బడకొడితి

సం.వెం.రమేష్‌

జలజల కురిసింది ముంగారువాన. ఎండిన తాటాకుల మీద టపటప తాళమేస్తా కురిసింది. కొండల గుండెల్ని తడివేళ్లతో తడమతా కురిసింది. గురిగింజ పొదలోని గువ్వ గూటిని నిమరతా కురిసింది. లేడవానిట దోగాడుతున్న పసిబిడ్డ బుగ్గమీద చిటికేస్తా కురిసింది. దుమ్ము దుప్పటిని కప్పుకొను, చెట్టుచేమలను నడగతా కురిసింది. పగిలి నెర్రెలుబారిన బీళ్లను పదునెక్కిస్తా కురిసింది. చిట్టెదురు గుబురులో పిల్లంగోయి పాటయి కురిసింది. కోనేట్లో తామరాకుల మీద జారిపడతా కురిసింది. కనుమలో ఎగిరే చిలకముక్కు ఎరుపును మెరిపిస్తా కురిసింది. ఉమ్మరిల్లి పోయిన మేనులు చెమ్మగిల్లేటట్టా కురిసింది.

”పోదామనుకొన్నప్పుడంతా ఏదో ఒక అడ్డంకి వస్తాని ఉంది మావయ్య. వానకాదు వరదలోచ్చినా సరే, ఈ పొద్దు పొయ్యే తీరాలి” అంటా లోపలకు వచ్చినాడు విక్కి.

”అవును విక్కీ, ఈ పొద్దు బడకొడితి కతేందో తేల్చేయాల్సిందే. బయల్దేరదాం పద” అన్నాను నా మేనల్లుడితో.

ఎన్నాళ్లుగా… కాదు కాదు, ఎన్నేళ్లుగా వింటూ ఉండాను బడకొడితి గురించి! నేను హోసూరుకు పోయిన కొత్తల్లో, కుందు మునుపల్లి నారణప్ప నోట్లో నుంచి మొట్ట మొదటిసారి విన్నాను ‘బడకొడితి’ అనే మాటను.

అవును నాకింకా గురుతుంది. అప్పుడు నేను హోసూరుకు అయిదుమైళ్ళ దూరంలోని కుముదేపల్లిలో ఉండేవాడిని. నేనుండిన ఇల్లుగల్లాయిన పేరు ఎల్లప్ప. ఆయన పెండ్లామూ నేను ఒక తల్లి బిడ్డల్లాగా ఉండేవాళ్లం. ఆయమ్మ పుట్టినిల్లు ఉండి కుందుమానుపల్లికి పొయినాము ఒకసారి. ఊరికి కడాన చేను అంచున ఉండే చిన్నఇల్లు వాళ్లది. ముగ్గురు ఆడబిడ్డలూ ఇద్దరు మగ చిన్నోళ్ళూ నాలుగు అవులూ కోడీ కుక్కా మేకా… కడలంత కాపురాన్ని ఈదే ఆ ఇంటిపెద్దే నారాణప్ప, ఆయన్లో సగం నారాయణమ్మ.

ఆపోద్దు పగలంతా ఆకాపురం, వాళ్ల చేనులోని చెనగ చెట్లను పెరకతా ఉంటే, ఊరికే ఉండేది ఎందుకని నేనూ చెయ్యి వేసినాను చేనులో. చేను చుట్టూ లక్కొలి (వావిలి) పొదలు గూముకొని ఉండాయి. వావిలి చెట్టును చూస్తే మా అన్నవ్వ గురుతుకొస్తాది. చిన్నప్పుడు అనువ్వ వాళ్ల ఊరికి పోతే, రెయ్యిపూట నన్ను చీకటీగలు కుడతాయని, దోవలు డొంకలు వెతికి వావిలాకును కోసుకొచ్చి, నా పడకచుట్టూ మండలు మండలు గా పరిచేది. వావిలాకు వాడకు చీకటిగలు దరికి రావు.

”ఏలప్పా లక్కిలాకునే చూస్తా ఉండావు, బంగారాకు ఏమన్నా సిక్కుతుందనా?” నారాయణమ్మ నవ్వతా అడిగేసరికి అన్నవ్వ వాళ్ల ఊరినుంచి కుందుమానుపల్లికి వచ్చేసినాను.

”బంగారాకా, అంటీ ఏటిదమ్మా?” అన్నాను అచ్చెరపోతా.

”అయ్యో అవి కూడా తెలీదా కొడుకా, ఎండపొద్దులో లక్కిలి వబ్బ (పొద)ల్లో వెతకతా ఉంటే, మిరమిర మించుతా ఒక బంగారు వల ఆకు సిక్కుతుంది. అదిగాన సిక్కిందంటే సాలు, ఇంగ ఇల్లంతా బంగారమే” చెప్పింది నారాయణమ్మ, అదొక పెద్ద గుట్టుమాట అయినట్టు గుసగుసగా.

”అయితే ఇన్నేండ్లలో మీకు ఎపుడూ చిక్కనే లేదా?” అడిగినాను.

”అన్ని వబ్బల్లోనూ ఉండేది లేదప్పో. ఏదో కోటికొక వబ్బలో సిక్కుతుంది అంతే” నారాయణమ్మ మారాడింది.

”అఁ ఆఁ సిక్కుతుంది సిక్కుతుంది. అట్లా అనుకొనే అడివిలోకి పొయిన మీ తాత బడకొడితి నోటికి సిక్కిపోయినాడు” ఎగతాళిగా అన్నాడు నారాణప్ప. అదిగో అప్పుడు విన్నాను ‘బడకొడితి’ అనే మాటను. ఆయన మాటలను బట్టి అదేదో బెడుసు మనుము (క్రూర మృగం) అని అనిపించింది. అది ఎట్టుంటాదో?!

”బడకొడితి అంటే ఏందన్నా?” నోరు విప్పినాను.

”బడకొడితే తేలీదేమప్పా?” నోట్లోని వక్కాకు ఎంగిలితో చేనును తడపతా అనింది నారాయణమ్మ.

”వాళ్ల తావున లేదేమోలే” అని ఆలితో పలికి,” దాని యీపుమింద తొట్లి ఉంటాదప్పో, నోట్లో నింకా రెండు కోరలు కొమ్ములట్లా వచ్చింటాయి. ఆ కోరలతో పట్టి ఎత్తి తొట్లిలో యేసుకొని పొయ్యేస్తాది” అన్నాడు నాతో.

”ఎవరినీ?”

”మనుసుల్నిప్పా” నా అడకుకు విసుక్కొంటా మారాడినాడు.

”ఇపుడూ ఉండాయా మన తావున?” వాటిని చూడాలని తమితో అడిగినాను.

”ఓ! ఏమి నువ్వు చెప్పేది. ఇపుడు మన తావున అడివి ఏడ ఉండాది. ఆ మంచు కొండపల్లి అడివిలో ఏమన్నా అరాకొరా మిగిలిండాయేమో” నా తమి మీద నీళ్లు చల్లతా అన్నాడు.

”నువ్వు చూసింటివా అన్నా?”

”లేదప్పో, నాకు తెలిసేటపిటికే లేవు. మా అప్పకూడా సూడ్లేదంట. మా తాతోడ్ల సూసినట్లా సెప్పుకొంటారు” నారాణప్ప మాటకు ఉసూరు మనిపించింది.

అప్పటి నుంచి నేను హోసూరులో ఉన్న పదేళ్లలో పదులపల్లెలో నూర్లసార్లు వినుంటాను ‘బడకొడితి’ గురించి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్పేవాళ్లు దాని గురించి. అందరూ చెప్పినదానినిబట్టి దాని రూపు ఇట్ట పొడగట్టింది నాలో..

అది గాడిదంత ఎత్తు ఉండచ్చు లేదా కుక్కంత ఎత్తు ఉండచ్చు. దానికి ముక్కుమీద కొమ్ము ఉండచ్చు లేదా దవడల్లో నుంచి కోరలు పొడుచుకొని వచ్చుండచ్చు. దాని వీపుమీద పెద్ద బిందెడు నీళ్లు పట్టేంత గుంట ఉండచ్చు లేదా చిన్న చెంబుడు నీళ్లు నిలిచే పల్లమైన ఉండచ్చు. దానిమెడ పందిమెడ లాగా కురచగా ఉండచ్చు లేదా ఒంటెమెడ లాగా సాగి ఉండచ్చు. దానికాళ్లు ఏనుగు కాళ్లంత లావువి అయినా అయుండాలి లేదా జింకకాళ్లంత సన్నవయినా అయుండాలి. దానితోక గొర్రెతోకలాగా మరీ బెత్తెడే ఉంటాది లేదా ఆవుతోక లాగా పొడవుగా వేలాడతా ఉంటాలి. ఒక్కొక్కసారి కుక్కతోక లాగా వంకర తిరిగి ఉంటాది కూడా.

ఏంది? నేను చెప్పిన మాటలకు ఇదీ అనే ఒక రూపు ఏదీ కళ్లల్లో మెదలడం లేదా? గజిబిజిగా ఉందా? నాదీ అదే నిలవరం. దాని గురించి ఇక్కడ నేను చెప్పింది నాలుగు మాటలే. అక్కడ వినిందేమో నాలుగు పదులు మాటలు, నాలుగు పదిపదుల మాటలు. నేనెంత గజిబిజి పడుండాల! అప్పుడు గురుతుకు వచ్చినాడు నా మేనల్లుడు విక్కి. వాడయితే దీని మందలను తేల్చేయగలడు అనుకొని, బెంగుళూరులో ఉండే వాడి దగ్గరకు పొయి ‘బడకొడితి’ కతనంతా వాడిముందు కక్కినాను.

విక్కీగాడికి మా అక్కాబావా పెట్టిన పేరు విక్రమాదిత్య. సగం బతుకంతా అడవుల్లో తిరిగిన విక్రమార్కుడి పేరును తెలిసి తెలిసీ ఎందుకు పెట్టాల వాళ్లు? వీడేమో ఇప్పుడు సగంకాదు, మొత్తం బతుకుని అడివికి రాసిచ్చేసినాడు. ఎప్పుడూ చెట్టూగుట్టా, మానూ మనుమూ, గువ్వా గూడూ అంటా అడవుల్లో తిరుగుతుంటాడు. ఏడాదికొకసారి ఎప్పుడయినా ఇంటికొస్తే, సంచి తెరిచి వాడు గడించుకొచ్చిన సొమ్ము నంతా మా ముందు కుప్పపోస్తాడు. నాకు తెలుసు మీరేమనుకొంటా ఉండారో… అమ్మకు కోక, అబ్బకు చేతి గడియారం, తమ్ముడికి జీన్స్‌, మామకు సెంటుసీసా… అంతలేదు ఇక్కడ. ‘అమ్మా ఇది ఏనుగు లద్దె… నానా ఇదిగో ఇది చిరుతపులి పెంట … మావయ్యా ఇది రేచుక్క పింటిక… అదీ ఇదిగో పులి…’ ఇదీ వాడు గడించుకొచ్చే సొమ్ము. అడివిలోని ఏదయినా ఉసురు కనుమరుగు కాబోతుంది అని తెలిస్తే చాలు పెద్దదిగులును గుండెల్లోకి దింపుకొని కుమిలిపోతుంటాడు.

వాడి అడివి తిక్కకు పైమెట్టు అనదగింది ఒకటి చెపుతాను. ఒకసారి బండిపురం అడవుల్లో ఆరేడుమందిమి కలిసి నడస్తుండాము. దోవలో మోకాటిలోతు నీళ్లుండే చిన్న మడుగును దాటాల్సి వచ్చింది. అర చల్లాటు (షార్ట్‌)ల వాళ్లు అట్టని దిగితే చల్లాటు (పేంటు)లను తొడుక్కొన్న వాళ్లం వాటిని ఎగలాక్కొని దిగినాము. మడుగును దాటినాక చూసుకొంటే ఒక్కొక్కరి కాళ్లకూ అయిదారు అంటుబూసు (జలగ)లు అంటు కొని కనిపించినాయి. ఆదరబాదరగా వాటిని పెరికేసినాము. విక్కిగాడు మట్టుకు ఒక బండమీద కూచుని తనకాలికి అంటుకొని ఉండే వాటిని మైమరచి చూస్తా ఉండాడు. వాటిని తీసెయ్యిరా అన్నందుకు వాడేమి చెప్పినాడో వినండి. ”ఇవి మనుషుల నెత్తురు తాగి ఎన్నేళ్ల యిందో, కాసేపు తాగనీలే మావయ్య”. వెప్పరపోవడం తప్ప చేసేదేమి ఉంటాదంటారు! ‘మనిషికొక్క తిక్క మహిలో సుమతీ’ అన్నాడొక పెద్దాయన. వీడికేమో ఈ అడివి తిక్క (నాకు తెలుగు తిక్క ఉందని అప్పుడప్పుడూ కొందరు అంటుంటారు. అప్పుడు నాకు ఒళ్లు మండుతాది. లెక్కాపక్కా లేకుండా తిక్క అనేస్తే ఒప్పుకొంటానా)

బడకొడితి గురించి నేను చెప్పిం దంతా విని ఒక నెలనాళ్లపాటు ఎనికెన (కంప్యూటరు)నూ పొత్తాలనూ తిరగేసి మరగేసి కిందామీదాపడి వాడు తేల్చేసింది ఇదీ…. ” ఇదేదో వింతగా ఉంది మావయ్యా. నువ్వు చెపుతున్న లాంటిది ఏదీ ఈ అడవుల్లో ఉన్నట్టు కానీ ఉండినట్టు కానీ పొదక (రికార్డు) కాలేదు”.

ఒళ్లు మండింది నాకు. ”నీ పొదకల ను తీసి తగలబెట్టు. మా జేజవ్వ నా చిన్నప్పుడు నాతో మానుబిల్లి, బావురుబిల్లి, జంగుబిల్లి, పెంకుబిల్లి, దేవాంగబిల్లి, పునుగుబిల్లి, కొంకబిల్లి, చెదులుబిల్లి అని ఇన్ని పిల్లుల గురించి చెప్పేది. ఇప్పుడయితే ఊరిబిల్లి ఊసరబిల్లి కూడా కనబడడం లేదనుకో. ఇన్ని పిల్లుల గురించీ నీ ఎనికెనలోనో పొత్తాల్లోనో ఉందా?” గయ్యిమని అరిచినాను.

నా అరుపులకు బెదిరి బిక్కమొకం పెట్టినాడు. పాపం, వట్టి ఎత్తుబారపోడు, నా మాదిరిగా దుడుకుబోతూ ఉడుకుమోతూ కాదు. అదే తెలుగు గురించి నాకేమీ తెలియదని ఎవరన్నా నామీద నోరు చేసుకొంటేనా… నా దెబ్బకు గుండెపోటు వచ్చిపోవాల్సిందే. వాడి బిక్కమొకం చూసి నాకే అయ్యో అనిపించి ”అదికాదు విక్కీ, మనమే నేరుగా ఆ మనుమును వెతుక్కొంటూ పోదాము. మంచుకొండపల్లి అడవుల్లో తప్పకుండా కనబడతాదని నా నమ్మకం” అన్నాను. నా మాటతో వాడి మొకం వెయ్యి మెరుపులొచ్చి మీదపడినట్టుగా వెలిగిపొ యింది. అడివిలోకి పోదామన్నాను కదా, ఇంక మావాడి ఇచ్చును పట్టగలమా!

అప్పుడు అనుకొన్నామే కానీ, నాలుగయిదుసార్లు బయలుదేరబోయి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయినాము. ఇద్దో ఇన్నాళ్లకు కుదిరింది. చెరొక సంచిని వీపులకు వేలాడేసుకొని, ఇంక అడుగు బయట పెట్టబోతాము అనగా గబుక్కున ఎదురొచ్చినాడు విక్కీవాళ్ల ఇల్లుగల్ల ముసలా యన, ”అబ్బయ్యా మీ అంటీకనిపించి ందా?” అంటూ. ఈయనకు డెబ్బయ్యేళ్లు దాటుంటాయి. ఈయనకన్నా అయిదారేళ్లు చిన్నది అయుండచ్చు ఆ తల్లి. వీళ్లిద్దరు నాకూ ఆంటీఅంకుల్స్‌, మా విక్కికి ఆంటీ అంకుల్స్‌. రేపు ఒకవేళ మా విక్కిగాడికి పిల్లకాయలు పుడితే వాళ్లకు కూడా అంటీ అంకుల్స్‌. (మనలో మాట. మా విక్కిగాడికి మేనమామ బుద్దులొచ్చి, టాట్‌ పెళ్లీ పెళ్లామూ వద్దు అనేసినాడు. అవి రెండూ లేవు కాబట్టి మూడోదైన పెటాకులు ఎట్టా ఉండవు. బలే తెలివయిన వాడులే మేనమామ లాగా ఆడపీ డను తగిలించుకోలేదు)

ఆ ముసలాయనకు ఏదో చెప్పి పరిగెత్తిపోయి, హోసూరుకు పొయే పేరేగి (బస్‌)నెక్కినాము. ఒళ్లుమండిన మిన్ను మొగుడు తుపుక్కు తుపుక్కున నేలపెళ్లాం మొకాన ఊసినట్టుగా ఉండుండీ చిలకరిస్తుం డాది వాన లక్కసంద్రం దాటి మడివాళం దాటి బొమ్మనపల్లికి చేరుకొనేదాకా, పరిగెత్తి వచ్చిన గస అణగలేదునాకు. అప్పుడు నిట్టూరిచి పేరేగి నాలుగుమూల లకూ చూపును తిప్పినాను. మందితో కిక్కిరిసి ఉంది పేరేగి. అంత గుంపులో గాలికి రెపరెపలాడే పైటకొంగు ఒక్కటి కూడా లేదు. పూలసరాలను ముడుచుకొన్న బారుకురులు లేనేలేవు. హమ్మయ్య, ఆడమూక ఎక్కలేదు. అందుకే పేరేగి అంతా మగచంకల చెమటతావిని వెదజల్లతా ఉంది. అదే ఆడవాళ్లు ఉండుంటే పూలగబ్బుతో నిండిపోయి ఉండేది.

”ఏమన్నో చాన్నాళ్లకు ఇల్లిడిసి బయిదేలిండావు?” ఏమో ఎవర్నో అడగతా ఉండారు కన్నడంలో

”మా ఆడది నిన్నటినింకా కానొస్తా లేదప్పా. పుట్నింటికేమన్నా పొయింటిందేమో అని చూసొచ్చేకి పోతా దండాను” కన్నడంలోనే మారు పలికి నాడు ఆ ఎవరో. (ఇంగిలీసో ఉరుదో అరవమో కన్నడమో… ఇట్ట వేరే కూతల్ని తెలుగు రాతల్లో రాసి తెలివిపరులు అనిపించుకొనేది కొందరికి మా గొప్ప. నా వల్ల కాదన్నో ఏ కూతనయినా తెలుగులోనే కూసేది నేను)

”మా ఆడది కూడా ఇల్లిడిసిపెట్టి పొయ్యేసిందన్నా” పక్కనే ఇంకొకాయన అరవంలో అరిచినాడు. అంతగుంపూ ఉన్నట్టుండి ఆడోళ్ల గురించే అరుపులూ వగపులూ ఏడుపులూ ముక్కచీదుళ్లూ… నాకు విసుగ్గా అనిపించింది. ఏమయిపోయినారు కొంపల్లో పడుండకుండా ఈ అడంగులంతా. పొతే పొయినారు, అందరూ కట్టగట్టుకొని కావేటి మునకలకు పొయుంటారు. అయినా ఇది ఆడినెల కాదే. ఆడినెలలో కదా కావేటి మునకలు వచ్చేది. కావేటి మునకలు కాకపోతే పెన్నేటి మునకలకో వన్నేటి మునకలకో వల్లకాటి మునకలనో పొయింటారు. పొయినోళ్లు అక్కడ్నే ఉండిపోరు కదా. మాపోరేపో తిరిగొస్తారు కదా. ఈ లోపల్నే పంచెలు చుట్టుకొని పరుగులు తీయాల్నా!

కోనప్ప అగ్గురారం దాటినాక మాగన్నుగా కునుకుపట్టింది. కుదుపులకు మెలకువ వచ్చిచూస్తే అత్తిపల్లిని దాటతా ఉండాము. ఇంకొక కాలుగంటలో హోసూరుకు చేరుకొనేస్తాము.

”విక్కీ, ముందు శీనూ వాళ్లింటికి పోదాము. శీనూనడిగి బండి తీసుకొంటే మనం ఎక్కడయినా తిరగచ్చు” అన్నాను. సరే అన్నట్టుగా తలూపినాడు విక్కీ.

హోసూరులో దిగినాక ఏదో కొత్త కొత్తగా అనిపించింది. వన్నెలు వెలిసిపొయిన వానవిల్లులాగాకనిపించింది హోసూరు. ‘ఎందుకని ఇట్టుంది?’ అని తలపోస్తా ఉంటే విక్కీ నోరు విప్పి ”మావయ్యా ఇంత ఊళ్లో ఒక్క ఆడమనిషి కూడా కనబడడం లేదేమిటి?” అన్నాడు. అవును వాడన్నది నిక్కమే. అందుకేనా ఈ ఊరు నాకు అట్ట అ(క)నిపించింది. గంపలనిండా పూలను నింపుకొని, బాటపక్కన నిలబడి పూలమ్ముకొనే అక్కొళ్లు లేరు. నోటినిండా వక్కాకును నమలతా ”అన్నయ్యా ఇదేనా రావడమూ” అని నన్ను పలకరించే అరటిపండ్ల బండి చిన్నమ్మ లేదు. ‘నీటయిన గగన గిరి కోట సావడిలోన మేటి దొర ఉన్నాడు సిలకా…” అని తాతగారి తత్వాలను తంబురమీటి పాడతా అడుక్కొనే అవ్వలేదు. ”నువ్వు కూడా కాసులు ఇయ్యాల్నా, ఏమీ వద్దు, పొయిరాపో కొడుకా” మరుగుదొడ్డి బయట కావలుండి నాతో ఈ మాటల్ని అనే మాదిగ మల్లమ్మ లేదు. ఏమయిపొయినారు వీళ్లంతా?!

తొర్రినోటి ముసిలోడి తుస్సుబుస్సు మాటలకు చిర చిర చిందే ఎంగిలి మాదిరి గా చిటపట పడతుండాయి చినుకులు. ఆ చితచితలోనే నడస్తా దుడ్డు చెరువు కట్టెక్కీ దిగి సీనూ వాళ్ల ఇంటికి పొయినాము. ఏడుపంటల్ని ఎండబెట్టుకొన్న కాపోడి మాదిరిగా నెత్తిన చేతులు పెట్టుకొని దిగాలుగా తిన్నెమీద కూచోనుండాడు శ్రీను.

”ఏమయింది శీనూ అట్టుండావు?” గొంతులో రవంత వెతను ఒలికిస్తా పలకరించినాను.

నా పలకరింపుకు చివక్కన తలెత్తి చూసి ”రాండి రాండి” అని పిలిచినాడు.

”నీ బండి కావాల శీనూ, బడకొడితిని వెతికి పట్టుకోవాల. మంచుకొండపల్లి అడివిదాకా పొయ్యేసి వస్తాము” అడిగినాను.

కాసేపు ఏమీ మాట్లాడలేదు. అనెంక నోరు విప్పి ”నిన్న బడినుంచి పొద్దుపొయినాక వచ్చింది. ‘ఏందివే ఇప్పుడొస్తే ఎట్ల, నాగొంతులో అన్ని ఉడుకునీళ్లు కాంచిపొసే దిక్కు కూడా లేదే’ అని కొంచెం విసుక్కొన్నాను. దానికి అలిగి వూడిసింది. అయ్యోరమ్మ పని చేసి సంపాదిస్తా ఉంది కదా. అందుకే కొవ్వెత్తి కొట్టుకొంటా ఉండేది. చిత్తూరుకు పూడిసిందో గుడియాతంకు పూడిసిందో, తిన్న ఎంగిలిగిన్నెల్ని కూడా కడక్కుందా పూడిసంది. నేను బండెత్తుకోని యెలబారతా ఉండాను. పొయ్యి దాన్ని తెగ్గోసుకోని రావాల కదా”

అంటే మాకు ఇక్కడ బండి దొరకదు. అక్కడి నుంచి వెనక్కు తిరిగినాము. ”అప్పావునగర్‌లో మహేశ్‌ అనే డాక్టరు నాకు బాగా తెలుసు. అతన్ని అడిగితే ఏదో ఒక బండిని ఇస్తాడు. తీసుకొని పోదాం పద విక్కీ” అంటూ దోవన పోతుండే తానేగి (ఆటో)ని నిలిపి ఎక్కి కూచున్నాను. నా పక్కనే ఎక్కి కూచున్నాడు విక్కీ.

”మావయ్యా, మనముందే వాళ్లావిడను అన్నేసి మాటలన్నాడే ఇంక ఎదురుగా ఎన్ని సూటిపోటు మాట్లాడి ఉంటాడో. అయినా తిన్నగిన్నెల్ని ఆయన కడిగితే ఏం పొయింది” బరువుగొంతుతో అన్నాడు విక్కీ.

”చిన్న పిల్లోడివి నీకు తెలియదులే విక్కీ. ఆడవాళ్లకు అలుసు ఇస్తే ఇంక బతుకంతా నెత్తికెక్కేస్తారు” పది పెళ్లిళ్లు చేసుకొని ఇరవై కాపరాలు ఈదిన అనుబోగంతో అన్నాను.

”బాగా చెపితిరి సార్‌. ఆడ ముండ లకి రవంత సందు ఇస్తిమో సస్తిమే. నా పెండ్లామే సూడండి. రెయ్యిపగలూ దీన్ని తోలి దుడ్లు గడించి ఎత్తుకొని పొయి ఇస్తుంటే తిని కులికేదే దానిపని. ఇంకేమి పంగనుం టాది ఇంట్లో. నాకూ నా ఇద్దురు కొడుకు లకూ అంత వండి పెట్టాల. ఒక ఆవు ఉంది, దానికి కసువూ కుడితే సుడాల. రెండు గోర్రెలుండాయి, వాటినట్ల యిప్పి తిప్పుకొని రావాల. ఇంతే దాని పని ఇంతకీ ఏమేమో చెపుతుంది. రెయ్యి దాని నోరు లేసేరికి బాగానసికితిని. తెల్లవారేసరికి ఏడనో పొయ్యేసిండాది…. దానెమ్మ… నా వాకిలి తొక్కేకి వచ్చిందంటే కాళ్లు యిరిచేస్తాను దొంగ లంజకి” పళ్లు నూరతా అన్నాడు తానేగి ఆయన.

”మీ ఆవిడ లేకపోయినా ఇల్లు గడిచిపోతాదా?” అడిగినాడు విక్కీ. ఆ మాటకు రవంత మొత్తబడి నట్టు ఉండాడు.

”ఎట్ల అయితింది సార్‌. ఇద్దురూ నేదర చిన్నోళ్లు. వాళ్లను సాకేకి మగోడిని నా చేత అయితిందా? ఇద్దో ఈ బాడిగ అయినంత నేనుకూడా రాయకోట వరకూ పోయ్యేసి రావాల. ఆ లంజ పుట్టింది రాయకోటలోనే”

”నిలుపు నిలుపు నిలుపప్పా…” నా అరుపుతో టక్కున నలిచింది తానేగి. ఎదురుగా నడిచి వస్తా ఉండాడురామసామి అయ్యవారు. ఆంజనేయుడి గుడిలో అయ్య వారు ఆయన. కనబడి చాన్నాళ్లయింది. ”దండాలు అయ్యవారు. ఏల ఈ దోవన పోతా ఉండారు? రాండి తానేగిలో పోదాము” పలకరించి పిలిచినాను.

”వద్దులే నువ్వు పదప్పా. నేనిట్లా తోటగిరి దనకా పొయ్యేసి రావల్ల” అన్నాడు.

”ఏమి అయ్యవారా తోటగిరిలో ఏదయినా పండగా పబ్బమా?”

”నా బతుక్కి పండగా పబ్బమూ కూడానా. ‘పగలంతా పనిపాటు లేకుండా కూకోనుంటావు కదా. వట్టి వంచినచారు చేసి తగలబెట్ట కపోతే అన్ని ఉలవల్ని మొలక్కట్టి చారు చేసింటేఏమీ జేష్టముండా’ అంటినప్పా అంతే…”

ఆయన చెప్పకుండా నిలిపేసిన మాటలు నాకు తెలిసిపొయినాయి. అమ్మోరు ఇల్లు వదిలిపొయ్యేసింది. అయ్యోరు గుడిని వదిలి అమ్మోరును వెతకతా ఉండాడు. ”పద పదప్పా బిరాన అప్పావునగరుకు పోనీ” అంటూ తానేగిని ఎక్కినాను. ఒక్కసారిగా కూడబలుక్కొన్నట్టు ఎట్టపొయినారు ఆడోళ్లంతా! తానేగి తలమీద టప్పుటప్పుమని దరువేస్తా మమ్మల్ని తరమతుండాది వాన.

”నువ్వు మొట్టమొదట బడకొడితి గురించి చెప్పినప్పుడు అది హైనా అయుండచ్చు అనుకొన్నాను మావయ్యా. ఎందుకంటే అది పిల్లల్ని ఎత్తుకొని పోతాదన్నావు కదా. తరవాతేమో కత్తేలు (ఖడ్గమృగం) అనుకొన్నాను, ముక్కుమీద కొమ్ము ఉంటాదనేసరికి. కానీ గత ఇన్నూరు మున్నూరేళ్లగా ఈ అడవుల్లో కత్తేళ్లు తిరిగిన అనవాళ్లు ఏవీ దొరకలేదు..కనీసం వాటిఎముకలు కూడా…” విక్కీ అంటా ఉంటే గురుతుకొచ్చింది.

”విక్కీ, కామరాజు చెప్పినాడు ఒకసారి. అదేదో ఊర్లో ఎవరిదగ్గరో బడకొడితి ఎముక ఉండాదంట. అతను బూతవైదిగుడంట” అన్నాను అల్లుడితో.

”ఆ ఎముకను చూస్తే మనకు ఇంకొంచెం దారి దొరవచ్చు మావయ్య” ఉవ్వాయిగా అన్నాడు విక్కీ.

”సరేలే, మహేశ్‌ గారి దగ్గర బండి తీసుకొని కామరాజు వాల్ల ఊరికి పోదాము” అన్నాను. మా మాటల్లోనే మహేశ్‌ వాళ్ల ఇల్లు వచ్చింది. ఇల్లూ మందులిల్లూ (ఆసుపత్రి) రెండూ కలిసి ఉంటాయి. ఆలూమొగుడూ ఇద్దరూ డాక్టర్లే. ఎప్పుడూ నొగులుపడ్డ వాళ్లతో కిటకిటలాడతా ఉండే మహేశ్‌ మందులిల్లు అరకొరమందితో వెల వెల పోతు ఉంది. ఆ అరకొరకూడా అంతా మగోళ్ళే గబ గబ మహేశ్‌ గదిలోకి పోబోయినాము.

”ఈ పొద్దుసారు ఇంకా రాలేదు. ఇంట్లోనే ఉండారు” తెల్ల తీరాటు (యూనిఫా) తమ్ముడు చెప్పింది విని ఇంటిపక్కకు తిరిగినాము.

”మహేశ్‌గారూ, వీడు నా మేనల్లుడు విక్రమ్‌. మేమిద్దరమూ బడకొడితిని కనిపెట్టాలని మంచుకొండపల్లి ఆడివిలోకి…” నా మాట నడుమనే ఆగిపోయింది. ఈపొద్దు గడ్డం కూడా గిక్కొన్నట్టు లేడు. పెళ్ళాం చచ్చినోడి మాదిరిగా అంటారేసరిగ్గా అట్నే ఉండాడు మహేశ్‌.

”సుమో ఉంది తీసుకోని పోండి” పొడిపొడిగా రాల్చినాడు నాలుగు పలుకులు.

”ఎపుటినుంచి కనబడతాలేదండీ పద్మావతి గారు?” అడిగాను నాకు తెలిసిందన్నట్టుగా మొకంపెట్టి.

”తెల్లవారి ఆరుగంటలపుడు కూడా ఇంట్లోనే ఉడింది. ఇంటినిండా పనోళ్లు, చేతినిండా కాసులు. దానికేమి నొప్పి! నేనేమన్నా అందరి మొగుళ్లట్లా తిడతానా కొడతానా. ‘ఏలనే మగరోగులతో అంతంతసేపు మాట్లాడేది’ అంటిని అంతే. పొయ్యేది ఒకటే పోకుండా నా కూతుర్ని కూడా తోడుకొని పొయ్యేసింది” కళ్లనీళ్లు పెట్టుకొన్నాడు మహేశ్‌.

నాకు చిర చిర మనింది. రెండు మూడునాళ్లు పెళ్లాం లేకపోతే ఏమయిపోతాది, దానికే ఇంతగా అలమటించి పోవాలన్నా? సరే నాకెందుకులే, బండిని తీసుకొని పొమ్మున్నాడు అంతే చాలు. అడివిలోకి పొయి బడకొడితిని కనపెడితే చాలు. ఇక్కడి వాళ్లంతా కనుమరుగు అయిపోయింది అనుకొంటున్న, బయటవాళ్లకు తెలియనైనా తెలియని ఒక కొత్త మనుమును లోకం ముందు ఉంచబోతున్నాను. ఈ దెబ్బతో నాకు ఐ.రా.స. వాళ్లు ఇచ్చే ‘ససకవా’ పోణిమో (పురస్కారం) మెగసెసే బిరుదో రావడం కడ్డాయం. నా తలపోతలనూ నన్ను మోసుకొని బండి బయలుదేరింది.

మేకపోతు తోక వెనకనే తెరువు పొడుగునా పిలపిలా పింటికలురాలినట్టు రాలతా మా వెంటపడినాయి చినుకులు, ‘ఈ డొక్క చినుకూ ఆడొక్క చినుకూ మారుగోడింట్లో మరొక్క చినుకూ’ అని అల్లెవ్వ వేసే పొడుపుకతను గురుతుకు తెస్తా.

మిడిగిరిపల్లి మీదగా మత్తిగిరి చీలుబాటను దాటి, కురుబట్టి, అగ్గొండపల్లి, కుందుమానుపల్లి, కెలమంగళము, చిన్నట్టి, బేళూరులను వెనక్కునెట్టి, కౌతాళము దగ్గర తారుబాటను దిగి మట్టిబాట మీద రెండు మైళ్లు లోపలకు పొయి కొత్తపల్లిని తాకింది మా బండి. నేరుగా కామరాజు వాళ్లింటి ముందు నిలిపినాము.

”నువ్వేమిటికి మాయామ్మను అట్లనింది. నీ నోటికి అడ్డూ పద్దూ లేకుండా పోయింది. ఇపుడు ఏడకి పొయిడిసిందో ఏమో! సంగటి చేసి యేసేది ఎవురిపుడు” కామరాజు గొంతు పెద్ద పెద్దగా తెరువులోనే వినిపించింది.

”ముయ్యినోరు. అది నా పెండ్లాము అయినంకనే నీకు అమ్మయింది. నేను అనిండే దానికి కాదు ఇల్లిడిసి పొయిండేది. నిన్న మాపుసారి నీ నోటికొచ్చినట్లంతా కుయ్యిలేదా. ఆ కూతలకే దాని గుండెలు పగిలి పొయింటాయి” కామరాజు వాళ్లబ్బ ఇంకా గట్టిగా అరస్తా ఉండాడు.

”కామప్పా, రవంత బయటికి వస్తావేమప్పా?” పలిచినాను. ”ఎవురది?” అంటూ బయటకొచ్చి, మమ్మల్ని చూసి ”రాండి అయ్యా బాగుండారా” అని పలకరించినాడు.

”బాగుండాన్లే. మీ అమ్మ ఉన్నెట్లు లేదు ఇంట్లో. మీ ఒక్క ఇంట్లోనే కాదు. ఈ తావున అందరి ఇండ్లల్లోని ఆడోళ్లూ ఏడకో పొయిండారు. మాపోరేపో వచ్చేస్తార్లే” అన్నాను. నా మాటలకుకొంచెం నెమ్మది పడినట్టు ఉండారు.

”కామప్పా, ఎవురి దగ్గర్నో బడకొడితి ఎముక ఉండాదని అపుడొక తూరి చెప్పింటివి కదా, ఎవురి తావునప్పా?” అడిగినాను.

”ఆయనా, మదనగిరిప్ప అని బూతవైదిగం చేస్తుంటాడు. మాదిగోళ్ల ఆయన. మొదులు దిన్నూరులో ఉండె. ఇపుడు అందేవనపల్లిలో చేరిపొయి ఉండాడు. ఆ ఊరికి పొయి అడిగితే ఎవురయినా చెపుతారు”

”విక్కీ, పద పద పొద్దుపోతా ఉంది” అని గిరుక్కున తిరుక్కోన్నాను. నాకంటే రెండడుగులు ముందే ఉండాడు విక్కీ. వాడికంటే నాలుగడుగులు ముందుంది వాన. తిరిగి కౌతాళం దగ్గర తారుబాటను ఎక్కినాము. కలుగోపసంద్రన్ని దాటి, డెంకణికోటను దాటి, నొగనూరును దాటి, కనుమలో దూకినట్టుండే దిగుడు బాటను దిగి అందేవనపల్లికి చేరుకొన్నాము. మొయిళ్లు మిన్నంతా కమ్ముకొని పొద్దే తెలియడం లేదు. మాదిగగేరి ఏ పక్కనుందో అడిగి మదనరప్ప ఇంటికి పొయేసరికి, ఇంటి ముందు వీరంగం ఆడతుండాడు ఆ మహన్నబావుడు. చేతిలో దుడ్డుకర్రను పట్టుకొని, ఇంటిముందుండే గుండ్రాయిని ”సావే దొంగలంజా…” అంటూ బాదతా ఉండాడు. వెంటనే కర్రను పక్కకు పొరేసి ఆ రాతిని అచ్చిళీంచుకొని ”రాయే లంజదానా… నువ్వు లేకపోతే నాకు ముద్దేసేది ఎవుతే…” అని ఏడస్తా ఉండాడు. మాళ్లా లేచి కాలితో ఎగిసెగిసీ తంతా ఉంటాడు.

”బూత వైదిగుడు కదా, కంటు కట్టిన దెయ్యమో బూతమో సందు చూసుకొని వచ్చి పూనేసినట్టు ఉంది” అన్నాను.

”లేదు మావయ్యా, ఎవరి కోసమో అల్లాడతా ఉండాడు” అన్నాడు విక్కీ.

”ఎవరికోసమో ఎందుకయి ఉంటాదిలే. వీడి పెండ్లాము కూడా గుడిసెమింద దెచ్చేసి పొయ్యేసుంటాది” అంటా అతని దగ్గరకు పొయినాను. నా వెనకనే వచ్చినాడు విక్కీ.

మమ్మల్ని చూసిన మదనగొరప్ప ”దండాలు సామే” అంటా ఎదురొచ్చినాడు. గుప్పున తగిలింది సారాయి గబ్బు.

”మదనగిరప్పా, బడకొడితిని ఏడన్నా చూసిండావా?” అడిగినాను.

”సామే, నా రామిని ఏడన్నా సూస్తిరా?” ఎదురడిగినాడు.

”కాదప్పా నీ తావున బడకొడితి ఎమిక ఉందంటనే?”

”కాదు సామి మీ తావున నా ఆడదాని పటము ఉందంటనే?”

”నువ్వు బూతవైదిగుడు మదనగిరిలే కదా?”

”నువ్వు ఆడోళ్ల సంగం ఆఫీసురులే కదా?”

మాటకు మాటతో సరిపెడతా ఉండాడు. అడకకు అడకతో ఎదురొడతా ఉంటాడు. నా ఇక్కట్టును చూసిన విక్కిగాడు ముసిముసి గా నవ్వుకొంటూ ఉండాడు.

”వాని పెండ్లాము కనబడక తిక్కలు పట్టిపొయిండాడు. వానితో ఏమి మాటలు సామీ” పక్క నుంచి వినబడి తలతిప్పినాను పండు ముసిలోడు. బడకొడితి ఎముకను గురించి అడిగినాను.

”అది ఏదో గొడ్డెమిక సామీ. పొట్టకూటికోసం ఏదో చెప్పి బతకతుంటాడు. వాని తావున ఏడ్నించి వస్తాది బడకొడితి ఎమిక?” ఉసూరుమనిపించినాడు ముసిలోడు.

”మంచుకొండపల్లి అడివిలో బడకొడుతులు ఏమన్నా ఉండాయా తాతా?” దింపుడు కళ్లం ఆశతో అడిగినాను.

”ఏడ సామీ! మంచుకొండపల్లీ, కెస్తూరు, బీరనపల్లి తావున అడివి పలసబడిపోయింది. మీరు ఒక పని సేయండి. నూటొక్క సామి కొండ ఉంది కదా. ఆ కొండమింద ఎలనీరుతో దీపం యెలిగే గవి ఉంది. ఆ గవిని దాటుకోనిపోతే అక్కడొక ఇరులదొడ్డి ఉంది. ఆ దొడ్లోని ఇరులోళ్లకు ఇంత వరకూ బయట లోకమే తెలీదు. వాళ్లేమో వాళ్ల అడివేమో అన్నట్లుంటారు. ఆ తావుకు పోతే మీకు ఏమన్నా సమాచారం సిక్కొచ్చు” ఎడారిలో వానకురిసిట్టు కురిసినాయి ముసిలోడి మాటలు మామీద.

అందేవనపల్లిని దాటినాక మూడు నాలుగు మైళ్లకి అంచెట్టి అనే ఊరు వచ్చింది. ఊరి దోవలో మేకలు తోలుకొస్తా ఎదురయిన ఆయన్ని దోవ అడిగినాము.

”నూటొక్కసామి కొండకా! అబ్బా సామీ ఇట్లా వానామోడములో బయిదేలిండారే. పొద్దు కూడా లేదు. సరే ఇంకొక మైలు ముందుకు పొయి నంక ఈ బాట చీలతాది. మీరు ఎడమ పక్కకు తిరగండ. మెలపుసామే, మెట్టురాయి వంక తావున యానిగలు ఉంటాయి, చూసి పొండ” అనేసి మేకలను తోలుకొని పొయ్యేసినాడు.

అతను చెప్పినట్టే ఎడమబాట పట్టింది మా బండి. అడివి చిక్కబడి మిన్నను అంటతా ఉంది. ఆరండ అడివి నడుమ మెలికలు తిరిగిసాగిన ఆ బాట, మమ్మల్ని మెట్టురాయిని దాటించి, చీకట్లు ముసురుకొనే పొద్దుకు ఒక పల్లెకు చేర్చి కనుమరగు అయింది.

”ఇదే ఊరన్నా?” మా బండి పక్కకు వచ్చిన ఆయన్ని అడిగినాను.

”దొడ్డమంచి. మనదే ఊరప్పా?”

”బెంగుళూరు”

”ఇట్ల ఏడకి పోవాలని వస్తిరి?”

”నూటొక్కసామి కొండకు”

”అట్లనా! ఇక్కడి వరకే బాట ఉండేది. ఇక్కడినింకా మూడు మైళ్లు నడిసేపోవాల. ఈ రెయ్యి ఇక్కడ్నే పణుకోండి. పొద్దిన్నే పోవచ్చు” అన్నాడు ఆయన తప్పదు కాబట్టి సరేనని తలూపినాము. ఒక ఇంటి తిన్నెమీద చాపలు పరిచి చోటు చూపించినారు. అంత ముద్ద తినుమని అడిగిన వాళ్ళే లేరు ఆ ఊర్లో. ‘పల్లెలు కూడా ఇట్ట పాడయిపియినాయి’ అనుకొంటూ మేము తెచ్చుకొన్న పండూ రొట్టే తిని నడుములు వాల్చినాము.

వాన చప్పుడు తప్ప ఊరంతా నిరుసద్దుగా ఉంది. విక్కీ ఎందుకనో మాపుసారి నుంచి దిగులుగా ఉండాడు. బడకొడితిని కనిపెట్టలేమని దిగులు పడతుండాడేమో!

”విక్కీ” పిలిచినాను. ”చెప్పు మావయ్యా” మెల్లగా అన్నాడు.

”దిగులు పడద్దు రా. మనం బడకొడితి గుట్టును కనిపెట్టేస్తాం” నమ్మకంగా అన్నాను. వాడుండే పక్క నుంచి చిన్న వెర్రి నవ్వు ఒకటి వినిపించింది. వాడు నవ్వినాడో లేకపోతే గాలిసద్దు నాకట్ట వినిపించిందో.

మేము పడుకోనుండే తిన్నెమీదకు, ఆ ఇంటిలోపలి నుంచి వణుకుతున్న గొంతుతో సన్నటి పాటేదో మెల్లగా వచ్చింది. ఆ కన్నడం పాటకు తెలుగు తెల్లం ఇదీ.. శివయ్యా నీ సగం మేనును ఎక్కడ దాచేస్తివి? ఎందుకు మరుగు చేస్తివి? నువ్వు మరుగు చేస్తివా? తానే మరగయిపోయెనా…?

నా పక్కన పడుకున్న విక్కి వెక్కతుండాడు. ఏమయింది వీడికి? వీపునిమురుతా ఓదార్చినాను.

పగలంతా తెగతిరిగినాము కదా. కాసేపటికే కునుకు పట్టేసింది. నడిరెయ్యిలో తెరువంతా గోలపుట్టి, ఆ గోలకు ఇళ్లన్నీ మేలుకొన్నయి. అందరూ ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చినారు. మేము కూడా తిన్నె దిగినాము. వాన వెలిసి, ఇప్పపూలు రాలినట్టు చూరుల నుంచి నీళ్ల చుక్కలు రాలతుండాయి. మిన్నులో అక్కడొకటీ అక్కడొకటీచుక్కలు మొలిచి ఉండాలి.

మేము పడుకొన్న ఇల్లుగల్లాయిన ఈ ఊరికి పెద్ద అయినట్లుండాడు. ఇంటిముందుకు ఇరవై ముప్పయి మంది విలవిలమంటా వచ్చి గుమిగూడినారు. అమాస చీకటిని ఒళ్లంతా పులుముకొని, బొగ్గుల బుట్టను నెత్తిన బోర్లించుకొన్నట్లుగా నల్లగా నిగనిగలాడతా ఉండారు వాళ్లంతా.

”విక్కి, వీళ్లు ఇరులోళ్లు. ఈ అడవుల్లో బతికే వాళ్లు” గుసగుసగా అన్నాను.

”ఏలరా, ఎపుడూ మీ దొడ్దిని దాటి అజ్జు బయటపెట్టని మీరు, ఇపుడు కట్టగట్టుకొని కొండదిగి వచ్చిండారు?” ఇంట్లో నుంచి వచ్చిన పెద్దాయన అడిగినాడు ఉరమతా.

”సామే, తెల్లారినింకా మా దొడ్లోని ఆడోళ్లంతా కానాస్తా లేరు సామే. అడివంతా గాలించేస్తిమి. మీకు చెప్పుకొందామని కొండదిగి పారొస్తిమి సామే” గొల్లుమన్నారు.

”మీ ఆడోళ్లూ మాయమయిరా?” బెప్పరపాటుతో అన్నారెవరో.

”వాళ్లను ఏమన్నా అంటిరా రా?” తిరిగి ఉరిమినాడు ఊరిపెద్ద.

”మేమేమి అంటాము సామే. అనినా ఎపుడూ అనేదే కదా అంటాము. ‘ఏమే ఎవుని తావుకు పొయ్యేసి వస్తా ఉండావు’ అంటాము. ‘ఎవునికి కొంగు పరిస్తివే’ అంటాము. ఆ మాటలకే అలిగి పొయ్యేవాళ్లు కాదు సామే. బిడ్డలంతా తల్లుల కోసరం ఉగ్గబట్టి ఉండారు సామే. మీరే దోవ సూపించాల సామే…”

ఇదే సందని ఒక ఇరులాయన్ని పక్కకు పిలిచి ”మీ అడివిలో బడకొడితి ఏ తావున ఉండప్పా?” అని అడగతా ఉండాను, ”మావయ్య” విసురుగా కసిరినట్టు అని, గబగబ నడిచిపొయి సుమో తలుపు తెరిచి లోపల కూసున్నాడు విక్కీ.

‘ఏదో అయింది వీడికి’ అనుకొంటా నేనూ ఆ పక్కకు అడుగులు వెడతా ఉండాను, నా అలపలుకి (సెల్‌ఫోన్‌) మోగింది. పొద్దున్నుంచీ వానవల్ల చిరువాలు (సిగ్నల్‌) దొరికినట్టు లేదు. ఇప్పటికి మొగింది.

”ఎక్కడుండారు రా? మాపుసరి మీ అక్క బడి నుంచి వచ్చింది. ‘తల నొప్పిగా ఉంది, ముందు కొంచెం కాఫీ ఇచ్చేసి, తరువాత ఇంకొక పనికి పో’ అన్నానంతే. అప్పటి నుండి మీ అక్క కనబడడం లేదు. విక్కీకి గబుక్కున చెప్పద్దు. మీరిద్దరూ వెంటనే బయల్దేరి వచ్చేయండి” ఆ పక్క నుంచి బావగొంతు.

నేను వెలవరపొయినాను. నా గుండె దడ దడ కొట్టుకొనింది. ఈ ఒక్క హోసూరు తావులోనే అనుకొన్నాను. అన్నిచోట్లా ఆడవాళ్లు కనబడడం లేదన్నమాట. మెల్లగా పొయి బండిలో విక్కీ పక్కన కుచున్నాను.

వాడు నన్ను పట్టించుకోనట్టుగా బండి దిగి, ఆ చీకట్లోనే ఊరుదాటి అడివిదోవ పట్టినాడు. నేను గబగబ వాడి వెనక పడినాను. ఆరండ అడవులు తిరిగి తిరిగి వాడుకపడిన కాళ్లు వాడివి, ఆ డోవంతా ముందే తెలిసినట్టుగా విరవిరగా పోతా ఉండాడు. నేను అడగతా ఉండే ఒకటీ అరకూ కూడా మారాడం లేదు. ఏదో పూనినట్టుగా ఉంది వాడి నడక నడవడికా. పొద్దున్నుంచీ కురిసి కురిసి అలిసిపోయిన వాన, మబ్బుల్ని కప్పుకొని మింటి మంచం మింద కునికేసింది. అడివంతా ఈల పురుగుల ‘రీ’లో మునిగిపొయి ఉంది. చుట్టుపక్కల ఎక్కడ నుంచో వంక పొరతుండే మోరుపు వినిపిస్తా ఉంది.

నేను ఇంతకుముందు ఒకసారి నాగొండపల్లి కిష్ణన్నతో కలిసి ఈ దోవన నూటొక్కసామి కొండకు వచ్చుండాను. అందుకే అంతో ఇంతోఈ దోవ తెలుసు నాకు కానీ వీడికెట్ట తెలుసు? తెలిసినోడి మాదిరిగా తెంపుగా పోతా ఉండాడే! ఇంతకు ముందు ఈ అడివిని కూడా తిరిగేసి ఉండాడేమో! అయితే అప్పుడు వీడి కంట పడలేదా బడకొడితి?

”విక్కీ విక్కీ, ఇదే నూటొక్కసామి కొండ. కొండమీదకు పోతే ఎలనీరుతో బెళుకు (దీపం) వెలికే గవి ఉంటాది” నా మాటల్ని లెక్కచేయకుండా కొండపక్క నుంచే చిక్కటి చీకట్లు నిండిన లోయలోకి దిగిపోతా ఉండాడు. ‘ఏంది వీడి తెంపరి తనం” అని గొణుక్కొంటా వెంట పడినాను.

నడవంగా నడవంగా నడవంగా లోయ లోపలి ఇరుకుల నుంచి సన్నటి వెలుతురు వచ్చి మా కళ్లను గుచ్చింది. ఆ వెలుతురు పక్కకు విరవిరగా నడిచినాము. దగ్గరకు పొయ్యేకొందీ వెలుతురు పెరిగింది. వెలుతురునే చూస్తా ఒక్క పరుగున పొయి నాము. దగ్గరకు పొయిన నేను బిర్ర బిగుసు కొని పొయినాను. కలుబారిపొయినాను.

అక్కడొక పెద్ద బయలు. ఏదో వెలుతురొచ్చి ఆ బయలును వెలిగిస్తా ఉంది. ఆరండ అడివికి నట్టనడుమున ఇంత బయలు ఎట్టొచ్చింది! బయలును మెరిపించే ఆ వెలుతురు ఎక్కడిది! అది కూడా కాదు నన్ను వెప్పరపొయేటట్టు చేసింది. ఆ బయ లంతా నిండిపొయిండాయి బడకొడుతులు.

విక్క కదిలి ఇంకొంచెం ముందుకు పొయినాడు. నేను కూడా నాలుగడుగులు వేసినాను. చానా బడకొడుతులు గొంతెత్తి ఏడస్తా ఉండాయి. కొన్ని దిగాలుగా దిక్కుకొకటిగా పడుండాయి. కొన్ని తిడుతున్నట్టుగా గొంతెత్తి అరస్తా ఉండాయి.

నువ్వు లేకపోతే నాకు దిక్కెవురే… ఈ నేదర బిడ్డల్ని నేను ఎట్ట సాకేల్నే… నిన్నేమీ అనను రామ్మో… ఇంకమీదట ఏమన్నా అంటే పొరకతో కొట్టు… అమ్మా… అక్కా… పెండ్లామా… చెల్లీ… చెలీ…

రోదనలు… ఏడుపులు… బతుకుమీద బెదురుతో… ఏమి చెయ్యాలో తెలియని చేతకానితనంతో… గుండెలు బాదుకొంటా…. నోళ్లు కొట్టుకొంటా ఉండాయి ఆ బడకొడుతులు. ఇంకా దగ్గరకు పొయినాను.

అరే… ఒక బడకొడితి అంతా శీనూ మాదిరిగానే ఉంది. ఇంకొకటి డాక్డర్‌ మహేశ్‌… మరొకటి ఆంజనేయుడి గుడి అయ్యవారు… తానేగి ఆయన… కొత్తపల్లి కామరాజు…. వాళ్లబ్బ… అందేవనపల్లి బూతవైదిగుడు… దొడ్డమించిలో అరుగు మీద చోటు చూపించినాయన… ఇరులోళ్లు…. మా బావ… అచ్చం అందరిలాగానే ఉండాయి… కాదు కాదు ఉండారు…. లేదు లేదు ఉండాయి. ఏమో! ఉండారు అనాల్నో ఉండాయి అనాల్నో!

కొన్నిటికి (లేదా కొందరికి) తలమీద కొమ్ములు.. కొన్నిటికి కింద దవడలో నుంచి పొడుచుకొచ్చిన కోరలు… పొడుగైన తోకలు…కానీ అవన్నీ అవన్నీ ఒక్కొక్కటిగా రాలిపోతా ఉండాయి. ఊడిపోతా ఉండాయి. తునిగిపోతా ఉండాయి. నిన్న మొన్నటి వరకూ వాటిల్నే చూపించి ఎవరెవర్నో బెదిరించిన, లొంగదీసుకొన్న బడకొడుతులు ఇప్పుడు ఆ కోరల్ని కొమ్ముల్ని తోకల్ని పోగొట్టుకొంటా ఉండాయి(రు).

ఏదో పోగొట్టుకొన్నట్టు అనిపించి వెనక్కు తిరిగి చూసుకొన్నాను. వెనక నా తోక కూడా ముక్కలు ముక్కలయి పడి ఉంది. బిత్తరపొయి మొకాన్ని తడుముకొన్నాను. నా మూతిమీద కూడా రెండు కోరలు, ఉదిరి పడబోయేటట్టు ఊగులాడతా ఉండాయి. అంటే నేను కూడా బడకొడితిని అయిపొయి నానా! నేను ఒక బడకొడితినా!

మాకు దూరంగా ఇంకా ఎక్కడికో నడిచిపోతా ఉండాడు విక్కీ, ఒంటరిగా… ఎవర్నో వెతుక్కోంటూ…

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.