-సిహెచ్‌ సుజాత

మా ఇంటి వంటల క్యాలండర్‌లో ఓ రోజు

ఆకు పచ్చని తోరణాలతో కళకళలాడుతుంది

ఆ రోజే సుఖశాంతులు కలిసొచ్చిన ఏకాదశి నాకు

ఆ రోజే పని ఒత్తిడి లేనిరోజు కావాలనుకున్నా.

364 రోజులలో ఖర్చైన నా శ్రమధానానికిగాను, ఒక్క 24 గంటలను

మిత్తికి తీసుకుంటూ ‘వంట’ అనే దైనందిన

బృహత్తర కార్యక్రమానికి ఎంతో ధైర్యంగా,

ఎంతో హాయిగా ఐచ్ఛిక సెలవు దినం ప్రకటించేసా

ఆ క్షణం నుండి నా ఆనందానికి అవధులు లేవు

నా అదృష్టానికి నేనే మురిసిపోయాను.

ఆహా! ఏమీ నా భాగ్యం!

చిన్న వాళ్ళకు రెండు, పెద్ద వాళ్ళకు మూడు అనుకుంటూ రెండెక్కం, మూడెక్కం చదువుకుంటూ చపాతీలు

ఒత్తక్కర్లేదు ఇంటి మనుషులను కొత్త చుట్టాల్లా

ఒత్తక్కర్లేదు, సపర్యలు చెయ్యనక్కర్లేదు.

కత్తికి కోసే పనీలేదు.

చెత్తకు చోటే లేదు.

ఇత్తడి సామనులతో పాటు అటకెక్కిన నా మనస్సును

పుత్తడిలామెరుగుపెట్టాలని పుస్తకాలను

దత్తత తీసుకున్నాను నా మనసులో నేను మాట్లాడి మనస్సులో పూల గుత్తుల పరిమళాలు వెదజల్లాను.

రోజూ అన్ని పనులతోపాటు అన్నం తినటం పూర్తిచేసే నేను

ఈ రోజు నా ‘ఆకలి రుచి’ గురించి కొత్తగా కనుగొన్నాను.

గుత్తివంకాయ కూర గుర్తుకు తెచ్చుకొని

ఉత్తిఅన్నం ఆదరాబాదరాగా తినేసా. ఈ పూటకి

బొత్తిగా పనిలేకుండా పోయింది.

ఒత్తిగిల్లి పడుకుందామనుకున్నా. అమ్మో ఈ

మత్తులో పడితే రేపెలా

అత్తమామలు, ఇంటి బంధువుల వచ్చేది రేపే

ఎత్తిపెట్టుకోవాలి సరుకులు రేపటికోసం

కొత్తిమీర, కరివేపాకులు లేవని బయల్దేరా బజారుకి

ఉత్తిపుణ్యాన ప్రకటించుకున్నాను ఐచ్ఛిక సెలవు

ఎత్తిపట్టుకోడానికే సరిపోయే ఐచ్ఛిక సెలవు దినం

ఐచ్ఛికసెలవు వంటకా? నా ఆకలి మంటకా?

 

దరఖాస్తు

– వై. శ్రీ వాణి

నీ కళ్ళల్లో కనిపిస్తున్నానని

నీ హృదయంలో నేనున్నానని

చెబితే నా మనసు నమ్మనంటోంది.

ఎందుకో తెలుసా?

నిన్ను హృదయస్థానంలో నిలుపుకుని

దేవునిలా ఆరాధిస్తే, పూజించిన పూలను కాలరాశావు.

నీవు చేసే అవమానం, నా మానాన్ని శంకించే అనుమానం

అమానుషంగా బాధిస్తుంటే

నా హృదయం బద్దలైపోయిన శబ్దం

నాకే వినిపిస్తుంటే… నిన్నెలా నమ్మేది!

వివాహ బంధాన్ని అపవిత్రం చేస్తూ

అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు

కనిపించలేదా నా రూపం….

నా హృదయంలోని అక్రందన వినిపించలేదా

అడదాని అవయవ నిర్మాణం దేవుడిచ్చిన శాపమా…

నేను చేసిన పాపమా…

ఆలిని అడవులు పాలుచెయ్యడం మీ మగవాళ్ళ నైజమా

హృదయం మీది తాళితో ఆలిని అయినందుకా

ఇంతగా గేలి చేస్తూ ఎగతాళిచేస్తున్నావే?

మత్తులో తూగుతూ నిర్ధాక్షిణ్యంగా

నీవు చేసే అవమానం

నా రోదన అరణ్య రోదన కావడం నా మనసును

నిర్ధయగా నలిపేస్తుంటే

నిన్నర్థం చేసుకొనేదెలా?

పదిలంగా ప్రాణంగా చూసుకోవాల్సిన నువ్వు

పది మందిలో పలుచన చేస్తుంటే

సుత్తిమెత్తని హృదయాన్ని సుత్తులతో కొడుతుంటే

హింసాత్మకంగా హింసిస్తుంటే

ఈ జన్మకు ఈ కష్టం చాలని

ఏడ్చేందుకు కన్నీళ్ళింకి పోయాయని

మనో వేదనతో మనశ్శాంతికై పరుగిడుతున్నా

నిన్ను శాశ్వతంగా వీడిపోవాలని కోరుకుంటున్నా

అందుకే విడాకులకు దరఖాస్తు చేస్తున్నా.

 

అంతరంగిక శిల్పం

– డా|| కత్తి పద్మారావు

అడవి ఉద్యానవనంలా పూస్తుంది

అంతర్గర్భితంగా

ఓ సెలయేరు

ప్రవాహాల నుండి జనిస్తున్న

జీవన సౌరభాలన్నీ

ప్రమోద భరితమౌతున్నాయి

నిజమే|

అనేక జీవితాలు

తమకుతాము

ఆలక్షితం చేసిన జీవన ఘట్టాలు

సువర్ణాధ్యాయాలుగా

మారుతున్నాయి.

మనిషి నవ్వులో ఎంతో సజీవత వుంది

నిర్లక్ష్యానికి గురైన

ఎన్నో తొంగిచూడని పార్శ్వాలు

ఈనాడు పదును తేలుతున్నాయి.

అది పర్వత శిఖరాగ్రమే

సూర్యుడు దాన్ని వెలిగిస్తున్నాడు

చంద్రుడు, వెన్నెల, గాలి

దాన్ని అలంకరిస్తున్నాయి

పర్వతశ్రేణులన్నీ శిల్పాకృతులే

దృశ్యాలు బాహిరమైనవే కాదు

అంతరంగికమైనవి కూడా||

ప్రతిభతో అవి వెలుగొందుతాయి

ప్రజ్ఞ వాటికి

జీవధాతువు?

అంతర్ముఖీనత నుండి

మాట్లాడుతున్న ప్రతిమాట

ఒక భవిష్యత్‌ దర్శనమే

చీకటిలో పేరుకొని ఉన్న

వెలుగురేకలు ఆత్మకథలుగా

ఒక మహకావ్యమౌతున్నాయి

ఆ ఒక్క పువ్వుచాలు

సున్నితమైన మనోశాస్త్రాన్ని

బోధించడానికి!

ఆకు వాడినపుడు చూడనివాడు

చెట్టు కూలినపుడు ఏమి చూస్తాడు?

ఎన్నో చూపుకు అందని

వారి గాథలు ఆకాశ నక్షత్రాల్లో

జ్వలితమవుతున్నాయి

అవును!

ఈనాడు చరిత్రంతా

విసిరిన కత్తిదికాదు!

మనిషిని నిర్మించిన సమూహానిది.

గణాలను నడిపించిన తల్లిది

ఆమె బిడ్డకే కాదు తల్లి

సమాజ భవితవ్వానికి కూడా

ఆమె నదినాగరికతను

సృష్టించింది.

శిల్పకళా ప్రపంచానికి

ఆయువు అయింది.

ఆమె శైథిల్యమైతే అతడూ లేడు.

అతడెవరో కాదు

ఆమె నుండి జనించినవాడే

ఆమె ఎవరో కాదు|

నిరంతరం పునర్నిర్మించబడేదే!

ఇక్కడ లింగబేధం లేదు.

పాకృతిక జీవన వ్యవస్థలను

ప్రజ్వలింపజేస్తున్న

వారిరువురు మాతృకలే

నిరంతరం పునరుజ్జీవనమే

ఆమె కథ.

 

అగ్ని పుష్పం

– ఝాన్సీ కె.వి. కుమారి

నీ చీకటికి నువ్వు సిగ్గుపడు

నీ లేమికి నువ్వు సిగ్గుపడు

నీ అవమానానికి నువ్వు సిగ్గుపడు

నీ అజ్ఞానానికి నువ్వు సిగ్గుపడు

నీ బానిసత్వానికి నువ్వు సిగ్గుపడు

ఎర్రని నీ రుధిరం

కాంతిని, క్రాంతిని

కోల్పోయినందుకు సిగ్గుపడు

సిగ్గుపడి… నీలో నువ్వు ముడుచుకుపోవడమే విప్లవం!

అప్పుడే … సూర్యుడు ఎర్రగా మండుతాడు

అప్పుడే …. నీకేక దిగంతాలను వణికిస్తుంది

అప్పుడే…. నీ స్వేదంనుండి అగ్నిపుష్పాలు ప్రభవిస్తాయి

అప్పుడే… విశ్వమంతా కొత్త కాంతులు విచ్చుకుంటాయ్‌!!!

 

ఆచారం – ఆదర్శం

– ఆనంద్‌

 

ఆచారం పేరు చెప్పి

ఆదర్శం మంట కలిపి

మడి చీరను చుట్టి

మంగళ సూత్రం కట్టి

అటు చూసిన

ఇటు చూసిన

ఎటు చూసిన

తప్పంటు, ఇంటికి ముప్పంటు

వంట ఇంటికి పరిమితం చేసి

ఇంటికి బానిసని చేసి

అజ్ఞానం నూరిపోసి

కులం పేరున

మతం పేరున

మత్తు చల్లి

మమ్మల్ని మరో వందేళ్ళు వెనక్కి తొయ్యాలని

మతోన్మాద రక్కసి కోరల్తొ శాసిస్తుంటె

చూస్తు ఉండాలా…

మడిని, గుడిని వదిలి

ఆచారానికి మంట పెట్టి

ప్రాణాలను ఉగ్గపట్టి

మరోస్వేచ్ఛ కోసం, వికాసం కోసం, విధానం కోసం

విప్లవ శంఖం పూర్తిస్తాం…

అనుకున్నది సాధిస్తాం….

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.