శరత్‌ ‘బిందుగారబ్బాయి’ నవలలో ‘మాతృహృదయం’ 31

– చింతనూరి కృష్ణమూరి 

బెంగాలీ సాహిత్యంలో బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ల వారసత్వాన్ని పునికిపుచ్చుకొని గద్యరచనలో వాస్తవిక వాదంతో వారిని మించిన వాడయ్యాడు శరత్‌. పాండిత్యప్రకర్షలేని రచనా, వాడుకలో ఉన్నభాష, పలుకుబళ్ళూ ఈయనను సాధారణ బెంగాలీపాఠకులకు దగ్గర చేశాయి. అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ సాహిత్య సృజన చేసిన శరత్‌ బెంగాలీల స్వభావం హృదయ స్పందనలే కథావస్తువుగా గ్రహించారు. జీవితంలో మంచీ, చెడు రెండూ ఉంటాయని చెప్తూ చెడును కూడా స్పృశిస్తూ మంచిని, ఉదాత్తభావాలను ఉన్నత శిఖరాలవైపు తీసుకువెళ్ళాలనేది ఈయన రచనల్లో అత్యత్సాహంగా కన్పిస్తుంది. శరత్‌ రచించిన 17 నవలికలూ, 13 నవలలూ, 17 కథలు అనేక వ్యాసాలలో స్త్రీలను అన్ని కోణాల నుంచి స్పృశించాడు. ఇతను సృష్టించిన స్త్రీ పాత్రలలోని స్వభావాలు తెలుగు పాఠకులనూ, ప్రధానంగా స్త్రీలను విశేషంగా ఆకర్షించాయి. అందుకే ఈయన తెలుగు పాఠకులకు అత్యంత ఆదరణీయ రచయిత కాగలిగాడు.

శరత్‌ రచనలు పలువురు రచయితలు అనువదించినప్పటికీ బొందులపాటి శివరామకృష్ణగారి అనువాదం సరళంగాను, సూటిగానూ మూల విధేయంగానూ కన్పిస్తుంది. ఈయన రచనలు చదివిన ప్రతి తెలుగు వాడి హృదయంలో అభిమాన రచ యితగా భద్రపీఠం వేసుకున్నారు. ‘బిందుగా రబ్బాయి’ అనే ఈ నవలిక యందు మాతృ హృదయం యొక్క గొప్పతనాన్ని, తన పుత్రుని యొక్క వృద్ధికోసం తల్లిపడిన ఆవేదనను ఉత్కృష్టముగా ఆవిష్కరించినాడు శరత్‌.

ఈ నవలిక యందు ముఖ్యపాత్ర అసాధారణ సౌందర్యవతి, లక్ష్మీస్వరూపిని అయిన ‘బిందువాసిని’. ఈమె భర్త మాధవుడు, భావ యాదవుడు, యాదవుని భార్య అన్నపూర్ణ, వీరి సంతానం అమూల్యచరణుడు, వీరి దగ్గరి చుట్టమయిన ఎలకేసి, ఎలకేసి కుమారుడు నరేంద్రుడు లను రచయిత ముఖ్యపాత్రలుగా మలచడం జరిగింది.

యాదవుడు పేదవాడైనప్పటికి చాలా కష్టపడి తమ్ముడిని బి.ఎల్‌ దాకా చదివించాడు. అంతేకాక ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక మహాధనికుని కూతురైన బిందువాసినిని తనకు మరదలుగా తెచ్చుకో గలిగాడు. ఈమె అత్తగారింటికి వస్తూ పదివేల రూపాయలు కట్నం తీసుకొచ్చింది. కానీ ఈమె కట్నానికి నాలుగురేట్లు అహంకారము, ఆత్మాభిమానంలతో మూర్చ రోగాన్ని కూడా అంటిపెట్టుకు వచ్చిందని పలువురు అభిప్రాయ పడ్డారు. యాదవుడు మాత్రం అందరికి భిన్నంగా తన మరదలు ధాత్రీ స్వరూపిణీ అని కొద్ది రోజుల్లో అందరు గ్రహిస్తారని. ఆమె అందం నిష్ఫలం కాదని ఆమెలోని సుగుణాలను గుర్తించాను కనుకనే తన ఇంటికి చిన్న కోడలుగా తీసుకొచ్చానని అనుకున్నాడు.

మెట్టినింటిలో బిందువాసిని మూర్ఛ రోగాన్ని చూచి ఇంటిల్లిపాది గజగజలాడే వారు. ఒక మారు ఈమెకు మూర్ఛ వచ్చిన సందర్భంలో భయపడిపోయిన తోటికోడలు అన్నపూర్ణ ఎటూ తోచక సంవత్సరం వయసుకల తన బిడ్డను పినతల్లి ఒడిలో వేసిపోతుంది. బిందు ప్రాణాలు బిగపట్టి మూర్చ నుండి తెప్పరిల్లి పిల్లవాడిని చంక నేసుకొని తన గదిలోకిపోతుంది. ఈ దృశ్యాన్ని చూచి తోటికోడలు మూర్ఛకు దివ్యౌషధం కనిపెట్టానని అన్నపూర్ణ సంతోష ిస్తుంది. ఎలాగూ తనపై సంసార భారం అధికంగా ఉండటంతో తన పిల్ల బాగోగులు చూసే తీరిక సరిగా లేకపోవడం తో తన బిడ్డ బాధ్యతను బిందువాసినియే వహిస్తుంది.

ఒకనాటి ఉదయాన తొమ్మిది గంటలైనప్పటికి పిల్లవానికి పాలు కాచి ఇవ్వకపోవడంతో వంటింట్లోకి వచ్చిన బిందు గిన్నెలోని పాలను చూస్తుంది. ఆమె వంటలక్కను ఉద్దేశించి పిల్లవానికి పాలువేడి చేసి ఇవ్వకుండా పెద్దల కొరకు వంటచేస్తు న్నావా? అని కసురుకొని అన్నపూర్ణతో సైతం తగువు పెట్టుకొని ఇక నుండి పిల్లవాని పాల విషయంలో వారు జోక్యం చేసుకోరా దని ఒట్టు వేసుకుంటుంది. తన ముద్దుల బిడ్డ ఆకలిని పట్టించుకోవటం లేదని కన్నతల్లిని సైతం తప్పుఎంచి తనకు ఆ పిల్లవానిపై గల ప్రేమను ప్రదర్శిస్తుంది.

బిందు అమూల్యని అక్షరాభ్యాసం చేయించిన తరువాత వాడిని మరుసటిరోజు బడికి పంపే సమయంలో చేసిన వేష భూష ణాలను చూచి కన్న తల్లి సైతం అబ్బురపడు తుంది. తన ఆశలకు ప్రతిరూపమై పిల్లవాడిని ప్రతిరోజు అంతదూరంలో ఉన్న బడికి పంపడం ఇష్టంలేకపోతుంది. మరియు పిల్లవానితో అక్కడ ఎవరైనా గొడవ పడుతారే మోనని అనుమానించి తమ ఇంటి అరుగు మీద పాఠశాల పెట్టించాలని తలు స్తుంది. తోటికోడలు ఈమెతో ఏకీభవించక ”ఏ తల్లిపిల్లలు ఆ తల్లికి ముద్దే” అందరూ తమ పిల్లలను బడికి పంపించటం లేదా? అంటుం ది. తమ పిల్లవాడిని ఇతరులతో పోల్చడం ఇష్టంలేకపోవడంతో తోటి కోడలతో విభేదించి బావగారిని ఒప్పించి వారి అనుమతితో తన పిల్లవాడు తన కళ్ళముందే ఉండేలా, తమ ఇంటి దగ్గర చదువు చెప్పించే ఏర్పాటు చేసుకుంటుంది.

తోటికోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో పని మనిషి వచ్చి పిల్లవాడు అడకత్తెరలో వేలుకోసుకొని ఏడుస్తున్నాడని చెపుతుండగా తన శరీరంలోని అణువణు వులో నిండిపోయిన తన గారాలపట్టి వేలు కోసుకున్నాడని తెలియగానే బిందు నువ్వేం చేస్తున్నావని పనిమనిషిని దూషించి అమూల్యని వేలికి తడిగుడ్డ చుట్టి అతనిపై గల ఆవాజ్యమైన ప్రేమతో తోడికోడలపై సైతం మండిపడుతుంది. పిల్లవాడు వీధి కాపుపిల్లలతో బిల్లంగోడు ఆడుతున్నాడని తెలుస్తుంది. పిల్లవానికి దెబ్బలు తగులు తాయనే ఆందోళన ఒకవైపు, మరోవైపు తాను పిల్లవానిపై పెట్టుకున్న ఆశలువీడి స్నేహితుల ఆటపాటలతో ఎక్కడ చెడిపోతాడేమోనని భయంతో పిల్లవానిపై గల ప్రేమాభిమా నాలను సైతం వదలుకొని కొన్ని గంటలు గదిలో నిర్భందిస్తుంది. తన మదిలోని ప్రేమను అణచుకొని పైకి మాత్రం కఠినంగా వ్యవహిరిస్తుంది. తాను లోలోనకుమిలి పోతూ పిల్లవాని నడవడికలో మార్పుతీసుకు వచ్చి అతని గొప్పవానిగా చూడాలనే ఆరాటంతో తాను కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఎవరికీ అర్థం కాకుండా ప్రవరిస్తూ అందరికి భిన్నంగా ప్రవర్తిస్తుంది.

వీరి దగ్గరి చుట్టమయిన ఎలకేసి తన కుమారుడైన నరేంద్రుడి గురించి గొప్పగా చెబుతూ వుంటే బిందు సహజమైన మాతృప్రేమతో అతని లోపాలను చూపు తుంది. అంతేకాక రక్తమాంసాల్లో భాగంగా పెంచిన పిల్లవాని గురించి గొప్పగా ఈ యేడు కూడా పరీక్షపాసై 20 రూపాయలు నగదు బహుమతి పొంది తన పినతండ్రి లాగా గుఱ్ఱం కొనుక్కుంటాడని ఎంతో నమ్మకంగా వాని భవిష్యత్‌ను చెబుతుంది. నరేంద్రుడిగా నాటకాలూ, నాట్యాలు అంటూ తిరగకుండా ఉండాలనే తపనతో వానికి దూరంగా ఉంచేలా ఏర్పాటు చేయాలనుకుంటుంది. మరో సమయంలో నరేంద్రుడిని పిల్లవాని యోగక్షేమాలు అడిగి వాడికి పిల్లవానిపైగల అభిమానాన్ని గ్రహించి తన కుమారుడిని అభిమానిస్తున్నారని ఒకే ఒక కారణంతో నరేంద్రుడికి 2000/- రూపాయలు సహాయం చేయమని భర్తను ప్రాధేయపడటంలో ఆమె ఉదాత్తమైన స్వభావం తెలుస్తుంది.

అన్నపూర్ణ తన తోడి కోడలు గురించి ఎలకేసితో చెబుతూ ఈమె లోకవిరుద్ధంగా ప్రవర్తిస్తూ తన కుమారుడిని సైతం లోక విరుద్ధంగా పెంచుతుందని చెబుతుంది. అపుడు బిందు సగర్వంగా తలెత్తి తోడికోడలి తో కుర్రవాని నలుగురిలో ఎన్నికయిన వాన్నిగా తయారు చేయాలంటే తల్లిలోక విరుద్ధంగా ఉండాలంటుంది. తాను అమూ ల్యని విషయంలో భిన్నంగా ప్రవర్తించేందుకు కారణం వాడు భవిష్యత్తులో ఉన్నతునిగా ఉండాలనుకోవడమే అంటుంది. కానీ తోడి కోడలు తన స్వంత కుమారుని భవితవ్యం గూర్చి అనుమానించగా బిందు అలాంటి మాటలు సైతం వినలేనట్లుగా నేను ఆ ఒక ఆశతోనే బ్రతుకుతున్నాని దీని కేనాడైనా దెబ్బ తగిలితే నాకు పిచ్చెక్కుతుంది. అని ఆమె హృదయం లో పిల్లవానిపై గల ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తుంది. ఈ మాటలు విని అన్నపూర్ణ స్తబ్దుగా వుండి తన తోటికోడలు పిల్లవాని విషయంలో ఎందుకు అంతలా తాపత్రయ పడుతుందో తెలుసుకు ంటుంది. ఇన్ని రోజులుగా బిందు పిల్లవాని విషయంలో కనపరిచే ప్రేమ, వాత్సల్యాలు ఒక్కసారి ఉత్కృష్టమవడంతో తన బిడ్డకు ఆమె సర్వ శుభాకాంక్షిణీ అని ఆమె మొహం చూసి చెప్ప రాని వాత్సల్యంచే అన్నపూర్ణ హృదయం పొంగిపోయింది.

అమూల్యుని అన్ని విషయాలు దగ్గర ఉండి గమనించే బిందు అతడు జుత్తు కత్త రింపులో నరేంద్రుడి జుత్తులా అనుసరించి కత్తిరించమని మంగలితో చెప్పటంతో ఆమె అతని భవిష్య జీవితంలో ఇలాంటి అనుకరణ వల్ల కలిగే ఇబ్బందుల గురించి తీవ్రంగా చింతిస్తుంది. ఈ విషయమై అన్నపూర్ణతో అక్కా! సామాన్య విషయం కాబట్టి నవ్వు వస్తుంది. అన్నీ ఇలాగే ఆరంభమవుతాయో మోనని భయంతో నాగుండె పగిలేలా ఉంది. అని అనటంతో పిల్లవాడు అనుకరణ వల్ల చెడిపోతాడని, పిల్లవాన్ని తాను అనుకున్నంత స్థాయి లేకపోతే తాను బ్రతుకలేనని చెప్పడంతో ఆమె అతనిపై పెట్టుకున్న ఆశల విలువ తెలుస్తుంది. ఈమె పుట్టింటికి వెళ్ళె సమయంలో సైతం పిల్లవాని మనస్సు ఆమూలాగ్రంగా తెలిసినట్లు తాను మేనా ఎక్కే సమయానికి తప్పక వస్తాడని అక్కతో చెబుతుంది. ఆమె చెప్పినట్లుగానే చివరి నిమిషములో వచ్చి ఆమె ఊహ అసత్యం కాదని నిరూపిస్తాడు. ఈవిధంగా బిడ్డ మనస్సులో ఏముందో ముందుగానే పసిగట్ట గలుగుతుంది. కాబట్టే అతనికి అన్ని తానై పెంచి అందరికి అందనంత ఎత్తులో వుంచాలని తలుస్తుంది.

అమూల్యుని జేబులో సిగరేట్‌ ముక్కలు దొరకడంతో దానిక్కారణంగా నరేంద్రుడని బిందు గ్రహిస్తుంది. ఎంతో అహంకారం, అభిమానం కలిగిన ఈమె తన పిల్లాడి భవిష్యత్తు బాగుండాలనే తలంపుతో తనను తాను మరిచిపోయి తోడికోడలు కాళ్ళను మొక్కటానికి సైతం వెనుకాడదు ఇది ఆమెలోని మాతృహృదయం. తనకళ్ళ ముందే తన ఆశల సౌధం కూలిపోతుంటే చూస్తూ ఉండలేక దానికి కారణమైన బంధువులను ఇంటి నుండి పంపించాలని ఉన్నప్పటికి బావగారికి ఈ విషయాలు చెప్పలేక ఆ తల్లిపడిన మానసిక క్షోభను రచయిత హృద్యంగా చిత్రించాడు.

పిల్లవాడు చేయిదాటి పోతున్నాడని గ్రహించిన బిందు పంతులు ద్వారా వారు చేసిన అల్లరి పనులకు ప్రధానోపాధ్యాయుడు పది రూపాయల జరిమానా విధించగా ఆ జరిమానా కట్టారని తెలుస్తుంది. ఆమె ఎంతో ఆవేదన చెంది, అమూల్యుడు తనకు తెలియ కుండా ఇంతా చేస్తున్నా తనకు ఎవరూ చెప్పలేదనే బాధతో తోటికోడలతో మీరు అన్నీ తెలిసి వాడిని చెడగొడుతు న్నారని, వాడి భవిష్యత్‌ మీ ద్వారానే నాశనం అవుతుందని కోపగించడంతో వీరి మాటలు మెల్లగా క్రమం మారి తగువుగా పరిణమించి రెండు కుటుంబాలు విడిపోతాయి. కానీ బిందు మనస్సు మాత్రం ఎప్పుడూ తన ముద్దుల బిడ్డ చుట్టు తిరగుతుండేది. పిల్లవాడు తనకోసం తప్పకవస్తాడని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేది. కానీ అది జరక్కపోవడంతో ఎంతో ఘోషను లోన అదిమిపెట్టె పిల్లవాడు బడికి వెళ్ళేది తన ఇంటి ముందునుంచే కనుక దూరం నుండై నా చూడాలనుకొని ఆరాటపడుతుంది. కానీ నిరాశే మిగులుతుంది ఆమె హృదయం నిండా.

తండ్రికి బాగాలేదని ఉత్తరం రావడంతో బిందు తన పుట్టింటికి వెలుతూ మళ్ళీ తిరిగి రానవసరం లేకుండా ఇదే కడసారి పయనమ య్యేటట్లు దీవించమని వంటలక్కను అంటుంది. ఇక్కడ కూడా తనచేతుల్లో పెరిగిన పిల్లవాడు, తనవారు లేని జీవితం తనకు అవసరంలేదని ఇదే చివరిసారి కావాలనుకుంటుంది. ఇక్కడకు వచ్చి తనవారు లేకుండా ఒంటరిగా జీవించడం కంటే చావడమే నయమనే నిర్ణయాని కొస్తుంది. మెట్టినింటిలో తనను అందరూ పరిత్యాగం చేశారని భావించిన బిందు ఏమి తినకుండా ఆత్మహత్య చేసుకోవాలను కుంటుంది. చివరకు అమూల్యుడు, అక్క, బావగార్లు రావటం, బావ తనను మళ్ళీ మెట్టినింటికి తీసుకువెలుతానని చెపుతాడు. ఆమె బావపై గల పితృభావనతో తన ఆత్మహత్య ప్రయత్నం మానుకుని పిల్లవానిని తన మచంలో పడుకోబెట్టి తనకు కొంత విశ్రాంతి ఇవ్వమని కోరుకుంటూ తాను చావుకు దగ్గరగా ఉన్న సమయంలో సైతం తన ప్రాణానికి ప్రాణమైన పిల్లవాడిని తనివి తీరా చూసుకోవాలని, తనకు ఇన్ని రోజులు దూరమైన ఆనందం తిరిగి లభించటంతో తిరిగి పిల్లవాని భవిష్యత్‌ కోసం తాను నిర్మించాల్సిన మెట్లను వెతుకుతుంది.

శరత్‌ రచించిన ఈ నవలిక యందు స్త్రీని అన్ని కోణాల నుంచి చిత్రిస్తూ శక్తి స్వరూపిణిగానూ, ప్రేమామృత వర్షిణిగానూ, సేవా తత్పరురాలుగానూ చెబుతూ కన్నతల్లి ప్రేమను మరిచే విధంగాపిల్లవాడిని సాకి అతనికి అన్నీ తానై పెంచి నలుగురిలో గొప్పవానిగా తయారు చేయటం కోసం పినతల్లి పడిన హృదయఘోషను హృద్యంగా కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు. అన్నపూర్ణ మాటల్లో బిందుకు అమూల్యుడు కన్నబిడ్డ కాకపోయిన పిల్లవాని మీద పంచప్రాణాలు. కడుపునపుట్టిన బిడ్డ అయితే ఇంకేమీ చేసేదో ఆనడంతోనే ‘బిందు’ మాతృహృదయాన్ని ఎంతగొప్పగా అవిష్కృతం చేశారో తెలు స్తుంది. అందుకే తెలుగు సాహిత్యంలో స్త్రీవాదిగా స్థిరపడిన ప్రముఖ రచయిత చలం. ”స్త్రీకి నేను వెన్నుముకనిస్తే శరత్‌ హృదయాన్నిచ్చాడ”ని ప్రశంసించడం అక్షరసత్యం అని చెప్పవచ్చు.

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.