంగా స్వరాజ్యం వచ్చిందన్నారు. స్వరాజ్యం వచ్చిన తర్వాత ఇది స్వరాజ్యం కాదని, కమ్యూనిస్టులు చెప్పారు. దానికోసం ఫైట్‌ చేస్తూ ఎప్పటికైనా సోషలిజమే సరైంది. ఇది స్వరాజ్యం కాదు, స్వరాజ్యం కావాలంటే సోషలిజమే శరణ్యమని కమ్యూనిస్టులు చెప్పిన తర్వాత అనేక యాంగిల్స్‌లో ఉద్యమాలు తీసుకొస్తున్న ప్రజాశక్తిమీద నిషేధం వచ్చింది. కార్యకర్తలందర్నీ జైళ్ళల్లో పెట్టటం, కామ్రేడ్స్‌ అంతా రహస్యంగా వెళ్ళిపోవటం, అక్కడ తెలంగాణా ఉద్యమం స్టార్ట్‌ అవటం, దాని ప్రక్కమ్మటే ఆంధ్ర ఉద్యమం కూడా. అంతటా కాదనుకోండి. అన్ని రాష్ట్రాల్లో వచ్చింది కదా! ”ఇదే కంటికి కన్ను పంటికి పన్ను” అనే నినాదం. ప్రభుత్వం మన కన్ను పొడిస్తే, మనం ప్రభుత్వగుండాల్ని, రౌడీల్ని, అటు తరపు తొత్తులందర్నీ పంటికి పన్ను, కంటికి కన్ను ఈ తుపాకి గొట్టంలోనుంచే సోషలిజం వస్తుందని. వాళ్ళేం చేస్తే మనం కూడా అది చెయొచ్చు. హింసకి ప్రతిహింస అనేదన్నమాట ఆనాటి నినాదం. దాన్ని తీసుకునేసరికి ప్రభుత్వం పత్రిక నిషేధించటం, కామ్రేడ్స్‌నందర్నీ అరెస్ట్‌ చేయటం, బుర్రకథల్ని, నాటకాల్ని నిషేధించటం, దీన్ని ధిక్కరించి ఇకప్పుడు స్త్రీలందరం రంగంలోకి దిగామన్నమాట. ఆ 144 సెక్షన్‌ను ధిక్కరించి మహిళా కార్యకర్తలు ముందుండి, మహిళా సానుభూతి పరులందర్నీ ముందు పెట్టుకొని ఒక వేయి మందితోటి విజయవాడలో కలెక్టరాఫీసు ముందు ఊరేగింపు వెళ్ళామన్నమాట. పక్కకి వాళ్ళనక్కడ టియర్‌ గ్యాస్‌ పెట్టి లాఠీలు పెట్టి కొట్టటం, కొన్ని వ్యాన్‌లు తీసుకొచ్చి ఎక్కించి ఎక్కడికో తీసుకువెళ్ళారు. నందిగామ జైళ్ళో పెట్టారు. అప్పుడు కూడా మాకేం భయం వేసేదికాదు. జైళ్ళకి వెళ్ళగానే ఆ టియర్‌గ్యాస్‌తో ఒళ్ళంతా మంటలుబుట్టింది. గాలి, వెలుతురూ లేని గదిలోపడేసే సరికి, భయోత్పాతం కల్గింది. ఎప్పుడూ చూళ్ళేదు కదా! సరే ఒక్కొక్కళ్ళన్ని తీసుకొచ్చి పడేస్తుంటే నలుగురితో చావుకూడా పెళ్ళిలాగానే అన్పించి మనవాళ్ళందరూ వచ్చేశారు. ఇంకేం భయమనుకుని, మేమే అల్లరిచేసి, పోలీసుల్ని గేలిచేయటం, ప్రభుత్వాన్ని గేలిచేయటం. తల్లీ వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు, విసిగించేస్తున్నారని అనేవారు. అలా చేసిన తర్వాత అందర్నీ వదిలేసి మామీద పదహారుమందిమీద కేసు నమోదు చేశారు. నందిగామ, జగ్గంపేట ఎక్కడెక్కడో పదిహేను, ఇరవై రోజులకి వాయిదా వేసి విసిగించి తిప్పటం మొదలు పెట్టారు. అప్పుడు మేమేం చేశామంటే ‘డాక్యుమెంట్స్‌’ మీద సంతకాలు పెట్టలేదు. ఈ రోజు వాయిదా వేశారు కాబట్టి మేం సంతకాలు పెట్టం. ఈ కేసు విచారణ చేస్తారా? లేదా? లేకపోతే మమ్మల్ని ఇక్కడే కూర్చోమంటారా, మేంమట్టుకు వెళ్ళేది లేదు, సంతకాలు పెట్టేది లేదు అని మేం తిరగబడ్డాం. తిరగబడేసరికి మళ్ళీ జైల్లో పడేశారు. జైళ్ళో పారేసి కేసు విచారణ చేస్తామని హామీ ఇచ్చి వదిలేశారు మళ్ళీ. జైళ్లోల్లో కూడా పోరాటం చేశామన్నమాట. కొంతమంది స్త్రీలనేమో రాయవెల్లూరు జైలుకి పంపించేశారు. పసిపిల్లల తల్లులు కూడా వచ్చారు జైలుకి అప్పుడు. ఈ అనసూయమ్మకు పదిహేనురోజుల కొడుకు. ఆమె కూడా వచ్చేసింది. వ్యాన్‌లో ఇక పట్టుకొని ఎక్కించలేక పౌరుషం ఉంటే వ్యాన్‌ ఎక్కండి మీరు అదేంటి సినిమా బొమ్మల్లాగ గంతులేయటానికి వచ్చారా? ఉద్యమం చేయటానికి వచ్చారా? అనేదో అన్నారు. అందరికి కోపాలొచ్చేసి గబాగబా వ్యానెక్కేశారు. పట్టుకొని ఎక్కించటానికి చాతగాక అట్లా ప్రొవోక్‌ చేశారన్నమాట! ఇక అక్కడ కూడా పసిపిల్లల తల్లుల్ని బైటికిరండని, పిల్లల్ని అడ్డం పెట్టుకొని పోలీసుల్ని మాకు చూపెట్టటం, చేయటం, మాకనవసరమని పంపించేయటం. అక్కడ కూడ డిసిప్లిన్‌, జైల్‌ డిసిప్లిన్‌ ఉండాలి. కమ్యూనిస్టులు ఎక్కడికి వచ్చినా వాళ్ళు చక్కగా, ఆదర్శంగా ఉంటారన్పించాలి. మీరు పిచ్చి గంతులు వేయొద్దని, ఆఖరికి వాళ్ళే అన్నారన్నమాట. అట్లయితే మేం సర్దుకోవటం, మొఖాలు కడుక్కోవటానికి బైటికి వస్తే నందిగామ జైలు చుట్టూ నిండిపోయారన్నమాట. నందిగామ జైలు చుట్టూ పెద్ద పెద్ద నినాదాలు చేసేవారన్నమాట. నినాదాలు చేసి పాటలు పాడేవారు.

మేం నిరాహార దీక్ష ఎందుకు చేశామంటే ఆగస్టు పదిహేను వచ్చింది. లడ్డూలు, గిడ్డూలు చేశారు. ఇవాళ ఆగస్టు పదిహేను. ఇవన్నీ చేయించామంటే ఈ ఆగస్టు పదిహేను మేం గుర్తించం. ఇది స్వరాజ్యం వచ్చినట్లు లెక్కకాదు. కాబట్టి ఈ రోజు మేం అన్నంతినం అని అన్నాం. నిరాహార దీక్షపడ్తే కొడ్తామన్నారు. కొట్టినా మంచిదే జెండావందనం చేయం మేం. ఈ జెండా మా జెండా కాదు అని అన్నాం. తినకుండా కూర్చుంటే బ్రతిమాలారు. తంతామన్నారు, ఏదో చేశారు. కేసు విచారణవగానే బైటికి వచ్చేశాం. శిక్ష అనుభవించలేదు. జరిమానా చెల్లించలేదు. తీసుకెళ్ళిపోయారు.

ఇక్కడుంటే మమ్మల్ని బతకనీయరు ఒకటి, తర్వాత స్త్రీలు కూడా అవసరం కదా! మరి స్త్రీలు లేంది ఎట్లా? ఇపుడు ఒక డెన్‌ ఉందనుకో, ఆ ఆ డెన్‌లో నల్గురు మగవాళ్ళు ఉంటే అనుమానం కదా! ఫామిలీతో ఉంటే అనుమానం ఉండదు కదా! పిల్లా, పాపల్తో ఉంటే అనుమానం ఉండదు కదా! అనేదాంతో తీసుకెళ్ళారు.

స్త్రీలు ఏం చేశారనంటే, అసలు స్త్రీలు లేని చరిత్ర లేదమ్మా, గతం నుంచి ఇప్పటివరకి చూసుకోండి, స్త్రీల్లేని చరిత్రలేదు. స్త్రీలు సగభాగం కాదుకదా జనాభాలో ఎక్కువభాగం స్త్రీలే కదా! ఉద్యమం ప్రబలటానికి కారణం స్త్రీలు, స్త్రీల పాత్ర చాలా ఉంటుంది. కానీ, స్త్రీల పాత్ర అణగారిపోతూ, పురుషుల పాత్రే పైకి పోతూ ఉంది. దానికి కారణం తరతరాలనుంచున్న స్త్రీ వ్యతిరేకతే. మరి స్త్రీల పాత్ర బైటికి రాలేదు. కానీ చాలా ఉపయోగపడ్తారు కమ్యూనిస్టు పార్టీకి. మేం కామ్రేడ్స్‌ని తీసుకెళ్ళి దాచిన రోజులున్నాయి. పురుషులైతే పట్టుకుంటారు, స్త్రీలనైతే పట్టుకోరని మేము ఏ స్టేషన్‌లో ఎక్కుతున్నామో, ఏ స్టేషన్‌లో దిగుతున్నామో ఎవరికీ తెలిసేది కాదు. ఆయుధాల్ని బెడ్స్‌ కింద దాచేసేవాళ్ళం- ముసలమ్మల బెడ్స్‌ కింద ఇంపార్టెంట్‌ ఇన్‌ఫరమేషన్‌ దాచేసేవాళ్ళం. అట్లా రాష్ట్రమంతటా డిస్ట్రిబ్యూట్‌ అయ్యేవి. తిరగబడ్డ స్త్రీల లాగా వేషభాషలు మార్చేవాళ్ళం. అవన్నీ టెక్నిక్స్‌. మాకు ‘షెల్టర్‌’ ఇచ్చారు. ఎంతోమంది తంతారనీ తెల్సు, కొడ్తారనీ తెల్సు. మానవతా దృష్టితో కానీ, పార్టీ భక్తితో కానీ అయ్యో రెండు రోజుల్నుంచి అన్నం లేదని చెప్పేసి, అవతల మలబారు పోలీసులున్నా సరే మాకు ‘షెల్టర్‌’ ఇచ్చారు. అన్నం దొరికింది. మరి స్త్రీలు ఆ రక్షణ ఇవ్వకపోతే మేమెట్లా బ్రతికేవాళ్ళం? అట్లా చూశారు, చేశారు. ఇక వీళ్ళకు అన్నం వండి పెట్టడం, బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకురావాలన్నా స్త్రీలే తీసుకురావాలి. నగలు మార్చాలన్నా స్త్రీలే మార్చాలి. ఒక కార్యకర్త కాకుండా ఫామిలీలు ప్రయాణం బిడ్డలతో సహా వెళ్ళటం.

మరి నేను పార్టీలోకి ఎంత బంగారంతో వచ్చాను. నా మంగళసూత్రం, మట్టెలతో సహా చిన్నమెత్తు బంగారం లేకుండా పార్టీకి ఉపయోగపడింది. ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన చైతన్యంతో చేశాం. పురుషులు చెప్తే చేయలే. మా కామ్రేడ్స్‌ అంతా నల్లుల్లా మాడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఇంక మాకెందుకవన్నీ వాళ్ళేపోగాలేందీ అని నేను నేనుగా ఇచ్చేశానన్నమాట! కమ్యూనిస్టు పార్టీ అంతా జమీందార్లనీ, ఆస్తుల్ని దోచుకుంటుంటే మరి కోటేశ్వరమ్మ నగలు పార్టీకెందుకిచ్చిందని అనుకునేవారు.

ఒక వండిపెట్టటమే కాదు, పత్రికలు బైటికి రాకూడదు. పార్టీకి సంబంధించిన పత్రికొస్తే తంతారు. మామూలు వాళ్ళను, పార్టీ వాళ్ళను కాల్చేసిన రోజులున్నాయి కదా! అట్లాంటప్పుడు రహస్య పత్రికలన్నీ ఆడవాళ్ళు సైక్లో స్టయిల్‌ చేస్తుంటే, కార్బన్‌ పేపర్స్‌ పెట్టి రాస్తుంటే రాష్ట్ర కమిటీ, ఆలిండియా కమ్యూనిస్టు పార్టీ ఏం చేస్తుంది? చరిత్రంతా మాకు తెలిసేది. అదొక టెక్నిక్‌. కాపీలు తీసేప్పుడు మానవునిలో ఉన్న సహజమైన బలహీనతలు వీళ్ళల్లో ఉన్నట్లుగా మేము చూశాం. ఈడొచ్చిన స్త్రీలని వీళ్ళు కోరటం వాళ్ళు బుద్ధి చెప్పటం, లెంపలేసుకోవటం. మీరు ఇక్కడుంటే పనికిరారు, అడవిలోకి వెళ్ళండి, పోరాట కార్యక్రమాలకి వెళ్ళమని పంపించేశారు. ఇవన్నీ చెప్పగూడ దనుకోండి; కానీ చెప్తున్నా! ఇంకా కూడా మనకు బుద్ధిలేదు అన్పించేది. హెల్ప్‌ ఇచ్చి తల్లికంటే ఎక్కువగా ఆదరించి, చంపుతారనే భయం కూడా లేకుండా కూడు వండి పెడ్తుంటే వాళ్ళకేమొచ్చింది మాయరోగం అని తిట్టుకునేవాళ్ళం.

ఇట్లా జరుగుతున్నపుడు నేను, సావిత్రక్కయ్య రాజేశ్వరరావు గార్ని అడిగాం, మేం ఉండం వాళ్ళదగ్గరా, వీళ్ళ దగ్గరా. చావో బ్రతుకో మీ దగ్గరే పెట్టుకోండి, కామ్రేడ్స్‌ అంతా చస్తున్నారు. మేం కూడా చావడానికి సిద్ధమయ్యే వచ్చాం. ఇదంతాఏంటి హిందూ సెంటిమెంట్స్‌ అనండీ, ఏమన్నా అనండీ ఎవరి భర్త దగ్గర వాళ్ళని ఆ డెన్స్‌లో పడేయండి. లేకపోతే అడవుల్లో తుపాకి పట్టుకుని సాయుధ పోరాటం చేస్తాం, అడవికి వెళ్ళి ఉండగలం అని అన్నాం. ఈ తుపాకీ నువ్వేం పట్టుకుంటావమ్మా నీ పనులు నీవు చేయి, తుపాకి పట్టుకునేవాళ్ళు తెలంగాణా వాళ్ళు వస్తున్నారు చాలామంది. ఇవి ఎవరు చేస్తారు, ఇది ఇంపార్టెంట్‌ మాకు. నువ్వెక్కడికి వెళ్తావమ్మా నీ జోలికెవరూ రారులే, ఎవరో పాపం పల్లెటూరి అమ్మాయిలు వాళ్ళు, మీ జోలికి రారు, వాళ్ళది గుండా, చెరువా! అయినా మేం కట్టుదిట్టాలు చేస్తున్నాంలే. మీరెందుకు భయపడ్తారులే గాబరా పడకండి అని అన్నారు. ఏమయ్యా, వాళ్ళకు ఇవన్నీ ఎట్లా తెల్సినై అని అడిగేవాళ్ళు కొన్నిసార్లు. ఎవరన్నా అరెస్టు అయినా మాకే ముందు తెల్సేది. ఎవరన్నా అరెస్టు అయితే వెంటనే టెక్నిక్‌ మార్చేవాళ్ళం. ఒక్కోసారి మనలోని బలహీనతతో చెప్పేవారు. కొడ్తేనో, తంతేనో, చెప్పేస్తే కామ్రేడ్సంతా బయటపడి పోతారు. అట్లా ఒకసారి పొద్దూరి సోమయ్య చెప్తే పద్దెనిమిది మందిని కాల్చేశారు. అప్పుడే అనసూయమ్మ భర్త కూడా ద్రోణాచలం దగ్గర కాల్చబడ్డారు. ఎవరన్నా అరెస్టు అయ్యేసరికి మాతో ఉన్న డెన్సన్నింటినీ, కామ్రేడ్స్‌ అందర్నీ కూడా ఒక దగ్గర్నుంచి, ఒక దగ్గరికి మార్చేవాళ్ళం.

కానీ మా దురదృష్టం, ఇంత చాకిరీ చేసినా మమ్మల్ని డెన్‌లోనే వదిలి పెడ్తారు. మా అదృష్టం బావుండి ఆ డెన్‌ ఎక్స్‌పోజ్‌ కాకుంటే వాళ్ళు అయిదురోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తారు, లేకుంటే లేదు. డెన్‌కి తాళం వేయటానికి మాత్రం వీల్లేదు. సి.ఐ.డి. ఎంక్వయిరీ చేస్తారు కదా అయితే మనవాళ్ళు వచ్చేవరకు మాకు నరకం కనిపించేది. మర్నాడు ఏ పదిగంటలకో కొరియర్‌ ఎవరో సిగ్నల్‌ ఇచ్చి వెళ్తారు. ఏ క్షణంలో పోలీసులు వస్తారో అనే భయంతో స్నానాలు కూడా చేయకుండా ఉండేవాళ్ళం. వచ్చి ఏ పిచ్చిపని చేస్తారో అనే భయం ఉండేది.

మేం కాపీలు తీస్తాం కాబట్టి మాకు కొన్ని విషయాలు అర్థమయ్యేవి. స్టాలిన్‌ ముద్రపడింది. కొందరు ఆలిండియా కార్యకర్తలు రష్యా వెళ్ళారని, స్టాలిన్‌ని కలిసారని. ఇది పోరాట కాలం కాదు, పోరాటానికి పరిపక్వత లేదు. పారిశ్రామిక కూలీలు, వ్యవసాయ కూలీలు, తుడిపీలు ఉద్యమంలోకి రావాలి. మధ్యతరగతి మేధావులే లీడర్లయ్యారు. చైనా వెనుకబడ్డ దేశమైనా, రష్యా సహకారం ఉండబట్టి రివల్యూషన్‌ వచ్చింది. అది భారతదేశానికి లేదు. ప్రస్తుతం మీరు విరమించుకోవాలి. అని పెద్ద తీర్మానమన్నమాట. ఆ తీర్మానం వచ్చిన తర్వాత పోరాటం విరమించు కున్నారు. విరమించుకొని ఆయుధాలన్నీ ఇచ్చేశారు. ‘అస్త్ర సన్యాసం అప్పుడే నటనోయి, తుప్పు గడిచినాక గొప్ప చెప్తున్నావు” అని రాశాం నమ్మకం లేక. ఇంతమందిని చంపుకున్న తర్వాత వదిలిపెట్టమంటారేంటి! రాజధాని పోవటానికి కామ్రేడ్స్‌మి ఏడ్చాం. తెలంగాణా పోలేంగా! ఇక ఒక్కొక్కళ్ళనీ బైట పెట్టారు. తుప్పు పట్టిన ఆయుధాల్ని బైట పెట్టినపుడు కొందరు హారతులు, హారతులిచ్చారు.

ఇంక బైటికి రావటంతోటే మార్క్సిస్ట్‌ల భార్యల్ని, తల్లుల్ని గ్రామాలకి వెళ్ళి, మీటయ్యారు. కొన్ని రియాక్షన్స్‌ ఎట్లా ఉన్నాయంటే, మీరంతా చల్లగానే ఉన్నారు, మా పిల్లలేగా చచ్చిపోయింది అన్నారు కొందరు! మీరు రహస్యంగా ఉండి తిప్పలుబడ్డారు, మేం బైటవుండి ఎన్నో తిప్పలు పడ్డాం అని చెప్పిన సంఘటనలున్నాయి, రేప్‌ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మధ్య తరగతి మనస్తత్వం, చెప్పలేరు బైటికి. నార్ల చిరంజీవి భార్యనైతే కాంపులోకి తీసుకెళ్ళి మూడురోజులకు వదిలిపెట్టారు. ఒళ్ళంతా గాయాల్తోటి మొత్తుకుంటూ వచ్చింది. అట్లా వాళ్ళ అనుభవాలు, సంఘటనలు మాకు, మా అనుభవాలు వాళ్ళకు చెబ్తుంటే మాకంటే గ్రామాలవాళ్ళే ఎక్కువ కష్టపడ్డారేమో అన్పించింది! కుప్పలు తగులబెట్టి, ఆస్తులు తగులబెట్టేశారు.

కనుచూపు మేరలో స్వరాజ్యం ఉందనుకున్నాం. ఆస్తులన్నీ నాశనం చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళిపోవాలి. బిడ్డలు బతకాలి ఏం చేయాలి? ఏదో బిజినెస్‌ చేసుకొమ్మని, నర్స్‌ ట్రైనింగ్‌, మిషన్‌ చేసుకుంటూ ఉద్యమాన్ని చూడండి… మాజీ కమ్యూనిస్టులు చేసినంత బాగా బిజినెస్‌ ఎవరూ చేయరు.

ఇక నా చరిత్ర ఇంకొక రూపంలోకి వెళ్ళిపోయిన తర్వాత, నేను బ్రతుకు తెరువుకోసం ఎక్కడికో వెళ్ళిపోవటం నేను ‘ఫీల్డ్‌లో’ లేను కాబట్టి, వాళ్ళందరూ నాకు మిత్రుల్లాగే కనిపిస్తారు. పాత వాళ్ళతో కలిసి బ్రతికాను కాబట్టి పాతచరిత్ర ఉంది.

(సమాప్తం)

(మనకు తెలియని మన చరిత్ర పుస్తకం నుంచి)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.