– గోపి భాగ్యలక్ష్మి

సమయం నాలుగు అందరు.. వచ్చినట్టేనా? బస్‌ కండక్టరు టికెట్లు కొడుతూ అడిగిండు. అయ్యొ కొంచెం ఆగవు సారు, మా పిల్లాడు ‘చాయ్‌ తాగనికె పొయిండు’ ఓ నడి వయసు పెద్దమనిషి బ్రతిమిలాడాడు. బస్సెక్కినంక నే అన్నియాది కస్తయ్‌ కండక్టరు చిటపట లాడిండు. మీరు గట్లంటె ఎట్లసారు అన్నోడు ఓ ప్రయాణికుడు. బస్‌ ఎల్లేది మూడున్నరకే పెద్దయ్యా! లేటయితే మాకు మాటస్తది. అని సముదాయించాడు డ్రైవరు. ”ఎండకాలం” ఉడుకుడు వశపడ్తలేదు బండి గదుల్తె నన్న గాలాడుతది. వెనక సీట్ల గుసున్న నర్సవ్వ యాష్ట పడుకుంట ”కొంగు” ఇసురుకున్నటె చాయ్‌ తాగనిరె పోయిన పిల్లగాడు రానె అచ్చిండు, ముందు సీట్లో వున్న పోతన్న అనంగనే కండక్టరు రైట్‌ రైట్‌ అని గంట గొట్టాడు. బస్సు మెల్లిగ మెల్లిగ బయల్దేరింది. అందరికి ఊపిరాడినట్టైంది. బస్‌లో తన తండ్రి ప్రక్కకు కూసున్న ‘గంగ’ కి చమటతో పాటు కండ్లల్ల నుంచి నీళ్ళు ధార గట్టినట్టు అడుస్తున్నయి. ప్రక్క సీట్ల కూసుని గంగను చూసిన రాజయ్య, తన బిడ్డ గంగ ఏడుస్తున్నదని మనసంతా కల కల చేసుకొన్నడు.

”నెమలి కండ్లల్ల నుండి ధార గట్టినట్లున్నది ”గంగా! ఎందుకే వల వలా ఏడ్వవడ్తివి. ఏమయిందే ఇప్పుడు బిడ్డా రేపు లేదు ఎల్లుండి అల్లుడు రానెవట్టె అల్లుడు దుబాయ్‌ నుంచి మనందర్ని చూడనీకె. బయలుదేరి రావట్టె మన కష్టకాలం ధీరినట్టె గదనె… బిడ్డను సముదాయించిండు రాజయ్య. కండ్లు తుడుసుకొని గంగ తండ్రి దిక్కుచూసింది. బిడ్డ గంగ నయితే సముదాయించిండు గాని రాజయ్య మనసంత నీళ్ళ ”నిండు కుండ” అన్నట్లున్నది. అరవై ఏళ్లు నెత్తిమీద పడినట్లే ఈ వయసుల ”పిల్లల” లాగ్గాలు… ”అయినాలు” చేసి నిమ్మలంగా… రామ రామ అనుకుంటు వుండేది కాని బతుకంత గాలి దుమారం లేసిన లెక్కున్నది అనుకున్నడు, మనసులనే… రాజయ్య మొఖంల విచారంతో పాటు కళ్ళల్ల సన్నగ నీటి పొర సైతం కదిలింది. మనసు నిండా మబ్బు మబ్బుగా వున్నట్లుగా అనిపించింది అయ్యా!! గంగ తండ్రిని పిలిచింది. రాజయ్య – ఏంది? అన్నట్లు చూసిండు అయ్యా! నా బతుకు గిట్లయిందేమే?? అంది మెల్లగా… అంతా ”రాత” తల కొట్టుకొన్నాడు రాజయ్య ఆడపిల్లకు చిన్నతనంల లగ్గం చేత్తె గిట్లనే వుంటది అని మనుసుల అనుకొని అయినా గంగా! మీ అవ్వ మొత్తుకొన్నదే గంగ పసిపిల్ల పదియేనేండ్లు దాటలేదు దానికి. ఇప్పుడే ”లగ్గం” ఎందుకు అని. నేనే ఇనకపోతిని అన్నడు. అయన్ని ఇప్పుడెందుకు గాని పోనియ్యే అయ్య! అని తండ్రిని సముదాయించింది గంగ. కాని తన పెళ్ళికోసం ఆనాడు తన తండ్రి ఎంత రగడ చేసి లగ్గం చేసిండో యాదికచ్చిపోలె తల్లి. మీది మీదికిపోయి కొట్టపోయిండ. – ఏదే నీల్గుతున్నవ్‌. అని తిట్టిండు.

మంచి సంబంధం కాల్ల కాడికి వస్తె ‘బల్లి’ శకునం లెక్క పల్కుతున్నవు ‘పిల్లి’ లెక్క ఎదురు పడుతున్నవు ”ఇయ్యల్ల” వున్న కాలం రేపుంటదా రెక్కలు ఆడిన్నాడే నెత్తిమీద బరువు దించుకోవాలె. గంగ వెనక పిల్ల గౌరి, ఎదగవట్టె ఇద్దరికి ఒక్కసారె లగ్గాలు అంటే అయ్యే పనేనా? పిలగాడు పిల్ల ఈడు జోడుగున్నరు, ఇంతో అంతో ‘వ్యవసదార్లు’ మంచిగ బతుకుతరు అని వున్న ఇల్లు తాకట్టు పెట్టి నెల తిరగకుండా గంగకి లగ్గం జేసి అత్త వారింట పంపిండు.

లగ్గం అయింది ఇటు ”వయినం” అటు వయినం” తిరుగుతుండగానే ఏడాది గడిచింది. బస్‌ ఆగింది. బస్‌ కండక్టర్‌ ”కుందన్‌ పల్లి” అచ్చింది. దిగేటోల్లు దిగుండ్రి. అని మొత్తుకుంటుండు. దిగేటోల్లు దిగిండ్రు. ఎక్కేమంది ఎక్కిండ్రు. కండక్టర్‌ రైట్‌ పోనియి. అని డ్రైవర్‌కి చెప్పిండు. బస్‌ కుదుపులతో ప్రయాణం సాగుతుంది. రోడ్డు మలుపు తిరిగింది. గంగ మనసులో రెండేళ్ల కింద జరిగింది కండ్లముందు తిరుగుతుంది. లగ్గమయి ఏడాది తిరిగిందో లేదో అత్తవారింట్ల ”ఆరడి” సురువయింది. బాధ మొదలైంది. అత్త సూటిగా తిట్టుడు సురు చేసింది. మామ నడుమ నడుమ మాటలంటాండు. ”ఇగో ఓ కోడలు పిల్లా- ఇను ఇటు నీ మొగడు, ఇటు నువ్వు తినుకుంట కూసుంటె కొండలు గూడ తరుగుతయి. మా ఇంట్ల నడవద్‌ అప్పుడే అనంగనే గంగ గుండెల్లో గుబులు పుట్టింది. తోటికోడలు పిల్లి మీద, పిట్ట మీద బెట్టి ఇసురుతుంది.

ఇక ఆడబిడ్డ అయితే తెగేసి చెప్పింది. ”ఇగో పిల్లా! మా తమ్ముడు ఉత్తగ ఖాళీగా తిరుగుతె మాకు మంచిగ అనిపిస్తలేదు. మావూరి పెద్దమనిషి వూళ్ళె కొందర్ని ”దుబాయ్‌” పంపిస్తుండు. లక్ష దాక కావచ్చు. మవాళ్ళ తాన పైసల్లేవు అక్కడ ఇక్కడ అడిగి డెబ్బయ్‌ వేలు సగవెడ్తం… ఇంకో ముప్పయి తక్కువుంది. మీ తల్లిగారింటికి పోయి అడుగు. ముప్పయి వేలయితే గాని మా తమ్ముడు దుబాయ్‌కి పోజాలడు అన్నది.

గంగ గుండెల రాయి వడ్డది. ఏడాది కింద లగ్గం చేసెటందుకు తన తండ్రి ఎన్ని యాతనలు పడ్డడు. ఎందరి కాళ్లు పట్టుకొన్నడో. తనకు తెలవంది కాదు.

మెల్లిగా మొదటిసారి గంగ అత్తవారింట నోరు విప్పింది. ఆడబిడ్డ వదినా నువ్వు ఆడబిడ్డవు అక్కవోసుంటె దానివి. నీకు గాకపోతే నా బాధలు ఎవరికి చెప్పాలె. ఏడాది క్రింద ఇల్లు గిరువ వెట్టి ఎకరం చేను అమ్మి నా లగ్గం జేసిండు. మల్లి గిప్పుడు దెమ్మంటె యాడ్నుంచి తెస్తడు చెప్పు అన్నది. ఆ మాటలు విన్న గంగ అత్త గయ్యిమని లేసింది. ”ఏందో దునియ”ల నీ అయ్యనే లగ్గం జేసిండా? మేం మా బిడ్డలకు జెయ్యలేదా?? దీర్ఘాలు దీసింది మూతిరుసుకుంట.

ఆడబిడ్డ కలగజేసుకొని ఆగే అవ్వ నేను గంగతో చెపుతున్న గదా. అని ‘అది గాదే గంగా మా తమ్ముడు దుబాయ్‌కి పోయి నాలుగు రాళ్ళు ఎనుకేసుకొని అస్తె నువ్వు సుఖపడతావు. ఇల్లు తీరుగ అయితది. ఊరి మీద ఖాళీగా తిరుగుతుండు. అది గాక మా అయ్య అవ్వ ఇయ్యల ఉంటరు. రేపు పోతరు. మేం ఏం చెప్పినా నీ మంచికే గంగా అన్నది. గంగ మాట్లాడ పోయింది. ఇగ ఏం మాట్లాడకు. తొందర ఏం లేదు. ఒక నెలవరకు మీ వాళ్ళని సుదురాంచుకొమ్మని చెప్పు. బట్టలు గిట్ట సర్దుకొని బుక్కెడంత దిని బస్సు ఎక్కు అన్నది ఆడబిడ్డ. అదే రోజు పుట్టినింటికి పయనమైంది గంగ.

అయ్య అవ్వ సంగతి అంతా విని నెత్తి గొట్టుకొని ఏడ్చిండ్రు. నాయిన ఊళ్ల అడగ రానోల్లను గూడా కాళ్లు మొక్కి అడిగిండు. ఊరి పెద్ద దగ్గరికి పోయిండు. ”ఎట్లనె రాజన్న! మొన్ననె బిడ్డ లగ్గమంటె అంతో ఇంతో సగవెడ్తియె ఇగ నాతోని గాదు అన్నడు. ఎక్కడా ఆశలేదు. అవ్వ ఏడ్చుకొంట చెవుల ‘పడిగెలు’ కుపికట్ట గుండ్లు అమ్మి అయ్య చేతిల ముప్పయి వేలు పెట్టింది. రాజయ్య గుడ్ల నీళ్లు గుడ్లల్ల నింపుకొని బిడ్డా గంగా ”ఇగ నీ అత్తింటికి పో. మాకు ఆశ పడకుంట. బతుకుండ్రి ఆ అని. గంగను అత్తవారింటికి పంపిండు. నెల తిరిగింది. భర్త దుబాయ్‌కి పోయిండు. రెండు నెలలకి ఉత్తరం రాసిండు.

ఓ రోజు గంగను పిలిచి అత్త మామ ఇట్లన్నరు. ఇగో కోడలా! మేమా చేనుకు చెలకకు పోయేటోల్లం. పొద్దుగాల పోయి పొద్దుపోయినంక కొంపకు చేరుడు. నువ్వు చూస్తె అయిసుల వున్న పిల్లవు. నిన్ను ఎవరు కాపాడుకుంట ఇంట్ల వుంటరు. ఎవలు కావలి గాస్తారు అందుకోసం మంచికోసమె చెపుతున్నం. నువ్వు మీ తల్లి గారింటికి పో మల్ల, మా ‘కొడుకు’ కొమురన్న అచ్చినంక మల్ల తీసుకచ్చుకొంటం నిన్న అన్నరు. గంగ తండ్రికి కబురిచ్చిండు మల్ల రాజన్న బిడ్డను తీసుకొని పోయిండు. రెండేండ్లు కావచ్చింది, దుబాయ్‌ నుంచి అల్లుడు వస్తుండని జాబు రాసిండు. ఇప్పుడు గంగను అత్తగారింటికి తీసుక పోతండు. ఏం మనుష్యులో ఏం కాలమో. రాజయ్య ఊసురుమన్నడు. తండ్రి ప్రక్కకి సీట్లో కూసున్న గంగకి ఎవరో ఎడమ భుజం మీద చేయివేసినట్టనిపించి ఉలిక్కిపడ్డది. వెనకకు తిరిగి చూసింది. బాగా లేగి ఉన్న ప్రక్క ఊరి ”రంగడు” పళ్ళు ఇకిలించిండు. కోపం అచ్చింది. ఏయ్‌ ఎవలు నువ్వు కావరం అచ్చిందా? చెయితీయ్‌ అన్నది గంగ. రంగడు చేయి తీయలేదు. బస్సు బోతున్నట్టే చెయి ముందుకు బోతుంది. ”ఏయ్‌ దొంగోడా! మా నాయనక” కి చెపుతా. తండ్రిని సూపిచ్చింది. ”గంగా నీకోసం యాడాదినుంచి కాపు గాస్తున్న ఇయ్యాల చిక్కినవు. అంటు నవ్వి సీట్లనుంచి లేసిండు. అది బస్సు అని అందుల జనం ఉన్నరని కూడా. ఏమేమో ఒర్రుతున్నడు అయ్యా లెవు ఈ తాగుబోతోడు చెయ్యేసి ఏంది అంటే ఏమేర్రుతుండ తండ్రికి చెప్పింది గంగ. రాజయ్య ఏంది బిడ్డా ఏందే అనుకుంటూ లేసిండో లేదో ఎనక నుంచి రంగడు ఒక లెక్కన లేచి ముంగటి కచ్చిండు. ”ఇయ్యాల నీ అయ్య గాదే ఆ దేవుడు కూడా నిన్ను ఆదుకోడు అంటూ ముందు సీట్లో గూసున్న గంగ చేయి పట్టుకొని బర బర గుంజుకుంట బస్సు తలుపు కాడికి దొబ్బుక పోతుండు. బస్సుల ఉన్న వాళ్ళు అందరు అట్లనే చూస్తుండ్రు. రాజయ్య అయ్యో నా బిడ్డని ఏం చేత్తవురా? నెత్తికొట్టుకుంట మొత్తుకుంట ఎనకకి ముందుకి తండ్లాడుతుండు. కండక్టరు బెల్‌ గొట్టిండు. బస్‌ ఆగింది. అందరు కండ్లప్పగించి చూస్తున్రు. రంగడు బలిష్టమైన మనిషి. కండలు తిరిగిన వాణ్ణి ఆపలేక అన్యాయం చూడలేక కండ్లు మూసుకున్నారు. పులి నాట్ల చిక్కిన జింకపిల్ల లెక్క గంగ అయ్యా! అయ్యా! అంటూ గింజుకొంటుంది ఏడుస్తుంది. ఓ పెద్దమనిషి కొంచెం ధైర్యం తోని ఏందిరా ఇంతమందిమి వుండంగ ఆడపోరిని ఆగం చేయ్యవడ్తవా పోయే కాలమారా! అన్నడు.

దానికి రంగడు పండ్లు కొరుకుతూ ”ఏయ్‌ ముసులోడా! సచ్చేడిది వుందా?? నోరు మూసుకొని మూలకి గూసో! అన్నడు రంగడు. అందరు భయపడుతుండ్రు. కారణం వాడు ఇదివరకే రెండుసార్లు జైలుకు పోయి అచ్చిండు తెగిచ్చినోడు. ఆ సంగతి అందరికీ తెలుసు. బస్‌లో వున్న ఆడోళ్ళు ”శాపాలు” పెడుతున్నరు. కండక్టరు ధైర్యం తెచ్చుకొని బస్‌ తలుపుకి అడ్డం నిలుసున్నడు. రంగడు ఒక చేత్తో గంగని పట్టుకొని కండక్టర్‌ని కిందకి ఇంకో చేత్తో దొబ్బేసి బస్‌లనుంచి దునికిండు. డ్రైవరు లేచేవరకే గంగని బస్‌ కిందికి ఈడ్చుక వచ్చిండు. కండక్టర్‌ తలకాయకి దెబ్బ తగిలి కింద పడ్డడు. డ్రైవర్‌ రంగడ్ని పట్టుకోబోయిండు. అందలేదు. అపుడు కొంచెం కొంచెం చీకటి పడుతుంది, డ్రైవరు దగ్గర వున్న పోలీసు ఠాణాకు పోన్‌ చేసిండు. బస్‌ల ఉన్నోల్లంతా భయంతో బిక్కు బిక్కు మంటుండ్రు.

వెనక సీట్ల కూసున్న దేవన్నకు మెలుకువ వచ్చింది. దేవన్నకి దూర పయనం చేస్తున్నవాడు. అలసిపోయి నిద్రల వున్నడు. జరిగింది సరిగా తెలువదు. ఎవరో లేపి అంతా చెప్పిండ్రు. పరిస్థితి అర్థమైంది. దేవన్న వెంటనే ”సుడిగాలి” లెక్క కిందికి దునికిండు. దేవన్న ‘మిలట్రి లో శిక్షణ తరువాత తమ ఊరికి తన ఇంటికి వెళ్తున్నడు. ఇప్పుడు ఈ బస్‌లోని సంఘటన అంతా ప్రమాదంగా వుందని దేవన్నకి అర్థం అయింది. రాజన్న దిక్కు చూసిండు. రాజన్న పాపం పిచ్చిపట్టిన వాడిలా ఏడుస్తున్నడు. బిడ్డా!! నీ అత్తగారికి నేను ఏం చెప్పాలె. నీ పెనిమిటి దుబాయ్‌ నుంచి అచ్చి నా గంగ ఏదంటే నేను ఏం చెప్పాలె రాక్షసుడు (రంగడు) నీ వెంట ఎప్పుడు పడ్డడు. ”రావణాసురుడు సీతమ్మని” చెరవట్టినట్టు ఎల వారుతున్నడు నా ప్రాణం ఇట్ల పోయినా బాగుండు.. కింద వడి నెత్తి వట్టుకొని ఏడుస్తుండు రాజన్న. బస్‌ల వున్నవాళ్లు తలా ఓ మాట అంటున్నరు. లోకరీతి గిట్లయిందంటున్నరు. ”బ్రహ్మం” గారు ఆనాడే చెప్పిండు అన్నరు పాపిష్టి కాలానికి పోగాలం దగ్గర వడ్డది అని. ఓ పెద్దాయన తత్వం చెపుతుండు. దేవన్న అన్ని వింటూ అందర్ని తప్పించుకొని బస్‌ కిందికి వచ్చిండు. ”ఆపుండ్రి ఇక కండ్లముందు ఆడపిల్లని తీసుకపోతుంటె కండ్లప్పగించిండ్రు. ఇప్పుడు అన్ని కతలు చెపుతుండ్రు అన్నడు దేవన్న.

డ్రైవరు అన్నడు ”వాడు త్రాగి వున్నడు చేతుల ”అతేర” వున్నది. నేను వాణ్ణి ఆపగలను. కాని ఈ బస్‌ల నుంచి నేను వెళ్ళొద్దు. బస్‌ల వున్న వీళ్ళ రక్షణ నాది. పోలీసులకి ఫోన్‌ చేసిన. ఏ క్షణంలనైనా వాళ్ళు రావచ్చు. నేను ఉండవడ్తది అన్నాడు. ”ఇప్పుడు ఏం చేద్దాం తమ్మీ!! అన్నడు. డ్రైవర్‌. దేవన్న క్షణం ఆలోచించి ఏం లేదన్నా ఇది అడివి ఆ అడ్డదారి అంతా గూడు చెట్టు పుట్టలు, తీగలు అన్నట్టు వుంటది. రంగడు గంగతో ఎంతో దూరం పోలేడు. కాని వెతికేలోగా ఏమైనా చేస్తాడని భయం అయితంది. అగో చూడండి ఆ మనిషి, గంగ చాల దూరంనుంచి ఇక్కడికి కనబడుతున్నరు అన్నడు దేవన్న. అవును కనవడుతుండ్రు అన్నాడు డ్రైవరు. అన్నా ఆపదల వున్నది ఆడపిల్ల. నేను ఆమెని కాపాడాలని నిర్ణయించుకున్న అన్నడు దేవన్న. అందరు ఆశతో చూసిండ్రు. రాజన్న తెలివి తప్పి పడిపోయిండు. దేవన్న అందర్ని ఉద్దేశించి ఇలా అన్నాడు.

అందరు ఇనుండ్రి. ఒక చిట్టి ఇచ్చి ఇందుల నా తల్లిదండ్రుల పేర్లు యింటి అడ్రస్‌ వున్నయి. నేను మిలిట్రిల పనిచేస్తున్న. సెలవులకి ఇంటికి పోనికె ఈ బస్‌ ఎక్కిన. ”ఊరు ఇంకా రాలేదు” కాని ”పోరు మొదలైంది” నేను బ్రతికితే ఆ ఆడమనిషితో తిరిగి వస్త. లేక రంగడితోని పోరులో నేను ఏమయినా అయితే మాఇంటికి కబురు ఇయ్యిండ్రి. తన తల్లితండ్రుల అడ్రసు ఇచ్చిండు. అంతే ఇక ఆలస్యం లేకుండా రంగడు పోతున్న దారి దిక్కు ఉరికిండు. దేవన్న అప్పటికి సూర్యుడు సెలవు అంటున్నడు. చీకటి క్రమ్ముతుంది. ముందున్న కర్తవ్యదీక్ష గురించి తన అధికారులు, తనకు ఇచ్చిన తర్ఫీదు దేవన్నకి. ఇప్పుడు ఈ ఆపద సమయంలో అక్కడకు వచ్చింది. చెట్లని పుట్టలని తప్పించుకొంటూ ముందుచూపు చూశాడు. రంగడు ‘గంగ’ జడ పట్టుకొని లాక్కుపోతున్నడు. దూరం నుంచి గంగ ఏడుపు వినపడుతుంది. సూర్యుడు అస్తమయంలో వుండి ”కెంపు” వర్ణంతో కనిపించాడు. ముందున్న తన కర్తవ్యంలా తోచింది దేవన్నకి. వడివడిగా కదులుతూ వున్నాడు. గంగ అరుపులు ఇంకా దగ్గిరగా వినవస్తున్నాయి. కొద్దిదూరం నడచిన దేవన్న కిందికి వంగి ఒక కొస దేలిన ”రాయి” ని అరచేతిలో ఇమిడిపోయే దాన్ని తీసి గట్టిగా బలంగా పట్టుకొన్నాడు. దేవన్న ఆలోచించాడు. ముందున్న వాడు నిరాయుధుడు కాడు. వాడి చేతిలో ఆయుధం వుంది. కావాలని చేసిన ప్రయత్నం కనుక ”గంగ”ని నదురు బెదురు లేకుండ తీసు పోతండు. తను వెనక వెనక వెళ్ళి పట్టుకునేలోపు చీకటి బాగా పడుతుంది. తన పట్టు వృధా కావచ్చు. చేతిలోని ”రాయి”ని ఒక్కసారి చూసుకొన్నడు. ”విల్లు” ఎక్కు పెట్టినంత ఏక ధ్యానంతో తీక్షణతో ముందుకు దృష్టి సారించాడు దేవన్న. గట్లు పుట్టలు అడ్డం తలగడంతో ఆ ఇద్దరూ స్పష్టంగా కనవడ్తండ్రు. చేతిలోని ”బండరాయి” గురి చూసుకొన్నట్టు చూసుకొన్నడు. ఈ రాయి గనక గురి తప్పకుండా తలిగితే ఆ ఇద్దరిలో ఎవరికైన తలగవచ్చు. గంగకైనా తలగవొచ్చు రంగనితృవైనా తలగవచ్చు. కాని తన గురి మీద తనకి నమ్మకం వుంది. అధికారులు మిలట్రి శిక్షణలో ఇచ్చిన తకీదు వుంది. ప్రశంస వుంది. తర్ఫీదు వుంది. ఈ ప్రయత్నంలో రంగడికి తలిగితే ఈ పోరులో తను గెలిచినట్టే. లేదు గంగకి తలిగితే మంచిదే. ఆ దుర్మార్గుని కిరాత తత్వంనుండి తప్పుకుంటుంది.

వాడి చేతిలో అత్యాచారపడి చచ్చే బదులు ఇదే నయంగా తోచింది. మంచి గెలవాలని చెడు ఓడాలని తపనతో ”గంగ”కి తగలకూడదు. ఈ రాయితో ఆఖరి కోరికగా దేవున్ని కోరుకొని చేతిలోకి బలాన్నంతా పుంజుకొని గురిచూసి వడిగా బలంగా విసిరాడు దేవన్న. అంతే తను అనుకున్నట్టే ఇద్దరిలో ఒకరు కుప్పగూలారు.

తను వేసింది ”బాణం” కాదు. రాయి మాత్రమే కావచ్చు. కాని అన్యాయాన్ని కూల్చడానికి. గురిపెట్టిన ”న్యాయం లాంటి ఆయుధంతో రాయి గురిగా విసరడంతో ‘ఓ మనిషి కుప్ప గూలడం, ఆ తూలుకి రెండో మనిషి కూడా కిందపడటం కనిపించింది. అది చూస్తూ దేవన్న వడివడిగా ముందుకి కదిలాడు. సూర్యుడు తన పని అయినట్టు జారుకున్నాడు. చేతి టార్చి సాయంతో చెట్లు, రాళ్ళు, పుట్టలు దాటుతూ ఆ మనుషుల వేపు వెళ్ళాడు. దగ్గరగా ఇంకా దగ్గరగా తన గురి తప్పలేదు. దుర్మార్గుడైన రంగని తలకి రాయి గురిగా తగిలింది. రంగడు అచేతనంగా పడి కనిపించిండు. రక్తం మడుగులో ప్రక్కన గంగ అపస్మారక స్థితిలో కనిపించింది. తను గమనించలేదు గాని ఆ ప్రదేశం రోడ్డుకి చాలా దూరమే. రంగన్ని అలాగే వదిలేసి గంగని అతికష్టం మీద ఎత్తుకొని భుజంపై వేసుకొన్నడు. మెల్లిగా పొదలు తప్పించుకొంటూ రోడ్డువైపు నడిచాడు దేవన్న. అక్కడ బస్‌ లేదు గాని ఎవరో ఇద్దరు మనుషులు వున్నారు. దగ్గరగా వచ్చి విషయం చెప్పారు. ఆ పిల్ల తండ్రి ఇదంతా చూసి గుండె పోటుతో హరీ అన్నాడు. బస్‌ను ముసలోన్ని పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పారు.

దేవన్నకి గంగ భారం అనిపించలేదు. దేశసేవకై తను తీసుకొన్న మిలట్రి శిక్షణ తనకి ఈ విధంగా ఈరీతిగా ఒకరి ”రక్షణ”కై ఉపయోగపడుతోందని తను ఏనాడూ అనుకోలేదు. ‘గంగ’ని ఆమె బాధ్యతని కూడా భుజాన వేసుకొన్నాడు. తన ఊరివైపు నడిచాడు. తన ఊరు తనకి ఏవిధమైన స్వాగతం చెపుతుందొ. ”దేవన్న పెదిమలపై నవ్వు. ఏమైతేనేం తనని తాను రక్షించుకొని ఒక అబలని ఒక అసహాయతని కాపాడే అవకాశం దేవుడే ఇచ్చాడు. కాదు కాదు ఆ దేశమాతనే తనకు ఈ అవకాశం ఇచ్చింది. తను మంచి పనేచేశాడు. దేవన్న తన ఊరికి తన వాళ్ళకి ఇంకా దగ్గరయ్యాడు.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో