– జూపాక సుభద్ర

‘వో అమ్మా గా సిన్నపోషన్నోల్లు యింటికొచ్చిండ్రే… అచ్చి నిన్ను బిన్న రమ్మంటండ్రే’ కలుపుదీసే సర్పంచి కలమ్మను తన బిడ్డె వనమ్మ కీకబెట్టినట్లు సెప్పింది.

‘ఎందుకాట బిడ్డా’ దూరంగ నిలుసున్న బిడ్డెతోని అంతే బిగ్గెరగ అన్నది కలమ్మ.

‘ఏమోనే నాకేమెర్క’ అని తల్లి కలుపుదీసే పాలుకు పక్కపోంటి వచ్చి నిలుసున్నది.

‘గీ సర్పంచిగిరి సల్లగుండ యింట్ల పనికి, ఎవుసం పనికి గింత పుర్సత్‌ లేకుంటాయె’ అని సికాకు పడి సరె పోదాంపా అని లుపుదీసే పాలు యిడిసిపెట్టి కొడువలి బట్టుకోని బిడ్డతోని యింటికొచ్చింది.

కలమ్మ పర్కాల మండలం కోడెపాక గ్రామ సర్పంచి. సర్పంచి గాకముందు కూలినాలి చేసుకునేది. ముగ్గురు పిల్లలు వూల్లె వున్న బడిల్నే చదువుతున్నరు. కోడపాక గ్రామం సర్పంచి గిరి యీ సారి ఎస్సీ మహిళకొచ్చిందని వూరి దొర గోపాల్రావు కలమ్మను నిలుసోబెట్టి గెలిపిచ్చిండు.

కలమ్మ వూల్లె ఏమైన పంచాదులైతే చాతనైన మేరకు ఆయా కులం పెద్దమనుషులతోని తెంపుతది. యిగ పెద్దపెద్దయన్ని అంటే భూమి తగాదాలు. నీల్ల తగాదాలు, యిండ్ల తగాదాలసోంటియి గోపాల్రావే చూసుకుంటడు. కార్యదర్శి, ఎం.ఆర్‌.ఓ., ఎం.డి.ఒ., ఎస్‌.ఐ. వచ్చినా గోపాల్రావు ఇంటికే పోతుంటరు. తర్వాత సర్పంచిని రమ్మనమని పిలిపిస్తరు. మొదట్ల ‘గీ దొరే సెప్పిండు సర్పంచంటే వూరికి పెద్దని’ మరి గీ ఆఫీసర్లు నాతో మాట్లాడాలె గాని గా దొరతోనేంపని గీల్లకు. నన్ను లెక్కజెయ్యరెందుకో గిట్లుంటయి కతల’ని తిట్టుకున్నది. వూల్లె సర్పంచి పనులు లేనప్పుడు ఇంట్ల కష్టమైనప్పుడు సర్పంచి కలమ్మ కూలికి బోతది. కొత్తలో కొందరు ‘సర్పంచి గూడ కూల్జేత్తదా’ కూల్జేసేటోల్లను సర్పంచిని జేత్తే ‘కూలి బుద్దులేడికి బోతయి’ అని మాట్లాడిండ్రు. అయినా తప్పలే కలమ్మకు. ‘పొట్టతిప్పలకేం జేత్తం’ గీ సర్పంచి గిరి నాకు పేరుకు పెద్దిర్కమే యిచ్చింది గాని పేగునిపిందా’ అని కాలి దొర్కినప్పుడల్ల కూలికి పోతనే ఉంటది కలమ్మ.

గియన్నుంటయనే ఎలక్షండ్లప్పుడు కలమ్మ జెప్పింది దొరతోని ”అయ్యా గీ రాజకీయంల మేమేడ నెగుల్తం సదువులేదు సాత్రం లేదు, భూమి జాగ లేనోల్లం. కూలికైకిలి గాల్లం మాకేడ వాక దొరా, ఎలక్షండ్లంటె పైసతోని పనాయె మానుంచైతదా” వద్దన్నది. కాలిగ నిలుసోండ్రి సాలు గవురుమెంటు మీ పట్టుండి ఎస్సీలు గూడ సర్పంచి గిరి జెయ్యాలని, చట్టం దెచ్చింది. ‘అందరు ఎస్సీలు మంచోల్లు గాదు మీరే మంచోల్లని, అందికే మీకు సాయం జేయనీకి మిమ్మల్ని నిలుసోబెడ్తున్న” అంటే పొంగిపోయి దొర మాకోసం చాన కష్టపడ్తుండని దొర చెప్పినట్లు యిన్నరు కలమ్మ మైసయ్యలు.

యింటి ముందట కూసోని సర్పంచి కలమ్మ కోసం ఎదురు సూతున్న సిన్న పోషన్న అతని భార్య, తమ్ముడు, యింకిద్దర్ని చూసి…

‘ఏందె పోషన్న ఏం సంగతే ఏందో బిరాన రమ్మన్నరాట’ పలకరించినట్లు అన్నది కలమ్మ పందిట్లకి వచ్చుకుంట. కూసున్నోల్లు లేవబోతుంటే కూసోండ్రి కూసోండ్రే అని జాలాట్లకు బోయి కాళ్లు మొకం కడుక్కొనివచ్చి అరుగు మీద కూసున్నది ‘ఏం సంగజ్జెప్పుండ్రని’

”మా అల్లున్ని పర్కాల పోలీస్టేషండ్ల వెట్టిండ్రు కలక్కా”

”ఎందుకు వెట్టిండ్రు” కలమ్మ.

”లైసెన్సు లేదని ఆటోతో పాటు టేషండ్ల వెట్టిండ్రు కలక్కా, జెరెట్లయిన నువ్వు ఎస్‌.ఐ. తోని మాట్లాడి యిడిపియ్యాలె” అని బతిలాడినట్లు జెప్పిండు సిన్నపోసన్న.

‘ఎన్ని రోజులాయెనో’ కలమ్మ అడిగింది.

‘నిన్న పొద్దుగాల తీస్కపోయిండ్రు’ సిన పోషన్న…

‘మీరెవ్వరైన బొయిండ్రా’ టేషన్‌కు

‘నిన్న సందకాడెర్కయితే బోయినం గాని ఎస్‌.ఐ. లేకుండే 5 వేలు గడ్తెనే యిడ్సి పెడ్తమని పోలీసాయిన చెప్పిండు’ సినపోషన్న.

”మా బిడ్డె రత్న జూడబోతె నీల్లాడ దావుకాండ్లున్నది. అడివికి బోతే ఆవొర్రది యింటికత్తె ల్యాగొర్రది” అన్నట్లున్నది కత జెరెట్లయిన జేసి యిడ్పియ్యి కలక్కా నీవు పున్నెముంటది పోషన్న భార్య రందిగ సెప్పింది.

‘మరి పొద్దుగాల్నే రావొద్దానే’ కలమ్మ సినపోషన్నతోని.

‘యాడ కలక్కా బిడ్డ దావుకాండ్లున్నది దాని జూసుకొని మల్ల మనూల్లె బడెవరకు అంబటాల్లాయె.’

‘సరె తియ్యి ఆటో మాట్లాడ్కరాపోండ్రి పోదాం’ అని చెప్పి కలమ్మ యింట్లకు బొయి సిప్పిరి తల్కాయకు నూనెబెట్టుకొని నున్నగ దువ్వుకొని సీరె మార్సుకొని బిడ్డెతో ‘వనా నేను పర్కాలకు బోతన్న తమ్ముడు సెల్లె పైలం యింట్ల కీసులాడుకోకుండ్రి. నేను సీకటిబడత్త అని బిడ్డెను సదుమాయించి బైల్దేరింది సిన పోషన్న వాల్లను తీసుకోని.

కోడపాక గ్రామానికి పర్కాల మండల్‌ హెడ్‌క్వార్టరు ఐదు కిలోమీటర్లుంటది. ఈ వూర్నించి ఏ వూరికి బస్సులేదు. యిదొక్కూరే కాదు శాన వూర్లకు బస్సుల్లేవు, వున్నా పొద్దొకటి మాపొకటివస్తది. అందరూ ఆటోలల్ల, జీబులల్లనే పోతరు వస్తరు.

పోలీస్టేషను కాడ సర్పంచి కలమ్మ, సిన్న పోషన్నోల్లు ఆటోదిగి లోపలికి బొయిండ్రు, గేటుకాడ అటిటు పోలీసులు నిల్సున్నరు. ‘ఎస్‌.ఐ. కావాలంటె’ లోపలికి తోలిండ్రు. లోపల రెండు మూడు సెల్లులున్నయి. వాటిల శాన బెదురుగ బెంగగ దింపుడు గల్లంల దించిన పీనుగలోలె ఎవల మొకంల పాణం లేనట్లున్నరు. పాపం ఆ మిగతోల్లు ఒకాయన నడీడు యింకో ఇద్దరు వయసు పిల్లగాండ్లున్నరు. ఒకడు పోషన్న అల్లుడు ఉపేందరని గుర్తుపట్టింది. అందరు ఎక్కడోల్లో ఏమో అని జాలిపడింది మన్సుల. ఎస్‌.ఐ. దగ్గరికి పోయి నిలుసున్నది టేబుల్‌ పక్కపోంటి. పోషన్నవాల్లు కూడ నిల్సున్నరు.

‘నమస్తె ఎస్‌.ఐ. సార్‌’ అన్నది కలమ్మ ఏదో ఫైలు తిరగేస్తున్న ఎస్‌.ఐ తోని.

పోషన్న వాల్లు గూడ నమస్తె బెట్టిండ్రు.

‘ఆ… నమస్తె ఏంది సంగతి’ నిర్లక్ష్యంగా అని మల్లా ఫైలులోకి చూస్తూ…

”నేను కోడెపాక సర్పంచి కలమ్మను ఎరికే గద సారూ” తనను మర్చిపోయిండేమో అని గుర్తుజేస్తూ…

‘ఆ… ఎరికే… అయితేంది’ పట్టించుకోనట్లు…

గోపాల్‌రావింటికి ఎప్పటికొత్తనే వుంటడు, దొరతోని చానకేసుల టేషనుకచ్చినప్పుడు సూసిండు మాట్లాడిండు. అయినా గిప్పుడు ఎవ్వలో తెల్వనట్టు అంజాన్‌ గొడ్తండు. గీనికెంత గీర సర్పంచినని నమస్తె పెట్టకపోతే పెట్టకపాయె, కనీసానికి కూసోమనన్న సెప్తలెడు. సరెతియి గవన్నెందుగ్గని, గిప్పుడు పనిమీదచ్చినంగా పని వొడగొట్టుకోవాలని మన్సుల అనుకొని ‘ఎస్సై సారు మీతోని పని వడిచ్చిన’ అన్నది కలమ్మ.

‘ఏం పని చెప్పు’ అన్నడు తలెత్తి సూడకుండనే…

‘మా వూరుపిలగాన్ని టేషండ్ల వెట్టిండ్రాట గద’ కలమ్మడిగింది.

‘నిన్న శాసమందిని బెట్టినం స్టేషండ్ల మీ వూరోడెవడు’ ఎస్‌.ఐ. గమండిగ అన్నడు.

‘ఉపేందరని ఆటో నడ్పుతడు సూడుండ్రి గా పిలగాన్ని వొదిలిపెట్టుండ్రి సార్‌’ జెర బతిమిలాడినట్టు…

‘ఏమ్మాట్లాడ్తున్నవు మాకేం పనిలేక స్టేషండ్ల బెట్టినమనుకున్నవా’

‘నేను అట్ల అండ్లేదు సార్‌’…

నువ్వసలు సర్పంచివేనా దానర్ధం తెలుసా నీకు ‘ఒక సర్పంచివై యుండి లైసెన్సు లేక ఆటోను బలాదూరుగ తోలెటోన్ని యెన్క ఏస్కస్తవా’ అని ఎస్‌.ఐ. కనరుగ కసురుకొని మాట్లాడే వరకు కలమ్మకు ఏంజెప్పాల్నో అర్థం గాలే.

”ఏంది గీడు నేను సర్పంచినని తెల్సిగూడ నేనేమ్మాట్లాడినా ఇనకుంట మర్యాద లేకుంట ఎట్ల బడితట్ల మాటాడ్తుండేంది నా మొఖం జూత్తె యీనికేమనిపిస్తుంది. నేనేం తప్పు మాట్లాడిన సాట సెరిగినట్లు సెరుగుతుండు యిదివరకు వూల్లె జరిగిన కేసుల మీద దొర ఫోండ్లు జేసి యిడిపిచ్చిన కేసులెన్ని కండ్లముందు జూడలే… గీడు గిప్పుడు నన్ను యిరుకున బెట్టి సొక్కంపూసోలే మాట్లాడుడు. వచ్చి గింతసేపాయె కాల్లు నొప్పులు బెడ్తున్నయి. కూసోమని గూడా సెప్తలేడు. నువ్వు మా ఆఫీసుకొచ్చినప్పుడు నిన్ను గూడ నాతీరే నిల్సోబెడ్తుండు కొడుక” అనుకున్నది.

యింతల గేటు వస్తున్న టిప్‌టాప్‌ జంటను జూసి ”హలో నమస్తే పద్మగారూ… ఏమి నా భాగ్యం రాండ్రి కూర్చోండ్రి”, రండి సార్‌ అని ఎస్‌.ఐ. అటీటు ఆగమాగమైతాంటె, ఎవరని కలమ్మ పక్కకు చూసింది. అరె మా వూరి దొర తమ్ముడు మరదలు యీమె మా వార్డు మెంబరు. నా కింద పంజేసేటామె అనుకున్నది. వాల్లు చూసిచూడనట్లుగున్నరు.

‘ఏంటి సంగతులు మీకు తెల్సినోల్లెవరినైనా మా పోలీసులు తీస్కొచ్చారా! మీరింత దూరం వచ్చారు’ ఒక్క ఫోన్‌ జేస్తే నేనే వచ్చేటోన్ని గదా చాలా మర్యాదగా ఎస్‌.ఐ. మల్లా ”ఏం దీస్కుంటరు కాఫీ… టీ… కూల్‌డ్రింక్స్‌” అని హడావుడి చేస్తుండు.

కలమ్మకు నా పోస్టు కన్న చిన్నపోస్టు వార్డు మెంబర్‌తోని గూడ ఎస్‌.ఐ. గంత మర్యాదతోని కింద మీద అవుడు చూసి కడుపు బాగ మండింది. నాకు ”గంతబాగ మర్యాదలియ్యకున్నా కూసోమ్మని గూడ అనకపాయె. గా వార్డుమెంబర్‌కున్న మర్యాద యిలువ నాకు లేకపాయె, నేనేం సర్పంచిని” యీనికి నేనేం పాపం జేసిన దొంగ గాడిది కొడుకు. అందున సర్పంచి కింద పనిజేసే వార్డుమెంబర్‌ను గంత అత్కాపత్కంగ జూసి నన్నేమో పుచ్చిన కుక్కను నిలవెట్టినట్లు నిలవెట్టిండు. నా మొకం నల్లగున్నా సర్పంచినే గదా. వూరుకూరు సర్పంచంటె పెద్దపేరని చెప్తరు మరి గిదేంది? గీడు నన్ను, నాతో వచ్చినోల్లను గూడ నిలవెట్టవట్టే? గిదేమన్యాలం ఏమపకీర్తి నాగ్గింత యిలువ లేదా యిలువ లేని గీ సర్పంచి సేసెవ్వనికి సెయ్యికెవనికి నలుగురికి సాయం జేసినట్టుంటది, పెద్ద పేరన్న వుంటదని గిండ్లకు దిగితే గింత అరుమంద ముంటదా. సర్పంచిగెక్కినప్పటి కాంచి గివ్వేగతులైతున్నయి. ఎవ్వరు జూడు నువ్వే పెద్దంటరు. మరి గీ పెద్దను అంటకుంట ముట్టకుంటనే ఫండ్సత్తన్నయి పోతన్నయి. కార్యదర్శి గూడ దొర గోసిల్నే వుంటడు. నాకొక్కరు వొక ముచ్చట చెప్పరు బడువలు. బద్దుమాసులని ఇయ్యర మయ్యర తిట్టుకున్దని మన్సుల.

కలమ్మకు యీ అవమానంతోని యింకా చాన కోపాలు మన్సుల కుతకుత వుడ్కుతున్నయి. ఏమంటె ఏం తప్పుదీస్తరో… ఏమన్నగాని వూకుంటె వుసురుదీస్తరు గీ కొడుకులు ఎవన్నో వొకన్ని సందు జూసుకొని బజార్ల కీడ్వంది నా బతుకు గిట్లనే తెల్లారెటట్టున్నది. గీ ఎస్‌.ఐ. గాడిప్పుడు దొరికిండనుకున్నది. గుయ్యర గుయ్యర మాట్లాడితే లాబం లేదనుకున్నది.

ఎస్‌.ఐ. వచ్చిన వార్డు మెంబర్ని ఆమె భర్తని సాదరంగ మాట్లాడి సాగనంపి ”ఆ చెప్పు” కలమ్మ అనుకుంట కూర్చిల కూసున్నడు ఎస్‌.ఐ. కాని కలమ్మని కూర్చో అని ఒక్క మాటంటలేడు యింక. గవన్ని కడుపుల వుగ్గబట్టుకొని వచ్చి పని 5 వేలు ఇచ్చేకాడ మూడువేలకి దించెటాలకు పానం బొయింది సాన రకాల యిరుకున బెట్టి పరేషాన్‌ జేసిండు. ఎస్సై ఆకరికి ఆ మూడు వేలకు ఉపేందర్ని యిడిపిచ్చి ఇంటికచ్చేటాలకు చీకటైంది. కడుపుల అదే అవుమానంతోని ‘ఎట్లరా గీ బతుకు పాడుగాను ఎసోంటి బత్కాయె’ అని బాగ తల్లడిచ్చింది. ఇంటికొచ్చి ఎస్‌.ఐ. అమర్యాద, అవమానించిన సంగతి వూర్లె యూత్‌ పిల్లగాండ్లతోని మాట్లాడితే ”గీ ఎస్‌.ఐ. మనోల్లను చాన సతాయింస్తండు. యూత్‌ పోరగాండ్లను అన్నల్లున్నవని అనుమానించి కొట్టుడు, ఆని పాపాలు ఎక్కువైనయక్కా మన జిల్లా ఎస్‌.పి. చాన మంచోడు. గీ ఎస్‌.ఐ. నిన్ను లెక్కజెయ్యలేదని, ప్రోటోకాల్‌ మర్యాదియ్యలేదని జెప్తె వూకోడు. నువ్వు బొయి కలుపు అవుసరముంటె మేం గూడొస్తం” అని సలహా జెప్పిండ్రు. రాత్రి యింట్ల మొగని తోని గూడ గీ ఎస్‌.ఐ. సంగతులు, వూల్లె అంబెద్కర్‌ యూతోలిచ్చిన సలహా గూడ చెప్పి యిసారిచ్చింది. ‘దొరకు చెప్పుదామా’ అనుకున్నరు. ‘దొర, ఆడు వొక్కటే. ఆనికి చెప్తె ఆడేంజేస్తడు. ఏమన్నా గానీ… ఎస్‌.పి.ని కలుద్దాం తియి. మన యూత్‌ పోరగాండ్లు గూడున్నరని ఒక్క చిత్తం జేస్కున్నరు.

కలమ్మ తెల్లారే ఎస్‌.పి. దగ్గెరికి బొయింది. మైసయ్యను, అంబేద్కర్‌ యూత్‌ సంగపోల్లను యెంటేసుకొని పోయి ఎస్‌.పి. ఆఫీసు బైట కూసున్నరందరు. ‘కలక్కా గీ ఎస్పీ మంచోడు ఎవరన్నా మనలాంటోల్లను హేళనజేసి మాట్లాడినా, చిన్న చూపు జూసినా, మనోల్లకు అన్యాయం జరిగినా వూకుంటలేడు శానమంచి పనులు జేస్తుండు జిల్లాల”

‘గా మద్యెన మల్లంపెల్లిల ఒక కూలిజేసుకునేటామెను కులం పేరుతో తిట్టిండనే గా పాపిరెడ్డిని జైల్లేసిండు. యిగ నీ సంగతి జెప్తె వూకుంటడాక్క చూసేవుండు. ఎస్‌.ఐ. గాని తోలు ఎద్దు తోలొల్సినట్లు వొలుస్తడు” యూత్‌ సంగం కార్యదర్శి సుధాకర్‌ చెప్తాంటె కలమ్మ ఆమె పెనిమిటి యింటండ్రు. ఈ లోపట ‘ఎస్పీగారు రమ్మంటండని’ బంట్రోతు పిలిస్తే అందరు లోపలికి బొయిండ్రు. పరిచయాలైనంక కలమ్మ పోలీస్టేషండ్ల ఎస్‌.ఐ. జేసిన అవమానమంత దేవిపోస్కున్నది.

ఎస్పి చాన వోపికతోని విని పిఎని బిలిసి ఎస్‌.ఐ. వివరాలన్ని రాయించి కలమ్మకు ‘ఏం పరువాలేదమ్మా బాధపడకండి. వాల్లు పెద్దపెద్దోల్లనే యిన్ని రోజులు సర్పంచులుగ చూసిండ్రు. యిప్పుడు మీలాంటోల్లకు సర్పంచిగ గౌరవమివ్వడానికి చిన్న తనమనుకుంటున్నరు. అది కులంలో వున్న దుర్మార్గం. ఎస్‌.ఐ. అట్లా జేయడం చట్టరీత్యా నేరం. కలమ్మగారు నేను చర్య దీస్కుంట మీరెల్లండి, యిట్లా యింకా మీకేమన్యాయం జరిగినా మీరు రాకున్నా, ఒక్క ఫోను జేసినా చాలు నేం జేసే సాయం నేంజేస్త సరేనా” అని కలమ్మతోని భరోసాగ మాట్లాడి వచ్చినోల్లందర్కి చాయలు జెప్పి పంపించిండు.

కలమ్మ ఏనుగెక్కినంత బలంతోనింటికొచ్చింది. నాలుగు రోజుల తర్వాత ”కోడెపాక సర్పంచిని దూషించిన పర్కాల ఎస్‌.ఐ. సస్పెన్షన్‌” అని పేపర్లొచ్చిందాన్ని సర్పంచి కలమ్మకు యూత్‌ సంగపోల్లు గాడుపు దుమారమోలె వురికొచ్చి చెప్పిండ్రు.

కలమ్మ ”అబ్బ ఎంత సల్లటి మాట తమ్మి నెత్తిన నెయ్యిపాలు బోసుకున్నట్లున్నదిర..” అన్నది కలమ్మ.

వూల్లె ఎస్‌.ఐ. తోని బాదలు వడ్డోలంత కలమ్మాఫీసుకు యింటికొచ్చి మంచి పంజేసినవ్‌ ‘నీ అసొంటోల్లుండాలె సర్పంచులనేటోల్లు’ అని వూల్లె సిన్న పెద్ద మాట్లాడ్తంటే పొగుడుతాంటె గా ఎస్పీ అసొంటోల్లు నాకు సపోర్టుగుంటే యిగ సర్పంచిగ నాకు తిరుగే లేదనుకున్నది కలమ్మ.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.