సొమ్ముకోసం వ్యసనాన్ని పెంచాలా?

నంబూరి పరిపూర్ణ

మనిషికి గానీ, కుటుంబానికిగానీ నికర ఆదాయమున్నప్పుడే మనుగడ సాగుతుంది. అవసరాలు తీరడానికి తగిన ఆదాయ వనరులుండాలి, తప్పదు.

ప్రభుత్వ వ్యవస్థ మనుగడకు కూడా యిదే తీరు వర్తిస్తుంది. పాలనా నిర్వహణకు, ప్రజలకుపయెగకరమైన రకరకాల ప్రాజక్టుల అమలుకు, వేలకోట్ల సొమ్ము అవసరమవుతుంది. ప్రభుత్వం ఈ సొమ్మును వివిధ ఆదాయమార్గాల్లో సమీకరిస్తుంటుంది. మొదటి ప్రధాన మార్గం ప్రజలు చెల్లించే పన్నులు. ఆ తర్వాత భూమిశిస్తు, రిజిస్ట్రేషన్‌ స్టాంపు డ్యూటీలు, అమ్మకం పన్నులు, ఎక్సైజ్‌ పన్నులు, ‘నీటి తీరువా’, విద్యుత్తు చార్జీలు, తాగునీటి చార్జీలు – యిలా భౌతికసేవలన్నింటికీ ఆదాయ సమీకరణ జరుగుతుంది (ఒక్క పీల్చేగాలికి తప్ప).
వీటన్నిటికీ తోడు మరో కొత్త మార్గాన్ని – 2004లో గద్దెనెక్కిన కాంగ్రెసు ప్రభుత్వం కనిపెట్టింది దాన్నమలుపరుస్తూ కాసులపంట పండించుకుంటోంది. దీని పేరు బహిరంగ మద్యపాన స్వేచ్ఛావిపణి! పాలకుల దృష్టిలో యిది ఎంతో ముఖ్యమైన, శ్రేష్టమైన ప్రజాసంక్షేమ పథకం! అందుకనే – పట్టణప్రాంతాలతో పాటు, గ్రామగ్రామాన బార్‌ అండ్‌ రెస్టారెంట్లను నెలకొల్పి – ప్రజలకు విరివిగా మద్యమందించే సేవలను చేపట్టింది ప్రభుత్వం!
పాలకుల ప్రోద్బలంతో జయప్రదంగా సాగుతున్న ఈ పథకం వల్ల ప్రజలకు ఒనగూడుతున్న మేలెంత, ప్రయెజనమెంత అని – బాధ్యతగల పౌరులంతా ఆలోచించాల్సిన అవసరముంది. ఎంచేతనంటే – ప్రజాస్వామిక ప్రభుత్వంగా చెలామణి అయ్యే ప్రభుత్వ అంతిమ లక్ష్యం ప్రజల సంపూర్ణ సంక్షేమమే అయివుండాలి గదా!
సమాజపు మెజారిటీ జనం కూడు, గుడ్డ, గూడు కోసం అల్లాడ్డమేగాక, అనేక రోగాలతో పోరాడుతున్నారు. ప్రభుత్వ వైద్యచికిత్సలు అంతర్ధానమై, కార్పొరేట్‌ వైద్యం గజ్జెకట్టి ఆడుతూ, పేదలకు అందుకోలేనిదయ్యింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల గుమ్మం తొక్కే ధైర్యంలేని నిరుపేద శ్రామికవర్గాలు మృత్యువు దరిజేరడం తప్ప మరోదారిలేదు.
గత శతాబ్ది తొంభయ్యవ దశకంలో ఆనాటి ప్రభుత్వం అమలుచేసిన మద్యనిషేధచట్టం, కూలీనాలీ ప్రజలకు గొప్పమేలు, ఊరట కలిగించిన మాట పూర్తిగా నిజం. లిక్కర్ వైన్లను ధనికులు, కల్లుసారాల్ని కొద్దిమంది శ్రామికులు తాగినప్పటికీ – అది రహస్యంగా జరుగుతుండేది. తాగుబోతుల మీద కేసులు నడిచేవి. రోజు కూలీల, రిక్షా ఆటోడ్రైవర్ల సంపాదన ఇంటికి చేరి – కుటుంబాలకింత తిండి లభించేది.
ఈ రోజున – అదే కష్టజీవులు – సాయంత్రానికల్లా ‘బార్లకూ’, బెల్టుషాపులకూ నిస్సంకోచంగా చేరుకుంటున్నారు. పీకలవరకూ తాగి ఇళ్లకు చేరి – నిషాదించుకునేందుకు – భార్యల్ని చితకబాదుతున్నారు. రాత్రంతా సాగే అల్లరి, బూతులు, కొట్లాటలతో పిల్లలు భయపడి, నిద్రకు దూరమవుతున్నారు. మరోవైపు – భార్య కూలీడబ్బులే ఇంటిల్లిపాదికీ తిండిపెడుతున్నాయి. తాగుడుతో ఉన్మాదులైన కొందరు భార్యల్ని మెడపిసికి, కిరోసిన్‌ చల్లి చంపుతున్న ఉదంతాలు, కన్న కూతుళ్లను చెరుస్తున్న ఘటనలు – పత్రికల్లో మామూలు వార్తలవుతున్నాయి.
దారిద్ర్యరేఖ దిగువనుండే చాలామందికి జీవితానికొక అర్ధముంటుందనీ, ఉండాలనీ తెలియదు. జీవితానికి ఓ గమ్యముండాలని అసలు తెలియకపోవడం వింతేం గాదు. వాళ్లకు ఆదినించీ తెలిసింది అన్నిటికీ కరవుపడడం, అగచాట్లు పడడం. వీరికి తెలిసిన సుఖమల్లా బాగా తాగి ఊగడం! మత్తుతో రాత్రి గడిపి, తెల్లారి మళ్లీ పనికోసం పరుగులెత్తడం. ఈ మత్తే – వారికి జీవితమందించే ఆనందం!
ఈ తాగుడు వ్యసన నిర్మూలనకు తగు శిక్షణా పద్ధతుల్ని రూపొందించి, అవగాహనా కేంద్రాల్ని నెలకొల్పడం, స్థిరమైన ఉపాధివర్గాల్ని కల్పించడం – సంక్షేమరాజ్యపు కర్తవ్యమై వుండాలి. అందుకు బదులుగా – ప్రజల బలహీనతలను అనేక రెట్లు పెంచే ఆదాయమార్గాలను ఆవిష్కరించడమేమిటి? ప్రస్తుత ముఖ్యమంత్రి – ఆరోగ్యప్రదాత అయిన ఓ డాక్టరు!! మంత్రులు మంచి విద్యావేత్తలు! మంచిచెడ్డల విచక్షణకు యిలాంటి గతి!
రాష్ట్రమంతా సాగుతున్న బార్ల, బెల్టు షాపుల ఆదాయం ఏటేటా బాగా పెరుగుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలే ప్రకటిస్తున్నాయి. 2006-07 సంవత్సరంలోని 6761 కోట్ల మద్యం అమ్మకాలు ప్రభుత్వ ఉత్సాహాన్ని రెట్టింపు చెయ్యడంతో – 2007-08కి అమ్మకాల టార్జెట్‌ 8450 కోట్లుగా నిర్ణయింపబడింది. ఈ లక్ష్యసాధన నిమిత్తం – ఎక్సైజుశాఖ తీవ్ర వత్తిడికి గురిచేయబడుతోంది. తమ తమ పరిధుల్లో (జ్యూరిస్డిక్షన్సు) అమ్మకాల్ని యితోధికంగా ముమ్మరం చేసే అధికార్లకు మంచి మంచి ప్రోత్సాహకాలు యివ్వబడనున్నట్లు – ఆదేశాలు జారీచేయబడ్డాయి. మద్యవిక్రయంలో మెరుగైన కృషిసల్పే – (ఈ శాఖ) ఎస్సైలు, సి.ఐలకు – వారు కోరే లాభసాటి ప్రాంతాలకు బదిలీలు జరిపించే తోడ్పాటునివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది.
ఇప్పటికీ – రెండువేల ఐదో సంవత్సరపు 26% మద్యం అమ్మకాలు, రెండువేల ఆరు ఆర్థిక సంవత్సరానికి 34%కు పెరిగాయి. రెండువేల ఏడు – ఎనిమిదిలో – అమ్మకాల్ని – మరో 34% పెంచాలనేది ఏలికల సంకల్పం. అందుకే ప్రస్తుత సంవత్సర టార్గెట్టు 8450 కోట్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ – మద్యం అమ్మకాల లాభాలు క్రింది విధంగా వున్నాయి.
సంవత్సరం లాభం
(1) 2004-2005 – 4500 కోట్లు
(2) 2005-2006 – 5363 కోట్లు
(3) 2006-2007 – 6761 కోట్లు
(4) 2007-2008 టార్గెట్‌ – 8450 కోట్లు
గడచిన ఒక్క సంవత్సరంలోనే – జనం 7400 కోట్లు మద్యం కొనుగోలుకు వెచ్చించారు. ప్రస్తుతం – గ్రామస్థాయిలో 60%, పట్టణస్థాయిలో 40% అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6564 మద్యంషాపులు, 1286 బార్లు, 16 ఎడిబిసిఎల్‌ అవుట్‌లెట్లు – ఈ వ్యాపారం నడుపుతున్నాయి. వేలం పాడుకున్న ప్రతి వ్యాపారి – మేజర్‌ పంచాయితీ చుట్టూగల ఊళ్లలో వందలాది (దొంగ) బెల్టు షాపులు పెట్టి – సారాను, ఛీప్‌ లిక్కర్లను నడివీధుల్లో పారిస్తున్నారు. రాష్ట్రంలో మండల మండలానికీ ఎన్నివేల అనధికార బెల్టుషాపులు నడుస్తున్నదీ – లోక్‌సత్తా నేతలు ఖచ్చితంగా చెప్పగలరు. ఈ షాపులకు ఇళ్లూవాకిళ్లూ, దేవుడిగుళ్లూ, స్కూళ్లూ, వాడకట్టులూ – యివేవీ అభ్యంతరాలు కావు. ఈ అన్నిచోట్ల తాగుబోతు గుంపుల గంతులు, తగవులు, లొల్లీలు, గొడవలు! చుట్టుపక్కలవాళ్లకు నిద్ర, విశ్రాంతి శూన్యం.
ఒక పక్క – చెదురుమదురుగా మహిళా స్వయంసహాయక బృందాలకు పావలా వడ్డీకి బ్యాంకు రుణాల్ని అందించడం, తద్వారా ప్రతి మహిళ లక్షాధికారిగా మారేట్టు చెయ్యగలమని దంబాలు పలకడం, మరోపక్క ఆ మహిళల మగాళ్లకు పీపాలకొద్దీ మద్యం నోటికందించడం – ఏమిటీ వింత విధానం? మళ్ళీ యిప్పుడు కల్లు దుకాణాలకు రెండు కిలోమీటర్ల పరిధిలో కల్లు బెల్టుషాపులు అధికారికంగా తెరిచి, అమ్మకాలు జరిపేందుకు – 1228, 1229 అన్న కొత్త జివోలు జారీచేయబడ్డాయి. అనునిత్యం – అంతకంతకు పెరుగుతున్న తాగుడు వ్యసనం వల్ల ఎన్ని కొంపలు గుల్లవుతున్నాయె, కూలిపోతున్నాయో ఏలికలకు తెలియదనుకోవాలా! రోజురోజుకూ పెరిగే కల్తీ మద్యపుచావులు, తాగుబోతుల చేతుల్లో హతులవుతున్న స్త్రీలు లెక్కలోకి రాదగ్గవాళ్లు గాదా?
అవసరాలకోసమో, ఆడంబరాల కోసవమో – స్వయంగా కన్నవాళ్లే తమ కూతుళ్లను వ్యభిచారగృహాలకు పంపి, డబ్బు పోగేసుకుంటున్నారు. కావలసింది డబ్బే మరే విలువలతో పన్లేదు. ప్రభుత్వానిక్కూడా – ఖజానా నింపుకోవడమే ప్రధానం, అది ఎలాంటి సాధనం ద్వారా అనేది అక్కర్లేదు. పాలక అధినేతలంతా గాంధీ అనుయయులమూ, భక్తులమూ అంటుంటారు సగర్వంగా. కాంగ్రెసు నిర్మాణ కార్యక్రమాన్ని అనుసరించి, మద్యవ్యసనం నించి ప్రజానీకం బయటపడేందుకు జీవితాంతం ఉద్యమస్థాయిలో కృషిచేసిన గాంధీజీ – ఈనాటి నేతల దృష్టిలో వెర్రివాడు, ఛాదస్తుడు. ఏ కార్యసిద్ధికైనా అందుకుపయెగించే సాధనం – ధర్మబద్ధమైందీ, శ్రేష్ఠమైందీ అయివుండాలని వక్కాణించుతుండేవారు గాంధీజీ! ఏవీ…ఎక్కడా…ఆ ధర్మాల విలువలు!!
మగాడి తాగుడు ఆడబతుకుల్నీ, బిడ్డల జీవితాల్నీ సర్వనాశనం చేస్తున్నప్పుడు – అలా జరక్కుండా తమను తాము రక్షించుకోడానికి పోరాడవలసింది మహిళలే. రాష్ట్రంలో – కరీంనగర్‌, శ్రీకాకుళం, గుంటరు జిల్లాల్లోని కొన్ని గ్రామాల స్త్రీలు బెల్టుషాపుల ధ్వంసానికి యిప్పటికే పూనుకున్నారు. ఈ పోరాట ఉద్యమం – అటు గ్రామసీమల్లో, యిటు నగరాల్లో వ్యాపించి, ఉధృతమవ్వాలి. రాబోయే ఎన్నికలకు యిదే సమస్య కీలకమూ, నిర్ణయాత్మకమూ అయి తీరాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో