మరుగునపడిన చరిత్రలు

– ఊర్వశి బుటాలియ

స్త్రీల చరిత్రల గురించి నాకెప్పటి నుంచి అవగాహన కలిగిందనే విషయాన్ని నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ‘ఎప్పటి నుంచి అవగాహన’ అని ఎందుకంటున్నానంటే, ఈ క్రమం అంతా కూడా ఒక రకంగా ఎన్నో విషయాల కలయికగా వుంటుంది. ఈ కథలన్నీ కూడా నా మనసులో ఇంకుతూ వచ్చా యి. అలా ఒక స్పష్టత వచ్చాక,

వీటి గురించి పనిచేయటం అవసరం అనిపించింది. ఇప్పుడు ఇలా చెప్పటం కూడా, ఒక విధంగా ఇది నాకే విచిత్రంగా వినిపిస్తూ వుంది. ఫెమినిస్టుగా, అతిగా, ఒక్కోసారి బాధాకరంగా తెలిసిన విషయాలతో ముందుకు సాగుతున్న నేను, భిన్నమైన సంక్లిష్టమైన ‘నిజాన్ని’ (ఒక్కోసారి మనం ‘నిజం’ అనుకునేదేదీ అలా వుండదు కూడా) అందుకోవటం కోసం అసంఖ్యాకమైన చరిత్ర పొరల్ని తవ్వితీయాల్సి వుంటుందనేది నాకు తెలుసు. మనం ‘కనుగొన్న’ స్త్రీల ఈ అంశాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచుతున్నాయా? అని అప్పుడు నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. కానీ అవి అంతే. నా ఈ అన్వేషణలో ఇంతకు ముందు నేననుకున్న దాని ప్రకారం ఇది చాలా మామూలు విషయమే: దేశ విభజనకు వెనకాల వున్న చరిత్రలో, నాకు తెలిసినంత వరకు దీనిలో స్త్రీల గురించేమీ లేదు. ఒక స్త్రీగా, ఫెమినిస్టుగా, దేశ విభజనలో స్త్రీల గురించి కనుగొనటానికి’ నేను ప్రయత్నించి వారికి కనిపించేలా చేయాలనుకున్నాను. ఒక రకంగా ఈ ప్రయత్నం. ఒక అసంపూర్ణ చిత్రాన్ని ‘సంపూర్ణం’గా చూపించింది.

నిజానికి ఎక్కడా పూర్తి చిత్రాలనేవి వుండవు. ప్రతి ఒక్కరూ ప్రతిసారీ ఈ విషయాన్ని కొత్తగానే కనుగొనాలనే విషయం ఇప్పుడు నాకు తెలుసు. సింహావలోకనం చేసిన ప్రతిసారీ ఈ చిత్రం మారుతుంది. నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు. నువెవ్వరితో మాట్లాడుతున్నావు. వారితో నువ్వెప్పుడు మాట్లాడావు, ఎక్కడి నుంచి మాట్లాడావు, నువ్వేం వినాలనుకుంటున్నావు. వాళ్ళు నీకేం చెప్పాలనుకుంటున్నారు, … ఇవన్నీ కూడా నువ్వు చిత్రించాలనుకున్న విషయాన్ని ప్రభావితం చేస్తాయి. ‘రాణా’ కథను వింటున్నప్పుడు నేను ఈ విషయా లన్నీ పూర్తిగా గుర్తించాను.

ఉదాహరణకు, రాణా మామ తన కథను తానే చెప్పటానికి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఒక స్త్రీ తన గురించి తాను చెప్పటానికి ఎంతో సమస్య నెదుర్కోవచ్చనే విషయాన్ని నేను గుర్తించాను. వీళ్ళు ఎవరితో మాట్లాడగలరు? ఎవరు వింటారు? స్త్రీల ‘గొంతు’లను పట్టుకోవటానికి నేను కూడా ప్రయత్నించగలిగానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. దాని కోసం వివిధ ప్రశ్నల్ని వేయాల్సి వచ్చింది. అలాగే వివిధ సందర్భాలలో మాట్లాడాల్సి వచ్చింది. వారు మాట్లాడేది, వారి మౌనం, సగం చెప్పి వదిలేసిన విషయాలు, వాటిలో ముడిపడి వున్న సూక్ష్మాంశాలు లాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలను వినటానికి ఎన్నో ప్రయత్నాలను చేయాల్సి వచ్చింది కూడా. మగవాళ్ళు అరుదుగా స్త్రీల గురించి మాట్లాడతారు. అసలు స్త్రీలు తమ గురించి తాము ఎప్పుడూ మాట్లాడరు. ఒక రకంగా, తమ గురించి చెప్పటానికి ‘ఉపయోగపడేది’ ఏమీ వుండదని అంటారు. ఈ అవగాహన ఒక్కోసారి వాళ్ళ మగవాళ్ళ ఆలోచననే బలపరుస్తుంది. లేదా, తరచూ, అసలు మాట్లాడటానికి వాళ్ళు అక్కడ వుండనే వుండరు. నిజానికి ఒక అపరిచితురాలిగా, బయటి వ్యక్తిగా, వాళ్ళ జీవితాల గురించి తరచి తరచి, వాళ్ళని గతంలోకి తీసుకువెళ్ళి, వాళ్ళు ఒక రకంగా దాదాపు మర్చిపోయిన అనుభవాలను గుర్తు చేసుకొమ్మని అడగటా నికి నాకేం హక్కు వుంటుంది? హింసాపూరి తమైన, హత్యలు, అత్యాచారాలకు సంబంధిం చిన చరిత్రలనే నేను తెలుసుకోవాలను కుంటున్నానని కూడా నాకు తెలుసు.

కొద్ది కాలంపాటు అప్పుడు నేను స్త్రీలతో మాట్లాడటం అపాను. ఈ చరిత్రల వెనకాల వున్న అనేక పొరల్లో దిగివున్న నిశ్శబ్దాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం వుంద ని నాకు నేనే చెప్పుకున్నాను. అంటే నాకు కావలసిన దాని కోసం ఇంకో చోటె క్కడో వెతకాల్ని వుందన్న మాట, నిజానికి ఇప్పటికీ నేను అన్ని రకాల నిశ్శబ్దాల గురించి తెలుసుకున్నాననుకోవటం లేదు. న్యూస్‌ పేపర్లలోని అంశాలు, జ్ఞాపకాలు, ఇంకా ఇతర రకాల ఆధారాలు నాకు ఈ కథలను దగ్గరకు చేర్చటానికి ఉపయోగ పడ్డాయి. ఒక కథ ప్రేమ, ద్వేషంతో కలగలిసి వుంటుంది. ఇంకో కథ నాలుగు జీవితాలు, రెండు జాతుల గురించి వుంటుంది. మరో కథ నన్ను స్త్రీల చరిత్రల దగ్గరకు తీసుకు వెళ్ళింది. ఆ కథే జైనబ్‌, బూటాసింగ్‌ల చరిత్ర.

యుక్త వయస్సులో వున్న ముస్లిం యువతి జైనబ్‌, పాకిస్థాన్‌కి ఒక కాఫిలాలో ఆమె కుటుంబం తరలి వెళ్తున్నప్పుడు జైనబ్‌ అపహరణకు గురైంది. ఆమెను అపహరిం చింది ఎవరో, ఆమె ఎంతమంది చేతుల్లోకి మారిందో ఎవరికీ తెలియలేదు. చివరికి, ఆమెను అమృత్‌సర్‌ జిల్లాకు చెందిన జాట్‌ బూటాసింగ్‌ కొన్నాడు. అందరు మగవాళ్ళ లాగే (వాళ్ళంతట వాళ్ళే స్త్రీలను అపహరిం చినా లేదా కొన్నా గానీ) ఆ సమయంలో అవివాహితుడిగా వున్న బూటాసింగ్‌, ‘చద్దర్‌’ సంప్రదాయ తంతును నిర్వహించి జైనబ్‌ను ‘పెళ్ళి’ చేసుకున్నాడు. కొంత కాలానికి, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళకొక కుటుంబం ఏర్పడింది. దేశ విభజన జరిగిన చాలా సంవత్సరాల తర్వాత, అపహరణలకు గురైన స్త్రీలను వెతుకుతూ వచ్చిన సెర్చ్‌ పార్టీ అమృత్‌సర్‌లో జైనబ్‌ను గుర్తించారు. ఆమె బూటాసింగ్‌తో అక్కడే నివసిస్తోంది. బూటాసింగ్‌ అన్నయ్య గానీ – లేదా అతని మేనల్లుళ్ళు గానీ ‘సెర్చ్‌’ పార్టీకి జైనబ్‌ వివరాలను తెలియ జేసుంటారనే అనుమా నం వుంది. బూటాసింగ్‌ పిల్లలు కుటుంబ ఆస్థిలో భాగం కలిగి వుంటారు గాబట్టి, దీనితో వీళ్ళకొచ్చే భాగం తక్కువయి పోతుందనేది వాళ్ళ ఆందోళన. అప్పటికే ఆ ‘రక్షించబడిన’ మిగతా స్త్రీలకు మల్లేనే, జైనబ్‌కు కూడా ఈ అంశంలో ఏ రకమైన నిర్ణయాధికారమూ లేదు. బలవంతంగా ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశారు. వార్తా పత్రికల రిపోర్టులు దీన్నొక తీవ్రమైన చర్యగా రాశాయి. జైనబ్‌ వెళ్ళిపోవటాన్ని చూడటానికి గ్రామస్థులంతా ఒక్కచోట చేరారు. ఆమె తన ఇంట్లో నుంచి నెమ్మదిగా చిన్న బట్టల మూటతోపాటు తన బిడ్డ నెత్తుకుని బయటకు వచ్చింది. ఆమె సామాన్లన్నీ జీపులో ఒక దగ్గర పెట్టారు. జైనబ్‌ జీపు ఎక్కి బూటాసింగ్‌ వైపు తిరిగి తన పెద్ద బిడ్డను చూపిస్తూ ‘ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. బాధపడొద్దు, నేను తొందరలోనే వెనక్కి వచ్చేస్తాను’ అని అన్నట్లుగా పేపర్లు రాశాయి.

జైనబ్‌ను కనుగొనటంలో ఆస్తి ప్రధాన పాత్ర వహించిందంటే ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు. ఆమె స్వంత తల్లిదండ్రులు చంపబ డ్డారు. అయితే భారత దేశంలోని పంజాబ్‌లో వారి ఆస్తులను అక్కడే వదిలేయటం వల్ల ఆమె కుటంబానికి నష్టపరిహారంగా పాకిస్థాన్‌ లోని లైల్యాల్‌పూర్‌లో భూమిని ఇచ్చారు. జైనబ్‌తోపాటు, ఆమె చెల్లెలు కూడా తండ్రి భాగంలో భాగాన్ని పొందారు. వాళ్ళ భాగాన్ని పొందారు. వాళ్ళ మామ వరసయ్యే వ్యక్తికి ఆ పక్క భూమినే ఇచ్చారు. జైనబ్‌ అచూకీ తెలుసుకోవటనాఇకి ఈ మామనే చాలా ప్రయత్నాలు చేశాడనే పుకార్లు వున్నాయి. ఆ భూమిని తన కుటుంబం అధీనంలోనే వుంచుకోవాలని అతను అనుకున్నాడు. దాని కోసం జైనబ్‌ను వెతికి పట్టుకోవాలను కున్నాడు. దొరికిన తర్వాత కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేస్తే గనుక, ఆస్తి ఇంక ఎక్కడికీ పోయే ప్రసక్తి వుండదని ఆలోచించాడు. అయితే అతని కొడుక్కి జైనబ్‌ను పెళ్ళి చేసుకోవటం ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే, ఆమె చాలా సంవత్సరాల పాటు ఒక సిక్కు పురుష/డితో కలిసి జీవించింది. ఈ విషయమై అతని కుటుంబంలో చాలా కాలంపాటు చర్చలు కూడా నడిచాయి. ఇక్కడ బూటాసింగ్‌కు అతని పొరుగు వారి ద్వారా, ఇతరుల ద్వారా ఈ విషయాలు చెదురు మదురుగా తెలుస్తుండేవి.

ఈ లోపల, ఎక్కడ వీలయితే అక్కడ బూటాసింగ్‌ తన కేసు గురించి చెప్పుకుం టూ పోయాడు. కానీ ఎక్కడా సహాయం లభించలేదు. పాకిస్థాన్‌ వెళ్ళటానికి అతను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయ ంలో అదంత సులభమైన విషయమేమీ కాదు. ఒక రోజు పాకిస్థాన్‌ నుంచి అతను ఒక ఉత్తరం అందుకున్నాడు. అది జైనబ్‌ పొరుగు వాళ్ళని తెలుస్తోంది కానీ ఎవరనీ స్పష్టంగా తెలియలేదు – జైనబ్‌ కుటుంబం, పెళ్ళి చేసుకోమని ఆమె మీద ఒత్తిడి పెడుతున్నారని ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా అక్కడికి వెళ్ళమని అందులోని సారాంశం. బూటాసింగ్‌ తన భూమంతటినీ అమ్మేసి, కొంత డబ్బు జమ చేసుకున్నాడు, కానీ రెండు దేశాల మధ్య రాకపోకలకు వున్న అడ్డంకులను దాటలేకపోయాడు. అతను పాస్‌పోర్టు, వీసా తీసుకోవలసి వుంది. దానికోసం అతను ఢిల్లీ వరకూ ప్రయాణిం చాలి. ఇక్కడ, ఇందుకోసమై అతను చేసిన మొదటి పని ఇస్లాం మతంలోకి మారటం, దీని వలన ఒక ముస్లింగా పాకిస్థాన్‌కు వెళ్ళటం సులభమవుతుందని అతను భావించాడు. బూటాసింగ్‌ ఇప్పుడు జమీల్‌ అహ్మద్‌. పాకిస్థానీ దేశస్థుడిగా తర్వాత అతను పాస్‌పోర్టు కోసం ధరఖాస్తు చేసుకున్నాడు. ఇదొక్కటే తనను జైనబ్‌ దగ్గరకు జేరుస్తుం దనుకున్నాడు. కానీ, ఆ సమయంలో, ఒక కొత్త దేశం పౌరసత్వం సంపాదించటం అంత సులభమైన విషయం కాదు. పాకిస్థాన్‌ హై కమిషన్‌ పాకిస్థానీ దేశస్థుడిగా బూటాసింగ్‌ అప్లికేషన్‌ను అంగీకరించి, ఆ విషయాన్ని ప్రభుత్వ యాంత్రాంగానికి తెలియజేసింది. ఇక్కడ ప్రశ్న కేవలం జాతీయతను ఒక్కటే మార్చుకోవటం కాదు.ఈ ప్రశ్నలు అంత సులభమైనవేమాత్రం కాదు. ఈ రెండు దేశాల మధ్య అక్షరాలా యుద్ధ వాతావరణం నెలకొని వుంది. అణువణువునా జీర్ణించుకు పోయిన అపార్థాలు, అనుమానాలు రెండు వైపులా చాలా తీవ్రంగా వున్నాయి. సరిహద్దుల దగ్గర ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఏ మాత్రం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రేమ కోసం ‘ఇతర’ జాతీయతకు సంబంధించిన వ్యక్తి దరఖాస్తును కేవలం అతని ‘ముఖ విలువ’ను బట్టి ఇస్తారా? చాలా నెలలపాటు, అతని దరఖాస్తు తిరస్కరించ బడింది. (ఆసక్తికరమైన విషయమేమంటే, అదే సమయంలో, వార్తా పత్రికల కథనం ప్రకారం, తారాపథంలో అగ్రగామిగా వెలుగొ ందుతున్న సినీ తార ‘మీనా’, పాకిస్థాన్‌ పౌరసత్వాన్ని తీసుకోవటనాకి దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తును వెంటనే అంగీకరించటమే కాక, పౌరసత్వం కూడా ఇచ్చింది. ఆమె ఈ పౌరసత్వ ‘ఫిరాయింపు’ ప్రెస్‌లో పెద్ద ఎత్తున వచ్చింది కూడా.)

అయితే బూటాసింగ్‌ తన విషయాన్ని అంత తొందరగా వదిలెయ్యలేదు… తక్కువ కాల వ్యవధి గల వీసా కోసం అతను దరఖాస్తు చేసుకున్నాడు, ఎందుకంటే పాకిస్థాన్‌ హై కమీషన్‌లో వున్న వ్యక్తులు అందరూ అప్పటికీ అతనికి బాగానే పరిచయమయ్యారు. దానితో అతనికి తొందరలో అంగీకారం వచ్చింది. ఇప్పుడు బూటాసింగ్‌ అలియాస్‌ జమీల్‌ అహ్మద్‌ పాకిస్థాన్‌ వెళ్ళే దారిలో వున్నాడు. అప్పటికే తన మామ కొడుకుని పెళ్ళి చేసుకున్న జైనబ్‌ను వెతకటానికి పూనుకొన్నాడు. ఆమెకు తిరిగి పెళ్ళయిందన్న విషయాన్ని అర్థం చేసుకోవటం అతనికి చాలా కష్టమయినప్పటికీ, అనుకోని పరిస్థితుల వల్ల జైనబ్‌ కోసం పోరాడటానికి అతనికి ఇంకో అవకాశం వచ్చింది. జైనబ్‌ను వెతికే తొందరలో, దేశంలోకి తాను అడుగు పెట్టినట్లు పోలీసుల దగ్గర రిపోర్టు చేయటం మర్చిపోయాడు – ఈ రోజుకి కూడా భారత్‌ పౌరులు పాకిస్థాన్‌లోకి, పాకిస్థాన్‌ పౌరులు భారత్‌లోకి వస్తే, ఇద్దరూ కూడా ఇరవై నాలుగ్గంటల లోపల తాము దేశంలోకి వచ్చినట్లు అక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి రిపోర్టు చేయాలి. బూటాసింగ్‌ దీన్ని అతిక్రమించటంతో, మేజిస్ట్రేట్‌ ముందర హాజరు కమ్మని తాఖీదు వచ్చింది. దానితో అతను తాను జైనబ్‌ను వెతికే క్రమంలో ఆమె గురించి తెలిసిన నిజాలతో వ్యాకులత చెంది, రిపోర్టు చేయాలన్న దానిని మర్చిపోయానని, దాన్ని క్షమించవలసిందిగా కోరుకున్నాడు. అది విన్న మేజిస్ట్రేట్‌ జైనబ్‌ను కోర్టు ముందుకు వచ్చి స్టేట్‌మెంట్‌ ఇవ్వవలసిం దిగా సమన్లు జారీ చేశాడు.ఈ క్రమంలోనే బూటాసింగ్‌ ఆశలన్నీ చెల్లా చెదరైపోయాయి. బంధువుల పహారాలో వచ్చిన జైనబ్‌ అతన్ని తిరస్కరిస్తూ: ‘నేను పెళ్ళయిన స్త్రీని, ఇప్పుడు ఇతనితో నాకేమీ పనిలేదు. నేను తన రెండో బిడ్డను అతని ఇంటి నుంచి తీసుకొచ్చాను. ఆ బిడ్డను అతను తీసుకెళ్ళి పోవచ్చు…’ అంది.

ఆ మార్నాడే బూటాసింగ్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో దొరికిన ఉత్తరంలో, అతనిని జైనబ్‌ గ్రామంలోనే ఖననం చేయవలసిందిగా రాసి వుంది. అయితే అతని ఈ చివరి కోరిక తీరకుండానే మిగిలిపోయింది. బూటాసింగ్‌ శరీరాన్ని పంచనామా కోసం లాహోర్‌కి తీసుకువచ్చినప్పుడు, బయట వేలాది మంది ప్రజలు గుమి గూడారని చెప్పారు: కొంత మంది ఏడ్చారు, ఒక సినిమా నిర్మాత ఈ కథతో సినిమా తీస్తానని ప్రకటించాడు. తర్వాత, పోలీసులు అతని శవాన్ని జైనబ్‌ గ్రామానికి తీసుకెళితే, ఆమె కులానికి, కుటుంబానికి చెందిన వాళ్ళు అక్కడ ఖననం చేయనీయకుండా అడ్డుకున్నారు. ఆ సంఘటనకు సంబంధించిన శాహెల్‌ గుర్తు లేమీ అక్కడ వుండటానికి వాళ్ళు ఇష్టపడ లేదు. దానితో బూటాసింగ్‌ అలియాస్‌ జమీల్‌ అహ్మద్‌ శరీరాన్ని లాహార్‌ తీసుకువచ్చి అక్కడ ఖననం చేశారు. (ఈ కథను ముక్కలు, ముక్కలుగా అనేక విధాలుగా సేకరించాను. వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రచురించని మాన్యస్క్రిప్టు: లాహోర్‌: ఏ మెమోయిర్‌ బై సోమ్‌ ఆనంద్‌. ఇప్పుడు బూటాసింగ్‌ జైనాబ్‌ల ప్రేమ కథకు ఎన్నో రకాల కథనాలున్నాయి. ముఖ్యంగా వీరోచిత ఇతిహాస స్థాయి ప్రేమ కథగా పేరు పొందటంతో, వివరాలు ఒకదానికొకటి చాలా భిన్నంగా వుంటాయి. దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది. కార్తవ్‌సింగ్‌ పేరుతో ఈ మధ్యనే పాకిస్థాన్‌లో ఒక వీడియో కూడా వచ్చింది.)

చావుతో బూటాసింగ్‌ ఒక హీరో అయి పోయాడు. ఇతిహాస కథనం, అన్య దేశంలో వున్న ప్రేమికులు – ఈ కథనంతో, హీర్‌-రంజా, సోహిని-మహిపాల్‌ లాంటివి చాలా వున్నాయి. ఈ క్రమంలో, జైనబ్‌, ఇంకా ‘బ్రతుకు’ నడిపిస్తూనే వుంది. తన ప్రియుని కోసం బాధపడటం కానీ, ఏడవ టం కానీ చేయలేని పరిస్థితి, పైగా ఎవరి తోనూ మాట్లాడలేని పరిస్థితి. వేలాది మంది అలాంటి స్త్రీలలో ఆమె కూడా ఒకటి.

జైనబ్‌, బూటాసింగ్‌ల కథ అలా నా వెన్నంటే వుండిపోయింది. ఇది చాలా కదలించే కథే, కానీ దీనికి మించినదేదో వుంది. దాని గురించి నేను పదే పదే ఆలోచిస్తూవున్నాను. అది నన్ను తొలుస్తూ వుంది. ఏదో ఒక రకమైన అసంతృప్తి నన్ను వెంటాడుతూనే ఉవంది. నాకు వివరించినట్లుగా, ఒక ధీరోధాత్తుడైన హీరో, గురించి తెలుసుకుంటాం: ఉద్వేగపూరితమైన అతని స్వభావం, అతని నిజాయితీ, స్థిర సంకల్పంతో కూడిన వ్యక్తిత్వం, తను ప్రేమిం చిన స్త్రీ కోసం సర్వస్వం ధారపోయటానికి సిద్ధపడిన స్వభావం, అతని ప్రేమకున్న బలాన్ని వివరిస్తాయి. కానీ ‘బాధితురాలి’కి సంబంధించి ఏమీ లేవు. ఎంత ప్రయత్నించి నప్పటికీ, నేను ఆమెకు సంబంధించిన గొంతును వినలేకపోయాను. అసలు జైనబ్‌ ఏమని ఆలోచించి వుంటుంది? ఆమె నిజంగా బూటాసింగ్‌ గురించి ఆలోచిం చిందా లేదా ఆమె తన జీవితంలో కొచ్చిన ఇద్దరు పురుషుల పట్లా ఒక రకమైన నిర్లిప్తతతోనే వుందా? తనను ఎత్తుకెళ్ళి పోయిన సంఘటన పట్ల ఆమె భావాలేమిటి, ఒక అత్యాచారంగా జరిగిన దీనిని ఆమె ఎలా తీసుకుంది? బూటాసింగ్‌, జైనబ్‌ ఇద్దరూ సంతోషంగా గడిపారని, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారనే చెప్పారు. అయితే ఈ వ్యక్తి అమెను నిజంగా తీసుకొచ్చే శాడు, అది కూడా ఒక సామానులాగా కొనుక్కొచ్చాడు. అలా అయినప్పుడు ఆమె అతన్ని ఎలా ప్రేమించింది? దీనితో నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి – ఇప్పటికీ బతికి వున్న స్త్రీలతో మాట్లాడాలనీ నాకు అర్థమయింది. ఈ విధంగా మాట్లాడటం వల్ల నేను వాళ్ళ అనుభవాలను, భావాలను అర్థం చేసుకోగలు గుతానని అనిపించింది. అయితే ఈ నిర్ణయం అంత సులభమైనదేమీ కాదు. ఒకస్థాయి చేరే సరికి పరిశోధనే ఒక లక్ష్యమయి పోతుంది. ఒక వ్యక్తి గురించి పరిశోధన చేస్తున్నప్పుడు, ఈ వ్యక్తి సమాచా రాన్ని అందించే, సాధనంగా మారతారు. ‘సమాచారాన్ని అందించే వ్యక్తి’ ఏ రకమైన అనుభూతులు లేనట్లుగా పట్టనట్లుగా మిగిలిపోతారు. అది మన పనికి చాలా ముఖ్యమే అయినప్పటికీ, నేను అలా నా స్వార్ధానికి ఈ రకమైన ఉల్లంఘన చేయదల చుకోలేదు. రాణామామ ఇంటర్వ్యూలో చేసినట్లుగానే, ఈ పరిశోధనలో నేను నా ఆలోచనల మీద పూర్తి నిశ్శబ్దాన్ని పాటించా లని నిర్ణయించుకున్నాను.

నాకు ఇప్పుడు తెలిసినంత వరకూ దేశ విభజనకు సంబంధించిన చరిత్ర అంతా కూడా స్త్రీలకు చాలా లోతైన మానసిక శారీరక హింసలను మిగిల్చింది. అందుకే ఎవరైతే వీటి గురించి మాట్లాడాలను కుంటున్నారో వారితోనే మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. అలాగే స్త్రీల చరిత్రలను వెలికి తీయటానికి ఉపయోగపడే ఇతర ఆధారాలను కూడా వెతికే పనిని కొనసాగిస్తాను. ఏదైనా ఒక పనిచేస్తున్న ప్పుడు అనుకోకుండా దానికి సంబంధించిన విషయాలనెన్నిటినో గమనిస్తాం. అలాంటిదే నాకు ఇప్పుడు ఎదురయింది.

1988లో, స్త్రీల పత్రిక ‘మానుషి’ ఒక గుజరాతీ పుస్తకం ‘మూల్‌ సుత ఉఖ్డే’ (మూలం నుంచి పెకిలించింది) మీద ఒక సమీక్ష వచ్చింది. దేశ విభజనలో అపహర ణకు, అత్యాచారానికి గురైన స్త్రీలతో పనిచేసిన కమలాబెన్‌పటేల్‌ అనే స్త్రీ జీవతంలోని జ్ఞాపకాలు, వాటికి సంబంధిం చిన వివరాలతో వున్న పుస్తకం ఇది. కమలా బెన్‌ చెప్పిన కథ నిజంగా కదలించేదిగా వుంది. దగ్గర దగ్గర 75,000 మంది స్త్రీలు, సరిహద్దుల కిరువైపులా అపహరణలకు అత్యాచారాలకు గురయ్యారని ఆమె ఈ కథనంలో గుర్తుచేసుకుంది. దీనిలో కాశ్మీర్‌ను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య దగ్గర దగ్గర 1,00,000కు చేరుతుంది. అత్యాచారాలే కాక, అనేక రకాల ఇతర హింసలను కూడా స్త్రీలు ఎదుర్కోవాల్సి వచ్చిందనేది వాస్తవం. చాలా మందిని నగ్నంగా వీధుల్లో తిప్పారు. రొమ్ములు కోసేశారు. వాళ్ళ శరీరాల మీద ఇతర మతాలకు చెందిన గుర్తులను పచ్చబొట్లుగా వేశారు. ఎంతో మంది తమ మీద జరిగిన అత్యాచాచాల వల్ల గర్భవంతుల య్యారు. పిల్లల్ని కన్నాగానీ, చాలాసార్లు వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. ఒక్కోసారి కుటంబాలు, తమ స్వేచ్చ కోసం స్త్రీలను మార్పిడి చేశారు. స్త్రీలు వారి ప్రాంతా ల నుండి, క్యాంప్‌ల నుండి అపహరణలకు గురవటం ద్వారా మాయమైయ్యారు. లేదా కాలినడకన సరిహద్దుల వెంట నడిచిన జన సమూహంలో వుండిపోయారు. కానీ వందలాది మంది స్త్రీలు, వాస్తవానికి వేలాది మంది, అత్యాచాచాలకు అపహరణలకు గురైయ్యారనే దాని గురించి ఇప్పుడు తెలుస్తోంది.

అత్యాచారాలకు, అపహరణలకు గురైన స్త్రీలను కనుగొని వారిని రక్షించటానికి పనిచేసిన ఇతర స్త్రీలతో కలిసి పనిచేసిన కమలాబెన్‌ తన అనుభవాలను ఈ పుస్తకంలో వివరించింది. కానీ ఆమె తన గురించి తాను ఏమనుకుందో? అప్పటి తన భావాల ను బయటకు వెల్లడించటానికి ఆమెకు కొన్ని దశాబ్దాలు పట్టాయి. ఎందుకనా, అని నేను చాలా ఆశ్చర్యపోయాను? ఒక నిశ్శబ్దాన్ని తన విధానంగా ఆమె ఎందుకు ఎంచుకుంది? ఇవి ఇంత కాలానికి బహిర్గతం చేయటానికి పురికొల్పిన అంశాలేమిటి? నేను ఆమె కోసం వెతికి, చివరికి పట్టుకోగలిగాను, పొట్టిగా, బక్కగా వున్న ఒక స్త్రీమూర్తి, దాదాపు ఒంటరిగా బొంబాయిలో జీవిస్తోంది. సహా యం కోసం వున్న అమ్మాయి దాదాపు పెంచు కున్న కూతురుగా ఆమెకు చేదోడు వాదోడు గా వుంటోంది. ‘నేనెందుకు దీని గురించి రాయలేదని నీకు తెలుసుకోవాల నుందా? ఇప్పుడు చెప్తాను’ అని ఆమె నాతో అంది.

‘ఇంతకు ముందు నా పుస్తకం రాయకపోవటానికి కారణమేమంటే, ఆ సమయంలో నేను చూసిన దాన్ని అంగీకరించలేకపోయాను. మనుషులు ఇంత దారుణంగా చెయ్యగలుగుతారా అని నమ్మడం నాకు చాలా కష్టమనిపించింది. పిశాచాలు భూమి మీదకి వచ్చాయా అన్నట్లుండేది అప్పటి పరిస్థితి. పిశాచగణాలు అవహించిన శివుడు, శివతాండవం చేసే వాడట, విధ్యంసాన్ని సృష్టించే తాండవ నృత్యం… అలాంటి ఉన్మాదమేదో ప్రతి ఒక్కరిలోనూ ఆవహించి వుండేది, స్త్రీలూ పురుషులూ ప్రతి ఒక్కరిలోను దేశవిభజన ఒక తాండవ నృత్యం లాంటిది… నేను అలాంటి అసాధారణమైన విషయాలెన్నిం టినో చూశాను. నన్ను నేనే ప్రశ్నించుకునే దానిని, రాయటానికి ఏం వుందని, అసలెం దుకు రాయాలని…’

కమలాబెన్‌ నిశ్శబ్దం ఒకటైతే, నేను మాట్లాడిన ఎన్నో కుటుంబాల సంగతేమిటి? వాళ్ళెందుకని అత్యాచారాల గురించి అపహరణల గురించి అసలు కనీసంగా కూడా ప్రస్తావించలేదు? ఇవి కావాలని చెరిపేసిన విషయాలా లేక నేనేమైనా పొరపాటు ప్రశ్నలను వేశానా? లేక, వాళ్ళు సగం సగం చెప్పిన విషయాల వెనుక అర్థాల ను వినలేకపోయానా? వాళ్ళు మాట్లాడినా గానీ, కొన్ని అంశాలను నేను పట్టించుకోలే దని అనిపిస్తోంది. దానితో మళ్ళీ నేను చేసిన ఇంటర్వ్యూలను మరింత పరిశీలించాను. హఠాత్తుగా నాకో విషయం స్ఫురించింది. వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక అర్థంకాని నిశ్శబ్దం, అస్పష్టత, సందిగ్ధతతో కూడిన వాక్యాలు. రావల్‌పిండి కలహాల్లో బతికి బయటపడ్డ ఇద్దరు ఢిల్లీకి చెందిన సోదరులు, వాళ్ళ కుటుంబం గురించి నాకు ఈ విధంగా చెప్పారు.

”మా ఇంట్లో మా నానమ్మ, తాతయ్య, నాన్న, అమ్మ, ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్ళు (ఒక అక్క తూర్పు పంజాబ్‌లో వుండేది) వున్నాం. మా అత్తయ్య ఢిల్లీలో వుండేది. ఆమె తన కూతురుతో మమ్మల్ని చూడటానికి మా దగ్గరకు వచ్చింది. ఇక్కడ కలహాల్లో వాళ్ళిద్దరూ చంపబడ్డారు. నిజానికి మా కుటుంబమంతా చనిపోవాల్సింది. కానీ మేమిద్దరం అన్నదము లం తప్పించుకున్నాం.

…. కొంత మంది గురుద్వారాలోను, కొంత మంది ఇంకో చోట చంపబడ్డారు. మా నానమ్మ, తాతయ్యలను పఠాన్లు ఇంట్లోనే చంపేశారు. మిగతావాళ్ళు… మా అమ్మ, మా చిన్న తమ్ముడిని గురుద్వారాలో చంపారు. మా నాన్న ఎలానో అక్కడ నుంచి తప్పించు కున్నా గానీ, దారిలో ఎక్కడో చంపేశారు… మేం చాలా కొద్ది మందిమి మిగిలిపోతే , దానిలో కూడా కొంత మందిమే బతికాం”.

చనిపోయిన వారిలో, వీళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది వున్నారు. అయితే వాళ్ళు తమ అక్కల గురించి సూటిగా స్పష్టంగా ఏమీ చెప్పలేదు. ఆ సమయంలో వాళ్ళు ‘మాయమయ్యారు’. వాళ్ళు ఆ గ్రామస్థులే, ఆ సమూహంలో వున్నవారే. చుట్టూ వున్న ప్రతి ఒక్కరికీ ఈ కథ ‘తెలుసు’, కానీ ఈ విషయాన్ని అందరూ రహస్యంగానే మాట్లాడారు. ‘వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ అక్కలిద్దరు ఆ సమయంలో కనిపించకుండా పోయారు’ అని పొరుగునున్నాయన నాతో అన్నాడు. అది సిగ్గుపడాల్సిన, అవమానపడే విషయంగా ఆయన చెప్పాడు. దానితో నేను ఆ విషయాన్ని అడగలేదు. కానీ, నేను మా మాటలన్నిటి గురించి తిరిగి ఆలోచించి నపుడు, నాకు అకస్మాత్తుగా తట్టినదేమంటే, ఆ ఇద్దరు అక్కలు కనిపించకుండా పోవటం గురించి అస్పష్టతతో కూడిన వాక్యాలే కాకుండా, ఇబ్బందికరమైన నిశ్శబ్దం. చిన్న ఏడుపు. ఆ తర్వాత వచ్చిన నిశ్శబ్ద్దం. ఈ నిశ్శబ్దం వెనుకే దేశ విభజనకు చెందిన ఎన్నో చరిత్రలు మరుగున పడిపోయివున్నాయని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న విషయాల అంచుల చుట్టూ ఈ చరిత్రలు పరిభ్రమిస్తూ వుంటాయి. ఈ చరిత్రలే స్వాతంత్య్రానికి వెనుక నున్న చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తాయి. పరిశోధించే కొద్దీ, నెమ్మదిగా, కఠోరమైన చరిత్రలు వాటంతటనే బయటకు వచ్చాయి.

కొన్ని నెలల తర్వాత నేను కమలాబెన్‌ను కలిశాను. నేను, సుదేష్‌ వైద్‌ ఒక పాత పుస్తకాల దుకాణంలో ఒక అపురూపమైన పుస్తకాన్ని చూశాం. దేశ విభజన తర్వాత అపహరణకు గురైన, లేదా కనిపించకుండా పోయారని కుటుంబాల చేత రిపోర్టు చేయబడిన వారిలో వేలాది మంది హిందూ, సిక్కు స్త్రీలున్నారని ఆ పుస్తకంలో వ్ను నివేదిక స్పష్టం చేసింది. 114 పేజీలు వున్న పెద్ద పుస్తకం ఇది (ఎ.జె.ప్లెచర్‌; అపహరణకు గురైన స్త్రీలు, పిల్లలను గుర్తించటానికి ఏర్పాటు చేయబడిన కమీషనర్‌, అంబాలా, జలంధర్‌ డివిజన్‌ల ఉన్నతాధికారి గారిచే ప్రచురించిన పుస్తకం ఇది.)

దీనిలో, జిల్లాల వారీగా అపహరణకు గురయ్యారని చెప్తున్న స్త్రీలు, పిల్లల వివరాలున్నాయి. దాదాపు 21,809 పేర్లు. ఇది అసంపూర్తి నివేదిక అని స్పష్టమవుతున్నా గానీ, ఎవరినైనా గానీ చాలా భయపెట్టే అంశమే. లెక్కతేలని అనేక మందితో కలిసి ముందు నేను చెప్పిన ఇద్దరు అక్క చెల్లెళ్ళ పేర్లు ఇందులో వున్నాయి. ఇంకా ‘…. యుక్తవయస్సు ఆడపిల్లలు, పెద్ద వయసు స్త్రీలు, పిల్లలు, దాదాపు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వంత గ్రామాలకు సంబంధిం చిన వ్యక్తుల చేతుల్లోనే అపహరణకు గురయ్యారు. సాధారణంగా జనబాహుళ్యం లోనూ, మత కలహాలకు సంబంధించిన చరిత్రకారుల ప్రబలంగా నమ్మేదేమిటంటే ముష్కర మూకలు ఎప్పడూ కూడా బయట నుంచి వచ్చిన వేరే మతం వారేనని. అయితే, నా దగ్గరకు వచ్చిన ఈ నివేదిక, అది పూర్తిగా తప్పని నిర్ధారిస్తోంది. చాలా మంది స్త్రీలను వారి గ్రామాలకు చెందిన పురుషులే అపహరించారు. చాలా మంది పెద్ద వయసు స్త్రీలు, దాదాపు యాభై, అరవై సంవత్సరాల వాళ్ళు కూడా అపహరణలకు గురయ్యారు. స్వచ్చంద సామాజిక సేవకుల దృష్టిలో, ఇది అసాధారణమవలేదు: ఎందుకంటే ఈ స్త్రీల సామాజిక స్థితిగతులు – సాధారణంగా వితంతువులు, ముసలివాళ్ళు లేదా అస్తి కోసం చంపబడ్డ మగవాళ్ళ భార్యలు – అపహరించే వాళ్ళకు ఈ విషయం సంపూరి ్తగా తెలుసు, వాళ్ళకే కొడుకులుగా మార్చు కోవటమంటే దొడ్డి దారిలో అస్థిని సంపాదించటమే.

చాలా కుటుంబాలు, తమ కుటుంబాల స్త్రీలు మాయమయ్యారని రిపోర్టు చేశారు. పోలీసుల దగ్గర ఫిర్యాదు చేశారు. ఒక స్థాయిలో సమస్య ఏమిటనేది ఒకసారి స్పష్టమయ్యాక, ప్రభుత్వం దానిమీద ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాల్సి వచ్చింది. మొట్టమొదటి పని, మాయమైన ఈ స్త్రీల గురించి ఒక పట్టికను తయారు చేయటం. దీని ఆధారంగా వెతుకులాట జరగలి. ఇదంత సులభమైన విషయమేమీ కాదు: ఒక్కోసారి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు లేదా నలుగురు విభిన్న ప్రాంతాలలో వుండి మాయమైన స్త్రీ గురించి అందరూ ఫిర్యాదు రిజిష్టరు చేశేవారు. ఆ సమయంలో సేవిం చిన విషయాన్నే ఒక దగ్గరికి చేర్చటం గానీ, దానిని నలుగురిలో చర్చించటం గాని ఇలా దీనికోసమై ఒక పద్దతంటూ ఏర్పడలేదు.

దానితో ఏ పట్టిక మీదా పూర్తిగా ఆధారప డటానికి వీలులేకపోయింది. పట్టికలను తయారు చేసే బాధ్యతను యునైటెడ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ వెల్ఫేర్‌కు చెందిన ఎడ్వినా మౌంట్‌బాటన్‌కు అప్పజెప్పారు. ఆమె ఈ సమాచారాన్నంతా ఒక దగ్గరికి చేర్చి ప్రత్యేక ప్రాంతాల్లోని స్థానిక పోలీసులకు స్త్రీల పేర్లను పంపించేవారు.

ప్రమాద స్థాయిలో పెరుగుతూ వస్తున్న ఈ పట్టికలను చూశాక, ఇరు ప్రభుత్వాలు ఈ అంశం మీద చర్య తీసుకోక తప్పలేదు. అతి తొందరలోనే 1947 సెప్టెంబరులో భారత్‌, పాకిస్థాన్‌ దేశాల ప్రధాన మంత్రులు లాహోర్‌లో కలిసి అపహరణకు గురైన స్త్రీలను వేదికించటం కోసం ఒక నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఒక ఉమ్మడి విధాన ప్రకటనను ఈ విధంగా వెలువరించారు: రెండు దేశాల కేంద్రప్రభుత్వాలు, బలవంతపు మత మార్పిడులను గానీ, బలవంతపు పెళ్ళిళ్ళను గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించవు. అంతేకాకుండా, అపహరణకు గురైన ఆడపిల్లలు, స్త్రీలను తప్పనిసరిగా వారి కుటుంబాల దగ్గరకు చేర్చాలి. వారిని కనుగొనటానికి, రక్షించటానికి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, ప్రభుత్వాలదే (యు. భాస్కరరావు ది స్టోరీ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌, ఢిల్లీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌, 1967 ఫేజ్‌ నెం:30). అపహరణకు గురైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బలవంతంగా ఇతర మతంలోకి మార్చబడి వుంటారనే భావన సర్వత్రా వుండేది.

తర్వాత అదే సంవత్సరం డిశంబరు 6న, ఎన్నో సమస్యలు ముళ్ళకంచెలుగా చుట్టు ముట్టి వున్నప్పటికీ, ‘ఇంటర్‌ డొమినియన్‌ ట్రీటీ’ (ఇరు దేశాల మధ్య జరిగే ఒప్పందం) ద్వారా ఒక ప్రాధమిక అవగాహనకు రావట ం జరిగింది. ఆశ్చర్యకరమైన దేమిటంటే, ఏ ప్రభుత్వమూ కూడా అపహరణలు జరగలేదని ఖండించలేదు. ఎందుకంటే వారి పురుషుల గురించి వారికి బాగానే తెలుసు కాబట్టి. అలాగే ఇరు ప్రభుత్వాలూకూడా అపహరణలకు గురై ఇతర ప్రాంతాలలో వున్న స్త్రీలను రక్షించటానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటానికి అంగీకారానికొచ్చాయి. అంతే కాకుండా ఇతర మతాల పురుషులతో జీవిస్తున్న స్త్రీలను వెనక్కి తీసుకురావటానికి, అవసరం అయితే నిర్భంధపూరితంగానైనా సరే తీసుకువచ్చి వారి స్వంత ‘ఇళ్ళ’కు జేర్చాలని కూడా ఇరువురూ ఒప్పందం చేసుకున్నారు.

ఇంకో మాటలో చెప్పాలంటే, వారి వారి మతాల దగ్గరకు చేర్చటం. ముఖ్యంగా ఇది భారత రాజ్యానికి సంబంధించి ఆసక్తికరమైన వైరుధ్యమే. తన మతం గుర్తింపుతో కాకుండా ఒక లౌకికవాద, హేతబద్ధ రాజ్యంగా తనను తాను వర్ణించుకున్న భారత రాజ్యం, దేశ విభజనపట్ల అయిష్టతను చూపించింది. (ఈ అవగాహన ఈ మధ్య కాలంలో ప్రశ్నించ బడింది కూడా.)

అయితే, సిద్ధాంతపరంగా చూస్తే ఈ రాజ్యంలో స్త్రీలు సమాన పౌరులైనప్పటికీ వాళ్ళు నిర్వచించబడేది మత గుర్తింపుతోనే. దానితో, అపహరణకు గురయ్యారని భావించబడ్డ హిందూ, సిక్కు స్త్రీలకు ఇల్లంటే అది భారత్‌లోనే వుంటుంది. ఎందుకంటే భారతదేశం అంటే హిందూ, సిక్కు మతాలకు చెందినదనుకుంటారు. అదే ముస్లిం దేశం కాబట్టి ముస్లిం స్త్రీలకు పాకిస్థాన్‌ అవుతుంది. కానీ ఈ స్త్రీలు నిజంగా ఎక్కడ వుండాలని కోరుకుంటున్నారనే దాని మీద కాదు. సైద్ధాంతికంగా, దేశ విభజన అంటే, ప్రతి ఒక్క పౌరుడు/ పౌరురాలికీ ఏ దేశానికి చెందాలను కుంటున్నారనే అవకాశం వుంటు ంది. ఎవరైనా స్త్రీలు దురదృష్టకర పరిస్థితుల్లో అపహరణలకు గురైతే, ఆమెకు ఈ ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది.

స్త్రీలను వెతకటానికి ఏర్పడిన ఈ యంత్రాంగంలో పోలీసు అధకారులు, సామాజిక కార్యకర్తలుగా వున్న స్త్రీలు, సాధారణంగా ధనిక కుటుంబాల నుంచి వచ్చినవారు, ఈ పనికోసం తమ సమయా న్ని వెచ్చించగలవారున్నారు. వీరిలో మృదులా సారభాయి, ప్రేమవతి థాపర్‌, కమలాబెన్‌ పటేల్‌, దమయంతి సెహగల్‌ వున్నారు.

చరిత్రగా స్త్రీ శరీరం..

డిశంబరు 6, 1947 ఇంటర్‌ డొమినీ యన్‌ ట్రీటీ ద్వారా అపహరణలకు గురైన స్త్రీలను ఎంత మందిని వీలైతే అంత మందిని వెతికి పట్టుకోవాలని భారత, పాకిస్థాన్‌ ప్రభుత్వాలు ఒక ఒప్పందానికి వచ్చాయనేది ఇంతకు ముందే చెప్పుకున్నాం. సెంట్రల్‌ రికవరీ అపరేషన్‌గా పేరుపడ్డ ఈ కార్యక్రమంలో పనిచేయటానికి ముందుకు వచ్చిన మృదులా సారాబాయ్‌ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి…

అతి కొద్ది కాలంలోనే, ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ఒప్పందం, ఉభయ దేశాల పార్లమెంటుల్లో ఆమోదం పొందింది. ‘అపహరణలకు గురైన వ్యక్తులను కనుగొని వారి వారి ప్రాంతాలకు పంపించే ఆర్డినెన్స్‌ (ది అబ్‌డక్‌టెక్‌ పర్సన్స్‌ రికవరి అండ్‌ రెస్టోరేషన్‌ ఆర్డినెన్స్‌) ముందుగా ఈ రెండూ బిల్లు రూపంలో వచ్చి, 1949లో చట్టంగా మార్పు తీసుకుంది. (యాక్ట్‌ నెం. ఎల్‌ఎక్‌సవి ఆఫ్‌ 1949), ఈ చట్టంలోని షరతుల ప్రకారం, భారత ప్రభుత్వం ఒక కార్యాచరణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి మరీ ముఖ్యంగా ‘అపహరణకు గురైన వ్యక్తి’ అనే దానికి ఒక కార్యాచరణ అర్థాన్ని తీసుకువచ్చింది.

మొత్తం విషయమే చాలా సంక్లిష్టమైన దవటం వల్ల పైన చెప్పిన అంశం చాలా ముఖ్యమైనది. ఎవరు అపహరణకు గురయ్యారు, ఎవరు కాలేదు అని ఎలా నిర్ధారించటం? ఒకవేళ స్త్రీ తన స్వంత నిర్ణయంతో వెళ్ళిపోతే గనుక ఏమిటి పరిస్థితి? ఈ అంశాలన్నీ ఆలోచనకు వచ్చాయి, వాటి గురించి పరిశీలించవలసిన అవసరం ఎంతైనా వుంది. వ్యక్తిగతం కాని రాజ్య వ్యవస్థకు తేదీలు, సమయాలు, గణాంకాలను నిర్ధారించటం క్లిష్టమైన సమస్యలు.

దానితో ఒకతేదీ నిర్ణయించబడింది. పంజాబ్‌లో 1947 మార్చి ప్రారంభంలో హింస మొదలైంది. ఏ స్త్రీ అయిన 1947 మార్చి 1 తర్వాత వేరే మతానికి చెందిన పురుషునితో సంబంధం వున్నా, కనిపించినా, కలిసి వున్నా ఆ స్త్రీని బలవంతగా ఎత్తుకు పోయారనే భావించటం జరిగడింది.

ఈ తేదీ తర్వాత, జరిగిన అన్ని పెళ్ళిళ్లు, మత మార్పిడులు అన్నీ కూడా నిర్బంధ పూరిత వాతావరణంలోనే జరిగాయని చూడబడింది. అలా వున్న వేటినీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా గుర్తించలేదు. అక్కడ స్త్రీలేం చెబుతున్నారని గానీ, వాళ్ళెంత ప్రతిఘటిస్తున్నారనేది, అది ‘నిజమైన’ సంబంధంగా వున్నా గానీ ఎవ్వరూ పట్టించు కోలేదు. స్త్రీలకు తామే ఈ విషయంలో స్వయంగా నిర్ణయించుకునే ఏ రకమైన అవకాశాన్ని ఇవ్వలేదు. నిర్ణయించిన ఈ తేదీ వెనుక ఎన్నో విషయాలు పరిష్కారమవ కుండానే వుండిపోయాయి. ఈ తేదీ తర్వాత విభిన్న మతాల మిశ్రమంతో పిల్లలకు జన్మనిచ్చిన స్త్రీలు కూడా అపహరణలకు గురైనట్టు భావిస్తారా? లేకపోతే మార్చి 1 తర్వాత జన్మించిన పిల్లలకు కూడా వర్తిసుం దా? ఈ చట్టంపై విషయాలన్నిటి మీదా అస్పష్టం గానే వుండిపోయింది….

…. ఏదీ ఏమైనా ఈ తేదీలను నిర్ణయించటం, చట్టం పనిచేసేలా చూడటం, పట్టించుకోవలసిన ఎన్నో అనూహ్యాంశా లకు దూరంగా అయితే లేదు. చాలా మంది స్త్రీలు ప్రతిఘటించారు. వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళటానికి వ్యతిరేకించారు. జైనబ్‌ లాంటి స్త్రీలు, తమను అపహరించిన లేదా తమని కొనుక్కున్న పురుషులతోనే సంబంధాల్లోకి వెళ్ళటం అసంభవమేమీ కాదు. మొదట్లో, నేనూ దీన్ని నమ్మలేకపోయాను. కానీ దీనిలో ‘తిరకాసు నిజం’ వుంది.

అసంఖ్యాకమైన చాలా మంది భారతీయ స్త్రీలకు అపరిచిత పురుషులతో జరిగే పెళ్ళిళ్ళు కూడా ఒక విధమైన అపహరణ, ఉల్లంఘన, అత్యాచారం లాంటివి గానే చూడాలని ఎవరైనా అనొచ్చు. అప్పుడు కేవలం దీనిని మాత్రమే అత్యాచారంగా ఎందుకు చూడాలి? ‘నన్నెందుకు భారత్‌ తీసుకెళ్ళాలని మీరెందుకింత పట్టుబడుతు న్నారు? మతానికి గానీ, పవిత్రతకి గానీ నాలో ఏం మిగిలి వుందని?’ ‘నేనెందుకు వెనక్కి తిరిగి వెళ్ళాలి/రావాలి’ అని అపహరణ కు గురైన ఒక స్త్రీ ప్రశ్నించింది.

మరొక స్త్రీ ‘నేను నా భర్తను పోగొట్టుకు న్నాను. ఇప్పుడు ఇంకొకరి బాంధవ్యంలోకి వెళ్ళాను. నాకంటూ ఎవ్వరూలేని భారత్‌కి రావాలని మీరు కోరుకుంటున్నారు. నేను ప్రతిరోజూ భర్తలను మారుస్తూ వుండాలని మీరు కోరుకుంటున్నారనుకోను’ అని అడిగి ంది. (కిర్‌పాల్‌ సింగ్‌; ది పార్టిషన్‌ ఆఫ్‌ ది పంజాబ్‌, పబ్లికేషన్స్‌ బ్యూరో, పంజాబ్‌ యూనివర్శిటి, పాటియాలా, 1972, పే. 171)

… వెనక్కి వెళ్ళటానికి స్త్రీలలో వున్న వ్యతిరేకతను అలా వుంచితే (అందరు స్త్రీలు ఇలా వ్యతిరేకించారని చెప్పలేం, చాలా మంది వారి స్వంత కుటుంబాల దగ్గరకు చేరుతున్నామని సంతోషించారు.) వారి మీద చెప్పుకోదగిన స్థాయిలో ఒత్తిడి, కొన్నిసార్లు నిర్భంధంగా కూడా వుండటం వల్లా వారు ఒక ‘ఒప్పుదలకు’ తీసుకురాబడేవారు.

‘… నాకంటూ ఎవ్వరూ లేరు’ చాలా మంది స్త్రీలు తెలుసుకున్న దానికన్నా విస్తృతంగా ఈ వాక్యంలో ఎంతో నిజం వుంది. చాలా మంది తమను ‘రక్షించటానికి’ బలవంతంగా చేసిన ప్రయత్నాలను ఎదిరించ లేకపోయారు. వీళ్ళు భరించరాని ఇంకొక ఆవేదనను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతకు ముందు వీరి గురించి ప్రభుత్వానికి రిపోర్టు చేసి, తమ స్త్రీలను తమకు అప్ప చెప్పవలసిందిగా కోరిన వీరి కుటుంబాలు, ఇప్పుడు వీరు కుటుంబంలోకి రావటానకి ఇష్టపడలేదు. 1948 ప్రారంభంలో పార్టిషన్‌ కౌన్సిల్‌ 16వ సమావేశంలో వారి వారి ప్రాంతాలలో వున్న కాందిశీకుల బాధ్యత ఆయా ప్రభుత్వాలే వహించాలని నిర్ణయిం చటం జరిగింది. అలాగే కాందిశీకులెవరూ కూడా పూర్తి రక్షణ పరిస్థితులు లేకుండా వారి స్వంత ప్రాంతాలకు తిరిగి వెళ్ళాలని బలవంతం చేయకూడదని, అప్పటి వరకూ రాజ్యమే వారి బాధ్యత వహించాలని నిర్ణయించటం కూడా జరిగింది. కానీ స్త్రీల విషయంలో వాళ్ళు ఈ విధంగా చెప్పారు.

‘ది మినిష్ట్రీ ఆఫ్‌ రిలీఫ్‌ అండ్‌ రిహాబిలి టేషన్‌’ వారు రెడ్‌ క్రాస్‌ సంస్థతో కలిసి ఒక నిజ నిర్ధారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేక ఉద్దేశ్యం, అపహరించ బడిన స్త్రీలను వెతికి పట్టుకోవటం….

పాకిస్థాన్‌లో వుంటున్న, అపహరించ బడిన స్త్రీల కోసం 25,000 పైగా విచారణలు మినిస్ట్రీ ఆఫ్‌ రిలీఫ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ స్త్రీల విభాగానికి వచ్చాయి. దాదాపు అప్పటికే 2500 మంది రక్షించబడ్డారు… ఈనాడు మా రెస్క్యూ పార్టీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే, అపహరించబడిన హిందూ స్త్రీలు తమ సమాజం తమను తిరిగి చేర్చుకోదనే భయంతో వున్నారు. దీని గురించి ముస్లింలకు బాగానే తెలిసుండటంతో, దురదృష్టవంతులైన ఈ స్త్రీల ఆలోచనల మీద అదుపు చేస్తూ వున్నారు. దీనితో చాలామం ది స్త్రీలు తాముంటున్న ఈ బందిఖానాల నుంచి బయటపడి ఇండియాకు రావాలంటే విముఖత చూపించారు.

ఇలాంటి సందర్బాలలో రెండు ప్రభుత్వా లు కూడా బలవంతంగానైనా సరే వారికి అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. (పార్టిషన్‌ కౌన్సిల్‌ 16వ సమావేశం, 1948).

బలవంతంగా ఖాళీ చేయించటం ఒక విషయం, కుటుంబాలు స్త్రీలను తిరిగి అంగీకరించటం ఇంకొక విషయం. ఈ స్త్రీలకి కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున విముఖత ఎదురవుతుండటంతో, గాంధీ, నెహ్రూ ఇద్దరూ కూడా ఈ అంశం మీద పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అపహరణ కు గురైన స్త్రీలు ఇప్పటికీ ‘పవిత్రంగానే’ వుంటారని భరోసా ఇచ్చారు…

….ఈ విషయంలో రావణుడి చేత అపహరించబడిన సీత కథను ఉదహరిస్తూ ఎంతో కాలం భర్తకు దూరంగా వున్నప్పటికీ ఆమె ఎంత ‘పవిత్రురాలిగా’ వుందో చెబుతూ వేలాది కరపత్రాలు ప్రచురించబడ్డాయి. వీటన్నింటిలో కూడా, స్త్రీల ‘పవిత్రత’ అనేది భారతదేశంలో హిందువులకు, సిక్కులకు ఎంత ముఖ్యమైనదో చెప్పబడింది. బహుశా హిందూ మతం స్వచ్ఛత, కలుషితం అనే అంశాలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల గావొచ్చు. అదే సమయంలో, అపహరణలకు గురైన ముస్లిం స్త్రీలను ఆ కుటుంబాలు పెద్దగా సమస్య లేకుండానే వెనక్కి తిరిగి తీసుకోవటం జరిగింది. పాకిస్థాన్‌లో అయితే, ఆల్‌ పాకిస్థాన్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌తో పాటు మిగిలిన సంస్థలు, ఇలా రక్షించబడిన చాలా మంది స్త్రీలకు మళ్ళీ పెళ్ళిళ్ళు చేయటానికి ఎంతో కృషి చేశారు. హిందువుల్లో వున్న స్వచ్ఛత అనే బావన వల్ల, పిల్లలున్న స్త్రీల కంటే ఒంటరిగా వున్న స్త్రీని వెనక్కి తీసుకోగలిగారు. పిల్లలుంటే మాత్రం పూర్తిగా అది మరొక కథ అవుతుంది. మతాల మిశ్రమంతో పుట్టిన పిల్లలు, స్త్రీల మీద జరిగిన హింసలకు గుర్తులుగా ఎప్పటికీ మిగిలి వుంటారు. అంతే కాకుండా పరాయి మతానికి చెందిన పురుషునితో లైంగిక సంబంధం కలిగి వున్నారనేది దీని వెనుక దాచేసినా దాగని సత్యం. ‘పిల్లల్ని నీతోనే వుంచుకోవాలను కుంటే వారితోపాటు నీ మిగిలిన జీవితమంతా ఏదన్నా ఆశ్రమంలో గడపాలి. లేదా వారిని వదిలేసి (ఇలాంటి పిల్లలందరినీ అనాథ శరణాలయాల్లో వుంచారు) నీపాత కుటుంబం దగ్గరికి వెళ్ళిపో’ ఇది ఈ స్త్రీలకు ఇవ్వబడిన ఒక అవకాశం. ఇక్కడ ఇంకొక సమస్య కూడా వచ్చింది: అప్పటికే చాలా మంది స్త్రీలు గర్భవతులుగా వున్నారు. ఇలాంటి వారినేం చేయాలి? సంఘ సేవకులు స్పష్టం చేసినదేమంటే, పిల్లలను కనేంతవరకూ ఈ గర్భవతులను ఎక్కడైనా వుంచటం లేద ‘శుభ్రం’ చేయించటం. వేరే మాటల్లో చెప్పాలంటే, సామూహిక గర్భ స్రావాలను నిర్వహించటం. (‘సఫాయి’ (శుభ్రం) చేయటం దీనిపేరు), దానితో ప్రభుత్వం సామూహిక గర్భస్రావాలకు ఆర్థిక సాయాన్ని అందించింది. దీని కోసం ఒక ప్రత్యేకమైన బడ్జెట్‌ను కూడా కేటాయిం చింది. వాస్తవానికి ఆ సమయంలో గర్బ స్రావం అనేది చట్టవిరుద్దం. కానీ ఈ కార్యక్రమంతో చాలా అస్పత్రులు బాగా సంపదను పెంచుకోగలిగాయి.

… దేశ విభజన తర్వాత అపహరించబడిన స్త్రీల కోసం వెతుకులాట తొమ్మిదేళ్ళపాటు జరిగింది. ప్రారంభమైన కొద్ది సంవత్సరాల లోనే వెతికి పట్టుకునే స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి నప్పటికీ ఈ వెతులాట ఐదేళ్ళపాటు కొనసాగింది. రెండు దేశాలలోనూ దాదాపు 30,000 మంది స్త్రీలు దొరికారు. 22,000 మంది ముస్లిం స్త్రీలు ఇండియా నుంచి, 8,000 మంది హిందూ, సిక్కు స్త్రీలు పాకిస్థాన్‌ నుంచి దొరికారు. వీరిలో చాలా మంది, ప్రభుత్వానికి అందచేయబడిన నివేదికల్లో లేరు. కాలం గడిచేకొద్దీ, ఈ వెతుకులాట విధానం మరింత సమస్యాత్మ కంగా మారింది – స్పష్టంగా, బయటకు కనిపించిన పెద్ద సమస్య, స్త్రీలు తమ పిల్లల్ని వదిలిరావటానికి ఇష్టపడకపోవటం. కాలం గడిచే కొద్దీ ఈ కార్యక్రమంలో కీలకపాత్ర వహిస్తున్న సోషల్‌ వర్కర్లలో విభేధాలు పెరగటం మొదలయ్యాయి. ఉదాహరణకు, రామేశ్వరి నెహ్రూ ఈ కార్యక్రమం ముగించాలని సూచిస్తే మృదులా సారాభాయ్‌ కొనసాగించాలని అనుకుంది. 1954లో, జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో, అపహరణకు గురైన వారిని, వారికి ఇష్టం లేకుండా బలవంతంగా వేరే దేశానికి పంపించకూడదని నిర్ణయించారు. ఏ రకమైన ‘బలవంతం’ గానీ, ‘భయం’ గానీ లేకుండా తమ గురించి ఆలోచించుకోవటానికి వీరి కోసం ప్రత్యేకమైన వసతి గృహాలని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే స్త్రీలకు స్వేచ్ఛాపూరిత అవకాశం ఎంతవరకు ఇచ్చారనేది మరో ముఖ్యమైన ప్రశ్న.

అనువాదం: కె. సజయ, (స్తీవాద రాజకీయాలు- వర్తమాన చర్చలు, సంపాదకులు రమా మెల్కోటె, కె. సజయ పుస్తకం నుంచి..)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో