మానికొండ సూర్యావతి

 నేను ఉద్యమంలోకి రావడమంటే స్వతహాగా కొన్ని పరిస్థితులబట్టే వొచ్చింది. ఏంటంటే మొట్టమొదట సాంఘికపరిస్థితి, దాన్నిబట్టే కడియాల గోపాలరావుగారు మా పెత్తల్లి పెనిమిటే అవుతారు. వాళ్ళింట్లో నేనుండేదాన్ని. కొత్తపట్నంలో అన్నపరాజు కామేశ్వరరావుగారని ఆయన ఒక స్కూలు ఆదర్శప్రాయంగా నడిపేవారు. మా పెద్దనాన్న కడియాల గోపాలరావుగారు కూడా ఆయనతోపాటు కొంతకాలం స్కూలు నడిపారు. మొదట అక్కడ కొత్తపట్నంలో క్లాసులు రాజకీయశిక్షణ తరగతులు జరిగినాయి. అప్పుడే అక్కడ కొంతమందిని అరెస్టు చేయడం జరిగింది. తరువాత రెండవ సంవత్సరంలో నర్సరావుపాలెంలో క్లాసులు జరిగినయి. అప్పుడు ఆయన ఆ క్లాసులకి అటెండు అయినాడు. చండ్ర రాజేశ్వరరావుగారు, గోపాలరావుగారు మొదట వీళ్ళంతా కాంగ్రెసు సోషలిస్టు పార్టీ భావాలని ప్రారంభించింది అక్కడన్నమాట. నేను అక్కడ వాళ్ళింట్లోవుండే దాన్ని కాబట్టి వాళ్ళు కొంతవరకు రాజకీయంగా స్త్రీలని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలనుకొని 1936-37 సంవత్సరాల్లో కాటూరులో ఆడవాళ్ళందరికి కలిసి క్లాసులు పెట్టారు. ఆ క్లాసులు ఆడవాళ్ళకే ప్రత్యేకం. దాదాపు పదిహేను మంది అటెండ్‌ అయ్యారు. అప్పుడు మేం కాటూరులోనే వుండే వాళ్ళం. అప్పుడు స్త్రీలు బైటికి వచ్చేపరిస్థితులుగానీ, చదువుకొనే పరిస్థితులుగానీ లేవుగదా. లేని స్థితిలో అక్కడ క్లాసులు పెట్టారు.

వెంకట్రాంగారనిచెప్పి ఆయన, ఈ రాజ్యంసిన్హాలేదు వాళ్ళఫాదరూ, ఇంకా గోపాలరావుగారు, చండ్ర రాజేశ్వరరావుగారు మొదలైన వాళ్ళంతా బిగినింగ్‌లో క్లాసులు చెప్పేవాళ్ళు. మొట్టమొదట గ్రామం కాటూరులోనే ఆడ వాళ్ళందర్ని కూచోబెట్టి అసలు దేశమంటే ఏమిటి, రాజకీయాలంటే ఏమిటి, అసలు స్త్రీల పరిస్థితులేమిటి, స్థితిగతులేమిటి, ఎలా వున్నాయి, స్త్రీలు కూడా వుద్యమాల్లో ఎందుకు పాల్గొనాలి. అప్పుడు సోవియట్‌ రష్యాలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటయివుందికదా! సోవియట్‌ రష్యాలో స్త్రీల పరిస్థితి ఎలావుంది, సోవియట్‌ రష్యాలో వున్నటువంటి సోషలిజంకోసం స్త్రీలనుకూడా తయారుచేయడానికి మనం పూనుకోవాలి, కమ్యూనిస్టు సమాజంలోనే స్త్రీల విముక్తి అనేటటువంటి మొదలైన విషయాలమీద రెండు మూడు రోజులు క్లాసులు తీసుకొనేవారు. తీసుకొన్న తర్వాత సోవియట్‌ రష్యావి, ఇంకా ఇతర పుస్తకాలు కూడా యిచ్చేవాళ్ళు. మళ్ళీ పేపరు (వార్తాపత్రిక) చదవడం, యివన్నీ చేయించేవాళ్ళు మాతో. ఎక్కువగా చదివించడం, చర్చించడం ఈ పని ఎక్కువగా యువజనసంఘాల వాళ్ళదేనూ.

అప్పట్లో అక్కడ వుద్యమంలో కాటూరే మొదటిది. ‘ఆంధ్రా మాస్కో’ అనేవారు కదా దాన్ని, నిర్బంధపురోజుల్లో జనం గుడ్డలూడదీసి గాంధీ విగ్రహం చుట్టూతిప్పి, ఆడవాళ్ళను కూడా బట్టలూడదీసి మొగవాళ్ళను వాళ్ళ వెనకాల నిలబెట్టి గాంధీ విగ్రహం చుట్టూ తిప్పారు. ఆ సంఘటన జరిగినప్పుడు నాకు ఇరవైరెండు, ఇరవైమూడు సంవత్సరాలు, రాయవెల్లూరు జైల్లోవున్నాను. కాటూరులో క్లాసుల తర్వాత ఆ వూర్లో మొత్తం కుర్రాళ్ళంతా యువజనసంఘం పెట్టడం, కర్రసాము నేర్చుకోవడం చేశారు. ఆడవాళ్ళు ఎక్సర్‌సైజులు చేసేవాళ్ళు ఆ సంఘాలసభ్యులు వాళ్ళ భార్యలు, చెల్లెళ్ళు వాళ్ళని క్లాసులకి పంపేవాళ్ళన్నమాట. అట్లా అప్పట్లో మగవాళ్ళు చైతన్యవంతం అయ్యారంటే వాళ్ళ యిళ్ళల్లో కూడా చైతన్యవంతం చెయ్యాలనేది కంపల్సరీగా అసలు ఓనమాలు నేర్పే దగ్గర్నుండి వుండేది. అందుకని ప్రతివాళ్ళూ, కుటుంబాలు, కుటుంబాలన్నీ ఒకే పద్ధతిలో నడిచేవితప్ప తేడాలుండేవి కాదు.

అప్పుడు మ్యారేజ్‌ కాకముందు నేనక్కడ వుండేదాన్నిగదా. తర్వాత సంవత్సరానికి కొత్తపల్లి క్లాసులయినప్పుడు నా మ్యారేజ్‌ అయింది. బంధువులే అనుకోండి మాకు. మానికొండ సుబ్బారావుగారు మా పినతాత కొడుకే. వాళ్ళ మేనమామ వాళ్ళు కాంగ్రెసు వుద్యమంలో జైలుకు వెళ్ళారు. తర్వాత మా అత్తగారు (బుల్లెమ్మ గారు) కూడా. దీన్నిబట్టే కాంగ్రెసు వుద్యమంలో రాట్నాలు వడకడం, నలుగుర్ని కూచోబెట్టి వడికించడం. అది కూడా కొంత అభివృద్ధికరంగానే వుండేది. తర్వాత యిందులోకి వచ్చింది. తర్వాత పార్టీలో ఆమెను అందరూ ‘గోర్కి అమ్మ’ అని పిలుచుకొనే వాళ్ళు.

అప్పుడు మొదట మాక్సింగోర్కి ‘అమ్మ’ పుస్తకం చదివించేవారు. మొట్టమొదట పార్టీలోకి వొచ్చిన ప్రతి వాళ్ళకి అమ్మ పుస్తకం గురించి చెప్పడం, పార్టీలోకి వొచ్చిన వాళ్ళందరం అమ్మ పుస్తకం చదవడం జరిగేది. అక్కడ విప్లవం ఎట్లా జరిగింది? అమ్మ ఎట్లాంటి పాత్ర వహించింది? దాన్నించి మనంకూడా ఆరకంగా చెయ్యాలనేటటువంటి భావంకలిగి మనం కూడా విప్లవంకోసం పూనుకోవాలనేటటువంటిది.

అట్లా పార్టీలోకి వచ్చింతర్వాత మహిళా సంఘాలు పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే అప్పుడు బూర్జువా మహిళా సంఘాలున్నాయి. చదువుకొన్నటువంటి వాళ్ళు క్లబ్బులవంటివి పెట్టుకొని, మామూలువాళ్ళని రానిచ్చేవాళ్ళు కారు. అందుకని గ్రామాలలో వ్యవసాయ కార్మిక స్త్రీలుగానీ, రైతు కార్మిక స్త్రీలు గానీ వున్నారు కదా వాళ్ళల్లో కూడా సంఘాలు పెట్టాలనే ఐడియా వచ్చింది. 1936లో కృష్ణాజిల్లా మహిళాసంఘం అని చెప్పిపెట్టారు. కాట్రగడ్డ హనుమాయమ్మ, చండ్రసావిత్రమ్మ వాళ్ళుండే వాళ్ళు అందులో, నేన్లేనప్పటికి, నాకు తెల్వదు. నా తర్వాత నాగళ్ళ రాజేశ్వరమ్మగారని చెప్పి, ఆమెనికూడా చేర్చడం జరిగింది ఆ కమిటీలో.

తర్వాత గుంటూరు జిల్లా మంత్రివారిపాలెం దగ్గర ఒక స్కూలు పెట్టారు. పిల్లలను కొట్టకుండా తిట్టకుండా చదువుచెప్పాలని ఆదర్శవంతంగా స్కూలు నడపాలని మామిడితోటలో పాకవేసి స్కూలు పెట్టారు. అందులో రెండు సంవత్సరాలు టీచరుగా వుండటం జరిగింది. సుబ్బారావుగారు వీళ్ళంతా కూడా ఆ స్కూల్లో టీచర్లుగా వుండేవాళ్ళు. అట్లా వుంటుండగా 1939లో అక్కడ పార్టీ సభ్యత్వం యిచ్చారు. తర్వాత కొన్నాళ్ళకి అక్కడ గొడవలొచ్చాయి. గొడవలొచ్చేటప్పటికి వీళ్ళు స్కూలునుంచి బైటికి వచ్చేశారు. మీరు వెళ్ళిపోయాక మేమేమిటని ఇంకా కొంతమంది టీచర్లు వెళ్ళిపొయ్యారు. అప్పుడిక రెండు మూడు సంవత్సరాల్లోకి స్కూలు మూసేయాల్సివచ్చింది. అప్పుడు మేం నందమూరు వచ్చేశాం. మేం యిక్కడ నందమూరులో లేనప్పుడు మావూరి మీద గవర్నమెంటుకు ఎక్కువ దృష్టిలేదు. అందుకని రహస్యంగా వుండేటటువంటి జిల్లా కేంద్రం మా ఇంట్లో పెట్టారన్నమాట. అప్పుడు మా యింట్లో జిల్లా కేంద్రం వున్నట్లు ఎవ్వరికి తెలియకపొయ్యేది. మా మ్యారేజ్‌ అయినాక 1941 జనవరిలో నన్ను జిల్లా మహిళా సంఘం కార్యదర్శిని చేశారు. చేసినతర్వాత అప్పుడు మా యిల్లు పోలీసుల దృష్టిలోకి, ఎంక్వయిరీలోకి వచ్చింది. ఏమీతెలియకపోతే మహిళా సంఘం కార్యదర్శిగా ఎందుకు చేస్తారు? కాబట్టి ఈమె భర్త ఎక్కడున్నారో ఈమెకి తెలిసుండాలనేటటువంటి అప్పుడు పోలీసుల దృష్టిలోకొచ్చింది. వచ్చేటప్పటికి మన యింట్లో కాంప్‌ ఎత్తేయటం జరిగింది. ఇక వీల్లేదు గద! గ్రామం పోలీసులదృష్టిలో పడింది గద!

ఈ రకంగా నేను వుద్యమంలో రావడం జరిగిందనుకోండి. నా కన్నీనేర్పి అభివృద్ధి తీసుకురావడం అనేది ఎక్కువగా కడియాల గోపాలరావుగారు, చండ్ర రాజేశ్వరరావుగారు మాకు మహిళాసంఘంవున్నా, రాజేశ్వరరావుగారే మొత్తం గైడెన్స్‌ ఇచ్చి మమ్మల్ని నడిపింది ఆయనేనన్నమాట.

అప్పుడు ఎట్లా వుండేదంటే చివరికి మా పెట్టెతీసి మాకు బట్టలెన్నివున్నాయనే చెకప్‌ కూడా వుండేదన్నమాట. అంటే ముఖ్యంగా పూర్తిగా పనిచేసేవాళ్ళకే మామూలు సభ్యులకు యిది వుండేది కాదనుకోండి. ముఖ్యంగా కార్యకర్తలు అయిన వాళ్ళకి ఆరు చీరెలుకంటే ఎక్కువగా వుండకూడదనే పద్ధతి ఒకటుండేది. మనం జనంలోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్తున్నామంటే ప్రజల్లో మనుషులుగా వుండాలి తప్ప అతీతంగా వుండకూడదు. మన వేషభాషల్లో వాళ్ళతో సమానంగా కలిసిపోయేలాగ వుండాలి తప్ప, మనం ఫాషన్లుచేసుకొని వెళ్తే ప్రజల్లో ప్రచారం చేయగలిగి వాళ్ళకి విషయాలు చెప్పగలిగేది వుండదు. కాబట్టి ఏంటంటే మనం జనంలో కలిసిపోయేటట్లు వేషభాషలదగ్గర్నుండి వుండాలనేటటువంటిది మాకు పాఠాల్లో చెప్పడం జరిగింది. దీన్నిబట్టే నాకు పెండ్లికి పెట్టిన పట్టు చీరలమ్మేసి ఇతరులకి వాటితో మామూలు చీరలుకొని కట్టుకునేవాళ్ళం. అప్పటినుంచి యిప్పటికి పట్టుచీరలు అలవాటులేదనుకోండి. పదిహేను పద్దెనిమిదేళ్ళ వయసు వాళ్ళమే అయినా పూలుకూడా పెట్టుకొనేవాళ్ళంకాదు. ఎందుకంటే పూలు అవీ పెట్టుకొని మనం మీటింగ్‌ అవీ జరుపుతుంటే ఇది సోకుజేసుకొని సానిదాన్లాగ తయారయివచ్చింది అనేటటువంటి మాట వస్తుంది. ఉదాహరణకి ఒకసారి ఏం జరిగిందంటే హనుమాయమ్మ నేను అన్నీ తీసేసినప్పటికి లోలకులంటే చాలా యిష్టం అవి పెట్టుకొన్నాం. పెట్టుకొని ఒక వూరు వెళ్ళాం. అక్కడ ఏంచేశారంటే హనుమాయమ్మ చెవులవి బావున్నాయని చెప్పి, తర్వాత కంసాలతన్ని ఆ మోడల్‌ కోసం చూసిరమ్మని ఆ వూరికి పంపించారట. అక్కడ ఆ వూళ్ళో రహస్యంగా మనజిల్లా ముఖ్యులున్నారన్నమాట. దాంతో ఈ విషయం వాళ్ళకి తెలిసింది. అప్పట్లో జిల్లా సెక్రటరీ నుండి మాకు ఇంత పొడుగు వుత్తరం వచ్చింది. మహిళాసంఘం సెక్రటరీగా నేనుండేదాన్ని కదా. లెటర్‌ నా దగ్గరకొచ్చింది. ఇంత పొడుగువుత్తరం అయితే వచ్చింది కాని, నాకిప్పుడు రెండు మూడు వాక్యాలే గుర్తున్నయి. ”మీరు ఫ్యాషన్లు ప్రచారం చేయడానికి వెళ్తున్నారా? విషయాలు ప్రచారం చేయడానికి వెళ్తున్నారా? శరీరానికి పంక్చర్లు పొడుచుకొని యివి ధరించడం అనేది ఇదొక నాగరికతా” అదీ యిదీ అని చెప్పియింత పొడుగు వుత్తరం వచ్చింది. ఈ రకంగా వుత్తరం వచ్చిందని చెప్పి హనుమాయమ్మ గారికి చూపించాను. అప్పుడయితే బాధనిపించింది. కానీ పార్టీ చెప్పింది యిది మంచి పద్ధతి కాదూ అని. కాబట్టి ఆ మరుసటిరోజునించి యిద్దరం తీసిపారేశాం. ఇక ఆ రోజు నుంచి ఈ రోజువరకు మేం పెట్టిఎరగమన్నమాట. వ్యక్తిగత విషయాలు కూడా ఎందుకు ఆజాతీసుకొనే వాళ్ళంటే మన కారెక్టర్‌ గురించి గానీ, మన వేషభాషల గురించిగానీ ఎట్లా వుండేదంటే మనం జనంలోకి వెళ్ళినప్పుడు మనం ఆదర్శంగావుండి పనిచేయాలేతప్ప లేకపోతే మనం జనంలో ఆకర్షింపబడ్డానికి అవకాశం వుంటుంది. అందుకనేంటంటే మనం అన్నిట్లోనూ యిదిగా వుండాలని, ఆ పద్ధతి ప్రకారం అందరం నడవడం జరిగేది. దీంట్లో (పార్టీలో) వున్నటువంటి వాళ్ళం అందులో ముఖ్యులు అనేటటువంటి వాళ్ళు కంపల్సరీగా పాటించాల్సి వచ్చేది. సామాన్య (ప్రజాసంఘాల) సభ్యులను వాళ్ళ యిష్టానికి వదిలిపెట్టేవాళ్ళం. వాళ్ళవాళ్ళ రాంకు దాన్నిబట్టి ఎవరిపై ఎటువంటి చర్య తీసుకోవచ్చు అనేది వుండేది. ఈ (కృష్ణా) జిల్లా మొత్తంమీద తిరగిపనిచేసేవాళ్ళం. పదిహేనుమందిమి ఉండేవాళ్ళం. అనుభవం లేదుగా మాకు, అందుకని యిద్దరిద్దరం కలిసివెళ్ళేవాళ్ళం.

గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, మీటింగ్‌ పెట్టినప్పుడు, మాట్లాడినప్పుడు, నువ్వేంమాట్లాడాలి, నేనేం మాట్లాడాలని ముందే అనుకొనేవాళ్ళం. తర్వాత నేను మాట్లాడింది సరిగ్గా వచ్చిందా, నువ్వు మాట్లాడిందాంట్లో లోపం ఏమిటి, నేను మాట్లాడిందాంట్లో లోపం ఏమిటి అని మళ్ళీ యిద్దరం చర్చించుకొనేవాళ్ళం. తర్వాత అక్కడ లోకల్‌ కామ్రేడ్స్‌ వుంటే వాళ్ళ అభిప్రాయాలు అడిగేవాళ్ళం. తర్వాత మరుసటిరోజు ఉదయం- ఆరాత్రి మేంచెప్పేదాన్నిబట్టి వూళ్ళో ఏమనుకొంటున్నారు, మగవాళ్ళేమనుకొంటున్నారు, ఆడవాళ్ళేమనుకొంటున్నారు, జనంలో ఎటువంటి అభిప్రాయం వచ్చింది ఏమిటి అనేటటువటిది సేకరించేవాళ్ళం, ఎందుకంటే దాన్నిబట్టి యింకొకవూరు వెళ్ళినప్పుడు ఈ అనుభవం తీసుకొని పనిచేసేవాళ్ళం.

ఇట్లా అనుభవాలు తీసుకొంటూ పనిచేసేవాళ్ళం. రాత్రిపూట బహిరంగసభ పెట్టేవాళ్ళం. పగలంతా మహిళాసంఘం సభ్యత్వం చేర్పించేవాళ్ళం. సభ్యత్వం అణా (ఆరు పైసలు). ఆమె పేరు, తండ్రి లేక భర్త పేరు, గ్రామం, జిల్లా, తాలూకాపేరు రాసుకొని అణాతీసుకొని ఆమెతో సంతకం చేయించుకొని రశీదు యిచ్చేవాళ్ళం. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకోసం ఈ సంఘం పనిచేస్తుంది. ఈ ఆశయాలని అంగీకరించి సభ్యులుగా చేరుతున్నా, అనేటటువంటిది రశీదుపైన వుండేది. మహిళాసంఘం జెండా మీద స్వాతంత్య్రం, శాంతి, అభ్యుదయం అని వుండేది అప్పుడు. సభ్యత్వం చేర్పించి, మళ్ళీ సంచులేసుకొని ఇంకోవూరు వెళ్ళేవాళ్ళం. ఇప్పట్లాగా బస్సులవీలేవుగదా! పదిహేను, ఇరవై రోజులు టూరులోనే వుండేవాళ్ళం. తిరిగి వచ్చింతర్వాత ఒకరోజు రెస్టుతీసుకొని, రిపోర్టు రాసి పార్టీకియిచ్చేవాళ్ళం. రిపోర్టు చదివి వాళ్ళు ఏమన్నా సూచనలుంటే చేసేవాళ్ళు. తప్పనిసరిగా నెలనెలకు సమావేశం వుండేది. జిల్లా మహిళాశాఖ వుండేది, జిల్లా వర్కింగ్‌ కమిటీ వుండేది. దాన్లో పార్టీకి సంబంధించినశాఖ వుండేది. వాళ్ళతో సమావేశం అయ్యేవాళ్ళం. ఈ సమావేశంలో చదవాల్సిన పుస్తకాలదగ్గర్నించి వుండేదన్నమాట. మళ్ళీ నెలరోజులకి సమావేశమయ్యేటప్పటికి ఫలానా పుస్తకాలు చదవాలని వుండేదన్నమాట. అందుకని తప్పనిసరిగా చదివేవాళ్ళం. ఈ తిరుగుళ్ళలోపడి చదవలేకపోతే యింక రేపు సమావేశంవుందనగా ఈ రాత్రి అంతా కూచునయినా చదివేవాళ్ళం. అంటే తీసుకొన్న కార్యక్రమాన్ని పూర్తిచేయలేదు అనిచెప్పి మనం అనిపించుకోకూడదు. అనిపించుకొటే మనం నిర్ణయానికి భిన్నంగా వున్నట్లే, వ్యతిరేకించినట్టే అనేటటువంటిభావన వుండేది. సహజంగా శిక్షణ యిచ్చినటువంటి దాంట్లోనే అది వుండేది. అట్లా, ఆ విధంగా పనిచేసేవాళ్ళం. ఎక్కువగా యువజనసంఘాలుగానీ, మన వాళ్ళుగానీ వున్న గ్రామాలు వెళ్ళేవాళ్ళం ముందుగా మనవాళ్ళు ఫలానా యింటికి వెళ్ళండి, ఫలానా కుర్రాణ్ణి కలవండి మీరని అడ్రసిచ్చి పంపేవాళ్ళు. మేం వెళ్ళేవూళ్ళల్లో మన కామ్రేడ్స్‌వుంటే కాంటాక్ట్‌ ఇచ్చేవాళ్ళు ఫలానాచోట కలుసుకోండని మాకు చెప్పి. తర్వాత మనవాళ్ళు వస్తారని వాళ్ళకి కబురువెళ్ళేది. అడ్రసులు తీసుకొని మేం వూళ్ళోకివెళ్ళి అడిగేవాళ్ళం. వాళ్ళని కలుసుకొన్నాక ఆ కామ్రేడే మమ్మల్ని కొందరు ఆడవాళ్ళకి కలిపేవాడు. ఊళ్ళో పబ్లిక్‌ మీటింగ్‌ పెట్టాలంటే ఏర్పాటుచేసేవారు. తర్వాత సభ్యత్వం చేర్పించడానికి కూడా మాతోపాటు యిళ్ళకి తిరిగేవాడు. ఎందుకంటే కొత్తవాళ్ళొస్తే చేరరుగదా! కామ్రేడ్స్‌ చెల్లెళ్ళుగానీ, భార్య గానీ, యితర కుటుంబసభ్యులుగానీ అయితేనే ఎక్కువగా వచ్చేవాళ్ళు. లోకల్‌గా ఎవరైనా తెలిసిన ఆడవాళ్ళుంటే వెంటేసుకొని తిరిగేవాళ్ళం. అప్పుడేంటంటే ఆడవాళ్ళు వచ్చేస్థితి అసలు లేదుగదా! ఇప్పటిలాగ కాదు గదా! గ్రామాల్లో పనిచేయాల్సివచ్చినప్పుడు కొన్ని కష్టాలెదుర్కోవాల్సివచ్చేది. ఆ రోజుల్లో ఒక ఊరినుంచి యింకొకవూరికి బండిమీద ఆడవాళ్ళు వెళ్తే బండికి వెనకా ముందు తెరలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. మా అమ్మా, పింతల్లి వాళ్ళంతా అట్లా వెళ్ళినవాళ్ళే. అసలెక్కువగా ఆడవాళ్ళు ఉద్యమంలోకి ఫ్యామిలీ సంబంధాలనుంచే వచ్చారు. ఫ్యామిలీ సంబంధాలు లేకుండా కొంతమందయితే వచ్చారుకానీ రావాలనుకొంటే సావకాశం లేదుగదా! రావాలంటే భర్తతో తెగతెంపులు చేసుకొనివస్తేతప్ప ఈ రోజుకీ ఆయిది లేదుకదా! తన భావాల్ని భర్త అంగీకరించకపోతే పనిచేసేస్థితి లేదుగదా! అట్లాంటి ఎగ్జాంపుల్స్‌ వున్నాయి.

నాగెళ్ళ రాజేశ్వరమ్మ, జానకిరామయ్యని చెప్పి వుండేవాళ్ళు. ఆయనకి పార్టీ అంటే యిష్టమే, కానీ ఆమేమో మంచి స్పీకరు. గ్రామాల్లోకెళ్ళి ఆర్గనైజ్‌ చేసేశక్తివుంది. వెళ్ళి చేసేదికూడా. అసలే అప్పట్లో ఆడాళ్ళు బయటికి రావడమనేది లేదు గదా! అ అరుగులమీద కూచునే పెద్దలుంటారు గదా! ”వాళ్ళు ఏమిట్రోయ్‌ నీ భార్య నీకంటే పైకివెళ్ళిపోయి పేరు సంపాదిస్తోందిరోయ్‌. నలుగురు నీ భార్య గురించి అదీయిదీ అని చెప్పుకుంటున్నారు” అంటే యిద్దరిమధ్య దాని మీద గొడవలొచ్చాయి. తర్వాత విడిపోతారా అనుకొన్న స్టేజీ వచ్చింది. డైవోర్సు దాకా వచ్చింది. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆమె పనిచేయడానికి బయటికి రాలేదు. తర్వాత కూతురు జ్యోతి మూలకంగానే వాళ్ళలో సఖ్యత వచ్చింది. తర్వాత కొంచెం పెద్దవాళ్ళయ్యాక ఆయన కూడా సర్దుకొన్నాడు. ఇప్పుడు ఆయన పనిచేయడు కానీ పార్టీకి మంచి సానుభూతిగావుంటూ మంచి మంచి సలహాలిస్తుంటాడు. ఆమె యింకా యాక్టివ్‌గానే పనిచేస్తోంది. అప్పట్లో కూడా ఆయన చుట్టుపక్కలవాళ్ళు అనే దాన్నిబట్టి కూడా కొంతవుంటుందిగదా!

గ్రామాలకు వెళ్ళినప్పుడు యిట్లాంటివి చాలా ఎదుర్కోవలసి వచ్చేది. సంచులు తగిలించుకొని బజారమ్మట నడిచివెళ్తుంటే ఈ అరుగులమీద కూచునే మొగవాళ్ళు ఎగతాళి, ఎక్కిరింపులు చేసేవాళ్ళు. ఆడవాళ్ళు కూడా మా ఎదుటనే తిట్టేవాళ్ళు. వాళ్ళ పిల్లలకోసం వాళ్ళయిళ్ళకి వెళ్ళినప్పుడు ”గాలిముండల్లాగ మీరు చెడిపోయిందిగాక మా బిడ్డల్ని కూడా చెడుపుతారా…” అని తిట్టేవాళ్ళు. తిడ్తే బయటికొచ్చాక యేడ్చేవాళ్ళం. ఒకచోటయితే అట్లా పిచ్చితిట్లు తిట్టేటప్పటికి తట్టుకోలేక అక్కడే ఏడ్చేశాను. శ్రీకృష్ణ అని నాతోవున్న యింకో కార్యకర్త తనేమో పోట్లాడుతానేవుంది. నేనేమో ఏడ్వడం, ఆమేమో పోట్లాడ్డం, తర్వాత నాలుగుమైళ్ళు నడిచి యింటికిచేరాం. చేరేటప్పటికి రాజేశ్వరరావో ఎవరో యింట్లో వున్నారు. ఉంటే ఆయన్తో వాళ్ళు యిట్లా తిట్టారు, ఏమయినా సరే యిక మేం పోనేపోమని చెప్పేసి పేచీ పెట్టాం. పెడ్తే అప్పుడు నవ్వివూర్కొని ఆ తర్వాత విషయం అంతాచెప్పి వాళ్ళాస్థితిలో వున్నారని చెప్పేసి మీరింకా యిదయ్యి యింకా పనిచేయాల్సిన అవసరం వుందని గుర్తించాలితప్ప, పట్టుదల పెంచుకోవాలితప్ప యిట్లా ఏడ్చేస్తారా అని కోప్పడ్డారు. ముందే ఒకసారి చెప్పగానే తెలుసుకొనే స్థితిలో వాళ్ళుంటే యిక పార్టీ అవసరం ఏముందీ, మీ అవసరం ఏముంది, మనం యిట్లా చాటుగా వుండాల్సిన అవసరం ఏముంది? మనకి తెలిసిన పరిస్థితులేగాబట్టి ఏమిటంటే మీరింకా ఎక్కువ పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించి పనిచేయాలి. దీన్ని మీరు మార్చాలని చెప్పేవరకు మళ్ళీవెళ్ళేవాళ్ళం.

ఒకనాడు శనగపాడు అనే గ్రామంలో ఒక కామ్రేడ్‌ అడ్రసు తీసుకొని వెళ్ళి అతన్ని కలిసి అక్కడ సభపెడుతున్నామని ‘టముకు’ వేయించాం. మహిళాసంఘం మీటింగ్‌ అని టముకువేస్తే అక్కడినుండి కొంతమంది రావడం మొదలుపెట్టారు. ఎక్కువగా మగవాళ్ళే వచ్చారు. ఒకోసారి చెరిసగంగా వచ్చేవాళ్ళు. అంతా ఒకేసారి రాకపోయేవాళ్ళు. అందుకని ముందువచ్చిన వాళ్ళను వెళ్ళకుండా కూచోబెట్టాలంటే పాటలు పాడాలి. వచ్చినా రాకపోయినా రెండే రెండు పాటలు నేర్చుకొన్నాం. మా గొంతులు బాగుండకపోయినా ఏ ఊరెళ్ళినా ఆ రెండేపాడేవాళ్ళం. ”స్త్రీలకి స్వాతంత్య్రం రాదా? స్త్రీ జాతికి స్వేచ్ఛలేదా?” అదొకటి. తర్వాత ఇంకొకటి ”అమ్మా చదువుకొనగ రావమ్మా! ఎన్నాళ్ళని బానిసత్వంలో కృశించిపోతావు నీటిలోని తాబేటిమాదిరి తెలియకుండగను, అమ్మా చదువుకొనగరావమ్మా!” ఇట్లా కొన్ని స్త్రీలపాటలు పెళ్ళిలో పాటలు పాడ్తారుగదా మంగళహారతులనీ, వాటిలోనే ఈ భావాలుపెట్టి మొదట పాటలురాశారు. ఇప్పుడు లేకుండా పోయాడు గానీ ముక్కామల నాగభూణమని చెప్పేసి చాలా పాటలు రాశాడు. ”మంగళమో వీరఝాన్సీ” అని యింకా చాలాపాటలు రాశాడు. ఉయ్యాలపాటలు, దంపుడు పాటలు కూడా పాడేవాళ్ళం. కొన్ని ప్రత్యేకం స్త్రీల పాటల పుస్తకాలు కూడా వచ్చాయి. అమ్మ (కోటేశ్వరమ్మ), తాపీ రాజమ్మ బాగా పాటలు పాడేవాళ్ళు.

గ్రామాల్లోకి మేం వెళ్ళినపుడు మేం స్త్రీలకి వితంతు వివాహాలు కావాలనీ విడాకులచట్టం వుండాలనీ చెప్పేవాళ్ళం. తర్వాత స్త్రీలకి ఆస్తిహక్కు వుండాలని కూడా చెప్పేవాళ్ళం. తర్వాత ప్రసూతి చికిత్స, ప్రసూతి సౌకర్యాలకోసం ప్రచారం చేసేవాళ్ళం. మహాసభలు జరిపినపుడు ఆరోగ్యవంతమైన పిల్లలప్రదర్శన ఏర్పాటుచేసి బహుమతులిచ్చే వాళ్ళం. ఆరోగ్యకరమైన ఆహారం గురించి, ఉప్పు, చింతపండు తగ్గించి తినాలనీ చెప్పేవాళ్ళం. ఎట్లా వంటచేసుకొనాలి, పిల్లల్ని ఎట్లా పెంచాలనేటటువంటిది కూడా ప్రచారంచేసేవాళ్ళం. సభల్లో సమావేశాల్లో చెప్పడం, మనపార్టీ కుటుంబాల్లో వాటిని అమల్లో పెట్టడంకోసం, మన కామ్రేడ్స్‌ కూడా ప్రయత్నంచేసేవాళ్ళన్నమాట. కూరగాయలు చెక్కుతీయకుండా వండుకోవడం యివన్నీ మన పార్టీకుటుంబాల్లో అమలుపరచేవాళ్ళు. దీన్ని చూసి యితరులు చేసేపరిస్థితి వచ్చేది.

మొదట్లోమాత్రం ఏంటంటే ”ఇంతటకీ మీరు చెప్పొచ్చేదేంటి ఆడాళ్ళు మొగాళ్ళకి ఒండిపెట్టకుండా బజార్లమ్మట తిరగండనీ, వెధవముండలకి పెళ్ళికావాలనేకదా” అనేవాళ్ళు. అంటే మేం వాళ్ళని ఫోర్సుచేసేవాళ్ళం కాదుగానీ” ఇప్పుడు ఒక స్త్రీ వుందనుకోండి, ఆమెకు పెళ్ళిచేసుకోవాలని లేదు అంటే అట్లానే వుండనీయండి. మీరూ బలవంతపెట్టేదిలేదూ మేమూ పెట్టం. ఒకవేళ ఆమెకు చేసుకోవాలని వుందనుకోండి. చిన్నవయసులోవుంది చేసుకోవాలని కోరుకుంటే సమాజం ఒప్పుకోవట్లేదు. కాబట్టి అనేక అక్రమాలు అవలంబించడం, శిశుహత్యలు, ఆత్మహత్యలు, భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. వెనక సహగమనపద్ధతి వుండేది. భర్త చచ్చిపోతే భార్యను బలవంతంగా తీసుకెళ్ళి తగలేసేవాళ్ళు. రాజారామ్మోహన్‌రాయ్‌ దాన్ని వ్యతిరేకిస్తే సమాజం మారింది. భర్తచచ్చిపోతే భార్యకూడా చచ్చిపోవడానికి యిప్పుడు మనం ఒప్పుకుంటామా? దాన్ని మార్చడానికి ఆయన ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చింది? ఇప్పుడు మనం ఎవరంకూడా సహగమనం మంచిది అనడంలేదు. ఎప్పటికప్పుడు సమాజం మారుతుంటుంది. మన పెద్దవాళ్ళు అవలంబించేదాంతో మంచివుంటే తీసుకోవచ్చు, చెడుంటేతీసి అవతల పారేయాలి” అని యిట్లా చెప్పేవాళ్ళం.

ఆస్తిహక్కు గురించి విడాకుల చట్టంగురించి కూడా ప్రచారం చేసేవాళ్ళం కదా! స్త్రీకి ఆస్తిహక్కులేనందువల్ల కట్నాలకాడ తగవులొచ్చి అనేకమంది చచ్చిపోయి కుటుంబాలు విచ్ఛిన్నమయిపోతున్నాయి. పుట్టుకతో తల్లిదండ్రి యొక్క ఆస్తిలో మగపిల్లలుగానీ, ఆడపిల్లలుగానీ సమానవాటా పొందే హక్కుదార్లుగా వుండాలి. వారిదయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వుండకూడదు అని ప్రచారం చేసేవాళ్ళం. చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం బి.యన్‌.రావు అనేటటువంటి ఆయన అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. భర్తచనిపోతే భర్తయొక్క ఆస్తిలో భార్యకు అనుభవించడానికి హక్కుండాలని, తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కులుండాలని చెప్పి నలభై యాభైవేల సంతకాలు సేకరించి బి.యన్‌.రావు కమిటీ విజయవాడ వచ్చినప్పుడు ఆయనకు యిచ్చాం. దీనిమీద పార్లమెంటులో కూడా మాట్లాడారు. తర్వాత హిందూకోడ్‌బిల్లు అనేటటువంటిది వచ్చింది. ఈ హిందూకోడ్‌ బిల్లుమీద మేం ఒక పుస్తకం కూడా వేశాం. ఆరకంగా ఆస్తిహక్కులో కొన్ని మార్పులు వచ్చినయ్యంటే మా ఆందోళన ఫలితంగానే.

ఇంకా ప్రతినాలుగు గ్రామాల్లో ఆస్పత్రి వుండాలని, ప్రతిగ్రామానికి ఒక చదువుకొన్ని నర్సువుండాలని కూడా ఆరోజుల్లో తీర్మానంచేసి దానిమీద ఆందోళన చేశాం. గ్రామాల్లో మరుగుదొడ్లు సౌకర్యంఉండదు గదా! దానికోసం మరుగుదొడ్లు కావాలనేటటువంటి దానిపై కూడా సంతకాల కార్యక్రమం తీసుకొన్నాం. ముందు మనం ఆదర్శంగా వుండాలని నందమూరులో మాస్థలంవుంటే దాదాపు ముప్పై సెంట్ల భూమి స్త్రీలకి మరుగుదొడ్లకోసం యిచ్చేయడం జరిగింది. రెండోవేపు కొన్ని గ్రామాల్లో చందాలు వసూలుచేసి ఏర్పాటుచేయడం జరిగింది. ఈ రకంగా సాంఘిక సమస్యలేగాక రాజకీయ సమస్యలు కూడా తీసుకొనేవాళ్ళం. రెండవ ప్రపంచయుద్ధం వచ్చిందిగదా దానిగురించి, బ్రిటిష్‌ ప్రభుత్వం పోవాలని చెప్పేవాళ్ళం. ఇట్లా రాజకీయ సమస్యల కోసంకూడా స్త్రీలని తయారుచేయడం జరిగేది.

42 ఏప్రిల్‌ 2వ తేదీన మహిళాసంఘం సభ జరుగుతూవుంటే అక్కడ వితంతువివాహం జేసుకొంటామని ఒక జంట వచ్చారు. వస్తే అప్పుడు మధ్యాహ్నంపూట మహిళాసంఘం సభలో పెళ్ళి చేశాం. ఆశ్రమం వుండేది అందులో జరిగింది. జరిగితే సనాతనులంతాకల్సి ఆశ్రమం మైలపడి పోయిందనిచెప్పి రవుడీలని తీసుకొచ్చి దాడి చేయించారు. అక్కడ కరెంటు లేదు. పందిళ్ళువేసి పెట్రొమాక్సు లైట్లుపెట్టి జరుపుకొంటున్నాం. దాదాపు పన్నెండువందలమందో పదమూడు వందలమందో ఆడవాళ్ళు పిల్లాజెల్లా అచ్చంగా ఆడవాళ్ళు వున్నారు. యువజన సంఘం, రైతుసంఘాల కుర్రాళ్లు గార్డులు రౌడీలు దాడిచేసి మీటింగ్‌ మీద రాళ్ళేస్తే ఒకళ్ళమీద ఒకళ్ళు పడి తొక్కుకుంటూ చెల్లాచెదరై పోయారు. దెబ్బలు తగిలాయి. తర్వాత ఈ కుర్రాళ్ళెళ్ళి రౌడీలని పట్టుకొని కొట్టడం జరిగింది. తర్వాత ఆశ్రమంలో ఇంకా వుంటే కుదర్దనేదాంతో ఆ పన్నెండువందల మందిని అటూఇటూ పెట్రోమాక్సు లైట్లుపెట్టుకొని నిలబడి మొత్తం అందర్ని వూళ్ళోకి నడిపించుకొని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి వూళ్ళో ఒక పెద్దగొడ్లచావిడివుంటే అది బాగుచేయించి మరుసటి రోజు అక్కడ మీటింగ్‌ పూర్తిచేసి ఎక్కడివాళ్ళనక్కడ పంపించివేయడం జరిగిందన్నమాట. అప్పటినుంచి అదొక ప్రచారం. ఆడాళ్ళమీద దాడిచేశారట, అట్లాచేశారట ఇట్లాచేశారట కొట్టారట అని వున్నయి, లేనియి కల్పించి ప్రచారం చేశారు. వాటినుంచి సర్దుకోవడానికి మళ్ళీ మేం తిరుగుప్రచారం చేయాల్సి వచ్చింది.

మిగతా వచ్చే సంచికలో…..

(మనకు తెలియని మన చరిత్ర పుస్తకం నుంచి)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో