– జూపాక సుభద్ర

ప్రముఖ సామాజిక కళాకారిణి, కార్యకర్త చంద్రశ్రీ యీ సమాజానికి భౌతికంగా దూరమై (7-7-12) అప్పుడే యేడాదైంది. కాని జీవితాంతం ఉద్యమ పాటగా, ఉద్యమ కళాకారిణిగా బతికిన చంద్రశ్రీ జీవితం చుట్టూనే కాదు చంద్రశ్రీ మరణం చుట్టూ అల్లుకున్న మనుధర్మ రాజకీయాలు, మగ దళిత రాజకీయాలు, కులస్త్రీల రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన, చర్చించాల్సిన సందర్భం ఇది.

చంద్ర విప్లవ ఉద్యమాల్లోకి రాకముందు చీరాలలో ఇంటర్‌ చదువుతున్న మామూలు దళితమ్మాయి. కాలేజిలో విప్లవ పాటలు విని ఆ పాటల్తో ఉద్యమంగా పయనమైంది ‘జననాట్యమండలి’కి. సమసమాజాన్ని కలగన్న పాటకోసం, సమానత్వాన్ని కోరుకొని అడ్డు తగిలిన అమ్మానాన్నలని కుటుంబాన్ని వదిలేసి వచ్చింది పూర్తిస్థాయి కార్యకర్తగా. ఆ పార్టీలోనే ఆమె పాట విని మనసు పడిన మగవాడిని కులం మతం పట్టింపుల్లేకుండా పెళ్ళి చేస్కుంది. తర్వాత ఆ మగవాడు మొగుడై పాట పదుగురికి పంచొద్దు యింటికే పరిమితి కావాలనే ఆంక్షల్ని, ఆ ఆంక్షల్ని సమర్థించే విప్లవ మనువాద కుల రాజకీయాల్ని, జెండర్‌ వివక్షల్ని ఎదిరించింది. ఆ మగాణ్ణి మగాల్లని మోసే విప్లవపార్టీని వదిలేసింది. పసిబిడ్డతో బైటకొచ్చింది.

తర్వాత కారంచేడు, చుండూరు దళిత ఉద్యమాల్లో దళిత ఉద్యమ పాటకు ప్రాణంబోసి బాధితుల పక్షాన నీలిపతాకగా నిలబడింది. మొత్తం తెలుగు ప్రాంతమంతా చంద్రశ్రీ పాటవినని పల్లెలేదు. ఆ తర్వాత కెజి సత్యమూర్తితో కలిసి ‘ఏకలవ్య కళామండలి’లో నల్లసూరీలను నలుదిక్కుల పాడిన చంద్రశ్రీ నల్లచందమామల కోసం దళిత విమెన్‌ థియేటర్‌ బెట్టింది.

చంద్రశ్రీని ముందుబెడుతూ నేను, శ్యామల దళిత్‌ విమెన్‌ థియేటర్‌ పెట్టాలనే ప్రపోజల్‌ వుండింది. ఒక మహిళా ఎన్‌జీవోను కూడా సంప్రదించాం. కాని అది వర్కవుట్‌ కాలే. మా దళిత మహిళల్ని నమ్మకంలోకి తీసుకోక కొంత, అనేక అనుమానాలు కొంత పంజేసి ఆ ప్రపోజల్‌ వట్టిపోయింది. కాని చంద్రశ్రీ ఆ ప్రపోజల్‌ని వ్యర్ధం చేయలే. తనే అన్ని అయి ‘దళిత విమెన్‌ థియేటర్‌’ పెట్టింది. అది ఆమెకే సాధ్యమైంది. ఎందుకంటే చంద్రశ్రీ బహుముఖప్రజ్ఞలున్న కళాకారిణి. బాగా రాయగలదు, గజ్జెకట్టి ఆడగలదు, నాటకాలు, ఏకపాత్రాభినయాలు చేయగలదు. కాని ఆమెకు పాటే జీవం. అగ్రకులంలో పుట్టిన కళాకారిణి అయి వుంటే ఆ గుర్తింపులు ఆకాశానికి యెగబాకేవి. సావిత్రిబాయి పూలే ఏకపాత్రాభినయాన్ని కూడా పాటగా మలుచుకొని పాడింది. క్యాన్సర్‌ జబ్బు ప్రాణాల్ని తోడేస్తున్నా పాటను ఆపలే. యీ భారతకులసమాజాన్ని విముక్తి చేసేది అంబేడ్కారిజమని ఆమె చివరిరోజుల్లో సంగీతం నేర్చుకొని ‘అంబేడ్కర్‌ సుప్రభాతాన్ని యీ సమాజానికందించింది ఆల్బమ్‌గా!

చాలామంది మిత్రులంటారు. చంద్రశ్రీ, కలేకూరి ప్రసాద్‌ జీవితాలు ఒక్కలాగే వున్నాయని. యిద్దరు దళితులు కులాంతర వివాహం, విప్లవపార్టీ నేపథ్యాలు, దళిత ఉద్యమ నేపథ్యాలు, కులాంతర వివాహ విచ్ఛిత్తి, కళలతో బతికారు యిద్దరు. కుటుంబాల చట్రాల్లో యిమడలేదు. సమాజ అణచివేతల్ని ప్రశ్నించినవారే. ధిక్కరించిన వారే. యిద్దరిదీ అకాల మరణమే. కాని దళిత సంగాలు కలేకూరిని స్వంతం చేసుకొని, గౌరవించుకున్నట్లు చంద్రశ్రీని చూడలేదు. చంద్రశ్రీ చనిపోయినప్పుడు కూడా చంద్రశ్రీని గౌరవంగా సాగనంపని వివక్షల్నే ఎదుర్కొంది. (చనిపోయాక్కూడా) పురుషుడు స్వతంత్రంగా ధిక్కారంగా బతికితే ఒక విలువ, స్త్రీ కూడా స్వతంత్రంగా ధిక్కారంగా బతికితే యింకో విలువ ప్రదర్శించడం దళిత మగవాళ్లకు, దళిత సంగాలకు సరియైంది కాదు. పైకి మనుధర్మాన్ని ఎదిరించుతున్నట్లు చెపుతూ ఆచరణ మనువాదంగా వున్న విప్లవసంగాలు కూడా చంద్రశ్రీ పట్ల నిర్లక్ష్యవైఖరే కనబరిచారు.

అన్ని అణచివేతల్ని ప్రశ్నించే దళిత సంగాలు జెండర్‌ వివక్షలు ప్రదర్శించడం నిత్యం జరుగుతూనే వుంది. యిక దళిత పత్రికలు చనిపోయిన బ్రాహ్మణ పండితుల ముఖ చిత్రాలతో ప్రత్యేక సంచికలు ఆగమేగాలమీద వేసి తమ బానిసత్వాల్ని చాటుకుంటున్నాయి. కాని సామాజిక కార్యకర్త, ఉద్యమపాటగా బతికిన దళితబిడ్డ చంద్రశ్రీ దళిత పత్రికలకు అంటకపోవడం విషాదం. యిట్లాంటి ఉద్యమ కార్యకర్తగా, కళాకారిణి జీవితం మహిళా సంగాలక్కూడా పట్టలే. యిక్కడి మహిళా సంగాలు మహిళా ఎన్‌జీవో సంగాలు, ఫెమినిస్టు సంగాలు చంద్రశ్రీ పాటను, కళను, ఆమె క్యాన్సర్‌తో పోరాడుతుంటే ఆమెను అక్కున చేర్చుకొని ఆదరించలేకపోయారు.

స్వతంత్ర, స్వేచ్ఛాయుత జీవనాన్ని ఆనందించిన అగ్రకుల మహిళల జీవితాలు ఛిద్రం కాలే. విచ్ఛిన్నం కాలే. వారి స్వేచ్ఛల్ని ఫెమినిజం కూడా అక్కున చేర్చుకొని ఆదరించింది. స్వేచ్ఛా. స్వాతంత్ర జీవనాల తర్వాత కూడా మల్లా సాధారణ కుటుంబ జీవనంలో సమాజంలో దళిత, బహుజన కులాల మగవాల్ల ఆసరాతో నిలదొక్కుకు న్నారు. కాని చంద్రశ్రీ విషయంలో అట్లా జరగలేదు. ఫెమినిస్టు అగ్రకులాల ఆడవాల్లు తమ ఆడవాల్ల పట్ల చూపించిన విశాలతను చంద్రశ్రీ పట్ల చూపించలేకపోయారు. కారణం కులం. యిటు సాటి జెండర్‌ కులవివక్ష, అటు సాటి కులం జెండర్‌ వివక్షలు చంద్రశ్రీని పట్టించుకోలేదు. ఆమె సామాజిక జీవితమ్మీద ఎలాంటి మాట ఫెమినిస్టుల్నించి రాలేదు. చంద్రశ్రీ జీవితం దళిత మహిళలకు గుణపాఠం కావాలి.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.