మానవీయ భాష నేటి అవసరం

ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ”పాలపిట్ట పాట – ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు” వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ”పల్లెటూరి పిల్లగాడా” పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.

నిజానికి ఎడిటోరియల్గా వస్తున్న ఈ కధనం రిపోర్ట్ల్లో రావలసింది. కానీ ఆనాటి ఆ సమావేశంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన వల్ల సంపాదకీయం రాయాల్సి వస్తోంది. అయితే ఇది ఒక ఉద్యమాన్ని కించపరచడానికో, వ్యక్తిగతంగా ఎవరినో దుమ్మెత్తి పోయడానికో రాస్తున్నది కాదు. అస్తిత్వ ఉద్యమాల పట్ల ఉద్యమంలో వున్న వారి నిబద్ధత పట్ల వున్న గౌరవానికి ఈ సంపాదకీయానికి ఏలాంటి సంబంధమూ లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల మాకెలాంటి వ్యతిరేకతా లేదు. ఇంతకు ముందు భూమిక తెలంగాణా పోరాట నేపధ్యంతో ” ప్రత్యేక తెలంగాణ సంచికను” కూడా వెలువరించిన విషయం విస్మరించకూడదని మనవి.

అయితే ఆ రోజు సమావేశంలో జరిగిన సంఘటనని ఎత్తి చూపాల్సిన అవసరం చాలా వుంది. మీటింగు మొదలవ్వబోతోందని సూచిస్తూ తెలంగాణ వైశిష్ట్యం గురించి ఒక పాట పాడ్డం మొదలుపెట్టారు. పాట మంచి ఊపుగా, ఉద్విగ్నంగా సాగుతోంది. సభికులు పాటను ఆస్వాదిస్తున్నారు. నేనూ అదే మూడ్లో వున్నాను. హఠాత్తుగా, కర్ణకఠోరంగా వినబడిన పాటలోని ఒక వాక్యం నన్ను దిగ్భ్రమకి గురి చేసింది. నిలువెల్లా వొణికించింది. కోపంతో నో..నో..అని అరిచాను కూడా.
తెలంగాణ అపుడెలా వుండేది, ఇపుడెలా వుంది పోలుస్తూ సాగుతోన్న పాటలో
”నిండు ముత్తయిదువులా ఉండేదానివి
ముండ మోపి లెక్క నయ్యావే తెలంగాణ…”

ఆ పాటని పాడుతున్న వాళ్ళల్లో ఇద్దరు స్త్రీలు కూడా వున్నారు. ఆ వాక్యాలని వాళ్ళెలా ఉచ్ఛరించగలిగేరా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు గుండెల్లో ముల్లు గుచ్చుకున్నంత బాధేసింది. నేనింక అక్కడ ఒక క్షణం నిలవలేకపోయాను. చివరి దాకా సమావేశంలో వుండి పాటలన్నింటిని వినాలని కూర్చున్న నేను, ఆ ఒక్క పాట అవ్వగానే లేచి హాలు బయటకి వచ్చేసాను.పాట పాడిన వాళ్ళని పిలిచి పబ్లిక్ మీటింగులో ఆడవాళ్ళని అవమానిస్తున్న ఆ పాటని మీరెలా పాడగలిగేరు అని అడిగితే సరైన సమాధానం రాలేదు.

విప్లవోద్యమ నేపధ్యం, ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యం కలిగిన వ్యక్తులు వేదిక మీద, వేదిక కింద ఆసీనులై వున్న ఆనాటి సమావేశంలో స్త్రీలని ముత్తయిదువలని, ముండ మోపులని చీలుస్తూ, అవమానిస్తూ గొంతెత్తి పాడటాన్ని నేను ఈ రోజుకీ జీర్ణించుకోలేక పోతున్నాను. అభ్యుదయ వాదులూ, విప్లవ వాదులూ కూడా ఇంకా స్త్రీలను అవమాన పరిచే భాషను వదులుకోలేక పోతున్నారే అని చాలా బాధపడుతున్నాను. స్త్రీలను కించపరిచే భాషను భాషాశాస్త్రం నుంచి తొలగించాలని ఒక వైపు స్త్రీవాద ఉద్యమం డిమాండ్ చేసి కొంతవరకు మామూలు సాహిత్యకారుల్లో సైతం ఒక అవగాహనని కల్గించినా అభ్యుదయవాదులు, విప్లవ వాదులు దీన్ని వొదిలించుకోలేకపోవడం చాలా దు:ఖంగా అన్పిస్తోంది.

తెలుగు భాష నిండా స్త్రీలను కించపరిచే పదాలు – మానభంగం, అనుభవించడం, చెరచడం, ముండమోపి, ముత్తయిదువ, అయిదోతనం, శీలం, అబల, సౌభాగ్యవతి లాంటి పితృస్వామ్య సంస్కృతికి అద్దం పట్టే పదాలు కుప్పలు తెప్పలుగా వున్నాయి. ఇలాంటి దారుణ పద ప్రయోగాలను భాషా శాస్త్రం నుండి తొలగించడానికి ఒక భాషా సాంస్కృతిక విప్లవంలో పాలు పంచుకోవాల్సింది పోయి అభ్యుదయ వాదులు కూడా వివక్షాపూరిత భాషను యధేేచ్ఛగా ప్రయోగించడం అర్ధం చేసుకోలేకపోతున్నాను.

ఇప్పటికైనా స్త్రీలకు సంబంధించి ఒక గౌరవ ప్రదమైన మానవీయ భాషను, ప్రత్యామ్నాయ పద ప్రయోగాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని అభ్యుదయ వాదులతో సహా అందరూ ఆలోచించాలని, పెద్దు ఎత్తున చర్చను లేవనెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

5 Responses to మానవీయ భాష నేటి అవసరం

 1. satyanarayana Tirunagiri says:

  భూమిక సంపాదకులకు,
  ఈ పాట రాసింది గద్దర్. పైగా చాల రోజుల్నించీ ఈ పాట ప్రచారం లో ఉన్నది. ఈ పాట ఒక సి. డీ లో వచ్చింది కూడానూ. ఈ విషయం గద్దర్
  కు తెలియజేసే ప్రయత్నం జరిగిందా? జరగక పోతే వెంటనే జరగాలని నా మనవి. ఇటువంటి పోలికలు, అభ్యంతరకరమైన భాష ఉన్న
  పాటలు వాటిని రాసిన రచయితల దృష్టికి తీసుకు వచ్చి ఆయా రచయితలచే ఇవి ఎందుకు అభ్యంతరకరమో గుర్తింపజేసే
  ప్రయత్నం జరగాలి. వారిచే తమ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయించాలి. నాకు తెలిసి ఒక పాట గద్దర్ లాంటి పేరున్న కవి
  రాసినప్పుడు అందులో ఇటువంటి అంశాలేవైనా ఉంటే వెంటనే ఆయన దృష్టికి తీసుకు రావడం జరగదు. అది మొహమాటం వల్లనో,
  లేదా ఆయనకున్న పేరు చూసి జంకడం వల్లనో లేదా ఆయన సరిదిద్దుకోడేమో అన్న అపనమ్మకం వల్లనో జరగొచ్చు. ఆయన పాటలు
  పాడే వాళ్ళు కూడా ఇటువంటి విషయాల పట్ల అంత సీరియస్ నెస్ చూపకపోవడం కలదు. కాబట్టి ఇటువంటి స్త్రీలను కించపరిచే భాషా
  సాంస్కృతిక అంశాలు పాటల్లో కానీ, సాహిత్యంలో కానీ కనబడితే ముందుగా ఆ రచయితల (వాళ్ళు అందుబాటులోనే ఉన్నారు
  గనక ) దృష్టికి – వారెంత పేరున్న వారైనా సరే – తీసుకువచ్చి మార్పించే ప్రయత్నం మార్పించే విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి.
  తర్వాత వాటిని పాడే వారి దృష్టికి తీసుకు వచ్చి పాడకుండా ఆపే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం సమిష్టిగా జరగాలని నా అభిప్రాయం.
  అంతే గానీ ఒక వేదిక మీద నుండి ఈ పాట పాడడం జరిగింది కాబట్టి ఆ వేదిక పైనున్న వాళ్ళందరికీ అవగాహన లేదనో, లేదా స్త్రీల పట్ల
  మొత్తంగా విప్లవ శిబిరం లో ఉన్న వారికి గౌరవం లేదనో వారింకా స్త్రీలను అవమాన పరిచే భాషను వదులుకోలేకపోతున్నారనో అనుకోవడం
  సరి అయింది కాదేమో!

 2. Seela SubhadraDevi says:

  సత్యవతి గారు
  మీ సంపాదకీయం చాలా బాగుంది.అందరూ ఆలొచించాల్సిన విషయం.

 3. ఆగస్ట్ 6న హైదరాబదులో నా ప్రత్యేక తెలంగాణ పాటల సి.డి లు (పాలపిట్టల పాటలు, తెలంగాణ వీరగాధ – బతుకమ్మ పాట) విడుదల సందర్భంగా పాడిన ఒక పాట గురించి భూమికలో సంపాదక వ్యాఖ్య చదివిన.

  ఆ పాట పాడిన సమయంలో నేను సభలో లేను. చుండూరు అమరుల స్మారక సభలో పాల్గొనడానికి ప్రెస్ క్లబ్ కు వెళ్లిన. సంపాదక వ్యాఖ్య చదివిన పాఠకులు ఆ పాట నా పాటల సి.డి లో ఉన్నదని భావించే అవకాశం ఉంది. అది నా పాట కాదని సంపాదకులకు తెలుసు. “చివరి దాకా సమావేశంలో వుండి పాటలన్నింటిని వినాలని కూర్చున్న నేను, ఆ ఒక్క పాట అవ్వగానే లేచి హాలు బయటకి వచ్చేసాను” అంటే ఆ ఒక్క పాట నేను రాసినదని పాఠకులకు అపోహ కలిగించడమే కదా! తెలిసి కూడా అది నా పాట అని పాఠకులు భావించే విధంగా అస్పష్టంగా వ్రాయడం అభ్యంతరకరం. ఆ రోజు సి.డి ల విడుదల సభకు విమల రాలేదు.

  స్త్రీని ఆకాశంలో సగంగా గుర్తించి గౌరవించడం నేను మొదట నగ్జల్బరీ రాజకీయాలతోనే నేర్చుకున్నాను. అయినా 1978లో నా కవితా సంకలనం ‘స్వేచ్ఛ’ లో ఒక అభ్యంతరకర మాట వాడినపుడు రంగనాయకమ్మ గారు ‘ప్రజాసాహితి’లో సమీక్షిస్తూ నా తప్పును గుర్తింపజేసింరు. నేను ‘సృజన’ ముఖంగా అప్పుడే క్షమాపణ చెప్పుకున్నాను.

  తెలంగాణ అస్థిత్వ ఉద్యమమైనా, స్త్రీవాద అస్థిత్వ ఉద్యమమైనా, మరే అస్థిత్వ ఉద్యమాలైనా, విప్లవోద్యమమైనా ఉమ్మడిగా ఆధిపత్య భావజాలాన్ని ప్రశ్నించి ప్రజాస్వామ్య సంస్కృతిని పెంపొందించి కృషి చేయాలని భావించే వారిలో నేను ఒకన్ని.

 4. CheLa says:

  మీ సంపాదకీయం చదివిన తర్వాత రాసినవారికి లేకున్నా పాడేవాళ్లకి, వినేవాళ్లకి లేదా అని అనిపించింది. అయితే మనం ఇంకా పితృస్వామ్య, భూస్వామ్య వ్యవస్థలోనే ఉన్నాం. చైనాలో భావజాల మార్పుకే సాంస్కృతిక విప్లవం కొనసాగిందని మీకు వేరే చెప్పనక్కర్లేదు.

 5. సంధ్య says:

  భూమిక సంపాదకులు సత్యవతి గారికి,
  ఆగస్ట్ 6వ తారీకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హాల్లో వరవరరావు గారి సి.డి ల ఆవిష్కరణ సభలో పాడిన ఒక పాట గురించి మీరు స్పందించిన తీరును భూమికలో చదివిన.

  సభ ప్రారంభంలోనే ‘అమ్మా తెలంగాణమా! ఆకలి కేకల గానమా!’ అని ఒక మిత్రుడు పాట ఎత్తుకునే వరకు ఆ పాట పాడుతడని మాకు తెలియదు. వరవరరావు గారి సి.డి లోని పాట పాడుతడని కోరస్ ఇవ్వడానికి వేదికనెక్కినం. పాడే పాటని మధ్యలో ఆపలేం కాబట్టి మీరు చెప్పిన అభ్యంతరకర మాటలను మేము ఉచ్ఛరించలేదు. స్త్రీలను కించపరిచే పదాలను వాడడం నాకూ అభ్యంతరమే.

  మీరు నన్ను ఈ పాట ఎవరిది అని అడిగితే గద్దర్ పాట అని చెప్పడం జరిగింది. మీరు రచయిత ప్రస్తావన అయినా లేకుండా పాడినవారి మీద, విన్నవారి మీద విమర్శ చేయడం న్యాయంగా అనిపించలేదు. పాట పాడిన మిత్రుడికి ఆ పాటలోని పదాలని మార్చుకొని పాడమని చెప్పడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో