-ఉదయమిత్ర

”ఆమెకెవరూలేరు”

చివరికావ్యాన్ని రాసి కధను పక్కన పడేశాను – విపరీతమైన అసంతృప్తి …. ఆంధోళన …. నన్నీ చివరి వాక్యం సలుపుతున్నగాయంలా తయారయింది. అదికాగితం మీద కుదురుగా ఉండక, లేచి వొచ్చినాగుబామై నామెడకు చుట్టుకున్నట్లనిపించింది.

”ఆమెకెవరూ లేనట్లేనా? ఇంతలేసి స్వాతంత్య్రం ఉన్నట్టా? లేనాట్టా? సముద్రంలో మంచి నీళ్ళకేడ్చినట్లు ఇంతలేసి స్వాతంత్య్రరాజ్యంలో చిన్న న్యాయందొర్కదా?”

ఈ సమయంలో చిక్కని చీకటి రాజ్యపు నిర్బంధంలో శ్వాసిస్తున్న సమయాన ఆ పిల్ల ఏమాలోచిస్తుంటది? లేక నిద్రపోతూ పీడకలలుకంటూ ఉంటదా? మేలుకొని పొగ చూరిన ఇంటి కప్పు దిక్కు జూస్తూ పిచ్చిదానిలా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటదా? రేపా పిల్లబడికిపోతే తోటిపిల్లలెట్లోచూస్తరు? టీచర్లు ఎట్లా చూస్తరు? పెండ్లి పేరింటాల్లో చుట్టాలేమంటరు? అద్దం ముందు నిలబడి బొట్టుపెట్టుకుంటూ ఉంటే ఒంటరిగా పశువులను మేపుతూ ఉంటే…. ఏమేమి ఆలోచనలోస్తాయి?

అసలు సంగతి పెళ్లంటూ అవుతుందా? ఈ కాలంలో అన్నీ సక్రమంగా ఉన్నోళ్ళకే పెండ్లిండ్లు గావడంలేదు …. మరి ఈ బీదింటి పిల్లను, అందునా ”మచ్చ” పడ్డ పిల్లని, తెలిసీ తెలిసీ ఎవడు పెళ్లి జేసుకుంటాడు? చేసుకున్నా ఆకాపురం ఎట్లా కొనసాగుతుంది? ఇంతకూ మొగుడూ మగాడేగదా….

ఆనాకొడుకు ఆ పిల్లను ‘రేప్‌’ చేసి ఎట్లాగూ తప్పించుకునే ఉంటడు, …. వాడు బాటకడ్డంపడి బూతుజోకులేస్తే పిల్ల మనసు ఎట్లా తట్టుకుంటది? అత్యాచారం అంటే ఒక విధంగా ఆత్మను చంపడమేగదా. పుంజుకోవడం ఎంత కష్టం.

అన్నీ ప్రశ్నలే

బదుల్లేని దీప్లాతాండాలో ప్రతిచెట్టూ, ప్రతిగట్టు, చేట్టూచేమా, ఎండానీడా, గాలీవెల్తురూ అన్నీ అన్నీ కూడ బలుక్కోని ఒకే ఒక్కవాక్యం ”ఆమెకెవ్వరూలేరు” ముగింపువాక్యంగా పల్కుతున్నట్టు అదేవాక్యంలో కొండా కోనా మార్మొగుతున్నట్ట నిపించింది.

పిచ్చివాడిలా ఆవాక్యాన్ని శిలువలా ధరిస్తూ ఎక్కడెక్కడో తిరిగాను. లోకమంతా వెల్తురులేని ఓ పెద్ద గుయ్యారంలా అనిపించింది. ఎంతగింజుకున్నా ఆ ఊరు, అనిశ్శబ్దం, ఆదైన్యం ఆ అమ్మాయి నన్ను వెంటాడుతున్నది.

దీప్లాతాండాలో పక్కా ఇండ్లు బాగానే ఉన్నాయి. ”మా తాండాలో మా రాజ్యం” అనే నినాదం గోడలపై కనబడ్తోంది. ఆ పక్కన ఊరిపశువుల కోసం ఎవరో పుణ్యాత్ముడు గట్టించిన నీళ్ల హౌస్‌లో గొడ్లు దామార నీళ్లు తాగుతున్నాయి. అవతల పక్కన రాలినతుత్తుర్‌ పండ్లు కోసం పోరలు పోటీలు పడ్తున్నారు. కానుగుచెట్టు తాను విస్తరించిన మేరా చల్లని నీడను తల్లి మనసులా పంచి పెడ్తోంది. ఊరికి దగ్గరగా మొక్క జొన్న చేలు ఉండడంతో ఊరి వాతావరణం చల్లగానే ఉంది.

నేను మా మిత్రుడు పాండు చాప మీద గూచుని ఉన్నాం. పాండుకు బాధితులు బంధువులు గావడంతో పలుకరించడాన్కి వచ్చాం. మా ఎదురుగ్గా బొంత మీద కూర్చొని ఉందా అమ్మాయి.

ఆ పిల్ల ముఖంలో భయం కొట్టొచ్చినట్టుగా కనబడ్తోంది. పులి బోనులోంచి గాయాల్తోటి తప్పించుకొచ్చిన లేడిపిల్లలా ఉందామె. ఆ పిల్లమనసులో ఏఏ సుడిగుండాలు చెలరేగుతున్నాయో చెప్పడం కష్టం.

ఎంతో చలాకీగా ఉండేదట.. ఒక్క మాటంటే నాల్గు మాటలు జవాబు చెప్పే మనిషి. ఏదడిగినా బిత్తర చూపులు చూస్తోందే కాని జవాబు చెప్పడం లేదు. జవాబు స్థానంలో కన్నీళ్ళోస్తున్నాయి.

”ఎట్లా జరిగిందిరా ఇదంతా?”. అన్నాను సానునయంగా

ఆ పిల్ల చేతిని చేతిలోకి తీసుకుంటూ..

ఆ పిల్ల నుండి జవాబు రాలేదుగాని, నా చేతిలో నుండి చేతిని గుంజేసుకుంది… ఎక్కడా నమ్మకంలేని, నమ్మకం కల్గించని దైన్య వాతావరణం.. మా వైపు చూస్తోందిగాని. . ఆ కళ్లలో ఏ భావమూలేదు.

”ఆ రోజు… సోమారం నాడు పగటాల్ల జర్గింది సార్‌ ఇదంతా’ అన్నాడు తండ్రి ముందుకొచ్చి… చేతికేదో కట్టుగట్టి ఉంది…

పాండు జరిగిందంతా చెప్పమన్నాడు.

”సార్‌… గీపోరిపేరు లచ్చిమి… పదిహేనేళ్లుంటయి. గీ మా పొలంకాడ పాషా అనేటాయన పొలం ఉంటది… ఆయన దగ్గెర మేం వారి గడ్డి గొన్నంసార్‌… ఆ రోజు నా బడ్డి ఒక్కతె ఆల్లగడ్డి వాము నుండి గడ్డిదెస్తున్నది సారు.. నే నేమో సెయ్యి గుంజుతున్న దని ఇంటికాడ పండుకున్న… గీసెయ్య ఇర్గి నెల్లాల్లయ్యింది. సెర్లపల్లి కాడ కట్టు గట్టించుకుంటున్న… ఇగ మా ముసల్ది కూలి పోయ్యిందిసారు…”

”అయితే…”

”ఆ పాషాగాడు ఎప్పట్నుంచో గీ పిల్లమీద కన్నేసిండు సార్‌… ఈ పోరి ఆనికి బిడ్డలా గుంటది… ఆడికేమొ నలబై అయిదేళ్ళు.. గీ పోరికి పదిహేనేళ్ళు….’ అంది తల్లి

”గంత పెద్దోడా?” ఆశ్చర్యపడటం నావంతయ్యింది.

”ఔను సార్‌… ఆన్కి మా పోరికన్న పెద్ద పెద్ద కొడుకులున్నారు… అందున పెద్దోని పెండ్లి మొన్న జేసిండ్రు” – అంది మళ్ళీ..

”మేం ఎవరం లేము.. ఒంటరిపోరి… మా గూడెం ఇసిరేసినట్టు గ రోడ్డుకు దూరంగా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిన దారిలేదు ఫిరాది లేదు.. పోరిగడ్డి దీస్కపోతుంటె… ఎనిక్కెల్లొచ్చి… నోరు మూసి.. ఒక్క దాన్ని మొక్క జొన్న సేన్లకి గుంజుకపోయిండు… తొలుత పది రూపాయలిస్తనన్నడట…. అది ఒప్పుకోలె.. లబ్బ లబ్బ మొత్తుకున్నది. ఆ తర్వాత పైపు దీస్కొని ఈరమార గొట్టిండు.. గీ దెబ్బలు జూడున్రీ…’ – అంటూ ఆ పిల్లకు దగిలిన దెబ్బలు చూయించాడు తండ్రి.. వీపంతా కములకపోయి ఉంది… రెండు చేతులకు బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి.

”అది చిన్న పిల్లసార్‌…. ఎంత మొత్తుకున్నా ఇనకుండా సేన్లకు గుంజుకపోయి గాపని (అత్యాచారం జేసిండు సార్‌.. ఈ నింట్ల పీనిగెల్ల… ఈన్నిగొట్టేసి ఎండల గూసున…” అంటూ తల్లి శాపనార్దాలు బెట్టింది.

”ఆ టైమ్‌ల ఎవరూ లేరా చుట్టు పక్కల…”

”ఎండా కాలంల పొలాల దగ్గర పన్లేమి ఉంటుయి సార్‌”.

అందరూ కూలకువోతరు… కొందరు ప్యాక్టరీలకు, కోళ్లఫామ్‌లకు వోతరు. గీ పిల్లవొదినె గాటైమ్‌లగాగుట్ట పక్కన ఎడ్లను మేపుతున్నది… పిల్ల ఒర్లుతుంటె ఉర్కొచ్చింది… చూస్తె ఏమున్నది… పిల్ల కాల్లపోడ్లి రక్తం గారుతున్నది.. అదేపైపు దీస్కొని ఎంటవడ్డది…

”తర్వాత”

”గా భాడుకావు గుట్టల్లకురికి దాక్కున్నడు సారు…”

ఇల్లుజూస్తే ఓ వైపు కూలిపోయి ఉంది.. మట్టిపోయ్యి… అలుకనినేల.. ఓనాల్గు గిన్నెలు.. ఎప్పటివో పాత ఫోటోలు… దండెం మీద చిరిగిన పాత బొంత బరువుకు దండెం బాగా వొంగిపోయి ఉంది. తాడుకు గట్టిన తీగ ఏదో పాకలేక పాకలేక పాకుతున్నట్టుగా ఉంది. పిలిస్తే పలికె దైన్యం…

ఉన్న ఇద్దరు కొడుకులు భార్యా పిల్లల్తో గుజారాత్‌కు వలన బోయారట! ముసలి తల్లిదండ్రుల్ని చూసుకోమని తమ చెల్లెలికి అప్పజెప్పిపోయారు. ఆ పిల్ల పక్క ఊళ్లో పదో తరగతి చదువుకుంటూ ముసలోల్లకు పెద్ద దిక్కుగా ఉంటుంది. ఉన్న మూడెకరాల పోలాన్ని పంట కోసం గీకుతూ ఉంటారు… పండితే పండినట్టు.. లేకపోతే ఎండినట్టు…

ఆ పిల్ల ముఖాన్ని మరోసారి జూశాను… చేతులు గట్టుకొని ఎటో చూస్తోంది.. ఇల్లంతా తగల బడ్డాక గడప ముందు గూచొని దిక్కులు చూస్తున్న ఇల్లాలిలా ఉందా పిల్ల..

మంచి నీళ్ళు తాగి నాంక, ”సార్‌… ఒక్కసారి పొలం జూసొత్తమా?” అన్నాడోయువకుడు .. బహూశా అత్యాచారం జరిగిన చోటును చూపించాలనే అట్లా అన్నాడేమో… మేమెవరూ అభ్యంతరం పెట్టలేదు.

గట్ల వెంబడి నడుస్తున్నాం. బలహీనమైన గుంజల మీదుగా కట్టిన కరెంటు తీగలు ఏ చిన్న గాలికయినా భూమ్మిద పడిపోతాయేమొ అన్నట్లుగా ఉన్నాయి. పల్లెల మీద, తాండాలమీద అన్నీ పగబట్టినట్లే ఉంటాయ్‌… పాషాకు పోలీస్‌శాఖలో బంధువులున్నారనీ, వాళ్ల అండ జూసుకొని తమను బెదిరిస్తున్నారని ఆ పిల్ల తల్లి చెప్పుకొస్తోంది. అతని భార్య అయితే ఏకంగా ఇంటిమీద కొచ్చి బండ బూతులు తిడ్తోందట.

దూరంగా ఎటు జూసినా మనుష్య సంచారంలేదు. కొంత దూరం నడిచాక ఓ గడ్డివాము కన్పించింది… ”ఇదే సార్‌. ఆ గడ్డివాము”. అన్నాడాయువకుడు .. గడ్డి తీస్కోవడానికి తెచ్చిన పాతలుంగీ మూగసాక్షిగా గడ్డివాము మీద పడి ఉంది.

అక్కడ్నుంచి గట్లమీద నడుస్తూ, ఒంకరటింకర బాటగుండా, ఒత్తుగా పెరిగిన మొక్కజొన్న చేను దగ్గర ఆగాం.

అక్కడికొచ్చేసరికి ముసలాయనకు దుఃఖ మాగలేదు. అట్లే ఏడుస్తూ పొలంగట్టుమీద కుప్ప గూలిపొయ్యాడు.. ఓ యువకుడతన్ని సముదాయిస్తున్నాడు…

”ఇక్కడ్నేసార్‌ ”అది” జరిగింది” అన్నాడింకో వ్యక్తి… మేం దగ్గరగా వెళ్లి పరికించి చూశాం.. అక్కడంతా యుద్ధం జరిగినట్లుగా ఉంది వాతావరణం.. మొక్క జొన్న దంట్లు ఓ పక్కకు ఒరిగిపోయి ఉన్నాయి. నల్లాలం తీగలు చిదుగుచిదుగు అయిపోయాయ్‌ పుంటికూర చెట్టు సగానికి వొంగిపోయి ఉంది. కిందగడ్డీ గాదం చిందరవందరగా ఉంది… ఆ వాతావరణం చూస్తేనే తెలుస్తుంది… ఆ పిల్ల విపరీతంగా ఘర్షణ పడ్డదని.. అక్కడ గడ్డివామూ, గట్లూ, చెట్లూ మూగ సాక్షులుగా నిల్చుని ఉన్నాయి… ఈ మనుష్యులకూ నోరులేదు. అంతా పిచ్చెక్కెనట్లుంది వాతావరణం… మేం తిరిగిన చోటల్లా మమ్మల్ని ఎవరో అనుసరిస్తున్నట్టు, నేను గమనించగలిగాను.. అయితే ఏమీ తెలియనట్టే ఉండిపోయాను…

అందరం విషాదంతో వెను దిరిగాం.

”కనీసం ఎఫ్‌.ఐ.ఆర్‌. అయినా రాసి ఉంటరా పాండూ?” అపనమ్మకంతోనే అడిగాను.

”ఏమో.. చెప్పలేం…” అన్నాడతను నిర్వేదంగా.

”అదిసరే… మీరు లంబాడాలు గదా… కనీసం ఎస్‌.సి., ఎస్‌.టి. అట్రాసిటీ కింద కేసు బుక్కయితది గదా” – అన్నాను ఆఖరి అస్త్రంగా..

”ప్చ్‌… లాభంలేదుసార్‌.. అస్సలు రేప్‌ జర్గినట్టు రుజువయితే గదాసార్‌…’ అన్నాడోయువకుడు.

”ఎందుకు గాదూ?”

”సార్‌.. మీకు దెల్వని విషయం కాదుగదా… ఆడికి డబ్బున్నది.. పల్కుబడి ఉంది.. చుట్టాలున్నారు…”

”ఉంటే..”

”కొంటాడు… అందర్నీ కొంటాడు.. గీ ఒక్క సంగతే జూడున్రి.. మేం అప్లికేషన్‌ ఇయ్యనీకెవొతే ఒక్క పూట సతాయించి సతాయించి తీస్కోనీకె సుక్కలు జూయించిండు… అట్లరాయి.. ఇట్ల రాయి అని మార్చిచ్చి మార్చిచ్చి తనకునచ్చినట్టుగా రాపిచ్చుకొని తర్వాత తాత్పారంగ దీసుకొన్నడు సార్‌ ఎస్‌.ఐ సాబ్‌”

”మరి నాయకులు లేరా…”

”’ఉంటారుసార్‌… ఆల్లువాల్లు ఒక్కటి… మాకెందుకు జేస్తరు సార్‌ సాయం… గీడ రామిరెడ్డి అని ఓ పెద్ద దొర ఉన్నాడు. ఆయనకు పెద్ద పెద్దోల్లతోటి కనెక్షన్లుంటయి. . గీ ప్రాంతంల ఏ సమస్య ఉన్నా అయన బంగ్లాల పరిష్కారం గావాల్సిందే.. అసలు ఆయన్ను దాటి ఏ కేసు బయటికి వోదు…”

”అయితే.”

పాషా బంధువులు ఆయన ఇంట్లో ఉన్నారు…”

”ఫోనీ.. స్టేషన్‌ల కేసు ఎంత దాంక వొచ్చిందో కనుక్కున్నారా?”

”అమ్మో.. ఇంకానయం… మమ్ముల గాడిదాంక రానిస్తరా సార్‌…”

పాషాను అసలు స్టేషన్‌కే తీసుకురాలేదట. ఒక్కసారి జర్నలిస్టు లోస్తారనే డౌట్‌తో అతడిని కాస్సేపు స్టేషన్ల ఉంచి రాచమర్యాదలు జేసి తర్వాత ఫ్రీగా వొదిలేశారట… మరోవైపు పై అధికారి విచారణకొస్తున్నాడని తెల్సి చాకచాక్యంగా అతడిని హాస్పిటల్‌లో చేర్పించారట…

ఇంకేముంది? కావల్సిన పనులు చక చకా జరిగిపోయాయి. పేషెంటు పరిస్థితి బాగాలేదని.. వాంతులు విరేచనాలవుతున్నాయని ఫిట్స్‌ వొస్తున్నాయని.. నెర్వస్‌ బ్రేక్‌డౌన్‌ అవుతోందనీ. ఇట్లాంటివే… మాలాంటి అల్ప జీవులకు అర్థంగాని వెన్నో కలిపి తన రిపోర్టులో రాసి ఇచ్చింది డాక్టరమ్మ. అందుకని అతడిని జిల్లా ఆసుపత్రికిగాని, హైద్రాబాద్‌కు గాని తగు చికిత్స నిమిత్తం వెంటనే పంపాల్సిందిగా సెలవిచ్చిందామె..

సవాలక్ష సందేహాలు.. ఆపిల్ల దేహం మీద ఈగలై ముసురుతున్నాయి…

”అసలు రేప్‌ జరిగిందంటరా సార్‌… నాకైతే ఫుల్‌ డౌట్‌. ఆ పిల్లకేమొ పదిహేనేళ్లు… అతడికేమొ నలభై ఐదేళ్లు.. రేప్‌ ఎట్లయితది.. ఏదో మతలబుంది” ఇది ఓ జర్నలిస్టు సదసత్సంశయం.

”సార్‌ … మాకూ వాల్లకూ పొలం పంచాయితి ఉంది… మేం వాల్ల పొలంలకు మూడు నాలుగ్గజాలు జర్గినమని శానా రోజుల్నుంచి పంచాయితీ నడుస్తుంది. దాన్నడ్డం బెట్టుకొని గీ నాట్కమాడ్తున్నారు.” అస్సలు రేప్‌ అన్నమాట ఉత్తమాటసార్‌…” ఇది పాషా చిన్న కొడుకు చెప్పేమాట.

”ఈ లంబాడాలకు పనిలేదు… తాగుతరు తింటారు.. తిర్గుతారు మంచిగ బతికెటోల్లమీద రాల్లేస్తారు.. పాపం గా పెద్దమనిషి (పాషా) కు ఏవేవో అంటగట్టి, ఆయన ‘ఇమేజ్‌’ను దెబ్బదీస్తున్నరు” ఇది ఓ జిల్లా ప్రముఖుడనేమాట..

”జరిగిందేదో జరిగింది.. ఎక్కువ జేస్తే రేపు ఆ పిల్లకే కష్టం. ఈ కేసులూ, ఈ గొడవలూ, వాళ్లవల్లకాదు.. కాంప్రమైజ్‌ అయితే డబ్బు ఇప్పిస్తా” ఇది ఓ లోకల్‌ ఛానెల్‌ పెద్దమనిషి వేస్తోన్న పాచిక.

నాకు లంబాడా లక్ష్మి జ్ఞాపకమొచ్చింది.. మునిగిపోతోన్న ఓడలో నిస్సహయంగా కేకలు వేస్తోన్న మనిషిలా ఉందా పిల్ల. అన్నీ ఉన్నట్టే ఉన్నాయ్‌… ఏమీలేనట్టే ఉన్నాయ్‌… కరువు జిల్లాలో అన్నీ కరువేనా..

అవతల నేరస్తుడు బోర విరుచుకు తిరుగుతున్నాడు.. వాడికి డబ్బూ, పలుకుబడీ, బలగమూ, తెలివితేటలున్నాయి. కేసును నీరుగార్చడాన్కి పోలీసులు, డాక్టర్లు, లాయర్లు, లీడర్లున్నారు.

మరీ.. విసిరేసినట్లున్న ఈ గూడెం ప్రాంతాన… పీడకల లాంటి బతుకును మోస్తున్న ఆ పిల్లకెవరున్నారు?

”ఆ పిల్లకెవరూ లేరు…” అదే వాక్యం.. వెంటాడే వాక్యం… అంతే మరి… కొన్ని వాక్యాలు, కొన్ని సంఘటనలు ఎంతగా తుడిచిపెడదామన్నా తిరిగి తిరిగి జ్ఞాపకాల పొరల్ని చీల్చుకు ముందుకొస్తుంటాయి.

కథరాసి ఓమూలన పడేశాను. వారం రోజులయ్యింది. ఎదుగుబొదుగూ లేదు.. చివరి వాక్యం నన్ను చిందరవందర చేస్తోంది. దిక్కుమొక్కూలేని ఆ తాండాలో దీనంగా తిరుగుతోన్న ఆ పిల్లనే మాటి మాటికీ జ్ఞాపకమొచ్చి, నన్ను విపరీతంగా డిస్టర్బ్‌ చేస్తోంది.. పొద్దునే ఆఫీసుకు బయలు దేరుతుంటే, ఎందరెందరో స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు కనబడ్తుంటారు.. వీళ్లకెవరికైనా ఆ పిల్లలాంటి అనుభవం ఎదురైతే.. అమ్మో.. తల్చుకోవడానికే భయంగా ఉంది… ‘బిగింపైన ముగింపు” ఉండాలంటాడు మాచారి… నా కథకు చివరి వాక్యం ఒదగడం లేదు. మొత్తం కథంతా చించెయ్యాలనుకున్నాను… మనసొప్పలేదు…

రాస్తున్న ఫైలు పక్క బెట్టి, కుర్చీలో జేరగిలబడిపోయాను… ఎవరి పన్లలో వాళ్లున్నారు. వీళ్లందరికీ ఎవరి ఆలోచనలు వాళ్లకున్నాయి… నాకొక్కడికే ఆ పిల్లజ్ఞాపకమొస్తోంది..

బయటేదో ఆలికిడి.. ఇది లోపలి అలికిడికాదు గదా… నో. నో. ఇది బయటి అలికిడే.. ఏదో ఊరేగింపు ఉన్నట్టుంది. నినాదాలు వినబడ్తున్నాయి. బయటికొచ్చినిల్చున్నా…

ఏదో స్త్రీల ఊరేగింపు..

బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని రెండు వరుసలుగా వొస్తున్నారు… మధ్య మధ్యన నినాదాలు ఊపందుకుంటున్నాయి. కొత్త కొత్త నినాదాలు అప్పటికప్పుడు పుట్టుకొస్తున్నాయి…

”స్త్రీలపై అత్యాచారాలు – నశించాలి”

”’దోషుల్ని కఠినంగా – శిక్షించాలి – కాదు కాదు. ఊరితీయాలి”

”అశ్లీల సినిమాల్ని – నిషేధించాలి”

”అశ్లీల ఛానెళ్లను – నిషేధించాలి”

”పోలీసుల నిర్లక్ష్య వైఖరి – నశించాలి”

”ఆవాజ్‌దో – హమ్‌ ఏకహై”

స్త్రీలు ముందుకొస్తున్నారు… ఊరేగింపు పెద్దదవుతోంది… నినాదాలతో వాతావరణం హోరెత్తుతోంది.. టి.వి.లు, కెమెరాలు ప్లాష్‌.. ప్లాష్‌ మంటున్నాయి.

సరే.. ఇదేదో స్త్రీల ఊరేగింపు అనుకొని వెనుదిరిగి వెళ్లబోయాను. అప్పుడు గాలిని చీల్చుకుంటూ వొచ్చిందో నినాదం” అబ్దుల్‌ పాషాను అరెస్ట్‌ చేయాలె” అని. అది పిడుగుపాటులా అన్పించింది. గిరుక్కున తిరిగి, నినాదంవొచ్చిన వైపు చూశాను. ఊరేగింపు మధ్యన లంబడాలక్ష్మి!! నాకళ్లను నేనే నమ్మలేకపోయాను. కళ్లు నులుముకొని మరోసారి పరికించి చూశాను. ఆ పిల్లనే .. పిడికిలెత్తి.. ఎవరినో గుద్దినట్టుగా నినాదాలిస్తోంది. గొంతులో కోపం, కసీ స్పష్టంగా కనబడ్తున్నాయ్‌.. బలంగా, స్థిరంగా అడుగులేస్తోంది.

ఆ పిల్ల ఈ పిల్లేనా.. ప్రశ్నలడిగితే జవాబుగ ఏడ్చిన ఈ పిల్లేనా నినాదాలిస్తోంది. ఎంతలో ఎంత మార్పు.. ఎక్కడి నుంచి వొచ్చిందా బలం.. ఒంటరిగా ఉన్నప్పుడు మాటరాని పిల్ల ఇప్పుడు ఊరేగింపులో తూటాల్ని పేలుస్తోంది. ఎంత విచిత్రం.. మూగ భూమి పగిలి దావానలం బైటికొస్తోంది.

ఆ పిల్ల ఒళ్లంతా చెమటతో తడిసి ఉంది నెత్తంతా.. చిందరవందరగా ఉంది… కాళ్లుదుమ్ము గొట్టుకొని ఉన్నాయి. అయితేనేం. అగ్నికణంలా రగిలిపోతోంది.. లోపలి గాయం ఎంతగ సలిపిందో.. అది కోపమై, నినాదమై గాల్లో మారుమోగుతోంది..

నాకు ”మృత్యుదండ్‌” సినిమా యాదికొచ్చింది. అందులో జమీందారు భార్య అతి భయస్తురాలు… భర్త అంటే వొణికి చస్తుంది. అల్లాంటి జమీందారు దుర్మార్గురాలకు వ్యతిరేకంగా ఊరి స్త్రీలంతా ఏకమై తిరగబడ్తారు… చిత్రమేమంటే ఆ ఊరేగింపుకు అగ్రభాగాన అతని భార్య నడుస్తుంది.

ఇంతకూ ఆ పిల్ల నన్ను గుర్తు పట్టిందో.. లేదో.. నేను ఆశ్చర్యం నుండి తేరుకునేలోపున ఊరేగింపు దాటెల్లిపోయింది.

సాయంత్రం ఇంటికొచ్చాను…

మనస్సు తేలిక పడ్డట్టయ్యింది… పిల్లల్ని పిలిచి ముద్దు పెట్టుకున్నాను. కాగితాల్ని ప్రేమగ తడిమాను. పాత సినిమాలో పాటలు పాడుకున్నాను. చెట్టుమీద పక్షికూత మరింత అందాన్ని సంతరించుకొంది. బొత్తిగా చిన్న పిల్లాడినైపోయాను.

రాసి పక్కన పడేసిన కథను మళ్లీ చేతిలోకి తీసుకున్నాను… ”ఆమెకెవరూ లేరు” చివరివాక్యం నన్ను సవాలు జేసినట్టని పించింది. వెంటనే పెన్ను దీసుకొని దాన్ని కొట్టిపడేశాను. గుండెమీద బండరాయి దీసినట్లనిపించింది. నిద్రరెండు చేతుల్తోనన్నా హ్వానించింది.

ఆ రాత్రి నాకో కల వొచ్చింది. వేలాది దీపాల మధ్యన కూచొని నేనో కథ రాసుకుంటున్నా.. నా అక్షరాలన్నీ ఒక్కటొక్కటే కనుమరుగయిపోయి, వాటి స్థానంలో ”లంబాడా లక్షి” నిల్చిపోయింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో