– చింతనూరి కృష్ణమూరి

పురుషాధిక్య సమాజంలో స్త్రీ అనాదిగా అణచి వేయబడుతూనే ఉంది. స్వేచ్ఛకు దూరమై వివక్షకు గురవుతూనే ఉంది. అందుకు స్త్రీల పరిస్థితి ఇలాగే ఉంటే సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న దళిత, గిరిజన స్త్రీల పరిస్థితి మరింత దయనీయం. ఇటు సామాజికంగా కులవివక్ష, అటు పితృస్వామిక కుటుంబ వ్యవస్థలో నిత్యం జరిగే దోపిడీ, అణచివేత వల్ల వీరు అనేక కష్టనష్టాలు అనుభవిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో సాధారణ స్త్రీ జీవిత, దళిత స్త్రీ జీవిత చిత్రణ జరిగినా ఉపకుల, గిరిజన మహిళల జీవితాన్ని చిత్రించిన సాహిత్యం చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే వీరి జీవితం, సమస్యలు నెమ్మదిగా సాహిత్యంలో చోటు చేసుకుంటున్నాయి.

గిరిజనుల్లో కూడా అనేక తెగలు, కులాలు ఉన్నాయి. ఒక్కో కులానికి ఒక్కో సంస్కృతి, జీవన శైలి ఉన్నాయి. గిరిజనుల్లో ఎరుకల కులస్తుల జీవనం – ప్రత్యేకమైంది. ఏ సంస్కృతైనా అత్యంత ప్రభావం చూపించేది ఆజాతి – మహిళలపైనే, ఎరుకల మహిళ జీవితాన్ని సమగ్రంగా చిత్రించిన నవల అరుణ రచించిన ‘ఎల్లి’ అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన స్త్రీల జీవితాన్ని చాలా సహజంగా చిత్రించారు రచయిత్రి.

ఎరుకల కులస్తులు మైదాన ప్రాంత గిరిజనులు. వీరికి ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలున్నాయి. వీరు కొన్ని సంచార జీవులుగా కనిపిస్తారు. అలాగే ఏదో ఒక గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకుని కూడా జీవిస్తుంటారు. తట్టలు, బుట్టలు అల్లడం, సోది (ఎటుక) చెప్పటం వీరి వృత్తి. పందుల పెంపకం వీరి జీవన విధానంలో ఓ భాగం. భార్యను అమ్ముకునే ప్రత్యేక సంస్కృతి కూడా ఈ కులంలో కనిపిస్తుంది. గ్రామాల్లో దళితుల మాదిరిగానే ఎరుకుల కులస్తులు కూడా చిన్నచూపు చూడబడేవారే.

ఎల్లి నవలలో స్త్రీ పాత్రలు ప్రత్యేకమైనవి. కుల కట్టుబాట్లు, పురుషాధిక్య ధోరణి కింత ఎరుకుల స్త్రీలు ఏవిధంగా నలిగి పోతున్నారో కళ్ళకు కట్టినట్లు చిత్రించారు రచయిత్రి. ఈ నవలలో ఎల్లి, మాలచ్చిమి, పారోతి, ప్రధాన పాత్రలు.. ఇందులో ఎల్లి నాయిక, మాలచ్చిమి అపార జీవితానుభవం కలిగిన పాత్ర పారోతి లోకం పోకడ తెలిసిన ఇల్లాలు. వీరితోపాటు బాజీ అనే పాత్ర అన్యాయానికి గురయిన అభాగ్యురాలు. నీతి, దురగ, మరికొన్ని స్త్రీ పాత్రలు.

ఈ నవల మొత్తం ఎల్లి పాత్ర ప్రధాన కేంద్రంగా నడుస్తుంది. ఆడుతూ పాడుతూ గడిపే బాల్యంలోనే పొరుగూరి తిమ్మయ్యతో ఎల్లికి వివాహం జరుగుతుంది. ఎరుకల కులంలో కూడా బాల్య వివాహ వ్యవస్థ ఉందనడానికి ఇది నిదర్శనం. పెళ్లంటే ఏమిటో తెలియని వయసులో, తోటిపిల్లలతో గోలీలాడుకునే ఎల్లిని తీసుకొచ్చి పెళ్ళి చూపులు నిర్వహిస్తారు. ఆమె కుటుంబ సభ్యులు. చింపిరి జుట్టుతో, గూడ జారిన చిరిగిన చొక్కాతోను పైకి లాక్కుంటూ వస్తున్న ఎల్లిని చూసి పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు నచ్చిందని చెప్పి, ఆ తర్వాత పెళ్ళికూడా జరిపిస్తారు. పేదరికం, నిరక్షరాస్యత, సరైన పోషణ లేక ఎరుకల పిల్లలు ఏవిధంగా ఉంటారనడానికి ఎల్లి బాల్య చిత్రణ ఉదాహరణ. క్రింది స్థాయి కులాల్లో భార్యా భర్తలిద్దరూ శ్రమిస్తేగాని ఇల్లు గడవని పరిస్థితి. ఈ కులాల్లో స్త్రీలు ఉత్పత్తి ప్రక్రియల్లో చాలా కీలకంగా ఉంటారు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే సామాజిక ఉత్పత్తి కార్యక్రమాలు అంటే కూలి చేయడం, వ్యవసాయం, ఇతర పనులు చేస్తూ జీవిస్తుంటారు. ఇటువంటి వారు ఇంటిపట్టునే ఉండి పిల్లలను శుభ్రంగా తయారుచేయడం చదువు చెప్పించడం, సరైన పోషణ చేసే పరిస్థితి వీరికి ఉండవు. పిల్లలకు ఇంత తిండి తెచ్చి పెట్టి బతికించడమే వీరి ప్రధాన ధ్యేయం. ఈ నవలలో ఎల్లి తల్లిదండ్రులది అదే పరిస్థితి. దీనికి అద్దం పట్టేలా ఎల్లి బాల్య చిత్రణ చాలా సహజంగా ఉంటుంది.

దళిత, గిరిజన స్త్రీలు తమ దైనందిన జీవితంలో మూడు రకాల అణచివేతకు గురవుతుంటారు. అవి కులతత్వం, పురుషాధిపత్యం, వర్గదోపిడే. ఈ నవలలో స్త్రీలు కూడా ఈ రకమైన అణచివేతకు గురైనవారే. బాజీపై అగ్రకుల పోకిరీలు అత్యాచారాలు చేయడం, ఎరుకల కులస్తులను ఆ గ్రామంలో చిన్న చూపు చూపడం, యజమానులు ఎరుకుల కులస్తులపై దాడులు చేయడం ఇవన్నీ కులతత్వానికి నిదర్శనం.

ఎరుకల స్త్రీలపై హింస నిత్యకృత్యం. ఇదో సాధారణ విషయంగా కనిపిస్తుంది. ఈ నవలలోని స్త్రీ పాత్రలన్ని పురుషుల చేతిలో హింసకు గురయినవే. పెళ్లయిన తర్వాత ఎల్లి తన భర్త తిమ్మయ్యతో కలిసి చూపల వేటకు వెళుతుంది. గాలానికి చిక్ని చేపను వెంటనే తీయకపోవడం వల్ల ఆ చేప నీటిలోకి వెళుతుంది. దీంతో తిమ్మయ్య తీవ్ర ఆగ్రహంతో ‘నీ చూపు ఏ రంకు మొగుడిపై ఉందే’ అంటూ విపరీతంగా కొడతాడు. అకారణంగా స్త్రీలపై నిందలు మోపడం, ఆ వంకతో హింసకు పాల్పడడం అనే పురుషాధిపత్య ధోరణి ఇక్కడ కనబడుతుంది. ఎల్లిని కొట్టడం చూసి అడ్డుకోబోయిన జీవాలుతో తిమ్మయ్యకు పోట్లాట జరుగుతుంది. ఆ తర్వాత జీవాలు ఎల్లిని తీసుకొని పుట్టింటికి వస్తుండగా చూసి, దువ్వ మధ్యలో కలసి, విషయం తెలుసుకుని తానే స్వయంగా ఎల్లిని ఇంటికి తీసుకువస్తాడు. దీని వల్ల జీవాలు ఎల్లిని లేవదీసుకువచ్చాడనే అపోహ కలగకుండా రచయిత్రి జాగ్రత్త పడినట్లు కనిపిస్తుంది. అలాగే ఎల్లి కూడా భర్తను వదిలి జీవాలు, దువ్వ వెంట, పుట్టింటికి రావడం చూస్తే – భర్తతో పాటు అత్తవారింట్లో బాధలు తట్టుకోలేకనేననే విషయం గమనించవచ్చు. మాలిచ్చిమి (నాయనమ్మ)తో ఎల్లి తాను మళ్ళీ అత్తవారింటికి వెళ్ళనని తెగేసి చెప్పడం దీనికి నిదర్శనం.

భార్యాభర్తలయిన పారోతి, బిచ్చాలు పందులను పెంచుతుంటారు. అందులో బిచ్చాలు నిర్లక్ష్యం వల్ల ఓ పందికి ఎవరో కాళ్లరిగ గొట్టినపుడు పారోతి తన భర్తను తిడుతుంది. దీన్ని అవమానంగా భావించిన బిచ్చాలు ఆమెను విపరీతంగా కొడతాడు. ఒక సందర్భంలో భర్తనొదిలి పుట్టింటికి వచ్చిన ఎల్లిని తలచుకుని జీవాలుతో ‘నీవు తిమ్మయ్యను కొట్టబట్టే దానికీగతి పట్టిందిరా’ అని అన్నప్పుడు ”కొట్టక ముద్దెట్టుకుంటారా” అని జీవాలు అంటాడు అపుడు ”పెళ్ళాన్ని కొట్టని మొగోడ్ని ఈ గుడిసెల్లో ఒక్కడ్ని చూపిచ్చరా” అని పారోతి అనడం స్త్రీలపై జరిగే గృహహింసకు తార్కాణం. పారోతిలో తిరుగుబాటుతత్వం, ఏమైనా ఎదిరించే తత్వం కనిపిస్తుంది. తన బావ కూతురైన ఎల్లిని మళ్ళీ అత్తవారింటికి తీసుకెళ్ళడానికి తిమ్మయ్య, అతని తండ్రి బూసియ్య వచ్చినపుడు వారిని పారోతి చెడామడా తిట్టడం, సందర్భం వచ్చినప్పుడల్లా అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడటం ఈమె తిరుగుబాటు ధోరణిని ప్రతీక. ఎల్లి పంచాయితీ ఎంతకీ తెగకపోవడంతో ఆమెకు వచ్చిన కట్నం తిరిగి చెల్లించాలని లేదా పిల్లని అత్తవారింటికి పంపాలని మామ బూసియ్య చెప్పినపుడు చివరకు ఎల్లిని అత్తవారింటికి పంపడానికే ఎంకన్న (ఎల్లి తండ్రి) నిర్ణయిస్తాడు. అంటే ఇక్కడ స్త్రీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పురుషుడే నిర్ణయం తీసుకోవడం స్త్రీల అభిప్రాయాలకు విలువలేదనే విషయం తెలుస్తుంది.

గొల్ల కులంలో పుట్టన మాలచ్చిమిని తల్లిదండ్రులు అక్కరలేదని పారేస్తే ఎరుకుల వాళ్ళు తెచ్చుకుని పెంచుకుంటారు. ఎరుకల కులంలో ఆడపిల్లను, భార్యలను అమ్ముకునే సంస్కృతి కనిపిస్తుంది. అంతుకుముందే పిల్లలున్నా, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికే భర్త భార్యను వేరొకరికి అమ్మితే మారుమాట్లాడకుండా వెళ్ళాల్సిందే. పేగుబంధాన్ని తెంపుకుని, ఇష్టమున్నా లేకున్నా కొనుకున్న వాడితో వెళ్ళి, కాపురం చేయాల్సిందే. మానవ సమాజంలో ఇదొక విపరీత ధోరణి, ఇది వారి కులాచారం. దీన్ని ధిక్కరించే తెగువ ఈ స్త్రీలకు ఉండదు. కుల కట్టుబాట్లు ఎంత పటిష్టంగా, కఠినంగా ఉన్నాయనే దానికి ఇది నిదర్శనం. పిల్లలను వదిలి తల్లి వేరొకరితో వెళ్ళేటప్పుడు ఆ తల్లి మానసిక సంఘర్షణ ఏ విధంగా ఉంటుందో ఊహించవచ్చు. అలాగే తల్లికి దూరమై అవస్థలు పడే ఆ పిల్లల స్థితిని అంచనావేయవచ్చు. ఇది వారి భావి జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ మాలచ్చిమి కూడా ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి తనను కొనుకున్న సుబ్బన్న దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆమె మానసిక క్షోభను అర్థం చేసుకోవచ్చు. ఓసారి మాలచ్చిమి తమ్ముడు నెలబాలుడు వచ్చి మొదటి భర్త ద్వారా పుట్టిన కొడుకుకు మనవడు పుట్టాడు. ఆచ్చం మాలచ్చిమిలాగే ఉన్నాడని చెప్పినపుడు ఆమెకు పేగు బంధాన్ని కెలికినట్టయింది. ఈ సందర్భంగా మాలచ్చిమి నెలబాలుడితో ”పుట్టగానే కన్న తల్లి పారేసింది. తర్వాత – పెంచుకున్నోడు అమ్మేశాడు. కట్టుకున్నోడూ అమ్ముకున్నాడు. ఇక్కడ కళ్ళముందే బిడ్డ చనిపోయింది. ఉన్నోడు (కొడుకు ఎంకన్న) ముద్దెయ్యడు. బిచ్చపు బతుకు బతుకుతున్నామరే” అంటూ ముఖం మీద చెంగేసుకుంటుంది. ఆ చెంగుచాటున సముద్రమంత దుఃఖమున్నది. బాధ కలిగినప్పుడు స్త్రీలు ముఖం పైపైట కొంగు కప్పుకుని ఏడవడమనే లక్షణాన్ని, ప్రతి స్త్రీకి స్వాభావికంగా ఉండే మాతృ హృదయాన్ని చాలా పరిశీలన దృష్టితో ఆవిష్కరించారు రచయిత్రి. సుబ్బన్న ద్వారా కన్న బాజీ (కూతురు)ని అగ్రకులాల వారు పాడుచేసినపుడు, పెళ్ళైన తర్వాత బాజీ భర్తను దగ్గరకు రానీయకపోవడం, తర్వాత ఆమె అనుమానాస్పదంగా మరణించినపుడు తల్లిగా మాలచ్చిమి పడిన ఆవేదన మాటల్లో చెప్పలేనిది. బాజీపై జరిగిన అత్యాచారాన్ని భర్తకు కూడా చెప్పకపోవడం, భర్త సుబ్బన్న కాలును ఆసామి నరికి వేయించడం, ఫలితంగా ఆయన మరణించడం, తనకు యిష్టంలేకపోయినా ఎల్లి మనవు తగాదా పెద్దమనుషుల చేతుల్లోకి వెళ్ళడం మాలచ్చిమిని తీవ్రంగా కలవర పరచిన సంఘటనలు, అయినా వీటన్నిటిని తట్టుకుని నిలవడం, ఆమె మానసిక దృఢత్వాన్ని తెలియజేస్తుంది.

సమాజంలో మిగతా స్త్రీలకంటే క్రిందిస్థాయి కులాల స్త్రీలపై అత్యాచారాలు క్రమంగా జరుగుతున్నాయి. ఈ నవలలో కూడా బాజీపై కొందరు అత్యాచారం చేయడం, ఫలితంగా ఆమె జీవితం నాశనమై, చివరకు మరణిస్తుంది. ఇది పురుషాధిక్య, అగ్రకులతత్వ దురహంకారానికి నిదర్శనంగా భావించవచ్చు. స్వభావంలోనూ, రూపంలోనూ ఇతర స్త్రీల సమస్యలకు, దళిత, గిరిజన స్త్రీల సమస్యలను స్పష్టమైన తేడా ఉంది. అగ్రకుల, ధనిక స్త్రీలపై ఇతరులు దౌర్జన్యం చేసే సంఘటనలు అరుదు. ఇక దళిత గిరిజన స్త్రీల విషయానికొస్తే వారికి ఇంటి నుంచి ఎదురయ్యే సమస్యలకంటే అగ్రకుల, భూస్వాములు, పెత్తందార్ల నుంచి పొంచివున్న ప్రమాదం అత్యాచారాలు, హత్యల రూపంలో వారి జీవితాలను చిద్రం చేస్తున్నాయి. ఇది బాజీ విషయంలో ఈ నవలలో ప్రతిఫలించింది. కింది స్థాయి బాధిత కుటుంబాలు అఘాయిత్యాలు చేసిన పెత్తందారులను ఎదిరించలేని దైన్యం కూడా ఈ నవలలో కనిపిస్తుంది. అత్యాచారానికి గురైన మహిళల్లో కొందరికి లైంగిక జీవితంపై భయం, విరక్తి కలుగుతాయి. అఘాయిత్యం జరిగినా దానిని బయట పడనీయకుండా బాజికి మరొకరితో పెళ్ళి చేసినప్పటికీ ఆమె లైంగిక జీవితంపై భయంతో భర్త దగ్గరకు వెళ్లదు. ఈ నవలలో బాజీ ఒక విషాద పాత్ర.

యుక్త వయస్సులో యువతి యువకుల మధ్య వ్యక్తంగానో, అవ్యక్తంగానో ఉండే ప్రేమలు ఈ నవలలో కూడా ఉన్నాయి. ఎల్లికి మామయ్య వరస అయ్యే జీవాలుకు ఆమెపై ప్రేమ ఉంటుంది. ఎల్లికి పెళ్లికాకముందు కలిసి ఆడుకున్నారు. ఎల్లికి పెళ్ళైయిన తర్వాత బాధపడతాడు జీవాలు. ఎల్లిని భర్త తిమ్మయ్య కొడుతుంటే చూసి అడ్డుకుని అతనిపై చేయి చేసుకుంటాడు. తర్వాత ఎల్లిని తీసుకొని దువ్వతో కలిసి పుట్టింటికి రావడంవల్ల పంచాయితీ ఎంతకీ తెగకపోవడంతోఆమె జీవితం బాగుచేయడానికి తాను పెళ్లి చేసుకుంటానని ఎంకన్నతో చెప్పడం ఎల్లిపై ప్రేమను మరోరూపంలో వ్యక్తం చేయడమే అలాగే నీతి దువ్వపట్ల – అనురక్తురాలవుతుంది. అతడిని తన మనసులో నిలుపుకుంటుంది. ఈ నవలలో స్త్రీలు తన కడుపున పుట్టిన పిల్లలతోపాటు, అక్కడలేదని పారేసిన ఇతరుల పిల్లలను కూడా సొంత బిడ్డల్లా పెంచడం వారి మానవతా హృదయాన్ని తెలియజేస్తుంది. యాదవ కులంలో పుట్టి ఇష్టంలేక కన్నతల్లి పారేయగా ఎరుకల స్త్రీ తెచ్చుకొని పెంచడం, మాలచ్ఛిమి మంత్రసానిగా పనిచేస్తున్నపుడు పొరుగూరిలో ఓ కాన్పు చేయగా, ఆ పుట్టిన బిడ్డను పారేయమని కొంత డబ్బు కూడా ఇవ్వగా, పారేయడం ఇష్టంలేక తానే తెచ్చి పెంచుకుంటుంది. ఆబిడ్డే మాలిచ్ఛిమి పెంపుడు కొడుకు దువ్వ ఎవరో కన్న పారోతిని అక్కి పెంచుకోవడం ఎరుకల స్త్రీల ఉదాత్తమైన మాతృ ప్రేమకు నిదర్శనం.

పితృస్వామిక కుటుంబాలతో ఆర్థిక పెత్తనం కూడా పురుషులదే, కిందిస్థాయి కులాలలో స్త్రీపురుషులిద్దరూ పనిచేసి సంపాదించినా నియంత్రణ మాత్రం మగవాళ్లదే. పురుషుడు (భర్త) తాను సంపాదించిన సొమ్మును తాగుడు, జల్సాలకు ఖర్చుపెడితే స్త్రీ (భార్య) మాత్రం కుటుంబపోషణకు వినియోగిస్తుంది. ఆమె సంపాదించిన డబ్బును కూడా బలవంతంగా లాక్కెళ్ళి తాగి, ఖర్చుపెట్టే ఆధిపత్యం పురుషుల్లో కనిపిస్తుంది. ఇదే విషయం ఎల్లి నవలలోనూ కనిపిస్తుంది. ఒకడుగు ముందుకేసి తాగుడుకోసం, డబ్బుకోసం భార్యలను, ఆడపిల్లలను నిర్ధాక్షిణ్యంగా అమ్ముకునే సంస్కృతి కూడా కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో ఎదురుతిరిగే భార్యలను కొట్టడం ఇక్కడ సాధారణ విషయం. ఇటు కుటుంబంలో హింస, ఆధిపత్యం, అటు బయట సమాజంలో కుట్ర తత్వం, ఇంటా బయట ఆర్థిక దోపిడి, అణచివేతలతో దళిత, గిరిజన స్త్రీలు నిత్యం వేదనను భరిస్తున్నారు. ఇదంతా ఎల్లి నవలలో మనకు కనిపిస్తుంది.

ఈ విధంగా ఎరుకుల కుల స్త్రీల జీవితంలో ఉండే సమస్యలు, విషాదకోణాలన్నీ చాలా సహజంగా చిత్రించారు రచయిత్రి. సాధారణ స్త్రీ సమస్యలతో పాటు ఎరుకల స్త్రీలకంటే ప్రత్యేక సమస్యలను కూడా ప్రభావితంగా చూపెట్టారు. సాధారణ ప్రజానీకానికి తెలియని ఎరుకుల కుల జీవితంలోని విశేషాలను ఈ నవలలో చూడవచ్చు. ఇందులో స్త్రీ పాత్రలు వేటికవే ప్రత్యేకమైనవి. అన్ని పాత్రలు వారి జీవనశైలిని, సంస్కృతిని తెలిపేవే. హృదయాన్ని బరువెక్కించే, కంటతడి పెట్టించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయిందులో, ఇలాంటి స్త్రీల జీవితంపై సాహిత్యపరంగాను, సామాజికపరంగాను మరింత లోతైనా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.