– రమా సుందరి

ఈ మధ్యకాలంలో ఎన్నడూ విననంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీల మీద ఇవి జరుగుతున్నాయి. ముక్కుపచ్చలారని పసిపాపలు, భారతదేశ ధార్మికత మీద ఆసక్తితో వచ్చిన విదేశీ మహిళలు… ఎవరూ వీటినుండి తప్పించుకోలేకపోతున్నారు.

అత్యాచారాలు జరిగినప్పుడల్లా రెండు వాదనలు ప్రముఖంగా వినిపిస్తాయి. సంప్రదాయవాదులు ఆడవారి వస్త్రధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నవని వాదిస్తారు. అంటే సాంస్కృతిక పరాయీకరణ వలన నష్టం జరుగుతుందన్న అర్థం ఇందులో ధ్వనిస్తుంది. అయితే స్థానిక సంస్కృతుల పరిరక్షణకు అనుకూలంగా వీరు చేసే వాదనలో సంస్కృతీ పరిరక్షణ బాధ్యత అంతా భారత స్త్రీలదేనన్న ధోరణి వ్యక్తం అవుతుంది. ఆ విధంగా స్త్రీల వ్యక్తిగత మరియు సామాజిక స్వాతంత్య్రాలను సంస్కృతీ పరిరక్షణ పేరుతో వీరు తిరస్కరిస్తారు.

ప్రగతికాముకులు అత్యాచారాలకు కారణాలను వస్త్రధారణలో కాకుండా వ్యవస్థలో చూడాలని కోరుతారు. సమాజంలో వస్త్రధారణ ప్రత్యేకమైన విడి అస్తిత్వం కలిగిఉండే విషయం కాదని, వ్యవస్థను నడిపే ఆర్థిక పునాదులు సంస్కృతిని శాసిస్తాయనీ, అలాంటి సంస్కృతిలో ఒకానొక భాగమే వస్త్రధారణ అని వారి వివరణ. వీరు కూడా సాంస్కృతిక పరాయీకరణ జరుగుతోందని అంగీకరిస్తూ దేశ సంస్కృతిని కాపాడుకోవాలని భావిస్తారు. అయితే స్థానిక సంస్కృతుల పరిరక్షణకు అనుకూలంగా వీరు చేసే వాదన, సంస్కృతుల ఆధిపత్యాన్ని తిరస్కరి ంచే ధోరణితో ఉంటుంది.

ప్రగతికాముకులు వస్త్రధారణను, అత్యాచారాలకు కారణంగా అంగీకరించరు. ఎందుకంటే, అనేక సందర్భాలలో అత్యా చారం, అధికారం, ఆధిపత్యాలకు వ్యక్తీకరణ గా ఉంటుంది. పశ్చిమదేశాలలో మహిళలకు వస్త్రధారణలో ఇంతకంటే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఇక్కడికంటే విషసంస్కృతి విస్తృతంగా విస్తరించినప్పటికీ, అక్కడ అత్యాచారాల శాతం తక్కువ. భారతదేశంలో వేళ్ళూనుకొని ఉన్న పితృస్వామ్యం, కరడు కట్టిన పురుషాధిక్యత ఈ అత్యాచారాలకు ప్రధాన కారకాలని వీరు అంటారు.

సంప్రదాయవాదుల్లోనూ, ప్రగతి కాముకుల్లోనూ ఉమ్మడిగా కనిపించే అంశం సాంస్కృతిక పరాయీకరణ పట్ల వ్యతిరేకత. కానీ వారికి ఉన్న కారణాలు వేరువేరు. సంప్రదాయవాదులు తెలిసి చేసినా, తెలియక చేసినా నశించిపోతున్న, నశించవలసిన పాత విలువలను పట్టుకుని వేళ్ళాడుతూ అందులో భాగంగా సాంప్రదా యక వస్త్రధారణను కాపాడుకోవాలని భావిస్తారు. ఇందులో మనదైనది అంతా గొప్పే అని, పరాయిది అంతా చెడ్డదేననే ఒక తప్పుడు అవగాహన వ్యక్తం అవుతు ంది. విదేశీ ఉద్యోగాలకోసం పశ్చిమదేశాల పౌరసత్వాల కోసం, ఫారెన్‌ అల్లుళ్ళ కోసం పరితపించేవారే సంస్కృతి పరాయీకరణ పట్ల గుండెలు బాదుకోవడం తరచుగా కనిపిస్తుంది. వీరికి డాలర్లు కావాలి. కానీ డాలర్ల వెంట వచ్చే సంస్కృతీవిలువలు వద్దు.

ఈ విషయం లోతు ‘సంస్కృతి’ అనే పదాన్ని అర్థం చేసుకోవటంలోనే ఉంది. సంస్కృతులు అనేవి యధాతథంగా వాటి స్థానంలో అవి ఉన్నపుడు ఒకటి గొప్పా కాదు, మరొకటి చెడ్డా కాదు. వేటికవే ప్రత్యేకత కలిగినవి. ప్రజల సర్వతోముఖ అభివృద్ధితో ముడిపడి ఉన్నంతవరకు ఏ సంస్కృతి అయినా గొప్పదే. కానీ వచ్చిన చిక్కంతా చరిత్ర ఎక్కడి సంస్కృతిని అక్కడే ఉంచలేదు. వ్యాపార వాణిజ్యాలతోపాటు పాత వలస పాలన, ఆధునిక సామ్రాజ్యవాద దోపిడి లాంటి ఆర్థిక ఆధిపత్య కార్యకలాపాలు ప్రపంచంలోని వివిధ సంస్కృతులు పరస్పరం ఇచ్చిన పుచ్చుకోవటానికి, సంభాషించుకోవ టానికి, సమ్మిళితం కావడానికి దారితీసింది. అంతేకాక సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి దారితీసింది.

వస్త్రధారణకు సంబంధించి కొన్ని నియమాలు గతంలో పాటించేవారు. దుస్తులు చలి, వేడిల నుండి శరీరాన్ని కాపాడటానికి అనే ప్రాచీనయుగాల నుండి, నాగరికత అభివృద్ధిలో భాగంగా అనేక రూపాలు తీసుకొంటూ ఒక దశలో పరిణితి రూపం తీసుకొంది. అన్ని వర్గాల పిల్లలను ఒకటిగా కలపగల ‘యూనిఫామ్‌’ కల్చర్‌ లాగా, అన్ని రకాల శరీరాకృతి కలిగిన మనుషుల పొడవు, లావు, కండలు, ఎముకలు కప్పిపెట్టే ఒక విశ్వజనీన సాధనంగా దుస్తులు ఒకప్పుడు ఉండేవి. మళ్ళీ స్త్రీ, పురుషులకు వాళ్ళ అవసరాల రీత్యా వేరువేరు వస్త్రధారణ ఉండేది. ఇందులో ఆనాటి వ్యవస్థల ప్రభావం కూడా ఉండేది. కాలక్రమేణ సాంస్కృతిక సామ్రాజ్యవాద ప్రభావంతో భారతదేశంలో అత్యధిక శాతం పురుషుల దుస్తులు పాశ్చాత్య ప్రభావానికి గురయ్యాయి. అయితే స్త్రీల దుస్తులు 80 శాతం ఇంకా స్థానికతను కోల్పోలేదు. కాలక్రమేణ స్త్రీల క్రియాశీలకపాత్ర అన్ని రంగాలలో పెరగటం వారి వస్త్రధారణలో మార్పులకు దారితీసింది.

ఆరడుగుల చీరల నుండి కురచ తక్కువ చీరలలోకి, తరువాత దక్షిణ భారతదేశ స్త్రీలు ఉత్తర భారతదేశ దుస్తులైన పంజాబీ డ్రెస్‌, చూడీదార్‌, షల్వార్‌ కమీజ్‌ వగైరాలలోకి మారిపోయారు. ఇందులో ఫాషన్‌తో బాటు, సౌకర్యం కూడా పని చేసింది. ఇప్పుడు దక్షిణ భారతంలో కూలీ కెళ్ళే మహిళలు కూడ పంజాబీడ్రెస్‌లోకి మారటం గమనించగలము. నగర ప్రాంత మహిళలు పాంటు, షర్ట్‌లలోకి మారారు. ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో సేల్స్‌ గర్ల్స్‌ కూడా జీన్స్‌ పాంటులు ధరిస్తారు.

వేషధారణలో ఈ మధ్య వచ్చిన ఫాషన్‌లో అంతర్లీనంగా కనిపించేది. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ. పాశ్చాత్యదేశాల్లో ఇలాంటి ఆకర్షణ కోసం తమను తాము వ్యక్తీకరించుకునే చర్యలు వెర్రితలలు వేస్తున్నాయి. వ్యక్తిత్వ సౌందర్యంతో కాకుండా శారీరక సౌందర్యంతో ఆకర్షించుకునే ప్రయత్నం ఏ దేశంలోనైనా సహజమే అయినా పశ్చిమ దేశాల్లో అది విపరీత పోకడలకు పోయింది. పోర్న్‌ మాపియా అభివృద్ధి చెంది, వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో పై చేయి సాధించటానికి అదొక సాధనంగా అక్కడ అవతరించడం దానికొక కారణం కావచ్చు. ఇది స్త్రీ, పురుషుల ఆకర్షణకు సంబంధించిన డైనమిక్స్‌ పైన తీవ్ర ప్రభావం పడేసినట్లు కనిపిస్తోంది.

శారీరక సౌందర్య ఆకర్షణలో భాగంగా శరీర భాగాలను కూడా బహిర్గతపరుస్తూ ఆపోజిట్‌ సెక్స్‌ను ఆకర్షించడమే పశ్చిమ దేశాల్లోనూ, కొన్ని లాటిన్‌ దేశాల్లోనూ ఒక ధోరణిగా ముందుకొచ్చింది. దుస్తులను రకరకాల షేపుల్లో కుట్టి ధరిస్తే అదొక ఫ్యాషన్‌ కావచ్చు. ఒకటికి రెండు, మూడు, లేదా ఐదారు దుస్తులు ఒకదానిపైన ఒకటి వేసుకొని లోచొక్కాలను బైటికి కనిపించేలా పై దుస్తులను కురచవి చేసుకొంటే అదొక ఫ్యాషన్‌ కావచ్చు. జుత్తుని రకరకాల షేపుల్లో కత్తిరించి ప్రదర్శించుకొంటే, పాతదైనా, లేటెస్టైనా, అదొక ఫ్యాషన్‌ కావచ్చు. కానీ శరీర భాగాల్ని చూపడం ఏమి ఫ్యాషన్‌? ఇక మనిషి దుస్తులను కనిపెట్టి ధరిస్తున్నదెం దుకు? ఇవి ఆలోచించవలసిన ప్రశ్నలు.

స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణలో భాగంగా వెర్రితలలు వేస్తున్న ఫ్యాషన్లు పాశ్చాత్య దేశాల్లో ప్రముఖ ధోరణి అయ్యింది. సాంస్కృతిక సామ్రాజ్యవాదంలో భాగంగా అది మన దేశానికి వచ్చింది. శాటిలైట్ల పుణ్యమాని విదేశి టి.వి., మ్యూజిక్‌లు దేశాన్ని ముంచెత్తితే, అంతర్జాలం పుణ్యమాని పోర్నోగ్రఫీకి గట్లు తెగి మారుమూల గ్రామీణ యువకుడి జేబులోకి సైతం జొరబడింది. ధనిక వర్గాలు అలవర్చుకొన్న పాశ్చాత్య సంస్కృతి, ‘పాలకుల భావాలే, పాలితుల భావాలు’ కనుక కింది వర్గాల మీదికి దూకింది. ఇందులో భాగంగా స్త్రీ, పురుష భేదం లేకుండా సకల వర్గాలు పబ్‌ సంస్కృతులకు, శరీర భాగాలు చూపుకొనే రకం ఫ్యాషన్లకు లోనవుతున్నారు. దుస్తులు తయారుచేసే పరిశ్రమలు కూడ ఈ రకం దుస్తులను తయారు చేసి జనం మీదకు వదులుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడ ఒక పెట్టుబడిదారుడు కాబట్టి ఈ దుస్తుల కంపెనీలకు అనేక రాయితీలు ఇచ్చి ఈ వస్త్ర సంస్కృతిని మనకు అంట కడుతున్నారు.

వాణిజ్య వ్యాపారాలు ప్రపంచానికి అవసరమే; కాని వ్యాపారం పేరుతో వచ్చే వలస పాలన, సామ్రాజ్యవాద దోపిడీ అవసరం లేదు. సంస్కృతుల సంగమం అవసరమే; కానీ సాంస్కృతిక ఆధిపత్యం అవసరం లేదు.

పాత కొత్తల మధ్య సంఘర్షణ ఎప్పుడూ తప్పదు. సంఘర్షణ జరిగితేనే మెరుగైన అంశం బైటికి వచ్చి అభివృద్ధి వైపుకి సమాజాన్ని నడిపిస్తుంది. అలాగే ప్రపంచీకరణ యుగంలో స్థానికం, పరాయిల మధ్య సంఘర్షణ అనివార్యం. ఈ సంఘర్షణలోంచి పుట్టే మెరుగైన అంశాలను, అవి ఏవైపు నుండి వచ్చినా, స్వీకరించాల్సిందే.

డాలర్‌ వెంట వచ్చే సంస్కృతి మొత్తంగా చెడ్డది కాదు. ప్రతి సంస్కృతిలోనూ పాత, కొత్తలు; గొప్పలు, లోపాలు ఉంటాయి. వాటిలో మెరుగైన అంశాన్ని ఆధునిక అంశాన్ని స్వీకరించి ప్రగతి నిరోధక చెడ్డ అంశాలను తిరస్కరిం చాలి. ఐతే : ఏది మంచిది, మెరుగైనది అనేది అలాగే ఏది ప్రగతి నిరోధకమైనదీ, చెడ్డదైనదీ అనేది ఎలా నిర్ణయించాలి అంటే ఒక్కటే దారి. ప్రజాస్వామిక విలువలకు, సమానత్వ భావాలకు ఏది విలువ ఇస్తుందో అదే గొప్పది, అదే మెరుగైనది, అదే ఆధునికమై నది. కొత్తకు పునాది పాతే కనుక రెండింటిలోనూ ప్రజాస్వామిక విలువలకు, సమానత్వ భావనలకు విలువ ఇచ్చేవి ఉంటాయి. వాటిని కాపాడుకుని ఆ విలువలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని తిరస్కరించటమే నేటి మనిషి కర్తవ్యం. ఆ మాటకొస్తే ఏ కాలంలోనైనా, సంస్కృతి రీత్యా, మనిషికి కర్తవ్యం ఇదే. పాతలోంచి ‘మంచి’ ని నిలుపుకొని కొత్తలోని అభివృద్ధిని ఆహ్వానించాలి.

భారతదేశం లాంటి మూడో ప్రపంచ దేశాల్లో కూడా ఆధిపత్య వర్గాలకు విదేశీ డబ్బు కావాలి. కానీ దానితో వచ్చే సంస్కృతిని అలవాటు చేసుకోకూడదు. ఆ ఆధిపత్యం అన్నీ రంగాల్లో కనబడుతుంది. పురుషులకైతే స్త్రీలు ఒద్దికగా ఉండాలి తప్ప కొత్త ఆర్థిక వెసులుబాటు తెచ్చిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను వారు కోరుకోకూడదు. ధనికులకైతే పేదలు అణగిమణిగి ఉండాలి తప్ప సోకులు కోరుకోకూడదు. అగ్ర కులాలకైతే చిన్న కులాలు కష్టం చేసుకొని తొంగోవాలి తప్ప తన కష్టాన్ని నచ్చిన రీతిలో ఖర్చుచేసుకోగూడదు.

ఇందులో భాగమే స్త్రీల వస్త్రధారణపై ఆంక్షలు.

సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనేది ఆర్థిక సామ్రాజ్యవాదం యొక్క అనివార్య ఫలితం. ఇందులో సామ్రాజ్య వాద దేశాల సంస్కృతి గొప్పదిగా చెప్పబడుతుంది. పశ్చిమ దేశాలే ఇప్పటి ఆధిపత్య సామ్రాజ్యవాద దేశాలు కనుక అక్కడి సంస్కృతి, ప్రజల వేషభాషలు, ఆ దేశాల్లోని వివిధ సామాజిక పాత్రల మధ్య ఉండే సామాజిక సంబంధాలు…. ఇవన్నీ గొప్పవిగా చెలామణిలో ఉన్నాయి. ఆర్థిక, సంస్కృతిక దురాక్రమణలో ఉన్న దేశాలలోని సంస్కృతులు తక్కువ రకం, ఇవి వెనకబడి ఉన్నాయి; ఇక్కడి కుటుంబ సంబంధాలు ప్రాచీనమైనవి; బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు మధ్య ఉండే సంబంధాలు ఇంకా అభివృద్ధి చెందలేదు…. ఇలాంటి వాదనలు, భావాలు – రూపాన్ని నెత్తికెత్తుకొని సారాన్ని తృణీకరించేవి. దీనిని దేశంలోని ధనిక వర్గాలు ఆనందంగా స్వీకరిస్తాయి, ఆచరిస్తాయి. పాలకుల భావాలే పాలితుల భావాలుగా చెలామణి అవుతాయి గనుక కింది వర్గాలు కూడ వారిని అనుకరిస్తాయి. ఆ విధంగా దేశీయ సంస్కృతిని, దిగుమతి చేసుకొన్న పాశ్చాత్య సంస్కృతి ఆక్రమిస్తుంది.

అయితే, ఆధిపత్య వర్గాలకు దేశీయ సంస్కృతి కూడా కావాలి. దేశీయ సంస్కృతిలో కింది వర్గాలను – స్త్రీలు, కార్మికులు, రైతులు, కింది కులాలు మొ. కట్టి పడేసే సాధనాలుగా ఉన్నాయి. కనుక అవి వారికి కావాలి. కానీ దేశీయ సంస్కృతిలోని ప్రగతి కాముకమైనవి, స్థానిక అస్థిత్వాన్ని కాపాడేవి మాత్రం వారికి వద్దు, అవి కింద వర్గాలను ఐక్యం చేస్తాయి కనుక.

అంటే తాగి తందనాలాడి లిక్కర్‌ మాఫియాను పోషించేందుకు పబ్‌లు కావాలి. కానీ అందులోకి స్త్రీలు రాకూడదు. రేసు గుర్రాలు, వాటిపై కాసే పందేలు కావాలి. కాని సంక్రాంతి పండగలో భాగమైన కోడి పుంజు పోటీలు నేరం. ఫ్యాంటు, షర్టు; సూటు, బూటు; షార్ట్‌లు, జీన్స్‌ కావాలి. వాటితో బాటు వచ్చే మిడ్డీలు, చడ్డీలు, లేడి జీన్స్‌, లేడి టీషర్ట్‌లు వద్దు. ఇది వివక్ష తప్ప మరొకటి కాదు. దేశీయ సంస్కృతిని పరిరక్షించుకోవడానికి వీలుగా పాశ్చాత్య సంస్కృతుల్లోని అవాంఛనీయ ధోరణులను అడ్డుకోవాలంటే మొదటి దేనిని అడ్డుకోవాలి? ఆర్థిక, రాజకీయ సామ్రాజ్యవాదాన్ని మొదట అడ్డుకోవాలి. దేశ వనరులు దేశ ప్రజలకు దక్కేలా కాపాడుకోవాలి. దేశ వనరుల నుండి పుట్టిన వస్తువులు, డబ్బులు దేశ ప్రజల పరం కావాలి. ఆ విధంగా ధన, వస్తు సంపదలు అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ అయినపుడు వాటిని అంటిపెట్టుకొని ఉండే సాంస్కృతిక, సామాజిక భావాలు, అలవాట్లు కూడా ప్రజాస్వామ్య పద్ధతులకు లోబడే తమదైన స్వంత అభివృద్ధి బాటపైన పరుగులు పెడతాయి. అది జరిగినపుడు స్త్రీ, పురుష వస్త్రధారణ, దాని పరిణామం ఏ పరిమితుల్లో ఉండాలో ఆ పరిమితుల్లోనే ఉంటుంది. ప్రజాస్వామిక వాతావరణం ఉన్నపుడు సంస్కృతీ పరిరక్షణ భారం ఒక్క స్త్రీలపై మోపడమే విచిత్రంగా, అవాంఛనీయంగా మారుతుంది.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.