కుంభమేళాలో చిన్న కోడలు (1906)

– బంగ మహిళ (రాజేంద్ర బాలా ఘోష్‌)

బంగ మహిళ గురించిన మరిన్ని వివరాలు: ఇరవయ్యవ శతాబ్దం మొదటి దశకంలోని హిందీ కథా రచయితల్లో బంగ మహిళ ఒక్కతే ఇతరుల రచనల్లోంచి పూర్తిగా కానీ, ఆంశికంగా గానీ ఏమీ దొంగిలించలేదని, ఛాయానువాదం చేసిన రచనల విషయంలో కూడా ఆమె మూల రచయితల పేర్లు ఇచ్చిందని, మూల రచయితలు ఆ రచనలకు పెట్టిన పేర్లలో రవంత కూడా మార్పు చేయలేదని విమర్శకుల అభిప్రాయం. తన సమకాలీక రచయితలు ఇంగ్లీషు నుంచి, బెంగాలీ నుంచి రచనలు దొంగిలించి పైగా దాష్టీకం చూపుతూ ఉండడం చూసి విసుగెత్తిన ఈమె ఇలా రాసింది కూడా, ”మూల రచయిత అనుమతి లేకుండా అనువాదం చేయడం ఆధునిక హిందీ రచయితలకు పట్టుకున్న మందులేని జబ్బులా ఉంది. బెంగాలీ భాష ఖజానాలోంచి దొంగిలించడం ద్వారానే రచయితలుగా చెలామణి కావాలనే వారి ప్రబలమైన కోరిక తీరుతూంది. … నేను కొత్త రచయితలతో వినయపూర్వకంగా నివేదించుకొనేదేమంటే, మీరు మీ మేధో శక్తితో, కల్పనా శక్తితో మీ బాష ఉన్నతి కోసం ప్రయత్నించండి. ఇతరుల సంపదతో అలా చేయడాన్ని గౌరవ ప్రదంగా భావించకండి. (సమాలోచక్‌, ఫిబ్రవరి-మార్చి 1904) ఎందరో పెద్ద పెద్ద హిందీ రచయితలు చేసిన ఇలాంటి గ్రంథ చౌర్యాన్ని వారి పేర్లతో సహా, ప్రమాణాలతో సహా ఆమె ఉదహరించింది. వారి రచనల మూలాలెక్కడ ఉన్నాయో స్పష్టంగా చూపింది. ఈ విధంగా హిందీ సాహిత్య చరిత్ర రాసే వారికి ఆమె ఎంతో ప్రామాణికమైన సమాచారం అందించింది. అయితే ఆ యా రచయితలను అపనిందల పాలు చేయడం ఇష్టంలేకదాన్ని ఎవరూ పట్టించుకోలేదు. మిర్జాపూర్‌ సమీపంలో పండేరా అనే ఊళ్ళో రామనారాయణ మిశ్ర అనే గృహస్తు ఉండేవాడు. చలి కాలం ఉదయం, ఇంటి యజమానురాలు యింటి ముంగిట కూర్చొని ఎండ కాచుకుంటూంది. ఇంటి పనిమనిషి ఆవుకు మేత వేసే పనిలో ఉంది. యజ మానురాలి దగ్గరే ఆమె ఇద్దరు మనవ రాళ్ళు, ఒక మనవడు ఆడుకుంటూ ఉన్నారు. యజమా నురాలు ఒకవైపు న్యాయాధిపతి అయి మధ్య మధ్యలో వాళ్ళ తగాదాలు తీరుస్తూ మరోవైపు మాటిమాటికీ పెద్ద కోడలును తొందరగా వంట చేయమని పురమాయిస్తూ కూడా ఉంది.

వంటింట్లో పెద్ద కోడలు వంట చేస్తూంది. చిన్న కోడలు ఒక పళ్ళెంలో పోసుకొని బియ్యం ఏరుతూంది. పెద్ద కోడలు, చిన్న కోడలు, యిద్దరూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉన్నారు. చిన్న కోడలు అంది, ”అక్కా, ఈసారి కుంభ మేళా చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని అంటున్నారు. మనం కూడా వెళ్ళి స్నానం చేసి వస్తాం పద. ఈసారి తప్పితే మళ్ళీ పండ్రెండేళ్ళ తర్వాతనే ఈ మేళా జరగబోయేది. అప్పటికి రాజెవరో రైతెవరో తెలియదు. ఒకవేళ ఈలోగా నేను చచ్చిపోతే ఇంకేముంది? అంతా ముగిసి పోతుంది. మనసులో కోరిక మనసులోనే ఉండిపోతుంది.”

పెద్ద కోడలు గట్టిగా నిట్టూర్చి ఇలా అంది, ”అయ్యో, ఇది ఎప్పటికైనా అయ్యే పనేనా? మనల్ను ఎవరు తీసుకెళ్తారు? అక్కడ లక్షల మంది చేరతారని విన్నాను. అలాంట ప్పుడు మనం అక్కడికి వెళ్ళి రావడమెంత కష్టమో ఆలోచించావా?”

”అరే, నీవే మనసు విరిగే మాట మాట్లాడితే ఇక వాళ్లతో ఏం చెప్పగలం? మనం వెళ్ళాలనుకున్నది ఒక తీర్థయాత్రకు నీవు గట్టిగా చెప్తే బావగారు తీసుకెళ్లరా? నా మనసు మాత్రం తప్పక తీసుకెళ్తారనే చెబుతూంది. ఎందుకంటే పిలవందే ఎట్లా వెళ్ళాలి? అని ఆలోచించడానికి చుట్టాలింటి కేమీ వెళ్లడం లేదు కదా! ఇక అక్కడికి చేరే గుంపుల గురించి అంటావా?నీవు చెప్పింది నిజమే. కానీ గుంపులు తీర్థస్థానంలో ఉండక మరెక్కడుంటారు? కాశీలో విశ్వేశ్వరాలయం దగ్గర, అన్నపూర్ణ గుడి దగ్గర తక్కువ గుంపులు ఉంటాయంటావా? అయినా దర్శనం చేసుకోడానికి మనమక్కడికి వెళ్ళడం లేదా? అందంతా వదలిపెట్టు. గ్రహణం పట్టినప్పుడు కూడా కోట్ల మంది గుంపు ఉంటుంది కదా అయినా మనం ఎలా స్నానం చేసి వస్తున్నాం?”

తర్కశక్తితో కూడిన ఇలాంటి చిన్న కోడలు మాటలు విని పాపం, పెద్ద కోడలు ఓడిపోయి ఇలా అంది, ”సరేలే తల్లీ, నీవు మా మరిదికి అన్నీ చెప్పి ఒప్పించు. అంతా సరిపోతుంది. బయలుదేరేటప్పుడు నన్ను కూడా వెంట తీసుకుపో. ఇక నేను పప్పుకు తిరుగమూత పెట్టాలి. అయ్యో, నీతో మాటల్లో పడి పప్పులో ఉప్పు వేశానో లేదో మరిచేపోయాను.”

ఇంతలో పనిమనిషి ఒక గంప నిండా పేడ తీసుకొచ్చి అక్కడ నిలిబడి ఇలా అడిగింది, ”ఏమ్మా, అక్కా చెల్లెళ్ళు ఏం సంప్రదింపులు జరుపుతున్నారు? ప్రయాగ కెళ్ళి స్నానం చేసిరావాలని అనుకుంటు న్నారా? అమ్మామ్మా, నేనూ వస్తాను. నన్ను కూడా తీసుకుపొం డమ్మా…” అందుకు కోపగించుకొని చిన్న కోడలు ఇలా అంది, ” చచ్చిందానా, ఎందుకే అంత గట్టిగా అరుస్తావు? నీ గొంతు ఎవరైనా పిసుకుతున్నారా ఏం?” పనిమనిషి గొంతు కొంచెం తగ్గించి బ్రతిమాలుతూ అంది, ”అమ్మామ్మా, ఇక అరవనులే, పోయేట్లయితే నన్ను కూడా తీసుకుపోండమ్మా..” పెద్ద కోడలు అంది, ”నీవెక్కడి పిచ్చిదానివే మొద్దూ! ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది కథ. ఇక్కడ ఎవరు వెళ్తున్నారని? వెళ్ళినప్పుడు చూద్దాంలే పేడబుట్టచంకనెత్తుకొని ఇంకా నిల్చోనే ఉన్నావేం. నుగ్గులు చేయడానికి పోకుండా? పో, పో”. పని మనిషి అక్కడి నుంచి ఎలాగో సాగిపోయింది. కానీ చిన్న కోడలు మనసులో మాత్రం సముద్రంలో పెద్ద అలలు లేచినట్లు అల్లకల్లోలంగా ఉంది. నిన్నటిరోజు ఆమె తన మేనత్త ఇంటికి వెళ్ళి ఉండింది. అక్కడ ఆమె మేనత్త కుటుంబమంతా, వాళ్ల ఇరుగుపొరుగు వాళ్ళంతా కూడా కుంభ మేళాకు వెళ్తున్నట్లు వినింది. ఇంకేముంది? చిన్న కోడలుకు ఇక శాంతి ఎక్కడిది? మనసులో ఉబలాటం విపరీతంగా పెరిగిపోయింది. తనూ అక్కడికి వెళ్ళడానికి ఎన్నో ఉపాయాలు ఆలోచించడం మొదలు పెట్టింది.’ అయ్యో, నేనక్కడికి ఎలా వెళ్ళాలి? అని. ఒక వైపు మంచి మాటలతో ఇంటి వాళ్ళను ఒప్పించడానికి ఉపాయాలు ఆలొచించింది మరోవైపు ఎవరైనా అడ్డం పడతారేమోనని దిగులు పడిపోయింది. ఎవరైనా వద్దంటే మాత్రం చాలా కష్టమైపో తుంది. అలా జరిగితే, కోటి ప్రయత్నాలు చేసినా, మరో పండ్రెండు సంవత్సరాల దాకా కుంభమేళా రాదు. ఆమెను లోలోపలే తినేస్తు న్న అన్నింటికంటే ఎక్కువ బాధ కలిగించే విషయమేమిటంటే, మేనత్త కూతురు, వదినె, ఇద్దరు మేళా నుంచి తిరిగి వచ్చి అక్కడి వింతలు విశేషాలు చెప్పినప్పుడు తను వాళ్ళ ముఖాలు చుసుకుంటూ ఉండాలే, అని.

ఇక అమావాస్య రావడానికి మూడు నాలుగు రోజులే ఉన్నాయి. చిన్న కోడలుకు కుంభ మేళాకు వెళ్ళి స్నానం చేసిరావాలనే ధ్యాస తప్ప వేరే ధ్యాస లేకుండానే పోయింది. ఒడిలో ఒక సంవత్సరం వయసు పిల్లవాడు న్నాడు. పాపం. ఆ పిల్లవాడికిప్పడు సకాలం లోపాలు కూడా దొరకడం లేదు. ఇక వాడి స్నాన పానాల గురించి సంరక్షణ గురించి చెప్పేదేముంది? ఆ రోజు పిల్లవాడి తలకు నూనె, వగైరా పెట్టనే లేదు. కానీ, గబగబా నూనె గిన్నె తీసుకొని అత్త దగ్గరికి వెళ్ళి ఇలా అంది. ”అత్తా, ఈ సంవత్సరం నీకాళ్ళు చాలా ఎక్కువగా పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ కూర్చో, నూనె, మందు రాస్తాను.” విని అత్త అనే దేవత తడబడి మనసులో ఇలా అనుకుంది, ” అరే, ఈ రోజు కోడలు కు ఇంత భక్తి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ రోజు సూర్యుడు పడమర నుంచి ఉదయించలేదు కదా! ఇన్ని రోజులూ, పిలిచినా వచ్చేది కాదు. ఏదో సాకు చెప్పి వెళ్ళిపోతూ ఉండేది. ఈ రోజు ఏమైంది? ఏమైతే ఏముందిలే, మంచిదే కదా! ఇలాంటి అవకాశాన్ని వృథా కానివ్వకూడదు.” అలా అనుకొని ఆమె ఇలా అంది, ”నిజమేనమ్మా, కానీ మీకు ఎప్పుడైనా తీరిక ఉంటే కదా! సరే, రా”. ఇలా అని ఆమె కాళ్ళు బారచాపుకొని కూర్చుంది.

చిన్న కోడలు మెల్లమెల్లగా ఆమె కాళ్ళకు నూనె రాయడం మొదలు పెట్టింది. ఇంతలో ఆమె కుమారుడు ఏడ్వడం మొదలు పెట్టాడు. అత్త చాలాసార్లు చెప్పింది,” ఇక చాల్లే, వెళ్ళు, ముందు బాబును సమదాయి ంచు, తర్వాత ఈ పని చేయవచ్చు.” కానీ చిన్న కోడలు ఆమె మాట వినిపించుకోలేదు. ఆమె కాళ్ళు పిసుకుతూనే ఉండిపోయింది. తర్వాత ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ ఆమె ఇలా అడిగింది,

ఏమత్తా, నీవెప్పడైనా కుంభమేళా సమయంలో స్నానం చేయడానికి వెళ్ళావా లేదా?” లేదమ్మా, స్నానం లేదు, పానం లేదు. మీ మామకు ఇలాంటివి నచ్చనే నచ్చవు. ‘మనసు నిర్మలంగా ఉంటే అన్నితీర్థ స్నానాలూ చేసినట్లే.’ అని అంటాడు. ఎప్పుడూ ఇంట్లో కూర్చొని రామ నామం జపిస్తుండాలి అంతే. ఒకసారి అతి కష్టం మీద మా వదినెతో పాటు ప్రయాగకు వెళ్ళాను. అయితే మేళా సమయంలో కాదు.”

”పోనీ, ఈసారి వెళ్ళి స్నానం చేసి రా రాదూ? పోతూ మమ్మలను కూడా వెంట తీసుకొని పో”.

”అయ్యో, తల్లీ, మనలనెవ్వరు తీసుకెళ్తారే? మీ మామకు ఆయాసం వస్తుంది. ఈ చలిలో ఆయన బయలుదేరడం జరిగే పని కాదు. హరనారాయణ (పెద్ద కొడుకు) ఇంట్లో లేనే లేడు. ఉండినా వాడికి సెలవు ఎక్కడ దొరకుతుంది? ఇక శివనా రాయణ (చిన్న కొడుకు) అంటావా? వాడు ఇంగ్లీషు చదువుకొని పూర్తిగా క్రిశ్చియనే అయిపోయాడు. రాత్రింబవళ్ళు దేవతలను, పితరులను పొయ్యిలోనో, కుంపట్లోనో పారేస్తుంటాడు”

ఇంతలో రామనారాయణ మిశ్రాగారు మనవరాలు చెయ్యి పట్టుకొని అక్కడికి వచ్చారు. కోడలు అత్తకు సేవ చేస్తూండడం చూసి నవ్వుతూ ఇలా అన్నారు, ”అహా, నీకింతగా సేవ చేయడం జరుగుతూంది, అయినా నీవేమో నా మంచి చెడ్డలు పట్టించుకొనే వాళ్ళెవరూ లేరని అంగలార్చుతూ ఉంటావు.”

అందుకు ఆయన భార్య ఇలా అంది, ”అదేం కాదులే, విన్నావా? చిన్న కోడలు ప్రయాగ వెళ్తే బాగుంటుందని అంటూంది.”

”ప్రయోగా! కుంభ మేళా లోనా!! రామ రామ !!! మనలాంటి ఇళ్ళలోని ఆడవాళ్ళకు సాధ్యమయ్యే పని కాదది.”

మామగారు అలా అనడం విని చిన్న కోడలు మనసులో చాలా నొచ్చుకుంది. త్వరత్వరగా పని ముగించుకొని తన గదిలోకి దూరిపోయింది. అక్కడ భర్తగారితో ఏమేమి మాట్లాడిందో అది నాకు తెలియదు. కానీ ఆమె సహవాసకత్తెల ద్వారా తెలిసిందే మిటంటే, విసుక్కున్న శివనారాయణ చివరకు ”కుంభ మేళా, కుంభ మేళా అంటూ నా తల తినేస్తున్నావు. కుంభకర్ణుని ప్రేతాత్మ నీ తలపైకి ఎలా వచ్చి కూర్చుందో నాకు తెలియకుండా ఉంది. అంతగా వెళ్ళాలను కుంటే మీ అన్నతో పాటు వెళ్ళిపో. నా ప్రాణం తీయొద్దు. సరే పో, అక్కడ ఆ చలిలో పిల్లవాణ్ణి చంపేయాలని ఉంటే చంపేయ్‌” అని అన్నాడని.

”మునుపు పోయిన పిల్లవాడు మీ ఇంట్లోనే పోయాడు కదా, అప్పుడు నేను వాణ్ని ఎక్కడికైనా తీసుకెళ్ళానా? చావు అనేది వస్తే దాన్ని ఎవరూ ఆపలేరనేది సత్యం”.

చివరకు చిన్న కోడలు మేనత్త, ఆమె కుమారుడు ఇద్దరు ఎంతగానో బ్రతిమలాడిన తర్వాత అతి కష్టం మీద ఇంట్లోవాళ్ళు చిన్న కోడలును వాళ్ళతో పాటు ప్రయాగకు పంపడానికి సమ్మతించారు. ఇక చిన్న కోడలు సంతోషానికి అవధులు లేవు. హడా వుడిగా కొంచెం వంట చేసి, సామాను సర్దుకొని, మూట, ముల్లె సర్దుకొని, బయలు దేరడానికి సిద్ధమైంది. ఆమె మేనత్త కుమారుడు శంకరదయాల్‌ ఆమెను తీసుకొని పోవడానికి వచ్చాడు. చిన్న కోడలు ఇంట్లో అందరితో వీడ్కోలు తీసుకుంటున్న సమయంలో పెద్ద కోడలు ఇలా అంది, ”చూశావా, నీవేమోపుణ్యం సంపాదించు కునేందుకు వెళ్తున్నావు. మేమేమో ఎక్కడివాళ్ళమక్కడే పడి ఉండిపోయాం. వెళ్ళిరా, క్షేమంగా వెళ్ళిరా”. అత్తగారూ లల్లూ (చిన్న కోడలు కుమారుడు)ను చంకకెత్తుకొని ముద్దాడుతూంది. ఆమె చిన్న కుమారుడు శివనారాయణ కోసం అందరూ వెదికారు. కానీ అతడెక్కడా కనిపించలేదు. అప్పడామె శంకర దయాల్‌తో ఇలా అంది, ” చూడు నాయనా, నీపైన నమ్మకం ఉండబట్టి కోడలిని పోనిస్తున్నా. ఈ పిల్లవాణ్ణి జాగ్రత్తగా చూసుకొనే బాధ్యత నీపైనే ఉంది. నా లల్లూకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు.”

”ఏమీ పరవా లేదమ్మా, మీరు నిశ్చింతగా ఉండండి. దేన్ని గురించి ఏమీ చింత పెట్టుకోకండి. అందరినీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాను. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ వెళ్తున్నారు కదా! దేవుని దయవల్ల, మీ ఆశీర్వాదం వల్ల మేమందరం క్షేమంగా తిరిగి వస్తాం.”

చిన్న కోడలు వెళ్ళి జట్కా బండిలో కూర్చుంది. ఆమె అత్తగారు మనవణ్ణి ముద్దాడి వాణ్ణి కోడలి ఒడిలో కూర్చో పెడుతూంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. కరుణార్ధ్ర స్వరంతో ఆమె ఇలా అంది, ”ఏ రోజైతే లల్లూ పుట్టాడో, ఆ రోజు నుంచి ఎప్పుడూ నా దగ్గరే ఉంటూ వచ్చాడు. ఈ రోజు మొదటి రోజు, వాడు నా ఎదుటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం చూడు శంకర్‌, జాగ్రత్తగా ఉండాలి మరి!”

చిన్న కోడలు వెళ్ళిపోయింది. కానీ పాపం పని మనిషి అదంతా చూస్తూనే ఉండిపోయింది. చిన్న కోడలు ఆ రాత్రి మేనత్త ఇంట్లోనే ఉండిపోయింది. మరుసటి రోజు అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు.

మిర్జాపూర్‌ రైల్వే స్టేషన్‌ వెయింటి ంగు రూములోను, ప్లాటుఫార్మ్‌ పైనా, చాలా రద్దీగా ఉంది. ఎటు చూసినా మానవ శిరస్సు లే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మూటెలు, ముల్లెలు, సామాన్లు గుట్టలుగా పడి ఉన్నాయి. సమయానికి రైలు తన విశాలకాయంతో వచ్చి నిలబడింది. శంకర దయాల్‌ చాలా జాగ్రత్తగా అందరినీ తీసుకెళ్ళి రైల్లో కూర్చో పెట్టాడు. వాళ్లతో పాటు భోజన ప్రియుడైన ఒక బ్రాహ్మణ దేవుడు కూడా ఉన్నాడు. యాత్రలో వారికి సహాయంగా ఉండడానికి ఆయన మూట, ముల్లె, తట్టా బుట్టా అన్నీ మోసుకెళ్ళి బండిలో పెట్టేశాడు. రైలు బయలు దేరడంలో ఇంకా కొంచెం సమయం ఉంది. శంకర దయాల్‌ లల్లూను ఎత్తుకొని ప్లాట్‌ ఫార్మ్‌ పైన నిల్చొని ఉన్నాడు. ఇంతలోనే శివనారాయణ పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. శంకర దయాల్‌ ఆశ్చర్యం తో అడిగాడు. ”నీవెక్కడి నుంచి ఊడిప డ్డావు?” శివనారాయణ అన్నాడు. ”లల్లూ నీతోపాటు వచ్చినప్పుడు నేనింట్లో లేను వచ్చిం తర్వాత తెలిసింది మీరందరూ వచ్చేశారని లల్లూను చూడాలనిపించి ఉదయం లేవగానే వాణ్ణి చూడడానికి స్టేషనుకు వచ్చేశాను.”

తండ్రిని చూసి లల్లూ గంతులేశాడు. సంతోషం పట్టలేక తండ్రి మెడకు కరుచుకు న్నాడు. ఇంతలో మొదటి గంట మ్రోగింది. శివనారాయణ శంకరదయాల్‌ వైపు ‘చిన్న కోడలు వైపు చూస్తూ ఇలా అన్నాడు. ”మీరందరూ వసతిగా కూర్చున్నారు కదా? ఇక అందరికీ నా నమస్కారం. లల్లూ, ఇక నీవు మీ మామ దగ్గరికి వెళ్ళిపో”.

లల్లూ తండ్రిని ఎందుకు వదిలి పెడతాడు? వాడు పెద్దగా ఏడ్వడం మొదలు పెట్టాడు. శంకర దయాల్‌ నవ్వుతూ శివ నారాయణతో అన్నాడు.” ఇంత గాభరా గాభరాగా నీవిక్కడికి రావడం చూసి ఎవరో హంతకుణ్ణి అరెస్ట్‌ చేయడానికి వస్తున్నా వేమో అని అనుకున్నాను. చివరకు నీవు ఇక్కడ మాకు ఇదిగో వీడితో తంటా తెచ్చి పెట్టావు. రా నాయనా లల్లూ, నా దగ్గరికి రా ఈయన్ను పోనీ, నేను నీకు మిఠాయి ఇస్తాను.”

తండ్రి-కొడుకులు ఒకరిపైఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉండగానే రైలు రాక్షసి కూత పెట్టింది. ఇంతలో వెంట వచ్చిన బ్రాహ్మ ణ దేవుడు వేగిరపాటుతో శివనారాయణతో ఇలా అన్నాడు. ”అన్నన్నా, తొందరలో నేను శంకర దయాల్‌ ఇంట్లో పూజా సామాగ్రి ఒక గిన్నెలో ఇంత మిఠాయి, కొంచెం పెరుగు మరి చిపోయి వచ్చాను. పోయి అది మా అమ్మకు ఊరికి తప్పక పంపించు. లేకుంటే చెడిపోతుంది.”.

అగ్గి తింటూ, నీళ్ళు తాగుతూ, పొగెగజిమ్ముతూ, రైలు దడబడ శబ్దం చేస్తూ పరిగెత్తింది. ప్రపంచపు అనిత్యతకు సజీవ నిదర్శన చూపించిపోతున్నట్లుగా. ఎక్కడైతే కొంచెం సేపు ముందు అంత కోలహలం వ్యాపించి ఉండిందో, అంత సందడి ఉండిం దో, అక్కడ ఇప్పుడు పూర్తి నిశ్శబ్దం రాజ్యమేలింది. ఇక చిన్న కోడలు విశ్రాంతిగా కూర్చొని తన అక్క రామదేవితో ఇలా అంది. ”రైల్లో చాలా రద్దీగా ఉంటుంది కూర్చోడానికి కూడా చోటు మీకు చాలా కష్టపడితే గాని చిక్కదు. అని అందరూ భయపెట్టె వాళ్ళు, అదంతా వట్టిదేనన్న మాట. అందరికీ ఇదొక సాకు మాత్రమే. నన్ను పోకుండా ఆపడానికి. మా అత్త మహాతల్లి చూడడానికి అమాయక ంగా కనిపిస్తుంది. కానీ చాలా మాయల మారిది. చెడుబుద్ది ఆమె నరసరం లో ఉంది. ఆమె జీవితమంతా బీగాలు, బీగం చెవులూ జాగ్రత్త చేయడంలోను, మా పెద్ద తోడుకోడలు జీవితం వంటా వార్పు, చూసుకోవడంలోనూ గడిచిపోతుంది. వీళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళరు. దానం, ధర్మం, పూజ పునస్కారాలు తాము చేయరు. వేరే వాళ్ళను చేయనివ్వరు. వాళ్ళకు ఇదంతా నచ్చనే నచ్చదు!”

ఈ రోజు అమావాస్య ప్రయాగలో త్రివేణి ఒడ్డున ఈ రొజొక అపూర్వమైన దృశ్యం కనిపిస్తుంది. మర్యాదా పురుషోత్తము డు రాముడు వనవాసానికి బయలుదేరిన ప్పుడు మొట్టమొదటగా ఇక్కడే బస చేసిన మాట నిజమైతే, అందువల్లనే కదా ఈ స్థలం మహిమ ఇంత గొప్పగా చెప్పబడుతూంది? అందువల్లనే కదా, ఈ ప్రయాగ హిందువులు గా పుట్టినవారి పవిత్రమైన నోళ్ళ ద్వారా ‘తీర్థరాజు’ అని పిలువబడుతూంది? హిందూ ప్రజలారా! మీరు నిజంగా ధన్యులు! మీ ఈ దృఢమైన మతవిశ్వాసం ధన్యమైంది! ఏ వేళలో అయితే ఇతర మతావలంబులకు రజాయిలో నుంచి ముఖం బయట పెట్టడం కడు కష్టమనిపిస్తుందో, ఆ వేళ నుంచి సూర్యాస్తమయం దాకా మంచు కంటే కూడా చల్లని నీళ్ళల్లో ఆబాల వృద్ధులు, స్త్రీలు అందరూ సంతోషంతో ఆనందంగా మునక లు వేస్తూ ఉంటారు. హిందూ జాతి ధన్యమైం ది! హిందూ సంప్రదాయం ధన్యమైంది! ఈ హిందూ ధర్మమా, నీ పవిత్రచరణాల్లో క్షుద్రురాలైన ఈ రచయిత్రి ఒకసారి కాదు, నూరు సార్లు కాదు, వెయ్యి సార్లు కాదు, కోటిసార్లు ఆదరపూర్వకంగా ప్రణమిల్లు తూంది. హిందూ సోదరులారా! మీ దగ్గర ఇక వేరే బలం ఏదీ లేదు. కేవలం ధర్మబలం మాత్రమే ఉంది. భగవంతుడు మీ ఈ ధర్మ బలాన్ని చెక్కు చెదరకుండా ఉంచుగాక! ఈ దాసి మనసారా కోరుకునేది అదే.

ఇక త్రివేణి ఒడ్డున ఉన్న ఇసుక కూడా సజీవ రూపం పొందినట్లుంది. దరిద్ర భారతవాసులు పాపం, ఎంత ఆనందంగా త్రివేణిలో స్నానం చేసి అక్షయమైన పుణ్యం మూట కట్టుకుంటున్నారు? కొందరి దగ్గర ఒళ్ళు దాచుకోడానికి ఒక బట్ట ఉంటే, కొందరి దగ్గర అది కూడా లేదు. కొందరి దగ్గర కడుపు నిండా తినడానికి ఉంటే, కొందరి దగ్గర అది కూడా లేదు. అయినా, ఇప్పుడు ఈ పవిత్ర భూమిలో అందరూ సమభావంతో ఆనందం అనుభవిస్తున్నారు!

అసంఖ్యాకమైన ఈ మానవ సందో హంలోనే మునుపు మనకు పరిచయ మైన చిన్న కోడలు కూడా కనిపించింది. ఆనకట్ట క్రింద, రద్దీ కొంచెం తక్కువగా ఉన్న చోట అన్న, వదినె, ఆడ పడచు, మేనత్తతో సహా, లల్లూను ఎత్తుకొని ఆమె నిలబడి ఉంది. ఆమె శంకరదయాల్‌తో ఇలా అంది.” అన్నా, ఈ రోజు లల్లూ ఇంత వరకు ఏమీ తినలేదు. వీనికోసం ఏదో ఒకటి తీసుకురా. ”శంకర్‌ దయాల్‌, ”సరే, ఉండు, ఇప్పుడే తెస్తాను” అంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో విశాలకాయం కలిగిన ఒక ఏనుగుకు ఎందుకోగాని పిచ్చి రేగింది. దానికి పిచ్చి రేగడంతోటే, మేళా అంతటా కలకలం వ్యాపించింది. శంకర దయాల్‌ లల్లూను ఎత్తుకొని చేతనైనంత వరకు అందరినీ సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నించ సాగాడు. గుంపులో నుంచి వచ్చిన ఒక తోపుతో శంకరదయాల్‌ అమ్మ బోర్లా పడిపోవడంతో ఆమె మోకాలికి పెద్ద దెబ్బ తగిలింది. శంకర దయాల్‌ లల్లూను చిన్న కోడలు చేతికిచ్చి తాను అమ్మకు పరిచర్యలు చేయడం మొదలు పెట్టాడు.

ఇంతలో పోలీసులు సాధువుల అఖాడా స్నానం చేసి వెళ్ళిపోవడంతో సామాన్య ప్రజలు స్నానం చేయడానికి దారి (ఇంతవరకు మూసి ఉండిన దారిని) తెరిచేశారు. ఇంకేముంది? జనసందోహమనే మహా సముద్రంలోతుఫాను చెలరేగినట్లైంది. అందరి మనసుల్లో అందరి కంటే ముందు మేమే గంగలో మునిగి పుణ్యరాసులు కొల్లగొట్టాలనే కోరిక తరంగంలా ఉవ్వెత్తున లేచింది. తుపాను చెలరేగినట్లు ఒకరి మీద ఒకరు పడసాగారు. ఆ తోపులాటలో చిన్న కోడలు తన తోటివారికి దూరమైపోయింది. గుంపులో చిక్కకుపోయిన ఆమె ఒకసారి పది అడుగులు ముందుకు వెళ్ళిపోతే. మరోసారి పది అడుగులు వెనక్కు వెళ్ళిపోయింది. పాపం ఇప్పుడామె పరిస్థితి చాలా దయనీయంగా తయారయింది. ఇంతలో ఒక పెద్ద తోపు రావడంతో లల్లూ ఆమె చేతుల్లో నుంచి విడిపడి దూరంగా పడిపోయాడు. చిన్న కోడలు గట్టిగా ఏడ్వడం మొదలు పెట్టింది. పిల్లవాణ్ణి ఎత్తి పక్కన పెట్టమని దీనంగా అందరినీ ప్రార్థించడం మొదలుపెట్టింది. సారి సారికీ ద్రౌపతిలాగా ”అన్న, అన్నా,” అంటూ వేడుకోవడం మొదలు పెట్టింది. కానీ నగాడాలు మ్రోగుతున్న చోట పిచ్చుక ఆక్రందనలు ఎవరు వింటారు? ఆ అసహయురాలు, ఆ దీనురాలు, ఆ అబల మొర ఎవరూ ఆలకించనప్పుడు ఇక ఆమే స్వయంగా పిల్లవాణ్ణి ఎత్తుకోడానికి వంగింది. వంగడంలో బోర్లా పడిపోయింది. అలా మనుషుల మధ్య క్రిందపడిపోయి కొద్దిగా తల ఎత్తడం కూడా పెద్ద పెద్ద పరాక్రమవంతులైన పురుషులకు కూడా సాధ్యం కాదు. అలాంటప్పుడు పాపం, ఆ అసహాయురాలు ఏం చేయగలుగుతుంది? బాధాకరమైన, కరుణోత్పాదకమైన ఆ దృశ్యాన్ని వర్ణించడం నా కలానికి శక్తికి మించిన పని. సహృదయులైన పాఠకులు, పాఠకురాండ్రు తమంత తామే దీన్ని తెలుసుకోగలరు.

ఇటు శంకర దయాల్‌ చాలా దుస్థితికి గురి అయ్యాడు. స్నానం, సంధ్య అటుంచి, తిండీ తిప్పలు మరిచి దినమంతా అందరినీ వెదకడంలో పడిపోయాడు. మధ్యాహ్నం తర్వాత రామదేఈ, అతని భార్య, ఇద్దరూ ఏడుస్తూ మొత్తుకుంటూ, కోట క్రింద కనిపించారు. తల్లి రామదేఈ మెడలోంచి ముత్యాలహారం ఎక్కడ పడిపోయిందో, అంతుచిక్కలేదు. అతని భార్య ముక్కు పుడక ముక్కులోంచి మాయమైంది. దాంతోపాటు ముక్కు బాగం కూడా కొంత మాయమైపో యింది. ఆమె శూర్పణఖ ట్రూ కాపీగా మారిందా, అనిపించేట్లు తయారయింది. ఒంటిపైని బట్ట రక్తంతో తడిసిపోయింది. అక్కడ గుడిసెలో పడి ఉండిన తల్లి అరిచి అరిచి చెబుతూంది. ”నాయనా, ఎలాగో ఒకలాగు అందరము ఒక చోటికి చేరాం మరి చిన్న కోడలు ఎక్కడుందో, ఏమైందో, తెలియడం లేదు. మనతో వచ్చిన బ్రాహ్మణ మహాశయుడు మూటలు, పెట్టెలు దించడ ంలో ఎక్కించడంలోనేమో చాలా హుషారు చూపించాడు, ఇప్పుడు మాత్రం కడుపులో పుట్టిన అగ్గిని చల్లార్చుకోడానికి ముఖం చాటు చేసుకుని గప్‌చిప్‌గా ఎకడో కూర్చుని ఉన్నట్లున్నాడు చివరకు అతడు హల్వా పూరీల రాయుడుగానే తేలిపోయాడు కదా!”

ఇక చిన్న కోడలు ఏమయిందో అని శంకర్‌ దయాల్‌ చాలా భయపడిపోయాడు. ఇలా ఆలోచించాడు, ”శివనారాయణ, ఆయన ఇంట్లో వాళ్ళు వింటే ఏమనుకుం టారు? అయ్యో నేనిప్పుడు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఎదుటుకి పోగలను? వెళ్ళడానికి నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ‘నీవేమో సలక్షణంగా తిరిగి వచ్చావు. మరి మా కోడలిని ఎక్కడ వదిలిపెట్టి వచ్చావు” అని వాళ్ళు అడగరా? అప్పుడు నేనేమని జవాబు ఇవ్వగలను? మేము ఆమెను పరాయి దాన్నిగా భావించి వేరు పడిపోయినప్పుడు ఆమె కోసం మేము ఎక్కువగా వెదికి ఉండమనే వాళ్ళంతా భావిస్తారు. ”ఓ దేవుడా! నేనేపాపం చేశానని, నా తలపైన ఇంత పెద్ద కళంక భారం ఉంచబడుతూంది? అయ్యో! ఆడవాళ్ళ మాటలు విని నేనెంతటి దురవస్థ అనుభవించవలసి వచ్చింది? మృత్యువు వచ్చి నన్ను తన ఒడిలోకి తీసుకుంటే ఎంత బాగుండును? నేనిప్పుడు ఎక్కడికెళ్ళాలి? ఎక్కడ వెదకాలి? ఎక్కడకూడా ఆమె జాడ తెలియడం లేదే!” అని ఆలోచించడం ఆరంభించాడు.

ఈ విధంగా బాధాతప్త హృదయంతో పిచ్చివాడిలాగా అతడు ఒక్కో చోటికి పది పది సార్లు వెళ్ళి వెదికాడు. ఒకసారి త్రివేణి ఒడ్డుకు వెళ్లి వెదికితే, మరోసారి గుడిసెల లోపలికి వెళ్ళి వెదికాడు, ఒకసారి శవాల గుట్టల్లో వెదికితే, మరోసారి పోలీసులు వాళ్ల దగ్గర వెదికాడు. చివరకు ఒక ముసలావిడ ద్వారా ఆమె జాడ తెలిసింది. ఎక్కువగా గాయపడినం దువల్ల పోలీసువాళ్ళు చిన్న కోడలును ఆసుపత్రికి పంపించారని ఆమె చెప్పింది. విన్న వెంటనే శంకర దయాల్‌ పరుగు పరుగున అక్కడికి వెళ్ళగానే చిన్న కోడలు ఒక మంచం మీద పడుకొని కనిపించింది. ఎవరో రాతితో పొడిచినట్లు ఆమె రొమ్ముపైన లోతైన గాయం అయింది. శంకర దయాల్‌ను చూడగానే ఆమె గాయం తగిలిన రొమ్ము కొట్టుకుంటూ ”నా లల్లూ, నా లల్లూ!” అంటూ పెద్దగా ఏడ్వడం మొదలు పెట్టింది.

”అన్నా, అన్నా, నీవు నా లల్లూను తెచ్చి ఇవ్వు, అయ్యో, నా లల్లూ ఇంతదాకా ఏమి తిని ఉండడు. వెళ్ళు, త్వరగా వెళ్ళి వాణ్ణి తీసుకురా. వానికి నేను తినిపిస్తాను. చీకటి పడుతూంది. లల్లూ రాత్రికి ఎవరి దగ్గర పడుకుంటాడు? నేను ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోను? లల్లూను చేతుల్లోకి తీసుకోడానికి అత్త ఎదురుగా వచ్చినప్పుడు నేనేమని చెప్పాలి? అన్నా, ఇంకోసారి వెళ్ళి వాణ్ణి వెదుకు. ఇక్కడో, అక్కడొ, ఎక్కడో ఒక చోట పడిపోయి ఉంటాడు. ఎత్తుకొని రా వెంటనే”.

ఓ అభాగ్యురాలైన చిన్న కోడలా! ఇప్పుడు ఈ భూ ప్రపంచంలో నీ పిల్లవాడి గుర్తు ఒక్కటి కూడా లేదు. వెన్న లాంటి వాడి కోమలమైన శరీరం లక్షల మంది మనుషుల కాళ్ళ క్రింద పడి పచ్చడి అయిపోయింది!

శోక సంతప్తురాలైన ఆ తల్లి వేదనను గురించి, హృదయ విదారకమైన ఆమె ఆక్రందనల గురించి రాసే శక్తి నిష్ప్రాణమైన ఈ కలానికి లేదు. ఈ కథ చదువుతున్న పాఠకుల్లో పాఠకురాండ్రలో ఎవరైనా కరుణోత్పాదకమైన ఈ దృశ్యాన్ని కళ్ళారా చూచి ఉంటే, వాళ్ళే పుత్ర శోకంతో రోదిస్తున్న ఈ తల్లి హృదయం లోని శోకాన్ని కొంత వరకు అర్థం చేసుకోగలుగుతారు.

ఏడ్చి ఏడ్చి చిన్న కోడలుకు రక్తపు వాంతులు కావడం మొదలైంది. కొంచెం సేపు తర్వాత ఆమె మూర్ఛపోయింది.

మరుసటి రోజు టెలిగ్రామ్‌ అందు కొని శివ నారాయణ ప్రయాగ చేరాడు.అ క్కడ ఈ దారుణమైన సంఘటన గురించి విని మొదట అతడు చాలా ఏడ్చాడు. చిన్న కోడలు కూడా అతన్ని చూడగానే ముఖం చాటు చేసుకొని పెద్దగా రోదించింది. కొంత సేపటి తర్వాత శివనారాయణ శంకర దయాల్‌తో ఇలా అన్నాడు. ”పుణ్య ఫలం మనకు క్షణం ఆలస్యం కాకుండా లభించింది. ఇక ఏదో విధంగా ఈమెను ఇంటికి తీసుకుపోయే ఏర్పాటు చేయాలి. చిన్న కోడలు ఏడుస్తూ ఇలా అంది. ”నేనిక ఇంటికి రాను, నా లల్లూ దగ్గరికే వెళ్ళిపోతాను”.

చిన్న కోడలిను చూసినప్పుడు త్వరలోనే భగవంతుడు ఆమెను లల్లూ వద్దకు పంపిస్తాడనే అనిపించింది.

ఈ కథ ‘సరస్వతి’ అనే ప్రసిద్ధ హిందీ సాహిత్య మాసపత్రికలో 1906లో వచ్చింది. ఈ కథలోని ట్రీట్‌మెంట్‌, శిల్పం, వస్తువు అన్నీ హిందీ సాహిత్యంలో ఆ కాలాన్ని అతిక్రమించి నవిగా ఉన్నాయని విమర్శకుల అభిప్రాయం. హిందీ కథా సాహిత్యంలో ఇరవయ్యవ శతాబ్దం, మొదటి దశకంలో వచ్చిన ఏ కథ కూడా ‘కుంభ మేళాలో చిన్న కోడలు’లాగా సామాజిక యథార్ధాన్ని ప్రతిబింబించ లేదు. ఇందులో రచయిత్రి బంగ మహిళ నివసించిన ‘పడరా’ అనే ఊరి వాతావరణం, మిర్జాపురీ మాండలికంలోని సహజత, ప్రాంతీయ సామెతల, నానుడుల చతుర్కారాలు, సంప్రదా యవాదుల నిరర్థకమైన నమ్మకాల ప్రతి ఘటన, ధార్మిక అంధత్వాన్ని నివారించాలనే తపన, వీటన్నింటి ప్రభావాన్ని మానవీయ కరణతో జోడించే కళ, ఇవన్నీ అకాలం నాటి కథల్లో ఎక్కడా కనిపించవు. ఆ నాడే ఆమె కుంభమేళాలో స్నానాలు లాంటివి వ్యర్థమని గట్టిగా చెప్పి, వీటిని గురించి వివేకంతో ఆలోచించమని చెప్పింది. మన గుడుల దగ్గర తొక్కిసలాటల్లో జరిగే దారుణాల సందర్భంలో, ముఖ్యంగా మొన్న మధ్యప్రదేశ్‌లో ఒక గుడి దగ్గర జరిగిన తొక్కిసలాట సందర్భంలో ఈ కథ మరింత ప్రాసంగికతను సంతరించు కుందని నా అభిప్రాయం.

– జె.ఎల్‌.రెడ్డి, న్యూఢిల్లీ.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో